ఆరాధన-2 (ధారావాహిక నవల)

-కోసూరి ఉమాభారతి

          ‘బే-పోర్ట్ ఆసియన్ కమ్యూనిటీ’ వారి ప్రతిపాదనకి అంగీకారం తెలిపాను. మియా ఆనందానికి అంతు లేదనడానికి నిదర్శనంగా కమ్యూనిటి హాల్ ని డాన్స్ మరియు యోగా స్టూడియోగా మార్చి, అవసరమయిన హంగులన్నీ కూర్చి ఓ అధునాతన బ్యాలెట్ స్టూడియోలా తయారు చేయించారు అభినవ్, మియా దంపతులు. ‘అర్చనా ఫైన్-ఆర్ట్స్’ (బే-పోర్ట్ ఆర్ట్స్ స్టూడియో) అని నామకరణం చేసి ఫ్లైయర్స్ వేసి, సోషల్ మీడియా మాధ్యమాల్లో పబ్లిసిటీ చేశారు. 

          నృత్యశిక్షణ మొదలు పెట్టే రోజున ఆలయం నుండి పంతులుగారు వచ్చి నా చేత ప్రారంభ పూజ చేయించారు. నూటయాభై మంది అతిధుల నడుమ నేను ఊహించని విధంగా.. మియా ఆధ్వర్యంలో సభాకార్యక్రమం నిర్వహించారు ‘బే-పోర్ట్ ఆసియన్ సొసైటి’వారు.

          తెలుగు అంత బాగా రాదన్న మియా.. అతిధులకి నన్ను పరిచయం చేస్తూ చక్కని తెలుగులో మాట్లాడింది.

          “ఈ నాటి మన నృత్యగురువు ఉమాభారతి గారికి, నృత్యం జీవన విధానం మాత్రమే కాదు. నృత్యం ఆమెకు ఆరాధనం, ఆధ్యాత్మకం కూడా. ఆమె ఓ కళా తపస్విని.  కళ వల్ల ఆమె సున్నితం. కళ వల్ల ఆమె స్పూర్తిదాయకం. నృత్యం లేక ఆమె లేదు.. ఆమె లేని నృత్యానికి సొబగులు లేవు.” అంటూ కరతాళ ధ్వనుల నడుమ క్షణమాగింది.

          “నేనెంతగానో అభిమానించే నాట్యభారతి ఉమాభారతి గారు మన యువతకి భారతీయ నృత్య శిక్షణతో పాటుగా యోగాభ్యాసన, హెరిటేజ్ క్లాస్ నిర్వహిస్తారు. ఈ రోజు మాత్రం అందరూ ఒకేసారి పాల్గొనవచ్చు.” అంటూ ఆమె తన ప్రసంగాన్ని ముగించాక, నాకు పట్టు శాలువలు కప్పి సత్కరించింది మియా.

          బే-పోర్ట్ అనేది ఓ అందమైన బీచ్ ప్రదేశం. ఆ బీచ్ చుట్టూ నిర్మితమైనదే పురాతన చక్కని ఊరు. దేశంలోనే  పేరున్న ‘బే-పోర్ట్ మెడికల్ యూనివర్సిటీ, రిసెర్చ్ సెంటర్ కాక పేరెన్నిక గల అతిపెద్ద మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులకు ‘బే-పోర్ట్ వైద్య నగరం’పుట్టిల్లు. బోలెడంత భారతీయ మేధా సంపత్తికి నట్టిల్లు. ఊరు చిన్నదే అయినా భారతీయుల సంఖ్య ఎక్కువే. 

***

          మొదటి క్లాస్ లో దాదాపు నలభై మంది చిన్న పెద్దా శిష్యులకు హస్త ముద్రలు నేర్పాను. మొదటి అడుగులు వేయించాను. శిష్యబృందంలో తెలుగు మూలాలున్న వారు కూడా ఎక్కువేనని గుర్తించాను. ఇక అందరితో నాలుగు యోగాసనాలు వేయించాను.

          మియా కూతురు తారని గమనించాను. తనకి ఆసక్తి ఉన్నా, అందరితో కలిసి డాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేయలేదు. నేనే తన వద్ద కూర్చుని, మాట్లాడి ప్రత్యేకంగా చేతి ముద్రలు పట్టించి, క్లాసు ముగించాను. 

          క్లాసులోని మాధురి అనే ఓ చిన్న పాపకి కొత్తగా చెవులు కుట్టించి చక్కటి పోగులు పెట్టారు. “చెవి నొప్పి” అంటూ ఆ అమ్మాయి అలుకబూనితే.. కూడా వచ్చిన తమ్ముడు “నేనూ డాన్స్ చేస్తాను” అంటూ మారాం చేయసాగాడు.  పిలిచి పక్కనే కూర్చో బెట్టుకుని, అందరినీ కాస్త దగ్గరగా వచ్చి కూర్చోమన్నాను.

          “మీకో చిన్న కధ చెబుతాను వినండి.” అంటూ నా చిన్ననాటి అనుభవం చెప్పనారంభించాను.

          “మాధురికి లాగానే నాక్కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. నేను వాడిని ముద్దుగా చూసుకునేదాన్ని. మా అమ్మ వెంటే ఉండి, తమ్ముడికి అన్నం తినిపించడం, ఆడించడం, నిద్ర పుచ్చడం చేసేదాన్ని.

          అమ్మ నన్ను చాలా మెచ్చుకునేది. “మా ఉమా ఎంత మంచిదో. తమ్ముణ్ణి  ప్రేమగా చూసుకుంటుంది.” అని అందరికీ నా గురించి గొప్పగా చెప్పేది.

          ఐదేళ్ళప్పుడు నాకు చెవులు కుట్టించారు. నొప్పి తెలియకుండా ఏదో ఆయింట్మెంట్ కూడా రాసింది అమ్మ. కాసేపటికి ఒకింత తగ్గినట్టు అనిపించినా, ఆ నొప్పికి  ఏడ్చి నిద్రపోయాను. 

          నేనైతే నిద్రపోయాను కానీ, నా పక్కనే అప్పటివరకు పడుకుని నిద్రలేచిన తమ్ముడుకి నా చెవి కున్న కొత్త వస్తువేదో కనబడుంటుంది. దాని సంగతేమిటో చూద్దామనుకున్నాడేమో. నా దగ్గర చేరి,  తన  చిటికిన వేలు నా  చెవికున్న రింగులోకి వేసి లాగడం మొదలెట్టాడు. ఏడ్చి అలిసిపోయి పడున్న నాకు, కాసేపటికి గాని వాడు చేస్తున్న పనికి నొప్పి తెలియలేదు…లేచి ఏడుపు లంకించుకుని గగ్గోలు పెట్టాను కూడా. 

          నా చెవికున్న రింగు నుండి వాడి వేలు రాదు… నాకేమో నొప్పి. అమ్మ పరుగున వచ్చింది. కాస్త కష్టపడి ఆ రింగు నుండి వాడి  వేలు వేరు చేయగలిగింది. 

          ఇంతకీ నేను చెప్పేదేమంటే, నాకు తెలియకుండానే, తమ్ముడి చేసిన పనికి వాడి మీద కోపం పెంచుకున్నాను. దాంతో ఎప్పుడూ మెట్లు దిగేందుకు వాడికి సాయం చేసే నేను .. ఓ రోజు ఎప్పటిలా చేయందించలేదు. వాడు అటు, ఇటూ తచ్చాడి, మరో మెట్టు దిగి, పాపం పడిపోయాడు. కాస్త దెబ్బలు తగిలాయి మరి. వాడికి సాయం చేయకూడదు అన్న ఆలోచనే తప్ప .. వాడికి దెబ్బ తగలాలని కాదు.

          అప్పుడు వాడికి రెండేళ్ళ వయసు. ఆ దెబ్బల వల్ల వాడి నుదిటి మీద గాయం కూడా అయింది.” అంటూ నేను చెబుతున్న ఆ చిన్ని విషయాన్ని ఆసక్తిగా వింటున్న స్టూడెంట్స్  వంక చూశాను. 

          కొద్ది క్షణాలాగి ఫక్కున నవ్వాను. వారూ నవ్వేశారు. “చెవులు కుట్టించుకున్న మాధురిని, తన తమ్ముణ్ణి చూసి నాకు నా విషయం గుర్తొచ్చి చెప్పాను. సరేనా.. ఇక పదండి మరి. నేనిచ్చిన ఫోల్డర్ లో ‘సంయుక్త – అసంయుక్త హస్త ముద్రలు బొమ్మలతో సహా ఉన్నాయి. ప్రాక్టీస్ చేయండి.” అంటూ క్లాస్ ముగించాను.

***

          బే-పోర్ట్ క్లాస్ మొదలయిన మూడు నెలల్లోనే , అక్కడి మెడికల్ స్టూడెంట్స్, గృహిణులు, పెద్దవాళ్ళు కూడా క్లాసులకి  రావడం మొదలు పెట్టారు. 

          ఏదైనా కళ అభ్యసించేందుకు  వయసుతో కానీ భాషతో కానీ నిమిత్తం లేదన్నది నా సిద్దాంతం. సంగీత నృత్యాలు .. మానసిక వికాసాన్ని కలిగించగలవు అన్న నమ్మకము ఉండబట్టే .. మియా ప్రతిపాదనకి ఒప్పుకుని .. ఒక నూతనత్వం కోసం కూడా నేను బే-పోర్ట్ లో నృత్య శిక్షణ మొదలుపెట్టాను.

          అందుకే, పెద్దవారిని కూడా శిష్యులుగా తీసుకున్నాను. వారంతా ఎంతగానో సంతోషాపడ్డారు. అనతి కాలంలోనే వారిలో కొందరు మంచి స్నేహితుల్లా మెలగ సాగారు కూడా.

          వారికి శిక్షణనివ్వడం ఓ కొత్త అనుభవంగానే కాదు కొంత ఛాలెంజ్ గా కూడా మారింది. జానపద నృత్యాలు, లలిత గీతాలకి నృత్యాలు నేర్పసాగాను. వారు మురిసి పోతూ సంతోషంగా నాట్యం చేస్తుంటే, నాకు ముచ్చటేసింది. ఈ విధంగా పెద్దవారికి కూడా శిక్షణ ఇస్తున్నందుకు.. డాన్స్ కమ్యూనిటి నుండి కొంత విమర్శకి కూడా గురయ్యాను.

          ఇక తార విషయానికి వస్తే, మెల్లగా క్లాసుల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. అందరితోనూ ముక్తసరిగానే ఉంటుంది. మియా మాత్రం ప్రతిసారీ నాకు ప్రత్యేకంగా తయారుచేసిన భోజనం తీసుకుని లంచ్ సమయానికి వస్తుంది. ఆమె చక్కగా నృత్యం చేయగలగడం చూసి ఆనందించాను. తన ఆరోగ్యం మాత్రం సున్నితంగానే ఉందని చెప్పింది.

          ‘హెరిటేజ్ హౌర్’ (సంప్రదాయం తరగతి) లో నేను చెప్పే నృత్యేతర విషయాలు పట్ల పిలలు, పెద్దలు కూడా ఆసక్తి కనబరచారు. వారే ప్రశ్నలు వేస్తారు. చాలా మటుకు నా నృత్య శిక్షణ, కళాజీవనంలోని అనుభవాలు, నేను నటించిన సినిమాల గురించి అడుగుతుంటారు.

          ఆదివారం క్లాస్ కి చీరకట్టులో సంప్రదాయంగా తయారయి, వెళుతుంటాను. భారతీయ చీర కట్టు, బొట్టు, కట్టుబాట్ల గురించి అవకాశం కల్పించుకుని మాట్లాడుతూ, రామాయణ భారత భాగవతాల నుండి నృత్యానికి సంబంధించిన అంశాలను కధలుగా చెప్పగలగడం కూడా బాగానే ఉందనిపించింది.

          ఐదేళ్ళకే మొదలయిన నా కళాజీవన ప్రస్థానం గురించి వారికున్న ప్రశ్నలకి తగ్గ జవాబులు.. శిష్యులకి స్పూర్తిదాయకంగా ఉండేలా.. విషయాన్ని మలచి చెప్పడం చేయసాగాను.

***

          మళ్ళీ ఆదివారం మొదటి క్లాసు ముగియగానే మియా ఎప్పటిలా లంచ్ తీసుకుని వచ్చింది. ఆమెతో పాటు ఓ పెద్దావిడ కూడా ఉన్నారు. తన తల్లి వాసుదేవి అని, ఇండోనే షియా నుండి వచ్చారని పరిచయం చేసింది మియా. ఓ నెలరోజులపాటు ఉంటారట.  నాతోపాటు లంచ్ చేశారు ఆ తల్లీకూతుళ్ళు.

          వాసుదేవి గారి మాటలని బట్టి, మియా తన ఏకైక సంతతి అని, చదువులోనే కాక, హిందుస్తానీ సంగీతం, ఒడిస్సీ నృత్యాలలోనూ శిక్షణ పొంది, బాగా కృషి చేసేదని, పెళ్ళి  అవగానే అన్నీ మూలబడ్డాయని కొంత వాపోయింది. మనమరాలు తార అయినా ఒక నృత్యకారిణి అవుతుందన్న తన కల నెరవేరేనో లేదో…అని దిగులు పడింది. మియా ఆరోగ్యం కూడా తనకి ఆందోళనకరంగా ఉందంటూ కన్నీళ్ళ పర్యంతమైంది.. మియా తల్లి వాసుదేవి.

          “ఆ దేవుని దయతో అంతా బాగుంటుంది లెండి వాసుదేవి గారు.” అన్నాను..

***

          మరో నాలుగు గంటల పాటు జరిగిన క్లాసులు, తోటివాళ్ళతో తార నృత్యాభ్యాసన, హస్త ముద్రలు పట్టి వాటి పేర్లు పలకడం కూడా తిలకించి తృప్తి చెందారు వాసుదేవి.

          తరువాతి కార్యక్రమంగా ఛాయ్ సేవించి, హెరిటేజ్ సెషన్ మొదలెట్టాను.

          అప్పటికే భరతనాట్యం అభ్యసించిన శిష్యురాళ్ళకి ‘గణేశ పంచారత కీర్తన’ మొదలెడతానని ప్రకటించి.. ముందుగా నేను కీర్తనని ఉచ్ఛరించి.. చిన్నా పెద్దా అందరితో పలికించాను. ప్రతి పదానికి అర్ధం చెప్పి, వినాయక చరిత్ర క్లుప్తంగా వినిపించాను.‘గణేశ పంచరత్నం’ ఆంగ్లంలో ముద్రించిన కాగితాలు పంచాను. 

          వాసుదేవి గారు తిరిగి వెళ్ళేలోగా మాతృదినోత్సవ వేడుక సందర్భంగా క్లాస్ లోని వారంతా డాన్స్ చేస్తే బాగుంటుందని అన్నది మియా.

          చూద్దాం’ అన్నట్టుగా నవ్వి ఊరుకున్నాను.

          నా దృష్టంతా సీనియర్ స్టూడెంట్ వైదేహి మీదే ఉంది. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మసులుకునే వైదేహి క్లాసుకి వచ్చినప్పటి నుండీ ముభావంగా, దిగులుగా ఉండడం గమనించిన నేను,  క్లాస్ అయ్యాక ఐదు నిముషాలు ఉండమని టెక్స్ట్ మెసేజ్ పెట్టాను.

          క్లాస్ ముగిసి మిగతా అందరూ వెళ్ళాక వైదేహి, నేను మిగిలాము. నాతో స్నేహంగా మెలిగే వైదేహిని సంకోచం లేకుండా.. తన ముభావానికి కారణం అడిగాను. కాసేపు మౌనం, కాసేపు దుఖంగా సాగింది ఆమె పరస్థితి. 

          ఇంకొద్దిసేపటికి  తేరుకున్న వైదేహి చెప్పినదాన్ని బట్టి.. ‘ఆమె తల్లితండ్రులు విడిపోతున్నారని, తల్లి విడిగా వేరే ఫ్లాట్ లో ఉంటుందని, కాన్సర్ వ్యాధితో క్షీణిస్తున్న తండ్రి ఆరోగ్యం గురించి.. ఆ అమ్మాయికి ఆందోళనగా ఉందని ఆర్ధమయింది.  అదే సమయంలో తన స్నేహితుడు వరుణ్ తో మనస్పర్ధల కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనయిందని కూడా ఆర్ధమయింది.

          వైదేహి భుజం పై చేయి వేసి, “బాధగా ఉందమ్మా.. నీ పరిస్థితి. ఏమనాలో తోచడం లేదు. ఏమైనా నీవు చాలా మనోధైర్యం ఉన్నదానివి. పార్ట్-టైమ్ పని చేసి కుటుంబానికి సాయపడుతున్న అమ్మాయివి. ఇటువంటి క్లిష్ట సమయాల్లో మరింత నిబ్బరం అవసరం.  ఓపికగా ఉండు. పరిస్థితులు మెరుగుపడతాయి.” అంటూ ఆమెని సముదాయించాను.

***

          ఇంటికి డ్రైవ్ చేస్తూ ఆలోచనలో పడ్డాను.  వైదేహి తల్లి మాలిని సౌమ్యురాలు. చాలా అందంగా ఉంటుంది. నర్స్ గా పని చేస్తుంది. తన తల్లి గురించి ప్రస్తావిస్తూ..ఓ మారు తమ కుటుంబ విషయాలు నాతో పంచుకుంది వైదేహి. నిజానికి .. మాలిని తన కన్న తల్లి కాదని, స్వంత పిన్నమ్మ అని చెప్పింది. తాను పుట్టిన నెలకే అనారోగ్యంతో తన కన్నతల్లి చనిపోయినప్పుడు.. కుటుంబ వొత్తిడి మూలంగా .. భార్య చనిపోయిన బావగారిని వివాహం చేసుకుందట మాలిని. తన పట్ల, తన తండ్రి పట్ల .. పిన్నమ్మ చాలా బాధ్యతగా, ప్రేమగా వ్యవహరిస్తుందని కూడా చెప్పింది. 

          మరి ఇంత కాలానికి భర్తని, కూతురుని వదిలిపోవడానికి మాలినికున్న కారణాలు ఊహించలేకపోయాను.

          మియా, ఆమె భర్త అభినవ్ కూడా .. కమ్యూనిటీలో అందరికీ సాయపడుతుంటారని గుర్తొచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఎందరినో ఆదుకుంటారని, తమ ఫుడ్ బిజినెస్ కి సంబంధించిన మార్కెట్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తుంటారని కూడా చెప్పుకోడం తాను విన్నది. మియా కలగజేసుకుని మాలిని వాళ్ళ పరిస్థితిని చక్కబరచగలదేమో’ అను కున్నాను.

          ఇకపోతే,.. మాతృదినోత్సవ వేడుకల్లో శిష్యుల చేత నృత్య ప్రదర్శన చేయించమని మియా సూచించడం నన్ను ఇబ్బందికి గురిచేసింది. క్లాసు మొదలుబెట్టిన ఆరు నెల్లకే వేదిక పై ప్రదర్శన చేయించడం సాధ్యం కాని పని. పద్దతి లేకుండా ఎలా డాన్సులు చేయించాలి? ఎలా నిర్వహించాలి?’ అనుకుంటూ ఇల్లు చేరాను.

*****

Please follow and like us:

One thought on “ఆరాధన-2 (ధారావాహిక నవల)”

  1. మియా ఆరోగ్య పరిస్తితి తలుచుకుంటే అయ్యో అసలు తార సంగతి ఏమవుతుంది అనిపిస్తోంది. బాగుందండి.

Leave a Reply

Your email address will not be published.