సంఘర్షణ (కథ)

-కృష్ణమాచార్యులు

          “సంసారం సాఫీగా సాగాలంటే భార్య భర్తలిద్దరూ కలిసిమెలిసి జీవనం సాగించాలి. నువ్వు తాబేల్లా నడుస్తూంటే నీ భార్య కుందేల్లా పరిగెడుతోంది. మీ యిద్దరి మధ్యన పొంతన యెలా కుదురుతుంది? ఇలా కొంత కాలం సాగితే…వూహించడానికే భయంగా వుంది. ఆ దేవుడే మీ కాపురాన్నికాపాడాలి” అంటూ దేవుడికి నమస్కారం పెడుతున్న స్నేహితుడు రమణని చూసి నిట్టూర్చాడు శేఖర్. 

          ఒక క్షణకాల మౌనంగా వుండి, ఆ తర్వాత రమణ కిలా బదులిచ్చాడు.

          “కలిసి వుండాలనే మా యిద్దరి తాపత్రయం. కానీ అలా వుండలేక పోవడానికి కారణం తన ఆశయం, గొప్ప వ్యాపారవేత్తగా సమాజంలో గుర్తింపు సాధించాలన్న తన తపన. అందుకోసం అహర్నిశలు కష్టపడుతోంది. అలాంటప్పుడు నా స్వార్ధం కోసం, తనను యింటి పట్టున వుండమని బలవంతపెట్టలేను కదా?”

          “ఇప్పుడెక్కడకు వెళ్ళింది?” రమణ గొంతులో అసహనం స్పష్టంగా తెలుస్తోంది.

          “గోవా. అక్కడ జరుగుతున్న ఒక వ్యాపార సదస్సుకి వెళ్ళింది. అక్కడ బిజీగా వుండి వుంటుంది”.

          “ఫోన్ మాట్లాడడమో, మెసేజ్ పెట్టడమో వుందా? అదీ లేదా?”

          “ఎందుకు లేదు? తనకు తీరిక దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తుంది. నా సంగతులు తెలుసుకుంటుంది.”

          తన సమాధానాన్నిరమణ నమ్మడం లేదని గ్రహించిన శేఖర్ భార్యని సమర్ధించే ప్రయత్నం చేసాడు.

          “అర్ధం చేసుకో. ఒక అసిస్టెంట్ ప్రొఫెసరుగా నాకున్న ప్రశాంతత, తీరుబడి తనకెలా వుంటుంది ?.క్రిందటి నెల, నువ్వు మా యింటికి వచ్చినప్పుడు చూసావు కదా. ఒక ఫోన్ తర్వాత మరొకటి. అన్నయ్య ఇంటికి వస్తే ఒక్క నిమిషం కూడా మాట్లాడ లేకపోయానని తను యెంతగానో బాధ పడింది”.

          “చెవిలో పూలు పెట్టించుకోవడానికి నేను పసివాడ్ని కాదు. నీలాగే ప్రొఫెసర్ని”

          “సారీ రా! మమత బిజినెస్ ప్రారంభించినప్పటి నుంచి మామధ్య దూరం పెరుగు తూ వస్తోంది. ఏ వ్యాపారమైనా కష్టంగానే వుంటుంది. నా సహాయం ఆశించకుండా తనే అన్ని చేసుకుపోతోంది”.

          “తను అడగలేదు సరే! నువ్వడిగి మరీ సహాయం చేయాల్సింది. తనకి ఇటు కాపురం, అటు వ్యాపారం బ్యాలన్స్ చేసుకోవడం తేలికయ్యేది. మీ ఇద్దరి మధ్య వున్న బంధం మరింత బలపడేది.” రమణ మాటలకడ్డు తగులుతూ శేఖర్ అన్నాడు.

          “తనొక్కతే అయితే నువ్వన్నట్లు చేయ్యొచ్చు. కానీ ఆమె, తన స్నేహితురాళ్ళతో కలిసి పని చేస్తోంది. అందువల్ల మనకి తొంగి చూసే అవకాశం లేదు.”

          “ఆమె వ్యాపారానికి పెట్టుబడి నువ్విచ్చావా?”

          “లేదు. ఆమె స్నేహితులిద్దరు పెట్టుబడి పెట్టారు. ఒక బొటిక్, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించారు. తనది శ్రమ పెట్టుబడి. లాభాలలో వాళ్ళతో సమానంగా మూడో వంతు.”

          “రెండు పడవల మీద కాళ్ళు. మునిగిపోరా?”

          “లేదు. ఒక స్నేహితురాలి తల్లికి మేరేజ్ బ్యూరో వుంది. అక్కడ పెళ్ళి కుదిర్చి, ఈవెంట్ బాధ్యత తీసుకుంటారు. వివాహానికి కావల్సిన డిజైన్ డ్రెస్సులు వీళ్ళు సమకూరుస్తారు. అలా ఒకదానికొకటి లింకు. ఫ్యాషన్ డిజైన్ డ్రెస్సులకు అంతర్జాతీయ మార్కెట్ వుంది. విదేశాల్లో వున్న వీళ్ళ స్నేహితులు, చుట్టాల సహాయంతో అక్కడ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ఒక్క యేడాదిలో వీళ్ళ ఆన్ లైన్ స్టోర్ వ్యాపారం వాళ్ళ అంచనాలను దాటిపోయింది.”

          “వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేదా?”

          “ఇద్దరికి అయ్యాయి. అందుకే వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నా రు. అందువల్ల మా ఆవిడకు తన సత్తా చూపే అవకాశం వచ్చింది”.

          “అంటే వాళ్ళు హాయిగా కాపురాలు చేసుకుంటూ మీ ఆవిడ సంసారానికి గండి కొడుతున్నారన్న మాట.”

          “మనం చూసే దానిలో వుంటుంది. వ్యాపారం చేయాలన్న ఆమె చిరకాల వాంఛ నెరవేరుతోందని నేను అనుకుంటున్నాను. తన సామర్ధ్యం నిరూపించుకునే అవకాశం వచ్చిందని ఆమె సంతోషిస్తోంది.”

          ” ఏడ్చినట్టే వుంది. అసలా అమ్మాయి పెళ్ళి చూపులప్పుడు వ్యాపారం చేస్తానని చెప్పిందా? !”

          “చెబితే చేసుకుంటానా! నాకు ప్రశాంతమైన జీవితం ఇష్టం. అందుకే టీచింగ్ చేస్తున్నాను. మీకు అలాంటి జీవితం ఇష్టమేనా? అని ఆమెను స్పష్టంగా అడిగాను.

          “ఏం చెప్పింది?

          ” ఆడపిల్లలకి యెన్ని ఆశలున్నా సంసారం ముఖ్యం అంటున్నారు అమ్మా నాన్నా. వినక తప్పదు. నా ఆశ యేదైనా, వారికి మనశ్శాంతి వుంటే చాలని పెళ్ళికి సిద్ధపడ్డాను. ఏం ఆశలని అడక్కండి. అదొక మూసేసిన చాప్టర్ “అని చెప్పింది. నిజమేననుకున్నాను.

          “బాగుంది. నీ మంచితనం ఆసరా చేసుకుని ఆమె యిలా చేయడం న్యాయం కాదు”

          “నా తప్పు కూడా వుంది. నేను ఆమె మూసేసిన చాప్టరులో యేమున్నాయో కనుక్కు ని వుండాల్సింది. ఆమెలో వ్యాపారం చెయ్యాలన్న ఆశ బలంగా లేకుంటే, యిలా రిస్క్ తీసుకునేదా?”

          “అదీ నిజమే. కానీ బుట్టలో పాముకు స్వేచ్చ నిచ్చి, ఆ పాము కాటుకు బలైన అమాయకుడివి నువ్వు” అని వెళ్ళిపోయాడు రమణ.

***

          ఆ రోజు రాత్రి, ఒంటరితనం వెక్కిరిస్తూంటే, శేఖర్ నిద్రకు దూరమయ్యాడు. వివాహ జీవితమిలా ప్రశ్నార్ధకంగా మారుతుందని అతడూహించలేదు. పెళ్ళయిన తర్వాత, ఆరు నెలల పాటు జీవితం సాఫీగా గడిచిపోయింది. మొదట మమత ఇంట్లోనే వుంటూ, ఒక బిజినెస్ బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదిస్తానంటే, సరేనన్నాడు. మహిళలు చేస్తున్న  వ్యాపారాలు, వ్యాపారంలో విజయం సాధించిన మహిళలతో చర్చలు, క్రొత్తగా వస్తున్న వ్యాపార అవకాశాలు …ఇలా భిన్నమైన, యువతులకు ఆకర్షణీయమైన అంశాలను
తెలియ చేస్తున్న ఆమె బ్లాగ్ కొద్ది కాలంలోనే మంచి విజయాన్ని సాధించింది. అంతా బాగుంది అని అనుకునే సమయంలో, ఆమె ఒక రోజు షాకిచ్చింది. స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తానంది. “నయా పైసా పెట్టు బడి లేదు. కాస్త కష్ట పడాలంతే” అని సంబరంగా చెప్పింది.

          సంసారం మాటేమిటి? బిజినెస్ యెలా చేస్తావని నిలదీయడానికి అతని సంస్కారం అంగీకరించలేదు.

          అదే సమయంలో, ఆమెకు ప్రోత్సాహమివ్వడానికి, ప్రశాంతత నిష్టపడే అతని మనసు, సుముఖంగా లేదు. అలా ఒక మానసిక సంఘర్షణతో శేఖర్ సతమతమయ్యాడు. ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు. అతని ప్రమేయం లేకుండానే వ్యాపారం మొదలయ్యింది.

          వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమైన మమత , భౌతికంగా, మానసికంగా శేఖర్ కి దూరమయిపోవడం మొదలైంది. దానికి పతాక సన్నివేశం బోటిక్ వార్షికోత్సవం సంబరంగా జరిగిన ఆ నాటి రాత్రి. ఆనందంతో ఆ రాత్రి మమత అభిసారికలా శేఖర్ దరి చేరింది. ముద్దుముచ్చటలతో దగ్గరవుతున్న సమయంలో ఫోన్ మ్రోగింది. ” ఇంటర్నేషనల్ కాల్” అంటూ మమత అతని కౌగిలి నుంచి విడివడి ఫోన్ అందుకుని
బాల్కనీలోకి పరిగెత్తింది. శేఖర్ కోపాన్ని అణుచుకుంటూ, అమె రాక కోసం పదినిమిషాలు నిరీక్షించాడు. ఆ తర్వాత విసుగు చెంది నిద్ర పోయాడు. మరునాడు ఆమె సారీ చెబు తుందని ఎదురు చూసిన శేఖర్ కి ఆశాభంగం తప్పలేదు. విచిత్రంగా మమత అసలేమీ జరగనట్లు వుండిపోయింది.

***

          “ఆశ చిటికేస్తే చాలమ్మా అందని దేముంది” అన్న మాట మమత విషయములో నిజమైంది. రాత్రనక పగలనక మమత పడ్ద కష్టం వృధా కాలేదు. ఒక యేడాది తిరిగేసరికి, వ్యాపారాలు విజయపథంలో నిలిచాయి. ఆమె స్నేహితులు సంతోషంతో ఆమెకు లాభాల తో పాటు మరింత అధికారం యిచ్చారు. బొటిక్ వ్యాపారానికి ప్రతినిధిగా పేరు ప్రతిష్టలు పెంచుకుంటే మన వ్యాపారానికి లాభం వుంటుందని సలహా యిచ్చి ప్రోత్సహించారు. ఆమె తన కోరిక నెరవేరే ఘడియ వచ్చిందని పొంగిపోయింది. మహిళా పారిశ్రామికులను, వ్యాపారస్తులను ప్రోత్సహించే అన్ని సంఘాలలో సభ్యత్వం తీసుకుంది. కొంత డబ్బు చెల్లిస్తే బహుమతులిచ్చే సంస్థలున్నాయి. వాటిని సంప్రదించి అనేక బహుమతులను సొంతం చేసుకుంది. లయన్స్, రోటరీ, జేసీస్, వంటి సేవా సంస్థలతో చేయి కలిపి , సేవా కార్యక్రమాలు నిర్వహించింది. నగరంలో జరిగే మారథాన్ కార్యక్రమాలలో పాల్గొని యువతీ యువకుల అభిమానాన్ని చూరగొంది. ఇలా సహస్రావధానం చేస్తున్న, మమతకు క్షణం తీరికలేదంటే ఆశ్చర్యమేముంది. ఇంటిపట్టున వుండడం గగనమై పోయింది. ఇంటి పనులకు, వంటకు ఒక మనిషిని యేర్పాటు చేసింది.

          ఒక ప్రక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ, మరొక ప్రక్క జాగింగ్, యోగాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ముందుకు సాగుతున్న మమతను బాధిస్తున్న ఒకే ఒక్క విషయం ఆమె సంసారం.

***

          కొద్దిరోజులు మధురంగా సాగిన కాపురం, ఈ రోజు బీడు పడిన పొలంలా, నీరు లేని నదిలా, గుండె కలుక్కుమనేలా వుంది. అప్పుడప్పుడూ కురిసే చిరుజల్లుల్ల వల్ల యేం ప్రయోజనం? బీడు పండదు, నది పరుగుతీయదు. “నేను సాధిస్తున్నానా?  నష్టపోతు న్నానా? నా స్నేహితురాండ్రు నిశ్చింతగా కాపురాలు చేసుకుంటున్నారు. తల్లులై, బిడ్డల ఆలనాపాలనా చూసుకుంటున్నారు. నాకేమయ్యింది? ఇంత వ్యాపార వ్యామోహం అవసరమా?”ఇలాంటి ప్రశ్నలతో ఆమె మనసు పరుగునాపి నిలిచింది. ఆమెలో
అంతర్మధనం మొదలైంది.

          కృషితో నాస్తి దుర్భిక్ష్యం ! మమత కన్న కలలు పండాయి. రెండో ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఆమె వ్యాపారం రెండింతలైంది. ఆమెకు ఆమె స్నేహితురాండ్రకు. ప్రతి ష్టాత్మకమైన వ్యాపార వేత్త, బహుమతులు లభించాయి. అప్పుడే ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది.

          బహుమతి ప్రదానం చేసిన వ్యాపార దిగ్గజం అరవింద గుప్తా మమతని చూసి, ముచ్చటపడ్దాడు. అందం, ఆరోగ్యంతో మెరిసే దేహం, వివేకం, అభిమానం కలబోసిన సంభాషణా చాతుర్యం, వ్యాపారంలో ప్రగతి సాధించిన జ్ణానం, నైపుణ్యం… ఇవన్నీ ఒక స్త్రీ రూపంలో తన ఎదుట నిలిచిందని అతడు భావించాడు.. 

          అతను ఈ మధ్యనే భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం జీవితానికేగాక, వ్యాపారానికి కూడా భాగస్వామి కాగల వ్యక్తి కోసం చూస్తున్నాడు. మమత గురించి గత యేడాదిగా వింటూ వచ్చిన అతను, ఆమెను చూడగానే ముగ్ధుడై, ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆమెకు ఫోన్ చేసి తన మనసులో మాటను తెలియ చేసాడు.

          “నీకు కావలసిన సమయం తీసుకో. బాగా ఆలోచించు. నీకూ, నాకూ వ్యాపారం వూపిరిలాంటిది. మనం కలసి పని చేస్తే ఇద్దరికి ఆనందంగా వుంటుంది. వ్యాపారమూ అభివృద్ది పొందుతుంది. అందుకే, జీవితానికి, వ్యాపారానికి, భాగస్వామిగా నిన్ను ఆహ్వానిస్తున్నాను”.

          మమతకి ఈ ఆహ్వానం ఒక కలలా వుంది. ఈ ఆహ్వానాన్ని మన్నిస్తే తన జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. భర్తకి అన్యాయం చేస్తూ సాగించిన ఈ జీవితానికి తెర పడిపోతుంది. కానీ ఇన్నాళ్ళూ వివాహ బంధాన్ని గౌరవించి తన యెడబాటుని ప్రేమతో సహించిన భర్తను వదిలి వెళ్ళడం, న్యాయమా? ఏదో ఒక రోజు నా భార్య నాతో కాపురం చేస్తుందన్న అతని ఆశలను భగ్నం చేసి అతని గుండెలో మంట రాజేయడం ధర్మమా? ఇంత వరకు ఎన్నో సమస్యలను అవలీలగా పరిష్కరించిన మమత తనకెదురైన
ఈ సమస్యతో మానసిక సంఘర్షణకి లోనైంది.

          ప్రశాంతంగా నిదురిస్తున్న భర్త అమాయక ముఖం ఆమె ఆవేదనను మరింత పెంచింది. చాలాకాలం తర్వాత, ఆమె అతని మీద చేయివేసి పడుకుంది. ఆమె కరస్పర్శకు అతడు కనులు తెరిచి, నిదురిస్తున్న భార్య ముఖం చూసి, ఆమె చేయిమీద చేయి వేసి, నిదురలోకి జారుకున్నాడు.

***         

          ఉదయం ఆరు గంటలకు నిద్రలేచిన శేఖర్ మమత కనబడకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. రోజూలాగే వంట మనిషి చేసిన ఫలహారం తిని యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. రాత్రి మమత కరస్పర్శ గుర్తుకు వచ్చి అతని మనసులో ఏదో జరగ బోతోందన్న అనుమానం రేకెత్తింది. బహుశా దీనినే పంచేంద్రియేతర భావమంటారు కాబోలు. తెలియని దిగులు మనసుని కృంగదీస్తున్నా, పైకి నవ్వుతూ, క్లాసులు తీసుకు న్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో, అతని మనసు మమత గురించిన ఆలోచనలతో వుద్విగ్నమైంది.

          “మమత ఒకనాటి వూరూపేరూ లేని అమాయక యువతి కాదు. సంఘంలో ఒక గుర్తింపు, గౌరవం, సంపాదించుకున్న మహిళ. సహజంగానే ఎందరో ఆమె పట్ల  ఆకర్షితు లు కావచ్చు.అలాగే ఆమె ఎవరినైనా అభిమానించవచ్చు. సంఘానికి అసూయ యెక్కువ. ఒక ఆడది, ఒక మగాడు కలిసి కనిపిస్తే, గాలి కథనాలు వండివార్చే వారెందరో. ఎంతటి ఆకర్షణా వలయంలో వున్నా , మమత, నన్ను వీడిపోదని నా నమ్మకం. నా నమ్మకం నిజమవుతుందా? నా సుధీర్ఘ నిరీక్షణ ఫలిస్తుందా?”

          అతని ఆలోచనలను భగ్నం చేస్తూ ఒక అపరిచిత వ్యక్తి వచ్చి తాను ప్రముఖ వ్యాపారస్తుడు అరవింద్ గుప్తా దగ్గర పనిచేసే ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు.

          “సార్! మిమల్ని కలవాలనుకుంటున్నారు. దయచేసి నాతో రండి. వారు అశోకా హోటల్లో వున్నారు” అని వినయంగా అభ్యర్ధించాడు. ఒక నిమిషం యేం చెప్పాలో శేఖర్ కి అర్ధం కాలేదు. అతని మనసు కీడుని శంకించింది. జరిగేది జరిగే తీరుతుందన్న నిర్వేదం అతడి మనసు నావరించింది. అతడు మెల్లగా లేచి ఆ అపరిచిత వ్యక్తి వెంట నడిచాడు.

***

          ఐదు నక్షత్రాల ఆశోకా హోటల్లో అడుగు పెడుతూ, శేఖర్ న్యూనతా భావానికి గురయ్యాడు.

          “మమతకు వ్యాపారాభివృద్ధికి, విలాసవంతమైన జీవితానికి, భర్తగా నేను చెయ్య లేనిది అరవింద గుప్తా చేయగలడు. బహుశా పూర్వ జన్మ దుష్కర్మ వల్ల ఆమె నా పాలబడింది. ఇప్పుడు మంచి కర్మల ఫలితం మొదలైంది. “అని ఆలోచిస్తూ అరవింద గుప్తాని కలిసాడు.

          పరస్పర యోగక్షేమాల విచారణ తర్వాత, అరవింద్ గుప్తా మృదువుగా యిలా అన్నాడు, “మిమ్మల్ని అడగకూడనిది అడుగుతున్నాను. మీరు మీ భార్యకు  విడాకులి వ్వండి. మీరు బిజినెస్ పాఠాలను బోధిస్తారు. ఆమె బిజినెస్ చేస్తుంది. మీవి మాటలు, ఆమెవి చేతలు. మీది గోమాత నడక, ఆమెది జవనాశ్వం పరుగు. మీరు నిలబడి నీళ్ళు త్రాగితే, ఆమె పరుగెత్తి పాలు త్రాగుతుంది. మీరు ప్రశాంతత కోరుకుంటారు. మీకు భిన్నంగా, ఆమె పోరాటానికి వెనుకడుగు వేయదు. మీ యిద్దరూ వ్యతిరేక ధృవాలు.
కలవని, కలుసుకోలేని జీవనం, యెంత కాలం కొనసాగిస్తారు? ఆమె నా భార్య అయితే నా వ్యాపారం పెరుగుతుంది. గొప్ప వ్యాపారవేత్త కావాలన్న ఆమె ఆశ నెరవేరుతుంది. ఇందులో బలవంతమేమీ లేదు. మీ కిష్టం లేదంటే, నిర్మొగమాటంగా చెప్పండి. మీకు శుభాకాంక్షలు తెలిపి, తప్పుకుంటాను.”

          శేఖర్ అతని సాధు స్వభావానికి ముగ్ధుడయ్యాడు. ఒక నిమిషం మౌనంగా వుండిపోయాడు. ఆ తర్వాత, 

          “మీరు మమతతో మాట్లాడారా? ఆమె అంగీకరించిందా?” అని అడిగాడు.

          “చెప్పాను. బహుశా ఆమె మీకీ విషయం చెప్పడానికి సందేహించవచ్చు. అందుకని, నేరుగా నేనే చెప్దామని మిమ్మల్ని ఇక్కడకు రమ్మని కోరాను.”

          “నేను నా భార్యతో మాట్లాడిన తర్వాత మీకు మెసేజ్ చేస్తాను. ధన్యవాదాలు” అని శేఖర్ యూనివర్సిటీకి వచ్చేసాడు.

***

          అరవింద గుప్తాని కలవడానికి వెళ్ళినప్పుడు అతనిలో తలెత్తిన నిస్వార్ధ భావాలు అతను యూనివర్సిటీకి చేరేటప్పటికి మాయమయ్యాయి. 

          “ఆమె నా భార్య. వేద మంత్రాల సాక్షిగా నాతో తాళి కట్టించుకుని నాదైన స్త్రీ. ఆమె వ్యాపారానికి నేను ఏ ఆటంకమూ కలిగించలేదు. భర్తగా నా హక్కులు చలాయించకుండా, బాధ్యతగా మసులు కున్నాను. నేనెందుకు ఆమెను వదులుకోవాలి?”అని అతని మనసు యెదురు తిరిగింది.

          విరుద్ధ భావాల సంఘర్షణతో, అతని మనసు నిప్పుల కొలిమిగా మారింది. జ్వరం
వచ్చిన వాడిలా నీరసంగా ముఖం వేళ్ళాడేసుకుని యిల్లు చేరాడు. అత్యంత ఆశ్చర్య కరంగా, మమత హాలులో సోఫాలో కూర్చుని ఫోన్ మాట్లాడుతూ కనబడింది. విడాకుల గురించి మాట్లాడడానికి ముందుగా వచ్చి, వేచి వుందన్న ఆలోచన అతని మదిలో మెదిలింది. అతని మనసు విషాద భరితమైంది.

          “వచ్చారా! “అంది మమత చిరునవ్వులొలుకుతూ.

          “ ఎన్నాళ్ళకు చూసా, ప్రశాంత సుందర వదనాన్ని. మనోహరమైన ఆ నవ్వుల
పువ్వులని. అందుకోసం కదా, యిన్నాళ్ళు విరహాన్ని, వేదననని భరించింది. కానీ
యిప్పుడు ప్రాణానికి ప్రాణమైన నా ప్రియ కాంతకు, విడాకులివ్వడానికి అంగీకారం తెలపాలి”

          అలా అనుకున్న అతనికి యేడుపు తన్నుకొచ్చింది. ఇన్నాళ్ళూ అతనిలో ఘనీ భవించిన బాధ కన్నీళ్ళ రూపంలో జలపాతమై ప్రవహించింది. ఉన్న ఫళంగా సోఫాలో కూలబడి, రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని విలపించసాగాడు. 

          అతడిని అలా చూసి మమత నిశ్చేష్టురాలైంది. ఎన్నడూ కోపం గాని, బాధగాని
ముఖంలో ప్రదర్శించకుండా నవ్వుతూ వుండే శేఖర్, సంతత ధారగా వస్తున్న కన్నీటిని తుడుచుకొనే శక్తి లేక, శోకిస్తున్నదృశ్యం ఆమెను కదిలించింది. 

          గబుక్కున అతని ముందు కూర్చుని , అతని ముఖాన్ని ఆర్తితో తన గుండెలకు
హత్తుకుంది. అలా ఒక క్షణం గడిచాక, “ఏమైంది? పసిపిల్లవాడిలా యిలా..” అంటూ అతని ముఖాన్ని తన చేతులలోకి తీసుకుని కన్నుల పై, నుదిటి పై, బుగ్గల పై, నాసిక పై, ముద్దులిడుతూ, లాలించింది. 

          “గుప్తా చెప్పాడు. నీ మంచి కోసం ..అతనితో…” అతని నోట మాటలు రావడం
లేదు.

          మమత అతని పెదవుల పై తన పెదవులుంచుతూ, “ఇంకొక సారి గుప్తా అనకండి” అని గాఢంగా ముద్దు పెట్టింది. ప్రేమతో చెలరేగిన మోహంతో పరవశిస్తూ ఆ భార్యా భర్తలు ఒక రెండు నిమిషాలు అలాగే వుండిపోయారు.

***

          ఆ తర్వాత, మమత, శేఖర్ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది, అతని చేతులు, తన
చేతుల్లోకి తీసుకుని, మందస్వరంలో యిలా చెప్పింది.

          ” మూడు సంవత్సరాల కృషి . పిచ్చి యెక్కిన దానిలా వ్యాపారమే జీవితం అనుకుని పరిగెత్తాను. సాధించానన్నతృప్తి కలిగింది. అదే సమయంలో గుప్తా వచ్చి ప్రపోజ్  చేసాడు. ఆప్పుడు నాలోని భార్య మేలుకుంది. నా కోసం తన సర్వస్వం త్యాగం చేసి, నన్ను ప్రోత్సహించిన నా భర్త , ఉదయమే భార్య చిరునవ్వు ముఖం చూడాలన్న కోరిక తీరని నా భర్త, భోజనం వేళ భార్యతో కబుర్లు చెప్పుకుంటూ తిందామని ఎదురు చూసి
విసిగివేసారిన నా భర్త, సాయంత్రం వేళల గుడికో, షికారుకో చెట్టాపట్టాలేసుకుని భార్యతో
తిరగాలన్న ముచ్చట తీరని నా భర్త. వెన్నెల రాత్రులలో ఆరుబయట కూర్చుని నేను రాలేదని నిరాశ చెందిన నా భర్త, శృంగారవేళ మనసున మనసై, తనువున తనువైన భార్య కోసం, ఓపికగా వేచి వున్న నాభర్త, నా ప్రాణానికి ప్రాణమైన శేఖర్ వుండగా.. ఇంకో పేరు తలచ వద్దు. ఆ మాటలంటూ ఆమె కొద్దిగా పైకి లేచి, అతడిని పెనవేసుకుని, అతని పెదాలను ముద్దాడి, ” మీరే నా ప్రాణం, వ్యాపారం కాదు” అని గోముగా చెప్పింది.

          శేఖర్ ఆ మాటలకు పులకించిపోయి, ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు.
గాలి కూడా చొరబడడానికి వీలు లేకుండా, ఆమె అతడి చుట్టూ చేతులు వేసి కౌగిలి బిగించింది. ఇద్దరి గుండెలు మృదంగాలై, మది పాడే ప్రేమ గీతానికి అనుగుణంగా ధ్వనించ సాగాయి. వారలా తన్మయ స్థితిలో వుండగా సూర్యాస్తమయమైంది. గదిలో చీకట్లు అలముకున్నాయి. కానీ వారు వెలిగించిన అనురాగ దీపాలు వారి హృదయ మందిరాలని వెలుగులతో నింపివేసాయి. ఆ వెలుగు పాకి, తేజోమయమైన వారి కన్నులు, ఒక భవిష్యత్తుని దర్శిస్తున్నాయి. అది వృత్తిలో విజయాన్ని, సంసారంలో మాధుర్యాన్ని,
సమతూకంలో అందించే ఒక స్పూర్తి సహిత, మేధోమయ భవిష్యత్తు, ప్రణయభరిత, మన్మధ పాలిత భవిష్యత్తు. సంఘర్షణా రహిత, ప్రశాంత సుందర భవిష్యత్తు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.