వెనుతిరగని వెన్నెల(భాగం-61)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా ఎదురయ్యి పెళ్లి చేసుకుంటాడు.
***
తన్మయికి తెలుసు. తనకి రెండే మార్గాలున్నాయి. ఒకటి ప్రభుకు నచ్చినట్లు అతని కుటుంబంతో కలిసి జీవించడం, లేదా ప్రభుతో విడిపోయి తన జీవితం తను ఎప్పటి లానే బతకడం.
ఈ విషయంలో సిద్దార్థతో సహా ఎవరినీ సలహా అడగదలుచుకోలేదు. నిజానికి అడగడానికి తనకి ఇంకెవ్వరూ లేరు కూడా.
ప్రభుని మనసారా నమ్మింది. తల్లిదండ్రులకి చెప్పాపెట్టకుండా పెళ్ళి చేసుకుంది. కానీ ఎప్పుడూ ఇలా అవుతుందనుకోలేదు. బహుశాః ఇదే జీవితం. కష్టాల మీద కష్టాలు వస్తూ ఉంటే ధైర్యంగా ఎదుర్కోవలసిందే.
మొన్నెప్పుడో కాగితం మీద రెండు ఆప్షన్లూ రాసుకుని మంచి చెడ్డలు సరిచూసు కుంది. రెండిటిలోనూ లాభాలూ, నష్టాలూ సరి సమానంగా ఉన్నాయి. ప్రభులేని ఒంటరి జీవితం తనకు ఎలాగూ అలవాటే. అందులో బాదరబందీలు ఉండవు. తనకి నచ్చని వారెవరూ తన ఇంట్లో ఉండరు. తనని పల్లెత్తు మాట అనేవారు కానీ, దేని గురించీ తనని నిలదీసి అడిగే వారు కానీ ఉండరు. కానీ పండగలూ పబ్బాలూ ఏ సంతోషమైనా, దుఃఖ మైనా తనకి తనుగా మిగిలిపోవలిసిందే తండ్రులు లేని పిల్లలతో అన్నిటికీ తనే జవాబు దారీగా నిలబడుతూ. ఇక సమాజంలో తన ఒంటరిపోరాటంలో ఎదురైన చేదు అనుభవా ల సంగతి చెప్పనే అక్కరలేదు. అవి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి.
జీవితంలో అనుకోని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డ ఒంటరి స్త్రీని సమాజం హర్షించదు సరికదా ఎప్పటికప్పుడు పీడించాలని చూస్తుంది. ప్రభుని పెళ్ళి చేసుకోవ డానికి ఉన్న బలమైన కారణాల్లో ఇదొకటి.
కానీ ఇంట్లో తనకి పీడన మొదలయ్యిందే. ఇంటి నుంచి సమాజంలోకి పారిపోవాలా? దుష్ట సమాజాన్ని తప్పించుకోవడం కోసం ఇల్లనే ముసుగులో దాక్కోవాలా?
కడుపులోని బిడ్డ మళ్ళీ కదలగానే చెయ్యి పొట్టమీద వేసుకుని తనలో తను అంది.
“నువ్వు చెప్పు పాపాయీ!”
అన్నిటినీ పక్కపెడితే అసలు రేపో మాపో పుట్టబోతున్న ఈ పసికూనకి తండ్రిని, అతని కుటుంబాన్ని దూరం చేసే హక్కు తనకి ఉందా?
ఆలోచనలో పడింది తన్మయి.
ఇవన్నీ పట్టించుకోని రైలు చీకట్లోకి దూసుకుపోతూనే ఉంది. తెల్లారగట్ల రైలు స్టేషనుకి చేరుకుంది. తన్మయి రైలు దిగి బాబుని ఒక చేత్తో నడిపించుకుంటూ, మరో చేత్తో బ్యాగు పుచ్చుకుని భారంగా అడుగులు వేయసాగింది.
***
ఇంటి దగ్గిర రిక్షా దిగుతూనే జ్యోతి ఎదురొచ్చి బాబుని ఎత్తుకుంది. వాకిట్లో ఊడుస్తున్న పనిమనిషి పరుగెత్తుకొచ్చి గబుక్కున తన్మయి చేతిలోని బ్యాగు అందు కుంది.
జ్యోతి తన భుజమ్మీది టర్కీ టవలు కూతురి చుట్టూ కప్పి కడుపు పైకి కనిపించ నివ్వవద్దన్నట్టు లోపలికి తీసుకెళ్ళింది.
అనుకోని ఈ చర్యకు ఆశ్చర్యపోయింది తన్మయి.
అంటే చుట్టుపక్కల వాళ్ళేవ్వరికీ తను మళ్ళీ పెళ్ళి చేసుకున్న విషయం ఇంకా తెలియదన్నమాట.
అయినా లోకులు అంత సామాన్యమైన వాళ్ళా? ఇదంతా పసిగట్టి గుసగుసలు పోరూ! తను పెళ్ళి చేసుకున్నదని అందరితో చెప్తే వచ్చే నష్టం ఏవుందో అర్థం కాలేదు.
అదే అంది తల్లితో.
వరండా పక్క గదిలో భానుమూర్తి నిద్రపోతుండడంతో ఈ విషయాలు ఏవీ మాట్లాడొ ద్దన్నట్టు రెండు చేతులూ పైకెత్తి నమస్కరించి విసవిసా వంటింట్లోకి వెళ్ళిపోయింది జ్యోతి.
బాబు వెనకే పరుగెత్తేడు.
తన్మయి నిట్టూర్చింది “పెళ్ళి చేసుకున్నాక మొదటిసారి వస్తే తనకు ఎదురవు తున్న ఆహ్వానం ఇది!”
తండ్రి పడుకున్న గదిలోకి తొంగి చూసిన తన్మయికి ఎముకల గూడులా మంచానికి అంటిపెట్టుకుని పోయిన భానుమూర్తిని చూసి దుఃఖం తన్నుకు వచ్చింది. వంటింట్లోకి వెళ్ళి “అదేవిటమ్మా, నాన్నగారికి ఏవయ్యింది?” ఏడుస్తూ అంది.
“ఏవోనమ్మా, నెల రోజుల నించి బొత్తిగా తిండి పోవడం లేదు. ఆ ఏడుకొండలవాడే రక్షించాలి” అంది జ్యోతి.
అయ్యో, ఇప్పటి వరకు తండ్రి తన మీద కోపంతో తనతో మాట్లాడడం లేదని అనుకుందే కానీ, ఇలా ఒంట్లో బాలేదని అస్సలు అనుకోలేదు.
“అదేవిటమ్మా, చెప్పొద్దూ ” ఇంకా ఏడుస్తూనే అంది తల్లితో తన్మయి.
జ్యోతి మాట్లాడలేదు.
మెల్లిగా తండ్రి పడుకున్న మంచం పక్కన కుర్చీ జరుపుకుని కూచుంది. ఎప్పుడూ ధీర గంభీరంగా ఉండే తండ్రి స్ఫురద్రూపం గుర్తుకు వచ్చింది. అసలు పోలికేలేని రూపంతో కొన ఊపిరితో ఉన్నట్టున్న పాలిపోయిన బక్క చిక్కిన శరీరాన్ని చూడలేక పోతూంది.
బాబు పరుగెత్తుకొచ్చి తట్టి లేపేడు భానుమూర్తిని.
కళ్ళువిప్పుతూనే పక్కనే ఉన్న కూతుర్ని, మనవడిని చూసిన భానుమూర్తి కళ్ళ ల్లోంచి నిశ్శబ్దంగా కన్నీళ్ళు కారసాగేయి.
తన్మయి కళ్ళు తుడుచుకుంటూ “నేనొచ్చేసేనుగా నాన్నా, బాధపడకండి” అంది.
అలాగే అన్నట్టు నిశ్చింతగా తలూపి అంతలోనే నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు.
తన్మయి తల్లి దగ్గిరికి వచ్చి “డాక్టరు ఏవన్నారు?” అంది.
“ఏ రోగమూ లేదంటున్నారు. అన్ని పరీక్షలూ చేసేరు. నీ గురించే ఎప్పుడూ ఈ మనిషికి బెంగ. ఆ బెంగ బెంగే ఇలా తినేసింది.” అంది చికాగ్గా.
తన్మయి నిస్త్రాణగా పీట మీద జేరబడింది. బాధ మనసుని మెలిపెడుతూంది.
ఒక పక్క ఆకలితో కడుపులోని బిడ్డ బుడుగు బుడుగుమని అదే పనిగా కదులుతూ ఉంది.
తన బాధ గమనించినట్టు జ్యోతి గబగబా ప్లేటులో ఇడ్లీలు పెట్టి ఇస్తూ “ముందు తినమ్మా, అసలే ఒట్టి మనిషివి కాదు” అంది.
ఆదరాబాదరా తింటున్న కూతురి తల మీద చెయ్యి వేసి “ఏమ్మా, అల్లుడు మంచి వాడేనా? ఎలా ఉన్నారు?” అని అడిగింది.
నిశ్శబ్దంగా తలూపి మంచి నీళ్ళు ఇవ్వమన్నట్టు సైగ చేసింది తన్మయి. భాను మూర్తిని చూసి నిశ్శబ్దమైపోయిన బాబు తల్లికి జేరబడి కూచున్నాడు. జ్యోతి వాణ్ణి ఒళ్ళోకి లాక్కుని తినిపించసాగింది. తినగానే ఇక మనసులోని బాధని తట్టుకోలేని తన్మయి పక్క గదిలోని మడత మంచమ్మీద నడుం వాల్చి రోదించసాగింది.
అల్లకల్లోలమైన తన జీవితం ఇప్పుడు తన తండ్రినీ పొట్టన బెట్టుకోసాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక తన జీవితంలోని కష్ట నష్టాలేవీ తల్లిదండ్రులకి తెలియనివ్వకూడదు. కష్టమో నష్టమో తనే ఓర్చుకోవాలి.
దృఢంగా నిశ్చయించుకుంది.
ప్రభుకు ఫోను చేసి తన మనసులోని బాధలన్నీ చెప్పుకోవాలని అనిపించింది.
కానీ అంతలోనే ఆలోచనలో పడింది. తనను “దసరా సెలవులు వస్తున్నాయని, ఊరు వెళ్ళిరమ్మని” ఎందుకు అడిగాడు? తనకొక్క దానికే సెలవులు ఉండి, ప్రభుకు సెలవులు లేవు కాబట్టి, తను ఇరవై నాలుగ్గంటలూ ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయనా? లేదా మరేదైనా కారణముందా? ఇంకేదైనా కారణమున్నా తనకు తను ఇలా ప్రభుకు వ్యతిరేకం గా ఆలోచించుకోవడం మానేయాలి.
అతను ఎంతో ఉదాత్తుడు. తనని మనసారా ఇష్టపడి, అతని జీవితంలోకి ఆహ్వానించిన వాడు. అతని బలహీనతల్లా అతని కుటుంబమే. ఇక బాబు విషయంలో అతని పద్ధతి బహుశా: క్రమంగా సర్దుకుంటుంది. తన జీవితంలో తనకి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలున్నాయి. ఇక వాటి మీద దృష్టి పెట్టాలి.
ఆ సాయంత్రం ప్రభు ఆఫీసు నించి వచ్చే సమయానికి ఇంటికి ఫోను చేసింది. లాండు ఫోను కావడంతో ఎప్పుడూ ముందు కిందనే ఫోను ఎత్తుతారు. ఒకవేళ ఫోను ప్రభుకి గానీ, తన్మయికి గానీ అయితే పైన ఫోను ఎత్తగానే కిందన ఫోను పెట్టేస్తారు. యథా విధిగా ఫోను ప్రభు తండ్రి ఎత్తేడు “అలో…” అంటూ.
అతని చెడ్డ అలవాటు ఏంటంటే అవతల మాట వినిపించేలోగా “అలో, అలో” అంటూ వీథి చివరికి వినబడేటట్టు అరుస్తూనే ఉంటాడు.
తన్మయికి ఇవన్నీ అలవాటే గాబట్టి ప్రభు లైనులోకి వచ్చే వరకు ఓపిగ్గా భరిం చింది.
“హలో తనూ! జాగ్రత్తగా చేరేవు కదూ! ఇదిగో నేనే ఇప్పుడు చెయ్యాలనుకుంటు న్నాను, ఇంతలోనే నువ్వే చేసేవు” ప్రభు ప్రేమైక స్వరం వింటూనే పులకించి పోయింది.
“ప్రభూ!.. ” అంటూనే గొంతు పూడుకుపోయి ఆగిపోయింది.
అట్నించి గాభరాగా “అంతా ఓకేనా?” అన్నాడు.
“నాన్నగారికి ఒంట్లో అస్సలు బాగోలేదు” అంది కొద్దిగా గొంతు సవరించుకుని.
“నీకు నచ్చినన్నాళ్ళు ఉండిరా” అన్నాడు సాలోచనగా.
“అదికాదు, నువ్వూ వస్తే బావుంటుంది” అంది.
అట్నుంచి సందేహంగా గొంతు సవరించుకుంటున్న ప్రభుతో “చూడు మరి, ఆలోచించు” అంది.
ప్రభు ఏదో అనేలోగా ఫోనులో మూడో గొంతు ఉన్నట్టు చిన్నగా దగ్గు వినబడింది.
తన్మయికి చికాకు వచ్చింది. అంటే ఇంతవరకు తమ సంభాషణ కిందన కూడా వింటున్నారన్నమాట. అది సభ్యత కాదని తెలియదా? ఇలాంటి పనులు కావాలని తెలిసీ చేస్తున్నారా? అయినా ప్రభు చెప్పుకోవాలి వాళ్ళకి.
“సరేమరి, తర్వాత ఫోను చేస్తాను” ఫోను వెంటనే పెట్టేసి కుర్చీలో జేరబడింది.
తామిద్దరికీ అడుగడుగునా అడ్డుగోడలు. అతనితో తను ఇలాంటి భవిష్యత్తుని ఎన్నడూ ఉహించుకోను కూడా లేదు. ఇంతవరకు ప్రభు తన తలిదండ్రుల్ని కలవలేదు. కనీసం ఇలా అయినా ఇక్కడికి వస్తే బావుణ్ణని ఆశపడింది. కానీ ఇక ఆ ఆశ అడియాస అయినట్టే. కిందన ఇప్పటికే ఒక పంచాయితీ ప్రారంభమయ్యి ఉంటుంది. వాళ్ళ కొడుకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, వెళ్ళకూడదో కూడా నిర్ణయించేది వాళ్ళే కదా!
మనసంతా గందరగోళంగా తయారయ్యింది.
నిశ్శబ్దంగా కళ్ళు ఒత్తుకుంటున్న తన్మయి దగ్గిరికి వచ్చి “ఇదేంటమ్మా, కడుపుతో ఉన్నపుడు అస్తమాటూ ఇలా ఏడవొచ్చా?” కసిరినట్టు అంది జ్యోతి.
తల్లి కాస్త తల నిమిరి “ఏడవకమ్మా” అని ఉంటే బావుణ్ణని అనిపించింది తన్మయికి.
పక్క గదిలో నుంచి తండ్రి మూలుగు, ఒక పక్క మనసులో ప్రభు గురించి చెలరేగుతున్న బాధ, కళ్ళేదురుగా బాబు, కడుపులో సుళ్ళు తిరుగుతున్న బిడ్డ…. అంతా, అన్నీ సమస్య ల మయమే. ఇక తల్లి దగ్గిర ఒక్క ఓదార్పు మాట లేదు. లేచి కాస్సేపు డాబా మీదికి వెళ్ళడానికి ఉద్యుక్తురాలయింది. మొదటి మెట్టు ఎక్కకముందే తల్లి వెనకే వచ్చి “ఎందుకు? చుట్టూ అందరూ చూసి తలో మాటా అనుకోవడానికా?” విసురుగా అంది.
తల్లికి సమాధానం చెప్పే ఓపిక లేదు. అయినా ఎదురు చెప్తే జరిగే పరిణామం తనకు కొత్తేమీ కాదు. ఏడుస్తూ పడుకుని, తనతో రోజంతా మాట్లాడ్డం మానేస్తుంది.
అయినా స్థిరంగా ఓపిక తెచ్చుకుని “అమ్మా! నాకు ఒంట్లో ఏవీ బాగాలేదు. కాస్త అలా గాలి పీల్చుకుని వస్తాను” అని మెట్లు ఎక్కసాగింది.
తనకెంతో ఇష్టమైన సాయం సంధ్య వేళ డాబా మీదికి వెళ్ళగానే జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయిన సాంత్వన కలిగింది తన్మయికి.
“మిత్రమా! నా భవిష్యత్తు ఇలా అంధకారబంధురం కావాల్సిందేనా?”
సమాధానంగా “కాదన్నట్టు” వెనకే బాబు పరుగెత్తుకు వచ్చేడు. తల్లి పొట్టని ఆప్యాయంగా నిమిరేడు. తన్మయి అంతా అర్థమయినట్టు తల పంకించింది. తన పిల్లలే తన భవిష్యత్తు. తన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా గెలవాలి. పట్టుదలగా తను గెలుస్తూ, ఈ పిల్లల్ని గెలిపించాలి.
“చెల్లి” అని అంది బాబుకి పొట్ట మీద చూపిస్తూ.
వాడు సంతోషంగా గెంతులు వెయ్యసాగేడు.
తన్మయి ముఖమ్మీద చిర్నవ్వు వెలిసింది. తనకి ఇంతకంటే ఏం కావాలి?
కిందికి వస్తూనే “అమ్మా! నాన్నగారిని హైదరాబాదు తీసుకు వెళ్ళి వైద్యం చేయిద్దాం” అంది తల్లితో.
ఏ కళనుందో మారుమాట్లాడకుండా ఒప్పుకుంది తల్లి.
“అలాగేనమ్మా! మన ఊళ్ళో డాక్టరు వారానికోసారి చూడ్డానికి వస్తున్నారు. రేపు ఆయన రాగానే ఒక మాట ఆయనకి చెప్పి..” అంది.
ప్రభుకి ఫోను చేసింది.
కిందన వింటున్నారని తెలిసి మరీ దృఢంగా చెప్పింది “నేను మా వాళ్ళని తీసుకుని వస్తున్నాను”
ప్రభు నించి వెంటనే “అలాగే” అన్న సమాధానం విని తన్మయి మనసు ఆనందం తో పొంగిపోయింది.
ప్రభు మంచి మనసు తనకు తెలుసు.
***
మర్నాడు ఉదయం లేవగానే తండ్రి పిలుస్తున్నట్లు వినబడి దగ్గిరికి వెళ్ళింది తన్మయి.
ఆశీర్వదిస్తున్నట్లు తల మీద చెయ్యి పెట్టి ఏదో గొణిగాడు.
ఆయన గొంతు తడారిపోయినట్లు నాలుక లోపలకి తోడుకుపోయి ఉంది. తన్మయి మంచినీళ్ళ కోసం పరుగెత్తింది. పెరట్లో ఉన్న జ్యోతిని గట్టిగా పిలుస్తూ తన్మయి తిరిగి వచ్చేసరికి బాబు చేతిని పట్టుకుని ఉన్న భానుమూర్తి ప్రాణాలు అప్పటికే గాల్లో కలిసి పోయేయి.
తన్మయి పెద్దపెట్టున ఏడుస్తూ కూలబడింది.
జ్యోతి “అయ్యో!” అని గట్టిగా అరుస్తూ వీథిలోకి పరుగెత్తింది.
బాబు బెంబేలుగా గుక్కపెట్టి ఏడవసాగేడు.
వీధిలో చుట్టుపక్కల అందరూ గబగబా చేరేరు. ఊర్లోని బంధువులు పరుగున వచ్చేరు. తల్లిని ఇద్దరు ఆడవాళ్ళు అక్కున చేర్చుకుని చెరో పక్కా పట్టుకున్నారు.
హఠాత్తుగా తన్మయికి కళ్ళ ముందు చీకటిమయంగా అనిపించింది. కళ్ళు తెరిచేసరికి వనజ ఎప్పుడు వచ్చిందో తెలీదు. తన చెయ్యి పట్టుకుని ఉంది. భోరుమని వనజని కౌగిలించుకుంది తన్మయి.
“ఏడవకు తనూ! జరగాల్సిన కార్యక్రమాలు అమ్మ ఒక్కత్తి చేసుకోలేదు. నువ్వే గుండె రాయిచేసుకుని ధైర్యం చేసుకోవాలి” అంది. అప్పటికే వాకిట్లో పడుకోబెట్టిన భానుమూర్తి పార్థివ దేహం దగ్గిర నూనె దీపం వెలుగుతూ ఉంది.
ముఖం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్నా, బిగుసుకుపోయిన శరీరం, పాలిపోయి అస్థిపంజరానికి వేళ్ళాడుతున్నట్టు పుల్లల్లాంటి చేతులు. తన్మయి దగ్గిరికెళ్ళి చేతుల్ని తడిమింది. నుదుటి మీద జుట్టుని సరిచేసింది. ఒత్తయిన తండ్రి జుట్టుని పట్టుకుని ఎన్నోసార్లు ఆడుకునేది చిన్నతనంలో. ఆ వీపు మీద ఉప్పుమూట ఎక్కించుకుని తిప్పిన రోజులు, ఒంట్లో బాలేనప్పుడు ఎత్తుకుని డాక్టరు దగ్గిరికి పరుగెత్తిన భుజాలు స్పృశించింది. తాడుతో కట్టిన బొటన వేళ్ళ పాదాలకి నమస్కరించింది. అమ్మమ్మ చనిపోయినప్పుడు తను మొదటిసారి మృత కళేబరాన్ని చూసింది. అప్పుడెం దుకో చల్లని ఒంటిని ముట్టుకోవడానికే భయం వేసింది.
కానీ ఇప్పుడు తండ్రి మృతదేహం దగ్గిర భయం లేదు. ఇక ఎప్పటికీ చూడలేనన్న వాస్తవం కలిగిస్తున్న బాధ తప్ప. ఒక పక్క కన్నీరుమున్నీరుగా రోదిస్తూనే తండ్రిని కళ్ళారా చూడసాగింది. జ్యోతి మాత్రం ఇక తన బాధ్యత అయిపోయిందన్నట్టు ఒక పక్కగా గోడకి జేరబడి కిందికి చూసుకుంటూ కూచుంది.
తల్లి కళ్ళల్లో నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాకపోవడం విచిత్రంగా అనిపించింది తన్మయికి. అది దుఃఖం రాని స్థితో, దుఃఖం అయిపోయిన స్థితో అనిపించడం లేదు.
బహుశా: సహజీవనం ఒక్కటీ మనుషులని దగ్గిరచెయ్యదేమో! మనస్సులో ఏ మూలనో కాస్త ప్రేమ కూడా ఉండాలి.
సహజంగా తల్లి బేల మనస్కురాలు కాదు. అయినా ఇదీ ఒకందుకు మంచిదే. తండ్రికి ఒంట్లో బాలేనప్పుడల్లా తల్లి ఒంటరిగా ఎలా ఉంటుందో అన్న బాధ తనని చుట్టుముట్టేది. ఇప్పుడా బెంగ అవసరం లేదనిపించింది తన్మయికి. దుఃఖపడాల్సిన అవసరం లేకపోయినా, ఏదో చుట్టుపక్కల వాళ్ళ కోసం మధ్య మధ్య ముక్కు చీదుతూ కూచుని ఉన్న జ్యోతి తన్మయి తన వైపు చూడడం గమనించి దగ్గిరికి పిలిచింది.
“వీళ్ళంతా సంప్రదాయాల పేరుతో బొట్టు, గాజులు తీసే తతంగాలు అవీ నాకు ఇష్టం లేదు. నువ్వే చెప్పు కాస్త” చెవిలో మెల్లిగా అంది.
తన్మయి దుఃఖ పడుతూనే తలూపింది.
అంతిమ యాత్రలో స్త్రీలు వాకిటి వరకే వెళ్ళగలిగిన సంప్రదాయాల్ని కాదనలేక పోయినా, తన్మయి తల్లి వైపు నిలబడి తల్లికి చెయ్యబోయిన తతంగాలన్నీ ఆపించింది.
భానుమూర్తి తరఫు బంధువులు వెనక వెనకే గుసగుసలు పోయినా తర్వాత సర్దుకున్నారు.
బాబుతో తండ్రికి తల కొరివి పెట్టించేరు.
సాయంత్రానికి ప్రభు వచ్చేడు. తన్మయి దుఃఖం కట్టలు తెంచుకుంది.
“హమ్మయ్య, వచ్చావా నేస్తం! నా దుఃఖపూరిత హృదయాన్ని ఓదార్చడానికి కాసింత సమయం చేసుకుని……” తన్మయికి లోపల్లోపల ప్రభు రాక సాంత్వన కలగజేయసాగింది.
ప్రభు వచ్చిన దగ్గరనించి అన్నీ తనే అయ్యి నిలబడి చెయ్యసాగేడు. బంధువులందరికీ అప్పుడే పరిచయమయినా ఎన్నాళ్ళుగానో అందరికీ తెలిసినట్లు మసలుతూన్న ప్రభు వైపు ప్రశంసాపూర్వకంగా చూసింది తన్మయి.
అంతవరకూ తనని అనుమానస్పదంగా చూస్తున్న బంధువులందరికీ ఒక సమాధా నం దొరికినట్టు చిన్నత్తయ్య దగ్గిరికి వచ్చి “ఎన్నో నెల?” అంది.
ప్రభు పనుల్లో కల్పించుకోవడం జ్యోతికి ఒక పక్క అప్రసన్నంగా ఉన్నా, మరోదారి లేకపోవడంతో నిశ్శబ్దంగా ఉండిపోయింది.
పెద్ద పిన్ని తన్మయి దగ్గిరికి వచ్చి బుగ్గలు పుణికి “మంచి పని చేశావమ్మా. అబ్బాయి ఎంతో మంచివాడు. మీ అమ్మకు ఇక దిగుల్లేదు” అంది.
ప్రభు మూడో రోజు చిన్న దినం అయ్యేవరకు ఉండి, పదకొండో రోజు పెద్దదినానికి మళ్ళీ వస్తానని వెళ్ళేడు.
తన్మయికి ఏ రోజూ దుఃఖం కట్టడి కావడం లేదు. అయినా లేచి పనులు చక్కబెట్టక తప్పడం లేదు. జ్యోతిని పలకరించడానికి రోజూ ఊళ్ళో ఎవరో ఒకరు వస్తుండడంతో మిగతా అన్ని పనులు తన్మయి చక్కబెట్టసాగింది. వచ్చిన వాళ్ళు తెస్తున్న స్వీట్ల పేకట్లతో వంటింటి అలమారా నిండిపోసాగింది. ఒక పక్క మనసులో బాధ సుళ్ళు తిరుగుతూ ఉంటే ఇదేమి ఆచారమో అనిపించ సాగింది తన్మయికి.
బయటి వరండాలో పెట్టిన భానుమూర్తి పటం దగ్గిర అగరొత్తులు, దీపం ఆరకుండా వెలిగించసాగింది తన్మయి.
నాలుగో రోజు వరండాకొచ్చిన జ్యోతి “అదెందుకలాగ అన్నీ తగలేస్తున్నావు?” అని తన్మయి మీద గయ్యిమనబోయి అంతలోనే ఎవరో బంధువులు గేటు తీసుకుని వస్తుండ డంతో లోపలికి వెళ్ళిపోయింది.
తల్లి ప్రవర్తన చిన్నతనం నించీ అలవాటయిన తన్మయి దేనికీ ఎదురు చెప్ప కుండా ఉండిపోసాగింది. ఇప్పుడు ఇట్టే వెలిగి ఆరిపోయే అగరొత్తులు, ఆవిరయ్యే దీపంలోని నూనె ముఖ్యం కాదు. అసలు ఐహిక ప్రప్రంచంలో ఏదీ ముఖ్యం కాదు. జీవన గమనంలో పైకి కనబడే ఆర్భాటాలన్నీ జీవించి ఉన్నంతవరకే. అగరుపొగై అంతర్థాన మయిపోయిన శరీరం తర్వాత మిగిలేవి జ్ఞాపకాలు మాత్రమే. చిన్నతనం నించి తండ్రితో ఉన్న అనుబంధం ఒక వైపు, ఆయన బతికి ఉన్న కాలంలో ఆయనకి సంతోషం కలిగించే వెన్నో చెయ్యలేకపోయిన బాధ మరోవైపు చుట్టుముట్టసాగేయి. అన్నిటికన్నా ఎక్కువగా తన వల్లే మొదట్నించీ తండ్రి అనారోగ్యం పాలయ్యాడన్న బాధ మెలిపెట్టసాగింది.
తండ్రి మరణం మొదటిరోజు కంటే ఎక్కువగా తన్మయిని కృంగదీయసాగింది.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.