కొత్త రుతువు

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– ఎమ్.సుగుణరావు

          సూర్యకళ ఆ మన్యం ప్రాంతంలో ఆ సాయంకాలం పూట వాకింగ్‌కు బయలు దేరింది. చుట్టూ కొండలు. ఆ కొండల మీద నుంచి దిగుతోన్న పశువుల మందలు. ఆకాశం లో తేలిపోతోన్న నీలి మబ్బులు. ఆ వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉన్నా, ఎందుకో సూర్యకళ మనసులో మాత్రం ఏదో ఆందోళన, అపరాధభావం. తను ఆ మన్య ప్రాంతం లోని ఆ ఊళ్ళో ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారిగా జాయిన్‌ అయ్యింది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన తర్వాత మూడేళ్ళు పల్లె ప్రాంతంలో పని చేయాలి అనే ప్రభుత్వ నియమాలు ప్రకారం తను ఆ ఊళ్ళోని ఆసుపత్రిలో చేరింది. చాలా మంది భయపెట్టారు. ఇంట్లోవాళ్ళయితే మరీనూ!

          ‘‘సిటీలో పెరిగినదానివి. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎలా నెగ్గుకొస్తావో’’ అంటూ తనను వెనక్కి లాగారు. అయినా తను ఈ పళ్లెటూరులో ఉండడం పెద్ద సాహసంగా భావించ లేదు. ఇది మరీ మారుమూల కుగ్రామం కాదు. చీమలు దూరని చిట్టడవి కాదు. శతృ నిర్బేధ్యమైన కీకారణ్యం కాదు. ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. కావాలసినవన్నీ దొరుకు తాయి. ఒక సినిమా హాలు కూడా ఈ మధ్యనే నిర్మించారు. మండల రెవిన్యూ అధికారి కార్యాలయం, పశువుల ఆసుపత్రి, ఎలిమెంటరీ స్కూలు ఉన్నాయి. ప్రతీ వారం సంత జరుగుతుంది. వంద కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం. ఇక దిగులుపడవల్సిన పనే ముంది? మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే తను మెడికల్‌ కాలేజీలో ఫేకల్టీ విభాగంలో చేరవచ్చు. ఈ పల్లెటూరులో తనకు ఇదో మంచి అనుభవం. ఏ రకమైన కాలుష్యం లేని ప్రదేశం. ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. తను వచ్చిన ఈ నెల రోజుల్లో ఊరివాళ్ళతో తనకు చెలిమి ఏర్పడింది. తనను బాగా ఆదరిస్తున్నారు. పాలు తెచ్చే వాళ్ళు, పెరుగు తెచ్చేవాళ్ళు, ఇంకా కూరగాయలు, ఆకుకూరలు తెచ్చిపెట్టేవాళ్ళు. ఇక ఇంటర్నెట్‌ సదుపాయం కూడా ఉంది. అయితే ఇక్కడున్న కొండ ప్రాంతంలో గిరిజనుల సాంప్రదాయాలు, నమ్మకాలు మాత్రం తనను కలవరపెడుతున్నాయి.

          ఆ రోజు ఉదయం జరిగిన ఆ సంఘటన తనకు గుర్తొచ్చినప్పుడల్లా మనసు బాధతో మెలికలు తిరుగుతోంది. కారణం` తను ఒక అబద్ధం చెప్పింది. సాధారణంగా తనకు అబద్ధాలు చెప్పడమంటే భయం. సాధ్యమైనంత వరకు నిజాలే మాట్లాడుతుంది. అబద్ధం చెబితే వచ్చే కష్టనష్టాలు తనకు తెలుసు. అబద్ధం చెప్పినపుడు గుండె వేగంగా కొట్టుకుంటోంది. తనకు అదే జరిగింది. ‘అయ్యో, ఎందుకు చేశానా ఆ పని?’ అనుకుంది. అయితే ఆ అబద్ధం చెప్పడం వెనుక ఒక కారణం ఉంది. ఒక హేతువు ఉంది. ఉదయం జరిగిన ఆ ఉదంతం అంతా గుర్తుకొచ్చింది సూర్యకళకు.

* * *

          ఉదయం పది అయ్యింది. ఇంటి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వచ్చింది ఆసుపత్రికి. ఇంటికి అర ఫర్లాంగ్‌ దూరంలో ఉంటుంది ఆసుపత్రి. దాని ప్రక్కనే మండల రెవిన్యూ అధికారి గారి ఆఫీసు. తను రాకమునుపే ఆసుపత్రిని శుభ్రంగా తుడిచి, కడిగి ఆసుపత్రిలో బెంచీ మీద కూర్చుంది పారమ్మ. కాంపౌండరు, నర్సు లోపల అంతకు ముందు వచ్చిన మందుల ప్యాకెట్లు సర్దుతున్నారు. తనను కలవడం కోసం వచ్చిన రోగులు అప్పటికే తన గది ముందు నుంచుని చూస్తున్నారు తన కోసం. ఆసుపత్రి తెరిచే పారమ్మ ఎప్పుడూ తను వచ్చేంత వరకు వేచి ఉండదు. తను పశువులను కాయడానికి కొండ మీదికి వెళ్ళిపోతుంది.

          ‘‘ఏంటి పారమ్మా… ఇంకా వెళ్ళలేదా?’’ అంటూ ఆమె పలకరించి లోపల తన సీటులో కూర్చుంది. వరుసగా పేషెంట్లను చూస్తోంది. కాంపౌండరు, నర్సు వచ్చిన వారికి ఇంజెక్షన్లు చేయడం, మందులివ్వడంతో ఒక గంటసేపటికల్లా వచ్చిన పేషెంట్లను చూడడం పూర్తి అయ్యింది. అప్పుడు తను సీటులో విశ్రాంతిగా వెనక్కి వాలింది. కాంపౌండరు తెచ్చిన కాఫీ త్రాగుతూ, ఇంకా బైట కూర్చున్న పారమ్మ వంక చూసింది. ఆమే ప్రక్కనే ఒక అమ్మాయి.

          ‘‘ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు?’’ అంది సూర్యకళ.

          మెల్లగా పారమ్మ వచ్చి తన ముందు నిలబడి, ఏదో చెబుదామని చేతులు నలుపు కుంటూ నిల్చుంది.

          ‘‘ఏమైంది. ఒంట్లో బాగలేదా? ఈ అమ్మాయి ఎవరు?’’ అంది సూర్యకళ, ఆమెను పరిశీలనగా చూసి.

          ‘‘నా రెండో కూతురు మేడం. వైజాగ్‌లో సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో చదువుతోంది’’ అంటూ అలాగే నిలబడిపోయింది.

          ‘‘ఏంటి… ఏమైందో చెప్పు’’ అంది సూర్యకళ.

          పారమ్మ అక్కడే నిల్చున్న కాంపౌండరు, నర్సు వంక చూసి ఏమీ చెప్పకుండా మౌనరూపం దాల్చింది. సూర్యకళకు అర్ధమైంది, తను చెప్పదల్చుకున్న విషయం వారికి తెలియకూడదని. కళ్ళతోనే ఆ ఇద్దరికీ సంజ్ఞ చేసింది, బైటకు వెళ్ళమని. వాళ్ళిద్దరూ బైటికి వెళ్ళిన తర్వాత సూర్యకళ పారమ్మ కళ్ళల్లోకి సూటిగా చూసి, ‘‘చెప్పు… ముందు కూర్చో…’’ అంటూ తన ముందున్న స్టూలు ఆమె వైపుకు తోసింది.

          ‘‘ఫర్వాలేదమ్మా…’’ అంటూ చుట్టూ ఒకసారి చూసి చెప్పడం మొదలుపెట్టింది పారమ్మ.

          ‘‘మేడం… ఈ పిల్లకు పన్నెండు సంవత్సరాలు వచ్చాయి. ఇంకా పెద్దపిల్ల కాలేదు. దీని ఈడువాళ్ళంతా అయిపోయారు. మా చుట్టాలంతా అడుగుతున్నారు. ఏమైంది మీ పిల్లకి? ఒకసారి డాక్టరుకు చూపించు. ఇంత లేట్‌ అవకూడదు అంటూ గొడవ చేస్తు న్నారు. ఇక నా పెనిమిటి సంగతి` ఏముందమ్మా, కొండ మీద కట్టెలు, పట్టుతేనె తీసుకొచ్చి సంతలో అమ్ముతాడు. వచ్చిన డబ్బులు సగం తాగేస్తాడు. నేను ఏదో ఇళ్ళల్లో పని చేస్తాను. పెద్దపిల్లకి తొందరగానే నెలసరి వచ్చింది. పెళ్ళిచేసి పంపేసాం. దానికి ఒక పిల్లాడు. మా అల్లుడు ఆటో డ్రైవర్‌. బాగానే చూసుకుంటాడు. దీని సంగతే బెంగగా ఉందమ్మా’’ అంది పారమ్మ.

          సూర్యకళ గౌరి వంక పరిశీలనగా చూసింది. అమ్మాయి పొట్టిగా, బొద్దుగా ఉంది. ఆరోగ్యంగానే కనిపిస్తోంది. కళ్ళలో నిగారింపు.

          ‘‘సరే… పరీక్ష చేస్తాను’’ అంటూ ‘‘నువ్వు బైట కూర్చో’’ అని ఆ అమ్మాయిని లోపల గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడున్న బెడ్‌ మీద పడుకోమని మరుగుగా ఉన్న కర్టెన్‌ను ముందుకు జరిపింది.

          ‘‘నీ పరికిణీ పైకి లాగమ్మా’’ అనేంతలో ఆ అమ్మాయి కంగారుగా ‘‘వద్దు మేడం… వద్దు మేడం…’’ అంటూ పడుకున్నదల్లా లేచి కూర్చుంది.

          ‘‘భయపడకు! నేను పరీక్ష చేస్తాను. సిగ్గుపడకూడదు. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు. నేనూ అమ్మాయినే కదా, పైగా డాక్టర్‌ను. భయపడకు’’ అంది, ఆమె కళ్ళలోకి స్నేహపూర్వకంగా చూసి.

          ఆ మాటలకు బదులివ్వకుండా ఏడుస్తూ కూర్చుంది గౌరి.

          ‘‘ఏమైంది?’’ అంది ఆశ్చర్యంగా సూర్యకళ.

          సమాధానం చెప్పకుండా, రెండు చేతులు జోడిరచి ‘‘అబద్ధం చెప్పేశానమ్మా మా ఇంట్లో. ఇప్పుడు నిజం తెలిస్తే చంపేస్తారు’’ అంది ఏడుస్తూనే.

          ‘‘ఏమిటి ఆ అబద్ధం? ఎందుకు నిన్ను చంపుతారు?’’ అంది.

          ‘‘నేను పెద్దపిల్లనయ్యాను. రెండు నెలలయిపోయింది. హాస్టల్‌లోనే నాకు తెలిసి పోయింది. మా ఇంట్లో చెప్పలేదు’’ అంది, తను ఏడుపు ఆపుకుంటూ.

          ‘‘నిజమా?’’ అంది.

          ‘‘నిజమేనమ్మా!’’ అంది గౌరి.

          ‘‘ఏమో… ఒక్కసారి నన్ను పరీక్ష చెయ్యని. భయపడకు. చిన్నపిల్లవు కదా. నీకు తెలుసో తెలియదో’’ అంది.

          ‘‘సరేనమ్మా, చూడండి…’’ అంటూ బెడ్‌ మీద కళ్ళు మూసుకొని పడుకుంది గౌరి.

          పరీక్ష చేసిన సూర్యకళకు అర్ధమైపోయింది. పైగా ఆమె పీరియడ్‌ టైమ్‌లో ఉంది. నేప్‌కిన్‌ కూడా వాడుతోంది. సరే… ‘‘ఇప్పుడేం చేయమంటావ్‌?’’ అంది.

          గౌరీ ఒక్క క్షణం ఆలోచనలో పడి ‘‘మా అమ్మకు నేను పెద్దమనిషిని అయ్యానని చెప్పకండి’’ అంది.

          ‘‘ఎందుకలా?’’ అడిగింది.

          ‘‘దానికి బోలెడంత కథ ఉంది మేడం. ఇంతసేపూ నేను మీతో ఏం మాట్లాడుతు న్నానో మా అమ్మకు అనుమానం వస్తుంది. మా అమ్మ పశువులు మేపడానికి కొండ మీదకు వెళ్ళాలి. తనను పంపేయండి. మీ దగ్గర కూర్చుని మొత్తం విషయం చెబుతాను’’ అంది గౌరి.

          ‘‘సరే…’’ అంటూ తన రూమ్‌లోనికి వచ్చి కూర్చుంది గౌరి.

          అంతవరకు బైట వేచి చూస్తోన్న పారమ్మ లోపలికి వచ్చి` ‘‘ఏమైందమ్మా? పరీక్ష చేసారా?’’ అంది.

          సూర్యకళకు వెంటనే ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఒక్క క్షణం ఆలోచనలో పడింది. తను ఎం.బి.బి.ఎస్‌. మొదటి సంవత్సరంలో చేరినపుడు తమ చేత చెప్పించిన హిపోక్రటీస్‌ మెడికల్‌ ఓత్‌ గుర్తుకొచ్చింది. ‘రోగి క్షేమానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి సత్యమైన సమాచారమే అందిస్తాను. ఎట్టి పరిస్థితులలోను అసత్యపూరిత ప్రకటనలు చేయను. అబద్ధపు సలహాలు, సూచనలు ఇవ్వను.’ ఆ మాటలు గుర్తుకొచ్చిన సూర్యకళ ఆలోచనలో పడింది.

          ‘‘ఏమైందమ్మా?’’ అంది పారమ్మ రెట్టిస్తూ.

          ‘‘కంగారుపడకు. నీ కూతురు గురించే ఆలోచిస్తున్నాను’’ అంటూ ఒక్కసారి కళ్ళు  మూసుకుంది.

          ‘గౌరి తనకు అబద్ధం చెప్పమంది. ఆ అబద్ధం వెనకాల ఆమెకు ఏం బాధ ఉందో? నిజం చెబితే తనను చంపేస్తారని భయపెడుతోంది. తన వైద్య వృత్తిధర్మం ప్రకారం తను నిజాలు చెప్పాలి. గౌరి చెప్పమన్నట్టు అబద్ధం చెబితే వచ్చే పరిణామాలు ఏమిటో! పైగా ఒక ఆడపిల్లకు సంబంధించిన సమస్య. ఒక్కసారి మనసులో ఊగిసలాట. ఏం చెయ్యాలి. ఘర్షణ. గోడగడియారంలోని లోలకంలాగ మనసులో ఊగిసలాట. సరే, ఈ చిన్నపిల్ల ఏదో బాధలో ఉన్నట్టుంది. ఈమె వైపే నిలబడతాను’ అనుకుంటూ ‘‘ఈ అమ్మాయికి ఒక సమస్య ఉంది. కంగారుపడకండి. మందులు రాస్తాను. అది పెద్ద ప్రమాదం కాదు. మందులు వాడి మంచి పోషకాహారం తీసుకుంటే త్వరలోనే రజస్వల అయిపోతుంది’’ అంది గబగబా.

          ఆ మాటలకు పారమ్మ సూర్యకళ మొహంలోకి చూసి, ‘‘ఫర్వాలేదు కదమ్మా. ఆ మంచి కబురు కోసం ఎదురుచూస్తున్నాం. మందులు వాడతాం. మా బంధువులంతా ఎదురుచూస్తున్నారు. ఈ పిల్ల పెద్దమనిషి అయితే తల మీద అక్షింతలు వేసి, చాప మీద కూర్చోబెట్టడానికి మావాళ్ళంతా కళ్ళు కాయలు కాచేటట్టు చూస్తున్నారు.ముత్తయిదువలు గంథం, వువ్వులు, పెసలు, తాంబూలం ఇవ్వడానికి కాచుక్కూచున్నారు. నాలుగో రోజు స్నానం చేయించి, క్రొత్త బట్టలు కట్టడానికి దీని మేనత్త ఆరాటపడుతుంది. మా గూడెంలో పెద్ద ఉత్సవం జరపడానికి, పొట్టేలు కోయడానికి గౌరీ నాన్న ఎదురుచూస్తున్నాడు. గూడెంలోని వాళ్ళకు ఇప్పసారా పోయిస్తానని అప్పుడే మాట ఇచ్చేసాడు. మా బంధువుల పిల్లోడు కూడా దీనితో పెళ్ళికి సిద్ధమయ్యాడు. పెద్దమనిషి అయిన ఆరు నెలలలోనే పెళ్ళి చేసేస్తాం’’ ఆమె ఉత్సాహంగా చెప్పుకు పోతోంది.

          ‘‘సరే… నువ్వెళ్ళు. ఏ మందులు వాడాలో మీ అమ్మాయికి రాసి పంపుతాను. నీకు లేట్‌ అయినట్టుంది’’ అంటూ పారమ్మ వైపు చూసింది.

          ‘‘సరేనమ్మా. నమస్కారం!’’ అంటూ పారమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

          బైట నిల్చున్న కాంపౌండరు, నర్సు` ‘‘టిఫిన్‌ చేసి వస్తాం అమ్మగారూ’’ అంటూ ఆసుపత్రి నుంచి బైటికి నడిచారు. అందరూ వెళ్ళిపోయారు. ఆసుపత్రిలో తను, గౌరి మాత్రమే అనుకుంది సూర్యకళ.

          ‘‘ఇప్పుడు చెప్పు’’ అంటూ తన ఎదురుగా ఉన్న స్టూలు మీద కూర్చోబెట్టింది.

          ‘‘థాంక్స్‌ మేడమ్‌. నన్ను రక్షించారు. ఇక్కడ మా గూడెంలో ఆడపిల్లలు పెద్దమనిషి అవగానే పెద్ద ఉత్సవం జరుపుతారు. ఊళ్ళోవాళ్ళను, బంధువులను పిలిచి భోజనాలు పెడతారు. వేటపోతును కోస్తారు. పట్నం నుంచి వీడియోగ్రాఫర్‌ను తీసుకువస్తారు. మా గూడెం అంతా ఫ్లెక్సీలు. ఇదంతా చేయడానికి బోలెడు డబ్బు ఖర్చవుతుందమ్మా. ఇది వరకు మా అక్కకు పెద్దమనిషి అయినపుడు చేసిన అప్పు ఇంకా అలాగే ఉంది. ఫంక్షన్‌ చేసి బాగా భోజనాలు పెడితే చాలనుకుంటారు. ఎవరు ఎక్కువ బాగా చేస్తే అంత గొప్ప’’ చెప్పింది గౌరి.

          సూర్యకళ ఆ అమ్మాయి మొహంలోనికి పరిశీలనగా చూసింది. ఆమెను చూసి జాలి వేసింది. ‘తల్లిదండ్రుల గురించి ఎంత గొప్పగా అర్ధం చేసుకుంది. వయసు చిన్నదే అయినా తనలో గొప్ప ఆలోచనలు ఉన్నాయి.’

          వెంటనే అంది సూర్యకళ` ‘‘పోనీ ఫంక్షన్‌ వద్దని చెప్పవచ్చు కదా, అబద్ధం ఆడడం దేనికి?’’ అంది.

          ‘‘లేదమ్మా. మా వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే పెద్దమనిషి అయిన తర్వాత ఆరు నెలలులోగా పెళ్ళి చేస్తారు. నాకు చదువుకోవాలని ఉంది. మంచి మార్కులు వస్తు న్నాయి. ఈ సంవత్సరం ఎనిమిది తరగతి పరీక్ష పాసవుతాను. బాగా చదివి మీలాగ డాక్టర్‌ అవుదామని ఉందమ్మా’’ అంది.

          ‘‘శెభాష్‌… మంచి ఆలోచన’’ గౌరీ భుజం మీద ఆప్యాయంగా నిమిరింది.

          ‘‘మరైతే ఎంత కాలం ఈ అబద్ధాన్ని దాస్తావు?’’

          ‘‘చూద్దాం అమ్మా. నిజం చెప్పి బాధ పడేకంటే ఇలా అబద్ధంతోనే ముందుకెళ్ళాలని ఉంది. ఇప్పుడు నేను పెద్దపిల్లనయ్యానని చెప్పేస్తే నేను అబద్ధం ఆడినందుకు మా అమ్మా నాన్నా నన్ను గొడ్డును బాదినట్టు బాదుతారు. మా గూడెంలో తెలిస్తే వారికి తల వంపులు. ఇక వెంటనే ఫంక్షన్‌ మొదలుపెడతారు. మళ్ళీ అప్పు చేస్తారు. ఇంకో ఆరు నెలల్లో పెళ్ళి జరుపుతారు. అలాగే మా అక్క బ్రతుకు నాశనం చేసారు. దానికీ చదువుకో వాలని ఉండేది. అప్పుడే దానికొక పిల్లోడు. ఇంట్లో పని, దాంతోపాటు కూలి నాలి చేయాలి. చక్కగా చదువుకుని టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్ళాలనుకుంది. మా అక్క బ్రతుకు అలా బుగ్గిపాలైంది.’’

          ‘‘సరే… భయపడకు… నీకు నేను అండగా ఉంటాను’’ అంటూ తన ప్రిస్క్రిప్షన్‌ పేడ్‌ మీద ఆమెకు అవసరమైన విటమిన్లు, టానిక్‌లు రాసిచ్చింది.

          ‘‘కంగారుపడకు. ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్పు. నువ్వు హాస్టల్‌లో ఉంటావు కాబట్టి ప్రమాదం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు’’ అంది.

          ‘‘థాంక్యూ మేడమ్‌’ అంటూ ఆ గదిలోంచి గౌరీ బైటికి నడిచింది.

* * *

          అలా ఉదయం జరిగిన ఆ సంఘటన గురించి ఆలోచిస్తూనే తను చెప్పిన అబద్ధం, రేపిన అలజడి అణచుకుంటూనే తన గదికి చేరుకుంది సూర్యకళ. ఆ రోజు ఆసుపత్రికి వెళ్ళిన వెంటనే తన కోసం ఒక ముప్ఫయ్‌ ఏళ్ళ అమ్మాయి, అంతే వయసున్న ఒక అబ్బాయి ఆసుపత్రిలో ఉండడం చూసింది. వారు తమను పరిచయం చేసుకుంటూ

          ‘‘మేము ఒక ఎన్‌.జి.ఒ. ను నడుపుతున్నాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆడ పిల్లలను ఎడ్యుకేట్‌ చేయడం కోసం. ఇక్కడ బాల్య వివాహాలు తరచుగా జరుగుతున్నా యి. వీటి మీద తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. అలాగే ఆడపిల్లలకు ఆరోగ్య సమస్యలున్నాయి. ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అందుకని ఒక మెడికల్‌ క్యాంప్‌ కండక్ట్‌ చేస్తున్నాం. మీరు సహాయం చేయాలి. అలాగే ఆడపిల్లల నెలసరి మీద కూడా వారికి అవగాహన కలిగించాలి. చాలా మందికి నేప్‌కిన్స్‌ ఎలా వాడాలో తెలియదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందు మేము మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిస్తాం. సిటీ నుంచి కొంత మంది లేడీ డాక్టర్ల బృందం కూడా వస్తుంది’’ అన్నారు ఆ ఇద్దరు.

          ‘‘సరే… మంచి కార్యక్రమం. నేను తప్పక సాయం చేస్తాను’’ అంది సూర్యకళ.

* * *

          రెండు రోజుల తర్వాత తమ ఆసుపత్రి ఆవరణలోనే మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిం చారు. అది కేవలం పద్దెనిమిదేళ్ళులోపు ఉన్న ఆడపిల్లల కోసమే. ఆ రోజు వచ్చిన ఆ మన్యప్రాంతపు ఆడపిల్లలు చెప్పిన సమస్య అందరికీ ఒకటే. ‘మా అమ్మాయి ఇంకా రజస్వల కాలేదు. ఏమైందో చూడండి.’ అలాగే రక్తహీనతతో బాధపడే ఆడపిల్లలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. చాలా మంది ఆడపిల్లలకు పరీక్ష చేసిన తర్వాత సూర్యకళకు షాకింగ్‌ కలిగించే ఒక నిజం తెలిసింది. వచ్చిన ఆడపిల్లల్లో చాలా మంది యవ్వనదశకు చేరుకున్న తమ తల్లిదండ్రుల దగ్గర తాము ఇంకా రజస్వల కాలేదనే అబద్ధాలతో నెట్టు కొస్తున్నారు. వారందరికీ చదువుకోవాలని ఉంది. తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని లేదు. అలాగే తాము రజస్వల అయితే వచ్చే ఇబ్బందుల గురించి భయపడుతున్నారు. సూర్యకళ అంతవరకు తను అబద్ధం చెప్పింది. ఒక నిజాన్ని దాచింది అనే భయం, బెంగ పోయాయి. ఇక వాస్తవాలు మాట్లాడాలనే అనుకుంది.

          మెడికల్‌ క్యాంప్‌ అయిపోయిన తర్వాత ఆడపిల్లల్ని, వారి తల్లిదండ్రులను కూర్చో బెట్టి తను చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఋతుచక్రం అంటే స్త్రీలలో నెల నెలా జరిగే ఒక రకమైన రక్తస్రావం. ఇది మొదటిసారిగా రావడమే రజస్వల. దీన్ని బహిష్ఠు, నెలసరి అని కూడా అంటారు. గర్భాశయంలో ఎండోమెట్రియం అనే లోపలి పొర ఒక నిర్ధిష్ఠమైన కాల వ్యవధిలో విసర్జించబడుతుంది. తిరిగి క్రొత్తగా తయారవుతుంది. ఈ రకంగా విసర్జించ బడిన స్రావాన్ని ఋతుస్రావం అంటారు. పెద్ద వయసు స్త్రీలలో ఋతుక్రమం ఆగిపోవ డమే ముట్లుడిగిపోవడం అంటారు. అంటే మెనోపాజ్‌. ఇలా మొట్టమొదటి బహిష్టు లేదా ఋతుస్రావం సహజంగా జరిగేది. దీన్ని మీరు పెద్ద ఉత్సవంగా జరుపుతున్నారు. ఇది ప్రకృతి చర్య. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్ట్రాన్‌ అనే హార్మోన్లు విడుదల కావడం వలన జరిగే చర్య. దీని వలన అండాశయం నుంచి అండం ప్రతి నెల విడుదలవుతుంది’’ సూర్యకళ చెప్పడం ఆపి, ఆ మీటింగ్‌ వచ్చిన ఆడపిల్లల వంక, వారి తల్లిదండ్రుల వంక చూసింది.
మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. ‘‘మనం పురోగమిస్తున్నాం. నాగరికత వికసించింది. చంద్రమండలం మీద కూడా కాలుపెట్టాం. దాని మీద నివాసం ఉండడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు కూడా వ్యోమగాములుగా మారి గ్రహాల పై కాలు మోపు తున్నారు. కానీ మీరు మాత్రం పిల్ల పెద్దమనిషి అవగానే పెళ్ళిళ్ళు చేసి వారి భవిష్య త్తును కాలరాస్తున్నారు. మీరు అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని మీ పిల్లలు గ్రహించారు. అందుకే మీ క్షేమం కోసం, మీరు ఋణగ్రస్తులుగా మారకుండా ఉండడం కోసం, అలాగే తాము చదువుకుని విద్యావంతులవుదామని మీ ఆడపిల్లలు మీ దగ్గర కొన్ని నిజాలు దాస్తున్నారు’’ చెప్పడం ఆపింది. అందరూ ఆ మాటలకు ఉత్కంఠగా, ఆసక్తిగా చూస్తున్నారు.

          సూర్యకళ చెప్పడం కొనసాగించింది. ‘‘కంగారుపడకండి. మీకందరికీ ఒక నిజం చెప్పబోతున్నాను. మీరంతా భయపడినట్టుగా ఇక్కడికి వచ్చిన మీ ఆడపిల్లలు మీ ఇంట్లో అబద్ధాలు చెప్పారు. అది ఒక మంచి కోసమే. నిజాన్ని దాచారు. ఒక మంచి పని కోసం మీ దగ్గర ఆ విషయాన్ని దాచారు’’ అంటూ సూర్యకళ గౌరి లాంటి ఆడపిల్లలు దాచిన ఆ నిజాన్ని అక్కడ ఆవిష్కరించింది. అయితే ఒక్క నిమిషం పాటు అక్కడున్న పెద్దల్లో అయోమయం. ఆ తర్వాత విషయం అర్ధమై కొంత మంది చప్పట్లు కొట్టారు. కొంత మంది మాత్రం ఉదాసీనంగా ఉన్నారు.

          ‘‘ఈ కార్యక్రమం ముగిసింది. ఈ ఆడపిల్లల్లో కొత్త ఋతువు మొదలైంది’’ సూర్యకళ చెప్పగానే అక్కడున్న ఆడపిల్లల మొహాల్లో నవ్వు మెరిసింది.

*****

Please follow and like us:

One thought on “కొత్త రుతువు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. కథలు అల్లడంలో అందెవేసిన చెయ్యి. కథావస్తువు కొత్తపుంతలు తొక్కింది. ఈ కాన్సెప్టతో ఇప్పుడిప్పుడే కొన్ని కథలు వస్తున్నాయి. మూఢనమ్మకాలనేవి మన్యంలో ఎక్కువగా ఉంటాయి. వారిలో కూడ చైతన్యం వస్తున్నదని రచయిత అద్భుతంగా చెప్పారు. కథామయుని కథనం గూర్చి చెప్పడం మాకు సాధ్యంకాని పని. మరో మంచి కథను పాఠకులకు అందించిన సుగుణారావు గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published.