ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 2

(ఒరియా నవలిక )

మూలం – హృసికేశ్ పాండా

తెనుగు సేత – స్వాతీ శ్రీపాద

          ముందు చెప్పిన సంఘటన జరిగిన ఏడాదిలోగా మరో కుటుంబం గమడా రోడ్ కి వచ్చి చేరింది. అది జహంగీర్ కుటుంబం. రాయపూర్ రైల్వే స్టేషన్ లో, అక్కడి నుండి వెళ్ళే  పాసెంజర్, గూడ్స్ ట్రెయిన్లలలో జహంగీర్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. రైల్ రోడ్ పాసెంజర్స్ వద్ద స్లిప్పర్లు, చెప్పులు, బాగ్ లు , సూట్ కేస్ లు కొట్టేస్తూ, తన జీవనోపాధి అయిన దొంగతనం అతను చిన్నతనంలోనే మొదలుపెట్టాడు. ఇరవై యేళ్ళు వచ్చేసరికి గూడ్స్ ట్రెయిన్ ల వాగన్లను పగులగొట్టే దశ చేరుకుని పెద్ద దొంగల ముఠా లీడర్ గా తయారయ్యాడు. ఒకసారి ఒక దొంగతనం చేస్తున్న సమయంలో ఆయుధాలు లేని రైల్వే గార్డ్ ను చంపేసాడు, ముందు కత్తితో పొడిచి, తరువాత తన దగ్గరున్న తుపాకి పేల్చి.

          ఆ హత్య చేసాక వేశ్యా వీధిలో పార్క్ చేసి ఉన్న సారాయి వ్యాపారి జీప్ దొంగిలించి తనకిష్టమైన పదహారేళ్ళ వేశ్యను తీసుకుని గమలా రోడ్డు చేరుకున్నాడు. పెషావర్ షాప్ కి వచ్చి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. పెషావార్ అతను ఇచ్చే సారాయి బదులు తనకు నచ్చినంత వరకూ తనతో ఉంచుకుందుకు అంగీకరించాడు. పైగా తన భార్య అని పరిచయం చేసిన వేశ్య పెషావర్ కి అతని కొడుక్కి కూడా పెద్ద వ్యామోహం అయి పోయింది. పెషావర్ భార్య మాత్రం రెండు కుటుంబాలు ఒకే కప్పుకింద ఉండటం అసాధ్యం అని గుర్తించి గోవింద భులియాతో మాట్లాడింది. రెండువందల రూపాయలు, కొంచం బెదిరింపుతో డీల్ సెటిల్ చేసి గోవింద తన షాప్ జహంగీర్ కు అమ్మేసాడు. గోవిందా పూర్వాశ్రమంలో లాగే చేనేత బట్టలు గ్రామ సంతలలో, లోకల్ ట్రెయిన్స్ లో అమ్ముకోడం మొదలు పెట్టాడు.

          జహంగీర్ అతని షాప్ లో బియ్యం, పప్పులతో పాటు నాటు సారాయి అమ్ముతూ పెషావర్ కలప వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు. సంపాదించిన డబ్బుతో ఇద్దరూ రైల్వే డిపార్ట్మెంట్ కు చెందిన వాడుకలో లేని భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఆ భూముల్లో కలప దుంగల గొడౌన్లు, కలప మిల్లులు, వాళ్ళ పనివాళ్ళకు అద్దెకివ్వడానికి ఇళ్ళు ఏర్పరచారు. 

          ఒక రోజున పెషావర్ ఎప్పటిలా తన దొంగ రవాణా కలప ట్రక్ తో వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. అతను దొంగతనం చేసిన ట్రక్ జాడ కాని అతని గురించి కాని ఎలాటి ఆచూకీ దొరకలేదు. పెషావర్ కుటుంబం అతని అదృశ్యంలో జహంగీర్ పాత్ర ఉందని నిర్ణయించుకోడంతో  రెండు కుటుంబాలు గొడవల్లో పడ్డాయి. అందువల్ల జహంగీర్ తన స్వంత కలప అక్రమ రవాణా వ్యాపారం మొదలుపెట్టాడు. అతని పిల్లలు కూడా చిన్న తనం నుండే ఈ వ్యాపారంలో చేరిపోయారు.

          రెండు కుటుంబాల వ్యాపారాలు సమాంతరంగా నడుస్తున్నాయి. 1965-70 మధ్య కాలంలో ముఖ్యమైన వృత్తి చెట్లు నరికి కలప అమ్ముకోడం. పది మంది కూలీలను మనిషికి పదిరూపాయల కూలి చొప్పున పిలిస్తే రెండు వందల రూపాయల దుంగలు డిపోలోకి తెచ్చేవారు. దుంగలు మిల్లులో కోసి ముక్కలుగా చేసాక వాటి ధర అయిదు వందల రూపాయలకు చేరేది. కాని ఒక్కోసారి పది రూపాయలు ముందుగానే తీసుకున్న కూలీలు ఒప్పుకున్నంత కలప తేలేకపోయేవారు. అందుకని వాళ్ళు తీసుకున్న ప్రతి వంద రూపాయలకు నెలకు పది రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉండేది.

          అదే సమయంలో ప్రతి డిపోలో దొంగ సారా వ్యాపారం సాగుతూ ఉండేది. ఈ వ్యాపారం కూడా ఈ రెండు కుటుంబాలు చేసేవి. అంతకు మునుపు గ్రామస్థులు తమ తమ ఇళ్ళలోనే సారాయి బట్టీలు పెట్టుకుని బియ్యంతో తయారు చేసుకునే వారు. ఇప్పుడు జహంగీర్ , జలంధర్ కుటుంబాలు ఎక్స్ సైౙ్ డిపార్ట్మెంట్ అధికారుల చేతులు తడిపి గ్రామస్థుల పై రెయిడ్ చేసి వారిని ఇబ్బంది పెట్టేలా చేసారు. చాలా మంది గ్రామస్థులు అరెస్ట్ అయ్యారు. దానివల్ల ఈ కుటుంబాల వ్యాపారం బాగా పుంజుకుంది. ఎక్స్ సైౙ్ డిపార్ట్మెంట్ ను అక్రమ సారాయి అమ్మకం నియంత్రించినందుకు అధికారులను ఎంతగానో ప్రశంసించి మెచ్చుకున్నారు. నాటు సారాయి అంటే శుద్ది చేసిన స్పిరిట్ కు రంగూ, నీరూ చేర్చడమే.

          ఇద్దరు కలప వ్యాపారుల నుండి సారాయి కొనడం వల్ల పనివాళ్ళు తీసుకున్న అడ్వాన్స్ డబ్బు ఎప్పటికీ చెల్లించలేకపోయే వారు. కాని వాళ్ళను మోసం చేస్తున్నారని ఎప్పుడూ నమ్మలేదు. డబ్బు వాళ్ళకు జీవితం కన్నా పెద్దదిగా అనిపించింది. మూడు రూపాయలు ఇచ్చే ఒక సంచీ మినుములు పండించడానికి నాలుగు నెలలు పట్టేది. ఒక రాత్రి చెట్లు నరికితే ఎనిమిది అణాలు వచ్చేవి. పదిహేను రోజుల పనికి మూడు రూపాయ లు వచ్చేవి. ప్రతి రోజూ చెట్లు నరకాల్సిన పని లేదు. పదిహేను రోజుల్లో ఆరు రోజులు నరికితే చాలు.

          ఇదంతా అవుతున్నా 1980 వరకు ఎలాటి ఆకలి చావులూ గమడాలో రికార్డ్ కాలేదు. నాకు అందించిన సాక్ష్యాలలో కూడా ఎలాటి ఆకలి చావు గురించిన సమాచారం లేదు.  ఆ సమయంలోనే విపరీతంగా చెట్లు నరకడం మొదలయినట్టు కనిపిస్తుంది. అప్పటి నుండే అక్కడ తక్కువ వర్షపాతం నమోదవడం మొదలయింది.

          ఆ సమయంలో చోటు చేసుకున్న మరో విశేషం కూడా చెప్పుకోదగ్గదే. గమడా రోడ్ టౌన్ షిప్ గా పెరుగుతుండటంతో మున్సిపాలిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది. జలంధర్, జహంగీర్ ఆ ప్రాంతంలో ఇన్నేళ్ళలో ప్రత్యేకమైన రాజకీయ విరోధులుగా సుస్థిరపడ్డారు.

          మరో మూడో మనిషి అక్కడ వాళ్ళకు సవాలు చెయ్యడానికి లేడు మరి. ఒకరు లీగల్ కౌన్సిల్ కి ఎన్నికయితే మరొకరు మున్సిపాలిటీ చెయిర్మన్. ఒకరు ఒక రాజకీయపార్టీకి చెందితే మరొకరు దాని శత్రుపక్షపు పార్టీకి చెందిన వారవుతారు. ఇప్పుడు కూడా ఇద్దరూ వేర్వేరు రాజకీయపార్టీలకు చెందిన వారే, వారి మధ్య కేటాయించిన రాజకీయ దూరం ఉంది. నాకు బాగా తెలిసినది ఇది.  వారి చరిత్ర కథనం వారికి కోపం తెప్పించవచ్చును. ఈ నివేదికను బాగా విమర్శిస్తారనీ నాకు తెలుసు. 

          గమడా గ్రామంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి, గమడా రోడ్ , చిన్న గమడా. గమడా రోడ్ ముప్పై కాంధ జాతి  కుటుంబాలతో కొండ మీద ఉన్న ప్రాంతం. వాళ్ళు బుడ్కా వంశానికి చెందిన వారు. ఇరవై, ఇరవై అయిదు కుటుంబాలతో , పాలవాళ్ళు, నేతగాళ్ళూ, గానుగ వాళ్ళు, కుల్థా కులానికి చెందిన రైతులు, బ్రాహ్మలు  ఉన్నది చిన్న గమడా ప్రాంతం. గమడా గ్రామం స్థానిక పంచాయతీ ఆఫీస్ చిన్న గమడాలో ఉంది.

          ప్రేమశిల తండ్రి ఒక బగువా. అంటే పవిత్రమైన పాటలు పాడే వాడు. అతను ఒక చేతిలో బ్రహ్మ వీణతో  గ్రామం నుండి గ్రామానికి  నడుస్తూ వరిగింజలతో అతను తయారు చేసిన దేవతను బాగ్ లో ఉంచుకుని పాటలు పాడేవాడు. అతను భీమాసిది -కాంధుల వంశవృక్షం గురించి, రామాయణం, భారతంలోని పిట్ట కథల గురించి పాడేవాడు. గతం లో స్థానికి భూస్వాములు, ముఖ్యులు అతని నివాసం, ఇంటిఖర్చులు, బహుమతులు, డబ్బు అన్నీ చూసుకునే వారు.  భూస్వామ్య విధానం చట్టం ఎత్తివేసాక అతను బీదవాడై పోయాడు. అప్పుడే కమ్యూనిటీ పెళ్ళిళ్ళ పేరమ్మ ధంగర మాజీ, పూర్ణా పెళ్ళి ప్రపోజల్ తీసుకుని వచ్చింది. ప్రేమశిలకు సోదరుడు లేడు. పాటలు, మతపరమైన సిద్దాంతాలు బగువా వృత్తికి చాలా పవిత్రమైనవి. తండ్రి నుండి ఈ రహస్యాలు, నిపుణత కొడుక్కి చేరతాయి, కాని కూతురికి సంక్రమించడం నిషేదం. ప్రేమశిల తండ్రికి కొడుకు లేడని అసంతృప్తిగా ఉండేది. ఇహ ఇప్పుడు భూస్వామ్య విధానం ఎత్తివెయ్యడంతో మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రేమశిల చక్కని సౌందర్యవతి. కష్టపడి పనిచేసే రకం. ఆమె తండ్రి పవిత్రమైన గానాలతో తిరుగుతుంటే ఆమె , ఆమె తల్లి ఉన్న కాస్త భూమిని చూసుకుంటూ అడవి పంటలను సేకరించే వారు.

          చెట్లు నరికే జనాలు అడవిని నగ్నంగా తయారు చేసాక ప్రేమశిల, ఆమె తల్లి దాదాపు రెండు ఎకరాల అడవి భూమిని చదును చేసి ముందు ఈ ఇద్దరు స్త్రీలు ఆ భూమిని తక్కువ దిగుబడినిచ్చే కొండభూమిగా , ఆ తరువాత మధ్య రకం పొలంగా , ఆ పైన వరికి అనువైన సారవంతమైన మాగాణిగా మార్చారు. ఆమె తండ్రి గనక కాస్త కాళ్ళు సారించి, మరికాస్త విముఖత నటించి ఉంటే ప్రేమశిల మరికాస్త మంచివాడిని పెళ్ళాడి ఉండేది. కాని ఆమె తండ్రికి మరికాస్త తిరిగి పెళ్ళికొడుకును వెదికే ఆసక్తి గాని, సమయం గాని లేకపోయాయి. అన్ని కార్యక్రమాలు- పెళ్ళికొడుకు ఎంపిక, పెళ్ళి కూతురి బేరం, వరి ధాన్యం తీసుకోడం, దోశలు తినడం,  ముళ్ళు వెయ్యడం, మొహాలు కడగడం, బంధువు లను కలవడం, పెళ్ళికూతుర్ని చెయ్యడం, నిశ్చితార్ధం, తదితర కార్యక్రమాలన్నీ యధా విధిగా జరుపుకున్నారు.

          పెళ్ళిపందిరి వెయ్యడం, అన్నం చికెన్ కర్రీతో విందు జరిగింది. అప్పటికి పూర్ణా  పీకలోతు అప్పుల్లో మునిగిపోయాడు. అప్పు చెల్లించేందుకు జహంగీర్, జలంధర్ సబ్ కాంట్రాక్టర్ లకు చెట్లు నరకడం మొదలుపెట్టాడు. కాని ఇచ్చే కూలి సరిపోడం లేదు. అందుకే సబ్ కాంట్రాక్టర్ భగర్తి దగ్గర వెయ్యి రూపాయలు అప్పు చేసాడు, ప్రేమశిల ఇంటికి వచ్చాక తొలి ఆషాఢానికి. వెయ్యి రూపాయల అప్పు మీద వడ్డీ నెలకు వంద రూపాయలకు చేరింది. అప్పు కట్టాక పూర్ణా దగ్గర మూడు వందలు మిగిలాయి. కొంచం బియ్యం, ఉప్పు, వంటనూనె కొన్నాడు. అతను ప్రేమశిలకు తను వెయ్యి రూపాయల అప్పు చెల్లించేందుకు ఖరారునామా చేసుకున్న కూలీనని, జీతం లేని పనివాడినని వివరించాడు.

          ఈ అప్పు అంతా దేనికో ప్రేమశిలకు అర్ధం కాలేదు. ఆమె తండ్రి ఎప్పుడూ అప్పులు చెయ్యలేదు. ఆమె తండ్రి పాడే పవిత్రమైన గానాల్లో ఒకటి భీముడిలా బలమైన శక్తి వంతుడు ఎలా దుర్భలమైన కుబేరుడికి బానిస కూలిగా మారాడో ఏకరువుపెడుతుంది.

          ప్రేమశిల ఈ ఉదంతం పూర్ణకు చెప్పి ఎలాగయినా శ్రమపడి అప్పు తీర్చెయ్యమని, ఇంటి సంగతి గురించి బాధపడొద్దనీ అతన్ని ఒప్పించింది.

          మళ్ళీ ప్రేమశిల అడవులకు తిరిగి వెళ్ళింది. వారం వారం సంతకూ వెళ్ళేది. సాల్ ఆకులు , టెండూ ఆకులు, పరిమళద్రవాలు, తేనె, అడవి పళ్ళూ , మామిడి కాయలు, పుట్టగొడుగులు ఏవి దొరికితే అవి ఏరుకుని తెచ్చుకుని సంతలో అమ్మేది.  ఎలాగోలా ఇల్లు నడిపించేది. ఏ విలువైనదీ దొరకని రోజున రెండు మోపుల కట్టెలు మోసుకువెళ్ళి స్థానిక సంతలో అమ్మేది.

          సెప్టెంబర్, అక్టోబర్ సమయానికి, అడవిలో బీడుగా ఉన్న ఖాళీ స్థలంలో కొండ ప్రాంతపునేలలో ప్రేమశిల సాగుచేసిన తక్కువ సమయపు వరిపంట ఇంటికి తెచ్చింది, ఆ సమయానికి ఆమె ఎనిమిది నెలల గర్భవతి. ఆమె రోట్లో వడ్లు దంచి, చెరిగి బియ్యం నిలవ చేసుకుంది. ఆ తరువాత లేవలేకపోయింది. అంటే మరిక అడవికి వెళ్ళలేక పోయింది. అయినా రోజూ అన్నమో, సిరి ధాన్యాలో , ఏవో ఒకటి వండేది.

          అలాగే ఒకరోజున అన్నం వండుతుంటే, ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ప్రేమశిల తల్లికి తెలియజేసారు. ఆమె వెంటనే వచ్చింది. ప్రసవం మామూలుగా జరిగింది. మగబిడ్డ పుట్టాడు. పుట్టిన ముప్పయ్యో రోజున అతని జుట్టు తీసే ఆనవాయితీ. పిల్లవాడికి పసుపు, నూనే మర్దనా చేసి స్నానం చేయించారు. ఎనిమిది మంది దేవత లకు, సంరక్షణ చేసే మాత జాడెన్ బుడాకు ముడి బియ్యం సమర్పించారు. ఒక కోడిని తీసుకు వచ్చారు. ప్రేమశిల తండ్రి వారి పూర్వీకుల పేర్లు చెప్తూ వెళ్ళాడు. అతను హృదానంద పేరు చెప్పగానే కోడి బియ్యాన్ని ముక్కుతో పొడిచింది. ఆ పిల్లవాడికి  హృదానంద అని పేరుపెట్టారు.

          విందు ముగిసాక, ప్రేమశిల తలిదండ్రులు వెళ్ళిపోయాక, పూర్ణ కొడుకును ఒక చేతిలో ఎత్తుకుని మరో చేత్తో అన్నం గరిటతో తిప్పుతున్నట్టు నటిస్తూ చెప్పాడు. తను భగర్తి వద్దకు వెళ్ళాననీ, అతనికి అప్పుపడిన వెయ్యి రూపాయలు చక్రవడ్డీతో కలిపి ఇప్పుడు రెండువేలకు పెరిగిందనీ. అతను బానిస కూలిగా, మామూలుగా చేసిన నానారకాల పనులకు మొత్తం కూలి, ఒక వెయ్యి రూపాయలే లెక్కకు వచ్చిందనీ, అంటే మరో వెయ్యి అదనపు అప్పు. ఆ అప్పు తీర్చే దారేమీ కనబడటం లేదు. అందుచేత ఒప్పందపు కూలీగా వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

          అతను చెప్పిన దానిలో చాలా మటుకు ఆమెకు ఏమీ అర్ధం కాలేదు. ఆమెకు అర్ధమయిందల్లా ఆమె భీముడిప్పుడు అప్పు వలలో చిక్కాడని. ఆమె వెంటనే గుండె ధైర్యాన్ని కూడదీసుకుని విసురుగా, తన బిడ్డను పూర్ణ చేతుల్లోంచి లాక్కుని బిడ్డకు పాలిస్తూ నిద్రలోకి జారుకుంది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.