యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా (చివరి భాగం)

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

మెల్ బోర్న్ – రోజు 3 (ట్రామ్ & సాహితీ మిత్రుల కలయిక) & రోజు- 4 (అమెరికా తిరుగుప్రయాణం) 

మెల్ బోర్న్ లో మూడవ రోజున మధ్యాహ్నం వరకు యర్రా నది మీద బోట్ టూర్ చేసి బయటికి వచ్చేసరికి  ఒంటిగంట అయ్యింది. దగ్గర్లో భోజనం కోసం ఒక్కొక్కటిగా రెస్టారెంట్లన్నీ చూసుకుంటూ నడవసాగాం. మా వరు ఆస్ట్రేలియాలో తనకిష్టమైన ఇటాలియన్ రెస్టారెంటుకి తీసుకెళ్ళమని అప్పటికే రోజూ పోరుతూ ఉంది. మొత్తానికి మాకు అక్కడ చూడచక్కని ఇటాలియన్ రెస్టారెంటు కనిపించగానే అటు నడిచాం. బ్రుసేటా అనే పచ్చి టమాటాలు, ఆలివ్ నూనె వంటివేవో వేసిన బ్రెడ్ అమెరికాలో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అక్కడ బ్రుసేటా, పిజ్జా, బ్రింజాల్ (వంకాయ) ఫ్రైస్ వంటివి ఆర్డర్ చేసాం. తీరా చూస్తే బ్రుసేటా కూడా దాదాపు పిజ్జాలానే ఉంది ఇక్కడ. రెండూ పిజ్జాలే అయిపోయేసరికి తినలేక తినలేక తిన్నాం. వంకాయ ఫ్రైస్ ని సిరి ఇష్టంగా తింది.

          తిరిగి డాక్ ల్యాండ్స్ లోని మా హోటలుకి వచ్చేటపుడు అక్కడి ట్రాము సర్వీసు ఎలా ఉందో చూడాలని అనుకున్నాం. డాక్ ల్యాండ్స్  ట్రాము ఎక్కాలంటే  మేమున్న రివర్ ప్రామినాడ్ నించి బ్రిడ్జి దాటి అవతలి వైపుకి వెళ్ళాలి. సిరి పేచీ పెట్టకుండా ఉండడం కోసం నడుస్తూ అందరం తనతో కబుర్లు చెప్పసాగాం. సరిగ్గా పదినిమిషాల్లో బ్రిడ్జి దిగంగానే ట్రాఫిక్ లైట్ల మధ్యలో మార్కెట్ స్ట్రీట్ లో ఉంది ట్రాము స్టేషను. అక్కడ రకరకాల రంగుల్లో ట్రాము రూట్లని సూచిస్తూ మాప్ కూడా ఉంది. మెల్ బోర్న్ లో సెంట్రల్ ఏరియా నించి చుట్టూ దీర్ఘ చతురస్రాకారంలో కొన్ని ప్రధానమైన ఏరియాలని కలుపుతూ ఉన్న ఈ ట్రాము పూర్తిగా ఉచితం. కొన్ని రూట్లకి మాత్రం టిక్కెట్టు ఉంటుంది. అయితే ఉచిత ట్రాము వెళ్ళే రూటులో ఉన్న అన్ని స్టేషన్లకి “ఫ్రీ ట్రామ్ జోన్” (Free Tram Zone) అన్న ఆకుపచ్చ బోర్డు ఉంటుంది కాబట్టి మనం ఎక్కే ట్రాము ఉచితమా, కాదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. అయితే మాకు అక్కడ ఒక గొప్ప సందేహం వచ్చింది. “ఎటు వెళ్ళే రైలు ఎక్కాలా?” అని. అక్కడున్న బోర్డు ప్రకారం తరువాతి ట్రాము రూటు ఏ రంగు, ఏ నంబరు, ఏది చివరి స్టేషను, ఎన్ని నిమిషాల్లో వస్తుంది వంటి వివరాలు వేళ్ళాడుతున్న బోర్డులో కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కనిపిస్తున్న బోర్డులో మరో పదిహేను నిమిషాల తర్వాతి ట్రాము డాక్ ల్యాండ్స్ కి వెళ్తుందని వివరాలు కనిపించేక అదే అయివుంటుందని అనుకున్నాం. “ఒకవేళ కాకపోయినా వచ్చే నష్టం ఏవుంది? ఒక  రౌండ్ ఊరు చూసినట్టవుతుంద”ని నవ్వుకున్నాం కూడా. మొత్తానికి సరైన ట్రామేఎక్కాం. అందరికీ సీట్లు దొరికాయి. మా హోటలు ఎదురుగా రోడ్డు మధ్యలో ట్రాము స్టేషను ఉంది కాబట్టి సులభంగా స్టేషన్ని గుర్తు పట్టాం. ఒకవేళ తప్పిపోయినా ఆ తర్వాత సిగ్నలు అవతల కనిపించేదే చివరి స్టాపు కూడా.  ట్రాము ప్రతి స్టేషనులోనూ, సిగ్నలు దగ్గిరా ఆగుతూ వెళ్ళినా పది నిమిషాల్లో భలే సులభంగా మా హోటలు ముందు దిగాం. చక్కగా ఉంది ఈ సర్వీసు. అప్పటివరకు ఈ విషయాన్ని తెలుసుకోక టాక్సీలలో తిరిగి బోల్డు డబ్బులు వృథా చేసాం. సమయం ఉంటే ఈ ట్రాములో వెళ్ళడమే ఉత్తమం. 

          ఇక ట్రాము దిగి హోటలు లోపలికి వెళ్ళకుండా కాఫీ తాగుదామని ఎదురుగా ఉన్న “ద డిస్ట్రిక్ట్” (The Disctrict) అనే షాపింగ్ ఏరియాలోకి నడిచాం. పిల్లలు మొదట కనిపించిన గిఫ్ట్ స్టోర్ లోకి ఇంకా ఏవేవో కొనుక్కోవడం మర్చిపోయామని లాక్కెళ్ళారు.  అక్కడ కనిపించిన చిన్న ట్రాము మోడల్ బొమ్మని ఇష్టంగా కొనుక్కున్నాను నేను. అంత నచ్చింది మరి ఆ ట్రాము! ఇక్కడ కూడా నాణ్యత కలిగిన సరుకులు అమ్మే స్టోర్లు ఉన్నాయి. కాఫీ దుకాణం పక్కనే జెయింట్ వీల్ కూడా ఉంది. ఇక్కడ కూడా పిల్లలతో ఓ సాయంత్రం హాయిగా గడపొచ్చు. 

          నాలుగుగంటల ప్రాంతంలో హోటలుకి చేరేం. అయితే ఆ రోజు సాయంత్రం ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య ముఖ్య సభ్యులు, తెలుగు మల్లి  అంతర్జాల పత్రికా సంపాదకులు శ్రీ మల్లికేశ్వరరావు కొంచాడ గారు మెల్ బోర్న్ లోని సాహితీ మిత్రుల్ని కలవడానికి మమ్మల్ని ఆహ్వానించడంతో అందరినీ త్వరగా తయారవ్వమని హడావిడి చేశాను నేను.  పాపం అప్పటికే అలిసిపోయి ఉన్నా ఎవ్వరూ నామాట కాదనకుండా నిశ్శబ్దంగా తయారయ్యేరు. 

          దాదాపు అయిదున్నర ప్రాంతంలో ఊబర్ తీసుకుని మెల్ బోర్న్ లో మేమున్న చోటి నుంచి యాభై మైళ్ళ దూరంలో ఉన్న క్యారమ్ డౌన్స్ (Carrum Downs) లోని శ్రీ శివ విష్ణు దేవాలయానికి బయలుదేరాం. ఉదయం షికారు చేసిన యర్రా నది కిందుగా ఉన్న టన్నెల్ లోంచి ప్రయాణం చేసాం. ఊబర్ కారు డ్రైవర్ దారంతా కబుర్లు చెప్పాడు. హర్యానా నించి వచ్చాడట. చిన్నతనంలో చదువు మీద దృష్టి పెట్టేవాడు కాదట. ఆర్ట్ వెయ్యడం అంటే ఉన్న ఇష్టంతో ఫైన్ ఆర్ట్స్ లో బియ్యే చదివాడట. ఇక ఇంట్లో పోరుపడ లేక మరో దేశానికి వెళ్ళాలనుకునే తరుణంలో ఆస్ట్రేలియాలో హాస్పిటాలిటీ & బిజినెస్ మానేజ్ మెంటు కోర్సు చదవడానికి అవకాశం వచ్చిందట. ఆస్ట్రేలియా వచ్చి దాదాపు పదిహేనేళ్ళయ్యిందని, ఇక్కడి అధిక టాక్సు వ్యవస్థ వల్ల హోటళ్ళలో మేనేజరుగా పనిచెయ్యడం కంటే సొంత బిజినెస్ గా పరిగణనకి వచ్చే ఊబర్ డ్రైవింగే బావుందని అన్నాడు.  భార్యా పిల్లల్తో ఇక్కడ డబ్బు విషయకంగా బాగానే గడుస్తున్నా ఎంతైనా ఈ దేశంలో తానొక కార్మికుడిగానే జీవితం వెళ్ళబుచ్చాల్సి వస్తూ ఉందని వాపోయాడు. ఇంతకీ జీవితంలోని ఒడిదుడుకుల్లో పడి ఆర్ట్ కంటిన్యూ చెయ్యడానికి కుదరలేదని చెప్పినపుడు మాత్రం నేను ఆర్ట్ ని వదిలెయ్య వద్దని, జీవితం అంతా అయిపోయాక వెనక్కి చూసుకుంటే మిగిలేది అదేనని సలహా ఇచ్చాను. 

          దాదాపు గంట తరువాత శ్రీ శివ విష్ణు దేవాలయానికి చేరాం. పెద్ద ఆవరణలో ఎత్తైన గోపురం,  ప్రాకారాలతో చక్కగా నిర్మించారు ఈ గుడిని. గుళ్ళోకెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఎదురుగా విశాలమైన ఆటస్థలంలో కనిపించిన ఉయ్యాళ్ల దగ్గిరకి పరుగెత్తింది మా సిరి. ఊబర్ కారతను కూడా దర్శనం చేసుకుని మా దగ్గిర సెలవు తీసుకున్నాడు. 

          అక్కడ ఆ వారాంతంలోనే రచయిత్రి శ్రీమతి ఉషా శ్రీదేవి శ్రీధర గారి అమ్మాయికి పెళ్ళయిన సందర్భంగా కుటుంబ సమేతంగా సత్యన్నారాయణ స్వామి వ్రతం జరుపు కుంటూ అందరినీ ఆహ్వానించారు. ఆ సందర్భంగా అక్కడికి విచ్చేస్తున్న సాహితీ మిత్రులకి నన్ను పరిచయం చెయ్యడానికి మాకు కూడా ఆహ్వానం పంపారు రావు గారు. 

          వ్రత కథ పూర్తి కాగానే చివర హారతి సమయాన అద్భుతమైన గాత్రంతో చక్కని కీర్తనలు ఆలపించారు ఉష గారు. ఆవిడ తంబురా నాదంతో కలిసి తన్మయత్వంతో పాడుతుంటే ఎంతసేపైనా వింటూ ఉండాలనిపించింది.  మా చిన్నతనంలో మా ఇంట్లో ఇలా ఏ కార్యక్రమం జరిగినా  మా అమ్మ, పెద్దపిన్ని, చిన్న పిన్ని ఇలా శ్రావ్యంగా పాడడం, వాళ్ళ వెనకే తిరుగుతూ నేను పాటలు నేర్చుకోవడం గుర్తుకొచ్చింది. 

          అక్కడికి వచ్చిన సాహితీ మిత్రులందరినీ పరిచయం చేసారు రావు కొంచాడ గారు. అక్కడే రావు గారి శ్రీమతి ప్రత్యూష గారు, శ్రీమతి & శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం గారు, శ్రీమతి & శ్రీ నారాయణ రెడ్డి తూర్పురాపు గారు, శ్రీమతి & శ్రీ శ్రీనివాస్ బృందావనం గారు మొ.న వారందరినీ కలిసాం. ఇండియా నించి వచ్చిన ఉషా శ్రీదేవి గారి అమ్మగారు కూడా రచనలు చేస్తూ, సాహిత్యాభిలాష కలిగి ఉండడం విశేషం. ఉషా గారి పిల్లలు, మా పిల్లలు కూడా ఒకరితో ఒకరు చక్కగా తెలుగులో మాట్లాడుకుని మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. మా ఊరు జగ్గంపేట నించి వెళ్ళి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మా కజిన్ ఉషా, సంతోష్ వాళ్ళ చిన్నారులతో వచ్చి మమ్మల్ని కలిసారు. అక్కడే క్యాంటీన్ లో ఉషా శ్రీదేవిగారు ఏర్పాటు చేసిన విందులో అందరం కలిసి కబుర్లు చెప్పకుంటూ విందారగించాం. ఉషా గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కొసరి కొసరి వడ్డించారు. భోజనాలు కాగానే వారందరితో కాస్సేపు అక్కడే నాతో ఇష్టాగోష్టి నిర్వహించారు రావు గారు. నా రచనల్ని, అమెరికాలో నా సాహిత్య వ్యాసంగాల్ని పరిచయం చేస్తూ ఆత్మీయ ప్రసంగం చేశారు ఆయన. ఆ తరువాత  శ్రీ తూములూరి శాస్త్రి గారు, రావుగారు తదితరులు రాసిన భారతీవిలాసం, సిరిదివ్వెలు, అదిగో అల్లదివో మొ.న పుస్తకాల్ని అందజేసి సత్కరించారు. నేను తీసుకువెళ్ళిన కథలు, కవిత్వ పుస్తకాలను వారికి బహూకరించి దాదాపు రాత్రి తొమ్మిది న్నర ప్రాంతంలో వారి దగ్గర్నించి సెలవు తీసుకున్నాం. బయట బాగా చలిగాలి విసురుగా వీస్తున్నా ఉషా కుటుంబంతో పాటూ, రావు గారి కుటుంబం, అక్కడికి వచ్చిన వారంతా మేం టాక్సీ ఎక్కేవరకూ మాతో ఉండి మరీ వీడ్కోలు పలికారు. వారి ఆదరాభి మానాలకి ఆస్ట్రేలియా నా పుట్టినిల్లన్నట్లు అత్యంత ఆత్మీయంగా తోచి వారిపట్ల మనసంతా కృతజ్ఞతతో  నిండిపోయింది. 

          అలా ఆస్ట్రేలియాలోని ఆ చివరి రోజు సాయంత్రం వారందరితో చాలా సంతోషంగా గడిచింది. 

          తిరిగి వచ్చేటపుడు కూడా అనుకోకుండా హర్యానానించి వచ్చిన మరొక వ్యక్తి ఊబర్ కారులో వెళ్ళాం. 

          అతను కూడా వచ్చేటపుడు మమ్మల్ని తీసుకువచ్చిన వ్యక్తిలాగే అదే రకమైన హాస్పిటాలిటీ వంటి  కోర్సు చదివి, ఇక్కడి టాక్సు వ్యవస్థవల్ల ఊబర్ నడుపుకుంటు న్నానని చెప్పాడు. ఒకప్పుడు అక్కడ పర్మినెంట్ రెసిడెన్సీ సులభంగా వచ్చేదని, కానీ ఇప్పుడు సంవత్సరాలు పడుతూ ఉందని, తమలా స్టూడెంటు వీసాలో వచ్చినవారు అక్కడ స్థానిక సిటిజన్ అయిన వారిని పెళ్ళిచేసుకుంటే వీసా సమస్యలనించి బయట పడవచ్చని ఆసక్తికరమైన విషయం చెప్పాడు. 

          పదకొండు గంటల వేళ హోటలుకి  చేరేం. మర్నాడే మా తిరుగు ప్రయాణం. ఉదయం ఆరు గంటలకి మెల్ బోర్న్ నించి సిడ్నీ ఫ్లైట్. అక్కణ్ణించి పదకొండు గంటలకి లాస్ ఏంజిలిస్ ఫ్లైట్. దాదాపు ఒంటి గంటల వరకూ మేల్కొని అన్నీ సర్దుకున్నాం. 

          ఉదయం నాలుగు గంటలకల్లా మా పికప్ టాక్సీ రావడంతో రెండు గంటలకే లేచాం.  ఆ రోజు మా పెళ్ళిరోజు కావడంతో  తలస్నానాలు చేసి చకచకా రెడీ అయ్యాం. ముందురోజు అనుకోకుండా గుడికి వెళ్ళి రావడం, పెద్దల్ని కలవడం యాదృచ్చికమైనా మా పెళ్ళిరోజుకి వారందరి ఆశీస్సులు లభించినట్లయింది. పిల్లలు కూడా ఆ పదిరోజులు యంత్రాల్లా కాస్సేపు పడుకుని లేచి మాతో బాటూ తిరగడానికి అలవాటు పడిపోయి లేచి గబగబా రెడీ అయ్యారు. 

          మెల్ బోర్న్  ఎయిర్ పోర్టులో మా లగేజీ లాస్ ఏంజిలిస్ వరకే పంపుతాం, అక్కణ్ణించి లగేజీ తీసేసుకుని తిరిగి శాన్ ఫ్రాన్ సిస్కో కి మేం మళ్ళీ చెకిన్ చేసుకోవాలని చెప్పారు.  లాస్ ఏంజిలిస్ లో ఇమ్మిగ్రేషన్ చెక్ కూడా ఉంటుంది కాబట్టి ఇది తప్పదన్న మాట. 

          మెల్ బోర్న్  నించి సిడ్నీకి వెళ్ళే మా ఫ్లైట్ నిజానికి ఏడింటికైనా మేం ముందుగానే ఎయిర్ పోర్టుకి వెళ్ళిపోవడం వల్ల టికెట్టు కౌంటరులో  ఆరు గంటల ఫ్లైటుకి ఖాళీ ఉంది వెళతారా అని అడిగి మార్చారు మమ్మల్ని. సీట్లు బోల్డు ఖాళీ ఉండడంతో కిటికీ సీట్ల దగ్గిర ముగ్గురం కూర్చునే అవకాశం వచ్చినా నిద్ర బాగా రావడం వల్ల ఎవ్వరూ కిందికి చూడనేలేదు నేను తప్ప. ఎనిమిదింటికి సజావుగా  సిడ్నీ చేరాం. 

          సిడ్నీలో సమయం ఉండడం వల్ల బ్రేక్ ఫాస్టు చెయ్యగలిగాం. అయితే సిడ్నీనించి లాస్ ఏంజిల్స్ ఫ్లైట్ లో మేం బుక్ చేసుకున్న సీట్లు కాకుండా తలా ఓ చోటా ఇచ్చారు. ఎయిర్ లైన్స్ వాళ్ళనడిగితే ఫ్లైట్ నిండిపోయింది కాబట్టి ఫ్లైట్ ఎక్కాక ఎయిర్ హోస్టెస్లని అడగమన్నారు. తీరా ఫ్లైట్ లోని ఎయిర్ హోస్టెస్లు  ఫ్లైట్ బయలుదేరాక  తోటి ప్రయాణీ కులతో   మాట్లాడుకోమన్నారు. తోటి ప్రయాణీకులు నాకు కాళ్ళు పొడవని ఒకరు, ఆ సీటు ఎప్పుడో బుక్ చేసుకున్నానని ఒకరు, టాయిలెట్ ప్రాబ్లమ్ అని ఒకరు.. ఇలా తలా ఓ కారణం చెప్పసాగారు. అదసలే పదహారు గంటల ఫ్లైటు. మళ్ళీ ఎయిర్ హోస్టెస్ల దగ్గరకే వెళ్తే, వాళ్ళు మేమేమీ చెయ్యలేమనడం మొదలు పెట్టారు.  నాకు భలే కోపం, చికాకు వచ్చాయి. అయినా తమాయించుకుని పట్టువదలని విక్రమార్కురాలిలా ఎయిర్ హోస్టెస్లు ఒకరి తర్వాత ఒకరిని అడుగుతూ ఫ్లైట్ చివరి వరకూ వెళ్ళాను. మొత్తానికి ఒక ఎయిర్ హోస్టెస్ వెంటనే నా మొరవిని దేవుడిలా వచ్చి మా సిరి కూర్చున్న పక్కన సీట్లో ని వ్యక్తికి తగిన మరొక సీటు చూపించి మాకు సహాయం చేసాడు. 

          ఈ తలకాయ నొప్పి ఏదోలా తగ్గిందని సరిపెట్టుకున్నా లాస్ ఏంజిల్స్ లో ఇమ్మిగ్రేషన్ లైనులో రెండు గంటలు నిలబడేసరికి మళ్ళీ తలనొప్పొచ్చింది. అదీగాక లగేజీ దగ్గిర చికాకు మొదలయ్యింది. 

          మెల్ బోర్న్  నించి సిడ్నీ లగేజీ తూకాలన్నీ సరిపోయాయా లేదు అన్న దానిమీద మేం దృష్టి పెట్టాం కానీ మా చేతుల్లో ఉన్న లగేజీలో ఏ వస్తువులు పెట్టుకోవచ్చు అన్నది చూసుకోలేదు. ఈ విషయకంగా ఆస్ట్రేలియాలో ఏం ఇబ్బంది ఎదురుకాలేదు కానీ లాస్ ఏంజిల్స్ లో లగేజీ చెకింగ్ దగ్గిర మాత్రం మా హ్యాండ్ లగేజీ సూట్ కేసులో మేం మా మిత్రులకోసం, మా కోసం కొనుక్కున్న బూమరాంగ్ (boomerang) లు పట్టుకెళ్ళడం కుదరదని మళ్ళీ బయటికెళ్ళి సూట్ కేసుని చెకిన్ చెయ్యడం కానీ, లేదా అవన్నీ అక్కడ చెత్తబుట్టలో పడెయ్యడం కానీ రెండే మార్గాలని చెప్పడంతో ఎయిర్ పోర్టు బయటికెళ్ళి  మళ్ళీ లోపలికి వచ్చి లగేజీని చెకిన్ చెయ్యాల్సి వచ్చింది. ఇలాంటి పనులకి నేనే సిద్ధహస్తురాలిని కావడంతో నేను ఒక్కదాన్నీ వెళ్ళొస్తానని బయటికి వచ్చాను. అయితే ఎయిర్ లైన్స్ వాళ్ళు మిగతావాళ్ళు నాతో రాలేదు కాబట్టి డబ్బులు కట్టమనడంతో వాళ్ళతో వాగ్వివాదం తప్పలేదు. చివరికి నలుగురం ప్రయాణిస్తున్నామని సిస్టంలో చెక్ చేసి ఎలవెన్సు ఉండడంతో డబ్బులు కట్టకుండా లగేజీ చెకిన్ చేసుకున్నారు. కాబట్టి హ్యాండ్ లగేజీలో బూమరాంగ్ వంటివి చెక్కవైనా, ఆస్ట్రేలియాలో అవి వెపన్సుగా ఉపయో గిస్తారు కాబట్టి అమెరికా ఎయిర్ లైన్సు నిబంధనలు కూడా ముందే చూసుకోవాలని పాఠం నేర్చుకున్నాం. కానీ ఇదంతా అయ్యేసరికి మా తర్వాతి ఫ్లైట్ కి బోర్డింగ్ సమయం అయి పోయింది. పైగా అక్కణ్ణించి బస్సెక్కి వేరే టెర్మినల్ కి వెళ్ళాలి. ఎలాగైతేనేం చివరి నిమిషంలో ఫ్లైట్ అందుకున్నాం. 

          అక్కణ్ణించి శాన్ ఫ్రాన్ సిస్కో కి గంటే ప్రయాణం. ఇల్లు చేరుకునేసరికి మరో రెండు, మూడు గంటలు పట్టింది. దారంతా బాగా నిద్రపోయినందువల్ల అందరికీ అలసట పూర్తిగా తీరినట్లయ్యింది. ఇంటికి చేరగానే “హోమ్ స్వీట్ హోమ్” అంటూ పిల్లలు ఇంటి మీద బెంగ పెట్టుకున్నట్టు లోపలికి పరిగెత్తారు. ఆ సాయంత్రం మా ఊళ్ళోని గుడికి, డిన్నర్ కి నేపాలీ రెస్టారెంటుకి వెళ్ళి మా పెళ్ళి రోజుని విశేషంగా ఒక్కరోజులో రెండు ఖండాలలోనూ జరుపుకున్నాం. మొత్తానికి అక్కడక్కడా చిన్న చిన్న కష్టాలెదురైనా దక్షిణార్థగోళంలోని ఆస్ట్రేలియాని చూడాలన్న మా ఉత్సాహవంతమైన ప్రయాణం ఎన్నో చెదరని అనుభూతుల్ని, అనుభవాల్ని మాకు పంచి ఆనందదాయకంగా ముగిసింది.

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.