అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 20
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి నెల రోజులు కావస్తోంది. ఇద్దరూ క్రొత్త దేశంలో జీవన విధానానికి అలవాటు పడుతున్నారు. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆ నూతన జంట సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ముందుకు సాగుతు న్నారు.
***
మాతృదేశాన్ని, కన్నవారిని వదిలి, క్రొత్త దేశంలోకి అడుగిడినపుడు ఏ పని చేయాడానికైనా, కొంత తెగింపు, చొరవ కావాలి. తీసుకునే నిర్ణయం సరైనదా, కాదా అనే విషయం ఫలితం వచ్చాకా కానీ తెలియదు. ఫలితం తనకు తగ్గట్టుగా రాకపోయినా కానీ, కొంత సంయమనంతో, స్థిత ప్రజ్ఞతను అలవరచుకున్నవారే అసలు విజేతలు.
విష్ణు కారు తీసుకుని, డీలర్ దగ్గిర ఉండగానే కారు ఇన్సూరెన్స్ కోసం ఫారం
పూర్తి చేసాడు.
ఫోన్ రావటంతో విష్ణు హలో అనగానే, అవతల వ్యక్తి
“హలో! నేను ఎన్ ఆర్ ఎమ్ ఏ నుంచి ఫిలిప్ మాట్లాడుతున్నాను. మీరు కారు
ఇన్సూరెన్స్ కి అప్లై చేసారు కదా! మీనుంచి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. మీ ఐడెంటిటీ కన్ ఫర్మేషన్ కోసం డ్రైవర్ లైసెన్స్ కాపీ కావాలి.” నెల నెల ప్రీమియమ్ ఎంత అవుతుందో అన్ని వివరాలు తెలియచేసాడు ఫిలిప్.
అతనితో మాట్లాడి ఫోన్ పెట్టేయగానే మళ్ళీ వెంటనే ఫోన్ మ్రోగింది.
టెక్ ఫోర్స్ కన్సల్టెంట్ వచ్చే సోమవారం విష్ణు చేరబోయే క్రొత్త ఉద్యోగం గురించి అతను వస్తున్నట్లుగా ఖరారు చేసుకుంది. టాక్స్ డిక్లరేషన్ ఫారం పూర్తి చేయమని చెప్పి, అడ్రస్, ఎవరిని కలవాలో వివరాలు చెప్పి, బెస్టాఫ్ లక్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
ఆస్ట్రేలియాలో ఏ విధమైనా మోసం, డబ్బు, లంచం తీసుకోకుండా జాబ్, రిక్రూట్ మెంట్ ఏజెన్సీ లు ఉద్యోగస్తులకు ఇంటర్వ్యూలో బాగా పెర్ ఫాం చేసిన వారికి అవకా శాలు ఇస్తారు. అలా అని నిస్వార్థంగా డబ్బు ఉద్యోగస్తుల దగ్గిర తీసుకోకపోయినా, ఎంప్లాయర్స్ దగ్గిర కమిషన్ ఉద్యోగ స్థాయిని బట్టి, సేలరీ ని బట్టీ ఛార్జ్ చేస్తారు.
విష్ణు భారమైన నిట్టూర్పు విడిచాడు.
“విశాలా! అవర్ హనీమూన్ పిరియడ్ ఈస్ ఓవర్. కష్టపడే సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి నైట్ షిఫ్ట్, క్వాలిటీ కంట్రోల్ ఫాక్టరీ ప్లాంట్ లో సూపర్ వైజర్ గా బాధ్యతలు తీసుకోబోతున్నాను. నా బయలాజికల్ క్లాక్, స్లీపింగ్ పేటర్న్ మారుతుంది. నా బెంగల్లా నీ గురించే! కుసుమ కోమలాంగివి. జాగ్రత్తగా, ధైర్యంగా ఒక్కదానివి ఉండ గలవా?”
“మహాశయా! ముందే ఎక్కువగా ఊహించుకోవద్దు మీరు. ఝాన్సీ లక్ష్మీ బాయి, రుద్రమదేవి ఉదయించిన దేశం నుంచే నేను కూడా వచ్చాను. వారి వీరగాథలు వింటూ పెరిగాను. అమ్మాయి, అబ్బాయి అని కాదు గానీ, పరిస్థితులకు తగ్గట్టుగా నెసిసిటీ ఈస్ ద నీడ్ ఆఫ్ మదర్ అన్నారు కదా! ఈ రెండు రోజులు ఆనందంగా గడిపేద్దాము అంది” కిల కిల నవ్వుతూ విశాల.
విశాల మాటలు, నవ్వు చూడగానే విష్ణుకి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. మొదటి సారిగా స్వంత కారులో వెళ్ళి, ఇంటికి కావలసిన గ్రాసరీస్ ఇద్దరూ ఇండియన్ స్టోర్స్ కి వెళ్ళి తెచ్చుకున్నారు. విశాల అక్కడ స్టోర్స్ లో దొంతరగా పేర్చి ఉన్న ఫ్రీ లోకల్
మ్యాగజైన్ తీసుకుంది. వారానికి కావలసిన కాయగూరలు, పాలు అన్నీ తీసుకుని, ఇంటికి చేరుకున్నారు. ఆ ఆదివారం విశాల, విష్ణు ఇంటి ఎదురుగా ఉన్న నార్త్ ఇండియన్స్ రమ్మని పిలవటంతో ‘నైబర్ హుడ్ తో పరిచయం మంచిది. ఇరుగు పొరుగు తెలియాలి’
అనుకున్నారు.
దీపక్, సొనాలి ఇద్దరినీ సాదరంగా ఆహ్వానించారు. చపాతీ, చోళే కర్రీ డిన్నర్ కి సొనాలి రెడీ గా చేసింది. వాళ్ళకి ఏడాది బాబు ఉన్నాడు. దీపక్ కాజువల్ జాబ్ సూపర్ మార్కెట్ లో నైట్ ఫిల్లింగ్ షెల్ఫ్ లలో సరుకులు నింపటం చేస్తానని చెప్పాడు. సొనాలి మాటలలో తను సెల్ఫ్ బిజెనెస్ చేస్తున్నాని చెప్పింది. చేతిలో బ్రోచర్ పెట్టి కాస్మెటిక్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయమని అడిగింది. విశాలకి కాస్త ఇబ్బందిగా అనిపించింది, బ్రోచర్ లో లిప్ స్టిక్, ఐ లైనర్స్ , సెంట్స్ మేకప్ కిట్స్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. గంటసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నారు విశాల, విష్ణు.
“ఈ నెట్ వర్కింలో ఆంతర్యం ఇదేనా? నవ్వుతూ పిలిచింది ప్రోడక్ట్ సేల్ కోసమా?”అంది విశాల.
“విశాలా! వెంటనే జడ్జ్ చేయకు. నువ్వు వెంటనే రియాక్ట్ అయి నీ అభిప్రాయం తెలియచేయనక్కర్లేదు. కొనడం, కొనకపోవడం నీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ అడిగితే ప్రస్తుతానికి నా దగ్గిర ఉన్నాయి అని చెప్పు. ఇరుగు, పొరుగు ఎవరో తెలుసుకోవడం మంచిదే. మంచైనా, చెడైనా కొంతమేర సరిహద్దు రేఖ గీసుకోవాలి. మనం సన్నిహితంగా ఉండేది, లేదు అనేది రెండు వైపులా ఉంటేనే, ఆఫ్రెండ్ షిప్ ఉంటుంది.”
సోమవారం మొదలు పెట్టే ఉద్యోగం కోసం ముందు రాత్రే బట్టలు విస్త్రీ పెట్టు కున్నాడు విష్ణు. రాత్రి షిఫ్ట్ కోసం సోమవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలు
పడుకున్నాడు విష్ణు. విశాలకు అన్ని జాగ్రత్తలు చెప్పి, నాలుగు గంటలకు ఇంటి నుంచి రూట్ చూసుకుని విష్ణు తన క్రొత్త జాబ్ కి బయలుదేరాడు.
విష్ణుకి ట్రైనింగ్, ఓరియంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా రాబర్ట్ అతని కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంటి నుంచి కేవలం అరగంట మాత్రమే ప్రయాణం. విష్ణుని చూడగానే వెల్ కం చెప్పి, ఫ్యాక్టరీ అంతా చూపించి, స్టాఫ్ ని పరిచయం చేసాడు రాబర్ట్. విష్ణు ఫ్యాక్టరీ ఆపరేషన్ ప్లాంట్ చూస్తూ, క్వాలిటీ కంట్రోల్ తను గడించిన అనుభవం ఈ జాబ్ కి ఎగ్జాట్ మ్యాచ్ అనుకున్నాడు.
***
మొదటి రోజు అలా ఒంటరిగా విష్ణు లేకుండా ఉండటం విశాలకు కాసేపు క్రొత్తగా అనిపించింది.
‘దేముడా! ఈ రాత్రి ఎలా గడపాలి?’
విష్ణు సహస్ర నామాలు, కనకధారా స్తోత్రం మనసులో చదువుకుంది. అప్పుటికి విశాలకు మనసులో ఉన్న చిక్కుముడులు, భయాలు దూదిపింజలా గాలిలోకి ఎగిరి పోయినట్లనిపించింది. విశాల ఇండియన్ కిరాణా షాప్ నుంచి తెచ్చుకున్న మ్యాగజైన్ పేజీలు తిరగేయసాగింది. అందులో లోకల్ బిజినెజ్ సమాచారం, కౌన్సిల్ లో జరిగే ఈవెంట్స్ మరెన్నో విషయాలు ఉన్నాయి. ఆసక్తికరంగా న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ ఇమ్మైగ్రెంట్స్ కోసం ఉచితంగా కోర్సులు చేరటానికి అవకాశం ఇస్తున్నారని చూసింది.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అడ్వాన్స్ కోర్స్ తనకు సరైనది. మున్ముందు కెరీర్ లో ప్రోగ్రెస్ కావడానికి బాగుంటుంది అని భావించింది. ఖాళీగా ఉండే బదులు, ఈ కోర్సులో చేరడం మంచిదే అనుకుంది. విశాలకి ఆ మ్యాగజైన్ చాలా బాగా నచ్చింది. రాత్రి తొమ్మిది గంటలు కావస్తుండటంతో, కిటికీ తలుపులు అన్నీ మూసి వచ్చి హనుమాన్ చాలీసా చదువుకుని, పడుకుంది.
***
సూపర్ వైజ్ చేయడం కాబట్టి మధ్యలో ఫ్యాక్టరీ సైట్ విజిట్ రౌండ్ వేయాలి. విష్ణు టీ త్రాగి, మొదటి రోజు షిఫ్ట్ పూర్తిచేసి ఇంటికి తెల్లవారుజామున ఐదు గంటలకు చేరుకు న్నాడు. జాబ్ అంత కష్టం కాదు కాని, నిద్ర ఆపుకుని, రాత్రంతా జాగారం చేస్తూ ఉండటం కాస్త కష్టం అనిపించింది విష్ణుకి. ఇంటికి చేరుకుని, విశాలని డిస్టర్బ్ చేయకుండా, అలసటతో నిద్రలోకి జారుకున్నాడు విష్ణు.
ఇన్నాళ్ళు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి, కలిసి ఇంటికి చేరుకునేవారు. విశాల కళ్ళు తెరవగానే, విష్ణు గాఢ నిద్రలో ఆదమరచి ఒళ్లు తెలియకుండా పడుకున్నాడు.
విశాల లేచి, చప్పుడు కాకుండా స్నానం చేసి రెడీ అయిపోయింది. దేముడికి దీపారాధన చేసుకుని, ఉప్మా బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేసింది. విష్ణు లేస్తాడని ఎదురు చూసింది. ఎపుడూ విష్ణుకి ముందు పెట్టి, తను తీసుకుంటుంది. అలాంటిది, తొమ్మిది దాటినా విష్ణు లేవక పోవడంతో, టిఫిన్ తినడానికి రమ్మని పిలిచింది. సగం నిద్రలో ఉన్న విష్ణు గట్టిగా విసు క్కున్నాడు.
“నువ్వు తినెయ్. నన్ను విసిగించకు” అని మొహం చూడకుండా దుప్పటి ముసుగే సుకుని పడుకున్నాడు.
విశాల అతని అరుపుకి బిత్తరపోయింది. చేసేది ఏమి లేక తనకు ఇష్టమైన ఉప్మాని, అయిష్టంగా నోట్లో పెట్టుకుని మొత్తానికి తిన్నాననిపించింది.
ఇపుడు ఆమెకి ఏమీ అర్థం కావటం లేదు. టైం చూస్తే ఉదయం 11 గంటలు
కావస్తోంది. ‘లంచ్ టైం కావస్తోంది. ఆయన లేస్తే ఏం తింటారు? టిఫిన్ పెట్టాలా?
లంచ్ ఏకంగా చేస్తారా?’ ఆలోచనలతో సతమతమవుతూ, ఆమెకి బుర్ర తిరిగిపోయింది.
అన్నం, కూర, పప్పు, టొమాటో రసం రెడీ చేసి, టేబుల్ మీద పెట్టింది.
మధ్యాహ్నం 12 గంటలు కావస్తుండగా విష్ణు లేచాడు. అపుడు రెడీ అయి హాలులోకి వచ్చాడు.
“విశాలా! ఎలా ఉన్నావు?” అన్నాడు.
విశాల బేలగా చూస్తూ, “ఇదిగో ఇలా ఉన్నాను. మిమ్మల్ని టిఫిన్ కి పిలిస్తే గట్టిగా కోప్పడ్డారు.”
“అయ్యో! నాకు అసలు నువ్వు మాట్లాడిన ధ్యాసే లేదు. ఏం మాట్లాడానో కూడా గుర్తు లేదు. నేను, నువ్వు క్రొత్త టైమ్స్ కి అలవాటు పడాలి. నైట్ షిఫ్ట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. కానీ తప్పదు కొన్నాళ్ళు నిలద్రొక్కుకోవడానికి, ఎక్స్ పీరియన్స్ కోసం నీకు, నాకు ఈ పాట్లు తప్పవు.”
అప్పటికి విశాల అతని మాటలకు కన్విన్స్ అయ్యి, కూల్ అయింది. తరువాత తను చూసిన కోర్స్ గురించి చెప్పి, అందులో చేరాలనుకుంటున్నాను అని చెప్పింది.
“అలాగే, మంచి ఆలోచన. మనం ఇద్దరం వెళ్ళి కోర్సు గురించి కనుక్కుందాం”
అన్నాడు.
విష్ణు ఇంటి బయటకి వెళ్ళి, పోస్ట్ బాక్స్ లోంచి కవర్లు తీసుకుని, లోపలికి వచ్చాడు.
టెలెస్ట్రా కవర్ ఓపెన్ చేసాడు. అందులో మూడు అంకెల్లో ఉన్న బిల్ చూసి బిత్తర పోయాడు.
“మనకి ఇంత బిల్ ఎలా అయ్యింది. ఓ! రాణిగారు ఇండియాకి ఫోన్ కాల్ చేసారా?
విశాలా! నువ్వు కార్డ్ లోంచి ఫోన్ చేయటం లేదా?”
విష్ణు సడన్ గా అలా మాట్లాడుతుంటే, విశాల మైండ్ మొద్దుబారిపోయి, ఏమి అనలేకపోయింది.
విశాల నెమ్మదిగా మనసు మరల్చుకుని, పేపర్, పెన్ను చేతిలోకి తీసుకుంది.
* * * * *
(ఇంకా ఉంది)