నెచ్చెలి-2024 డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం

-ఎడిటర్

 

డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం
——————————————————–
ప్రథమ బహుమతి రూ.1500/- (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

బి.కళాగోపాల్ – యోధ..!

పురస్కార పత్రంతో బాటూ, అభినందనలతో కవితని ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాం.

***

యోధ..!

-బి.కళాగోపాల్

విట్రియోల్ 
నా ముఖాన్ని కాల్చేస్తూ చర్మాన్ని మండిస్తూ /
శిరోజాలు అంటుకు పోయి 
కనుగుడ్లు చితికిపోయి /
ముక్కురంధ్రాలు మూసుకుపోయి 
చెవులు తెగిపడి /
చెంపలు కరిగి బొమికెలు తేలి నన్నో వికృతశిలగా మారుస్తున్న/
 ఆ విషపు ద్రావణ బుడ్డి మురుగునీటి పక్కన/
 విసిరిన వాడి అహాన్ని సంతృప్తి పరుస్తూ వికటాట్టహాసం చేయసాగింది../
మెడ దిగువన పాలిండ్లు ఉడికిపోతూ తోలుత్తిత్తిలా దేహం ఊగిసలాడుతుంటే/
 మంట గాయం బాధ నొప్పి ఆవేశం ఆక్రోశం దుఃఖంతో నా కంఠనాళాలు చిట్లిపోతున్నా/
 ఈ లోకం తలుపులు తెరువదు /
అవయవాలు తెగిపడుతున్నా ఏ నాలుగు గోడలు "అయ్యో..!" అంటూ ఆసరా ఇవ్వవు /
శరీరంతో పాటు కాలిపోతున్న మనసు /
శిథిలమవుతున్న ఎముకల నడుమ నా దేహం అస్థిత్వం కొరకు వెతుక్కుంటున్న ప్రాణం/ గంధకపు నత్రజని
గాలుల్లో కొట్టుకుపోతున్న నా మనో స్వప్నాలు/
ఈ మహా బీభత్సం ఈ యుద్ధాలిక చాలునని చెప్పేవారు/
 క్షమ, సత్యం, దయ గురించి బోధించే తల్లితండ్రులు తటస్థమై /
అడవుల్లో గుహల్లో. మౌనంగా ఉంటే..
ఓటిటి పోర్న్  విషవలయాల నరాలతీపు తిమ్మిరి /
సైకో గబ్బిలాలు గడగడపనా రక్త బీజులై పేట్రేగుతుంటే/
 ఉద్యోగిని ఐనా, పంటచేలకూలీ ఐనా, పాలిచ్చే తల్లి ఐనా /
దేహాలపై గాయాలు నిరంతర జ్వలనం../
లక్ష్మి, ఫాతిమా, ప్రీతి కాలిన మాంసపు ముద్దల ముఖాల పేర్లు అనంతం ../
ద్వేషం పగల మాటున బుసకొట్టే అహం ఒక్కటే శతాబ్దాలుగా విర్రవీగుతున్నది /
 అనాగరికత కసాయితనంతో వీరతిలకాలు దిద్ది/ ఉన్మాదులతో ద్రవహింస నెత్తుటివాగును పారిస్తుంది/
దేవుడా !నిజంగా నేను నీ బిడ్డనేనా?/
ఐతే నన్నెందుకిలా ఒజ్మాండియస్ ఖండిత దేహాల ఎడారిలో  విసిరేశావ్?/
జీవితాన్ని పండించుకోవాల్సిన నా కలలు బూడిదవుతున్నాయి/
ప్రేమలు చనిపోతున్నాయి/

ప్రేమించావా? లేదంటే టాయిలెట్ క్లీనర్లూ
 కిరాయి కోట్లో చౌకగా దొరికే/
 విషద్రావణాలు గాఢమైనా సజలమైనా అమాయక లేతముఖాలపై విసిరికొట్టి/ సందుగొందుల్లో చీకటినీడన నక్కే
ఉన్మాద రక్కసుడా!/
ఏమి పాపం చేశానని నా దేహానికి శిక్ష?
నా మాటను శ్వాసను ఙ్ఞానాన్ని సకల భావోద్వేగాలను/ 
మెదడును బుద్ధిని అణగదొక్కి మదిగదిలో పెంచుకున్న చిగురుకలలను చిదిమి/
 నన్నో అవిటిదేహంగా నేల జారిన పగుళ్ళ గాజు బొమ్మగా చేసి /
పైశాచిక ఆనందం పొందే మనో దౌర్భాగ్యుడా!/
నా కాన్ఫిడెంట్ నో అన్న పదమే నీకు కంటగింపైది /
విట్రియోల్ దాడి నీ దగ్గరో చౌకబారు రసాయన ఆయుధమైంది/
 ప్రాణం కన్నా పవిత్రమైనది ఏదీలేదని తెల్సుకోవడానికి/
 ఇలా ఎన్ని ముఖాలు విషద్రావణాలలో ఉడికి ఉడికి కాలిపోవాలి?/
నా ముఖాన్ని వికృతపర్చినా/ 
అంటుకుపోయిన నా చర్మం మీద నీ అహాన్ని పరిచి/
 అదే విజయమని విర్రవీగే మనో దౌర్చాగ్యుడా ! కళ్ళు విప్పి చూడరా/
 నేనిప్పుడు కాలిముద్ద ఐన చర్మానికి లెక్కలేని శస్త్రచికిత్సల సూదిపోట్లు/
 ప్లాస్టిక్ సర్జరీల మార్పులతో రూపాంతరం చెందిన గోల్డెన్ జాయినరీ *కిన్ సుగీ దేహాన్ని/
 తుఫానులు ఎదురైనా ముఖం చూపించలేక అద్దం భోరున విలపిస్తున్నా /
లోపాలే వరమై ఫీనిక్స్ లా పైకెగసి /
నా మైనస్ దేహాన్ని మెదడు అట్టడుగు పొరల్లో నెట్టేసి/ 
వైఫల్యంతో సఫలమైన ఫైటర్ ని/
 గాయాలు మచ్చలు కుట్లు గాట్ల కొత్త దేహాన్ని  అంగీకరించి/
అభేద్యమైన ఆత్మశక్తితో అడ్డంకులను అవకాశాలుగా మార్చుకున్న రియల్ షీరోని../
అగ్ని సరస్సున విరిసిన వజ్రపు తునకలా నన్నునేను సాన బెట్టుకొని/
 కాలిన దేహపు తొలగిన అవయవాలతో కరెక్షన్స్ మేకప్ లేవీ లేని పెదవులపై విరిసే చిర్నవ్వుతో/
నా మనోదర్పణంలో ప్రతిబింబించే నయీ ఉమ్మీద్ ని/
యోధనై.. ప్రపంచ పటం మీద నా ప్రత్యేక వ్యక్తిత్వపు వన్నెలద్దుకొని ఫ్యాషన్ ర్యాంపులపై ఠీవి నొలికిస్తూ /
ఇంపర్ ఫెక్షన్ మేక్ మి  మోస్ట్ బ్యూటిఫుల్ అంటున్న  నయీ పెహచాన్ ని/
నేను నాలాగే ఉండి మీతో సమానంగా నిలబటమేనంటున్న నయా జిందగీని..!!/

***

*కిన్ సుగీ=పగిలిపోయిన పింగాణీ పాత్రలను బంగారు లేదా వెండి వర్ణంతో అతికించే జపాన్ వారి అద్దకం కళ.

*****

Please follow and like us:

One thought on “నెచ్చెలి-2024 డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం”

  1. మైనస్ దేహాన్ని మెదడు అట్టడుగు పొరల్లో నెట్టేసి.. చాలా అద్భుతంగా రాశారు. వ్యధా భరిత స్త్రీ ని ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published.