దేవి చౌధురాణి

(మొదటి భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          రాత్రి ఒకటవ ఝాముకి హరివల్లభ బాబు భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంటావిడ ప్రక్కనే కూర్చుని వడ్డిస్తున్నది.

          “ కులత తిరిగి పోయిందా?” అడిగాడాయన.

          “రాత్రి పూట ఎలా వెళ్తుంది. రాత్రికి కోడలు అతిథి. ఇక్కడే వుంటుందిఅన్నది అత్తగారు.

          “అతిథి అయితే ఇంటికి బయట చావటి గదిలో ఉంచండి.”

          “చెప్పాను కదా రాత్రి వేళ ఎక్కడకీ పంపించనని. అంతగా పొమ్మనేటట్లయితే, మీరే పొమ్మనండి. అయినా పెద్ద కోడలు ఎంత అందంగా ఉన్నదో!”

          “కులతలు అందంగానే ఉంటారులే. నేనే పొమ్మంటాను, జాగ్రత్త! వ్రజేశ్వర్‌ని పిలువుఅన్నాడాయన.

          ఒక దాసి వెళ్ళి వ్రజేశ్వర్‌ని పిలుచుకు వచ్చింది. అందమైన కుర్రాడు. ఇరవై రెండేళ్ళు ఉంటాయి, వచ్చి తండ్రి ప్రక్కన వినయంగా నిలబడ్డాడు

          “నీకు ముగ్గురు భార్యలు, తెలుసా నీకు?” అడిగాడు హరివల్లభ బాబు.

          వ్రజేశ్వర్ సమాధానం చెప్పకుండా అలాగే నిలబడ్డాడు. పాత కాలం కదా, అందుకనే వినయంగా నిలబడ్డాడు. రోజులలో అయితే అందరికంటే పెద్ద వెధవే ఆపకుండా వాగుతాడు

          “నీకు మొదటి వివాహం ఒక బంజారా దానితో అయ్యింది తెలుసా? అది ఇవ్వాళ వచ్చింది. దాన్ని చీపురుకట్టతో నాలుగు తగిలించి తన్ని తరిమెయ్యమని మీ అమ్మకు చెప్పాను. ఆడది ఇంకో ఆడదాన్ని తరమనని మొండికేసింది. ఇప్పుడు దాన్ని తరిమే పని నీది. అలాగైతే గానీ దాని అంటు వదలదు. రాత్రికి రాత్రి చీపురుతో నాలుగు బాది తరిమెయ్యి. అప్పుడుగానీ నాకు మనశ్శాంతి వుండదు.” అన్నాడు హరివల్లభ బాబు.

          “వద్దురా, వద్దు. ఒక ఆడదాని మీద చెయ్యి చేసుకోవటం తప్పు. తండ్రి మాట పాటించాలని అనుకుంటున్నావేమో? తల్లి మాట కూడా పాటించాలని తెలుసుకో. జాగ్రత్త. ఏదో రకంగా ఇంటి గౌరవం నిలబడే విధంగానే పంపుదాముఅన్నది ఇంటావిడ.

          వ్రజేశ్వర్ తండ్రి వంక చూసిమీ ఆజ్ఞఅన్నాడు. తల్లి వైపు తిరిగిఅలాగేనమ్మాఅన్నాడు.

          “రాత్రికి రాత్రే కోడలిని తరిమేస్తే, తర్వాత ఏం తింటుంది?” అన్నది ఇంటావిడ.

          “దానికిష్టమయ్యింది చేసుకుంటుంది. దొంగతనమో, దోపిడీనో, అడుక్కు తింటుందో, నాకెందుకూ?” అన్నాడు హరివల్లభ బాబు.

          ఇంటావిడ ఆయన వంక మిటకరించి చూసి, ఏమీ పాలుపోక, ఇటు కొడుకు వైపు తిరిగి, “వెళ్ళరా, వెళ్ళి కోడలకి ఈయన మాటే చెప్పు. మీ నాన్నగారికి విషయం తలకెక్కింది,” అన్నది.

          వ్రజేశ్వర్‌కి ఏంచెయ్యాలో తోచక అక్కడి నుండి ఠాకురాణి దగ్గరకు వెళ్ళాడు. ఆవిడకైతే ఇంటి భోగట్టా అంతా తెలుసు. అక్కడ ఆవిడ ఒక చేత్తో విసినకర్రతో విసురు కుంటూ రెండో చేత్తో జపమాల తిప్పుకుంటూ జపం చేస్తున్నది.

          “మామ్మాఅంటూ పిలిచాడు వ్రజేశ్వర్.

          “ఏం నాయనాఅన్నది ఆవిడ.

          “ఈవేళ ఒక కొత్త కబురు తెలిసింది.”

          “కొత్త కబురా? సాగర్ నా చరఖా విరగొట్టిందనా! అది ఇంకా చిన్న పిల్లే కదా, విరిగితే విరిగిందిలే. సాగర్‌కు కనీసం చరఖా తిప్పుదామని బుద్ది పుట్టింది, అదే చాలు.”

          “అది కాదు, ఈవేళ ఏమయ్యిందంటే …”

          “సాగర్‌ని ఏమీ కోప్పడవద్దు. మీరు సుఖంగా వుండండి. చరఖాలు నాకేమీ తక్కువ లేవు.”

          “నువ్వు నా మాట వినే పని లేదు, ఎప్పుడూ నీ సోదే గానీ…”

          “ముసలిదాన్ని, ఎప్పుడు పోతానో, చరఖా మాట వదిలేయ్ ..”

          “నా మాట వింటావా లేదా, లేకపోతే వెళ్ళి నీ చరఖాలన్నీ విరగొట్టమంటావా?”

          “, ఏమిటీ? అయితే చరఖా సంగతి కాదా?”

          “కాదు. నాకు ఇద్దరు బ్రాహ్మణిలు, నీకు తెలుసు కదా?”

          “బ్రాహ్మణీ? నయన కోడలు, సాగర్ కోడలు. ఇంతేనా. నన్ను కథలు చెప్పమంటే, నా దగ్గర కొత్త కథేమీ లేదు.”

          “అరే, కథలు వదిలెయ్యవే …”

          “కథ చెప్పమంటావ్, వద్దంటావు. సరే, అడిగావు కాబట్టి పావురాయిల కథ చెబుతాను. ఒక చెట్టు కొమ్మ మీద ఒక పావురాయి, పావురాణి వుండేవి …”

          “మామ్మా, ఏం చేస్తున్నావే నువ్వు. ముందు నా మాట విను.”

          “నీ మాటేంటి? నువ్వు వేరే ఏమీ పని లేకే కదా, కథ వినటానికే కదా వచ్చింది? లేకపొతే ఎందుకు వస్తావూ?”

          మామ్మగారికి పైత్యం పరాకాష్ఠకు చేరిందనుకున్నాడు వ్రజేశ్వర్. ఆవిడకు కొంత వివేకం దైవం ఎప్పుడు అనుగ్రహిస్తాడో తనకైతే తెలవదనిపించిది. గట్టిగానాకు ఇప్పుడూ ఇద్దరు బ్రాహ్మణిలు ఉన్నారు. అంతకు క్రితమే నాకు ఒక బంజారా దానితో కూడా వివాహమయ్యిందని నీకు తెలుసు కదా? బంజారాది ఈవేళ ఇక్కడికి వచ్చింది.”

          “రామ రామ, బంజారాది అంటావేమిటి? పిల్ల బ్రాహ్మల పిల్ల.”

          “వచ్చిందా లేదా?”

          “, ఎందుకు రాలేదూ? వచ్చింది.”

          “ఎక్కడుందీ? నేను మాట్లాడాలి.”

          “ఎక్కడుందో నీకు చెపితే, నువ్వు వెళ్ళి కలిస్తే, నేను నీకు చెప్పానని తెలిస్తే, మీ ఆమ్మానాన్నా నా మీద ఎగిరెగిరి పడతారు. అది వద్దులే, రా పావురాయి పావురాణి కథ చెపుతాను విందువుగాని.” 

          “దానిని కలవటానికి కాదు, దాన్ని తరమటానికి. అది ఎక్కడుందో తెలవకుండా ఎలా తరుముతాను? అందుకే నీ దగ్గరకి వచ్చాను.”

          “చూడు నాయనా, నేనేమో విధవను. కృష్ణనామం జపిస్తూ గడుపుతున్నాను. కథలు వింటానంటే చెపుతాను. నాకు బంజారాదీ తెలీదు, బ్రాహ్మణీ తెలవదుఅన్నది ముసలావిడ.

          “నిన్ను బందిపోటులెత్తుకు పోనూ, బాబోయ్!” 

          “అట్లాంటి మాటలనబాకు. బందిపోటులంటే నాకు చాలా భయం. వెతకటానికి వచ్చావా?”

          “లేకపోతే నీ జపమాల చూడటానికి వచ్చానటే?”

          “అయితే సాగర్ కోడలి దగ్గరకి వెళ్ళు.”

          “అదేమిటి, బంజారాది సాగర్ దగ్గరెందుకు వుందీ? సవతీ, సవతీ కలసి వుంటారా?”

          “సాగరే పెద్ద కోడలిని రమ్మని తీసుకువెళ్ళింది., అక్కడ ముందు గదిలో ఉన్నారు. అంత అందమైన, పొందికైన కోడలు పిల్ల ఎక్కడా వుండదు.”  

          “అంత మంచి అమ్మాయయితే నీ చరఖా ఎందుకు విరగ్గొడుతుందీ? నయనను నీ రెండో చరఖాని విరగొట్టమని చెపుతానులే. సాగర్ పధ్నాలుగేళ్ళ పిల్ల, దాని దగ్గరకి ఇప్పుడు నేను పోవాలా?”

          “చూడు నాయనా, మా కాలంలో భార్య ఎనిమిదేళ్ళదైనా, ఇరవై ఎనిమిదేళ్ళ దయినా, భార్య పిలవగానే భర్త వెళ్ళేవాడు. ఏమిటో కాలం …” అంటూ వాపోయింది ముసలావిడ

          “మావయ్యకి దండం పెట్టాలి, స్వర్గంలో వున్నాడు నీతో పడలేక. సర్లే పధ్నాలుగేళ్ళ పిల్ల దగ్గరకే వెళతాను.”

          “మరి ఇక్కడే నుంచున్నావే వెళ్ళకుండా, అసలు ఎన్ని సార్లు జపించానో మర్చి పోయా. నయనకి చెపుతానులే, నీకు నోటి దురుసెక్కువయ్యిందనిఅంటూ జపమాలను సరి చేసుకుంది ముసలావిడ.

          “చెప్పు, సంతోషిస్తుందిఅంటూ అక్కడి నుండి రుసరుసా నిష్క్రమించాడు వ్రజేశ్వర్.

***

          సాగర్‌కి అత్తవారింటిలో రెండు గదులు కేటాయించారు. ఒకటి మేడ పైనా, ఒకటి క్రింద. సాగర్ కబుర్లు చెప్పుకోవటానికీ, ఆడుకోవడానికి క్రింద గది, పైన పడక గది.

          వ్రజేశ్వర్ అక్కడ నుండి నేరుగా  మేడ పైనున్న సాగర్ గదికి వెళ్ళాడు. అక్కడ సాగర్ స్థానంలో ప్రఫుల్ల కూర్చుని వుంది. వ్రజేశ్వర్‌కి అమ్మాయే బంజారాది, మొదటి భార్య అని అనుమానమొచ్చింది. ప్రఫుల్ల లేచి నిలబడింది.

          ఏం మాట్లాడాలో ఎలా మొదలుపెట్టాలో వ్రజేశ్వర్‌కి తోచలేదు. ఇది బార్యాభర్తల సంబంధం. సన్నిహితం, ఆంతరంగికం. ఇప్పటి దాకా ఒకరినొకరు చూసుకోవటం కూడా లేదు. మరి మొదటి పరిచయంలోనే తను చేయవలసిన పని తన అర్థాంగిని ఇంటిలో నుండి తన్ని బయటకు తరమటం. ఆడ మనిషి తన్నులు తిని బయటకు పోవటం. సంభాషణ ఎలా మొదలు పెట్టాలి? ఏమీ తోచలేదు వ్రజేశ్వర్‌కి.

          ఇద్దరిలో ఎవరికీ మాట రాలేదు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. ఇది ఒక వింత సమస్య.  

          ఇద్దరిలో ఎవరికీ మాట రాలేదు, ఇద్దరికీ ఏమి చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో తెలియలేదు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. తరువాత ప్రఫుల్ల లేని చిరునవ్వు కొంచెం తెచ్చుకుని వ్రజేశ్వర్ దగ్గరకి వచ్చి, దిగ్గున క్రిందికి పడి వ్రజేశ్వర్ కాళ్ళకి నమస్కరించిందివ్రజేశ్వర్‌కు భార్య చేస్తున్న ప్రణామంతో మాట రాలేదు. ఆకస్మిక పరిణామం నుండి కొంచెం తేరుకునిప్రమాణ స్వీకారంగా ప్రఫుల్ల భుజాలు పట్టుకుని పైకి లేపి పట్టె మంచం మీద కూర్చోబెట్టి ప్రక్కన కూర్చున్నాడు. ప్రఫుల్లను పైకి లేపి నిలబెట్టుతున్నప్పుడు క్రొద్దిగా తొలిగిన ప్రఫుల్ల ఘూంఘట్ నుండి ఆమె కన్నీటి ధార కనబడింది

          పాఠకుడా, రోజుల్లో లాగా కాదు. రోజులలో స్త్రీలందరూ సాంప్రదాయంగా ఉండేవారు, చక్కగా చీర కొంగు తలపై కప్పుకునేవారు. కొంగు చాటున వున్న ముఖం అందమే వేరు! రోజులలో అయితే స్త్రీలందరూ ముఖాన్ని బయటే వేసుకు తిరుగు తున్నారు, కాల వైపరీత్యం!

          పాఠకుడా, నేను వయసు పైబడిన వాడిని, క్రింద వాఖ్యలు రాయటంలో తప్పు లేదు. పిన్న వయస్కులు ఎవరైనా చదువుతుంటే మాత్రం తరువాతి భాగాన్ని చదవద్దని మనవి.

          వ్రజేశ్వర్ తండ్రి వంటి కాఠిన్యుడు కాదు. ప్రఫుల్ల కన్నీటితో అతని మనసు చలించింది. అతను అప్రయత్నంగానే, ప్రఫుల్ల చుబుకం వేళ్ళతో స్పర్శించి, నెమ్మదిగా ప్రఫుల్ల తల పైకి ఎత్తాడు. ప్రఫుల్లకి ఇది ఎన్నడూ తెలియని ఒక అందమైన అనుభవం.

          ఇంతలో తెరచి వున్న తలుపుల దగ్గర గాజుల గలగలలు వినిపించాయి. అటు చూస్తే ద్వారానికి మధ్యలో చారడేసి కళ్ళతో, రెపరెపలాడుతున్న ముంగురులతో, ఒక చేతిలో తాళం, రెండో చేతిలో తాళంచెవి పట్టుకుని వూపుతూ, చిలిపిగా నవ్వుతున్న బాలిక కనిపించిది. వ్రజేశ్వర్‌కి అది సాగర్ అని అర్థమయ్యింది. మామూలుగా అమ్మాయి సాగర్ తనకు ఎప్పుడూ ఎదురుపడదు. అమ్మాయి ఏమీ మాట్లాడకుండా తలుపులు దగ్గరకి లాగి, బయట నుండి తాళం వేసి వెళ్ళిపోయింది. వ్రజేశ్వర్ తేరుకునిసాగర్, ఆగు, ఏం చేస్తున్నావు?” అన్నాడు. అప్పటికే సాగార్ పారిపోయి క్రింద ఠాకురాణీ దగ్గరకు చేరింది.

          “సాగర్ కోడలా, నువ్వు ఈవేళ నా దగ్గర పడుకోవటానికి వచ్చావా? నీ గదిలో పడుకోవటానికి ఏమయ్యిందిఅడిగింది ఠాకురాణి. సాగర్ ఏమీ మాట్లాడలేదు.

          “ఏం, వ్రజేశ్వర్ నిన్ను నీ గదిలో నుండి తరిమేశాడా?”

          “తరిమెయ్యకపోతే నేను నీ దగ్గరకెందుకు వస్తాను? రాత్రికి నేను నీ దగ్గరే పడుకుంటాను.”

          “అలాగా, ఇప్పుడే వచ్చి మళ్ళీ నిన్ను పిలుస్తాడు చూడు. నేను వయసులో వుండగా మీ తాతగారు కూడా అంతే, ఇంతలోనే తరిమేసేవారు, అంతలోనే నన్ను పిలుచు కుంటూ వచ్చేవారు. నాకెప్పుడూ కోపం రాలేదు, కానీ ఆయనకి కోపంవస్తే ఎదురుగా వుండలేకపోయేదాన్ని. వ్రజుడు కూడా ఇప్పుడంటే ఇప్పుడే నీకోసం పరిగెత్తుకొస్తాడు చూడు. ఒక రోజు ఏమయ్యిందంటే …”

          “మామ్మా, ఒక కథ చెప్పు.”

          “ఏం కథ చెప్పమంటావు? పావురాయీ పావురాయిణి కథ చెప్పనా? నీకొక్కదానికే ఎందుకు చెప్పటం, వెళ్ళి కొత్తగా వచ్చిందే పెద్ద కోడలు, దాన్ని కూడా పిలుచుకారా, ఇద్దరికీ చెపుతా.”

          “ఎక్కడుందో నాకు తెలీదు. వద్దు, నాకొక్కదానికే చెప్పు, వింటానుఅన్నది సాగర్. ఠాకురాణి కథ చెప్పటం మొదలు పెట్టగానే సాగర్ నిదురపోయింది. అయినా ఠాకురాణీ కథ చెపుతూనే వున్నది. కాసేపటికి ఆవిడ కూడా నిదురపోయింది

          ఉదయం సాగర్ వెళ్ళి పైన తన గదికి వేసిన తాళం నెమ్మదిగా  తీసి, చప్పుడు చేయకుండా విరిగిపోయిన చరఖా తీసుకుని మళ్ళీ ఠాకురాణీ దగ్గరకు చేరింది.

          తాళం తీస్తున్న అలికిడితో ప్రఫుల్లకి మెలుకువ వచ్చి పక్కపై నుండి దిగి, లేచి నిలుచునిసాగర్ తాళం తీసింది, ఇక నేను వెళతాను. నన్ను మీ భార్యగా కాకపోయినా ఒక దాసీగానైనా గుర్తుంచుకోగలరుఅన్నది.

          వ్రజేశ్వర్‌కి  కూడా మెలుకువ వచ్చింది. ప్రఫుల్లతోఇప్పుడే వెళ్ళవద్దు, నేను నాన్నగారితో ఒకసారి మాట్లాడి చూస్తానుఅన్నాడు.

          “ఆయన వైఖరి మారుతుందా?”

          “మారినా మారకపోయినా, నేను నా కర్తవ్యం నెరవేర్చాలి కదా. అకారణంగా నిన్ను త్యాగం చెయ్యటం పాపం కదా.”

          “మీరు నన్ను త్యాగం చెయ్యలేదు. మీ శయ్యమీద నాకింత చోటు ఇచ్చారు, అదే నాకు సర్వము. మీరు నా దుఃఖాన్ని పోగొట్టటానికి మావగారితో తగవు పడవద్దు, దానివలన నాకు సుఖం ప్రాప్తించదు.”

          “నీ పోషణ భారానికి అయ్యే ఏర్పాటులు ఆయనే చెయ్యాలి కదా?”

          “నన్ను ఆయన వెలి వేసిన తరువాత, నా పోషణ భారాన్ని గురించి ఆయనను యాచించను.”

          “నా దగ్గరైతే ఏమీ లేదు, ఉంగరం తప్ప. దీన్ని అమ్మి కొంత కాలం గడుపు. నేను కొంత సొమ్ము సంపాదించే ప్రయత్నం చేస్తాను. నీ పోషణ భారం నాదేనని మాట ఇస్తున్నాను.”

          వ్రజేశ్వర్ ప్రఫుల్లకి ఉంగరం బహూకరించాడు. ప్రఫుల్ల ఉంగరం తన వేలికి పెట్టుకుని, “ఒకవేళ మీరు నన్ను మరచిపోతే?”

          “నేను మిగిలిన వాళ్ళనందరనీ మరచిపోగలను కానీ, నిన్ను మరచిపోగలనా?”

          “తరువాత నన్ను గుర్తు పట్టలేకపోతే“?

          “నీ మోము నాకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది.”

          “నేను ఉంగరాన్ని అమ్మను. ఆకలితో అంతమైనా అమ్మను. మీరు నన్ను గుర్తుపట్టలేనప్పుడు, ఉంగారాన్ని గుర్తుగా చూపుతాను. దీనిమీద ఏమి వ్రాసి ఉంది?”

          “నా పేరు.”

          ఇద్దరూ కన్నీటితో వీడ్కోలు పలికారు.

***

          ప్రఫుల్ల క్రిందికి వచ్చేటప్పటకి సాగర్ నయన ఒకే చోట కనబడ్డారు. “రాత్రి ఎక్కడ పడుకున్నావు అక్కా?” అని అడిగింది నయన.

          “తీర్థం అయ్యిన తరువాత ఎవరన్నా అవే కబుర్లు చెపుతూ పోతుంటారేమిటీ?” అన్నది సాగర్.

          “అంటే?”

          “ఈవిడ రాత్రి నన్ను తరిమేసి లక్ష్మీదేవిలాగా నారాయణుడితో గడిపింది, ఆయనేమో ఈవిడకు ఉంగరం బహుమతిగా ఇచ్చాడుఅని ఆట పట్టించింది సాగర్.

          నయనకు ఈర్ష్యాసూయలు పెల్లుబికాయి. “అక్కా, నువ్వు అడిగినదానికి ఏమన్నారో గుర్తు లేదా?” 

          ప్రఫుల్ల వ్రజేశ్వర్ చూపిన ఆదరంతో అన్నీ మరచిపోయింది. “ ప్రశ్నకు?” అని అడిగింది.

          “నేనేమి తినాలని నువ్వు అడిగితే, అడుక్కునో, దొంగతనమో దోపిడీ, డాకూనో చేసి బ్రతకమని మావగారు అన్నారని నీకు చెప్పలేదా?” అన్నది నయన.

          “ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాంఅని ప్రఫుల్ల అక్కడి నుండీ బయలుదేరింది. సాగర్ ముఖ ద్వారం దాకా వెనుకగా వచ్చింది. ద్వారం దగ్గర ప్రఫుల్ల, “వెళుతున్నాను చెల్లీ, మళ్ళీ తిండిగింజల కోసం గడప తొక్కను. నువ్వు మీ కన్నారిం టికి వెళ్ళినప్పుడు నేను అక్కడికే వచ్చి కలుస్తానుఅని అన్నది.

          “మా కన్నవారిల్లు ఎక్కడో నీకు తెలుసా?”

          “తెలుసుకుంటాను.”

          “మరి వస్తావా అక్కడికి?”

          “అక్కడికి రావటానికి నేనేమి సిగ్గుపడనక్కర్లేదు.”

          “అదిగో, మీ అమ్మ అక్కడే నిలబడి వుంది.” అన్నది సాగర్. ఇంటి బయటి తోటలో నిలబడి తనకోసం వేచి చూస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళింది ప్రపుల్ల.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.