బొమ్మల్కతలు-23
-గిరిధర్ పొట్టేపాళెం
అనుకోకుండా కొన్ని కొన్ని అద్భుతంగా చేసేస్తాం, అనుకుని చేసినా అంత బాగా చెయ్యలేమేమో అనుకునేంతలా. ఈ బొమ్మ అలా అనుకోకుండా నేను ఒకప్పుడు చేసిన అద్భుతమే.
సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, కానూరు, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న నాటి రోజులవి. అక్కడ చదివిన నాలుగు సంవత్సరాలు నా బొమ్మల ప్రస్థానంలో ఒక మలుపు తిరిగిన మైలురాయి, కలికితురాయి కూడా. హాస్టల్ లో సెకండ్ ఇయర్ లో నా పక్క రూమ్ లో ఉండే “వాసు” (శ్రీనివాస్ నీలగిరి, మెకానికల్ ఇంజనీరింగ్) నాకు పరిచయమయ్యి మంచి మిత్రుడయ్యాడు. వాసు దగ్గర ఏదో మ్యాగజైన్ లో ప్రింట్ అయిన ఒక ఫుల్ పేజి కలర్ ఫొటో చూశాను. ఒక చిన్న పాప సముద్రంలోని నీళ్ళన్నీ తోడి తన బకెట్ లో నింపాలన్నట్టు ఆ నీళ్ళల్లో దిగి చూస్తుండ టం, చూడగానే నన్నెంతో ఆకట్టుకుంది. ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ చాలా గొప్పగా తీశాడు. అప్పట్లో మంచి ఫొటో చూస్తే దాని బొమ్మగా గియ్యాలనో, పెయింటింగ్ గా ట్రై చెయ్యాలనో అనిపించేది. ఈ బొమ్మ చూడగానే తీసుకుని బాల్ పాయింట్ పెన్నుతో వెయ్యటం మొదలు పెట్టాను. కళాదృష్టి కలిగిన వాసు కూడా అప్పట్లో నా బొమ్మలకు అభిమాని. వేసిన ప్రతి బొమ్మా పరికించి చూసేవాడు. నా బొమ్మల స్ఫూర్తితో తనూ క్యారికేచర్స్ ట్రై చేస్తుండేవాడు. వాసుది గుంటూరు, విజయవాడకి దగ్గరే కావటంతో నెలకి రెండుసార్లన్నా ఇంటికి వెళ్ళి వస్తుండేవాడు. ఒకసారి దీపావళికి నలుగురు ఫ్రెండ్స్ ని ఇంటికి తీసు కెళ్ళాడు, రెండ్రోజులు సరదాగా గుంటూరు తిరిగాం. వెంకటేష్ “వారసుడొచ్చాడు”సినిమా కూడా చూశాం. అప్పట్లో తెలుగు వారపత్రికలు, సినిమాల్లో కొంచెం భిన్నంగా పబ్లిసిటీ డిజైన్ చేసే ఆర్టిస్ట్ లు వీళ్ళే నా బొమ్మల సాధనానికి గురువులు. చిరంజీవి “రుద్రవీణ” సినిమాలో “లంక భాస్కర్ గారు” సినిమా టైటిల్స్ లో కొత్తగా రాసిన ఇంగ్లిష్ ఫాంట్ కి ఆ సినిమా న్యూస్ పేపర్స్ పబ్లిసిటీలో గీసిన చిరంజీవి బొమ్మలకీ చాలా ఆకర్షితుడ్నయ్యాను. ఆ ఇంగ్లీష్ ఫాంట్ ని అనుకరిస్తూ నోట్ బుక్స్ లో హెడింగ్స్, నా పేరూ రాసుకునే వాడిని.
నాలుగేళ్ళ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పూర్తయ్యి, మూడవ సంవత్స రంలోకి అప్పుడే అడుగుపెట్టాం. నాలుగేళ్ళూ క్యాంపస్ లో హాస్టల్స్ లోనే ఉన్నాను. కాలేజి లో రెండు హాస్టల్స్ ఉండేవి. మొదటి రెండేళ్ళు ఓల్డ్ హాస్టల్ అని ఒకటి, చివరి రెండేళ్ళు న్యూ హాస్టల్ అని ఇంకోటి ఉండేది. న్యూ హాస్టల్ మంచి ఆర్కిటెక్చర్ తో కట్టిన బిల్డింగ్, మా కాలేజి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిజైన్ చేశారు అని అనేవాళ్ళు. ట్రైయాంగిల్ ఆకారంలో ఆర్కిటెక్చర్ కొత్తగా ఉండేది. పక్కనే ఆనుకుని పొలాలు, కొద్ది దూరంలోనే కనిపిస్తూ ఉండే కానూరులోని “విజయలక్ష్మి సినిమా థియేటర్”. మా హాస్టల్ నుంచి పెద్ద పొలం గట్టుమీద పది నిమిషాల్లో నడచి వెళ్ళొచ్చు, అక్కడే చాలా సినిమాలకి వెళ్ళే వాళ్ళం, ఎక్కువగా శనివారం సెకండ్ షోలకి, అప్పుడప్పుడూ మ్యాట్నీలకి. కొత్త సినిమాలు వస్తే మొదటిరోజు మ్యాట్నీకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్తే టికెట్స్ ఇచ్చేవాళ్ళు, క్యూలో వెళ్ళే పనిలేదు, అయితే అలా వెళ్ళి నేర్పుగా చెప్పి టికెట్స్ తీసుకురాగల సత్తా అందరికీ ఉండేది కాదు, కానీ ప్రతి ఫ్రెండ్ సర్కిల్ లో అలాంటి వాడొకడుండేవాడు. మా ఫ్రెండ్స్ లో “బాలసుబ్రమణ్యం” అని తిరుపతి ఫ్రెండ్ విజయవాడలో ఏ థియేటర్ కెళ్ళినా మేనేజర్ రూమ్ కెళ్ళి కాలేజి పేరు చెప్పి తమాషాగా టికెట్స్ సంపాదించుకొచ్చే వాడు.
మూడవ సంవత్సరం వచ్చేసరికి పోస్టర్ కలర్ పెయింటింగ్స్ మొదలుపెట్టి వేస్తూ ఉన్నాను. అప్పటికి రెండేళ్ళు కాలేజ్ మ్యాగజైన్ లో నా బొమ్మలు ప్రింట్ అవటంతో చాలామందికి “గిరిధర్” అన్న పేరు స్టూడెంట్ గానే కాదు ఆర్టిస్ట్ గానూ సుపరిచయం అయ్యింది. ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు ఆర్ట్ మీద మక్కువ ఉన్న ఒకరిద్దరు జూనియర్స్ ఆదివారం మధ్యాహ్నం పనిగట్టుకుని నా రూమ్ కి వచ్చేవాళ్ళు ఏం పెయింటింగ్ వేస్తున్నానో చూట్టానికి. కాలేజి మ్యాగజైన్ అంటే గుర్తుకొచ్చే ఒక తమాషా సంఘటన. మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కాలేజి మ్యాగజైన్ కి బొమ్మలు, కవితలు, ఆర్టికిల్స్, ఫొటోస్ సబ్మిట్ చెయ్యొచ్చు అని లిటరరీ క్లబ్ న్యూస్ బోర్డ్ లో నోటీస్ పెట్టారు. అది చూసి నేను వేసిన మూడు బొమ్మలు సబ్మిట్ చేస్తే మూడూ తీసుకున్నారు. అది తెలిసి నా ఫ్రెండ్ ఒకతను ఒక బొమ్మ తెచ్చిచ్చి నాతో వెయ్యించుకుని కింద తన పేరు కూడా నేనే రాసిస్తే సబ్మిట్ చేశాడు. అది తెలిసిన ఇంకో అతను నాకు పరిచయం కూడా లేదు, ఏదో వారపత్రిక పట్టుకొచ్చి అందు లో ఒక బొమ్మ వేసి తన పేరు రాయమని ఇబ్బంది పెట్టి మరీ వేయించుకున్నాడు. తర్వాత ప్రింట్ అయిన మ్యాగజైన్ లో వాళ్ళిద్దరూ వాళ్ళ పేరు చూసుకుని మురిసి పోయారు గొప్పగా. నాకు మాత్రం నా మూడు బొమ్మలు, ఆ రెండు బొమ్మలూ కలిసి ఐదు బొమ్మలు ఏకంగా నా ఒక్కడివే ప్రింట్ అవటం చూసుకుని మురిసిపోయాను. తర్వాత ఆ ఇద్దరూ కొంచెం ఆందోళనకూడా పడ్డారు పాపం, ఎవరైనా వచ్చి బొమ్మ వేసివ్వమంటే ఏం చెయ్యాలా అని. కాలేజి తమాషాలు అలా(నే) ఉంటాయి.
న్యూ హాస్టల్ లో ఉన్న రెండేళ్ళ కాలేజ్ లైఫ్ భలే ఉండేది. సీనియర్స్ అయ్యాం, ఇంకో ఒకటి రెండేళ్ళలో కాలేజి అయిపోతుంది. ఒక పూట మాత్రమే క్లాసులు. ప్రాక్టికల్స్ కంప్యూటర్ ల్యాబ్ కి పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు. ఎపుడన్నా వెళ్ళి అందరం ఒక్క సారి “మిని కంప్యూటర్ డంబ్ టర్మినల్స్” ముందు కూర్చుని లాగిన్ అయ్యి కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏదోటి రాద్దామని మొదలు పెట్టేసరికి లోడ్ ఎక్కువయ్యింది, సిస్టమ్ రీబూట్ చెయ్యాలి అరగంట పడుతుంది అని చెప్పేవాళ్ళు, హ్యాపీగా హాస్టల్ కి వెళ్ళి పొయేవాళ్ళం, ఇంక మళ్ళీ వచ్చే పనిలేదు. అలా మధ్యాహ్నం పరీక్షలు లేకుంటే, సినిమాకి వెళ్ళకుంటే ఎక్కువగా బొమ్మలు వేస్తుండేవాడిని. ఫైనల్ ఇయర్ లో “సోవనీర్” అని ఒక బుక్ ప్రింట్ చేసి బ్యాచ్ లో అందరికీ ఇచ్చేవాళ్ళు. అందులో ఒక్కో పేజీకి ఒక్కొక్కరి చొప్పున ఆ ఇయర్ బ్యాచ్ లో అన్ని బ్రాంచ్ ల వాళ్ళవీ పాస్ పోర్ట్ ఫొటో, అడ్రెస్స్, ఫొటో కింద ఒక తమాషా క్యాప్షన్, క్లాస్ మేట్స్ సెలెక్ట్ చేసిందే. క్యాప్షన్స్ సరదాగా ఉండేవి. నాకు నా క్లాస్ మేట్స్ అందరూ కలసి పెట్టిన క్యాప్షన్ “రవివర్మ ఆఫ్ ది కాలేజ్” అని. తమాషాగా అనిపించింది, నన్ను రవివర్మతో పోల్చటం ఏంటి అని. అప్పట్లో ఇండియా మొత్తం మీద బ్రిటీష్ కాలం నాటి “రాజా రవివర్మ” అంత పాపులర్ పెయిం టర్.
అప్పట్లో చాలా బొమ్మలు ఈ బొమ్మలాగే క్యాజువల్ గా గియ్యటంతోనే మొదల య్యేవి. ముందుగా అవుట్ లైన్ వేసుకోవటం, పేపర్ మీద కంపోజిషన్ చేసుకోవటం ఇలాంటివేవీ ఉండేదికాదు. అలా పెన్నుతో గీస్తూ పూర్తిచేశాక చుట్టూ బార్డర్ ఇండియన్ ఇంక్ తో వేసేవాడిని. అప్పటికి పెన్సిల్, బాల్ పాయింట్ పెన్ బొమ్మల్లో కమాండ్ వచ్చేసుంది కనుక ఈ బొమ్మలో గమనిస్తే షేడ్స్ సులభంగా వెయ్యగలిగాను. ఆ హెయిర్, హ్యాట్, బాడీ వెనుక భాగం నీడల ఛాయల్లో ఇది కనిపిస్తుంది. ఎదురుగా సముద్రపు నీళ్ళ ని అంత శ్రద్ధగా వెయ్యకపోయినా సముద్రం అనిపించేలా గీసిన సన్నని గీతల షేడ్స్ రియలిస్టిక్ గా లేకున్నా సముద్రాన్ని మాత్రం తలపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు వేసే బొమ్మల్లో అక్కడక్కడా లోపాలు కనిపిస్తాయేమో కానే, అప్పటి పోర్ట్రెయిట్స్ బాడీ ప్రొపోర్ష న్స్ మాత్రం పర్ఫెక్ట్ గా వేసేవాడిని, అంటే అంత ఎక్కువగా శ్రద్ధ ఉండేదన్నమాట.
కాలేజిలో ఫ్రెండ్స్ ఇచ్చిన ఉత్సాహం, ప్రోత్సాహంతో నా బొమ్మల ప్రయాణం నాలుగేళ్ళు కొత్త కొత్త ప్రక్రియలు చేస్తూ, మెళకువలు నేర్చుకుంటూ, మెటీరియల్ కోసం విజయవాడ నగరం అంతా గాలిస్తూ, ఆంధ్ర భూమి వారపత్రికలో వచ్చే ఉత్తమ్ గారి పెయింటింగ్స్ చూసి సాధన చేస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అందంగా, ఆనందంగా సాగిపోయింది. కాలేజి అయ్యాక ఉద్యోగ వేటలో మా అందరి బాటలూ వేరయ్యాయి. ఎవరి విజయబాటల్లో వాళ్ళు పయనిస్తూ అన్ని దిక్కులకీ అందనంత దూరాలకి అందరం వెళ్ళిపోయాం. అస్థిరంగా మొదలుపెట్టిన కాలేజి బయట జీవిత ప్రయాణాలు స్థిరంగా కుదుటపడి జీవితాల్లో స్థిరపడ్డాం. విజయవాడలో ఒక్కరూ లేరు, కొందరు వాళ్ళ స్వస్థలాల్లో ఇంజనీర్స్ గా, కొందరు హైదరాబాద్, సింగపూర్, కువైట్, అమెరికాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ చాలాకాలం ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండానే ఉండిపోయాం. త్వరత్వరగా మారిపోతున్న ఇప్పటి కాలంలో మళ్ళీ అందరం ఈమధ్యనే వెలుగులోకి వచ్చేశాం. మాట్లాడుకున్నపుడల్లా నా బొమ్మల ప్రస్థావన రాకుండా ఉండదు. నేను అప్పట్లో ఎక్కువగా వేసిన నా అభిమాన నటి “భానుప్రియ” ని గుర్తుచేసుకోకుండా ఉండరు. అమెరికాలో భానుప్రియ ఉండేది, నీ బొమ్మలు ఎప్పుడూ చూడ్లేదా అని కూడా అడుగుతుంటారు. లేదు, చూసుండదు. నా బొమ్మలు చూసినవాళ్ళు అతి కొద్దిమందే. ఆ కొద్ది మందిలో “భానుప్రియ” ఉండే ఛాన్స్ లేనే లేదు. ఎప్పుడూ ఎక్కడా వెలుగు చూడని నా కాలేజి రోజుల బొమ్మలు అవన్నీ. అవి చూసిన కాస్త వెలుగల్లా నా చుట్టూ ఉన్న మిత్రు ల ముఖాల్లో సరదా, తామాషాల నవ్వులు, ఆ నవ్వులతోబాటు వాళ్ళ కళ్ళల్లో స్నేహ కాంతులు చిందిన అప్పటి వెలుగులే…
“ఆనాటి వెలుగులో ఈనాడు కదలాడే నీడలే జ్ఞాపకాలు.”
Ballpoint pen on Paper (8.5″ x 11″)
*****
గిరిధర్ పొట్టేపాళెం – వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బోస్టన్, USA లో భార్య డా|| జయలక్ష్మి, కొడుకులు రిత్విక్, భువన్ లతో నివాసం. పుట్టిన ఊరు కావలి, నెల్లూరు జిల్లా, పెరిగిందంతా ఇంటికి దూరంగానే. విద్యాభ్యాసం- కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్, హిందూపురం లో హైస్కూల్, ఆంధ్ర లొయోలా, విజయవాడ లో ఇంటర్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళశాల, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, జె.యన్.టి.యు హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా T.C.S. India, పలు USA సంస్థల్లో అనుభవం.
హాబీలు – బొమ్మలు వెయ్యటం, నేర్చుకున్న విషయాలు, అనుభవాలు రాయడం, పుస్తకాలు చదవడం.