యాదోంకి బారాత్-21

-వారాల ఆనంద్

నాకూ మీకూ
గాయాలకేం కొరత,
కనిపించేవి మానిపోతాయి
మనసు లోపలివి కొనసాగుతాయి తడి తడిగా
గాయాల్ని గేయాలుగా గున్ గునాయిస్తూ
తలెత్తుకు నడిస్తేనే
బతుకు ఢంకా బజాయిస్తుంది

***

          ఎనభయవ దశకం చివరి మూడు నాలుగేళ్ళూ నేను కాళ్ళకూ మనసుకూ చక్రాలేసుకు తిరిగాను.

          పెళ్ళి, అమ్మ అస్తమయం, ఇల్లు మారడం, మరో పక్క స్కూలు వీటి నడుమ పిల్లలకథలు రాయడం, మరో పక్క నా ప్రధాన ఇష్టమయిన ఫిలిమ్స్ అండ్ ఫిలిం సొసైటీకార్యక్రమాలూ. అంతా బిజీ బిజీ.

          సినిమాల విషయానికి వస్తే హైదరాబాద్ లో 1986లో జరిగిన ఫిల్మోత్సవ్ నాలోగొప్ప ప్రేరణ కలిగించింది. మొత్తం ఫెస్టివల్లో పాల్గొని అన్ని సినిమాల్నీ చూడలేదు కానీ. చూసిన సినిమాలూ పాల్గొన్న మేరకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందా ఫెస్టివల్. అప్పుడు ఎన్.టీ.రామారావు గారు ముఖ్యమంత్రి. హైదరాబాద్లో తోలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కనుక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం 90 రోజుల్లో ‘తెలుగు లలిత కళా తోరణం’ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ప్రారంభోత్సవం అక్కడే చేసారు. అప్పుడు అదొక గొప్ప సందర్భం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం  ఆధ్వర్యం లోని డైరక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ వాళ్ళు ఈ అంతర్జాతీయ ఫెస్టివల్స్ రెండు  రకాలు గా చేసే వారు. ఒక ఏడు INTERNATIONAL FILM FESTIVAL ని కాంపిటీటివ్ ఫెస్టివల్ గానూ, మరుసటి రోజు FILMOTSAV నాన్- కాంపిటీటివ్ ఫెస్టివల్ గా నిర్వహించేవారు.

          కాంపిటీటివ్ ఫెస్టివల్ ను డిల్లీలోనూ నాన్- కాంపిటీటివ్ ఫెస్టివల్ ను ఇతరనగరాల్లోనూ నిర్వహించేవారు. అట్లా 1986 లో హైదరాబాద్ లో ఫిల్మోత్సవ్ ఏర్పాట యింది. అదొక పెద్ద అంతర్జాతీయ సినిమా ఉత్సవం. ఈ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో 1978 నుంచి అనేక దేశాల ఉత్తమ చిత్రాలతో పాటు భారతీయ సినిమాల్లోంచి ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాల్ని కూడా ‘ఇండియన్ పానోరమా’ గా ప్రదర్శించడం  ప్రారంభిం చారు. హైదరాబాద్ ఫిల్మోత్సవ్ సందర్భంగా సత్యజిత్ రే చాలా గొప్పగా చెప్పారు. This year filmotsav is being held in Hyderabad, which is the worthy venue being, I understand, a very film conscious city… అన్నారాయన. చాలా సంతోషం వేసింది. ఆ ఫెస్టివల్లో నాకు గుర్తున్నంతవరకు తెలుగులోంచి సింగీతం శ్రీనివాస రావు గారి  ‘మయూరి’, మన్ మోహన్ దత్ తీసిన డాక్యుమెంటరీ ఫిలిం ‘కలంకారీ’ ప్రదర్శించారు.

          ఇక హైదరబాద్ లో తొలి ఫిలిం ఫెస్టివల్ కనుక తెలుగు పత్రికలూ బాగా హంగామా చేసాయి. సినిమా వాళ్ళ ఇంటర్వ్యు లు, కవరేజ్ బాగా ఇచ్చారు. దేవులపల్లి అమర్ లాంటి వాళ్ళు కూడా ఆక్టివ్ గా సినిమా రిపోర్టింగ్ చేసారు. అది నాకయితే గొప్ప  ఉత్సాహా న్ని ఇచ్చింది. కరీంనగర్నుంచి నేనూ, నారదాసు లక్ష్మన్ రావు, నరేడ్ల శ్రీనివాస్ లము పాల్గొన్నట్టు గుర్తు. ఎవరికయినా ఒక ఉత్సవం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. విషయం మీద ఆసక్తి వుంటే వ్యక్తిగతంగా ముందుకు వెళ్ళేందుకు తోడ్పడుతుంది. అది ఫిలిం ఫెస్టివల్ అయినా సాహితీ ఉత్సవమయినా కూడా. నా విషయంలో అదే జరిగింది. అప్పటికే ఫిలిం సొసైటీలు ఏర్పాటు చేయడం మంచి సినిమాల గురించి చదవడం చూడడం ఆసక్తిగా వున్న వాణ్ని హైదరాబాద్ ఫిల్మోత్సవ్ నాకు ఎంతో ఊపునిచ్చింది.

***

          అప్పటిదాకా స్క్రీన్ వెనకాల వున్న వాణ్ని 1988లో కఫిసో కార్యదర్శి బాధ్యతల్ని తీసుకున్నాను. రేణికుంట రాములు అధ్యక్షుడు. కార్యవర్గం అంతా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అప్పుడు మా గౌరవాధ్యక్షుడు కలెక్టర్ శ్రీ టీ.ఎస్.అప్పారావు. కఫిసో అప్పటి దాకా ప్రతి సంవత్సరం నవంబర్లో బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించడం  ఆనవాయితీగా చేస్తూ వస్తున్నది. అప్పుడు ప్రతి నవంబర్ కరీంనగర్ లో బాలల సినిమా పండగ. అయితే నేను కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నంక ఒక ఆలోచన వచ్చింది. పల్లెల్లోని పిల్లల కోసం సినిమాలు చూపిస్తే ఎట్లా వుంటుంది అని. రాములు గారు  ఉత్సాహం చూపించారు. నేను వెళ్ళి కలెక్టర్ టీ.ఎస్.అప్పారావుని కలిసాను. నా ఆలోచన చెప్పాను. ఆయన ఎంతో ఉత్సాహం చూపించాడు. మరి నేనేం చేయాలి అన్నారు. CHLDREN FILM SOCIETY OF INDIA నుంచి 16mm prints తెప్పిస్తాను. పౌర సంబంధాల శాఖ నుంచి projector, operator లు కావాలి అన్నాను. సరే మరి మీ ప్రయాణాలు అన్నారాయన ఏముంది బస్ లో వెళ్తాం అన్నాను.. నొ నొ వాన్ అరేంజ్ చేస్తానన్నారు. నేను ఎగిరి గంతేసినట్టు ఫీలయ్యాను. మీరు ప్లాన్ చేసుకోండి. ఒక అప్లికేషన్ ఇవ్వండి అన్నారు. అప్పటికే దగ్గరున్న దరఖాస్తు ఆయనకిచ్చాను.  ఇంకే ముంది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా. అన్నీ ఏర్పాటు చేసారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి రండి సార్ అని అడిగాను. టీ.ఎస్.అప్పారావు గారు నవ్వి చూడండి ఆనంద్ ప్రతి సారి మేము ఉండాలని అనుకోవద్దు. మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మేము న్నట్టే అనుకోవాలి. పని జరగడం ప్రధానం కదా అన్నారు. చాలా సపోర్టివ్. ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే.

          గ్రామీణ బాలల చలన చిత్రోత్సవం ఫిలిం స్క్రీనింగ్ షెడ్యుల్ వెసాము. మొట్ట మొదటి స్క్రీనింగ్ చొప్పదండి జవహర్ నవోదయ స్కూల్లో. అప్పుడక్కడ జనార్ధన రెడ్డి గారు ప్రిన్సిపాల్. గార్లపాటి తిరుపతి రెడ్డి, డీ.పీ.ఆర్.వొ. నరసింహా చారి, గోపు లింగా రెడ్డి, రాములు గారు నేనూ వెళ్ళాం. ఫిలిం స్క్రీనింగ్ తర్వాత పిల్లలు ఊహించనంతగా స్పందించారు. సభ తర్వాత పిల్లలు మాట్లాడ్డం, భోజనాలూ అదొక అనుభవం. ఇంకే ముంది ఆ రోజు నుంచి ప్రతి సాయంత్రం డీపీఆర్వో  వాన్, ప్రొజెక్టర్, ఆపరేటర్ శ్రీనివాస్, ఫిలింబాక్స్ నేనూ, రాములు సార్, కరీంనగర్ లో బయలు దేరేవాళ్ళం. ఏపీ ఆర్ వొ కృష్ణమూర్తి మాతో ఉండేవాడు. వారం పాటు సాగిందా ఫెస్టివల్. రెండవ రోజు మల్యాల దగ్గరి తాటిపల్లి. అక్కడ స్కూలు ప్రిన్సిపాల్ గా ఇంటర్ లో మా లెక్చరర్ శ్రీ పార్థసారధి గారు. ఇంకే ముంది. నిబద్దత కలిగిన గొప్ప టీచర్. అట్లే మిగతా రోజుల్లో మల్లాపూర్,కొండాపూర్, పెంబట్ల లాంటి అనేక చోట్ల గ్రామీణ బాలల చిత్రోత్సవాలు జరిపాం. పిల్లల సంతోషం, పార్టిసిపేషన్ మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. అప్పటివరకు నా మొత్తం ఫిలిం సొసైటీ కారీర్ లో సంతోషాన్నీ తృప్తినీ ఇచ్చిన ఉత్సవం అది.

          దాదాపుగా అదే సమయానికి అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ లో తన స్టూడియో శిల్పిని తీసేసి హైదరాబాద్ వెళ్ళాడు. విద్యానగర్ లో స్టూడియో చిత్రలేఖ ప్రారంభించాడు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా తన దగ్గరకు వెళ్ళేది. ఆ క్రమంలో నువ్వు కవిత్వం రాయడం లేదు గదా మరి సినిమాల మీద రాయొచ్చు కదా అన్నాడు. డైరెక్టర్స్ పైన రాయాలి అన్నాను. పద పల్లకి ఆఫెస్సుకు వెళ్దాం అన్నాడు. అప్పటికే ‘పల్లకి’, ‘స్రవంతి’ వార పత్రికలు వస్తున్నాయి. ప్రభాకర్ వాటిల్లో కవిత్వం రాస్తున్నాడు.విక్రం సంపాదకుడు.
రాజ్భవన్ రోడ్డులో వున్న పత్రికాఫీసుకు వెళ్ళాం. విక్రంకి నన్ను వివరంగా పరిచయం చేసాడు ప్రభాకర్. నేను సమాంతర సినిమా డైరెక్టర్ల మీద వారం వారం రాస్తానన్నాను. విక్రం గారే “డైరెక్టర్స్ డైరీ” అని శీర్షికకు పేరు పెట్టారు.

          ఇంకే ముంది సత్యజిత్ రే నుంచి మొదలు పెట్టి వారం వారం రాసాను. అదే కాలంలో హైదరాబాద్ ఫిలిం క్లబ్ కార్యదర్శి శ్రీ బి.హెచ్.ఎస్.ఎస్.ప్రకాష్ రెడ్డిగారితో సన్నిహితత్వం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా ఎదిగి దశాబ్దాలుగా పెరుగు తూనే వచ్చింది. తను దాదాపుగా జీవితాన్ని ఫిలిం క్లబ్ కార్యక్రామలకు, సమాంతర సినిమాలకు అంకితం చేసారు. అకుంటిత దీక్షతో పనులు చేస్తాడు. నిరంతర ఫిలిం సొసైటీ శ్రామికుడు అనొచ్చు ఆయన్ని. కరేస్పాన్దేన్స్ చేయడంలో కానీ క్లబ్ నిర్వహణలో కానీ ఆయన చూపే చొరవ వెచ్చించే సమయం నిజంగా అబ్బురపరుస్తుంది. తర్వాత ఫెడెరేషన్ లో కూడా అన్ని బాధ్యతల్నీ నిర్వహిస్తున్నాడు. తనే ఆ ఏడు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ డిల్లీలో జరుగనుంది వస్తారా అన్నాడు. నేనూ ఉత్సాహం చూపించాను. ప్రెస్ అక్రేడిటేశన్ తీసుకొండి అన్నాడు. నేను పల్లకి విక్రం గారిని అడిగాను. ఫారం నింపి పంపాము డిసెంబర్లో లెటర్ వచ్చింది రమ్మని పిలిచాడు విక్రం. నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుని. డిల్లీ ప్రయాణపు ఏర్పాట్లల్లో పడిపోయాను. ఈ లోగా ఒక రోజు నేనూ నందిగం కృష్ణా రావు మరో మిత్రుడూ ఉదయం ఆఫీసుకు వెళ్ళాం. పతంజలి గారిని కలిసాం. అప్పటికే నేను పతంజలి భాష్యం చదివిన ఊపులో వున్నాను. నేను డిల్లీ ఫెస్టివల్ కు
వెళ్తున్నాను అని చెప్పగానే మాకేమయినా రాయకూడదూ అన్నారు పతంజలి. అంతే కాదు మా ఆఫీసు నుంచి అల్లాని శ్రీధర్, ఫోటోగ్రాఫర్ రమేష్ వస్తారు అని చెప్పాడు. వాళ్ళది వాళ్ళు రాస్తారు మీది మీరు రాయండి. మాకు ఫాక్స్  చేయండి అన్నారు పతంజలి. డిల్లీ బయలు దేరాను. సహచరి ఇందిర వరంగల్ లో వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో వుంటానంది. ఇందిర వాల్లక్కయ్య ఉష డిల్లీ నుంచి తమకు కుర్చీలు తెమ్మంది. ఇంకా ఏవో డిమాండ్స్. నాకేమో కేవలం ఫెస్టివల్ సినిమాలు అంతే, డిల్లీలో జే.ఎన్ యు లో వున్న మిత్రుడు జే.మనోహర్ రావు దగ్గర వుండాలని ఆలోచన. బయలుదేరాక రైల్లో మంథనికి చెందిన రాకేశ్ పరిచయమయ్యాడు. మర్నాడు రాత్రికల్లా యునివర్సిటీ హాస్టల్కు చేరాను. నన్నుచూడగానే సంతోష పడ్డ మనోహర్ బట్టలు ఏమి తెచ్చుకున్నావు అన్నాడు ఎందుకు అన్నాను డిల్లీ జనవరి చలిలో ఈ మామూలు బట్టలతో ఉంటావా అని నవ్వి తన స్వెట్టర్ ఇచ్చాడు. ఉదయమే బయలుదేరి సిరిఫోర్ట్ చేరాను. అక్కడొక చిత్రం జరిగింది. నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి లెటర్ చూపించి కార్ద్ ఇవ్వమని అడిగాను. కౌంటర్లో ఉన్న క్లర్క్ లెటర్ చూసి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని వుంది కదా అన్నాడు. అప్పుడు చూసాను పూర్తి లేఖను. తల తిరిగి పోయింది. నేను విక్రం అంతా చూసాం కానీ ఉత్సాహం లో గమనించలేదు. ఏం చేయడం. ప్రకాశ్ రెడ్డి ముందుకొచ్చాడు. ఎఫ్ ఎఫ్ ఎస్ ఐ నార్త్ రీజియన్ కార్యదర్శి యు.రాధాకృష్ణన్ ను కలిసి విషయం చెప్పాం. తాను డెలిగేట్ కార్డ్ అరేంజ్ చేసాడు. హమ్మయ్య అనుకున్నాం. ఇంకేముంది సాయంత్రం ఫెస్టివల్ ప్రారం భోత్సవం. మంత్రి హెచ్.కే.ఎల్.భగత్ ముఖ్య అతిథి. షబానా అజ్మీ తదితరులు అతిథు లు. లాంచనంగా ఫెస్టివల్ ప్రారంభం కాగానే షబానా మైకు దగ్గరికి వెళ్ళి ‘సఫ్దర్ హాష్మి’ హత్యకు నిరసన తెలుపుతూ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదిక మీద నిరసన తెలిపే సరికి మొత్తం కలకలం రేగింది. మర్నాడు అన్ని పత్రికల్లో అదే ప్రధానాంశం. ఇక నేను సినిమాలు చూడడంలో మునిగిపోయాను. ప్రకాశ్ రెడ్డి గారు చెప్పారు ఇండియన్  పనోరమా సినిమాలు తర్వాత ఎప్పుడయినా చూడొచ్చు ఫారిన్ సినిమాల మీద దృష్టి పెట్టండి అన్నాడు. అట్లాగే చేసాను. ఆ ఏడూ కంట్రీ ఫోకస్ లో ‘చైనా’ సినిమాల్ని ఒక పాకేజీగా వేసారు. ‘రెడ్ సోర్ఘం’ మొదలు దాదాపు అన్ని సినిమాలూ చూసాను.”సినిమా కోణం లోంచి చైనా” అన్న ఆర్టికల్ పంపిస్తే ఉదయంలో పతంజలి గారు చాలా వివరంగా
ఫోటోలతో వేసారు. ఫెస్టివల్ అన్ని రోజులూ దర్శకులు ఎవరు కనిపిస్తే వాళ్ళతో పరిచయం చేసుకోవడం ఇంటర్వ్యు లాగా మాట్లాడ్డం దాన్ని ఉదయంకు ఫాక్స్ చేయడం. సినిమాల గురించీ రాయడం.

          ఆ క్రమంలో అదూర్ గోపాల కృష్ణన్, అస్సాంకు చెందిన జానూ బరువా, సయీద్ అక్తర్ మీర్జా, బుద్దదేవ్ దాస్ గుప్తాలతో సహా ఎందరినో పలకరించాను. మాట్లాడాను. రాసాను. గరంహవా లాంటి సినిమాలు తీసిన ఎం.ఎస్.సత్యు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనతో మాట్లాడినప్పుడు విజయవాడ ఫిలిం సొసైటీ కిషోర్ కూడా నాతో వున్నాడు. ఇక ‘తాయీ సాయిబా’ సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న గిరీష్ కాసరవెల్లితో సుదీర్ఘమయిన సంభాషణ చేసాను. దాన్ని కరీంనగర్ తిరిగి వచ్చిన తర్వాత ఆంద్రప్రభకు పంపాను. అంజనేయ శాస్త్రి గారు ప్రత్యేకంగా ప్రచురించారు. డిల్లీలో ఇంకా ఇక్బాల్ మసూద్, సయీద్ అక్తర్ మీర్జా లను కూడా కలిసాను. ఇప్పుడన్నీ గుర్తు లేవు గానీఎంత గొప్ప అనుభవమో అది. ఈ విషయంలో ప్రకాష్ రెడ్డి గారికే ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

          ఫెస్టివల్ జరుగుతున్న రోజుల్లో ఒక రాత్రి మనోహర్ అన్నాడు. ఏమిటి సినిమాలు రాతలు ఇవే పనులా రేపు సిరిఫోర్ట్ కు వేళ్ళకు. నీకు డిల్లీ చూపిస్తానన్నాడు. సరేనన్నాను. మర్నాడు రెడ్ ఫోర్ట్ మొదలు అన్నీ దగ్గరుండి చూపించాడు మనోహర్. అదొక మంచి జ్ఞాపకం. థాంక్ యు మనోహర్. ఫెస్టివల్ ముగిసిన తర్వాత కుర్చీలు అవీ ఏవో షాపింగ్ చేసి గొప్ప ఆనందంతో బయలుదేరాను. కాజీపేట్ స్టేషన్లో దిగగానే టీ.సి.పట్టుకున్నాడు. ఓవర్ లగేజ్. ఫైన్ కట్టమంటాడు. నాకేమో జేబులు ఖాళీ. ఏం చేయాలి. బతిలాడాను. వాడు కొన్ని డబ్బులు ఇస్తే వదిలేస్తానన్నాడు. అట్లా నాకు దొరికాడు. అప్పుడే అటుగావచ్చిన రైల్వే సీనియర్ అధికారిని కలిసి నేను పత్రికా రచయితను నన్ను డబ్బులుఅడుగుతున్నాడు అన్నాను. ఉదయంలో వచ్చిన బై లైన్ ఆర్టికల్ చూపించాను. ఏ ముంది హల్ చల్ ఆఫీసర్ వాడిని తిట్టడం నన్ను మీరు వెళ్ళండి సార్ అనడం జరిగి పోయింది. హమ్మయ్య అనుకుంటూ నేను వరంగల్ కు ఆటోలో బయలుదేరాను. అట్లా ముగిసింది నా డిల్లీ ప్రయాణం.

డిల్లీ ఫిలిం ఫెస్టివల్ సినిమాకు సంబంధించి నాకు పెద్ద ఐ ఓపెనర్.
“గుడారం నిలపడుతుందో
గాలికి ఎగిరి పోతుందో
సృజన లోకంలో నేనో బంజారా..”

***

          నడిచే కాలం, గడించే అనుభవం అనేక విషయాల్ని మార్చేస్తుంది కదా. 1989డిల్లీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని వచ్చాక నేను సినిమాల్ని చూసే విధానం మారింది. సినిమాని అర్థం చేసుకుని విశ్లేషించే పద్ధతీ మారింది. దాంతో కఫిసో  కార్య క్రమాలలోనూ మార్పులు వచ్చాయి. దానికి తోడు కరీంనగర్ రెసిడెన్శియల్ స్కూల్ కార్యక్రమాలూ అన్నీ బిజీ బిజీగా మార్చేశాయి.

          ఆ ఏడు అధక్ష కార్యదర్శి బాధ్యతల్లో నరెడ్ల శ్రీనివాస్ నేనూ వున్నాం. కేవలం ఆ ఒక్క సంవత్సరంలో నలభైకి పైగా సినిమాల్ని ప్రదర్శించాం. జనవరి ఒకటిన ‘భక్త పోతన’ ప్రారంభ మయిన ఆ ఫిలిమ్స్ పరంపర ‘కన్యాశుల్కం’, ‘మరోచరిత్ర’, ‘మేఘ సందేశం’ లాంటి తెలుగు చిత్రాలతో పాటు గుల్జార్ ‘కోషిష్’, ‘కినారా’, గురుదత్ ‘కాగజ్ కేఫూల్’, మీరా నాయర్ ‘సలాం బాంబే’ లాంటి సినిమాలతో కొనసాగింది. అంతేకాదు‘బల్తజార్’ మొదలయిన అనేక ఫ్రెంచ్ సినిమాలూ ప్రదర్శించాం. ఇక జూన్ నెలలో శ్రీ బి.నర్సింగ్ రావు రూపొందించిన ‘రంగుల కల’, ‘మావూరు’, ‘ది సిటీ’ సినిమాలతో ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాం. ‘మావూరు’ కరీంనగర్ లో పెద్ద ఊపు. కళాభారతి హాల్లో సిరిసిల్లా రుద్రరవి అయితే రీలు చేంజ్ సమయంలో ముందు వరసలో వున్న దర్శకుడు నరసింగ రావు గారి దగ్గరికి వెళ్లి ఎంతగానో అభినందించాడు. దాదాపు హాల్లో వున్న అందరూ  మా వూరు, సిటీ డాక్యుమెంటరీ సినిమాల్ని ఎంతగానో ఇష్టపడ్డారు. తర్వాతి రోజు కరీంనగర్ నెహ్రు యువకకేంద్ర హాలులో “తెలుగు సినిమా నేటి స్థితి-భవిష్యత్తు” అన్న అంశం పైన సెమినార్ నిర్వహించాం. ఆనాటి సమావేషంలో నేనూ, శ్రీనివాస్ మాట్లాడాం. బి.నరసింగ రావు తెలుగు సినిమా అప్పటి పరిస్థితిని వివరిస్తూనే అంతర్జాతీయ స్థాయి పరిణామాల్ని విస్తృతంగా చర్చించారు. చైతన్యవంతమయిన సెమినార్ గా నిలిచిపోయింది.

***

అదట్లా వుండగా స్కూలు వార్షికోత్సవం వచ్చింది ఘనంగా నిర్వహించాం. పిల్లల పాటలు నృత్యాలూ నాటకాలతో సాగింది. 

ఆ కార్యక్రమ రిపోర్ట్ ని రాసి తీసుకెళ్ళి కరీంనగర్ గడియారం దగ్గర మాల్యాల మధురమ్మ భవనంలో వున్న ఈనాడు టౌన్ ఆఫీసులో ఇవ్వడానికి వెళ్లాను. అప్పుడు వి.పి.ఎస్.రాజు జిల్లా విలేఖరిగా వున్నారు. రాసింది చూసి ఎవరు రాసారు ఇది అన్నారు. నేనే అని జవాబిచ్చాను. ఎంచేస్తారు లాంటి వివరాలు అడిగారు. యధాలాపంగా అడుగుతున్నారో అని అనుకున్నారు. కాని తర్వాత కలిసి ఈనాడు జిల్లా ఎడిషన్స్ లో కల్చరల్, స్పోర్ట్స్, లీగల్ విషయాల కోసం ప్రత్యేక రిపోర్టర్లను తీసుకుంటున్నాం. మీరు కల్చరల్ రాయగలరా అన్నాడు. నాకెట్లా వీలవుతుంది. జాబ్, స్కూల్ అన్నాను. ఏముంటుంది తీరిక సమయాల్లో చేయడమే కదా. సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయి మీకు ఇంటరెస్టే కదా. జాలీగా చేయండి అని ఒప్పించాడు. ఇంటికి వెళ్ళింతర్వాత ఇందిరను అడిగాను ఏంచేద్దాం అని మీకు గౌరవంగా వుంటే రాయండి. సమయం వీలు చూసుకోండి అంది. నేను రాయడానికి నిర్ణయించుకున్నాను. ఇంకేముంది సాయంత్రా లు బిజీ. మూడురోజుల ఉత్సవ మేదో జరిగింది. నేను రాసిన రిపోర్ట్ కేవలం సింగిల్ కాలం వేసారు. నేను స్టాఫ్ రిపోర్టర్ రాజు గారిని అడిగాను. ఇదేమిటి సార్. తాను చాలా సిన్సియర్. తన పని తాను చేసుకునే రకం. ఎలాంటి ప్రలోభాలకూ లొంగని వాడు. హైదరాబాద్ డెస్క్ ఇంచార్జ్ గా సాహిత్య కారుడు డాక్టర్ రామకృష్ణగారున్నారు. వీలయినప్పుడు ఒక సారి వెళ్ళి కలవండి అని తానన్నాడు. ఎదో పని మీద హైదరాబాద్ వెళ్ళాను. ఆ రోజు వీలు చేసుకుని సోమాజిగూడా లోని ఈనాడు ఆఫీసుకు వెళ్ళాను. డెస్క్ కు వెళ్ళి డాక్టర్ రామకృష్ణ గారిని కలిసాను. తాను కిందికి వచ్చి కాంటీన్ లో కూర్చుని అనేక సాహితీ సాంస్కృతిక అంశాల మీద మాట్లాడు కున్నాం. ఇద్దరమూ ఒకరికి ఒకరం నచ్చాం. విరివిగా రాయండి అన్నారాయన. ఒక్క సాహితీ సాంస్కృతిక అంశాలేకాదు సామాజిక సేవా అంశాలు కూడా రాయండి కళాకారు డికి హద్దులేముంటాయి అన్నాడు. ఇక అప్పుడు కళాభారతి హాలు,యువక కేంద్రలో అట్లా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగనా రాసేవాన్ని. ఈనాడులో విస్తారంగా కవరేజ్ వచ్చేది.  త్యాగరాజ లలిత కళాపరిషత్, కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడెమి, ఒకటేమిటి ఎన్నోసంస్థలు వాటి కార్యక్రమాలు ఈనాడు లో ప్రముఖంగా వచ్చేవి. సాయంత్రాలు వార్తల కోసం టౌన్ ఆఫీసుకు వెళ్లి చంద్రమౌళి అని టెలీప్రింటర్ ఆపరేటర్ ఉండేవాడు. అతనితో టైప్ చేయించే వాణ్ని. ఇక ప్రత్యేక కథనమయితే, ఫోటోస్ వుంటే ఐటెం రాసి, ఫోటోస్ జత చేసి ఉదయమే ఆర్టీసీ బస్ లో డ్రైవర్ కు ఇచ్చేవాన్ని. ఆ కవర్ ను హైదరాబాద్ జుబిలీ లేదా గౌలీగుడా బస్ స్టాండ్ లో వున్న ఈనాడు బాక్స్ వేయమని అడిగేవాన్ని. దాని కోసం డ్రైవర్ కి చాయ్ కోసం కొంత డబ్బు ఇచ్చేది. అది సరిగ్గా ఈనాడు బాక్స్ లో పడితే తెల్లారి వార్తలు వచ్చేవి. అదో టెన్షన్. కానీ అందులో ఎదో తెలియని మత్తు వుండేది. ఈనాడు కోసం కేవలం కల్చరల్ సాహిత్యం మాత్రమే కాకుండా సామాజిక అంశాలూ రాసాను. వాటిల్లో ముఖ్యంగా నాకు కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. కరీంనగర్ లయన్స్ క్లబ్ వాళ్ళు LIONS CHARITABLE EYE HOSPITAL ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. డాక్టర్ భాస్కర్ మాడేకర్ అని సీనియర్ సిన్సియర్ ఫిజీషియన్ చైర్మన్ గా వుండి నిర్వహించేవారు. ఆయనే దానికి కర్త ఖర్మ క్రియ కూడా. ఒక రోజు ఆయన్ని కలిసి హాస్పిటల్ మీద  రాయాల ని వుంది అన్నాను. ఆయన ఆశ్చర్యపోయి మాకు కూడా కవరేజ్ ఇస్తారా అన్నాడు. అదేంటి సార్ అన్నాను. ఆదివారం సిటీ చివర రేకుర్తి లో వున్న హాస్పిటల్ కి తీసు కేళ్ళారు. అక్కడ వాళ్ళ నిబద్ధత చూసి బాగా నచ్చింది. కంటి వైద్యులు డాక్టర్ శ్రీక్రిష్ణ ఇంగ్లే, డాక్టర్ శ్రీధర్ ల సేవా గుణం ఆకట్టుకుంది. ఏముంది మంచి వార్త రాసి ఫోటోలతో పంపాను. సెంటర్ స్ప్రెడ్ లో బాగా ప్రెసెంట్ చేసారు. దానికి నేను పెట్టిన శీర్షిక ‘చీకట్లోం చి.. వెల్తురు లోకి..” డాక్టర్ భాస్కర్ మాడేకర్, డాక్టర్ శ్రీధర్ లు బాగా సంతోషపడ్డారు. అనేక సంవత్సరాల పాటు మెడికల్ గానూ ఫ్యామిలీ పరంగానూ చాలా స్నేహంగా వున్నారు. ఇక మరొక డాక్టర్ నాగభూషణం గారు, ఆయనకో గొప్ప అలవాటు వుండేది. వివిధ రూపాల్లో వున్న అందమయిన కర్ర ముక్కల్ని సేకరించడం, వాటితో పాటు కాయిన్స్, నోట్స్ ఇట్లా సేకరణ ఆయన హాబీ. ఒక రోజు ఆయన మ్యుజియం కు వెళ్ళి “కర్రముక్కల్లో కమనీయ రూపాలు” అని రాసాను. ఏముంది పెద్ద హిట్. ఇక కరీంనగర్ పట్టణంలో 1969 లో  ఏర్పాటయిన మ్యూజియం ఒకటి బస్ స్టాండ్ ఎదురుగా వుండేది. ఇప్పటికీ వుంది. ఎవరూ దాని వైపు చూసేవాళ్ళు కానీ సందర్శించేవాళ్ళు కానీ లేరు. దాని పైన “అజ్ఞాత వాసంలో అందాల మ్యూజియం” అని రాసాను అందరి దృష్టీ దాని వైపు మరలింది. కరీంనగర్ కు ప్రతేకమయిన వెండి తీగ పరిశ్రమ మీద రాసిన స్పెషల్ స్టోరీ స్పెషల్ గా నిలబడింది. అంతేకాదు కరీంనగర్ జిల్లా ఎల్లలుదాటిన జిల్లా వెలుగులు డాక్టర్ సి.నారాయణ రెడ్డి, బాపురెడ్డి, చిత్రకారులు వైకుంఠం,పీ.టీ.రెడ్డి, దర్శకులు బీ.ఎస్.నారాయణ, కే.కే.రెడ్డి ఇట్లా
ఎందరొ మహానుభావుల ప్రోఫయిల్ ఆర్టికల్స్ రాసాను. అప్పుడు జిల్లాలో జర్నలిస్టులుగా ఉదయం లో సాయిబాబా, ఆంద్ర ప్రభ లో దేవులపల్లి అమర్, ఆకాశవాణికి నరహరి శర్మలు వుండేవాళ్ళు. తర్వాతి కాలంలో ఆంద్రభూమికి కే.ఎన్.చారి, ఆంధ్రజ్యోతికి ఎస్.కే.జాకీర్ తదితరులు పనిచేసారు.

1989 సెప్టెంబర్ లో ఫైల్మ్ సొసైటీ నిర్వహణలో ‘ఇండియన్ పనోరమా’ చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేసాం. ఆంద్ర ప్రదేశ్ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పోరేషన్ సహకారంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించాం.

అప్పుడు కలెక్టర్ శ్రీ ఐ.వి.సుబ్బారావు. వారం పాటు వెంకటేశ్వర టాకీసులో మేము నిర్వహించిన ఈ ఫెస్టివల్ లో గౌతం ఘోశ్ ‘అంతర్జాలీ యాత్ర’. మీరా నాయర్ ‘సలాం బాంబే’, వీడు, పెస్తోంజీ, కడలి తీరత్తు, త్రిశాగ్ని, అడలితీరత్తు తదితర సినిమాల్ని ప్రదర్శించాం. ప్రారంభోత్సవాన్ని నిర్వహించాగా కలెక్టర్ సుబ్బారావు, వామన్ రావు, మురళీమోహన్ రావు తదితరులు హాజరయ్యారు. శ్రీనివాస్ స్వాగతం చెప్పగా, నేను వందన సమర్పణచేసాను.

          నాకు బాగా గుర్తు దేవులపల్లి అమర్ ఆయనకెందుకు మైకు ఇస్తున్నారు అని శ్రీనివాస్ తో అన్నాడు. నేను కొంత బాధ పడ్డప్పటికీ మౌనం వహించాను. అయితే ఈ
పనోరమా ఫెస్టివల్ మొత్తం ఏ రోజుకు ఆరోజు ఈనాడులో ఆనాటి సినిమా పరిచయం రాసాను. చాలా మంది ఉదయమే ఈనాడులో అవి చదివి సినిమాకు వచ్చేవారు. ఆ రకంగా ఈనాడు ఎంతగానో సాయపడింది. ఈనాడు దెబ్బకు ఉదయం జిల్లా విలేఖరి సాయి బాబా నరేడ్ల శ్రీనివాస్ ను తమ పత్రికకు, ఆంద్ర ప్రభకు గోపు లింగారెడ్డిని CONTRIBUTORS తీసుకున్నారు.

          ఇదంతా ఇట్లా సాగుతూ ఉండగానే కరీంనగర్ లో సాహితీ కార్యక్రమాలు జరగడం పెరిగింది. గోపు లింగా రెడ్డి ‘వికాస సాహితీ’ సంస్థ స్థాపించి శ్రీశ్రీ జయంతి లాంటి అనేక ప్రగతిశీల కార్యక్రమాలు చేసారు. ఇక లెక్చరర్లు డాక్టర్. బి.దామోదర్ రావు, డాక్టర్ గండ్ర లక్ష్మన్ రావు, డాక్టర్ డింగరి నరహరి ఆచార్య, డాక్టర్ బి.లక్ష్మయ్య, గజేందర్ రెడ్డి లాంటి వాళ్ళంతా కలిసి ‘సమతా సాహితీ’ పేర అనేక సాహితీ కార్యకరమాలు నిర్వహించారు. వారికి సాహిత్య అభిమాని గంగయ్య ఆచార్య ఎంతో సహకరించారు. ఆ తర్వాత  కే.ఎస్. అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్ తదితరులు ‘సమైఖ్య సాహితి’ఏర్పాటు చేసారు. వీట మధ్య బోయినపెల్లి వెంకటరామారావు ‘జిల్లా రచయిత సంఘం’, మలయశ్రీ గారు, సబ్బని లక్ష్మినారాయన గార్లు తమ తమ సంస్థలతో పలు కార్యక్రమాలూ ప్రచురణలూ చేసారు.

          అట్లా మొత్తం మీద కరీంనగర్లో ఈనాడు సాంస్కృతిక విలేఖరిని నియమించు కోవడం..తద్వారా దినపత్రికలు విస్తృత స్థాయిలో కవరేజీ ఇచ్చి సముచిత స్థానం కల్పించడంతో సాహితీ సాంస్కృతిక కార్యక్రామాల నిర్వహణ సంఖ్య చాలా పెరిగిందనే చెప్పొచ్చు.

***

ఓటమి ఊపిరి కాదు, అలవాటు కాదు, దిన చర్యా కాదు
అది చీకటిలా ఎదురొస్తుంది, చిటికేస్తే పరుగెడుతుంది
అట్లా చిటికేస్తూ కాలం గడపడం 1990ల్లో ఆరంభమయింది.

***

          నేను ఒకేసారి రెండు మూడు రంగాల్లో పనిచేయడం దాదాపుగా అప్పుడే మొదల యింది. జర్నలిజం, రైటింగ్ ఆన్ ఫిలిమ్స్ అండ్ ఫిలిం సొసైటీ ఉద్యమం, జూనియర్ కాలేజీలో ఉద్యోగం, స్కూలు నిర్వహణ, సాహిత్య అధ్యయనం, పలు సంస్థలు ఇట్లా అనేక రంగాలు ముడివేసుకు పోయాయి. బయట అదట్లా వుంటే వ్యక్తిగత జీవితంలో అనేక ఒత్తిడులు ఒడిదొడుకులు. సహచరి ఇందిరకు అబార్షన్లు కొంచెం అనారోగ్యం.. అన్నీ ముప్పిరిగొన్నాయి. అయినా తాను ఎంతో ధైర్యంగా ఒంటి చేత్తో ఆన్నింటినీ దాటేసు కుంటూ నన్ను వాటి నుంచి దాటిస్తూ వచ్చింది.

          ఆ ఏడు జనవరి మొదట్లోనే నేనూ, హైదరాబాద్ ఫిలిం క్లబ్ ప్రకాష్ రెడ్డి గారూ కలకత్తా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళాం. ఆ ఫెస్టివల్ లో పనోరమా విభాగానికి శ్రీ బి.నరసింగ రావు గారి జాతీయ అవార్డును అందుకున్న ‘దాసి’ ఎంపికయింది. దాసి అప్పుడు జాతీయ స్థాయిలో అయిదు అవార్డులు అందుకుంది. “దాసి దోసిట కీర్తి రాసులు” అని దేవిప్రియ అప్పుడు దిన పత్రికలో అనుకుంటాను ప్రధాన వార్తగా రాసారు. దూరదర్షన్ కోసం తీసిన ఆ సినిమా ఒక క్లాసిక్. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని విభాగాల్లో ఉత్తమ శైలిని ఆవిష్కరించింది. దర్శకుడిగా బి.నరసింగ రావు, ప్రధాన భూమిక
పోషించిన అర్చన, కెమెరా వర్క్ చేసిన ఏ.కే.బీర్ లు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఇక ఫిలిం ఫెస్టివల్ ప్రారంభ సమావేశంలో మొట్టమొదటిసారిగా సత్యజిత్ రే ను దగ్గరగా చూసే అవకాశం కల్గింది. మాట్లాడే వీలు కాలేదు. అది నాకు జీవితంలో పెద్ద వెలితి. అప్పుడు ఈనాడుకు రాస్తున్నాను కనుక కలకత్తా వెళ్ళేటప్పుడు న్యూస్ టుడే ఎండీ రమేష్ బాబును కలిసి ఇట్లా వెళ్తున్నాను అని చెప్పాను. అక్కడి నుంచి ఏమయినా రాయనా అన్నాను. తప్పకుండా రాయండి అన్నాడు. కానీ అక్కడి నుండి రాస్తే వాటిని ‘సితార’ కు ట్రాన్స్ఫర్ చేసారు. వాళ్ళు వాళ్ళకున్న పరిధి దృష్ట్యా వాడలేదు. అట్లా కలకత్తా ఫెస్టివల్కు సంబంధించి రాయడం విషయంలో సైలెంట్ గా వుండి పోయాను. కాని ఆ ఫెస్టివల్ లో దేవిప్రియ, వోల్గా, అక్కినేని కుటుంబ రావు, కే.ఎన్.టీ.శాస్త్రి, ఆంద్రజ్యోతి జగన్ లాంటి అనేక మంది దగ్గరయ్యారు. తర్వాతి కాలంలో ఫిలిం సొసైటీ
విషయంలో నాకు ఎంతో సహకరించారు. కరీంనగర్ వచ్చి కఫిసో సభల్లో పాల్గొని నాతో పయనించారు. షాజీ కరున్ ‘పిరవి’, రే ‘ఘన శత్రు’, మృణాల్ సేన్ ‘ఏక్ దిన అచానక్’, అపర్ణాసేన్ ‘సతి’, సయీద్ అఖ్తర్ మీర్జా ‘సలీం లంగ్దేపే మత్ రో’ లాంటి మంచి సినిమాలు చూసే అవకాశం కలిగింది.

          కలకత్తా నుంచి తిరిగి వచ్చాక ఇందిర కన్సీవ్ అయింది. అప్పటికే పలు
అబార్శన్స్ తో చాలా గందరగోలంగా ఉండింది పరిస్థితి. ఆ సమయంలో గోదావరిఖనిలో సహా ఉద్యోగి ఆత్మీయ మిత్రుడు రమేష్ బాబుకు బంధువు అయిన డాక్టర్ హైమవతి ఎంతగా సహకరిచిందో మాటల్లో చెప్పలేను. ఒక సారయితే రాత్రి పదిగంటల  సమయం. ఇందిర తీవ్రమయిన కడుపునొప్పితో  విలవిలలాడ సాగింది. వెంటనే హైమవతి గారి ఇంటికి వెళ్ళాం. ‘మేడం, సారు, పిల్లలతో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్ళారని’ ఆయా చెప్పింది. ఎట్లా ఏం చేయడం. ఏ సినిమా అని అడిగాను. బాలకృష్ణ టాకీసుకు అన్నది ఆమె. ఇందిరను అక్కడే వాల్లింట్లో కూర్చో బెట్టి నేను టాకీసుకు వెళ్ళాను. సినిమా రన్ అవుతున్నది. నేను గేట్ కీపర్ కు చెప్పి వెళ్ళి బాల్కనీలో నిలబడ్డాను. చీకట్లో డాక్టర్ గారిని ఎట్లా గుర్తుపట్టడం. కానీ ఎట్లా చూసిందో తాను లేచి వచ్చి ఏమిటి ఆనంద్ ఇట్లా వచ్చారు అంది. నేను విషయం చెప్పాను. మీరు వెళ్ళి పిల్లల దగ్గర కూర్చోండి. నేనూ మా ఆయన వెళ్ళి ఇందిరను చూసి వస్తాం అన్నారు. నేను చేతులు ఎత్తి మొక్కాను. నొ నొ
అదేమిటి అంటూ స్కూటర్ మీద ఇద్దరూ వెళ్ళి వచ్చారు. ఏమీ లేదు ఆనంద్ ఇంజెక్షన్ ఇచ్చాను రాత్రికి మా ఇంట్లోనే కింది ఫ్లోర్ లో వుండండి పొద్దున్నే వెళ్ళండి అంది. థాంక్స్ చెప్పి వచ్చాను. అంతలా ఆత్మీయుల్లా చూసిన డాక్టర్ తను.. ఎంతగానో రుణపడి వున్నాం. ఆ తర్వాత సర్క్యులేజ్ చేసారావిడ. డెలివరీకి వరంగల్ వెళ్తారు కనుక జాగ్రత్త లెన్నో చెప్పింది.

***

          ఇక మరో వైపు ఫిలిం సొసైటీలో ఆ ఏడు కూడా చాలా సినిమాలే వేసాము. ఎన్నో
ఫారిన్ సినిమాలకు తోడు హిందీ సినిమాల విషయానికి వస్తే ‘దో ఆన్ఖే బారా హాత్’, ’పరిచయ్’, ‘కొట్నిస్ కి అమర్ కహానీ’ లాంటి సినిమాలు వేసినట్టు గుర్తు. మరో పక్క ఈనాడు కోసం బీ.ఎస్.నారాయణ, నేరెళ్ళ వేణు మాధవ్, చిత్రకారుడు పీటీ రెడ్డి తది తరుల ఎందరి గురించో ప్రోఫైల్స్ రాసాను, ఇంటర్వ్యు లు చేసాను. అప్పుడే శ్రీమతి గునోత్తమ గారు పరిచయం అయ్యారు. వారి కూతురు విష్ణువందన అప్పుడప్పుడే నాట్యం నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇచ్చేది. అట్లా ఒక కొత్త కళాత్మక కుటుంబంతో కలిగిన
పరిచయం ఇప్పటికీ కొనసాగుతున్నది. అప్పుడే జిల్లా కలెక్టర్ గా వున్న శ్రీ ఐ.వీ. సుబ్బా రావు చొరవతో జిల్లాలో అనేక కార్యక్రమాలు జరిగాయి. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల తాను ఎంతో చొరవ చూపించే వారు. వారి శ్రీమతి కూడా. ఐ.వీ.సుబ్బారావు కరీంనగర్ లో ప్రధానంగా త్యాగరాజ లలిత కళా పరిషత్, కరీంనగర్ ఫిలిం సొసైటీ లాంటి పలు సంస్థలకు ఎంతగానో ప్రోత్సాహాన్నిచ్చారు.

          1988 సంవత్సరానికి గాను కరీంనగర్ జిల్లాకు చెందిన గొప్ప కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి భారత ప్రభుత్వం ‘జ్ఞానపీఠ పురస్కారం’ ప్రకటించింది. జిల్లాకు చెందిన కవికి అంత గొప్ప గొరవం లభించడంతో జిల్లా అంతా పండుగ వాతావరణం ఏర్పడింది. అంతకు ముందు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేసిన విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అదొక జ్ఞాపకంగా వున్న జిల్లాకు ఏకంగా జిల్లా వాసి డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికే అత్యన్నత పురస్కారం
రావడంతో పులకించి పోయింది. జిల్లాకు చెందిన అనేక మంది సాహితీ వేత్తలు, తెలుగు అధ్యాపకులు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి డైరక్ట్ స్టూడెంట్స్ వున్నారు. దాంతో ఆ సందర్భంగా డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి ఘనంగా సన్మానం చేయాలని తలపోశారు. అందరం కలిసి కలెక్టర్ ను కలవాలని నిశ్చయించుకున్నాం. ఆ టీములో నేను,  ఎన్. శ్రీనివాస్, డాక్టర్ గోపు లింగా రెడ్డి, డాక్టర్ బి.దామోదర్ రావు, డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు తదితరులం వున్నాం. వెళ్లి కలిసి విషయం చెప్పాం. సుబ్బారావు గారు అత్యంత వేగంగా సకారాత్మకంగా స్పందించారు. అయితే కేవలం ఘన సత్కారం వల్ల ఎమీ జరగదు. ఆ ఒక్క రోజు ఉత్సవంతో పెద్ద ఉపయోగం లేదు. ఏదయినా శాశ్వతంగా వుండేది చేయాలి… ఆలోచించండి అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏదయినా పురస్కారం పెడితే ఎట్లా వుంటుంది అనగానే చాలా బాగుంటుంది. దాని కోసం ఒక సంస్థ కొంత శాశ్వత నిధి పోగు చేయండి నా వంతు సహకరిస్తానన్నారు. ఇంకేముంది ‘సాహితీ గౌతమి’ పేర సంస్థ ఏర్పాటయింది.
అది కేవలం సంస్థలాగా కాకుండా జిల్లా లోని అన్ని (దాదాపు 30)సంస్థల సమాఖ్యగా వుండాలి అనుకున్నాం. పురస్కార నిర్వహణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. శాసన మండలి సభ్యులు గీట్లజనార్దన రెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారు. నిధులు సమకూర్చేందుకు కరీంనగర్ కు చెందిన ప్రముఖ న్యాయవాదులు లక్ష్మా రెడ్డి, ఎడవల్లి జగ్గారెడ్డి, మానసిక వైద్యులు డాక్టర్ భాగ్యా రెడ్డి, డాక్టర్ బాలస్వామి, ఇట్లా మరెందరో ముందుండి నిధుల్ని సమీకరించారు. నాకు తెల్సి ఆ రోజుల్లో సుమారు 60 వెల పైచిలుకు నిధి సమీకరించారు. నిర్దేశించుకున్న లక్ష సమకూర లేదు. కానీ  అవార్డు ను ఇవ్వాలని ప్రకటించారు. మొదటి అవార్డు కోసం డాక్టర్ ఎన్.గోపి రాసిన చిత్రదీపాలు” ఎంపిక అయింది. అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. అప్పుడు సాహితీ గౌతమి లో ప్రధాన భూమికల్ని డాక్టర్ గోపు లింగారెడ్డి, డాక్టర్ బి.దామోదర్ రావు లు నిర్వహించారు. నేనూ, శ్రీనివాస్ సంస్థలోనూ, సంస్థకు తోడుగానూ వున్నాం. ఇక రెండవ సంవత్సరం
వచ్చేసరికి కలెక్టర్ సుబ్బారావుకు బదిలీ అయింది. ఆయన స్థానంలో శ్రీ భన్వర్ లాల్ కలెక్టర్ గా వచ్చారు. తెలుగు వాడు కాకున్నా బాగా మాట్లాడేవాడు. సాహితీ సంస్కృతుల పట్లా ఎంతో ఆసక్తి కలిగిన వాడు. ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉండగానే సాహితీ గౌతమి రెండవ సినారె కవితా పురస్కారాన్ని దేవిప్రియ ‘నీటి పుట్ట’ కు ప్రధానం చేసారు. ఆ అవార్డు కార్యక్రమంలోనే ‘దుమారం’ పేర ఒక కరపత్రం వెలువడింది. ఈ అవార్డులు
వాటి ఎంపిక తీరును విమర్శిస్తూ వచ్చిన ఆ కరపత్రం చారిత్రాత్మక మయింది. అయితే చాల చిత్రంగా ఆ తర్వాత దాన్ని ఎవరూ తామే వేశామని ప్రకటించు కోలేదు. అయినా అంతా బహిరంగ రహస్యమే. ఇవ్వాళ నేను పేర్లు చెబితే వివాదం అవుతుంది. అందుకే నేనూ చెప్పడం లేదు. అది రాసిన వాడికి ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వచ్చింది అది అసలు ఐరనీ. జిల్లా కలెక్టర్ గా భన్వర్ లాల్ గారు చేరిన తర్వాత జిల్లాలో అనేక కార్యక్రమాలు చెపట్టారు. ‘స్కౌట్స్ జంబోరే’ అత్యంత ఘనంగా
నిర్వహించారు. దానికి ఆనాటి రాష్ట్రముఖ్య మంత్రి శ్రీ ఎన్.జనార్ధన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పీకర్ శ్రీపాదరావు అధ్యక్షత వహించారు. నేనూ ముఖ్యమయిన  బాధ్యత నే స్వీకరించాను. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసల్నీ అందుకున్నాను. తరవాత జిల్లాలో జిల్లాకలెక్టర్ భాన్వర్ లాల్ నేతృత్వంలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం చేపట్టారు. ‘అక్షర ఉజ్వల’ అని పేరు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారిగా ఎంతో కృషి జరిగింది. ‘అక్షర ఉజ్వల’ పేర పత్రిక తెచ్చాం. దాని సంపాదక వర్గంలో నేనూ ముఖ్య పాత్రనే పోషించాను. 

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.