క్షమించరూ…

-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

గౌరవనీయులైన అత్తయ్య గారికి,

నమస్కరించి,

          మీరు ఆశ్రమంలో ఎలా వున్నారు…?  మిమ్మల్ని అక్కడ సరిగా చూసుకుంటు న్నారా? ఇక్కడ నేనూ, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్యా అందరూ కులాసాగానే ఉన్నాం. మీ ముని మనుమడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. 

          అమెరికాకు వచ్చామే గానీ… మీగురించే తలంపు. అసలు ఈవయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు  పొరపాటు చేసామని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నిజానికి నా సహాయం ఇప్పుడే మీకు చాలా అవసరం. ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా లేకుండా నాస్వార్థం చూసుకున్నందుకు నేనెంతగా మనస్తాపపడుతున్నానో చెప్తే నమ్మరేమో…?

          నాకు పెళ్ళైన వెంటనే మీదగ్గరకు కోడలుగా వచ్చానే గానీ… చాలా కాలం మీకు నేను, నాకు మీరు విరోధులుగానే ఉన్నాం. అత్తగారిలా హుకుం జారీచేసేవారని నేనూ… కోడలుగా నేను మీకు గౌరవం ఇవ్వడం లేదని మీరూ…  ఎవరికివారు ఒకరినొకరు  అర్థం చేసుకోకుండా మాడుముఖాలతోనే ఒకే  ఇంట్లో గడిపేసాం. నాగురించి మీరూ… మీగురించి నేనూ ఇరుగుపొరుగు వారితో చెప్పుకుని మన ఇంటిపరువు మనమే  బజారు కీడ్చుకున్నామేమో…? మీ అత్తగారు నిన్ను ఇలా అంటున్నారని నాతో, మీకోడలు ఇలా అంటుందని మీతో… ఉన్నవాటికి మరో నాలుగు విషయాలు జోడించి చాడీలు చెప్పే సరికి… మనలో మనకే తెలీని శత్రుత్వం పెరిగిపోయింది. మన మధ్య పోరు పొరుగు వారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది. ఎన్ని గొడవలు పడ్డా తెల్లారితే మనం ముఖ ముఖాలు చూసుకోక తప్పేది కాదు. 

          తర్వాత తర్వాత ఆలోచిస్తే తెలిసింది… పుట్టింట్లో ఎంతో సుకుమారంగా పెరిగి కోడలుగా మీ ఇంటికొచ్చాక, ఆ కొత్తవాతావరణంతో… నేను ఏదో తెలీని సంకుచిత భావంతో అలా ప్రవర్తించేదాన్నని. అసలే పెళ్ళైన కొత్త. నేను నిద్ర నుంచి లేవడం కొద్దిగా లేటయ్యేది.  మీరేమో ఉదయాన్నే లేచి అన్ని పనులూ చేసేసుకునేవారు. నాకు పని చేద్దామన్నా ఏమీ ఉండేది కాదు. పైగా మీకు అతి శుభ్రమెక్కువ. నాకు వచ్చీరాని పనులు… వచ్చీరాని వంటలు.  ఏ పని చేస్తే ఏమంటారో అనే భయం నాలో పేరుకు పోయింది. నేనేమీ చేయడం లేదనే కోపంతో మీరుండే వారు.

          మీరు పైకి చెప్పకపోయినా నాగురించి మీరెలా అనుకుంటున్నారో… నాకూ అర్థమయిపోయేది. మీరెప్పుడూ నీకు ఏ పనులూ చేయమని పురమాయించలేదంటే… అలా చెప్పి చేయించుకోవడం మీకిష్టం లేకనే.  చేసేది ఏమైనా ఉంటే మీరు చెప్పకుండా నేను చక్కబెట్టాలని మీకుండేది. ఆడదంటే ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలను కునే సాంప్రదాయపు చాదస్తంలో మీరుండేవారు. 

          రాను రాను… ఒకరికి ఒకరు పనుల్లో సాయం చేసుకుంటూ… ఇల్లు చక్కబెట్టుకోవడం అలవాటు పడేసరికి… పిల్లవాడు కాస్తా పెళ్లీడుకెదిగిపోయాడు.

          మీరు వృద్దాప్యంలోకి, మేము నడి వయసుకీ వచ్చేసాం. నాకొచ్చిన అనుభవంలో… నా కొడుక్కి పెళ్లి చేస్తే నా కోడలు దృష్టిలో నేను అత్తగారిలా కాకుండా ఒక అమ్మగా మిగిలిపోవాలనిపించింది. అనుకున్నట్టుగానే… మీమనమడికి పెళ్లి చేసాను. కొడుకూ కోడలూ అమెరికా వెళ్లిపోయారు. నా గురించి కోడలికి గానీ… కోడలు గురించి నాకు గానీ తెలిసే ఆస్కారం కూడా కనిపించలేదు. 

          ఈలోపు మీరు జారి కిందపడి కాలు విరక్కొట్టుకోవడంతో… మీ సేవలకు నేను అంకితం అయిపోయానన్న కృంగుబాటుతో అక్కడ పుట్టిన నా మనుమడిని చూడ్డానికి అమెరికా వెళ్లలేకపోతున్నామనే నిరాశ ఎక్కువైపోయింది. మీకు ఈయన ఒక్కడే కొడుకవ్వడంతో…  మిమ్మల్ని చూసే దిక్కువరూ లేక, మాకు మరో మార్గం కనిపించక,  మా కోరిక తీర్చుకోడానికి… మిమ్మల్ని వృద్దాశ్రమంలో పెట్టేసి, మరీ అమెరికా వచ్చేసాం. మా వీసా గడువు ఆర్నెల్లు వున్నా… మూడు నెలలకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అనిపిస్తుంది.

          ఇక్కడ  అన్ని హంగులూ  ఉంటాయి. బయట తిరుగుతున్నంత సేపూ కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. మళ్లీ ఇంట్లోకి అడుగు పెడితే జైలు జీవితమే.  కొడుకూ కోడలు ఆఫీసులకు వెళ్లిపోతూ మనుమడిని కూడా ప్లే స్కూల్లో దింపేస్తారు. ఆ సమయమంతా ఇంట్లో పనిచేసుకుంటూ… వాళ్ళు తిరిగి వచ్చేసరికి… అన్నీ సమకూర్చి పెట్టడం అయిపోతుంది. శని ఆదివారాలు కాస్తా పార్టీలు షికార్లు అని తిరుగుతారు. బయటకు వెళ్లాలనిపించి ఎక్కడికైనా  తీసుకెళ్లమని కొడుకూ కోడల్ని అడుగుదామని వున్నా… అభిమానం అడ్డొస్తుంది. అదీగాక, ఇండియాలో  పిల్లలకు మనం పెట్టే తిండి లాగే… ఇక్కడ పిల్లలకు పెడుతుంటే కోడలికి నచ్చడం లేదు. పిల్లవాడిని ముద్దుచేసే విషయంలో కూడా కొన్ని రూల్స్ పెడుతుంది. వాటన్నిట్టికీ తల ఆడిస్తూ వుండాలి. ఏదైనా పొరపాటు వస్తే… లేనిపోని భేదాభిప్రాయాలు మా అత్తాకోడళ్ల మధ్య చోటు  చేసు కుంటాయేమోనని భయమేస్తుంది.  ఈమాత్రం దానికి ఇక్కడకొచ్చి వీళ్లకు సేవలు చేసే కంటే… అనారోగ్యంతో మంచం మీదున్న మీలాంటి వాళ్లకు సేవ చేసుకోవడంలోనే ఎంతో తృప్తి కనిపిస్తుందేమో…?  మాకేమాత్రం కనికరం లేకుండా… అస్వస్థతతో ఉన్న మిమ్మల్ని అలా వృద్ధాశ్రమంలో వదిలేసి రావడం… మేము చేసిన క్షమించరాని నేరమే. 

          మన తరం అత్తాకోడళ్లలో ఎన్ని మనస్పర్థలొచ్చినా కోడలికి అత్తగారంటే భయ భక్తులుండేవి. ఈతరం కోడళ్లు అత్తలతో కలిసి వుండకపోయినా, కనీస గౌరవం కాదు కదా… కొద్దిరోజులు కలిసున్నా మనస్పర్థలు మొలకెత్తడానికి చిన్న మాటచాలనిపిస్తుంది. 

          ఎన్ని తరాలు మారినా… ఎంతగా తల్లీ కూతుళ్ళుగా కలిసిపోయి వుందామను కున్నా… అత్త అమ్మా కాదు. కోడలు కూతురూ కాదు.

           అత్తయ్యా! త్వరలోనే మీకోసం ఇండియా వచ్చేస్తున్నాం. మిమ్మల్ని వృద్ధాశ్రమం లో పెట్టేసి వచ్చినందుకు నన్నూ, మీ అబ్బాయినీ క్షమించరూ…!

                                                  ఇట్లు,

                                               మీకోడలు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.