అద్దం
– వి.విజయకుమార్
రజితాన్నీ, నిఖార్సైన దాన్నీ. ముందస్తు అంచనాలు లేనిదాన్ని.
చూసిందాన్ని చూసినట్టు అమాంతం మింగేయటమే నాపని.
రాగద్వేషాల ముసుగులేం లేవ్, ఉన్నదాన్ని ఉన్నట్టే అన్నీ
నేనేం కృూరురాల్ని కాదు, కాకపోతే నిజాయితీ దాన్ని
నాలుగు మూలల చిట్టి దేవుడి నేత్రాన్ని
ఇంచుమించు రోజంతా ఎదుటి గోడ తలపుల్లోనే
చూపులన్నీ పెచ్చులూడే ఆ గౌర వర్ణపు గోడ మీదే
అది నా హృదయంలో భాగమనుకుంటాను
కానీ అదేమో మిణుకు మిణుకు మంటుంది.
ముహాలూ, చీకటీ దోబూచులాడుతూ విడదీస్తూ పోతుంటాయ్.
నేనిప్పుడో సరోవరాన్ని
ఓ స్త్రీ నామీదకు వంగుతోంది
తన నిజ బింబాన్ని నేనెలా ప్రతిబింబిస్తానో నాలో చొరబడుతూ
తర్వాత్తను ఆ అబద్ధపు కొవ్వొత్తి వైపూ చంద్రుడి వైపూ మొహం తిప్పుతుంది
నేనప్పుడు తన వీపుని శుద్ధంగా ప్రతిఫలిస్తాను.
కానీ తనేమో నాకు బదులుగా దుఃఖాన్నీ ఆవేశపు చేతుల్నీ బహుకరిస్తుంది.
నేను తనకెంతో ఇష్టమే. తను వస్తుందీ, పోతూంది.
ప్రతీ ఉదయం చీకటి చోట్లో ముందు ఆక్రమించేది తన మొఖమే.
నాలో తను ఒక యవ్వనవతిని కలిపేసుకుంది నాలోనే ఒక వృద్ధురాలిని కూడా.
రోజు తర్వాత రోజు ఎండు పరిగెలా మారుకుంటూ.
(సిల్వియా పాత్ “ది మిరర్” కు అనువాదం)
*****