జీవితం అంచున -20 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

ఎంతో ఉద్విగ్నంగా ఇల్లు చేరుకున్నాను.

          నా కలల్లో కనిపించే అమ్మకూ, నా కళ్ళ ముందున్న అమ్మకూ పోలికే లేదు.

          గంభీరమైన అమ్మ విగ్రహం శుష్కించి పోయి వుంది. ఈ రెండేళ్ళ కాలంలో ఆమెను వృద్దాప్యం, ఒంటరితనం కృంగతీసాయో లేక ఆమె మానసిక అస్వస్థత కారణంగా చిక్కి పోయిందో కాని చాలా బలహీనంగా వుంది. అమ్మ చిన్నబోయిన మొహంతో, చప్పిడి దవడలతో, ప్రాణం కళ్ళల్లో పెట్టుకుని వుంది.

          అమ్మ కళ తప్పి వుండటం వలననేమో నాకు ఇల్లంతా కళావిహీనంగా, శూన్యంగా అనిపించింది.

          నన్ను చూసిన అమ్మ కళ్ళల్లో ఆనందపు మెరుపు స్థానే విచారపు వెరపు కనిపిం చింది. తన సామ్రాజ్యంలోకి శత్రు ప్రవేశం జరిగిందన్న అభద్రత అమ్మ కళ్ళల్లో కదలాడింది.

          కుమిలిపోతున్న నా మనసుని ఓదార్చుకుంటూ అమ్మ భుజం చుట్టూ చేతులు చుట్టి ‘ఎలా వున్నావమ్మా’ అంటూ బొటబొటా కన్నీరు కార్చేసాను. అమ్మ అభావంగా నా వంక చూసి, తన పైనున్న నా చేతులు తొలగించి నెమ్మదిగా కర్ర సాయంతో నడుచు కుంటూ తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. కొండంత ఆశతో కోట్ల మైళ్ళ ప్రయాణం చేసి వచ్చిన నేను సోఫాలో కుప్పకూలిపోయాను.

          “భోజనం చేస్తారామ్మా…” అడిగాడు కాశీ.

          “లేదయ్యా.. అర్ధరాత్రి వేళ భోజనమేమిటి… ఫ్లైట్ లో భోజనం పెట్టారు. అమ్మ ఇప్పటి వరకూ మెలకువగా వుండి, నేను రాగానే వెళ్ళి పడుకుండి పొయిందేమిటి..” అడిగాను బాధగా.

          “మీకు తెలియంది ఏముందమ్మా. కొంచం డిస్టర్బ్డ్ గా వున్నారు. రేపొద్దుటికల్లా సర్డుకుంటారులే. ఫ్రిజ్జిలో పాలు ఉంచాను. కాఫీ ఏమయినా కలపమంటారా..” కాశీ కూడా బాధపడుతూ అడిగాడు.

          “వద్దులే. నువ్వు పడుకో” అన్నాను.

          “మీరు వచ్చేసారుగా. నేను కిందకు వెళ్ళి నా రూములో పడుకుంటానమ్మా. పొద్దునే లేచి వస్తాను. మీకు ఇప్పుడు ఏ అవసరం లేదుగా.” అంటూ పక్కబట్టలు చుట్టి మడత పెట్టేసుకున్నాడు కాశీ.

          కాశీ వెళ్ళాక తలుపు గడియపెట్టి అమ్మ రూములోకి వెళ్ళి చూసాను. అమ్మ గోడ వైపుకి తిరిగి పడుకుని వుంది. డిస్టర్బ్డ్ గా వున్న అమ్మను మరింత డిస్టర్బ్ చేయటం సముచితం కాదని భావించి నిశ్శబ్డంగా నా బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాను. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి, అన్ని అవస్థలు పడి, ఇన్ని సరిహద్దులు దాటి ఎంతో ఆరాటపడి ఉద్వేగంతో వచ్చి నిస్సత్తువగా నా గదిలో పడుకున్నాను.

          అమ్మ పరిస్థితిని బట్టి చూస్తే నేను ఆస్ట్రేలియా తిరిగి వెళ్ళి నర్సింగ్ ప్లేస్మెంట్ పూర్తి చేయటం అసాధ్యం అని అర్ధం అవుతోంది. కాని  అలాగని ఆ పరిస్థితిలో వున్న అమ్మను నేను ఒంటరిగా మేనేజ్ చేయగలనా అని ఆందోళనగా వుంది. డాక్టరయిన నా కూతురి పర్యవేక్షణలో ఆస్ట్రేలియాలో వుంటే అమ్మకు మంచి చికిత్స, నాకు పూర్తి మద్దతు దొరుకు తాయి.

          కాని అమ్మకు వీసా వచ్చే అవకాశం, మేము ఆస్ట్రేలియా వెళ్ళే మార్గం అసలు వుందా..?

          నా తదుపరి ప్లాన్ ఆఫ్ ఏక్షన్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.