అమృత్ సర్ స్వర్ణ దేవాలయం
-డా.కందేపి రాణి ప్రసాద్
సిక్కులు పరమ పవిత్రంగా భావించే నగరం, స్వర్ణ దేవాలయం ఉన్న నగరం, సీతమ్మను కాపాడిన వాల్మికి ఆశ్రమం ఉన్న నగరం, జనరల్ డయ్యర్ ఊచకోతకు బలై పోయిన జలియన్ వాలా బాగ్ ఉన్న ప్రాంతం, పాకిస్తాన్ తో కలసి ఉన్న నగరం, పంజాబ్ రాష్ట్ర ఆర్థిక నగరం అమృత్ సర్ ను చూసే ఆవకాశం లభిస్తే ఎవరైనా వదులుకుంటారా. దేశంలోని ఏకైక సిక్కుల పవిత్ర గురుద్వారా అమృత్ సర్ లో హరి సాహిబ్ మందిర్ ఇక్కడ సిక్కుల మత గ్రంథమైన గురుగ్రంద్ సాహిబ్ ఉన్నది. స్వర్ణ దేవాలయానికి నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఇంతటి ఘన చరిత కలిగిన అమృత్త సర్ ను చూడటానికి మేము ఈ నెల 12 వ తేదిన బయల్దేరి వెళ్ళి తిరిగి 16 వ తేదీన ఇంటికి వచ్చాము.
మేము వెళ్ళేటపుడు రెండు ఫ్లైటులు మారి వెళ్ళ వలసి రావడంతో రోజంతా గడిచిపోయింది. అమృత్ సర్ లో ఉన్న మిత్రులు హోటల్ ను ముందుగానే బుక్ చేయడంతో వెళ్ళి ప్రశాంతంగా నిద్రిపోయాం. పిల్లల్లో వచ్చే మానసిక రుగ్మతలు ఆధునిక చికిత్సా పద్ధతులను గురించి చర్చించటానికి అమృత్ సర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పిల్లల డాక్షర్లను ఆహ్వానించింది. ఈ కారణంగా మా వారితో పాటుగా నేనూ బయల్దేరాను. మా అబ్బాయి కూడా పిల్లల డాక్టరే కాబట్టి ముగ్గురం వెళ్ళాం. రెసిడెన్సీ హోటల్ లో దిగి కాన్ఫరెన్స్ కు వెళ్ళాము.
నేను పంజాబ్ రాష్ట్ర రాజదాని చండీఘర్ ను ఇదివరకు రెండు సార్లు చూశాను. అమృత్ సర్ ను చూడటం తోలిసారి పంజాబ్ రాష్ట్రంలో లూధియానా తర్వాత రెండవ పెద్ద నగరంగాం అమృత్ సర్ నగరమున్నది. చాలా చిన్న ఎయిర్ పోర్టు శ్రీగురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అని పేరు. ఎయిర్ పోర్టు లోనే స్వర్ణ దేవాలయం రెప్లికా కనిపించింది. చేతి కుట్లకు, ఫుల్ కారీ వస్త్రాలకు, అప్పడాలకు ఫేమస్ అట. ఈ ఫుల్ కారీ వస్త్రాలకు శాస్త్రి బజార్, హాల్స్ బజార్ లలో డిమాండ్ ఎక్కువగా ఉన్నది. మన హైదరాబాద్ సుల్తాన్ బజారులాగా చీమ దూరే సందు లేకుండా ఉన్నది. చెప్పుల దగ్గర్నుంచి చెవులకు పెట్టుకునే జూకాల దాకా, ఇల్లు చిమ్ముకునే చీపురు దగ్గర్నుంచి డబుల్ కాట్ బెడ్ షీట్ల దాకా సమస్తం దొరుకుతున్నాయి. షాపింగ్ మాల్స్ లో దొరికే వస్తువులన్నీ అతి తక్కువ రేట్లకే చమక్ చమక్ మని మెరుస్తూ చూపరుల మదిని దోచుకుంటున్నాయి. నేను కూడా చెవులకు పెట్టుకునే జూకాలు కొన్ని జతలు కొనుక్కున్నాను, చెప్పులకే సమయం సరిపోక తీసుకోలేదు.
మాములుగా మనకు సిక్కులు తక్కువగా అక్కడొకరు అక్కడొకరు కనిపిస్తారు కదా! ఎయిర్ పోర్టులో దిగగానే అందరూ గడ్డాలతో తలపాగాలతో కన్పించడం చూస్తుంటే గమ్మత్తుగా అనిపించింది. అధికారులు, పోలీసులు, ఆర్మీ అందరూ సిక్కులే కనిపిస్తు న్నారు. మేము తిరిగి వచ్చే రోజు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలా ఉంది. తను ఫోనులో మాట్లాడుకుంటూ తొలిగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లు ఉన్నది. ఆ అమ్మాయి ఫోను మాట్లాడుతూనే మీరు హైదరాబాద్ వెళుతున్నారా అని అడిగింది. అవునన్నట్లుగా తలూపాను. అంతలో మా అబ్బాయి ‘త్వరగా రా’ అనటంతో ‘తెలుగు వాళ్ళ’ అని మళ్ళీ అడిగింది. నవ్వి ‘అవునమ్మా’ అని చెప్పాను. అవతల ఫోనులో ఎవరితో మాట్లాడుతు న్నావు అన్నట్లున్నారు. ‘తెలుగు వాళ్ళట బావా’ అని సంతోషంగా ఫోనులో చెపుతున్నది. తర్వాత వివరాలు అడిగాను. “ఆర్మీలో పనిచేస్తాడు మా బావ. సంవత్సరమైంది పెళ్ళయి. ఈసారి తనకు సెలవు దొరకక పోవటం వలన నన్ను ఒక్కదాన్నే పంపిస్తున్నాడు అని విషయమంతా చెప్పింది. మేము హైదరాబాద్ దాకా తోడుంటాం. ఏమీ భయపడనక్కర లేదు” అని చెప్పగానే మరల ఫోనులో ఈ విషయమంతా చెప్పింది. బోర్డింగ్ పాస్ ల వరకూ ఆ అమ్మాయికి తోడుగా ఉన్నాం. సెక్యూరిటీ చెకిన్ దగ్గర విడిపోయాం. ఫ్లైట్ ఎక్కాక దూరంగా సీట్లో కనిపిస్తే చెయ్యి ఊపాను. మనవాళ్ళున్నారన్న ధైర్యం ఎంతైనా పని చేస్తుంది.
సిక్కుల పవిత్ర నగరమైన అమృతసర్ లో స్వర్ణ దేవాలయం ఉన్నది. దీని గోపురం బంగారు గోపురంగా ప్రసిద్ధి చెందింది. హరి మందిర్ సాహిబ్ ను దర్బార్ సాహిబ్ అనీ స్వర్ణదేవాలయం అనీ అంటారు. ఈ గురు ద్వారాను గురు రాందాస్ సాహిబ్ అనే సిక్కు గురువు 16 వ శతాబ్దంలో నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని “జస్సా సింగ్ ఆహ్లదాలియా” తిరిగి 1764 లో పునర్మించారు. నేను డిగ్రీ చదువు కునేటప్పుడు జనరల్ నాలేడ్జ్ పోటీలలో ఎప్పుడూ SGPC అంటే ఏమిటి? ఆపరేషన్ బ్లూస్టార్ ఏమిటి? అనే ప్రశ్నలు అడిగేవారు. వీటి గురించి బాగా చదువుకునే వాళ్ళం. టెర్రరిస్టులు స్వర్ణ దేవాలయంలో దాక్కున్నారని వాళ్ళను పట్టుకోవడానికే ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహిం చారని చదువుకున్నాం. SGPC అంటే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అని ప్రశ్న అడగగానే టకీమని సమాధానం చెప్పే వాళ్ళం. అప్పటి నుంచి స్వర్ణ దేవాలయం ఎలా ఉంటుందో అనే ఊహలే తప్ప చూడటం కుదరలేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత అమృత్ సర్ వెళ్ళే పని రావడంతో ఎగిరి గంతేసినట్లని పించింది.
చుట్టూ నీళ్ళు, మధ్యలో మిలమిల మెరిసిపోయే స్వర్ణదేవాలయంను చూడగానే నిజంగాన్నే చూస్తున్నానా అని కాసేపటి దాకా నమ్మకం కుదరలేదు. ఇది గురుద్వారా కాబట్టి ఎర్రటి బట్టను నెత్తికి కట్టుకొని వెళ్ళాం. మేం వాఘా బార్డర్ నుంచి వెళ్ళడంతో మొహం మీద జెండా రంగులున్నాయి. లోపలికి అనుమతించలేదు. మొహం కడుక్కున్నాక లోపలికి వెళ్ళాం. చాలా పెద్ద క్యాంపస్ మేము రాత్రి పూట వెళ్ళడంతో లైట్లతో స్వర్ణదేవాలయం అందం ద్విగుణీకృతం అయింది. నీళ్ళ మధ్యలో బంగారు కలుప వలే ఉన్నది. ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు దగ్గర అందరూ దణ్ణం పెట్టుకుంటు న్నారు. కొంత మంది రాలిన ఆకుల్ని ఏరుకుని తింటున్నారు. ఉదయం నుంచీ తిరిగి తిరిగి అలసిపోవడంతో రేపు మరోసారి వద్దామని అనుకుని వెళ్ళి పోయాము.
‘GDBPCON’ అనే కాన్ఫరెన్స్ అమృత్ సర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగింది. ఈ కాలేజీ వంద ఏళ్ళకు పైబడి చరిత్ర కలిగి ఉన్నది. లోపల అన్నీ ఎర్ర ఇటుకలతో ఉన్న బిల్డింగులే ఉన్నాయి. మేము వెళ్ళగానే రిజిస్ట్రేషన్ సరి చూసుకుని కార్డులు తీసుకుని లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఎక్కువగా రోటీలు చేశారు. పెరుగన్నం లేదు. బిర్యాని కూడా ఒకే రకం పెట్టారు. రోటీల్లో నాలుగైదు రకాలున్నాయి ఎక్కడికి వెళ్ళినా గులాబ్ జామ్ పెడుతున్నారు. వీళ్ళకు చాలా ఇష్టమేమో అనుకున్నాం. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రాజ భవనాలు కనిపిస్తున్నాయి. చాలా చారిత్రిక ప్రాధాన్యం కలిగిన ఊరిది. మరీ ముఖ్యంగా ఊర్లోనే పాకిస్తాన్ తో కలిసి ఉన్న బార్డర్ ఉండటం ఆశ్చర్యంగా ఉన్నది.
అట్టారి బార్టర్ అని బోర్డు మీద రాసి ఉన్నది. ఇది వేరే బార్డర్ ఏమో అనుకున్నాం. వాఘా బార్డర్ అంటే ఇదే అని చెప్పారు. అమృత్ సర్ ను ప్రతిరోజూ లక్షమంది యాత్రికు లు సందర్శిస్తారట. అక్కడ వాషూ బార్డర్ దగ్గర దాదాపు పదివేల మంది ఉన్నట్లు అనిపిం చింది పెద్ద ఆడిటోరియం ఇది. చుట్టూ ఎటు చూసినా మొహాన జెండా రంగులతో జై భారత్ అనే నినాదాలతో కనిపిస్తుంటే ప్రతి ఒక్కరికీ తెలియని ఆవేశం వస్తున్నది. హిందుస్తాన్ జిందాబాద్ అనే అరుపులు కూడా వినిపిస్తున్నాయి. గేటుకు అవతల పాకిస్తాన్ కనిపిస్తున్నది. వాళ్ళ ఆడిటోరియంలో ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. మనకేమో వేల మంది ఉన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆడిటోరియంలో మెల్లగా ఒక వంద మంది చేరినట్లున్నారు.
అంతలో ఒలింపిక్స్ క్రీడల్లో భారత దేశానికి బ్రాంజ్ మెడల్ సాధించిన ‘మనూబాకర్’ అనే అమ్మాయి వచ్చింది. మిలిటరీ మొత్తం ఆ అమ్మాయికి గౌరవ వందనంగా చాలా వాయిద్యాలు వాయిస్తూ సెల్యూట్ చేశారు. షూటింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్న ఆ అమ్మాయికి ఇచ్చిన గౌరవాన్ని చూస్తే చాలా అబ్బుర మనిపించింది. భారత మాతాకి జై, హిందుస్తాన్ జిందాబాద్ అనే నినాదాలతో ఆ ప్రదేశమంతా మార్మోగుతుంటే వెంటనే వెళ్ళి సైన్యంలో చేరాలనిపించింది. అంతగా ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది నోరు తెరవకపోతే గట్టిగా అరవమని మరల మరల నినాదాలు ఇస్తున్నారు. దద్దరిల్లిపోయే శబ్దాలతో భారత మాతాకి జై అని అరుస్తుంటే ఏదో సినిమాలో డైలాగ్ గుర్తు కొచ్చింది. “భారతీయులందరి జై శబ్దానికే పాకిస్తాన్ చచ్చిపోయిం ది అని” నిజంగా అలాగే అనిపించింది. అక్కడ రెండు మూడు గుటల సేపు మేము కూడా మిలిటరీలో చేరినట్లుగా అనిపించింది. అక్కడే బి.ఎస్.ఎఫ్ మ్యూజియం ఉన్నది.
దుర్గాయణ్ టెంపుల్ కు వెళ్ళాము. బహుశ దుర్గా మాత ఆలయం కావచ్చను కున్నాం కానీ కృష్ణుడు రాధ ఉన్నారు. దాదాపుగా ఇస్కాన్ ఆలయాలలో ఉండే కృష్ణుని వలె రంగురంగుల బట్టలు, ఆభరకాణలు వేసుకుని ఉన్నారు. గుడి అంతా బంగారు రంగులలో ఉన్నది. గోపురం బంగారంతో మెరిసి పోతున్నది. గుడిలోపల భక్తులు ఉండి భజనలు చేస్తున్నారు. మా మెడల్లోని టాగ్ లను చూసి ‘డాక్టర్లా’ అని అడిగి కూర్చోవడానికి చోటిచ్చారు. గుడి లోపల సీలింగ్ భాగంగా అద్భుతంగా, అత్యంత మనోహరంగా డిజైన్ చేయబడి ఉన్నది. ఈ గుడి చుట్టూరా కొలను ఉన్నది. అందులో ఫౌంటెన్లు నీళ్ళను చీమ్ము తున్నాయి. ఈ ప్రాంగణంలో వినాయకుడు, శివుడు, పార్వతి గుడులున్నాయి. గుడి బయట ఒక కట్టడం వద్ద పండిత్ మదన మోహన్ మాలవ్య ఫోటో పెట్టి ఉన్నది.
స్వర్ణ దేవాలయం, జలియన్ వాలా బాగ్, దుర్గాయణ టెంపుల్, పార్టిషన్ మ్యూజియం అన్నీ దగ్గర దగ్గరగానే ఉన్నాయి. పార్టిషన్ మ్యాజియం చూడటానికేముందిలే అనుకున్నాం గానీ లోపల చూస్తే ఎన్ని విషయాలు తేలిసినాయో! భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడం, మనకు స్వాతంత్య్రం వచ్చినపుడే జరిగింది. పాకిస్తాన్ వాళ్ళ ఆగస్టు 14వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటే మనమేమో ఆగష్టు 15వ తేదీ స్వాతంత్య దినం జరుపుకుంటాము. ఆ సమయంలో ఎన్నో గొడవలు జరిగాయట. హిందూ ముస్లిమ్ తగాదాలు పెచ్చరిల్లి వేల మంది చనిపోయారు. భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎన్నో వేల కుటుంబాలు ఆదేశం నుంచి ఈ దేశంలోకి, ఈ దేశం నుంచి ఆ దేశంలోకి మారారట. వేల ఇళ్ళు, గుళ్ళు నేల మట్టమైపోయినాయి. అక్కడ ఆ ఫోటోలు చూస్తుంటే బాధనిపించింది. ఇంత ఆస్తినష్టం ప్రాణనష్టం జరిగిందా అని ఆశ్చర్యం వేసింది. అక్కడ గాంధీ నెహ్రూ, వల్లభాయి పటేల్ ల ఉపన్యాసాలు, చర్చలు జరిగిన వీడియో క్లిప్పింగ్స్ టీవీలలో నిరంతరం ప్రసారమవుతున్నాయి. వారి గొంతుతోనే ఆ ఉపన్యాసాలను వినవచ్చు. ఆ సమయంలో జరిగిన ధ్వంస కాండలో ఇళ్ళు ఎలా పడి పోయాయో ఒక ఇల్లును లోపల అలాగే పెట్టి చూపించారు. అమృత్ సర్ లోని ప్రజలకు ఆహారం ఇవ్వకుండా వేరే చోట్లకు పంపించేయడం వలన ఆహారం లేక ఎంతమంది మరణించారో సాక్ష్యాలతో ఫొటోలతో సహా చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఇంత విధ్వంసం జరిగిందా అని తెలియని విషయాలు తెలుసుకున్నాం.
జలియన్ వాలా బాగ్ ఎప్పుడు చూస్తామా అని చాలా ఎదురు చూశాం. సన్నని సందులో ఇరుకైన దారిలో లోపలికి నడుస్తుంటే బ్రిటిష్ దళాలు ఎలా ఉచకోత కోశారో అర్థమైంది. దారికి రెండువైపుల గోడలకు విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. లోపల చాలా పెద్ద మైదాన ప్రాంతం ఉంది. ఒక్కో బిల్డింగులో ఒక్కో రకమైన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ దురంతం 1919 వ సంవత్సరంలో జరిగింది. ఈ ఉద్యాన వనంలో సమావే శమైన స్వాతంత్ర వీరులను బ్రిటిషు సైన్యం అకారణంగా చంపేసింది. ఇక్కడ పది నిమిషాల పాటు కాల్పులు జరిపి వేల మంది ప్రాణాలు తీశారు. సన్నగా ఇరుకుగా ఉన్న దారి నుంచి తప్పిచకునే అవకాశం కూడా లేదు. ఆ సమయంలో అమరురైన వీరుల కోసం జ్ఞాపకంగా ఒక చిహ్నాన్ని నిర్మించారు. ఆ చిహ్నం చుట్టూ కలువల తోటను పెంచారు. ఆ మైదానంలోనే వారి సమాధులు సైతం ఉన్నాయి. జనరల్ డయ్యర్ ప్రసంగాలు, ఆ నాటి దినపత్రికలు అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. 1650 రౌండ్ల కాల్పులు స్త్రీలు, పిల్లలు మీద జరిపారు. పంజాబీయుల బైశాఖి సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన వారిపై ఈ మారణకాండ జరగడం అమానుషం. చేతిలో ఏ ఆయుధాలు లేని వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిగాయని పుస్తకాల్లో చదివిన విషయాలను ఇక్కడ ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాం.
చివరి రోజు గోవిందఘర్ కోటకు వెళ్ళాం. అక్కడ మ్యాజిక్ షో, స్పోర్ట్స్, డాన్స్ ప్రోగ్రాములు, సరదా ఆటలుతో వచ్చిన వాళ్ళను అలరిస్తున్నారు. రాజా రంజిత్ సింగ్ కోట ఇది ఎంతో విశాలమైన ప్రాంగణం ఇందులో బ్యాటరీ కార్లతోనే తిరిగాం. అక్కడక్కడా ఆగి షోలు చూసుకుంటూ వెళ్ళాము. ఇది కూడా ఎర్ర ఇటుకలతో కట్టిన కోట. ఇందులో కొన్ని షాపులు కూడా ఉన్నాయి. ప్రజల్ని ఆకర్షించడానికి ఇవన్నీ పెట్టినప్పటికీ జనం తక్కువగానే ఉన్నారు. రాజా రంజిత్ సింగ్ జీవిత కథను 70 షో ద్వారా చూపించారు. ఇందులో కళ్ళకు జోళ్ళు మాత్రమే కాదు కుర్చీలకు ఇనుప రాడ్లు కూడా ఉన్నాయి. వాటిని పట్టుకుని కుర్చీల్లో కూర్చోవాలి. సినిమాలో ఆకాశంలోకి పోతున్నట్లు కిందికి సడన్ గా పడినట్లు చూపించేవన్నీ మనం నిజంగా అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో నీళ్ళులో వెడుతున్నట్లుగా, వర్షం పడినట్లు చూపించే సన్నివేశాల్లో మన మీదకు నీళ్ళు చల్లబడతాయి. కుర్చీలు గుండ్రంగా తిరుగుతూ పైకీ కిందకీ ఉగుతూ భయానందాలకు లోను చేసింది. ఒంటెల సవారీ కూడా ఉన్నది. పంజాబ్ జానపద నృత్యాలను చూసి ఆనందించడమే గాకుండా వారి తో కలిసి డాన్స్ కూడా చేశాము. ఇద్దరు కలిపి తొక్కే సైకిళ్ళ మీద ఎక్కి సరదా పడ్డాము. అమృత్ సర్ చాలా చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా అనిపించింది.
*****
నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.