వ్యాధితో పోరాటం-24

కనకదుర్గ

          రాత్రి పడుకునేపుడు, నేనేం మాట్లాడకుండా ఏ గొడవ లేకుండా పడుకుందామను కున్నాను.

          “ఇంటికి ఎందుకు రాలేదు చెప్పు.” అని పదే పదే అడగసాగాడు.

          “ఊరికేనే, ఏం లేదు, చాలా రోజులయింది, అమ్మా, నాన్న దగ్గర ఉండి, వాళ్ళని మిస్ అవుతున్నాను. అందుకే…”

          ” అది కాదు, అసలు రీజన్ చెప్పు ఎందుకు రాలేదో.”

          ” ఏం కాలేదు, ఏం లేదు. ఒక్కరోజు మా ఇంట్లో ఉండాలనుకోవడం తప్పా?”

          ” అది కాదు, అసలు సంగతి చెప్పు.”

          “ఏం లేదంటే వినవేంటి?”

          “చెప్పు…”

          ఒక్కనిమిషం ఆలోచించాను. “నువ్వు కోపం తెచ్చుకోవద్దు, మళ్ళీ మాట్లాడకుండా మౌనంగా అయిపోవద్దు, సరేనా?”

          ” సరే!”

          ” ఏం లేదు, నేను అనుకున్నంత ఈజీగా లేదు అడ్జస్ట్ కావడం… అపుడపుడు చిన్న బ్రేక్స్ తీసుకుంటే కొంచెం మార్పుంటుందేమో! ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి ఎపుడన్నా ఒకసారి వచ్చి ఒక రెండ్రోజులుంటాను, అమ్మా, నాన్నకి కూడా కొంచెం బావుంటుంది అనుకుంటున్నా,” అంతే.

          అంతసేపు చెప్పు, చెప్పు అన్నవాడు సడన్ గా కామ్ గా అయిపోయాడు.

          మాట్లాడకుండా పడుకున్నాడు.

          నాకేమనిపించిందంటే శైలు చేసిన గొడవ మా ఇంట్లో అందరికీ చెప్పేసి నేను ఏడుస్తూ ఉన్నానేమో అనుకుంటూ వచ్చి ఉంటాడేమో!

          మర్నాడు నేను లేచి కాల కృత్యాలు తీర్చుకుంటుంటే అమ్మ కాఫీ చేసి, ఉప్మా టిఫిన్ కూడా చేసి పెట్టింది అల్లుడికి.

          నేను వచ్చి శ్రీనిని స్నానం చేస్తావా అని అడిగాను. శనివారం ఆఫీస్ ఉండదు, స్నానం చేసి, బోంచేసి సాయంత్రం ఇంటికి వెళ్దామంటాడనుకున్నాను.

          “లేదు, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను,” అన్నాడు.

          ” అయితే నేను స్నానం చేసి వస్తాను,” అని చెప్పి లోపలికి వెళ్ళాను.

          స్నానం చేసి వచ్చేవరకు వెళ్ళిపోయాడు. నాన్న, ” నువ్వు స్నానానికి వెళ్ళగానే, పాంట్, షర్ట్ వేసుకుని, వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడమ్మా. నేను అమ్మ భోజనం చేసి వెళ్ళమని ఎంత చెప్పినా వినలేదు. ఏమ్మా! అంతా బాగేనా? ఏదైనా సమస్యా?” అని అడిగాడు నాన్న.

          “వెళ్ళిపోయాడా? అయ్యో! అదేం లేదు నాన్న, అంతా బాగానే ఉంది. నన్నందరూ బాగా చూసుకుంటారు.” అని చెప్పాను కానీ మనసులో విపరీతమైన నిరాశా, నిస్పృహలు చోటు చేసుకున్నాయి.

          శ్రీని వాడిన టవల్ తీసేవరకు నా నోట్బుక్ పాతది అక్కడ పడి ఉంది. నాన్న దాంట్లో పద్దులు రాసుకుంటుంటారు.

          నోట్బుక్ తీసి పెట్టడానికి తీసే వరకు అందులోంచి ఒక నోట్ పడింది. అమ్మా, నాన్న లోపలికి వెళ్ళిపోయారు నయం. అసలే నాన్నకు అనుమానం వస్తుంది.

          ఆ నోట్ తీసి చదివాను. ” నీకు అన్నీ తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావు. ఇపుడు అడ్జస్ట్ కావడానికి రావటం లేదంటే నీ ఇష్టం. నీకు రావాలనిపిస్తే రా, లేకపోతే వెళ్ళి పోవచ్చు.”

          నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  ఏం రాసాడు? వెళ్ళిపోవాలా? ఎక్కడికి? ఎందుకు? పెళ్ళంటే బొమ్మలాటనుకుంటున్నాడా?

          నేనేమన్నాను, అడ్జస్ట్ కావడానికి నేననుకున్నదానికన్నా ఎక్కువ సమయం పట్టొచ్చని అన్నానే కానీ, నేను వేరు వెళ్దామనలేదు. అలా చెపితే అడ్జస్ట్ కావడానికి నీకెలాంటి సాయం కావాలో చెప్పు, నాకు చేతయినంతగా నేను సాయం చేస్తానంటాడను కున్నాను కానీ ఇలా నిర్దయగా వెళ్ళిపో అని ఒక్క మాటలో తేల్చేస్తాడనుకోలేదు.

          నాకు 22ఏళ్ళ వయసు, తనకి 26 ఏళ్ళు – నాలుగు సంవత్సరాల తేడా అంతే. అదే కాదు. డబ్బాలు కొట్టుకునే తత్వం కాదు, మద్రాస్ ఐ.ఐ.టి లో ఎం.టెక్ చేసాడు మంచి తెలివైన వ్యక్తి, పుస్తకాలు చదివే అలవాటుంది, కుటుంబం అంటే ప్రేమ.

          ఒకవైపు కోపం, ఉక్రోషం, మరో పక్క అమ్మ వాళ్ళు చూస్తే బాధ పడతారేమోనని కంగారు. అవును వీళ్ళే కదా! నేను వాళ్ళింట్లో అడ్జస్ట్ కాలేమోనని చెబుతున్నా అబ్బాయి మంచివాడు, మంచి ఉద్యోగం, నువ్వు కోరుకున్నట్టుగా కట్నం తీసుకోవడం లేదు, చదువుకోవడానికి అభ్యంతరం పెట్టడని నచ్చచెప్పి, చినమామయ్యతో నచ్చచెప్పించి మరీ చేసారు. ఇపుడు చెప్పనా, ఎంత మంచివాడో – చెప్పేయనా?

          “చిన్ని ఎప్పుడొచ్చావే? శ్రీనివాస్ రాలేదా?’ అనే మాటతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.

          మా అన్నయ్య పక్కనే ఉంటాడు. వచ్చాడు.

          “నిన్న మధ్యహ్నం వచ్చా అన్నా. శ్రీనివాస్ రాత్రి వచ్చాడు, ఇపుడే వెళ్ళిపోయాడు. ”  అన్నాను నన్ను నేను కూడతీసుకుని.

          ” ఈ రోజు శనివారం కదా! ఆఫీసుండదు ఈ రోజు, రేపు వుండి రేపు రాత్రికి వెళ్ళాల్సిం ది!” అన్నాడు అన్నయ్య.

          నాన్న వచ్చి, “మేమదే అన్నాము. కానీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.” నాన్నకు శ్రీని ప్రవర్తన అయోమయంగా ఉంది. ఎందుకంటే తన పేరు చిన్నల్లుడి పేరు ఒకటేనని, తనలాగే బాధ్యాతాయుతమైన మనిషని, కష్టపడి పని చేస్తాడని, చాలా మర్యాదగా ఉంటాడని, పెద్దలను గౌరవం ఇస్తాడని చాలా మెచ్చుకుంటుండేవాడు.

          నేను లోపలికి వెళ్ళాను. అమ్మని చూడగానే పట్టుకుని గట్టిగా ఏడవాలనిపించింది.

          “అమ్మా నీకు గుర్తుందా, నాకు ఎంట్రన్స్ లో మంచి మార్కులే వచ్చాయి కదా! నేను చదివింది వనితా కాలేజ్ లోనే కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే సీట్ వచ్చేది. అపుడు ఎం.ఏ ఇంగ్లీష్ పొద్దున, సాయంత్రం భారతీయ విధ్యాభవన్ లో జర్నలిజం చేసే అవకాశం వుండేది. కానీ పొద్దున్నుండి, రాత్రి దాక బయటే వుంటే ఇంట్లో వాళ్ళతో కలిసిపోవడం కష్టం అవుతుంది, అదీకాక మా అత్తగారికి కొంచెమన్నా సాయం చేయకుండా బయటే వుంటే బావుండదని ఒకటే నాకిష్టమయిన జర్నలిజం కోర్స్ చేస్తాను అని చెప్పాను….”

          “అవును గుర్తుంది. ఇపుడేమయింది?” అన్నది అమ్మ.

          ” ఏం లేదమ్మా! ఇట్లాంటివి గుర్తుపెట్టుకోరు మనుషులు..”

          మా అమ్మ దగ్గరకొచ్చి, ” ఏం జరిగిందమ్మా? నిన్నటి నుంచి చాలా ఢల్ గా ఉన్నావు. ఎవరేమన్నా అన్నారా?”

          ” ఏం లేదమ్మా! మీరు చాలా గుర్తొస్తున్నారని ఒక్కరోజు మీతో ఉందామనుకుని వచ్చాను. మనం కలిసి సమయం గడపనే లేదు.” అన్నాను పొంగుకొస్తున్న దు:ఖాన్ని అదిమిపెడ్తూ.

          “మీరిద్దరూ బాగున్నారా? గొడవలేం లేవు కదా!”

          ” లేవమ్మా, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. చదువుకుంటున్నాను. ఇంకేం కావాలి.” అన్నాను.

          ఉద్యోగం లేకుండా పెళ్ళి చేసుకున్నందుకు చెప్పు తీసుకుని నన్ను నేను బాగా కొట్టుకోవాలనిపించింది.

          పెళ్ళి కాక ముందు నేను రోజు ఏడ్ఛేదాన్ని కాదు. కాపురానికి వెళ్ళిన రెండు నెల్ల నుండి ఏడవని రోజు లేదు.

          పెళ్ళంటే అంత ఈజీకాదని, ఇద్దరూ ఒకరినొకరు బాగా తెలుసుకోకుండా పెళ్ళి చేసుకోకూడదని అంటే ఇద్దరూ సమాన బంధం కావాలనుకుంటే, ఆ బంధం ఎలా వుండాలి, మన జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇద్దరూ బాధ్యతలను సమంగా ఎలా పంచుకోవాలనే విషయాలు ముందే చర్చించుకోవాలి. ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరితో ఎలా ఉండాలి, అందరూ వచ్చిన కొత్త కోడలితో ఎలా ఉండాలి అనే అవగాహాన ఉండాలి. లేకపోతే సినిమాలో కోడలు రాగానే బాధ్యాతలన్నీ తీసుకుని ఎంత బాగా చూసు కుంటున్నా అత్తా, ఆడబిడ్డలు కష్టాలు పెట్టడం అయినా సహనంతో ఆ కోడలు అన్నీ భరించి పూజలు చేసి కుటుంబాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తుంది కదా! అలాగే ఉండాలను కుంటారు నిజజీవితంలో కోడళ్ళు కూడా!

          అన్నయ్య వచ్చి ఏదో మాట్లాడించాలని ప్రయత్నించాడు. కానీ నాకు ఎక్కువగా మాట్లాడాలని లేదు, లేచి అమ్మకి సాయం చేస్తానని వెళ్ళాను. అమ్మ వంట చేస్తున్నంత సేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. వంటయ్యాక ముగ్గురం కూర్చొని తిన్నాము. నాకు వెళ్ళాలని లేదు. నువ్వు రానక్కరలేదు అన్న మనిషి దగ్గరకు ఎలా వెళ్ళడం? వెళ్ళినా ఏం మాట్లాడటం?  నాకు జాబ్ వచ్చేదాక ఎందుకు ఆగలేదు అన్నదానికి సమాధానం, నాన్న రిటైర్ అయ్యి కొన్నేళ్ళయ్యింది, నా బరువు దించేసుకోవాలి, నా బాధ్యత తీర్చేసుకోవాలి అని మా అమ్మా, నాన్న తాపత్రయపడ్డారు. ఇప్పుడు నాకు చాలా కోపం వస్తుంది జాబ్ వచ్చేదాక చేసుకోనని ఎందుకు నేను గట్టిగా నిలబడలేదని నన్ను నేను తిట్టుకుంటున్నాను, చాలా విసుగొస్తుంది. ఎంతో ప్రేమ చూపించి, ఎప్పటికీ ఇలానే ఉంటానని చెప్పిన మనిషి, నేను కాపురానికి వచ్చేపుడు భయంగా వుందని, ఆకాశంలో ఎగిరే పక్షులంటే నాకు చాలా ఇష్టమని, అంత స్వేచ్చగా కాకపోయినా మా ఇంట్లో ఎలా ఉండేదాన్నో అలాగైనా ఉంటానో లేదో అంటే, ఎందుకంత భయం అక్కడ ఎలా ఉన్నావో, ఇక్కడ అలాగే ఉండు అని చెప్పిన మనిషి…  నా మనసులో చెలరేగే భావాలు తనతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటాను. అలా పంచుకోవడం కూడా తప్పని చెప్తున్నాడేమో? తను తన మనసులో మాట ఎలా చెప్పడో నేను అన్నీ నా మనసులోనే దాచుకుని కుమిలిపోవాలేమో! మనసు గాయపడింది. ఇంత త్వరగా ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు.

          ఇపుడేం చేయాలి?

          పోనీ శనివారమే కదా, ఆఫీస్ ఉండదు. ఈ రెండ్రోజులు ఉండి వెళ్దామని అన్నా బాగుండేది. ఏది చెప్పకుండా వెళ్ళిపోయాడు.

          నేను మధ్యాహ్నం ఇంటికి బయల్దేరాను. నాన్న,”నువ్వొక్కదానివి వెళ్తావా? నేను కూడా వస్తాను నీతో,’’ అన్నాడు.

          “వచ్చేపుడు నేనొక్కదాన్నే వచ్చాను కదా నాన్న. నే వెళ్తానులే,” అన్నాను.

          ” శ్రీనివాస్ కూడా ఉండి ఇద్దరు కల్సి వెళ్తే బావుండేది. ఈ రోజు శనివారమేగా ఉంటాడనుకున్నాము. మా ఇంటికి వచ్చినపుడు నిన్ను తీసుకుని వెళ్ళి విడిచిపెట్టా లమ్మా, లేకపోతే బావుండదు, మీ అత్తగారు వాళ్ళు ఏమన్నా అనుకుంటారు?” అన్నాడు.

          “మళ్ళీ రాత్రయిపోతుంది నువ్వు తిరిగిరావడానికి,” అంటే, “ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటాలే. ఒక్కరోజు ఉంచుకోరా నన్ను?” అన్నాడు నవ్వుతూ.

          సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. శ్రీనివాస్ లోపల పడుకుని వున్నాడు. అందరూ సాయంత్రం టీ తాగుతున్నారు. అందరింట్లో 3-4 గంటలకు టీ తాగితే వీళ్ళు సాయంత్రం 6.30-7 గంటలకు త్రాగేవారు. నాన్నకి ఇస్తామంటే వద్దన్నారు. ఆయన రెండు పూటలా కాఫీయే త్రాగేవారు.

          రాత్రి భోజనాలయ్యాక నాన్నకి పడుకోవడానికి ఏర్పాటు చేసి నేను లోపలికి వెళ్ళాను.

          శ్రీనివాస్ ఏదో బుక్ చదువుతున్నాడు. తనంత తానుగా ఏది మాట్లాడడు అందుకని నేనే అడిగాను,”అంత త్వరగా వెళ్ళిపోమ్మనడానికేనా నన్ను పెళ్ళిచేసుకుంది?”

          ఏం మాట్లాడలేదు.

          “నీకు మన కుటుంబాల విషయాలు తెల్సు. ఇది ఫారిన్ కంట్రీ కాదు, పెళ్ళి చేసుకున్నాము, కొన్నాళ్ళయ్యాక నచ్చలేదు కలిసి వుండలేము విడిపోదాము అనుకోవడానికి? అసలు నీ ఇష్టమయితే వుండు లేకపోతే వెళ్ళిపో అంటే నేనెక్కడికి వెళ్ళాలి. నువ్వే చదువుకో, ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అని చెప్పావు. ఏ కారణం వల్ల వెళ్ళిపొమ్మన్నావు నన్ను?”

          మళ్ళీ ఏం మాట్లాడలేదు. కాసేపు నేను ఏం మాట్లాడలేదు.

          కొద్ది సేపయ్యాక నా పక్కన వచ్చి కూర్చున్నాడు. “నాకు కోపం వచ్చిన మాట నిజమే! కానీ నేనట్లా అనకుండా ఉండాల్సింది సారీ!”

          “నీ ఇష్టమయితే ఉండు లేకపోతే వెళ్ళిపో అంటే ఇప్పటికిప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? మా ఇంట్లో వాళ్ళు అర్ధం చేసుకుంటారనుకుంటున్నావా? తప్పంతా నాదే అంటారు, నేనే సరిగ్గా అడ్జస్ట్ కాలేకపోయాను అందుకే నువ్వెళ్ళిపోమన్నావంటారు తెలుసా!” అప్పటికే కన్నీళ్ళు కారిపోతున్నాయి.

          పొద్దుటినుండి నేను పడ్డ ఆవేదనంతా వెక్కి వెక్కి ఏడవడంతో బయటికి వచ్చేయ సాగింది.

          బయటకి వినిపిస్తుందేమో అని మూతి మీద చెయ్యి పెట్టుకుని శబ్దం రాకుండా ప్రయత్నం చేస్తున్నాను.

          “అట్లా అన్నాను కానీ నువ్వు లేకుండా నేనుండగలనా? నీకు కష్టమవుతుందేమో, ఇక్కడ అందరితో అడ్జస్ట్ కావడానికి, నిన్ను ఇబ్బంది పెడ్తున్నానేమో అనిపించింది….”

          “ఇలాంటి సమస్యలు వస్తాయనే నేను పెళ్ళి చేసుకోనన్నాను. కానీ అమ్మా, నాన్న బాధ పడ్తారని ఒప్పుకున్నాను…”

          “వాళ్ళకి చెప్పలేను, నీకు చెప్పలేను. ఏం చేయాలో అర్ధం కాలేదు. నువ్వు నిన్న సాయంత్రం ఇంటికి రానంటే అస్సలు రావేమో అని భయమేసింది….”

          “నీతో అన్నీ మంచిగా కూర్చొని మాట్లాడదామని వచ్చాను, కానీ నువ్వు చాలా స్ట్రెస్స్ లో ఉన్నట్టనిపించి ఎక్కువ మాట్లాడలేదు….”

          “పొద్దునే తిక్కతిక్కగా అనిపించి బుర్రలో ఏదొస్తే అది రాసేసాను… ఇంటికి వచ్చి నప్పటి నుండి ఎందుకట్లా అన్నానా అని బాధ పడ్తూనే వున్నాను.”

          ఇదంతా బయటకు రావడానికి ఒక గంట పైనే పట్టింది. తన మనసులో ఏమున్నా బయటకు చెప్పడం అలవాటు లేదు. నేనన్నీతనకి చెప్పడం అలవాటే, కానీ తన కుటుంబం గురించి మాట్లాడితే అప్సెట్ అవుతాడని ఈ మధ్యనే ఎక్కువగా ఆ విషయాలు మాట్లడడం మానేసాను.

          “నేనేమి నీకీమధ్య చెప్పటంలేదు కదా! ఎందుకంత అప్సెట్ అయ్యావు? నేనెంత బాధ పడ్డానో తెలుసా? వెళ్ళాలన్నా నాకు జాబ్ లేదు. జర్నలిజం డిప్లోమా అయిపోతే ఏదన్నా న్యూస్ పేపర్ ఆఫీస్ లో జాబ్ చూసుకోవాలి అని అనుకున్నాం కదా!”

          “నువ్వు చెప్పకున్నా నాకు తెలీదా? రోజు నీ మనసులో ఎంత బాధ పడ్తున్నావో!”

          నేను తనని పట్టుకుని ఏడ్చేసాను. తను ఎవ్వరినీ బాధ పెట్టలేడని తెల్సుకున్నాకే నేను అడ్జస్ట్ అయిపోవాలని అనుకున్నాను, కానీ ఒకోసారి అమ్మమ్మగారి మాటలు, గొడవలు చూసి భయం వేస్తుంది. ఈ సమస్యకు పెద్ద పరిష్కారం లేదు అని ఇద్దరికీ తెలుసు. తను నేనెళ్ళిపోతే కనీసం నేను బాధపడకుండా ఉంటానేమో అనుకుని వుంటాడు. కానీ దాంట్లో వున్న కష్ట నష్టాల సంగతి ఆలోచించలేదు.

          ఇద్దరం మానసికంగా, నిద్రలేక అల్సిపోయాడేమో, కాసేపయ్యాక నిద్రలోకి జారుకున్నాడు శ్రీని.

          నిజంగా తను నేను లేకుండా ఉండలేడా? కొన్ని నెలలే కదా అయ్యింది కలిసి వుంటుంది. ఇది నిజంగా ప్రేమేనా? మధ్యతరగతి కుటుంబాల్లో నిజమైన ప్రేమలుం టాయా?

          అపుడు నాకు రంగనాయకమ్మ గారు ఒక ఆర్టికల్లోనో, బుక్ లోనో అంటారు, ” ఇద్దరు వ్యక్తులు కలిసి వుంటున్నారంటే ప్రేమవల్లే కాకపోవచ్చు, వారిద్దరు ఒకరికొకరు అలవాటై పోయి ఒకరు లేకపోతే మరొకరు ఉండలేమని అనుకుంటారంతే.”

          ఇంకా ఎంత జీవితం కలిసి వుండాలి… ఇపుడే ఎక్కడ అయిపోయింది. ఇంకా ఎన్నెన్ని సంఘటనలు ఇలాంటివో, ఇంకా కఠినమైనవి ఎన్ని ఎదుర్కోవాలో అనుకుంటూ నిద్రలోకి మెల్లిగా జారుకున్నాను.

          నేను సాయంత్రం కాలేజ్ కి వెళ్ళిరావడం, బోంచేసి కాసేపు క్లాస్ వర్క్ చేసుకుని ఏదైనా బుక్ చదువుతూ పడుకోవడం. ఎక్కువ ఏ విషయాలు ఆలోచించకుండా, నా పనులు నేను చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. వీకెండ్ లో ఇంట్లో వుండేవాడు శ్రీనివాస్. బయటికి ఎక్కడికైనా వెళ్దామని అనేవాడు కాదు ఎప్పుడు. నేను కూడా ఎందుకులే అనవసరంగా గొడవ అని చదువులో దృష్టి పెట్టసాగాను. ఒకోసారి మా మామ గారు పిలిచి, ఊరికే లోపల ఉండడం ఎందుకురా? కొత్తగా పెళ్ళయిన వారు చక్కగా సాయంత్రం బయటకు వెళ్ళండి. ఒకోసారి వెళ్ళేవాళ్ళం, ఒకోసారి లేదు. ఒక రోజు సడన్ గా వాంతులు మొదలయ్యాయి. ఒకటి రెండ్రోజుల్లో తగ్గిపోతుందిలే అనుకుంటే తగ్గలేదు. కళ్ళు బాగా తిరగసాగాయి.  అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళి చాలా రోజులయ్యింది,  శ్రీనివాస్, నేను కల్సి వెళ్ళాము. అక్కడ కూడా ఒకటి రెండుసార్లు వాంతులయ్యాయి. అమ్మకి  డౌటొచ్చింది. నాకేమో ఏం లేదు ఏదో తిన్నది పడలేదేమొ అందుకే డాక్టర్ దగ్గరకు వెళితే ఏదైనా మందిస్తే తగ్గిపోతుందిలే అని అనుకున్నాను. అమ్మ భోజనాలయ్యాక నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాక, “చిన్ని, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వద్దాం బట్టలు మార్చు కుని రామ్మా.” అంది అమ్మా.

          “అబ్బా! ఇపుడా, నిద్రొస్తుందమ్మా!,” అన్నా బద్దకంగా.

          “ఒక గంటలో వచ్చేద్దాం, వచ్చాక పడుకో కావల్సి వస్తే.”

          శ్రీనివాస్, అన్నయ్య బయట రూంలో మాట్లాడుకుంటున్నారు.

          బలవంతంగా లేచాను.

          రిక్షాలో డా.ధన్యశ్రీ దగ్గరకు వెళ్ళాము.

          ఆమె చెయ్యి పట్టుకుని చూసి కొన్నిప్రశ్నలు వేసింది. అమ్మతో, ” మీరు అమ్మమ్మ అవ్వబోతున్నారు, మాకు స్వీట్ తినిపించాలి,” అంది నవ్వుతూ.

          నేనేమి మాట్లాడలేదు. ఇదేంటి ఇట్లా అయ్యింది. నేను మరీ షాక్ అవ్వకున్నా, ఇపుడే కాకపోతే బావుండు, నా జర్నలిజం కోర్స్ అయిపోయి, ఏదైనా వార్తాపత్రికలో కానీ పత్రికలో కానీ ఉద్యోగం వచ్చాక ఎన్నో మంచి మంచి ఆర్టికల్స్ రాసాక, జాబ్ రొటీన్ అలవాటయ్యాక అపుడు పిల్లలు అనుకున్నాము.

          నాకు పిల్స్ పడలేదు, ఇంక వేరే పద్దతుల గురించి డాక్టర్లని కనుక్కుంటే అవి అందరికీ సరిపడవు అని చెప్పడంతో శ్రీనివాసే ఏం వద్దులే, “ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్,” తనే కండోమ్స్ వాడేవాడు. చాలా జాగ్రత్తగా ఉన్నామనే అనుకున్నాము. నాకు పిల్లలంటే ఇష్టం. మనం పెద్దవాళ్ళమయ్యాము, మనమే బాధ్యతగా ఉండాలి కానీ మనకి ఇపుడు వీలు కాదు కదా అని అబార్షన్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. సెటిల్ అయ్యాకే పిల్లలయితే చాలా బాగుంటుంది. అలా కాకపోతే మాత్రం నేను సెటిల్ అయ్యాక కంటాను, ఇపుడు ఇంకా జీవం పోసుకోని ఒక ముద్దని తీసేసుకుంటే పెద్ద ప్రాబ్లెం ఏంటి? అని అనే వారున్నారు. అలా చేయించుకునే వారుంటారు. కానీ నేను శ్రీనివాస్ తో ముందే చెప్పాను. మనం జాగ్రత్తగా ఉండాలి లేదు ఏదైనా అయితే మాత్రం నేను అబార్షన్ చేయించుకోను అని చెప్పేసాను. కానీ నిజంగా నాకీ పరిస్థితి ఎదురవుతుందని అనుకోలేదు.

          అమ్మకి అర్ధం అయ్యింది నేను కొంచెం షాక్ లో ఉన్నాన్నని. ఇంటికి వచ్చేదాక ఏం మాట్లాడలేదు.

          శ్రీనివాస్ రెడీగా వున్నాడు. నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంటే గదిలోకి వెళ్ళి పడుకున్నాను. 

          మేం ఇంటికి వచ్చేవరకు అక్కా, బావ, పిల్లలు వచ్చారు. ఇల్లంతా సందడిగా వుంది.

          శ్రీనివాస్ మెల్లిగా నేను పడుకున్న గదిలోకి వచ్చాడు. నేను అటు తిరిగి పడుకు న్నాను. మెల్లిగా నా పైన చెయ్యి వేసి, “చిన్ని, డాక్టర్ ఏమన్నది? ఏదైనా తిన్నది పడలేదా? ప్లీజ్ చెప్పు నాకు చాలా టెన్షన్ గా ఉంది,” అన్నాడు.

          గిర్రున ఇటు తిరిగాను, “ఎందుకంత టెన్షన్? చెప్పు?” అన్నాను కొంచెం కోపంగా.

          “ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? అసలు డాక్టర్ ఏమన్నది?” అని చేతులు పట్టుకుని అడిగాడు.

          “ఇంకేమంటుందనుకున్నావు?”

          “అంటే?”

          “ఐయామ్ ప్రెగ్నెంట్ మిష్టర్ శ్రీనివాస్.”

          “కానీ ఎలా?”

          “అది నీకే తెలియాలి.”

          మా అక్క కిటికీలో నుండి చూసింది. మా అమ్మ తర్వాత వచ్చి చూసింది. తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళారు.

          శ్రీనివాస్ మనసు సున్నితమైంది.

          తను భార్య దగ్గర కూర్చుని తన ఆరోగ్యం గురించి అడుగుతున్నాడు. అది కూడా తప్పేనా?

          మేం అందరి ముందు రోమాన్స్ చేయటం లేదు కదా!

          “చిన్ని! టీ లోపలికి తేవాలా? బయటికి వస్తారా?” అని మా అక్క అడిగింది.

          “ఇపుడొద్దని చెప్పు,” శ్రీనివాస్.

          “వస్తున్నాం బయటికి. నీకు అక్కర్లేకపోతే నువ్వు తాగకు, కానీ నాకు కావాలి టీ.” అని లేచాను జడ పైకి ముడి వేసుకుంటూ.

          “ఇపుడెలా?” అన్నాడు దిగాలుగా మొహం పెట్టి.

          “టీ తాగడానికి కూడా అంత ఆలోచించాలా?”

          “నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకర్ధం కావటం లేదసలు.”

          “ముందు టీ తాగుదాం. రేపు ఇంటికి వెళ్ళాక తీరికగా ఆలోచిద్దాం. సరేనా? నాకస్సలు ఓపిక లేదిప్పుడు.” అంటే లేచి బయటకు వచ్చాడు.

          ఇంటికి వచ్చేదాక చాలా ఢల్ గా ఉన్నాడు శ్రీనివాస్. తనకి తెల్సు మేము మాట్లాడు కున్న కొన్ని ప్లాన్స్ లో ఇదొకటి. నా చదువు, జాబ్, బాగా సెటిల్ అయ్యాక పిల్లలు.

          ఈ లోపల ఇలాంటిది ఏదైనా జరిగితే … దాని గురించే ఆలోచిస్తున్నాడు.

          మేం మాట్లాడుదామనుకునే లోపల ఆ రోజు మధ్యాహ్నం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి, “నేను అర్జంట్ గా బాంబేకెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసారు. ఆరుగంటలకల్లా బయల్దేరాలి,” అని హడావిడి చేసాడు.

          ప్యాకింగ్ కి హెల్ప్ చేసాను, తను స్నానం చేసి రెడీ అయ్యేవరకు.

          టైం కాగానే వెళ్ళిపోయాడు. నాకు సడన్ గా చాలా దిగులుగా అనిపించింది.

          నాకింకా వాంతులు తగ్గలేదు. చాలా నీరసంగా ఉంది. తను వారం రోజులదాకా రాడు.

          కాలేజ్ కి వెళ్ళలేకపోయాను. రోజు ఊరికే పడుకుని నిద్రపోయేదాన్ని. తింటే కాసేపు కాగానే వెంటనే అంత బయటికి వచ్చేది.

          ఒకరోజు మధ్యాహ్నం పోస్ట్ మాన్ వచ్చి రెండు ఉత్తరాలిచ్చి వెళ్ళిపోయాడు. ఇన్ లాండ్ లెటర్. తండ్రి పేరున్నది మా అత్తగారికిచ్చి నా లెటర్ తీసుకుని లోపలికి వెళ్ళాను.

          శ్రీనివాస్ దగ్గర నుండి. ఓపెన్ చేసాను.

          వెళ్ళిన వారం రోజులకి లెటర్స్ కూడా రాసుకుంటారా? మళ్ళీ నేను రిప్లయి రాయాలా?

          లెటర్ మొత్తంలో నేను ప్రెగ్నెంట్ అంత త్వరగా అయినందుకు తప్పంతా తనదే అని, తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నానని, తనని క్షమించమని, నేనే నిర్ణయం తీసుకున్నా తను సపోర్ట్ చేస్తానని. జాబ్ కూడా చేయడానికి తప్పకుండా ప్రయత్నించ వచ్చని, సారీ, సారీ, సారీ అని ఎన్నోసార్లు రాసాడు.

          ఎప్పుటిదాకో ఎందుకు ఇపుడు దగ్గర ఉండి సపోర్ట్ చేస్తే చాలు అనుకున్నాను.

          లెటర్ వచ్చిన రెండ్రోజులకి వచ్చేసాడు శ్రీనివాస్.

          తను వచ్చాక పక్కన ఒక గుజరాతీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. ఆయన చూసి వాంతులు ఎక్కువ కాకుండా ప్రెగ్నెంసీలో వేసుకునే టాబ్లెట్స్ రాసిచ్చారు.

          అవి వేసుకుని రెండ్రోజుల తర్వాత కాలేజ్ కి వెళ్ళడానికి ప్రయత్నించాను. బయటకు వెళ్ళి కాస్త దూరం కూడా నడవలేక పోయాను. వచ్చి పడుకున్నాను.

          మేమిద్దరం పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు. శ్రీనివాస్ కి అపుడు,”అయ్యో! మనం ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ పాపో, బాబో పుడితే మళ్ళీ టైం దొరకదు. కనీసం, బెంగళూర్, ఊటీకైనా వెళొద్దాం,” అన్నాడు.

          “నాకు లేవడానికే కష్టం అవుతుంది, ఇంకా నయం చంద్రమండలానికి వెళ్దా మన్నావు కాదు, భలేవాడివే! నాకు ఓపికే ఉంటే చక్కగా క్లాసెస్ కే వెళ్ళేదాన్ని కదా!” అన్నాను.

          అమ్మమ్మగారు చాలా ఆనందించారు నేను గర్భవతినని తెలిసి. అందరూ ఆనందించారు, శైలజ, ’బాబు, చిన్న బాబు పుడ్తాడు,” అని రోజు ఒక పాట లాగ పాడేది.

          పుట్టింటి వారే గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాలని, మొదటి పురుడు కూడా వాళ్ళే చేయాలని అమ్మమ్మగారు ఎన్నోసార్లు అనసాగారు.

          నాకు అమ్మ దగ్గరకు వెళ్ళాలని వుంది. నేను, తను కల్సి వెళ్ళాం. మేముండేది చందూలాల్ బారాదరి. కానీ అమ్మకి కాన్పులు చేసిన డాక్టర్ అమీనా బేగం, అప్పట్లో జజీఖానాలో పని చేసేది. ఇపుడు ఆమె రిటైర్ అయిపోయి ఇంట్లోనే చిన్న నర్సింగ్ హోం పెట్టుకుంది. మా అక్క రెండు పురుళ్ళు అక్కడే చేసింది. మా బావ కాన్పులు మంచి డాక్టర్ దగ్గర చేయించాలన్నాడు. మా అక్క రెండు పురుళ్ళు అక్కడే జరిగాయి. అమ్మ నన్నుకూడా బషీర్బాగ్ లో వున్న నర్సింగ్ హోంకి తీసుకెళ్ళింది.

          అమ్మ నాకు టెస్ట్ ఎలా చేస్తారు అన్నది ఏమి చెప్పలేదు . ఆమె టెస్టింగ్ టేబుల్ మీద పడుకోబెట్టి లోపల చెయ్యి పెట్టి చూసింది. నాకు కొద్దిగా షాకయ్యింది.

          అంటే ఫస్ట్ టైం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేదాక ఇలాంటిదొకటి వుంటుందని తెలీదు.

          ఆమె మూడు నెల్ల తర్వాత మళ్ళీ రమ్మన్నది.

          మా ఇంటికి తిరిగి వెళ్ళెప్పుడు శ్రీనివాస్ అన్నాడు, ” నాకా నర్సింగ్ హోం నచ్చ లేదు. మన ఇంటి దగ్గర మంచి డాక్టర్ వెదికి అక్కడికి వెళ్దాం. సరేనా?”

          “మళ్ళీ మీ అమ్మమ్మగారు మా పుట్టింటి వాళ్ళు ముందు నుండి డెలివరి దాకా మా అమ్మ వాళ్ళే చూసుకోలేదని గోల పెడ్తుంది. అమ్మకి ఎక్కడ తెలుసో అక్కడికి వెళ్తే తప్పేముంది?”

          “నేను అట్లా అనలేదు. ప్రతిసారి నీకు ఏదైనా హెల్ప్ కావల్సి వస్తే ఇంత దూరం రావాలి. అదే మన ఇంటి దగ్గర ఉంటే వెంటనే సాయం దొరుకుతుంది కదా!”

          “మరి మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు చెబుతావా? మీ అమ్మమ్మగారు మళ్ళీ రోజు ఏదో ఒకటి అంటూనే……,” నా మాట ఆపి,” అందరికి చెబుతాను. నువ్వేం ఎక్కువ ఆలోచిం చకు సరేనా?” అన్నాడు శ్రీనివాస్.

          డాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు ట్రిప్ కి వెళ్ళొచ్చా? అని అడిగితే “ఏం పర్వాలేదు వెళ్ళేసి రండి, ఇదేం జబ్బు కాదు. అన్ని పనులు చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు.” అన్నది డాక్టర్ అమీనా బేగం.

          అంతే బెంగళూర్, మైసూర్, ఊటీకి టికెట్స్ బుక్ చేసాడు. ట్రిప్ కి వెళ్ళే ముందు కాలేజ్ కి కొన్ని రోజులు వెళ్ళాను. టాబ్లెట్స్ పని చేసేవి కానీ బాగా నీరసంగా ఉండేది.

          ఫస్ట్ టర్మ్ హాలీడేస్ ఇచ్చారు కాలేజ్ కి. కాలేజ్ లో చేరినపుడు చాలా ఉత్సాహంగా ఉండేది. కొన్నాళ్ళు బేసిక్స్ అయ్యాక ఒక ప్రాజెక్ట్ చేయమని ఇచ్చారు. నేను “డ్రగ్స్ ఇన్ ద ట్విన్ సిటీస్,” ఎన్నిక చేసాను. దానికి కావాల్సిన వారిని, డ్రగ్స్ ఇన్ హైద్రాబాద్ గురించి రిసెర్చ్ చేసిన వారిని, వారి రిపోర్ట్ కొంచెం చదివి, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు లాంటి విషయాలు సైకియాట్రిస్ట్ ని అడిగి తెల్సుకున్నాను. కానీ ఎక్కడ కూడా ఎవ్వరిని అడిగినా కూడా డ్రగ్ అడిక్ట్ ని ఎట్లా పట్టుకోవాలో తెలియ లేదు. కిళ్ళీ బడ్డీల దగ్గర కాపలా కాసినా ఎవరు సాయం చేయడానికి ముందుకు రాలేదు. అపుడే నాకు వేవిళ్ళు మొదలవ్వడం, కాలేజ్ ఎగొట్టటం జరిగాయి. మళ్ళీ వచ్చేటప్పటికీ అందరి ప్రాజెక్ట్ వర్క్స్ చూస్తున్నారు. నేనెంత వరకు చేసానో అలాగే ఇచ్చేసాను. అది పూర్తవ్వలేదని నాకు తెల్సు, కానీ అపుడు నేనున్న పరిస్థితిలో చేసేలా లేను.

          ప్రొఫెసర్ చాలా బాగా వచ్చిందన్నారు కానీ రియల్ డ్రగ్ అడిక్ట్స్ తో మాట్లాడలేదు కదా అందుకే ఫస్ట్ మార్క్ పోయింది.

          ఎలాగైతేనేం నన్ను మెల్లిగా ఒప్పించి బెంగళూర్, మైసూర్, ఊటీకి బయల్దేర దీసాడు. టాబ్లెట్స్ వేసుకున్నా వెంటనే వాంతి కాకున్నాకాసేపటి తర్వాత అయ్యేది. ఆ తర్వాత చాలా నీరసంగా ఉండేది. బెంగళూర్ వెళ్ళగానే నేను హోటల్లో నిద్రపోయాను. మధ్యాహ్నం నన్ను లేపి టాబ్లెట్ ఇచ్చి ఇడ్లీ లైట్ గా తినమన్నాడు శ్రీనివాస్. కానీ తినాలనిపించలేదు. ఏదో తిన్నాననిపించి మళ్ళీ పడుకున్నాను. సాయంత్రం లేచి కాసేపు దగ్గరలో వున్న పార్క్ కి వెళ్ళొచ్చాం. నన్ను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకు న్నాడు. అస్సలు విసుక్కునేవాడు కాదు.

          శ్రీనివాస్ లో నాకు బాగా నచ్చిన విషయం తల్లికి సాయం చేయడం, చెల్లంటే ప్రాణం, పుస్తకాలంటే ఇష్టం, వాళ్ళ ఇంట్లో తండ్రికి జర్ధా పాన్ తినే అలవాటుంది. వాళ్ళ బంధువుల్లో కూడా చాలా మందికి ఆ అలవాటుంది. కొంతమందికి సిగరెట్, మందు, కూడా వున్నాయి. తండ్రికి, శ్రీనివాస్ కి మధ్య చనువు లేదు. మా మామగారు 19 ఏళ్ళపుడు శ్రీనివాస్ పుట్టాడట. అపుడు వాళ్ళ ఇంటి దగ్గర అబ్బాయిలు, “బచ్చాకు బచ్చా హువా,” అని వెక్కిరించేవారని, అప్పట్లో ఆడవాళ్ళే పిల్లలని చూసుకునేవారు కాబట్టి తనూ అంతగా పట్టించుకోలేదట. 4 ఏళ్ళ తర్వాత శైలజ పుట్టగానే ఆ అమ్మాయి ప్రవర్తన అందరిలా లేకపోవడంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, తన మెదడు ఎదుగుదల 6 ||సం|| దగ్గరే ఆగిపోతుందని చెప్పడం వల్ల ఆ అమ్మాయికి తల్లీ, తండ్రి ఎక్కువ ప్రేమాప్యాతలు ఇచ్చేవారు. శ్రీనివాస్, నాకెందుకు ఇది దక్కలేదు అనుకోకుండా చెల్లికి అవసరం కాబట్టి తను కూడా అదే ప్రేమాప్యాతలని పంచేవాడు. తను కావాలంటే జర్ధా పాన్ తినేవాడు, సిగరెట్లు, మందు తాగేవాడేమో, వాటివల్ల వచ్చే నష్టాలను ఇంట్లో చూసాడు కాబట్టి వాటిని జీవితంలో ముట్టుకోకూడదనుకున్నాడు.

          ఒకరోజు బృందావన్ గార్డెన్స్ చూద్దామని వెళ్ళే ముందర ఎవరినయినా ఏ టైంకి మూస్తారో కనుక్కోని వెళ్దామని అంటే,’ఎందుకు నాకు తెల్సు, ఇంతకు ముందు ఫ్రెండ్స్ తో వచ్చాను.’ అన్నాడు.

          లాస్ట్ బస్ తీసుకుని వెళ్ళేసరికి, బృందావన్ గార్డెన్స్ లోకి ప్రవేశిస్తున్నాము, ఫౌంటెన్స్ లైట్స్ ఆఫ్ చేసేసారు. గార్డెన్స్ అంతా చీకటై పోయింది. మళ్ళీ హోటల్ కెళ్ళి పడుకున్నాను. అక్కడ లాల్ బాగ్ కెళ్ళాము, మైసూర్ కి వెళ్ళాం కానీ ఏం చుసామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఊటీలో మాత్రం టూరిస్ట్ బస్ లో వాళ్ళు చూపించే ప్రదేశాలు తిరుగుతూ వెళ్ళాం. అక్కడ చలిగా ఉంటే స్వెటర్స్ వేసుకుని వెళ్ళాం. బొటానికల్ గార్డెన్స్ లో పెద్ద పెద్ద ఎవర్ గ్రీన్ చెట్లు చూసాము, లేక్ లో బోటింగ్ చేసాము. చెట్లు, పూలు  చూస్తూ బస్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం ఆలస్యం అయ్యింది. కండక్టర్ త్వరగా రమ్మని విజిల్ వేసాడు, మేము బస్ ఎక్కగానే అందరూ చప్పట్లు కొట్టారు, జస్ట్ మ్యారిడ్ కపుల్ అంటూ.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.