సస్య-1

– రావుల కిరణ్మయి

స్నేహం 

(పదివారాల  చిరు  నవల  తొలి  పదం)

***

కూరిమి గల దినములలో

నేరము లెన్నడును గలుగ నేరవు, మఱి యా

కూరిమి విరసంబైనను

నేరములే  తోచుచుండు నిక్కము  సుమతీ!

          ప్రాథమిక  పాఠశాలలో  5వ తరగతి తెలుగు వాచకంలోని  “సూక్తి సుధ”పాఠంలోని ఈ పద్యం ఆ రోజు తాను బోధించడానికని పుస్తకం తెరిచింది,కానీ భావోద్వేగంతో గొంతు పెగలడంలేదు సస్యకి. శతకకారుడు బద్దెన తను అనుభవించి రాశాడో  లేదో తెలియదు  గానీ, తను మాత్రం ఇప్పుడు అక్షరాల గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్నది. అందుకే ఉబికి  వస్తున్న  దుఃఖాన్ని అదిమి పట్టుకొని  నల్లబల్ల పై  ముత్యాల్లాంటి తన అక్షరాలతో  రాసి పిల్లలను  కూడా రాసుకొమ్మని  చెప్పింది.

          తరువాత  తాను రాగయుక్తంగా ఈ పద్యం చెప్పడం అసాధ్యమని తలచి,

          ఒరేయ్ పిల్లలూ..మనం ఈ పద్యాన్ని సరికొత్తగా యూట్యూబ్  చానల్ లో వింటూ  నేర్చుకుందాం అని  మౌత్ పీస్ తెప్పించి  ఫోన్ తో కనెక్ట్  చేసింది.

          పిల్లలు  దాన్ని అనుసరిస్తూ  పాడుతూ అభ్యాసం  చేయసాగారు. తరగతిలో  వెనక  బెంచీలో  కూర్చుని  అబ్జర్వు  చేయసాగింది.

          ఆమె ఆలోచన తరంగాలు  గజిబిజిగా  సాగుతూ మనస్సును తమ అధీనంలోకి తీసుకోగా మౌనముద్రయింది.

          ఇంతలో హెచ్.ఎమ్  వింద్యగారు  తరగతి  అబ్జర్వేషన్ కి  వచ్చారు.

          పిల్లలు చదవడం ఆపేసి లేచి విష్ చేశారు.

          సస్య మాత్రం అలానే  గమనించకుండానే ఉండిపోయింది.

          హెచ్.ఎమ్ గారు దగ్గరగా వచ్చి..

          ఏమ్మా? సస్య? అలా ఉన్నావేం? నా రాకను కూడా గమనించినట్లు లేవే? ఒంట్లో బాగాలేదా? ఉదయం బాగానే ఉన్నట్టున్నావ్! అడిగారు ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి.

          ఆ స్పర్శతో  తేరుకున్న సస్య ,

          సారీ! మేడమ్! నేను బాగానే ఉన్నాను. ఈ  పద్యం నన్ను కొంచెం డిస్ట్రబ్ చేసింది. అంతే!

          సరేమ్మా! అని

          పిల్లలూ! కూరిమి అంటే మీకు తెలుసా? అని మళ్ళీ నల్లబల్ల  దగ్గరగా వెళ్ళి ఆ పదాన్ని చూపిస్తూ ప్రశ్నించారు.

          పిల్లలు  తెలియదన్నట్టుగా మౌనంగా ఉండిపోయారు.

          మేడమ్! నేనింకా పద్యాన్ని వివరించలేదండీ అన్నది సస్య.

          అవునా..!అని,

          పిల్లలూ…! కూరిమి అంటే స్నేహం అని అర్థం. మీరందరూ అందరితో ఎలా ఉండాలి? మళ్ళీ ప్రశ్నించారు హెచ్.ఎమ్.

          స్నేహంగా…గట్టిగా  పిల్లలంతా ముక్తకంఠంతో చెప్పగానే, మేడమ్

          మరి ఎలా ఉండాలి? ఏమిటి? అనేది సస్య  మేడమ్ వివరిస్తారు. మీరు అర్థం చేసుకుని అలాగే నడుచుకోవాలి, సరేనా? అన్నారు.

          పిల్లలు ఓ.కే మేడమ్ అనడం పీరియడ్ బెల్ మోగడం రెండూ  ఒకేసారి జరిగాయి.

***

          సస్య  ఇంటర్వెల్ కావడంతో స్టాఫ్ రూంలో కూర్చోకుండా తనకు  ఎంతో ఇష్టమైన పాఠశాల  ఆవరణలో  ప్రభుత్వం  పర్యావరణ పరిరక్షణ కోసం రాబోయే వర్షాకాలంలో ప్రతి చోట నాటించేందుకు చేపట్టిన మొక్కల  పెంపకం  తోటలో కూర్చున్నది. అందు లోని అన్ని మొక్కలు  ఆమెకు  నేస్తాలే.

          ఏ వాసన లేని ఎర్ర మందారం అంటే ఆమెకు ప్రాణం.

          ఈ రోజు కొత్తగా విచ్చుకొన్న  మందారాలను ఫోన్ లో బంధిస్తూ కూర్చుండి పోయింది.

          అటెండర్ ఆదమ్మ, తన ఆనందానికి భగ్నం కలిగిస్తూ..

          మేడమ్! మిమ్మల్ని పిలుస్తున్నారండీ హెచ్.ఎం గారు అని రావడంతో అప్పటికి ఆ మూగ నేస్తాలకు  సెలవు చెప్పి  ఆఫీస్ గదిలోకి కదిలింది.

          అప్పటికే  మిగతా స్టాఫ్  అందరూ తన కొరకే చూస్తున్నట్టుగా కూర్చున్నారు.

          పాఠశాలను ఆనుకొని పక్కనే ఉన్న గ్రంథాలయం లైబ్రేరియన్ కనకలక్ష్మి కూడా వచ్చి ఉన్నది.

          నమస్తే  మేడమ్! ఎలా ఉన్నారు? ఈ మధ్య మీ పుస్తక మిత్రుల కొరకు రావడం లేదెందుకని? అడిగింది  ఆత్మీయంగా.

          తనూ విష్ చేసి, పనుల ఒత్తిడితో రాలేకపోతున్నాను

          భలేవారు మేడమ్  మీరు. “ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిదని “ఒత్తిడి ని అధిగమించడానికి  పుస్తక పఠనం ఎంతో  దోహదపడుతుందని చెప్పిన  మీరేనా? ఇలా  అంటున్నది  అని లక్ష్మి నవ్వింది.

          హెచ్.ఎం మినిట్స్  బుక్  సస్య  చేతికి  ఇవ్వడంతో ఆమె వైపు ఒక చిరునవ్వు  నవ్వి బుక్  అందుకుంది.

          హెచ్.ఎం గారు  మాట్లాడడం మొదలు పెట్టారు.

          ఉపాధ్యాయ మిత్రులందరికీ  ఈ అత్యవసర  సమావేశానికి  స్వాగతం.

          మనతో ఉన్న  వీరు  లైబ్రేరియన్  కనకలక్ష్మి గారు. ఇద్దరికి  తప్ప మనందరికీ చాలా సుపరిచితులు. వీరు  గ్రంథాలయ వారోత్సవాలు నామమాత్రంగా జరిపించడం కాకుండా విద్యార్థులలో  పఠనావగాహన పెంచి  తద్వారా  సమాజాన్ని కూడా  పఠనం వైపు  నడిపిం చాలనే  సత్సంకల్పంతో మన సహాయం  ఆశిస్తూ  ఇక్కడికి  వచ్చారు.

          తన లక్ష్యం  పెద్దది  కావచ్చు కానీ  అత్యాశ  మాత్రం  కాదనిపించింది.

          ఎంత పెద్ద  ప్రయాణమైనా  ఒక అడుగుతోనే  మొదలవుతుందన్నట్టు ప్రయత్నం  అయితే చెయ్యాలి కదా! అందుకని  తను  మన  సహాయసహకారాలను ఆశిస్తున్నారు.

*****

(సశేషం)

Please follow and like us:

One thought on “సస్య-1”

  1. మేడం ఈ స్టోరీ నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్కోవచ్చా ప్లీజ్… చాలా బాగుంది స్టోరీ 🥺

Leave a Reply

Your email address will not be published.