ప్రేమ- మృత్యువు (శ్రీ అరవిందులు లవ్ అండ్ డెత్ కు డి. సత్యవాణి అనువాదం పై సమీక్ష )

-సునీత పొత్తూరి

“The Spirit shall look out through Matter’s gaze / And Matter shall reveal the Spirit’s face.”

          శ్రీ అరవిందులు మహా భారతంలోని రురు- ప్రమద్వరల కథ ఆధారంగా రాసిన  ‘Love and Death’ దీర్ఘ కవితను ‘ప్రేమ –మృత్యువు’ పేరుతో తెలుగులోకి ఇటీవలే అనువదించి, సొంతంగా ప్రచురించారు శ్రీమతి డి సత్యవాణి.

మూల_కథ

మహాభారతం ప్రథమాశ్వాశంలో రురు, ప్రమద్వరల ప్రసక్తి చాలా క్లుప్తంగా వుంటుంది. భృగుమహర్షి వంశజుడైన ‘రురు’ రుషి కుమారుడు, విద్యావంతుడు తపశ్శాలి.

          ప్రమద్వర -మేనకకు, విశ్వావసుడనే గంథర్వునికి జన్మిస్తుంది. ఆమెను పసిపిల్లగా వుండగానే స్థూలకేశుడనే ముని ఆశ్రమ ప్రాంతంలో  విడిచి పెట్టి, వారిద్దరూ తిరిగి దేవలోకం వెళ్ళి పోతారు. స్థూలకేశముని ఆశ్రమంలో పెరిగి పెద్ధదవుతుంది ప్రమద్వర.

          యుక్తవయసు వచ్చాక ప్రమద్వర అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఆటపాటలలొ వుండగా, అడవిలో హోమ సమిధలు  కోసం వచ్చిన ‘రురు’ ఆమెను చూసి ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో ఇద్దరికీ వివాహం నిశ్చయం అవుతుంది. ఇక వివాహం కొద్ది రోజులు వుందనగా.. ప్రమద్వర పాముకాటు వల్ల మరణిస్తుంది. అది తెలిసి రురు దుఃఖిస్తూ.. ఏకాంతంగా బాధపడతూంటే, ఒక దేవదూత కనిపించి జాలిపడి, అతను తన ఆయుష్షు లో సగం ఆమెకి ఇస్తే, ప్రమద్వర పునరుజ్జీవం పొందుతుంది అని చెబుతాడు.

          అందుకు సిద్ధమైన రురు, ప్రమద్వర తండ్రీ, గంధర్వుడు అయిన విశ్వావసు సాయంతో యమధర్మరాజు వద్దకు వెళ్ళి, తన సగం ఆయుష్షు ఇచ్చి ప్రమద్వరను బతికించుకుంటాడు. 

          మహా భారతంలోను, దేవీ భాగవతం, అష్టాదశ పురాణాల్లో కొంత కొంత ఈ కథను చదవవచ్చు. 

          అయితే శకుంతల కథ మల్లే,  ఏ కవి దృష్టీ పడకపోవడంతో  రురు-ప్రమద్వరల అపురూపమైన ప్రేమ కథకు తగినంత ప్రాచుర్యం లభించలేదు అన్నది వాస్తవం.

          సరిగ్గా.. ఆ కొరత తీర్చటానికే తానీ దీర్ఘ కవిత రాసానంటారు శ్రీ అరవిందులు.

          రురు ప్రమద్వరల కథని మహాభారతంలో చదివినపుడు సావిత్రి కథలాగే అనిపించిందిట శ్రీ అరవిందులకి. అయితే ఈ కథను తగినంత కావ్యాత్మకంగాను.. అందంగాను చెప్పక పోవడం వల్ల, లభించ వలసినంత ఆదరణ లభించలేదు అని చెబుతారు. ఆ లోటును భర్తీ చేయడం కోసము, అస్పష్టత నుంచి దూరం చేయడం కోసమూ తానీ కావ్యగాథను కవితగా మలచాను అంటారు అరవిందులు ఇందులో. 

          అలాగే కథకు, కథనానికి- బలాన్ని, పరిపుష్టిని కలిగించేందుకు, మదనుడు, యముడు వంటి అదనపు పాత్రలను ప్రవేశపెట్టారట. ఇంగ్లీషు పాఠకులు పలకడానికి అనువుగా ‘ప్రమద్వర’ పేరును ‘ప్రియంవద’ గా మార్చి ఈ దీర్ఘ కవిత రాసారుట.

          కథ ప్రకారం నిజానికి ఇది ‘ప్రేమ-త్యాగం’ కావాలి. కాని ‘ప్రేమ- మృత్యువు’ అన్నారెందుకు అనుకున్నా.. కొంత పరిశీలనాత్మకంగా ఈ దీర్ఘ కవితని చదివేదాకా.

ఈ కవితను స్తూలంగా మూడు భాగాలుగా చూడొచ్చు.

– రురు, ప్రియంవదల గాఢమైన ప్రేమ ;  పాము కాటుకు ప్రియంవద మరణించడం.

– రెండవది. తన ప్రియ సఖి దూరమై దుఃఖిస్తున్న రురుకి, కామునికి (cupid/                  మన్మథుడు) మధ్య జరిగిన సంభాషణ.

–  మూడవది. యమలోకంలో రురుకి యముడికి మధ్య సంవాదం.

ప్రేమ

“అతడు – నవ్వుతూ సూర్యుణ్ణి చూసి, 

“ఎంత అదృష్టమో, ఈ జీవితం, ఈ ప్రేమ..”

అని ఆనందంగా కేకపెట్టాడు.

“నిజంగా ఈ ఆనందం ఎన్నటికీ ముగిసిపోదు. లేదా మాకు ఎన్నటికి ముసలితనం రాదు.

నిరంతరం సజీవంగా పారే నదులవలె

ఎల్లపుడూ వీచే గాలివలె

మధురంగా సాగుతూ

పూలవలె వికసిస్తూ

స్థిరమైన వృక్షాలవలె సుదీర్ఘకాలం జీవిస్తాం..”

అతడు కలగన్నాడు!

 

రురు ప్రియంవదల ‘ప్రేమ

పర్వం’ లో రురు మనసు పాడిన గానం!

          మరు క్షణంలో పెను విషాదం. అతని కళ్లముందే అతని ప్రేయసి విషపు పురుగు కాటుకు బలై నేలకొరిగింది

          “నాగరికత పాడుచేయని ఆ ప్రకాశ వన్యప్రాంతంలో అకళంకితమైన వెచ్చని నూతన ప్రేమానుభూతితో రురు తన కన్నె వధువు ప్రియంవదతో, ఉషోదయం విరిసిన సుమంతో ఆడినట్టు సల్లాపాలాడుతున్నాడు..!

పసిడి బుగ్గలతో, అరమోడ్పు కన్నులతో,

మెత్తని చూపులతో

ధవళకాంతితో వెలిగే ప్రియంవద;

ఎర్రని ఆమె హృదయ పుష్పం అతడి కోసం

వికసించింది..

రురు కోసం, అతడి ప్రేమ కోసం..

          రురు వాంఛ ఆనంద కెరటాల్లో ఆ కలువ చుట్టూ నాట్యం చేస్తోంది. అతడి ఆత్మలో ప్రియంవద నృత్యం చేస్తోంది.

          అతడికి ఈ అవని ఈ ఒక్క సుమం కోసమే పానుపు పరచింది;

          ఆమెకు అతడి కౌగిలిలోనే సర్వప్రపంచం ఇమిడింది.” ఇలా మొదలౌతుంది..

          అందరు యౌవనవంతులానే.. రురు ప్రియంవదల ప్రేమ విడదీయలేని బంధం గా వర్ణిస్తూ కవిత సాగింది.

          తుఫాను ముందర ప్రశాంతతలా.. ఈ ప్రేమ వర్ణన చదివాక, హటాత్తుగా అతని కనులముందె..

          పాముకాటుకు నేలకొరుగుతుంది ప్రియంవద.  అతను మాటరాక నిస్సహాయంగా వుండగానే, ఆమెను సాకిన వనదేవతలు అక్కడ నుండి దూరంగా తీసుకుపోతారు.

          ప్రియంవద మరణ వియోగం తట్టుకోలేని రురు ప్రకృతిని నిందిస్తాడు కాసేపు.

          మరి కాసేపు ఆమె సాన్నిధ్యాన్ని కలగంటూ మైమరుస్తాడు. ఇంకాసేపటికె తన వియోగ బాధను వ్యక్తం చేస్తూ తాను ‘అందరిలా ఏడుస్తూ.. నిందిస్తూ కూర్చోనని, తానేమిటో నిరూపిస్తానని’ ప్రతిన పూనుతాడు. అడవిలో అశ్వత్థ వృక్షం అతని శాపవచనాలకు కంపిస్తుంది.

          ఇక్కొడొక కవి సమయం తీసుకున్నారు అరవిందులు. భృగుమహర్షి వారసుడిగా ఆ శక్తి అతనికి వచ్చిందంటారు. 

కామదేవత(మన్మధుడు)

అలా బాధపడుతున్న సమయంలోనే కామదేవత కనిపిస్తాడు రురుకి. ‘క్యూపిడ్’ కి సారూప్యం.

          అతడో ప్రేమ దేవత. ఎట్లాంటి ప్రేమకైనా తానే కారణంట. అది ప్రేయసీ-ప్రియుల ప్రేమే కావచ్చు, సోదర-సోదరీ ప్రేమ కావచ్చు, మాతృ ప్రేమ, తల్లీ-బిడ్డలు ఏదైనా కావచ్చు.

          అసలు మనిషికీ.. మనిషికీ మధ్య సహజంగా వుండాల్సిన ప్రేమ కూడా తన వైభవాలు అంటాడు మదనుడు.

          కొన్ని కలవరపెట్టేవీ వున్నాయిట-

          “ఓ మానవుడా ఆత్మ లోతుల్లోని గూఢవాంఛలు మహా తీవ్ర ఉత్కంఠలు నావే.” అంటాడు.

          ‘ తాను మనుష్యుల మధ్య ప్రేమను పెంచగలవాడినే కాని.. మృత్యువుతో  గెలవలేనని’ ఆ సంకల్పం వుంటే రురునే అందుకు సిద్దం కావాల్సిందిగా చెబుతాడు.

          ఎలాగట? అతడు తన ప్రేమనే కవచంగా ధరించి అధోలోకాలకు వెళ్లమని చెబుతాడు మన్మథుడు. అక్కడ మృత్యువు వుంటాడు. అతడు మిగతా దేవతల్లా పొగడ్తలు, కానుకలకు లొంగడు. అతనికి కావలసినది ప్రాణాలే!  బేరమే చేయాల్సి వస్తే, నీ సగం జీవితాన్ని త్యాగం చేయాల్సి రావచ్చు. అయినా ఎందుకీ ప్రయాస. మరో అందమైన యువతిని పెళ్లాడి జీవితం సుఖమయం చేసుకోవచ్చు కదా అంటాడు మన్మథుడు రురు తో. రురు మండిపడతాడు ఆ మాటకి. ఏమైనా సరే తన ఆయువులో సగం త్యాగం చేయడానికి సిద్దపడతాడు. అతని ప్రేమకి ముచ్చటపడి.. అలాగే కాంతులీనే పుష్పం అతనికిచ్చి వైతరణి దాటి పాతాళానికి పయనం కమ్మని చెబుతాడు.

          అట్లాగే యమలోకం చేరుతాడు.

(ఇక్కడ యముడికి బదులుగా గ్రీకు పురాణ దేవత పాతాళలోకపు రాజైన Hades పేరు వాడారు. )

యమడితో సంవాదం;

          “ఎలా రాగలిగావు? అసలెవరు నిన్ను ఇక్కడకు రానిచ్చారు?” అంటాడు యముడు.

          అందుకు బదులుగా.. ‘తన ప్రేమ పుష్పమే దారి చూపించిందని’ చెబుతాడు రురు.

          విషయం తెలిసాక.. సవాలు చేస్తూ తర్కానికి దిగుతాడు యముడు-

          “నీ జీవన-సాఫల్యమైన వార్థక్యాన్ని యిచ్చివేయాలి.. అప్పుడే ఆమె తిరిగి పుష్పిస్తుంది.”

          “సరే త్యాగం గొప్పదే అందుకు ప్రతిగా నీ మృతజీవిని నేను తిరిగి యిస్తాను. కాని ఒకటి గ్రహించు. నువ్వు త్యాగం చేయబోయేది నీ వార్థక్యం.

          వార్థక్యం విలువ తెలుసా? ” అని ప్రశ్నిస్తాడు.

          “యవ్వనం ఆశల భారంతో సదా ముందుకు చూస్తుంది. ప్రౌఢ వయసు తీవ్ర వాంఛల గాఢతలో శ్రమిస్తుంది. పెద్దతనం వీటన్నిటి తలపోత.. ఆ తరువాతే వార్థక్యం- అద్భుతమైన దశ నింగికి చేరువ

          ఆ వరాన్ని నువ్వు త్యాగం చేస్తావా? ఎందుకోసం? కేవలం కొన్ని సంవత్సరాల కోసం..

          కొన్ని రోజుల తర్వాత  ఆమె తిరిగి చేరాల్సిందే..” అంటాడు.

          అయినా పట్టు వదలడు రురు.

          ” ముసలితనాన్ని ఓ బాధామయ చెడుగానో, తేలిగ్గా త్యజించడానికే  దేవతలు మనిషికి ఇవ్వలేదు. కాని, ప్రశాంతంగా, ఠీవిగా, ఆ నిటారుగా, జారిపోయే దివ్యబాట వైపు- సుఖంగా అధిరోహణ చేయడానికి ఇవ్వబడింది.

          అందుకె కాలం ఇంకా మనిషిని యవ్వనానికి,ఆ వైభవానికి మృగతత్వానికి, క్రిందికి లాగి దెబ్బలు వేస్తుంది.—–

          పృథ్వి వైపు సాగే మనిషిని, అతడు కేవలం ‘ఆత్మ’ అని హెచ్చరించడానికి;

          కేవలం క్షణికత్వం అనుకునె బ్రతుకు మృత్యువుతో ముగిసిపోదని చెప్పడానికి;

          అతడు మాతృ హస్తాలకు మాత్రమే పరిమితం కాడు.

          ఏది పుట్టుక లేనిదో, ఏది శాశ్వతమో..జన్మలేనిదో ఆ చిరంతన ఆకాశానికి పిలువబడతాడు!

          ‘ఆత్మ పెరుగుతూ వుంటే దేహం అంతరిస్తుంది.’

***

          యవ్వనం ప్రౌఢత్వం నడివయసు,వార్థక్యం నాలుగు దశలు;

          అవి ముగిసినపుడు మృత్యువు చేరువవుతుంది..

          ఈ విధంగా జీవితం వర్ణించబడింది.”

          ఆత్మ పెరుగుతూండగా దేహాం అంతరించి పోవడం..– ఉపనిషత్తులు ఏది సత్యమని ఉద్ఘాటించాయో .. ఆ ఆత్మ మాత్రమే నిలచిపోయేది అంటాడు.

          ఇందులో రురుని హెచ్చరిస్తూ యముడు తెలియ చేసిన వృద్ధాప్యం యొక్క విలువా తక్కువ కాదు. అనుభవాల సోపానాల మీద పరమపద సోపాన పథాన్ని ప్రశాంతంగా అధిరోహించేందుకు ‘వార్థక్య దశ’ సాయం చేస్తుంది.

          రుద్ర చమకంలో ‘వృద్ధం చమే’ ‘ వృద్ధిం చమే’ అని వుంటుంది. వృద్ధిని, వృద్ధాప్యాన్ని కోరుకో దగినదిగా భావిస్తూ.

          రురు తన ఆయుష్షులో సగం ఇవ్వడం ద్వారా ఇద్దరూ అర్థాయుష్కులుగానే జారిపోతారు. వార్థక్య దశ చూడనే చూడరు. అందుకే యముడు అతను వదులుకోబోయే వార్థక్య దశ గురించి చెప్పడమే కాకుండా అదెలా వుంటుందో యవనిక మీ కదిలే చిత్రాల లా గోచరింప చేస్తాడు.

          “అక్కడ రురు తనకు తాను వార్థక్యంలో దివ్యంగా కనిపించాడు.

          అనంతం సన్నిధిలో రిషి వలె, పచ్చని పచ్చిక పై గానపరవశుడై;

          మహా విశాల శిఖరాగ్రం పై విస్తృత అనుభూతితో

          స్వల్ప విషయాలకు కదలిపోక,

          అతని చుట్టూ ఓ సనాతన వృక్షాన్ని ఆవరించి వున్నట్టుగా

          చిన్న అంకురాలు ఠీవిగా.. జ్వాలలవలె లేచాయి. అవి అతడి హస్తవాసిగా పెరిగాయి. అవి అతడి కార్యాలు.

          కాలం చేతికింద చెరిగిపోని మహా చక్రవర్తులు గాఢ సృజనాత్మక మనసు కలిగిన కవులు వారి పెదవులు వుచ్ఛరించె వాక్కులు

          మహా విస్తృత తాత్విక విత్తులు

          ఇవన్నీ పూజింపబడటం చూసాడు.

          పైన అబ్బురపరచె అపరాహ్ణపు మార్మిక వదనోదయం చూశాడు

          అంతా ఆ విశ్వ సౌందర్యంలో  లీనమైంది”

          దిగ్భ్రాంతికిలోను చేసే అనుభవం.. క్షణకాలం మైమరచినా, తిరిగి అదే పట్టుదలతో తన ప్రేయసి ప్రాణాలను మాత్రమే కోరుకొని సాధిస్తాడు రురు. పృథ్విని చేరతారు ఇద్దరూ.

          తిరిగి పృథ్వి ని చేరాక వారికి

          “పచ్చ పచ్చని ప్రపంచం.. సూర్యుని వెచ్చదనం… ..పృథ్వి పరిమళాలు.. కోయిల స్వరం” ఎప్పటి లాగే విందు చేస్తాయి.

          అది రురు విజయం. మృత్యువు పైన ప్రేమ సాధించిన విజయం. ఏది సత్యమో.. ఏది అనుభవైక వేద్యమో అదే ఇది.

          వృద్ధాప్యం, నిశ్చింతతో కూడిన జీవన దశను  ‘రురు’ త్యాగం చేసాడు అని చెబుతూ రురు కథకు ఆధ్యాత్మిక కోణాన్ని.. కావ్య శబలతను అద్దారు శ్రీ అరవిందులు.

నేపథ్యం

          ఈ దీర్ఘ కవితను రాసే సమయానికి శ్రీ అరవిందుల వయసు 27 సంవత్సరాలు (1899). సావిత్రి మహా కావ్యాన్ని వ్రాయడానికి మునుపే ఈ కవిత రాసారు అరవిందులు.

          ఈ కవితను రాసే సమయంలో తన మనస్థితి ఎలా వుందో చెబుతూ అరవిందులు అన్నమాటలివి;

          “it was written in a white heat of inspiration during 14 days of continuous writing—in the morning  of course, “–and he adds further  “I never wrote anything with such ease and rapidity before or after.”

(Sri Auribindo A biography  and history by K. R. Srinivasa Iyengar)

          అప్పటికి ఆయనకి భారతీయ ఆధ్యాత్మికత పూర్తిగా వంటబట్టలేదు.  తను చదివిన గ్రీకు పురాణాల ప్రభావం ఇందులో వుందని అంటారు. ఆ కారణంగానే మన పాతాళ లోకాన్ని పోలిన Tartarus ని, యముడిని  పోలిన Hades సామ్యాలతో కథ నడుస్తుంది.

          మరింత నిబద్ధతతో హిందూ పురాణ వర్ణం మేళవించి రాసినట్లై తే ఈ కవిత మెరుగైన విజయం సాధించేదేమో అని ఆయనే అభిప్రాయపడ్డారు. అదీ నిజమే అనిపించింది. పాశ్చాత్య ప్రభావం వలన ఈ అందమైన గాథ ప్రయత్నం చేసినా సాధించాల్సినంత పేరు తేలేక పోయిందేమో. 

          మరొక కారణం కూడా వుంది. శ్రీ అరవిందుల కవిత్వం సాధారణ పాఠకులకు ఏమంత సులభ గ్రాహ్యం కాదు. ఓ అధ్యయనంలా చదివితే తప్ప మనసుకెక్కదు.

          ఇక్కడే.. అనువాదకులు మనకు సాయ పడతారు. శ్రీమతి  సత్యవాణి గారు మూడు దశాబ్దాలకు పైగా అరవిందుల సాహిత్యం అధ్యయనం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అరవిందుల ‘సావిత్రి’, కొన్ని ఇతర రచనలను తెలుగులోకి అనువదించారు.  ఆవిడ సులభ శైలిలో చేసిన తెలుగు అనువాదం  ‘ప్రేమ-మృత్యువు’ రురు చదువరులకు అందుతుంది అనే భావిస్తాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.