డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ” – వసంతమూన్ పుస్తక సమీక్ష

-పి. యస్. ప్రకాశరావు

          కులం కారణంగా క్షవరం చేయడానికి ఏ మంగలీ ముందుకు రాకపోతే, వాళ్ళ అక్క ఆయన జుట్టుని కత్తిరించినప్పుడూ, మాస్టారు బోర్డుమీద రేఖాగణిత సిద్ధాంతాన్ని రుజువు చేయమని అంబేద్కర్ ని పిలిచినప్పుడు, క్లాసులోని విద్యార్థులు బ్లాక్ బోర్డు దగ్గర పెట్టుకున్న తమ టిఫిన్ డబ్బాలు మైల పడిపోతాయని వాటిని తీసేసుకున్నప్పుడూ, వర్ణ వివక్ష ఎంత భయంకరమైనదో ఆయనకు అర్ధమైంది . ఆయన ఓసారి తనసోదరుడు, వదినలతో రైల్వేస్టేషను నుంచి ఊళ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అంటరానివాడు కావడం వల్ల ఆయనకెవరూ బండి కట్టలేదు. చివరికి ఓ బండివాడు ఒప్పుకున్నాడు. కానీ దళితులకు బండి తోలడం అవమానంగా భావించి బండివాడు అంబేద్కర్ నే బండి తోలమన్నాడు.

          దారిలో దాహంతో అలమటించి పోతున్నా అగ్రకులాల వాళ్ళు నూతి నీళ్ళు  ముట్టుకోనివ్వలేదు. ఇవన్నీ ఆయన హృదయం పై గాఢమైన ముద్రవేశాయి. అవమానాలను భరిస్తూనే మెట్రిక్ పరీక్ష పాసై, అభినందన సభలో బహుమమతిగా పొందిన బుద్ధుడి ఆత్మకథ పుస్తకమే వర్ణవివక్షకు తావులేని బౌద్ధమతం పై అభిమానం కలిగించిందేమో ! పది సంవత్సరాలు బరోడా రాజ్యంలో పని చేయాలనే ఒప్పందం పై అమెరికాలో ఫై చదువులు పూర్తి చేసి వచ్చినా వివక్ష మాత్రం వెంటాడుతూనే ఉంది. సంస్థానానికి వచ్చిన పెద్ద ఉద్యోగికి దర్బారు నుంచి లభించే స్వాగతం ఆయనకు లభించకపోవడానికీ, చివరికి హోటల్లో తలదాచుకోడానిక్కూడా అనుమతి లభించక పోవడానికీ , వివరాలు చెప్పకుండా పార్సీ హోటల్లో దిగితే వాళ్ళు ఈయన జాతి గురించి తెలుసుకుని కర్రలతో దాడి చేసి హోటల్ ఖాళీ చేయించడానికి కులమే కారణమైంది. బరోడా రాజా దగ్గర మిలిటరీ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన కింద పనిచేసే గుమస్తాలూ, బంట్రోతులూ ఫైళ్ళు ఆయన చేతికి ఇవ్వకుండా దూరం  నుంచి విసిరేయడానికీ, ఆయన లేచి వెళ్ళగానే మైలపడిందని తివాచీ  కడిగేయడానికీ, మంచినీళ్ళు కూడా దొరక్కుండా చేయడానికీ కూడా ఆయన కులమే కారణంమైంది.

          అగ్రవర్ణాల పెత్తనాన్ని ధిక్కరించి ఐదువేలమందితో కలిసి మహాడ్ లోని చవదార్ చెరువు నీటిని తాగినందుకు చెరువు నీరు మైలపడిందని గగ్గోలు పెట్టిన అగ్రకులపెద్దలు 108 బిందెల నీళ్ళలో పేడా, గోమూత్రం, పాలు పెరుగూ కలిపి చెరువుని శుద్ధి చేసుకున్న సంఘటన చదివాక ” పేడ , గోమూత్రం కంటే మానవ స్పర్శ అపవిత్రమైనదా ? ” అనే ఆలోచన రానివాడు మనిషే  కాదు. ఇలాంటి సంఘటనలెన్నో అంబేద్కర్ని మానసిక క్షోభకు గురిచేశాయి. హిందూమతం పై ఏవగింపుని కలిగించాయి. ఆయన వెనుకనున్న జనాన్ని చూసి ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే అస్పృశ్య సమాజం కోసం ఐదు కోట్ల రూపాయ లిస్తామన్నారు ఆ మతపెద్దలు. తరువాత క్రైస్తవ మతం స్వాగతం పలికింది. ఆయన తిరస్కరించారు. ‘మా  సిక్కుమతం ఏకేశ్వరవాదాన్ని విశ్వసిస్తుంది’ అని ఆ మతస్తులు ఆహ్వానించారు. అన్నీ కాదని చివరికి 1956 అక్టోబరు 14 న బౌద్ధమతం స్వీకరించారు.

          అంబేద్కర్ ఉద్యమ నేపధ్యాన్ని తెలిపే ఈ సంఘటనలు “డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ” పుస్తకంలోవి. రచయిత వసంతమూన్. (మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన బాబాసాహెబ్ అంబేద్కర్ సమగ్ర రచనలకు ఈయన ప్రధాన సంపాదకుడు)

నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ప్రచురణ . 

అనువాదం చాగంటి తులసి .పేజీలు-267

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.