యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-19

మెల్ బోర్న్ – రోజు 3 మెల్ బోర్న్ సిటీ హైలాండ్స్ బోట్ టూర్

మర్నాడు మా ప్యాకేజీ టూరులో మేం ఎంపిక చేసుకున్న ప్రైవేట్ మెల్ బోర్న్ సిటీ టూరు క్యాన్సిల్ అవడంతో రోజంతా ఖాళీ ఏర్పడింది. కాబట్టి మా అంతట మేముగా ఉదయం 11 గం. నించి మధ్యాహ్నం 1 గం. వరకు రెండుగంటల పాటు యర్రా నది (Yarra River) మీద తిప్పుతూ నగరాన్ని చూపించే పడవ టూరైన మెల్ బోర్న్ సిటీ హైలాండ్స్ బోట్ టూర్ (Melbourne city highlands boat tour) ని బుక్ చేసుకున్నాం. ఒక గంటసేపు టూర్లు కూడా ఉంటాయిక్కడ. ఒక్కొక్కళ్ళకి గంటసేపైతే $35 డాలర్లు, రెండు గంటల సేపైతే $58 డాలర్లు టిక్కెట్టు.

          ముందురోజు రాత్రి బాగా ఆలస్యం కావడంతో పొద్దున్నే లేవకుండా బాగా విశ్రాంతి తీసుకున్నాం. పదిగంటలకల్లా మొదటిరోజు మేం స్కై డెక్ కి, నదిమీద జిప్ లైన్ కి వెళ్ళిన ప్రాంతంలోనే ఊబర్ దిగాం. పడవలో తినేందుకు ఏవీ దొరకవని తెలియడం వల్ల అప్పటికప్పుడు పక్కనే ఉన్న దుకాణానికి పరుగెత్తి బనానా బ్రెడ్డు, చిప్సు వంటివి తెచ్చు కున్నాం. పడవలో తాగేందుకు టీ, కాఫీలు ఇస్తారని వెబ్సైటులో రాసినా తీరా ప్రయాణం లో మంచినీళ్ళు కూడా అడిగితే కానీ ఇవ్వలేదు. అదొక్కటి తప్ప ప్రయాణమంతా సాఫీ గానే జరిగింది. పెందరాళే మధ్యాహ్న భోజనం చేసే అలవాటు ఉంటే ఈ టూరుకి వెళ్ళే  ముందే ఏదైనా తిని రావడం మంచిది.

          ఈ యర్రా నది (Yarra River) ని ఒక్కప్పుడు స్థానిక భాషలో Yarra Yarra River (యర్రా యర్రా నది) అని పిలిచేవారట. విక్టోరియా రాష్ట్ర రాజధాని అయిన ఈ మెల్ బోర్న్ నగరం ఒకప్పుడు చిన్న గ్రామంగా, ప్రధానంగా ఈ నది ఒడ్డునే ఉండేది.

          ఈ నది యర్రా పర్వత శ్రేణులలో పుట్టి 242 కిలోమీటర్లు పశ్చిమాన యర్రా వ్యాలీ గుండా, గ్రేటర్ మెల్బోర్న్ నగరం మీంచి ప్రవహించి పోర్ట్ ఫిలిప్ బే దగ్గిర సముద్రంలో కలుస్తుంది.

          ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండడం వల్లనో ఏమో వరద గోదారిలా బురదరంగులో ఉంది ఈ యర్రానది. నగరం దాపున ఇది నిజానికి నదిలా కాకుండా కాలువలా ఉంటుం ది. నది నగరం మధ్య ప్రవహిస్తున్నప్పటికీ ఎక్కడా చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉండడం విశేషం. తీరాలు కూడా అంతటి పరిశుభ్రంగానూ ఉన్నాయి. ఈ నదీ ప్రవాహంలో ఆకులు వంటి చెత్తని ఎప్పటికప్పుడు జల్లెడ పట్టే పెద్దసైజు జల్లెడ పెట్టెల వంటివి తీరం వెంబడి కనిపిస్తూ ఉంటాయి.

          1835 ప్రాంతంలో ఇప్పటి మెల్‌బోర్న్‌ సిటీ సెంట్రల్ ప్రాంతాన్ని పోర్ట్ ఫిలిప్ అసోసియేషన్‌లోని ప్రముఖ సభ్యుడైన జాన్ బాట్‌మాన్ (John Batman) మొదటగా కనుగొన్నాడట. స్థానికుల నుండి ఆయన 6,00,000 ఎకరాల (2,400 కి. మీ) భూమిని సంపాదించి యర్రా నదికి ఉత్తర తీరాన ఉన్న ఈ స్థలాన్ని గ్రామ నిర్మాణానికి ఎంచు కున్నాడు. ముందు ఈ ఊరికి “గ్లెనెల్గ్” (Glenelg) అని పేరు పెట్టారట. కానీ అప్పటి బ్రిటిష్ గవర్నర్ సర్ రిచర్డ్ బోర్క్ (Sir Richard Bourke) 1837లో అక్కడ పర్యటిస్తూ ఈ నగరానికి “మెల్బోర్న్” అని నామకరణం చేసారు. అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి విలియం లాంబ్, 2వ విస్కౌంట్ మెల్బోర్న్ ఇంగ్లీష్ మిడ్‌ల్యాండ్స్‌లోని డెర్బీషైర్‌లో మెల్బోర్న్ లో నివసిస్తూ ఉండడం వల్ల అదే పేరుని ఇక్కడ పెట్టారట. ఇప్పుడు మెల్బోర్న్ ని ఇక్కడ ఆస్ట్రేలియన్ యాసలో “మెల్ బర్న్” అని పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియాలో రెండవ పెద్ద నగరం.

          పై నించి చూస్తే యర్రా నది నగరానికి గంధపు పాపిట బొట్టులా అందంగా అమిరింది. ఇరవైకి పైగా బ్రిడ్జిలతో మెల్బోర్న్ నగరానికి ఇనుమడించిన సోయగాన్ని తెచ్చిపెట్టింది ఈ నది.

          సరిగ్గా ఉదయం 11 గం. కు సౌత్ గేట్ దగ్గిర లోయర్ ప్రామినాడ్ లో (Lower Promenade) రెండవ నంబరు జెట్టీ నించి పడవ ప్రయాణం ప్రారంభమైంది. సముద్రం లోని పడవల్లా కాకుండా పైన పెద్దగా ఎత్తులేకుండా చదునుగా ఉంటాయి ఈ పడవలు. ఇలా ఎందుకు ఉన్నాయో అక్కడి బ్రిడ్జిల కిందికి పడవ వెళ్ళేటపుడు అర్థమవుతూ ఉంటుంది. పడవ డెక్ మీద నిల్చుంటే కొన్ని పాత బ్రిడ్జిల కింది భాగం దాదాపు చేతికి తాకేంత ఎత్తులో ఉంటుంది మరి! కింది అంతస్తులో వందమంది వరకూ కూర్చోవచ్చు. పైన ఒక వైపుగా చిన్న డెక్ మాత్రం ఉంది. కింది అంతస్తులో కూచుంటే దాదాపు నీటి మట్టానికి ఒరుసుకుని నడుస్తూ ఉంటుంది పడవ.

          గంటసేపు టూరుకి, రెండుగంటలసేపు టూరుకి ఒక్కటే పడవ. మొదటి గంట సేపూ నది ఎగువ భాగానికి వెళ్తే, రెండో గంట పాటూ నది దిగువ భాగానికి వెళతాం. ముందుగా నది ఎగువ భాగానికి వెళ్ళేదారిలో ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, ఒలింపిక్ పార్క్ టెన్నీస్ సెంటర్, గవర్నర్ భవనం, రాయల్ బొటానిక్ గార్డెన్స్ మీదుగా వెళ్ళి హెర్రింగ్స్ ద్వీపం (Herring Island) దగ్గిర వెనుదిరుగుతాం. ఈ హెర్రింగ్స్ ఐలాండ్ మానవ నిర్మిత ద్వీపం. ఒకప్పుడు స్కౌట్స్ ట్రైనింగ్ స్కూలు ఉండేది ఇక్కడ. ప్రస్తుతం ఉత్తమ శిల్ప కళాకృతులకు, అరుదైన అనేక పక్షులకు నిలయమిది.

          ఈ పడవ మీద నీళ్ళని ఒరుసుకుంటూ నెమ్మదిగా ఏ పనీ లేనట్టు ప్రయాణిస్తూ హెర్రింగ్స్ ద్వీపాన్ని చుట్టి వస్తూ ఉంటే టామ్ సాయర్ తో కలిసి మిసిసిపీ నది మీద బద్ధకంగా చిన్న పడవలో ప్రయాణించి జాక్సన్ ద్వీపానికి చేరినట్టు అనిపించింది. చిన్నప్పటి కల ఏదో నెరవేరినట్లయ్యి సంతోషం చుట్టుముట్టింది.

          పన్నెండు గంటల ప్రాంతంలో వెనక్కి మళ్ళీ ఎక్కడ బయలుదేరేమో అక్కడికి వచ్చి ఆగి గంట టూరు వాళ్ళని దించి మళ్ళీ బయలుదేరింది పడవ. నది దిగువ దారిలో మెల్బోర్న్ కన్వెన్షన్ సెంటర్ దాటి, డాక్ ల్యాండ్స్ చుట్టి వస్తాం. షిప్ యార్డ్ దాపున సాగర సంగమ ముఖద్వారం వరకూ వెళ్ళోస్తాం. పెద్ద పెద్ద కంటైనర్ షిప్పుల నించి క్రేన్లు అట్టపెట్టెల్లా కంటైనర్లని లాఘవంగా మోసుకుపోతున్న దృశ్యం చూసితీరాల్సిందే.

          ఇక్కడ సముద్రతీరమైనా తేమగా లేదు. ఆహ్లాదంగా అనిపించింది ఆ పడవ ప్రయాణం. చుట్టూ అందమైన నగర భవనాలు, చెట్లూ చేమలు, పక్షులు, నదీ తీరాన నడక దారిలో షికార్లు చేసే మనుషులు, సైకిలిస్టులు, దూరాన ఓడలు, తోడుగా కబుర్లు చెపుతూ వెన్నంటి వచ్చే ఆకాశం, మధ్య మధ్య స్పృహలోకి రప్పించే పడవ కెప్టెన్ , గైడు కామెంటరీతో రెండుగంటలు ఇట్టే గడిచిపోయాయి.

          పడవలో మా పక్కనే కూర్చున్న దాదాపు డెబ్భై ఏళ్ళ వయసున్న ఇద్దరు తెలుగు ఆడవాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ అరవై ఏళ్ళ తరువాత ఇప్పుడు కలుసు కున్నారట. అందులో ఒకామె ఆస్ట్రేలియాలో ఎప్పుడో ముప్పయ్యేళ్ళ క్రితమే సెటిల్ కాగా, మరొకావిడ వాళ్ళ అబ్బాయి ఇంటికి రెండు వారాల కిందట వచ్చిందట. అరుదైన ఆ స్నేహితురాళ్ళతో కాస్సేపు అబ్బురంగా కబుర్లు చెప్పాను.

          ఒంటిగంట ప్రాంతంలో తిరిగి తీరం చేరుకున్నపుడు ఎన్నాళ్ళ తర్వాతో కలుసు కున్న స్నేహితురాలిని హత్తుకుని వీడ్కోలు చెప్పినట్లు యర్రా నదికి వీడ్కోలు పలికాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.