మెసేజ్ బాక్స్

मेसेज़ बाक्स

హిందీ మూలం – డా. రమాకాంత శర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          ఇప్పుడు శుభాకాంక్షల సందేశాలు కేవలం మొబైళ్ళ మీదనే అందుతున్నాయి.
కొంతమంది పాతస్నేహితులు రిగ్యులర్ గానూ, కొంతమంది బంధువులు అప్పుడప్పుడూ “గుడ్ మార్నింగ్” వంటి శుభాకాంక్షలు పంపుతూ వుంటారు. పొద్దున్నే వాళ్ళ సందేశాలు చదవడానికీ, వాటికి జవాబివ్వడానికీ వాట్సప్ తెరవడం నాకు అలవాటై పోయింది. ఎవరితోనైనా కాంటాక్టులో ఉండాలంటే ఇదొక్కటే మార్గం మిగిలింది. లేకపోతే ఈ వేగ వంతమైన జీవితంలో ఎవరిగురించి అయినా యోగక్షేమాలు అడగడానికి, వాళ్ళను ప్రతి ఉదయం జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరిదగ్గర సమయం ఉంది?

          ఈరోజు చాయ్ తాగిన తరువాత నేను మెసేజ్ లు చదవడం ప్రారంభించాను. రోజూ
నాకు నియమం తప్పకుండా పంపేవారే పంపుతున్నారు. నేను ఒక్కొక్కటే మెసేజ్
ఓపెన్ చేస్తున్నాను. వాటికి జవాబు కూడా ఇస్తున్నాను. ఆఖరివరకూ వచ్చి నేను ఆగి పోయాను. ఈ సందేశం ఎవరిది? పంపించిన వ్యక్తి పేరు కాస్త తెలిసిందిలా అనిపిస్తోంది – “సంజన”. బుర్రతో కాస్త ఆలోచిస్తే ఆపేరుతో ఉన్న ఒక ముఖం వేగంగా మనస్సులో మెదిలింది. ఇంచుమించు ఎనిమిదేళ్ళ క్రిందట కాన్పూరు ఆఫీసులో నాతో పనిచేసిన సంజనే ఈమె. ట్రాన్స్ ఫర్ అయినతరువాత నేనావూరు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. అప్పటినుంచి ఆమెతో ఏవిధంగానూ కాంటాక్ట్ లేదు. మేమిద్దరం ఆ ఆఫీసులో కలిసి పనిచేశాం. కాని రిజర్వ్ గా ఉండే ఆ అమ్మాయితో నేను తక్కువగానే మాట్లాడేవాడిని. ఆమె నిజంగా చాలా అందంగా ఉండేది. ఆమెతో మాట్లాడటానికి ఎందరో తహతహలాడేవారు. కాని తను ఎవరికీ అవకాశం ఇచ్చేది కాదు. ఎనిమిదేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత ఆమె సందేశాన్ని ఇవాళ వాట్సప్ లో చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఎనిమిదేళ్ళలో నా మొబైల్ నెంబరు మారలేదు. అందుకనే సందేశాన్ని పంపడంలో ఆమెకి ఏమీ ఇబ్బంది కలిగి ఉండదు.

          “ఎలా వున్నారు మీరు? సుప్రభాతం” – సంజన

          నేను యాంత్రికంగా ఆమెకి జవాబు ఇచ్చాను – “బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఇన్నాళ్ళ తర్వాత గుర్తు చేసుకున్నారు. బాగుంది.”

          “చాలా రోజుల నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామనుకుంటున్నాను. మీరు గుర్తు పడతారో లేదోనని ఊరుకున్నాను.”

          “అవును. తెలుసుకునేందుకు కొన్ని క్షణాలు పట్టింది. కలిసి పని చేసేవాళ్ళం.
అప్పుడు కూడా మనమధ్య సంభాషణ ఎంత జరిగేది? కాని, మరిచిపోవడంలాంటిదేమీ
లేదు.”

          “నేను ఇలాగే ఉన్నాను. మనసు విప్పి ఎవరితోనైనా మాట్లాడాలంటే నాకు మొహ మాటంగా ఉంటుంది. అందుకే నేను మీకు ఫోన్ చెయ్యలేదు. రాసి మాట్లాడాలంటేనే నాకు సహజంగా ఉంటుంది.”

          “అంటే మీరెప్పుడూ ఫోన్ చెయ్యరు. నేను కూడా మీకెప్పుడూ ఫోన్ చెయ్యకూడదా.”

          “ఇలా మీరు-మీరు అంటారేమిటి? మీకన్నా చిన్నదాన్ని. “నువ్వు” అనవచ్చు నన్ను.

          అవును. ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు ఫోన్ కూడా చేస్తాను.”

          “సరే, ఇన్నాళ్ళ తరువాత ఉన్నట్టుండి నేనెలా జ్ఞాపకం వచ్చాను?”

          “జ్ఞాపకం చేసుకునేందుకు సాకు కావాలా? ఇంత పెద్ద గ్యాప్ వచ్చిందనిపించింది. మీరెప్పుడూ నన్ను గుర్తు చేసుకోలేదు. సరే నేనే చేద్దామనుకున్నాను.”

          “గుడ్. మంచి పని చేశావు. మనం కాంటాక్ట్ లో ఉందాం. సరేనా” 

          “సరే.”

          మర్నాటి నుంచి రోజూ పొద్దున్నే ఆమెనుంచి “గుడ్ మార్నింగ్” మెసేజ్ వస్తోంది. నేను కూడా దానికి జవాబు వెంటనే ఇస్తున్నాను. ఏరోజునైనా ఆమెనుంచి సందేశం రాకపోతే ఏదోలా ఉండేది. తరువాత తను మెసేజ్ పంపలేకపోవడానికి కారణం కూడా రాసేది. ఎప్పుడైనా నేను బిజీగా ఉండి జవాబివ్వలేకపోతే ఆమె తన చింతను వ్యక్తం చేసేది – “మీరెక్కడున్నారు? ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం అయింది. మీరేమీ జవాబివ్వలేదు.”

          నెమ్మదిగా గుడ్ మార్నింగ్ వంటి సందేశాలతో పాటు ఎక్కువగా క్షేమసమాచారాలు తెలుపుకునే పద్ధతిలో ఉండే ఇతర సందేశాలు కూడా ఇచ్చిపుచ్చుకోవడం  మొదల యింది. తనకి నచ్చిన ఇటువంటి సందేశాన్ని తను మెచ్చుకునేది. నా అభిరుచిని ప్రశంసించేది కూడా. నేను కూడా ఈ విషయంలో వెనకబడి ఉండేవాడిని కాదు.

          ఒకరోజున తను ఫార్వర్డ్ చేసిన సందేశం ఇది – “మంచి పుస్తకాలను, మంచి
మనుషులను వెంటనే అర్థం చేసుకోలేం. వాటిని లేదా వారిని చదవవలసి వుంటుంది.
మీకీ రోజు శుభప్రదం కావాలి.”

          నేను రాశాను – “చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ గుడ్ విషెస్ అండ్ లవ్లీ మెసేజ్. కాని కొన్ని పేజీలు చదవగానే వాస్తవాన్ని చూడగలుగుతామన్నది నిజం కాదా?”

          ఆమె వెంటనే జవాబిచ్చింది -“నాకు పుస్తకమూ అర్థం కాదు, మనుషులు కూడా.”

          “నువ్వు పంపిన మెసేజ్ చూడు. చదవవలసివుంటుందని రాశావు. మూసిన పుస్తకం,
మనుషులు ఎలా అర్థం అవుతారు?”

          “మొత్తం పుస్తకాన్ని, మనుషులనూ కూడా చదవడం నావల్ల కాదు. కవరు చూసి
పుస్తకాన్ని చదవాలనీ, స్వరూపం చూసి కాంటాక్ట్ చెయ్యాలనీ అనిపిస్తుంది కాని నేను పుస్తకాల పేజీలనీ, మనుషుల మనస్సులనూ కూడా తెరిచిచూడలేకపోతున్నాను.”

          “సరే, ఏదైనా పుస్తకం పూర్తిగా చదువు. దాన్ని ఎంత అర్థం చేసుకున్నావో నాకు
చెప్పు.”

          “సరే… మీరు అలా అంటూవుంటే… ఏదయినా పుస్తకం పేరు చెప్పండి”

          “ఏదో ఒక పుస్తకం తీసుకో. చదవడం మొదలుపెట్టు.”

          “సరే, ప్రయత్నిస్తాను.”

          ఆ తరువాత చాలా రోజులవరకూ ఆమె సందేశం ఏదీ రాలేదు. తను కూడా నా మెసేజ్ కి జవాబేమీ ఇవ్వలేదు. రోజూ ఆమె ఏదయినా మెసేజ్ పంపివుండవచ్చునని అనుకుంటూ నేను మెసేజ్ బాక్స్ తెరుస్తాను. కాని అదేం జరగడం లేదు.

          ఆరోజు ఆశించినదానికి భిన్నంగా మొదటి మెసేజ్ ఆమెది – “నేను మొత్తం
పుస్తకం చదివాను.”

          “ఏం పుస్తకం?”

          “పేరులో ఏముంది? మీ సలహాని పాటిస్తూ నాకు దొరికిన మొదటి పుస్తకం చదవడం
మొదలుపెట్టాను. కొన్ని పేజీలు చదివాక దాన్ని పూర్తిగా చదవాలా అక్కర్లేదా అన్నది తెలుస్తుందని మీరు సరిగానే చెప్పారు. నాకు కూడా ఊరికే సమయాన్ని వ్యర్థం చేసుకుం టున్నానని అనిపించసాగింది. కాని, చదువుతూ ముందుకు వెడుతున్నకొద్దీ ఇంటరెస్ట్ కలిగింది. పుస్తకం చదవడం పూర్తి అయాక నిజంగా పుస్తకం చాలా మంచిదని  అర్ధ మయింది.”

          “చూశావు కదా, నేను సరిగానే చెప్పాను కదా, పుస్తకం చదవడం మొదలుపెట్టమని.”

          “అవును. కాని పుస్తకం పూర్తిగా చదివితేకాని అది అర్థంకాదన్నది కూడా నిజం.
చాలా మంచి పుస్తకాన్ని కూడా మనం కొన్ని పేజీలు చదివాక తీసి పక్కన పెట్టేస్తాము. పుస్తకాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని మొదటినుంచి చివరవరకూ చదవడం అవసరం.”

          “మంచివాళ్ళని కూడా చదవవలసి వస్తుంది….”
          “చెడ్డవాళ్ళు కూడా చదవకుండా అర్థం కారు.”

          “అవును…. ఉన్నమాటే చెబుతున్నావు. సరే, పుస్తకం చదివేశావు. ఇప్పుడు ఎవరైనా
మనిషిని కూడా చదివి చూడు.”

          “మనిషిని చదవడం పుస్తకం చదవడమంత తేలికంటారా?”

          “ఎప్పుడైనా ప్రయత్నించి చూశావా?”

          “అవును… లేదు… అవును… తెలీదు.”

          “అలా అంటే ఎలా, సరే చదివి చూడు…. తరువాత నీ ఆఖరి అభిప్రాయం చెప్పు.”
మర్నాడు గుడ్ మార్నింగ్ మెసేజ్ తో బాటు ఆమె మరో మెసేజ్ ఫార్వర్డ్ చేసింది – “మిత్రుడు, పుస్తకం, మార్గం, ఆలోచన సరి అయినవి కాకపోతే తప్పుదారి పట్టిస్తాయి. కాని, అవి సరి అయినవి అయితే జీవితాన్ని బాగుచేస్తాయి, సుప్రభాతం.”

          “చాలా మంచి సందేశం. ఎవరైనా మిత్రుడుకాని, పుస్తకం కాని, దారి కాని లేదా
ఏమన్నా ఆలోచన కాని నిన్ను తప్పుదారి పట్టించాయా?” 

          “నేను ముందే చెప్పాను కదా. పుస్తకం చదవడంలో మనస్సు లగ్నం అయేది కాదు.
మార్గం ఏదీ నాముందు లేదు. స్నేహితులెవరినీ నేను ఏర్పరుచుకోలేకపోయాను.

          మరి ఆలోచన… ఆలోచన అయితే చాలా చేస్తాను. కాని పద్ధతి ఏదీ నిర్ణయించుకో లేకపోయాను.”

          “నాలో నీకు మిత్రుడెవరైనా కనిపిస్తున్నాడా?”

          “అవును. ఇప్పుడు కనిపిస్తున్నాడు.”

          “ఇంతకు ముందు కనిపించేవాడు కాదా?”

          “చెప్పాను కదా, ఇప్పుడు కనిపిస్తున్నాడని…”

          “అయితే, ఈ మిత్రుడు నిన్ను తప్పుదారి పట్టించలేదుకదా?”

          “మీరు సరయిన మిత్రుడు కానని అనుకుంటున్నారా?”

          “అది నువ్వు నిర్ణయించాలి.”

          “పుస్తకం మంచిదా కాదా అన్నది నిర్ణయించడానికి దాన్ని చదవవలసి వస్తుంది,
కదా?”

          “నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా అర్థం అవుతోంది. ఎవరైనా మంచి వ్యక్తి అవునా కాదా అన్నది నిర్ణయించడానికి ఆ వ్యక్తిని పుస్తకం లాగా చదవవలసి ఉంటుంది. అదే కదా?”

          “ఖచ్చితంగా. సరే, నేను సాయంత్రం నాలుగింటికి మీకు ఫోన్ చేస్తాను. సరేనా?”

          “అయితే ఫోన్ చెయ్యడానికి మనసొప్పిందా?”

          జవాబుగా తను మందహాసం చేస్తున్న ఇమోజీ చిత్రం పంపించింది. ఇన్నిరోజుల నుంచి మేము కేవలం చాట్ మాత్రమే చేస్తూఉన్నాము. మొదటిసారిగా ఆమె నాకు ఫోన్ చెయ్యబోతోంది. ఆ మర్నాడు ఉదయంనుంచి నేను సాయంత్రం నాలుగవడం కోసం ఎదురుచూడసాగాను.

          సెలవురోజు. సరిగా నాలుగింటికి ఫోన్ బెల్ మోగింది. నేను ఫోన్ ఎత్తి `హలో’ అన్నానో లేదో అవతలివైపు నుంచి వినిపించింది – “హలో, నేను మాట్లాడుతున్నాను.”

          “అవును. చెప్పు సంజనా. నీ గొంతుకలో ఏమీ మార్పు లేదు.”

          “నా కంఠస్వరమే ఒక గుర్తు…..జ్ఞాపకం ఉంటే” – ఆమె నవ్వుతున్నట్లు
వినిపించింది.

          “అది సరే. కాని నువ్వు పూర్తిగా మారిపోయావు. టచ్ మీ నాట్ లాగా, తనలోనే
లీనమై ఎక్కువగా మౌనంగా ఉండే అమ్మాయి, ఇప్పుడు స్వయంగా ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్న సంజన…..”

          “మీకు బాగుండలేదా?”

          “అబ్బే,.. అదేం కాదు.”

          ఆమె మళ్ళీ నవ్వింది – “మీరు నిజమే చెబుతున్నారు. ఈ ఎనిమిదేళ్ళ సుదీర్ఘ
కాలంలో ఇన్ని అనుభవాలను చూసిన తరువాత నాలో కొంచెం మార్పు అనేది వచ్చింది.
కాని, ఈ రోజున కూడా నేను ఎవరితోపడితే వారితో మనస్సువిప్పి నవ్వడం, మాట్లాడటం చెయ్యలేను.”

          “అంటే దీని అర్థం నేను అదృష్టవంతుడిననా…?”

          ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. తిరిగి గంభీరస్వరంలో అంది – “మీరింకా
పెళ్ళి చేసుకోలేదుకదా?”

          “చేసుకోలేదు.”

          “తెలుసు. ఏమైనా ప్రత్యేక కారణమా?”

          “అదేం లేదు. ఇంతవరకూ ఆలోచించలేదు. అంతేననుకో. నువ్వు పెళ్ళి చేసు కున్నావా?”

          “లేదు. ఎవరూ దొరకలేదు ఇంతవరకూ.”

          “అరే, ఇరవైయెనిమిదేళ్ళదానివయ్యావు నువ్వు. ఇంతవరకూ ఎవరూ దొరకలేదా?”

          “మీరు కూడా నాకన్నా రెండేళ్ళు పెద్ద. సరే… పోనివ్వండి. ఎవరితోనైనా జీవితం
గడపాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఎవరితో జీవితమంతా గడపాలో ఆ వ్యక్తితో జీవితం గడపడానికి మనస్సు అంగీకరించాలి కదా.”

          “అయితే మనుషుల్ని పూర్తిగా చదవడం మొదలుపెట్టు. ఎవరో ఒకరు అటువంటి వారు తప్పకుండా దొరుకుతారు.”

          “నిజం చెప్పమంటారా. మనుషుల్ని నేను చదువుతూనే ఉన్నాను.”

          “అలాగా, నువ్వు అన్నావు గదా, నాకు పుస్తకాలు కాని, మనుషులు కాని అర్థం కారని.”

          “ఎవరైనా చదివిన తర్వాతే ఇది చెప్పగలుగుతారు. నాకర్థం కాదని చదవకుండా ఎవరూ చెప్పలేరు.”

          “నువ్వు చెప్పింది కొట్టిపారేసే విషయం కాదు.”

          “నా గురించి ఆసక్తి చూపినవారిని నేను చదవటానికి ప్రయత్నించాను. కానివాళ్ళలో ఎవరూ స్నేహితుడు కనిపించలేదు. సరియైన మార్గం లభించలేదు. ఒక పద్ధతి అంటూ ఏదీ నిర్ధారణ కాలేదు.”

          “సరే, ఒక విషయం అడగనా, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నీకెందుకు జ్ఞాపకం వచ్చాను?”

          “ఎవరైనా జ్ఞాపకం రావడం ఏమన్నా నేరమా?”

          “నేను అలా ఎప్పుడన్నాను?”

          “సరే, ఇంక నేను ఫోన్ పెడుతున్నాను. వీలుపడితే రేపు ఆఫీసు తరువాత మళ్ళీ ఫోన్ చేస్తాను.” అలా అని ఆమె నిజంగానే ఫోన్ పెట్టేసింది. నాకు ఆమె ఒక ప్రహేళిక లాగా అనిపించింది. మనస్సు ఆమెని చదవడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ చిక్కుకు పోయింది.

          మర్నాడు ఉదయం నేను మెసేజ్ చూడటానికి కూర్చున్నప్పుడు అన్నిటికన్నా
పైన ఆమె సందేశం ఉంది – “అర్థం చేసుకోవడమనేది జ్ఞానం కన్నా లోతైనది. చాలా మందికి మీరు తెలుసు… కాని మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. గుడ్ మార్నింగ్.” 

          నేను వెంటనే జవాబు రాశాను – “వెరీ గుడ్ మార్నింగ్. నేను నిన్నుఎరుగుదును. కాని అర్థం చేసుకోలేకపోయాను. నీ ఫోన్ కోసం ఎదురుచూస్తాను.”

          ఆమె జవాబు కూడా వెంటనే వచ్చింది – “నన్నెప్పుడూ పుస్తకంలాగా చదివే
ప్రయత్నం చేయలేదా?”

          “మూసివున్న పుస్తకం ఎవరైనా ఎలా చదువుతారు?”

          “అలాగా? సాయంత్రం ఫోన్ చేస్తాను.”

          నేను ఆమె గురించి ఆలోచించసాగాను. ఆమె నాకు బాగానే ఉన్నట్లు అనిపించేది.
కాని, ఆమె చుట్టూ చాలామంది స్మార్ట్ గా ఉన్నవారు కనిపిస్తూఉండేవారు. ఆ వలయాన్ని ఛేదించడం, సాధారణంగా ఉన్న నాకు ఊహించడానికి కూడా అలవి కాదు. సాయంత్రం ఆమె ఫోన్ కోసం ఎదురు చూశాను. కాని ఫోన్ రాలేదు. బహుశా సమయం దొరకలేదేమో నని అనుకున్నాను. రెండోరోజు, మూడోరోజు కూడా ఫోన్ రాకపోయేసరికి కొంచెం చింత కలిగింది. ఆమె క్షేమసమాచారం అడగాలని నాకనిపించింది.

          రెండు-మూడు సార్లు బెల్ మోగినతరువాతనే ఆమె ఫోన్ ఎత్తింది. తను హలో
అనగానే నేను అడిగాను – “ఏమయింది? నువ్వు ఆరోజునే ఫోన్ చేస్తానని అన్నావు
కదా?”

          “ఏంలేదు. మాటిమాటికీ మీకు ఫోన్ చేసి ఎందుకు ఇబ్బంది పెట్టాలని అను కున్నాను.”

          “ఇదేమన్నా కారణమా? నువ్వు ఫోన్ చేస్తానన్నావు, అందుకని ఎదురు చూశాను. తర్వాత రోజులకొద్దీ గడుస్తూంటే దిగులు కలిగింది.”

          “అలాగా, మీకు నాగురించి దిగులు కలిగిందా?”

          “అవును. కలిగింది. కలగకూడదా?”

          “మీకు నాగురించి దిగులు కలుగుతుందో లేదో, మీరు నాకు ఫోన్ చేస్తారేమో
చూద్దామని అనుకున్నాను.”

          “నువ్వు నన్ను చదవడానికి ప్రయత్నిస్తున్నావా?”

          “మీరు కూడా నన్ను చదవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు
కదా?”

          “అవును. ఒక పజిల్ ఎదురుగా వచ్చి నిలిచింది. అది సాల్వ్ చెయ్యాలను కుంటున్నాను.”

          “సరే. పజిల్ సాల్వ్ చెయ్యడానికి కొంత క్లూ ఇస్తాను మీకు. నేను ఎనిమిదేళ్ళుగా ఎప్పుడు జీవితంలో అడుగు ముందుకు వేద్దామనుకున్నా మీ ముఖమే నాకు ఎదురుగా కనిపిస్తూవచ్చింది. కేవలం మీ కళ్ళలోనే నాకు ఆకలి కాకుండా నిష్కపటభావం కనిపించింది. ఎప్పటికైనా ఈ నిష్కపటంగా ఉన్న కళ్ళు నా కళ్ళలోకి తొంగిచూసి ఏమయినా చెప్పని విషయాలు చెబుతాయేమోనని అనుకున్నాను. కాని, ఈ మూసివున్న పుస్తకంలోని పేజీలు తిరగెయ్యడానికి మీరు ముందుకి రావడానికి, లేదా పుస్తకంలోని పుటలు గాలివిసురుకి వాటంతట అవే మీ ఎదురుగా తెరుచుకోవడానికి ముందుగానే మీకు ట్రాన్స్ ఫర్ అయింది. అంతా స్థిరంగా ఉండిపోయింది. వింటున్నారా?”

          “అవును, వింటున్నాను. చెప్పు.”

          “ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత పరస్పరం కాంటాక్ట్ చేసుకోవడానికి కారణంకాని, సాకు గాని ఏదీ లేదు. కొన్ని రోజుల క్రిందటనే మీకింకా పెళ్ళి కాలేదని నాకు తెలిసింది. అంతే, చదవడానికి పుస్తకం నేనే స్వయంగా మీ ఎదురుగా ఉంచాను.” 

          “ఊఁ. నన్ను చదవడంకూడా మొదలుపెట్టావా?”

          “అవును. మీ జీవితంలో నాకేమైనా చోటు ఉందో లేదో తెలుసుకోవాలి కదా?”

          “నీకేమనిపించింది?”

          “నన్నెప్పుడూ తప్పుదారి పట్టించని ఒక మిత్రుడు మీలో వున్నాడనే నమ్మకం
బలపడింది. నేనిప్పుడు మీ ఎదురుగా ఒక పజిల్ లాగా కాదు, ఒక తెరిచిన పుస్తకంలాగా
ఉన్నాను. మీరు మీ నిర్ణయం నిస్సంకోచంగా చెప్పవచ్చును. నాకు అనుకూలంగా
లేకపోయినా, నేనేమీ అనుకోను.”

          “నాకు ఆలోచించుకునేందుకు సమయం ఇవ్వు.”

          “అనుకోకుండా ఇదంతా మీ ముందుకి వచ్చింది. ఆలోచించుకునేందుకు సమయం మీకు తప్పకుండా ఇవ్వాలి. ఇంక తప్పుదారి పట్టించకండి మిత్రవర్యా. స్పష్టంగా చెప్పండి.” – ఇలా చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది.

          నేను రాత్రంతా ఆలోచించాను. కాన్పూరులో ఉన్న రోజుల నుంచి సంజన మెసేజిలు, నేను పంపిన మెసేజిలు, తరువాత ఫోన్ లో సంభాషణ… ఇవన్నీ మనస్సులో
ఎన్నోసార్లు మెదిలాయి. నిద్ర అతికష్టంమీద వచ్చింది. పొద్దున్న లేవగానే నేను మెసేజ్ బాక్స్ తెరవగానే అన్నిటికన్నా పైన నా మిత్రుడొకతని సందేశం ఉంది. సాధారణంగా నేను మెసేజ్ చదివి దానికి జవాబు ఇచ్చి తరువాతి మెసేజ్ తెరుస్తాను. కాని ఆ  సందేశం లో ఉన్న విషయం నన్ను ఆపుజేసింది. నేను అది మాటిమాటికీ చదివాను – “అతను ఒక్కసారే అన్నాడు మిత్రుడినని, తర్వాత నేనెప్పుడూ అనలేదు… బిజీగా ఉన్నానని.”
నేను సంజనకి ఇవ్వదలుచుకున్న జవాబు నాకు దొరికింది. నేను ఆ మెసేజ్ వెంటనే
ఆమెకి ఫార్వర్డ్ చేశాను.

          ఆమె జవాబు కోసం నేను ఎక్కువ నిరీక్షించవలసిన అవసరం లేకపోయింది – “ఫ్రెండ్ కోసం బిజీగా లేరని తెలిసి సంతోషం కలిగింది. మా మమ్మీ-డాడీలను కలుసు కునేందుకు ఎప్పుడు వస్తున్నారు?”

          “చాలా తొందరగా. నిన్ను కలుసుకునేందుకూ, నిన్ను చూడటానికీ కూడా నాకు తొందరగా ఉంది. త్వరగానే మనం స్నేహంకన్నా ఎక్కువైన బంధనంలో బంధితుల మవుదాం.”

          నేను మెసేజ్ బాక్స్ మూసేస్తున్నంతలోనే దానిలో మరో సందేశం మెరిసింది –

“ఎప్పుడైనా మనవల్ల బంధం చిక్కుపడితే
నీవు ఆ చిక్కుని పరిష్కరించు, ఎందుకంటే
నీ చేతిలో కూడా ఆ బంధానికి చెందిన
ఒక చివర ఉంటుంది కదా.”

          ఈ మెసేజ్ సంజన పంపింది కాదు. స్నేహితుడెవరో ఫార్వర్డ్ చేశాడు. కాని మేము ఏ దిశగా అడుగులు వేశామో, దానిని కొనసాగించేందుకు ఇది చాలా శక్తివంతమైన సందేశం ఇస్తోంది. నా పెదవులమీద ఒక మందహాసం తొంగిచూసింది. 

          నేను ఈ మెసేజ్ ని సంజనకి ఫార్వర్డ్ చేశాను. ఆమె జవాబుకోసం ఎదురు చూడ కుండా మెసేజ్ బాక్స్ ని క్లోజ్ చేసి లేచాను. నేను నా తల్లిదండ్రులకి కూడా విషయ మంతా చెప్పాలి. వారు నా నుంచి ఇటువంటి నిర్ణయంకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. కాన్పూరు వెళ్ళడానికి కూడా నేను ఏర్పాట్లు చేసుకోవాలి.

***

డా. రమాకాంత శర్మ – పరిచయం

1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత శర్మ 90కి పైగా కథలు వ్రాశారు. నాలుగు కథాసంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, నాలుగు నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాలపైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు
కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.