కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-20

శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం

 -డా. సిహెచ్. సుశీల

          ” అనుమానాస్పదమైన జీవితం ఎప్పుడూ సుఖవంతం కాదు నిష్కలంకమైన హృదయాలు కలవటానికి అవకాశం ఉంటుంది కానీ పవిత్రత ఏమాత్రం లోపించిన హృదయాలు విడిపోతాయి దాంపత్య జీవితం సందేహాస్పదమైన దృష్టిలతో అనుమానం తో కూడిన అడుగులతో నడవలేదు”
 
          నిఖార్సైన ఒకలాంటి ‘స్టేట్ మెంట్’ తో ప్రారంభమైన “ఒడిదుడుకులు ” అనే ఈ కథ శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం 1951, మార్చి లో కిన్నెర పత్రికలో రాసారు.
 
ఒడిదుడుకులు
 
“అనుమానాస్పదమైన కాపురాలు” నిలబడవు, పరస్పర  నమ్మకం ముఖ్యమని 1951 లోనే‌- అంటే దాదాపు 74 ఏళ్ళ క్రితమే ఒక స్త్రీ పాత్ర ద్వారా కథా ప్రారంభంలోనే ధైర్యంగా పలికించారు రచయిత్రి.
 
          శారదకు తన పద్దెనిమిదో యేట రమేష్ తో వివాహమైంది. అతనంటే ఇష్టంతోనే వివాహం చేసుకుంది. ఎన్నో ఊహాసౌధాలు నిర్మించుకుంది. ఆశాపూరిత హృదయంతో వాటిలో సుఖావాసం చేయాలని మనసారా కోరుకుంది. కానీ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితం గడిపిన తర్వాత ఆ సౌధాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. 
 
          ఇక్కడ రచయిత్రి  అద్భుతంగా అంటారు – ” కూలిపోయినందుకు కాదు, కానీ కూలిపోయిన కారణాలకు బాధపడుతుంది”.  నిజమే. కాపురం కూలిపోయిన గాయం కంటే, దాని నేపధ్య కారణం మరింత “నొప్పి” ని కలగజేస్తుంది ఆత్మాభిమానం గల మగువకు. తన ప్రమేయం లేకుండా, తన తప్పు లేకుండా కాపురం విచ్ఛిన్నమయితే ఏ స్త్రీ మాత్రం బాధపడదు! ఎంతో ప్రేమతో, నమ్మకంతో, పరస్పరావగాహనతో, అన్యోన్య దాంపత్యం నెరపాలని ప్రతి భార్యా కోరుకుంటుంది. సంసారంలో తానెంత నిజాయితీగా వుంటుందో భర్త కూడా అంతే నిజాయితీగా ఉండాలని ఆశించడం సహజం. దానికి బీటలు వారినప్పుడే ఆమెలో కోపమో, రోషమో, తగిన బుద్ధి చెప్పాలన్న ఉక్రోషం కలగడమో కలగడంలో ఆశ్చర్యం లేదు.
 
          అష్టవర్షా భవేత్ కన్యా అని దృఢంగా నమ్మిన కాలంలో ఎనిమిదేళ్ళు రాకముందే పెళ్ళిచేసేసే కాలంలో, భర్తే దైవం, సంసారమే స్వర్గం అనే సమాజంలో, భర్త ఏం చేసినా ఎదురుచెప్పకూడదు అనే కుటుంబంలో ఉన్న స్త్రీ సంగతి ఏమో కానీ, శారద ఇంటర్మీడి యట్ చదువుకున్నది. పెళ్ళి అయినా ఉద్యోగం చేయాలని కోరుకున్నది. కానీ ఆమె కోరుకున్నది జరుగలేదు.  “మన దేశంలో స్త్రీ స్వాతంత్య్రం ఒక వింత నిఘంటువులో బంధింపబడి ఉంది. భర్త తనకిష్టం ఉన్నంత వరకు తన భార్యకు స్వేచ్ఛనిస్తాడు. తనకిష్టము లేకపోతే లేదు” అని అనుకున్నది. ” అయినా స్వాతంత్రం ఒకళ్ళు ఇస్తే వచ్చేదా” అని కూడా అనుకుంది. ఏది ఏమైనా భార్య చేత ఉద్యోగం చేయించి మగ వాళ్ళందరి ఎదుట తిప్పించటం రమేష్ కిష్టం లేకపోయింది అందుకనే శారద అల్లిక పనిచేసుకుంటూ గృహమనే “పవిత్ర స్వర్గం”లో కూర్చుండి పోయింది. భర్త ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ప్రేమతో పంపడం, తిరిగి వచ్చినప్పుడు స్నేహంతో ఆహ్వానించడం చేసేది. ఆయన లేనప్పుడు కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని అల్లిక పని చేసుకుంటూనో, పుస్తకం చదువుకుంటూనో  గడిపేది. ‘ఆనందంగా ఉన్నామనే’ అనుకునేది.
 
          ఒకరోజు భర్త తన ఆఫీసులో పని చేసే స్నేహితురాలిని టీ కి పిలుస్తున్నానని, తగిన ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించి వెళ్ళాడు. ఏర్పట్లన్నీ చేసి యధా ప్రకారం కిటికీ దగ్గర కూర్చిని బయటకు చూస్తుంటే, ఎదురింటి ఇరవయ్యేళ్ళ యువకుడు తననే చూస్తుం డడం గమనించింది. ఆమె చూడగానే పలకరింపుగా నవ్వాడు. అతనెవరో శారదకు తెలీదు. ” కానీ ఎందుకు నవ్వాడో తెలిసింది”. గట్టిగా నవ్వాలనిపించింది. బలవంతాన ఆపుకుని చిరునవ్వు నవ్వింది. దాంతో అతనికి ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్టుంది, ఒక ఉత్తరం రాసి నౌకరు చేత పంపాడు. చదివిన “శారద అసహ్యంతో ముఖం తిప్పేసు కుంది”. ఇంతలో ఏదో ఆలోచించుకుని, తను కూడా చీటి రాసి పంపింది – టీ కి రమ్మని. అది చూసుకుని అతను వచ్చేసాడు.
 
          “కొద్దసేపటిలో నా భర్త కూడ వస్తారు, కూర్చోండి” అంది. అతని ముఖం వెలవెల బోయింది. ఆమె వైఖరి అంతుబట్టలేదు.
 
          ఇంతలో రమేష్, అతని స్నేహితురాలు వచ్చేసారు. కొత్త వ్యక్తిని చూసి ఆశ్చర్య పోతున్న భర్త చేతిలో ఆ యువకుడు రాసిన ఉత్తరం ఉంచింది. రమేష్, అతని స్నేహితు రాలు విస్మయసాగరంలో మునిగిపోయారు. యువకుడు బిత్తరపోయాడు. 
 
          రమేష్ కోపం అవధులు దాటింది. నిర్లజ్జగా ఉన్న ఆమె ప్రవర్తనకి అసహ్యించు కున్నాడు. ముగ్గురి ముఖాల్లో మారుతున్న భావాలను పరీక్షిస్తున్నట్టు చూస్తోంది శారద.
 
          చిరునవ్వు నవ్వింది. దాంతో రమేష్ కి నిప్పులో నెయ్యి పోసినట్టయి, కోపంతో అరిచాడు – ” సిగ్గు లేదా ఇంత అసహ్యంగా ప్రవర్తించటానికి”! అని.
 
          ఆ స్నేహితురాలి వైపు చూస్తూ శారద “మిమ్మల్ని ఇక్కడకు టీ కి రమ్మని లెటర్ రాసారు కదూ” అంది. ముఖమంతా కందగడ్డ లా చేసుకొని ” ఇంటికి పిలిచి నీ భార్యచే అవమానిస్తావా” అందామె. “అతిథిని గౌరవించాలని తెలీదా” అన్నాడు రమేష్ ఉగ్రుడై. శారద శాంతంగా “తెలుసు. అందుకే నేను నా అతిథిని టీ కి పిలిచాను” అంది. అనుకోని ఎదురుదెబ్బకు స్తబ్దుడై, తర్వాత గట్టిగా అరవడం మొదలెట్టాడు. 
 
          “అతనిలోని పురుషత్వం అధికారం చలాయించమని అతన్ని ప్రోత్సహించింది. అందుకే “నేను సంపాదిస్తున్నాను. నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి నాకు అధికారం ఉంది” అన్నాడు.
 
          “అవును నాదే పొరపాటు. మీ మాటలకు మోసపోయి ఉద్యోగం మానుకున్నాను. నేను కూడా ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉంటే మీరు ఇలా మాట్లాడేందుకు అవకాశం ఉండేది కాదు. ఇక నేనూ  ఉద్యోగం చేస్తాను. నాకు స్వాతంత్రం వస్తుంది. అప్పుడు నా అతిధిని భోజనానికి కూడా పిలుచుకోవచ్చు” అంది. 
 
          రమేష్ కోపంతో స్నేహితురాలితో బయటకు వెళ్ళిపోయాడు. యువకుడు నిలబడి ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. శారద తన ఎందుకు పిలిచిందీ కొంచెం కొంచెం అతనికి అర్థం అవుతోంది. ఆమె అతడు రాసిన లేఖను ముక్కలు ముక్కలు చేసేసింది.  “మీ మగవాళ్ళు మూఢులు. స్త్రీ నవ్వినా ఆ నవ్వుకి పెడ అర్ధాలు తీసి ఆమెను నాశనం చేయాలని చూస్తారు. వాళ్ళల్లో నువ్వు కూడా ఒకడివి” అంది నిర్దాక్షిణ్యంగా. శారద మాటల్లోని అంతరార్థం యువకుడికి నెమ్మదిగా బోధపడింది. ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు.
 
          అంతే. ఆ రోజు నుండి శారద ఒంటరిగా తన జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది. ఉద్యోగం చేసుకుంటోంది. కానీ ఆమె హృదయం చాలా గాయపడింది. తాను తప్పు చేయ లేదని గట్టిగా నమ్మినా, తొందర పడ్డానేమో అని ఒకోసారి అనుకోసాగింది. ఏ విషయాన్ని నిశ్చయించుకోలేక మధనపడసాగింది.
 
          కథ చివరిలో రమేష్ మనసులో పశ్చాత్తాపం కలిగి, అతను తిరిగి రావడం, క్షమాపణ కోరడం, కాఠిన్యం వహించలేక ఆమె ఒప్పుకోవడంతో ముగింపు చేసారు రచయిత్రి. కానీ 
“ఆమె జీవితం లో జరిగిన ఈ దుఃఖ ఘటన వల్ల ఆమె హృదయానికి తగిలిన గాయం మానింది – కానీ మచ్చ మాత్రం పోలేదు. జీవితంలో ఉండుండి ఆ ఘటన గుర్తుకు వస్తూనే ఉంది. కానీ ఈసారి ఆమె ఉద్యోగం చెయ్యడం మాత్రం మానుకోలేదు” అన్న పలుకులతో ముగించడం అద్భుతం.
 
          ఇంత అభ్యుదయ భావాలతో, చైతన్య వంతమైన శారద లాంటి స్త్రీ పాత్రను ‌సృష్టించిన రచయిత్రి – ఒక్కరోజు భర్త తన స్నేహితురాలిని  టీ కి పిలిస్తేనే శారద ఇంత నాటకం ఆడాల్సిన సన్నివేశాన్ని కల్పిస్తారా! ఇంతేనా శారద వ్యక్తిత్వం! వానాకాలపు చదువు కాక, ఇంటర్మీడియట్ చదువుకున్నది. ఉద్యోగం చేయాలని కోరుకున్న ఉత్సాహం కలది. భర్తకు ఇష్టం లేకపోవడంతో సమాధాన పడి, సంతోషంగా సంసారాన్ని చిరునవ్వుతో సాగించగల నేర్పరి. ఖాళీగా కూర్చోక, చుట్టు పక్కల వారితో బాతాఖానీ వేయక, అందంగా అల్లికలు చేసుకునే కళా హృదయ. ఆసక్తి గా పుస్తకాలు చదువుకునే సంస్కారవంతురాలు. అలాంటి శారద ఒక్కరోజు భర్త తన స్నేహితురాలిని టీ కి ఆహ్వానిస్తే అపార్థం చేసుకునే కుంచిత మనస్కురాలు కాదు. బహుశా ఇలా చాలా సార్లు జరిగివుండవచ్చు. ఆ విషయం రచయిత్రి వాచ్యంగా చెప్పక పాఠకుల ఊహకు వదిలారు. పైగా ” మిమ్మల్ని టీ కి రమ్మని లెటర్ రాసారు కదూ” అంటే – అతను గతంలో ఇలా పిలవడం జరిగిందని తెలుస్తోంది. “లెటర్ రాసారు కదూ” అనడం చూస్తే అతను ఆడవారికి లెటర్స్ రాస్తాడని ఆమెకు తెలుసు అనుకోవాలి.
 
          అదే సమయంలో ఎదురింటి కుర్రాడు ( తన కంటే ఆరేళ్ళు చిన్నవాడు) నవ్వడం, ఉత్తరం రాయడం అవకాశంగా తీసుకుంది. అతగాడు ఉత్తరంలో ఏం రాసాడో కానీ ఆమె “అసహ్యంతో ముఖం తిప్పేసుకుంది” అనడం వల్ల అతనూ ఏదో అసభ్యంగా రాసాడని తెలుస్తోంది. మగవాడు పలకరింపుగా నవ్వినా కూడా స్త్రీ చిరునవ్వు నవ్వకూడదు. మర్యాద కోసం మొహమాటంగా నవ్వితే, వెంటనే చులకనగా తీసుకుని ధైర్యంగా ఉత్తరం రాసేస్తారు. ఇతగాడికీ బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ నాటకంతో బుద్ధి చెప్పింది.
 
          1951 లో రచయిత్రి వాశిరెడ్డి కాశీరత్నం ‘శారద’ లాంటి ఆదర్శప్రాయమైన పాత్రను ‌సృష్టించారు.
 
          ఆమె రచించిన ఇతర కథలు –  ఆడబోయే నాటకం, ఇది నా తప్పు కాదు, ఎవ్వరిదీ పాపం, ఏరాడ కొండ కరిగింది, గంగ జాతర నాడు, గాజు పెంకులు, గూడు లేని పక్షులు, చిగిర్చన వసంతం, చేతనాచేతనాలు మొదలైనవి కిన్నెర, విశాలాంధ్ర, జ్యోతి, ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక తెలుగు స్వతంత్ర వంటి పత్రికలలో ప్రచురించబడ్డాయి.
 
          కాశీ రత్నంగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. హిందీ పండిట్, కవయిత్రి, గాయని, రచయిత్రి, రాజకీయ నాయకురాలు, ‘మహిళా విజయం’ పత్రిక ను 16 ఏళ్ళు నడిపిన ఎడిటర్ , జర్నలిస్టు, సామాజిక పరిశోధకురాలు, నిత్య చైతన్య శీలి. తానా వంటి సభల్లో పాల్గొని తెలుగు భాషా సాహిత్యాలు గురించి ప్రసంగించారు. 
 
          సేవకు పర్యాయపదం ఆమె. నాలుగేళ్ళ వయసులో గాంధీ గారిని చూసారామె.
15 ఏళ్ళ వయసులోని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారం రోజులు జైల్లో ఉన్నప్పుడు గొంతెత్తి దేశభక్తి పాటలు పాడుతుంటే ఖైదీలతో పాటు పోలీసులు వచ్చి వినేవారు.  సినీ నటి సావిత్రితో కలిసి మద్రాస్ రేడియోలో పాటలు పాడటం ఒక ప్రత్యేకత. ఎన్టీఆర్ హయాంలో పార్టీ మహిళా విభాగానికి కార్యదర్శి గా మూడేళ్ళ పాటు సమర్ధవంతంగా పని చేసారు. 1988 లో ‘నంది ఉమెన్స్ అసోసియేషన్’ స్థాపించి మహిళల్లో చైతన్యం నింపారు. ఎన్నో రకాల వృత్తి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. హెల్త్ క్యాంపులు, పోలియో ప్రత్యేక క్యాంపులు, ఐ క్యాంపులు నిర్వహించడం, అంగన్ వాడీ పాఠశాల ఏర్పాటు వంటి అనేక చైతన్య వంతమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నో వ్యాసాలు, కథలు, నవలలు రాసి, ఎన్నో  అవార్డులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుని సేవాపధంలో జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అభిలాషించే కాశీరత్నంగారి జీవితం ఎంతైనా ఆదర్శ నీయం. అనుసరణీయం. ఉన్నతమైన, ఉత్తమమైన కాశీరత్నం గారి జీవన యానాన్ని షేక్ హసీనా అక్షరబద్ధం చేసి పుస్తకం గా వెలువరించారు.
 
          కాశీరత్నంగారి పుస్తకావిష్కరణ సభలో లోక్ సత్తా వ్యవస్థాపకులు డా. జయప్రకాష్ నారాయణ, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారితో పాటు పాల్గొన్న ఈనాడు ఎడిటర్ ఎం. నాగేశ్వరరావు మాట్లొడుతూ ” కుటుంబమంతా కలిసికట్టుగా ఉండేలా తీర్చిదిద్దడంతో పాటు పిల్లలకు ( ఇంద్రాణి, మైత్రేయి, పద్మ) మంచి విలువలు నేర్పిన కాశీరత్నంగారు మహిళల సమగ్రతకు మారుపేరు” అని ప్రశంసించారు. 

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us: