అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 21

– విజయ గొల్లపూడి

జరిగినకథ:విశాల, విష్ణుసాయి కొత్తగా పెళ్లైన జంట. ఆస్ట్రేలియాలో పెర్మనెంట్ రెసిడెంట్స్ వీసాతో సిడ్నీ వచ్చారు. దేశం కాని దేశంలో బంధువులు ఎవరూ లేకపోయినా, క్రొత్త జీవన విధానానికి అలవాటు పడుతున్నారు. విష్ణు నూతన ఉద్యోగం నైట్ షిఫ్ట్ లో చేరాడు. విశాల నెల రోజులు వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్రోగ్రాం టేఫ్ లో పూర్తి చేసింది.

***

          కష్టాలు లేని జీవితం అంటూ ఉండదేమో! ధనిక, పేద తారతమ్యం లేకుండా సమస్యలు అనేవి ఏదో ఒక రూపంలో, ఎపుడో ఒకపుడు చుట్టుముడతాయి ప్రతి ప్రాణిని. కొన్ని సమస్యలు స్వయంకృతాపరాధాలు, కొని తెచ్చుకునేవి అయితే, కొన్ని ప్రకృతిలో సంభవించే ప్రళయాలు, వరదలు, భూకంప ప్రకంపనాలు వీటికి ఎవరు అతీతులు కారు. మరికొన్ని సమస్యలు అవతల మనిషి మూడ్స్ అండ్ మెలోడీస్ నుంచి ఉత్పన్నమై ప్రక్క మనిషిని ప్రభావితం చేస్తాయి. ఇంక శారీరిక సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలకి కొన్నిటికి మందులు ఉన్నాయి. మరికొన్ని లొంగని వ్యాధులకు మందులు కనుక్కునే ప్రయత్నాలు, పరిశోధనలతో భవిష్యత్తుపై ఒక ఆశ చిగురిస్తుంది. ఏది ఏమైనా గాని, భగవంతునిపై విశ్వాసం, కర్మ సిద్ధాంతం నమ్మిన వారికి మిన్నువిరిగిమీద పడినా, స్థిత ప్రజ్ఞతతో జీవితయానం కొనసాగిస్తారు.

          విశాల తను చూసిన ఇండియాలింక్ మ్యాగజైన్ నుంచి కొన్ని వివరాలు తను ఎక్స్ ప్లోర్ చేయాలనుకున్నవి టిక్ చేసింది. న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న ఫ్రీ కోర్స్ వివరాలు నోట్ ప్యాడ్ లో వ్రాసుకుంది. తన లిస్ట్ ఆఫ్ టెన్ ఐటెమ్స్ తప్పనిసరిగా చేయవలసిన టు డూ లిస్ట్ చూసుకుంది. డూ యు వాంట్ టూ టాక్ టు యువర్ లవుడ్ వన్స్ ఓవర్ సీస్ ఫర్ ఓన్లీ $15 పెర్ మంత్ అన్న అడ్వెర్టైజ్ మెంట్ చూసి ఆ నెంబర్ కి ఫోన్ చేసింది.

          అవతలి నుంచి “చిత్రాంగి హియర్! అని పలకరింపు సమాధానంగా వచ్చింది.
విశాల ఫోన్ ఓయిస్ మెయిల్ వివరాలు గురించి అడిగింది. దానికి జవాబుగా చిత్రాంగి “మీరు డబ్బు పే చేయగానే మీ పేరుతో అకౌంట్ లాగిన్ డిటైల్స్ ఇస్తాము. మీరు మాట్లాడాలనుకున్నవారికి ఫోన్ లో ఓయిస్ మెయిల్ లో మీ మెసేజ్ పంపుతారు. మళ్ళీ మీకు వారి నుంచి సమాధానం ఓయిస్ మెయిల్ ద్వారా వస్తుంది. మీరు లాగిన్ అవ్వగానే న్యూ మెసేజెస్ వినవచ్చు. నెలలో ఎంతమందితోనైనా ఈ సర్వీస్ ద్వారా కేవలం పదిహేను డాలర్లకే మాట్లాడవచ్చు” అని చెప్పింది.

          విశాల ఆనందంగా “నిజంగా మీ సర్వీస్ చాలా ఉపయోగం, ముఖ్యంగా భారతదేశం నుంచి క్రొత్తగా వచ్చిన వాళ్ళకు. నేను మా వారితో మాట్లాడి మీకు కన్ ఫం చేస్తాను” అని ఫోన్ పెట్టేసింది.

          తన నోట్ ప్యాడ్ లో ఓయిస్ మెయిల్ ఐటెమ్ టిక్ చేసుకుంది. తరువాత గవర్నమెంట్ సపోర్ట్ ఉచిత విద్యావకాశాలు చూసి, తనకి ఆసక్తి ఉన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అడ్వాన్స్ డ్ కోర్స్ కోసం ఫోన్ చేసి వివరాలు, అడ్రస్ నోట్ చేసుకుంది. అలా ఆ రోజు తను చేయవలసిన పనుల గురించి లిస్ట్ చూసుకుంటూ రంగంలోకి దిగగానే ఒక్కసారిగా మనసు తేలికైంది. ఇపుడు విశాల మనసులో విష్ణు తనను కసురుకున్నాడు అన్న భావన పూర్తిగా తొలగిపోయింది.

          విష్ణు ఫ్రెష్ అయ్యి రాగానే అతనికి భోజనం వడ్డించింది. ఇద్దరు కలిసి లంచ్ చేసారు. తరువాత నెమ్మదిగా విశాల తను చూసిన ఓయిస్ మెయిల్ సర్వీస్ గురించి చెప్పింది. మనకి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి బాగుంటుంది అనిపిస్తోంది. మనకు ఫోన్ బిల్స్ కూడా సగానికి సగం తగ్గుతాయి. 

          విష్ణు ఒక్కసారిగా దిగ్గున విశాల మొహంలోకి చూస్తూ, “సారీ విశాలా! ఇందాక నేను అన్నమాటకి నొచ్చుకున్నావా? మనకి నెమ్మదిగా ఖర్చులు, బిల్స్ పెరుగుతాయి. కొద్దిగా స్టెబిలైజ్ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఆ ఆలోచనలో ఏదో అనేసాను. నైట్ షిప్ట్ ఇది ఇంకా మొదటి రోజు. మన ఇద్దరం అలవాటు పడాలి. నీకు, నాకు ఇది కత్తి మీద సాము వంటిది. జాగ్రత్తగా నిభాయించుకోవాలి.

          విశాలా! పద. నిన్ను ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్ కి తీసుకెడతాను. యు కెన్ ఎన్ రోల్ యువర్ డిసైర్డ్ కోర్స్” అన్నాడు విష్ణుసాయి. విశాల ఆనందంగా రెడీ అయి ఇద్దరూ కాలేజీకి చేరుకున్నారు. అక్కడ రిసెప్షన్ లో వివరాలు తెలుసుకుని, ఫారం ఫిలప్ చేసారు. ఆ కోర్స్ న్యూసౌత్ వేల్స్ పర్మనెంట్ రెసిడెంట్స్ కోసం గవర్నమెంట్ ఫండెడ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. విశాల క్రైటీరియా అన్ని మ్యాచ్ కావడంతో కోర్స్ అప్రూవ్ అయింది. వారానికి రెండుసార్లు క్లాసులకి హాజరు కావాలి. అసైన్మెంట్స్ పూర్తిచేయాలి. కోర్స్ డ్యూరేషన్ ఆరు నెలలు.

          అక్కడ పని పూర్తి చేసుకుని విష్ణు, విశాల ఇంటికి చేరుకున్నారు. విష్ణు రెండు గంటలు నిద్రకి ఉపక్రమించాడు. విశాల ఉప్మా బాక్స్ లో సర్ది విష్ణు నైట్ షిఫ్ట్ కోసం సిద్ధం చేసింది. విష్ణు నాలుగు కావస్తున్నపుడు, నైట్ షిఫ్ట్ కి బయలుదేరి వెళ్ళిపోయాడు.
విశాల ఆ సమయంలో సాయంత్రం కాగానే ప్రదోషవేళ దేముడి ముందు దీపం పెట్టి, వారంలో ఏడు రోజులు ఆయా దేవతల స్త్రోత్రాలు చదువుకునేది. తరువాత తను చేరిన కోర్స్ పుస్తకాలు చదువుతూ అసైన్మెంట్ పూర్తి చేసేది. ఓయిస్ మెయిల్ లో ఇటు పుట్టింటికి, అటు అత్తారింటికి రోజూ మెసేజెస్, వంటా వార్పులు ఇలా కబుర్లు పంపు కుంటూ పరస్పరం ధ్వని తరంగ సమాధానాలతో ఇంటి బెంగను తీర్చుకుంది.

          విశాలకి ఇపుడు తను ఒంటరి అన్న ధ్యాస కూడా రాకుండా తను ఏర్పరుచుకున్న బాటలో విష్ణు నైట్ షిఫ్ట్ కి వెళ్ళినా బాగానే రొటీన్ కి అలవాటు పడింది. మొత్తానికి ఎలాగైతేనేం విష్ణు రెండు వారాలు రాత్రి షిఫ్ట్ పూర్తి చేసాడు. రెండు వారాలు ఎపుడెపుడు గడుస్తాయా అని ఎదురు చూసాడు. ఎందుకంటే మూడు రోజులు సెలవులు కలిసి వస్తాయి. కాస్త బడలిక తీరి, శరీరానికి, మనసుకు విశ్రాంతి దొరికేది విష్ణుకు ఆ మూడు రోజులు. వారం వారం బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూంటే విష్ణు ఫైనాన్స్ గ్రాఫ్ మెల్లిగా ఎత్తుకు ఎదగసాగింది.

          ఆ రోజు విష్ణు సాయి రాబర్ట్ కి ఇన్ ఛార్జ్ ఇస్తూ మాటలలో న్యూసౌత్ వేల్స్ హాలిడే రిసార్ట్స్ గురించి చెబుతూ తను ఈ మధ్యనే వెళ్ళి వచ్చిన కాఫ్స్ హార్బర్ గురించి చెప్పాడు. వివరాలు అన్నీ తెలుసుకున్నాడు విష్ణుసాయి. మూడురోజులు వరుసగా శెలవలు రావడంతో హాలిడే ప్లాన్ చేసాడు. ఆ శనివారం విశాలతో కలిసి డొమెస్టిక్ ఫ్లైయిట్ క్వాంటాస్ ద్వారా కాఫ్స్ హార్బర్ గంటన్నరలో చేరుకున్నారు. వెళ్ళగానే కారు బడ్జెట్ కార్ హైర్ సర్వీసెస్ లో కారు రెంట్ కి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సెప్ హైర్ బీచ్ హాలిడే రిసార్ట్స్ కి చేరుకున్నారు. రిసార్ట్స్ కి చేరుకోగానే రిసెప్షన్ లో కీస్ తీసుకుని, సెకెండ్ ఫ్లోర్ లో అలాట్ చేయబడిన రూమ్ కి చేరుకున్నారు. రూంకి ఎదురుగా వాటర్ ఫ్రంట్ నీలి సముద్రపు అలలు, చల్లని గాలి తాకుతూ చక్కని జంటకు ప్రకృతి అందా లను ఆస్వాదించడానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంది ఆ ప్రదేశం. రూంలో ఆకర్షణీయంగా అమర్చబడిన ఫర్నిచర్, టీవి విత్ ఫాక్స్ టెల్ ఛానెల్స్.

          “ఓహ్! వ్వాటే లగ్జూరియస్ అపార్ట్ మెంట్. వ్వాటే సర్ ప్రైజ్. నాకు ఇష్టమైన బీచ్ అలలతో, ప్రకాశవంతమైన సూర్య కిరణాలు అలా చూస్తూ ఎంతసేపైనా గడిపేయవచ్చు” అంటూ రెండు చేతులూ బుగ్గలకు ఆనించుకుని ఆనందంగా విశాల కళ్ళు మెరిసాయి.

          “నాకు తెలుసు విశాలా! నీకు ఈ ప్లేస్ నచ్చుతుందని. నిజంగా ఈ గడిచిన నెలలో నేను పడిన కష్టానికి, ఇది నా రివార్డ్ అనిపిస్తోంది. అఫ్ కోర్స్, ఇందులో నీకు కూడా సగ భాగం ఉంది డియర్!” అన్నాడు విష్ణు విశాల మెడ చుట్టూ చేతులు వేస్తూ.

          ఇద్దరికీ రెండు కప్పులలో వేడివేడి టీ, బిస్కట్స్ అక్కడ టీపాయ్ మీద పెట్టి సముద్ర తీర అందాలను ఆస్వాదించారు.

          తరువాత ఇద్దరూ రిఫ్రెష్ అయ్యి కిందకి వచ్చారు. కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ ఆ ప్రొద్దున్న ఇస్తారు, క్యాంటిన్ ఇటు వైపు ఉంది అని రిసెప్షన్ బోయ్ చెప్పటంతో అటువైపు సాగారు. అక్కడ వివిధ కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్స్ మరియు జ్యూసెస్ తో బఫే అది.
ఇంకా క్రోసెంట్స్ సాఫ్ట్ గా, బటర్ తో టేస్టీగా ఉన్నాయి. సోర్ డౌ బ్రెడ్ విత్ పీనట్ బటర్, బేక్ డ్ బీన్స్ ఇలా ఎన్నో వెరైటీ ఫుడ్స్ ఆకర్షణీయంగా అమర్చబడి ఉన్నాయి. టీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి.

          విశాలకి అమర్చిన విధానం వెజిటేరియన్ వెస్ట్రన్ ఫుడ్ లో ఇన్ని వెరైటీలా! మై గాడ్! ఏం టేస్ట్ చేయాలో కూడా తెలియటం లేదు విష్ణు. సచ్ ఎ గుడ్ ఛాయిస్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అని సంభ్రమాశ్చర్యాలతో విష్ణు వైపు మెచ్చుకోలుగా చూసింది విశాల.
బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఇద్దరూ అక్కడ ప్రక్కనే ఉన్న ఇన్ ఫర్మేషన్ సెంటర్ కి కారులో వెళ్ళారు. అక్కడ జెన్నీ తనను పరిచయం చేసుకుని ఇద్దరికీ సాదరంగా అహ్వానం పలికింది. రూట్ మేప్ చూపిస్తూ కాఫ్స్ హార్బర్ లో చూడవలసిన ముఖ్య ప్రదేశాల గురింది అన్నీ టిక్ చేసి ఇచ్చింది.

          ఈ కాఫ్ హార్బర్ ప్రదేశం సిడ్నీ నుంచి ఇక్కడికి కారులో రావాలంటే కనీసం ఐదు గంటలు పడుతుంది. మనం విమానంలో రావడం వలన సగం టైం సేవ్ చేసాము అన్నాడు విష్ణు. ఇక్కడ చూడవలసిన బీచెస్ ఎన్నో ఉన్నాయి. కాఫ్స్ హార్బర్ లోప్రత్యేక ఆకర్షణ బిగ్ బనానా ఫన్ పార్క్ కి ఇద్దరూ చేరుకున్నారు.

          ఎంట్రెన్స్ లో పెద్ద అరటిపండు పసుపురంగులో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరూ కెమెరాలో జ్ఞాపకాలను బంధించుకున్నారు. ఈ బిగ్ బనానా 1964 వ సంవత్సరంలో పాట్రిక్హ్యూస్ నిర్మించారు. అరటి పండుకి సంబంధించి అనేక ఉత్పత్తులు ఈ పార్క్ లో ఉన్నాయి. అక్కడ ఉన్న సావనీర్ షాపులోకి దారి తీసారు విశాల, విష్ణు. ముచ్చటగా కనిపిస్తున్న బనానాస్ ఇన్ పైజామాస్ బొమ్మ చేతిలోకి తీసుకుంది. 

          ఆస్ట్రేలియా ఎబిసి టివిలో పిల్లలు ఇష్టపడే షో “బనానాస్ ఇన్ పైజామాస్” B1 మరియు B2 పేర్లతో పసుపురంగుతో అరటిపండ్లు రెండు కవలలు. కోలకళ్ళు చిరునవ్వులు చిందిస్తూ, బటన్లు పసుపు మరియు నలుపు బూట్లతో నీలం మరియు తెలుపు చారల పైజామా బట్టలతో రూపొందించిన కాల్పనిక కేరెక్టర్స్.

          విశాల చాలా ఇష్టంగా ఆ బొమ్మను కొనుక్కుంది. విష్ణుసాయి చేతిలో గైడ్ మ్యాప్ చూసుకుంటూ ఒరారా నీగి నీగి సిలీ లుకౌట్ కి దారి చూసుకుంటూ అక్కడికి చేరు కున్నారు. ఇది కాఫ్స్ హార్బర్ లో మొట్టమొదటి పర్యావరణ ధృవీకరణ పొందిన టూరిస్ట్ ఎట్రాక్షన్. సినిక్ లుకౌట్ వ్యూ ని ఇద్దరూ బైనాక్యులర్స్ తో ఇద్దరూ చూస్తూ విశాలా, విష్ణు చాలా సమయం అక్కడ గడిపారు.

          ఇద్దరూ ఆ సాయంత్రం ఇండియన్ రెస్టారెంట్ కోసం వెతుక్కుంటూ టేస్ట్ ఆఫ్ నార్త్ ఇండియాకి వెళ్ళారు. అక్కడ నాన్ రోటీ, వెజిటేరియన్ కర్రీ టేస్ట్ లను ఆస్వాదించారు.
రాత్రి ఏడు గంటలకి తిరికి రిసార్ట్ కి చేరుకున్నారు.

          “మనకి జిల్లా, జిల్లాకి నీరు, మాట, యాసలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది కదండీ! నేను ఇక్కడ కాఫ్స్ హార్బర్ లో స్వచ్ఛమైన గాలి, ప్రకృతి, సుందర దృశ్యాలు చూస్తున్నాను. ఇక్కడ ఎక్కువగా ఆస్ట్రేలియన్ స్లేంగ్ ఉంది. ఇక్కడ ఇండియన్స్ తక్కువ కదా!” అని తన అభిప్రాయం చెప్పింది విష్ణుతో విశాల.

          “విశాలా! దటీజ్ ఎ గుడ్ ఎనాలసిస్. నువ్వు చక్కని వ్యాసం తయారుచేసి పొందు పరుచుకో. యు గాట్ బ్యూటిఫుల్ టాలెంట్” అన్నాడు మెచ్చుకోలుగా విష్ణు. విశాల బడలిక తీర్చుకుంటూ, టివి రిమోట్ చేతిలోకి తీసుకుని టివి ఆన్ చేసింది. ఎబిసి ఛానెల్ లో వస్తున్న బనానాస్ ఇన్ పైజమాస్ షో ఆసక్తిగా చూసింది. చాలా రోజుల తర్వాత, నిద్రలేని రాత్రులు గడుపుతూ, అలుపెరుగకుండ నైట్ షిఫ్ట్ చేస్తూ కష్టపడుతున్న విష్ణుసాయి ఆ రోజు భార్యతో ఉల్లాసంగా కబుర్లు చెబుతూ నిద్రలోకి జారుకున్నాడు.

          ఉదయం నిద్ర లేస్తూనే విశాల సూర్యోదయం, సూర్యుని రాక మునుపు ఆకాశం లేత ఎరుపు వర్ణంలో కనిపించిన సుందర దృశ్యం చూస్తూ, విష్ణు ని నిదురలేపింది. సూర్యుని అరుణ రంగు వర్ణంలో చూడగానే విశాల ఆనందంతో “శ్రీ సూర్యనారాయణా! వేద పారాయణా! లోక రక్షామణీ! దైవ చూడామణీ! అని స్తుతించింది.

          అద్భుతం విశాలా! వాట్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. విట్ నెస్డ్ సన్ రైస్. నా చిన్నతనంలో ఆకాశవాణిలో సూర్యవర్ణాలను, రంగులను పూవులతో పోల్చుతూ విన్న పాట గుర్తొస్తోంది…

శ్రీ సూర్య నారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా మేలుకో !
పొడుస్తూ భానుడూ పొన్న పూవూ ఛాయ
పొన్న పూవూ మీద పొగడ పూవు ఛాయ !! శ్రీ సూర్య నారాయణా! మేలుకో హరి సూర్యనారాయణా !!
ఉదయిస్తు భానుడూ ఉల్లి పూవూ ఛాయ
ఉల్లి పూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ !! శ్రీ సూర్య !!
గడియొక్కి భానుడూ కంబ పూవూ ఛాయ
కంబపూవూ మీదా కాకారి పూఛాయ !! శ్రీ సూర్య !!
జామెక్కి భానుడు జాజి పూవు ఛాయ
జాజి పూవు మీద సంపంగి పూఛాయ !! శ్రీ సూర్య !!
మధ్యాహ్న భానుడూ మల్లెపూవూ ఛాయ…

          “వావ్! మీరు పైకి కనిపించని ఛుపే హుయే రుస్తుం. అపురూపమైన సూర్యస్త్రోత్రం గుర్తు చేసారు. మీకు అభినందన మందార మాలలు” అంది విశాల కళ్ళు పెద్దవి చేస్తూ.
ఉదయమే ఇద్దరూ బ్రెడ్ టోస్ట్ విత్ అవొకాడో ఆర్డర్ చేసి బ్రేక్ ఫాస్ట్ చేసారు. సమ్మర్ డ్రెస్ థీమ్ ధరించి విశాల, విష్ణు ఎమరాల్ట్ బీచ్ కి వెళ్ళారు.

          అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీలు రగ్గు పరుచుకుని, పిల్లలతో సందడిగా ఉంది ఆ ప్రదేశం. ఆ ప్రక్కనే బీచ్ కి ఆనుకుని ఉన్న పార్క్ కి కూడా వెళ్ళి చూసారు. ఆ రోజు సూర్యరశ్మి బాగుండటంతో కాస్త రద్దీగా ఉంది. కొన్ని కుటుంబాలు పిక్నిక్ కి వచ్చాయి.
ఆ సాయంత్రం విశాల, విష్ణు వుడ్ ఫైర్ ఇటాలియన్ పిజ్జా డిన్నర్ చేసారు. ఇద్దరూ రూమ్ కి చేరుకుని బయట బాల్కనీ డోర్ తీయగానే, ఎదురుగా కనిపించిన సుందర దృశ్యం పూర్ణ చంద్రబింబం ఎర్రని కాంతితో దర్శనమైంది. సమయం తెలియకుండా పున్నమి చంద్రుని కాంతిలో సంతోషంగా గడిపారు విశాల, విష్ణు. ఉదయమే ఇక ఫైట్ ఉండటంతో త్వరగా ఇద్దరూ నిద్రకి ఉపక్రమించారు. రూం చెకౌట్ చేసి, కీస్ ఇచ్చేసి, ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు విశాల, విష్ణు. అద్దెకు తీసుకున్న కారు రిటర్న్ చేసి, ఇద్దరూ చెకిన్ అయ్యి, ఫైయిట్ గేటు దగ్గరికి చేరుకున్నారు. ఉన్నట్టుండి విశాలకి కళ్ళు తిరిగినట్టుగా, వికారంగా అనిపించి అక్కడ సీటు దగ్గిర కూర్చుండిపోయింది.

          విష్ణు కంగారు పడుతూ మంచినీళ్ళ బాటిల్ త్రాగమని ఇచ్చాడు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.