సింహం మనోగతం

-కందేపి రాణి ప్రసాద్

          అదొక టైగర్ సఫారీ. పేరుకు టైగర్ సఫారీ అని పేరు కానీ అందులో సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు ఎలుగుబంట్లు వంటి పెద్ద జంతువులన్నీ ఉంటాయి. స్వేచ్చగా ప్రశాంత వాతావరణంలో జీవిస్తుంటాయి. అని మనుషులు చెప్తారు కానీ నమ్మకండి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేనొక సింహాన్ని, నా కథ చెబుతా వినండి.
 
          నేనొక సింహాన్ని. సింహమంటే ఎవరు? అడవికి రాజు కదా! అడవిలో రాజులా బతికేదాన్ని. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. జైలులాంటి జూపార్కులో పడేయలేదు. కొంత నయమనుకోండి. ఇక్కడ కావాల్సినంత ఖాళీ ఉన్నది. అయినా నేను పుట్టి పెరిగిన నా అడవి నాకు ప్రీతి పాత్రం కదా! నా స్నేహితులు, బంధువులు అందరూ అక్కడే ఉన్నారు కదా! నల్లమల అడువుల్లోనో, మడ అడవుల్లోనో మరే అడవుల్లోనే ఉండాల్సిన దాన్ని ఈ టైగర్ సఫారిలో తెచ్చి పడేశారు. దీని పేరు టైగర్ సఫారీ అట. ఆఫీసర్లు చెప్పుకోగా విన్నానులే.
 
          నాలాంటి సింహాలు మరికొన్ని ఉన్నాయి. అందరం ఒకే చోట ఉండాలి. అడవిలో అయితే ఒక్కొ అడవికి ఒక్కో రాజు ఉంటాడు. మిగతా జంతువులన్నీ రాజును గొప్పగా చూస్తాయి. ఇక్కడ అలాంటి గొప్పదనాలేమీ ఉండవు. పైగా నా మాట కూడా చెల్లుబడి కాదు. ఇక్కడ చాలా సింహాలున్నాయి. అన్ని సింహాలూ ‘నాకు గౌరవమివ్వాలి’, ‘నాకు గౌరవమివ్వాలి’ అని చూస్తుంటాయి. సింహాలేనా! మిగతావి కూడా పెద్ద జంతువులే కదా! పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటి మృగాలే కదా! ఈ సఫారీలో పెద్ద జంతువులు మాత్రమే ఉంటాయి. దేశ ప్రధానులందరూ ఒకచోట చేరి కూర్చోమంటే ఎలా ఉంటుందో మాక్కూడా అలాగే ఉంటుంది. చిన్న జీవులు ఉంటేనే కదా మాకు భయపడేది.
 
          మనుషుల పిల్లలు ఎక్కడో హాస్టళ్ళలో చేరి బిక్కు బిక్కు మంటూ ఉన్నట్లుగా ఉంటుంది మా సఫారీలో ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఇళ్ళలో ఉన్న పిల్లలు కూడా హాస్టల్లో ఒక రూములో సర్దుకున్నట్లుగా ఉంది మా పరిస్థితి. అడవినంతా రాజ్యమేలిన మాకు కొద్దిపాటి గుహను కాస్త ఖాళీ ఇచ్చి బతకమంటే ఎలా ఉటుంది. మీరే చెప్పండి మాక్కూడా హాస్టల్లోనే ఉన్నట్లుంది. ఏం చేస్తాం!
 
          హాస్టల్ వార్టెన్ల లాంటి క్యూరేటర్లు ఉంటారిక్కడ. టైముకు మాక్కావలసిన మాంసం తెచ్చి పడేస్తారు. మేం ఎక్కేడికీ పారి పోకుండా జైలు గోడల్లాండి గోడలు నిర్మిస్తారు. గోడల మీద కరెంటు వైర్లు పెడతారు. ఇంకా మా గుహ చుట్టూతా కందకాలు తవ్వి ఉంచుతారు.
అడవంతా సరదాగా తిరుగుతూ నచ్చిన జంతువును వేటాడి తినడంలో ఉన్న తృప్తి వాళ్ళేదో తెచ్చిస్తే ఉంటుందా! మా స్వేచ్ఛ కు అడ్డు కట్ట వేస్తూ ఉంటారు. మా సఫారీలో జింకలు, లేళ్ళు, కుందేళ్ళు వంటి చిన్న జంతువులే కనిపించవు. అవి మమ్మల్ని చూసి నపుడు కళ్ళలో కనిపించే భయమంత కిక్కెక్కిస్తుంది.
 
          అసలు ఇదంతా కాదు గానీ ఈ మనుషులతో చాలా తిప్పలు పడాలి. చాలా విసిగి స్తారు. మమ్మలి పశువులు, మృగాలు అంటారు కానీ మనుషులు అంతకన్నా ఎక్కువగా హింసిస్తారు. మేమేదో మా పొట్ట తిప్పలు కోసం వేటాడతాం కానీ మనుషులు అలా కాదు.
ఎప్పుడు పడితే అప్పూడు మమ్మల్ని చూడటానికి మనుషులు వచ్చేస్తుంటారు. ఉదయం టిఫిన్లు తినక ముందే వచ్చేస్తారు. మధ్యాహ్నం అన్నం తిన్నాక ఓ కునుకు తీద్దామంటే ఒకటే గోల. నవ్వులు, ఈలలు, అరుపులు, కేకలతో సఫారీ అంతా అదర గొట్టేస్తారు.చుట్టూ గ్రిల్స్ పెట్టుకున్న బస్సుల్లో కూర్చుని హిహిహి అని నవ్వుతుంటారు. మా సివంగి నీళ్ళలో స్నానం చేస్తుంటే ఫొటోలు తీస్తారు. కొద్దిగా కూడా సిగ్గులేదు వెధవలకు. బస్సుల్లోంచి పుల్లలు, రాళ్ళు విసిరేస్తుంటారు. మేమేం చేయలేమని ధీమాగా చేస్తారు.
 
          కొంత మంది ఈ బస్సులకు చికెన్ మాంసం తాడుతో కట్టుకుని వస్తారు. మా పిల్లలేమో తెలియక బస్సు దగ్గరకు వెళ్ళగానే తాడుతో చికెన్ ను లోపలకు లాగేసు కుంటారు. మా పిల్లల్నిలా ఏడిపించినందుకు నాకు చాలా కోపం వచ్చింది. నేను ఏనుగుతో ఈ విషయం చెప్పాను. ఏనుగులు రెండు వచ్చి బస్సును తోసేశాయి. బస్సు పడిపోయింది. లోపల మనుషులంతా ఏడుపులు మొదలుపెట్టారు.
 
          బాగా తిక్క కుదిరింది. అడవికి రాజాలైన మమల్ని హీనంగా చూస్తారా ! మమ్మల్ని బోనులో పెట్టి వెక్కిరించడం కాదు. బయట వదిలిపెట్టిన తర్వాత బలా బలాలు తేల్చుకో వాలి. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకండి. సింహాలైనా, పులులైనా క్రూర మృగాలే కాదు మూగ జీవులు కూడా అని గ్రహించండి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.