పేషంట్ చెప్పే కథలు – 30

మెరుపు

ఆలూరి విజయలక్ష్మి

          మిట్టమధ్యాహ్నమయినా హేమంత శీతలచ్ఛాయా జగతిని ఆచ్చాదించేవుంది. “మేడం” శృతి చాంబర్ లోకి ఆదుర్దాగా ప్రవేసించాడో యువకుడు. అతని కళ్ళల్లో బెదురూ! ముఖం మీద చిరుచెమటలు!

          “యస్” అంటూ తలెత్తిన శృతి జీవన్ ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది.

          “మేడం! నేను ఆక్సిడెంట్ చేసాను. నా స్కూటర్ క్రింద ఒక కుర్రాడు పడ్డాడు.” ఏడుపు గొంతుకతో చెప్పాడు జీవన్.

          “ప్రమాదమైన దెబ్బలేం తగల్లేదు కదా!” అప్రయత్నంగా కుర్చీలో నుంచి లేస్తూ ఆత్రుతతో అడిగింది శృతి.

          “స్పృహలోనే వున్నాడు కానీ, తలకు, కాళ్ళకు దెబ్బలు తగిలాయి. తల నుండి విపరీతంగా రక్తం కారిపోతూంది. జీవన్ చెప్తూ ఉండగానే రిక్షాఅతను పది, పన్నెండేళ్ళ వయసున్న కుర్రాడిని చేతుల మీద తీసుకొచ్చి పరీక్ష గదిలో పడుకోబెట్టాడు. కుర్రాడి ముఖం, బట్టలు రక్తంతో తడిసిపోతున్నాయి.

          “మేడం! మీరే నన్నీగండం నుంచి ఎలాగైనా తప్పించాలి. ఆ కుర్రాడిని జనరల్ హాస్పిటల్ కు తీసుకువెళ్తే పోలీస్ కేసు అవుతుంది. ఒకసారి పోలీస్ ల చేతిలో పడితే ఎన్ని తంటాలు పడాలో మీకు తెలిసిందే కదా! మీరిలాంటి కేసుల్ని ట్రీట్ చెయ్యరని నాకు తెలుసు. అయినా నా మీద దయతలచి అతన్నెలాగైనా బ్రతికించండి. ఏ డాక్టరు అవసరమయితే ఆ డాక్టర్ని పిలిపించండి. డబ్బెఎంతైనా ఫరవాలేదు”. ఒక్కసారి అంత రక్తాన్ని చూచి బెదిరిపోయిన జీవన్ లోగొంతుతో శృతిని ప్రాధేయపడ్డాడు. “కంగారు పడకండి. ముందతన్ని చూసాక ఇక్కడ ఉంచి ట్రీట్ చేయగలమో లేదో చెప్తాను.” జీవన్ కి దైర్యం చెప్పి పరీక్ష గదిలోకి వెళ్ళింది శృతి. అప్పటికే నర్స్ గాయాల దగ్గర శుభ్రం చేస్తూంది. శృతి స్పర్శతో కళ్ళు విప్పాడతను.

          “నీ పేరేంటి బాబూ?!” ఓదార్పుగా తన చేతిని పట్టుకున్న శృతి వంక బేలగా చూసాడతను.

          “వేణు. వేణుగోపాల్” అస్పష్టంగా చెప్పాడు. దెబ్బతో కలిగిన షాక్, ధారలుగా కారిన రక్తాన్ని, క్షణాల్లో వాచిపోయి, అమితమైన బాధ పెడుతున్న కుడి కాలును చూసిన భయం అతని కళ్ళల్లో కదలాడుతున్నాయి. అంతకంటే ఎక్కువగా రేపటి నుండి తాను పనిలోకి వెళ్ళలేకపోతే?!… అన్న బ్రతుకు భయం వేణు హృదయాన్ని నులుముతోంది.

          “ఎలా దెబ్బతగిలింది వేణూ!” గాయాల్ని పరిశీలిస్తూ నొప్పి తెలియకుండా ఉండడానికి అతడ్ని మాటల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూంది శృతి. ఆమె ప్రశ్నతో పూర్తిగా తెలివిలోకి రావడానికి ప్రయత్నించాడు వేణు.

          “నాకు ఎన్నాళ్ళనుండో సైకిల్ మీద రయ్యిన వెళ్ళాలని కోరిక. మా ఓనరు బజార్లోకెళ్ళి అరటిపళ్ళు తెమ్మంటే ఆయన చూడకుండా దొడ్లోవున్న సైకిల్ ఎక్కి బయల్దేరాను. పెడల్స్ సరిగ్గా అందక బాలెన్స్ ను ఆపుకోలేక ఈయన స్కూటర్ కి అడ్డేల్లి పడ్డాను” తల మీద లోతుగా వున్నా గాయం చుట్టూ వెంట్రుకల్ని నర్స్ కత్తిరిస్తూంటే ఓర్చుకుంటూ జవాబిచ్చాడు వేణు.

          “ఆయన స్పీడ్ గా వేళ్తూ నిన్ను పడేశానని చెప్తూన్నాడే?!” కుట్లు వేస్తూ అడిగింది శృతి.

          “కాదమ్మగారూ! నేనే ఆయన స్కూటర్ కి అడ్డేళ్ళాను. ఆయనదేం తప్పులేదు” నిశ్చలంగా చెప్తున్నా అతని వంక ఆశ్చర్యంగా చూసింది శృతి. తప్పు తనదే అని ఖచ్చితంగా అందరికీ తెలుస్తున్నా ఎదుటివాడిమీదకు నెపాన్ని నెట్టేసి బుకాయించే వాళ్ళనే సామాన్యంగా చూసే శృతికి తప్పు తనదే అని స్పష్టంగా ఒప్పుకుంటున్న వేణు అపురూపంగా కనబడ్డాడు. “ఆయన తిడతారని నేను బయపడుతూంటే ఆయనే నన్ను భుజానేసుకుని రిక్షా దొరికే దాకా మోసుకుని తీసుకొచ్చారు”. కొట్టేసి పారిపోయే చాలామందిలా కాక జీవన్ వేణును తీసుకొచ్చి ట్రీట్ చేయిస్తున్నందుకు సంతోషించింది శృతి.

          కాలికి, తలకి ఎక్స్-రే తీయించాలని చెప్పగానే, ప్రక్కవీధిలో ఉన్న ఎక్స్-రే క్లినిక్ కు వేణును తీసుకెళ్ళి ఎక్స్-రేలు తీయించుకుని వచ్చాడు జీవన్. ఎక్స్-రేల్ని చూసాక మెదడుకు దెబ్బ తగిలిన సూచనలు కనపడడం లేదని, కుడికాలి ఎముక విరిగిందని, న్యూరోసర్జన్ కి ఒకసారి చూపించి, ఆర్థోపెడిక్ సర్జన్ తో కాలికి కట్టు వేయిస్తానని చెప్పింది శృతి. వేణుకు తక్షణ ప్రాణాపాయం ఏమీ లేదని తేలాక అప్పుడతని తల్లి దండ్రులకీ విషయం తెలియజేయాలనే విషయం గుర్తుకొచ్చింది. తల్లిదండ్రుల విషయం అడగగానే ముఖం ఇంకా వాడిపోయింది.

          “మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ పన్లోకి వెళ్ళింది”. తనకు దెబ్బ తగిలిన విషయం అమ్మకు తెలిస్తే యెంత తల్లడిల్లిపోతుందో గుర్తుకొచ్చి కలవర పడ్డాడు వేణు.

          “మరేలా?” వేణు బాధ్యతను స్వీకరించే వ్యక్తులెవరూ లేకుండా, వారి అనుమతి లేకుండా తన బాధ్యతతో అతనికి చికిత్స చేయించడానికి తటపటాయించింది శృతి.

          “మా ఇంటి దగ్గరి వాళ్ళకెవరికైనా చెప్తే మా అమ్మను తీసుకొస్తారు” వేణు చెప్పింది విని జీవన్ ఆలోచనలో పడ్డాడు. తాను అర్జెంటుగా ఆఫీసుకు వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. ఈ కుర్రాడి తాలూకు వాళ్ళంతా చేరితే వాళ్ళను తాను ఎదుర్కోలేడు. వాళ్ళు తనదే తప్పని తూలనాడతారు. తన దగ్గర సాధ్యమైనంత ఎక్కువ డబ్బు లాగడానికి ప్రయత్నిస్తారు. తన మెడమీద పోలీస్ కేసు అనే కత్తిని పెట్టి ఎన్నివేలిమ్మని డిమాండ్ చేస్తారో! తనకసలే ఒణుకుగా ఉంది. తన ఆఫీసుసులో కొలీగ్స్ కి ఫోన్ చేసి రమ్మంటేనో!… అదే నయం. వాళ్ళయితే కొంచెం దబాయింపుగా మాట్లాడతారు. తన ముఖం చూస్తే వీళ్ళు మరీ లోకువగట్టి మాట్లాడతారు.

          కబురు చేయడానికి ఎవరూ లేరు. కంపౌండర్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ఆర్థోపెడిక్ సర్జన్ వచ్చేలోగా వేణు వాళ్ళమ్మగారు వస్తే బావుంటుంది”. శృతి భావాన్ని అర్థం చేసుకున్న జీవన్ అప్పటి వరకు తన మనసులో మెదిలిన ఆలోచనల్ని ప్రక్కకు నెట్టి వేణు తల్లిని పిలుచుకు రావడానికి సంసిద్దుడయ్యాడు. తాను ఆమెను పిలుచుకుని వస్తే వేణుకు ట్రీట్మెంట్ మొదలుపెట్టడంలో జాప్యం జరగదనే వాస్తవమొక్కటే అతని మనసులోవుంది.

          “నేనావిడను తీసుకువస్తాను మేడం!” అంటూనే బయటకు వడివడిగా వెళ్తున్న అతని వంక ప్రశంసగా చూసింది శృతి. ఆక్సిడెంట్ చేసి దెబ్బతగిలిన వాళ్ళను వాళ్ళ ఖర్మానికి వాళ్ళను వదిలేసి పారిపోవడమో, లేక హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పటికీ వాళ్ళకు ట్రీట్మెంట్ కోసం కొంచెం డబ్బు పారేసి, వీలు చిక్కితే అదీ ఇవ్వకుండానే ఉడాయించేసే ప్రబుద్దులనే ఎక్కువగా చూసే శృతికి జీవన్ ఇంతటి నిజాయితీతో బాధ్యత తీసుకోవడం అబ్బుర మనిపించింది.

          కాసేపట్లోనే జీవన్ ఆఫీస్ కొలీగ్స్ ముగ్గురు వచ్చారు. వేణు చుట్టాలొక ఐదుగురు వచ్చారు. రావడం రావడమే జీవన్ పై కత్తులు దూస్తూ వచ్చారు. వేణు తల్లికి కబురుచేసి ఆవిడ వచ్చేలోగానే వేణుకు తగిలిన దెబ్బలని చూసి అగ్గగ్గలాడిపోతూ నానా హడావిడి చేశారు. “వీడు రేపు పన్లోకి వెళ్ళకపోతే వాళ్ళమ్మ ఒక్కత్తే సంపాదించి తెచ్చేదాంతో వాళ్ళ కడుపులు నిండవు. వీడి తరువాత వాళ్ళిద్దరూ రెక్కలు రాని పక్షులు. ఇప్పుడు కాలికి కట్టు వేశారంటే మూడునెల్లదాకా వీడు వీధిలోకి రావడానికి వీలుండదు. అంచేత మీరు కూడా కొంచెం ఆలోచించండి”. చల్లగా బేరం మొదలుపెట్టారు వేణు బంధువులు. నొప్పి తెల్వకుండా చేసిన ఇంజక్షన్ ప్రభావంతో మాగన్నుగా నిద్రిస్తున్నాడు వేణు. జీవన్, అతని స్నేహితులు గుసగుసగా సంప్రదించుకుని తమ బేరం చెప్పారు.

          “డాక్టర్ల ఫీజులు, మందులు, కట్లు వేయడానికి యెంత ఖర్చు!! ఇంతా పెట్టుకుని ఇంకా తరబడి ఇల్లు గడవడానికి కూడా ఇవ్వమంటే డబ్బు కట్టలిసరడానికి వీడేమీ లక్షాధికారి కాదు. మామూలు గుమాస్తా. మీరూ ఆలోచించండి మరి’.

          ఇరువర్గాల వారికి వాదులాట జరుగుతూ ఉండగా జీవన్ శృతి దగ్గరకు వచ్చాడు.

          “మేడం! వాల్లగొంతెమ్మ కోర్కెల్ని తీర్చగల శక్తి లేదు నాకు. దయచేసి మీరు కొంచెం కలగజేసుకుని వాళ్ళను ఒప్పించండి. నేను స్కూటర్ని స్పీడ్ గా నడిపి ఆక్సిడెంట్ చెయ్యడం తప్పే! ఒప్పుకుంటున్నాను కానీ..” అంతలో శృతి ఫోన్ ని అందుకున్న న్యూరోసర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ వచ్చారు. న్యూరో సర్జన్ మెదడుకు సంబంధించిన సమస్యేమీ లేదని నిర్థారించి వెళ్ళాడు. ఆర్థోపెడిక్ సర్జన్ జనరల్ ఎనస్థీషియా ఇచ్చి విరిగిన ఎముకను సరిచేసి కట్టు వెయ్యాలని చెప్పాడు.

          కట్టు వెయ్యడానికి సిద్ధంచేస్తూ ఎనస్థటిస్ట్ కోసం నిరీక్షిస్తూ ఉండగా వేణు తల్లి కొడుకుకు దెబ్బ తగిలిందని తెలిసి పరుగు పరుగున వచ్చింది. అమ్మ స్పర్శ తగలగానే కళ్ళు విప్పి తల్లిని అల్లుకుపోయిన బిడ్డను అక్కున చేర్చుకుని కన్నీళ్ళు కార్చిందామె.

          “నాన్నా! ఇన్ని దెబ్బలు తగిలించుకున్నావు, నీకేమన్నా అయితే నేనెలా బ్రతకనురా?!” కొడుకుని కౌగలించుకుని ఏడుస్తూ వెలుతురేలేని తన బ్రతుకుని తలచుకుంటూందామె.

          “ఆమ్మా! ఏడవకమ్మా! ఇంకెప్పుడూ ఇట్లా చెయ్యను. నీమీదొట్టు”. తల్లి తల మీద చెయ్యేసి వాగ్దానం చేసి ఆమె కన్నీళ్ళను తుడుస్తున్నాడు వేణు.

          కొంచెందూరంలో ఇంకా కొనసాగుతున్న వాగ్వివాదాలు తల్లీ కొడుకుల చెవుల్లో పడుతూనే ఉన్నాయి.

          “అమ్మా! ఆయనదేం తప్పులేదు. నేనే బాలన్స్ ఆపుకోలేక పడ్డాను.” తల్లితో రహస్యంగా చెప్పాడు వేణు.

          “ఒరేయ్! నువ్వు నోర్ముయ్యారా. పెద్దవాళ్ళేదో మాట్లాడుతున్నారు గదా!” వేణు పెద్దమ్మ కూతురు కసిరింది.

          “కానీ అన్యాయంగా మాట్లాడగూడదుగా!” నసిగాడు వేణు.

          “సింగినాదం! అన్యాయమంట అన్యాయం!! న్యాయంగా అడిగితె ఎవడిస్తాడ్రా? రేపటి నుంచి మీ అమ్మ ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుందిరా నీకు, నీ చెల్లెళ్ళకు తిండి?! చావుకు పెడితేనే కానీ, లంఖణానికి రారు. నువ్వు నోర్మూసుకునుండు. నాన్న, అన్నయ్యా సాధ్యమైనంత ఎక్కువ రాబడతారు”. అందామె. వేణు విచారంగా మౌనం వహించాడు.

          వేణు తల్లి దుర్గను చూడగానే గుర్తించింది శృతి. ఆమె పురుళ్ళన్నీ తన దగ్గరే అయ్యాయి. శృతి పలకరించగానే భర్తను తలచుకుని కన్నీళ్ళు పెట్టుకుంది దుర్గ.

          కట్టవేశాక వేణును రూమ్ లో పడుకోబెట్టారు. జీవన్ ఈ వ్యవహారంనింతటితో వదిలించుకోవాలని తొందర పడుతున్నాడు. ఒకరినొకరు దబాయిస్తూ ఇరువర్గాలవారూ బెట్టుగావున్నారు. జీవన్ మళ్ళీ శృతి దగ్గరచేరి ఏంటో కొంత స్వల్ప మొత్తం తీసుకోవడానికి వాళ్ళను ఒప్పించమని ప్రాధేయపడుతున్నాడు. అప్పటి వరకు కారుణ్యమూర్తిలా ప్రవర్తించిన జీవన్ లోని మరో కోణాన్ని దర్శిస్తూంది శృతి. అంతలో దుర్గ శృతి దగ్గరకు వచ్చి అక్కడ జీవన్ ని చూచి ఒక్కక్షణం తటపటాయించింది.

          “అమ్మగారూ! దిక్కులేని బ్రతుకయిపోయింది మాది. మా ఆయన పోయిన దగ్గర్నుండి కటిక చీకట్లో తచ్చట్లాడుతూ బ్రతుకుతున్నాము. పుస్తకాలు పట్టుకోవలసిన పసి చేతుల్తో నా బిడ్డ మెకానిక్ షెడ్డులో మోటు పనులు చేసి సంపాదించి తెస్తే గాని మా బ్రతుకులు వెళ్ళమారడంలేదు. ఎవరికి వాళ్ళకే ఏ రోజుకారోజు బ్రతుకు వెతుకులాటగా వున్నా బంధువులు మమ్మల్ని ఎన్నాళ్ళాదుకుంటారు? అందుకే కలోగంజో తాగుతూ మా పాట్లేవో మేము పడుతుంన్నాము”. శోకదేవతలా వున్నా దుర్గ చెపుతూంది విని జీవన్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడీవిడ ఉపోద్గాతమంతా దేనికి?! ఈ ఆకలి అరుపులన్నీ ఖచ్చితంగా అప్పనంగా తన దగ్గర్నుంచి డబ్బు కొట్టేద్దామనే దురుద్దేశంతోనే! డబ్బాశ ఎన్ని నాటకాలనైనా వేయిస్తుంది. దరిద్రం యెంత నీచానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. ఇప్పుడీవిడ తన జాలి కథతో, బుడిబుడి దీర్గాలతో డాక్టరమ్మగారి మనసు కరిగిస్తుంది. ఈవిడ మాయమాటల్లో పడిపోయి మేడం తనను వాళ్ళడిగినంత డబ్బు ఇవ్వమంటారో ఏమిటో! ఇందాక తనసలే నోరు జారాడు. పెద్ద గొప్పగా డబ్బు ఎంతైనా ఫరవాలేదన్నాడు. ఇప్పుడది తన మెడకు చుట్టుకుంటుంది. ఎలా తప్పించుకోవడం?!… అయినా తాను డాక్టరమ్మగారి మాట విని తీరాలని రూలేమీ లేదుగదా?! ఆ కుర్రాడికెలాగూ ప్రాణ భయం లేదని నిర్ధారణ అయిందాయె. తానిప్పుడు జడవాల్సిన పనెంతమాత్రమూ లేదు. వాళ్ళ తాటాకుచప్పుళ్ళకు బెదరకుండా నిబ్బరంగా నిలబడగలడు.

          “అమ్మగారూ! నా కొడుకు అవిటివాడు కాకుండా కాపాడండి” దుఃఖంతో పూడుకు పోయింది దుర్గ కంఠం. ‘తాను కోరుకోబోయేదానికి యెంత చక్కటి పునాది వేస్తూందో మహాతల్లి’ అనుకుంటూ ఆమె వంక కఠినంగా చూస్తున్న జీవన్ ఆమె చూపు తన వైపుకు తిరగగానే ముఖం తిప్పుకున్నాడు.

          “బాబుగారూ! మిమ్మల్నిలా అడగడం ఇష్టం లేదు నాకు. కానీ డబ్బులేని నేను నా ఇష్టాల ప్రకారం బ్రతకలేనని నాకు తెలుసు బాబూ! వాడి కాలికి నయమయ్యేదాకా ఏ బాదొచ్చినా అమ్మగారు చూసేలాగా ఏర్పాటు చేసి వెళ్ళండి చాలు. నా చేతికేమీ డబ్బివ్వొద్దు మీరు”. తన గుండె మీద నుండి కొండంత భారం దిగిపోయినట్లుగా ఒక క్షణం ఊపిరి పీల్చుకున్న జీవన్ కి అప్పటివరకు తన మనసులో మెదిలిన ఆలోచనలు గుర్తుకొచ్చి సిగ్గుతో చితికిపోతున్నాడు.

          “పేదరాలి కోపమే కాదు, ఆత్మాభిమానం కూడా చేటు అనే సత్యం నాకు అనుభవమైంది బాబూ! అందుకే నోరు తెరిచి అడుగుతున్నాను. నా బిడ్డ అవిటివాడు కాకుండా చూడండి. అంతే చాలు” భోరున విలపించసాగిందామె.

          ఆమె కన్నీళ్ళు జీవన్ మనసులోకి ప్రవేశించాలని ప్రయత్నించిన మాలిన్యాన్ని ఒక్క ఉదుటున బయటకు తోసేసాయి. అప్రయత్నంగా దుర్గ చేతినందుకున్న జీవన్ మాటలకందని ఆత్మీయతను, భరోసాను మౌనంతో అందిస్తున్నాడు.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.