బొమ్మల్కతలు-24

-గిరిధర్ పొట్టేపాళెం

 
          హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా.  జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తు పెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా కూడా ఆ విజువల్స్, ఆ అద్భుత మైన చిత్రీకరణ అనుభూతి కోసం వెళ్ళి సినిమా చూసేవాళ్ళు. అప్పుడు భారతీయ భాషల్లోకి డబ్బింగ్ చేసే ప్రక్రియ ఉండేది కాదు. నా చిన్నప్పటి హైస్కూల్ డేస్ లో అయితే “బ్రూస్ లీ” కరాటే స్టిల్స్ ఉన్న నోట్ బుక్స్ కి ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పటికీ బాగా గుర్తుంది. బ్రూస్ లీ “ఎంటర్ ది డ్రాగన్” ప్రపంచ సినిమా లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత అమెరికన్ కామిక్ బుక్ సిరీస్ వరసలో ముందుగా వచ్చిన “సూపర్ మ్యాన్” కూడా అంతగా పాపులర్ అయ్యింది. “బ్రూస్ లీ” అంతలా ప్రతిఒక్కరికీ చేరువ కాకపోయినా సూపర్ మ్యాన్ సినిమాలో హీరో “క్రిస్టొఫర్ రీవ్” పేరు చాలా మందికి బాగా గుర్తుండేలా. క్రిస్టొఫర్ రీవ్ సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఉన్న స్టిల్స్ నాకైతే పోర్ట్రెయిట్ డైమన్షన్స్ కి ఒక కొలమానంగా అనిపించేవి.
 
          అప్పుడప్పుడే కొలిచి గీసినట్టు, అచ్చుగుద్దినట్టు తెలుగు సినిమా హీరో, హీరోయిన్ల పోర్ట్రెయిట్స్ పెన్సిల్ తో  వేస్తూ కొంచెం కొంచెం నాసిరకం వాటర్ రంగుల బిళ్ళలతో పెయింటింగ్స్ మొదలు పెట్టిన నా ఇంటర్మీడియట్ కాలేజి రోజులవి. ఏదో ఆదివారం దినపత్రికలో నాకు దొరికిన సూపర్ మ్యాన్ స్టిల్ ఇది. ఆంధ్ర లొయోలా కాలేజ్, విజయవాడలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి సమ్మర్ శలవులకి “కావలి” వచ్చినపుడు వేసింది. పరీక్షలు కూడా రాసి ఇంటికి రావటంతో రెండు నెలలు ఖాళీ సమయం. బొమ్మలు వెయ్యటం, పత్రికలు తిరగెయ్యటం, నవలలు దొరికితే చదవటం, రోజూ పొద్దున కావలిలో ఉన్న మూడు లైబ్రరీలకి వెళ్ళి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ తిరగెయ్యటం, పెద్దమామయ్య ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకెళ్ళి కాసేపు అక్కడ ప్రింట్ అవుతున్న మెటీరియల్స్, పాంప్లెట్స్, పెళ్ళి పత్రికలు గమనించటం, అప్పుడ ప్పుడూ సాయంత్రం ఏదైనా సినిమాకి వెళ్ళటం ఇవే శలవుల్లో నా వ్యాపకాలు. పొద్దున్నే లేచి రోజంతా ఈ వ్యాపకాలన్నీ చేసినా ఒక్కొకరోజు సాయంత్రం అయ్యేసరికి ఏమీ తోచేది కాదు. అప్పుడు ట్యూబ్ లైట్ వెలుతురులో నేలమీద కూర్చుని ప్యాడ్ పెట్టుకుని బొమ్మలు గీసుకుంటూ కాలక్షేపం చేసేవాడిని. నాసిరకం వాటర్ కలర్ బిళ్ళల పెట్టె ఒకటి, అన్న కొన్నది ఇంట్లో వాడకుండా పడిఉండేది. వాడి విశ్వోదయ హై స్కూలులో ఆర్ట్ క్లాస్ కోసమని కొన్నది. నాకు పెన్సిల్ తో వెయటం బాగా వచ్చాక, పెన్నుతో కొంత కాలం బొమ్మలేశాక, రంగుల మీదికి మనసు మళ్ళింది. వాడక అలా పడున్న ఆ వాటర్ రంగు బిళ్ళల పెట్టె నేను వాడటం మొదలుపెట్టాను, ఒక డజను దాకా వాటితో చిన్న చిన్న వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశాను. వాటిల్లో ఈ “సూపర్ మ్యాన్” ఒకటి. రంగులు పేపర్ మీద వేస్తుంటే బాగా పాలిపోయినట్టుగా ఉండేవి . మిక్సింగ్ కి సరిగా సహకరించేవి కాదు. అయినా వాటిల్తోనే కొద్ది కాలం కుస్తీలు పట్టేవాడిని.
 
          ఒక్కొకసారి ఏమీ తోచని నాకు తన స్కూల్ రికార్డ్స్ నన్ను రాయమని అమ్మ పని కల్పించేది. అమ్మ ఎప్పుడు అడిగినా రాయను అనకుండా శ్రద్ధగా అన్నీ రాసి పెట్టే వాడిని. అమ్మ కావలి “జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల” లో జూనియర్ అసిస్టెంట్ గా, అంటే క్లర్క్ గా పని చేస్తుండేది. గర్ల్స్ హైస్కూల్ కి ఆనుకునే, పక్కన బాయ్స్ హై స్కూలులో టీచర్ గా నాన్న పనిచేశారు. ఊహించని విధంగా మమ్మల్నీ ఈ లోకాన్నీ వీడి నాన్న పోయిన ఒక్క నెలకే అమ్మ జాబ్ లో చేరవలసిన పరిస్థితి ఎదురైంది. ధైర్యం చెప్పి అమ్మకి అన్నీ తనే అయ్యి మా తాతయ్య, అంటే అమ్మ నాన్న అమ్మతో తొలి అడుగులు వేయించారు. అప్పుడు మేమున్న పరిస్థితుల్లో అమ్మ ఉద్యోగం చెయ్యకపోతే మా మనుగడ చాలా కష్టం అయ్యేది. అమ్మ చదివిన పి.యు.సి (అంటే ఇంటర్మీడియట్) క్వాలిఫికేషన్ కి అమ్మకి ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గర్ల్స్ హై స్కూలు మొత్తానికి అమ్మ ఒకటే క్లర్క్, స్కూలు రికార్డ్స్, నెల నెలా జీతాలు, పరీక్షల ఫీజులు, మార్కుల లిస్టులు, అన్నీ అమ్మ ఒక్కటే చూసుకునేది. నెల మొదటి వారం జీతభత్యాల లెక్కలు రాసి స్టాఫ్ అందరికీ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చే పని కూడా అమ్మదే. స్టూడెంట్స్ పరీక్షల ఫీజులు కట్టించుకుని ఆ డబ్బులు బ్యాంక్ లో వెళ్ళి జమ చేసే పనీ అమ్మదే. ఇలా నెల మొత్తం చాలా పని ఉండేది. పెళ్ళయ్యాక గృహిణిగా ఉంటూ ఇల్లు, సంసారం నాన్ననీ మమ్మల్నీ చూసుకుంటున్న అమ్మకి ఒక్క సారిగా జాబ్ చెయ్యాటానికి కావలసిన చదువున్నా ఆ పని బొత్తిగా తెలీదు, అనుభవం లేదు. స్కూల్ లో క్లరికల్, రికార్డ్స్ పని అస్సలు తెలీదు. ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలలు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ అమ్మకి ఎంతో ధైర్యం చెప్పి చాలా సపోర్టివ్ గా ఉండి నేర్పించింది అని అమ్మ చెప్పేది.
 
          శలవులకి నేను వచ్చినపుడల్లా ఆ రికార్డులు రాసే పని కొంతవరకూ నేనూ చేసిపెట్టే వాడిని. ఒక్కొక నెల పని భారంతో అమ్మ పడే టెన్షన్స్ కూడా ఇంకా గుర్తున్నాయి. పొద్దున 5 గంటలకి ముందే నిద్రలేచి కసువూ, కళ్ళాపి, ముగ్గుల పనులు ముగించి పాలు తీసు కుని రావటం, ఇంటి ఎదురుగా మున్సిపల్ కుళాయి దగ్గర బిందె లైన్లో పెట్టి నిలబడి మంచి నీళ్ళు పట్టుకోవటం, రోజుకి సరిపడా నీళ్ళు పట్టి తొట్టెలకీ, బకెట్లకీ పోసిపెట్టటం, మాకు కాఫీలు, టిఫెన్లూ చేసి పెట్టటం, అంట్లు కడిగి, బట్టలు ఉతికి ఆరేసి, మాకు మధ్యాహ్నానికి అన్నం, పచ్చడీ, కూరా వండి, అన్నీ వంటింట్లో సర్ది పెట్టి, తయారయ్యి తొమ్మిది గంటలకల్లా ఇంటికి తెచ్చుకున్న రికార్డు బుక్కులన్నీ పట్టుకుని నడచి స్కూలు కి వెళ్ళటం…ఇది రోజూ అమ్మ పొద్దున పని. ఆ పనుల్లో బయల్దేరే టైమ్ కొద్దిగా ఆలశ్యం అయితే పడే టెన్షన్ చాలా ఉండేది. అలాగే లంచ్ టైమ్ ఎర్రటి ఎండలో నడచుకుంటూ ఇంటికి వచ్చి గబగబా మాకు భోజనాలు పెట్టి, తనూ తిని స్కూలుకి పరుగులు పెట్టటం. సాయంత్రం నాలుగున్నరకి రాగానే బిందె పట్టుకుని నీళ్ళకోసం వెళ్ళటం, చీకటి పడే వేళకి మళ్ళీ వంటా, వార్పూ, పనులతో అలా అలసిపోతున్నా అలసట తెలియని మిషన్ లా తిరిగి తిరిగి అరిగిపోతూ కరిగిపోయిన కాలం తాలూకు రోజులవి.
 
          ఇప్పటికీ గుర్తుంది, ఆ సంవత్సరం సమ్మర్లో నేనే ఒక నెల రికార్డులు అన్నీ రాసి పెట్టాను. వాటిల్లో సంతకాలు పెడుతూ హెడ్మిస్ట్రెస్ చూసి చాలా మెచ్చుకున్నారంట. నా చేతివ్రాత గుండ్రంగా ఉండేది. “విజయలక్ష్మీ ఎవరు రాశారు ఈ నెల రికార్డ్స్?” అని హెడ్మిస్ట్రెస్ అడిగితే, “మా చిన్నబ్బాయి గిరి, కాలేజి నుంచి శలవులకొచ్చాడు” అని చెప్పిందంట. సమ్మర్ లో స్కూలుకి శలవులు, అయినా అమ్మకి మాత్రం నెల మొదటి వారం, చివరివారం రికార్డుల పని ఉండేది. అలా సమ్మర్ శలవుల్లో స్టాఫ్ అంతా పని చేయ్యకున్నా జీతాలు ఇవ్వాలి, క్లరికల్ పని తప్పదు కాబట్టి అమ్మకి సమ్మర్ శలవుల్లో నెల జీతంతో బాటు స్పెషల్ గా మరో 20 రూపాయలు వచ్చేది. ఆ సంవత్సరం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ ఆ స్పెషల్ డబ్బులు అమ్మకి ఇస్తూ “ఈ 20 రూపాయలు మాత్రం మీ చిన్నబ్బాయికి ఇవ్వు” అని చెప్పిందంట. అమ్మ వచ్చి ఎంతో సంతోషంగా నాకు చెప్తే నేనూ ఎంతగానో పొంగిపోయాను. ఆ డబ్బులు నేను తీసుకోలేదు కానీ, ఒక రకంగా నా మొదటి సంపాదన అని చెప్పుకోవాలంటే మాత్రం అమ్మ కష్టార్జితంలో నా వంతుగా నేను సాయం చేసి సంపాదిచిన మొదటి సంపాదన అదే. అదే శలవుల్లో అమ్మతో ఒకసారి పొద్దున్నే తోడుగా స్కూలుకి వెళ్ళి ఒక రెండు గంటలు నేనూ అన్నా ఇద్దరం అక్కడ ఉన్నాం. అప్పుడు వాళ్ళ హెడ్మిస్ట్రెస్ రూముకి అమ్మ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసింది. నా గురించి, నా చదువు గురించీ హెడ్మిస్ట్రెస్ అడిగి తెలుసుకుంది. తర్వాత అమ్మ వాళ్ళ స్టాఫ్ అందరికీ నా గురించి కూడా చెప్పిందని అమ్మ చెబితే గుర్తుంది. సరిగ్గా పదేళ్ళ తర్వాత మొదటిసారి నేను TCS లో జాబ్ చేస్తూ లండన్ వెళ్ళినపుడు అమ్మ స్కూల్ లో ఆ విషయం వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి చెప్తే చాలా సంతోషపడిందని, వాళ్ళ స్టాఫ్ అందరికీ “విజయలక్స్మి చూడండి పిల్లల్ని ఎంత గొప్పగా చదివించి వృద్ధిలోకి తెచ్చిందో” అంటూ చెప్పిందని తెలిసి నేనూ చాలా పొంగి పోయాను. మా చెల్లెలు లక్ష్మి కూడా అదే స్కూలులో చదువుతూ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ఉండేది. ఆటల్లో, పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ కాంపిటీషన్స్ లో ప్రైజెస్ అన్నీ తనకే వచ్చేవి. అలా మా గురించీ, అప్పటి మా ఫ్యామిలీ పరిస్థితి గురించీ బాగా తెలిసిన వాళ్ళ హెడ్మిస్ట్రెస్ కి, అమ్మంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. 
 
          ఈ బొమ్మలో కనిపించే “సూపర్ మ్యాన్” ఆ సినిమాలో సాదా సీదా మనిషే. కానీ తన ఎదురుగా ఏదైనా విపత్తు వస్తే అనుకోకుండా దివ్య శక్తి వచ్చి అతన్ని సూపర్ మ్యాన్ గా మార్చేస్తుంది. నయాగారా జలపాతంలో పడిపోతున్న చిన్న పిల్లని సైతం అందరూ అశ్చర్యంగా చూస్తుండగా గాలిలో ఎగురుతూ వెళ్ళి రక్షించి తీసుకుని వస్తాడు. ఇలా ఎన్నో సంభ్రమాశ్చర్యాలు కలిగించే సాహసాలు చేస్తుంటాడు. మా జీవితాల్లో అమ్మ నిత్యం చిన్న పిల్లలమైన మా కోసం మా కళ్ళ ఎదుటే రోజూ జీవితంతోనే సాహసాలు చేసింది. సినిమా మూడు గంటలే కాబట్టి ఆ సాహసం ఫలితం వెంటనే కనబడేలా తియ్యాలి. నిజ జీవితంలో ఇలాంటి అమ్మలు చేసే సాహసాల ఫలితాలు పిల్లలు పెద్దయ్యి ఎదిగి వృద్ధిలోకి వచ్చాక మాత్రమే కనిపిస్తాయి.
 
          ఏ శక్తీ అండగా లేకున్నా సరే ఒంటరిగా జీవితంతో పోరాటం చేసి పిల్లల జీవితాల్ని తీర్చిదిద్ది వాళ్ళని గెలిపించి తను గెలిచే ప్రతి అమ్మ ఒక సూపర్ వుమన్. సూపర్ మ్యాన్ అవ్వాలంటే అదృశ్య శక్తులూ, దివ్య శక్తులూ తోడవ్వాలేమో. సూపర్ అమ్మ అవ్వాలంటే ఏ శక్తీ తోడు అవసరం లేదు. భూమి పై అమ్మ సూపర్ మ్యాన్ ని మించిన పెద్ద సూపర్ శక్తి…
 
“మానవాళికి దేవుడిచ్చిన దివ్య శక్తి అమ్మ.”
 
క్రిస్టొఫర్ రీవ్ – సూపర్ మ్యాన్
Watercolors on Paper (8″ x 11″)
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.