ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 3
(ఒరియా నవలిక )
మూలం – హృసికేశ్ పాండా
తెనుగు సేత – స్వాతీ శ్రీపాద
పూర్ణ జలంధర్ దగ్గర రెండువేలు అప్పుతీసుకున్నాక, వడ్డీ ఎప్పటిలానే నెలకు పది శాతం, భగర్తికి వెయ్యిరూపాయలు కట్టేసాడు. జలంధర ప్రభుత్వ స్టాంప్ డ్యూటీకని వందరూపాయలు ఉంచేసుకున్నాడు.
పూర్ణ వలస కూలీగా ఆంధ్రా వెళ్ళిపోడానికి పత్రం రాసిచ్చాడు. దారిఖర్చుల కింద జలంధర్ మరో రెండు వందలు ఉంచుకున్నాడు. తన ప్రయాణానికి బట్టలు, ఒక బాగ్ ఇతర వస్తువులు రెండువందలరూపాయలు పెట్టి కొనుక్కున్నాడు పూర్ణ. ఒక సంచీ బియ్యం కొనుక్కుని ప్రేమశిలకు రెండు వందలు ఇచ్చి ఒక వంద తనతో ఉంచుకు న్నాడు.
మధ్య రకపు భూమి నుండి వరి , తక్కువ పంట ఇచ్చే కొండభూమి నుండి సిరిధాన్యాల పంట కోతలు పూర్తి చేసి నిలవవేసారు. ఇంకా మాగాణీ వరి పంట కొయ్యవలసి ఉంది. ఆ సమయంలోనే ఒక రోజున అతను గమడా రోడ్ రైల్వే స్టేషన్ కి ఒక ట్రక్ ట్రాలీలో బయలుదేరాడు. అతనిలా వేలాది మంది వలస కూలీలు స్టేషన్ లో ఉన్నారు. అక్కడ జలంధర్ సోదరుడు ఒకడు పూర్ణను ఒక ఆంధ్ర బ్రోకర్ కు పరిచయం చేసాడు.
ఆ బ్రోకర్ గ్రూప్ లో పూర్ణ లాటి వాళ్ళు మరో వందమండి ఉన్నారు. ఆ బ్రోకర్ ఒరియాలో మాట్లాడలేడు. గోండ్ తెగకు చెందిన, పది కిలోమీటర్ల దూరాన ఉన్న పక్క ఊరి మనిషి , అప్పటికే ఎన్నో సార్లు ఆంధ్రా వెళ్ళివచ్చిన వాడు బ్రోకర్ కూ , కూలి వారికీ మధ్యవర్తిగా ఉన్నాడు.
పూర్ణ అంతకు ముందు ట్రెయిన్ ఎక్కలేదు. ఇప్పుడు ట్రెయిన్ లో అతను తత్తరపడుతూ, కలవరంతో ఉన్నాడు. ముగ్గురికోసం ఉన్న బెంచీల మీద ఆరుగురు సర్దుకున్నారు. మిగతా వారు నేల మీద సాగిలపడ్డారు. మొదట్లో దాటిపోతున్న స్టేషన్ల పేర్లు చదవగలిగాడతను, కాని మర్నాడు ఏ పేర్లూ చదవలేకపోయాడు, మరి అతనికి ఒరియా తప్ప మరో అక్షరాలు తెలియవు. అందుకే తరువాత వచ్చిన తెలుగు పేర్లు చదవలేకపోయాడు. చివరికి ఒరియా అక్షరాలు కూడా ఒరియా తెలియని వాళ్ళు రాయడంతో అవీ చదవ శక్యం కాలేదు. అతను ట్రెయిన్ లో టాయ్ లెట్ కి వెళ్ళడాని క్కూడా భయపడ్డాడు. కాని వెళ్ళక తప్పనప్పుడు అతను క్యూలో నించున్నాడు. అతని వంతు రాగానే, టాయ్ లెట్ దరిద్రంగా ఉండటం చూసాడు. అక్కడే వాంతి చేసుకుని, మరోసారి ఆ అవసరం రాకుండా ఉండటానికి తిండి తినడం మానేసాడు. విపరీతమైన దాహం వేస్తే తప్ప కనీసం నీళ్ళు కూడా తాగలేదు. బులియాలు, కాంధులు, గోండ్లు, పహరియాలు, బింజిహయస్ లూ, పైకాలు, గొల్లవాళ్ళు అతనితో ప్రయాణిస్తున్నవారు. కొత్తగా రైలు ప్రయాణం చేస్తున్న అతన్ని వాళ్ళంతా ఆట పట్టించారు.
ఇంతకు ముందు ఆంధ్రాకు వెళ్ళిన వలస కూలీలు చాలా ఉత్సాహంగా హైదరాబాద్ పెద్ద స్టేషన్ అని చర్చించుకుంటున్నారు. ఆ చర్చ రెండో రోజు రైలు ప్రయాణంలో వేగం అందుకుని , పూర్ణకు అర్ధం అయినది వాళ్ళు వాళ్ళ గమ్యం చేరబోతు న్నారని. ఈ లోగా ఆంధ్రా బ్రోకర్ తీరు మారిపోయింది. అతను కఠినంగా ప్రవర్తించ సాగాడు. కర్ర చేతిలో పట్టుకుని కూలీలను పశువుల మందలా అదలించసాగాడు.
ట్రెయిన్ ఒక చిన్న స్టేషన్ లో ఆగింది. ఆంధ్రా బ్రోకర్ కర్ర చేతిలో పట్టుకుని తెలుగులో కూలీలను దిగమని చెప్పాడు. అతను తెలుగులో చెప్పినప్పటికీ ప్రతివారూ అర్ధం చేసుకుని దిగేసారు. ఉదయం కార్యక్రమాలు స్టేషన్ టాయిలెట్స్ లో పూర్తికానిచ్చి, తాము తెచ్చుకున్న తిండి తిన్నారు అందరూ. పూర్ణా తను తెచ్చుకున్న పేలాలు తిన్నాడు. స్టేషన్ లో మిగతా బ్రోకర్లు కూడా ఉన్నారు. కూలీలను మూడు గ్రూప్ లుగా విభజించారు. మూడు వేరు వేరు ట్రక్ లలోకి ఎక్కించి తీసుకెళ్ళారు. పూర్ణ ఒక ఎండిపోయిన నదీ తీరానికి చేరుకున్నాడు. అతన్నక్కడ ఇటుకల బట్టీలో పనిచెయ్యడానికి కుదుర్చుకు న్నారు. ఇంతకు మునుపు అతను ఏ ఇటుకల బట్టీలోనూ పనిచెయ్యలేదు. ఇంటి పైకప్పుకు వాడే పెంకులు ఎలా కాల్చాలో మాత్రం తెలుసు అతనికి. ఇటుకలు చేసి వాటిని కాల్చడం త్వరగానే నేర్చుకున్నాడు.
పూర్ణ మే నెలలో ఇంటికి తిరిగి వచ్చాడు. అతని రోజూ వారీ ఖర్చులు, అప్పుతీర్చాక కూలీలో మిగిలినది అయిదువందల రూపాయలకన్న తక్కువే. అందులో రెండు వందల రూపాయలు టికెట్ కు అయింది. అతను పాతబడి వెలిపోయిన బట్టల బదులు కొత్త బట్టలు, చెప్పులు కొనుక్కున్నాడు. ప్రేమ శిలకు ఒక చీర, కొడుక్కి బిస్కట్లు ఒక డ్రెస్ కొన్నాడు. రెండు వందల రూపాయలతో ఇల్లు చేరాడు.
పూర్ణ ఇల్లుచేరేసరికి ప్రేమశిల అడవిలో దొరికే తియ్యదుంపలను ఉడికిస్తోంది. హృదానంద వరండాలో పాకుతున్నాడు. ఆ సమయానికి కూలీలు గమడా రోడ్ స్టేషన్ నుండి గమడా గ్రామం చేరడానికి ట్రక్ ఏర్పాటుచెయ్యలేదు. పూర్ణా నడిచి వచ్చే సరికి అలసిపోయాడు. అయినా ఇల్లు చేరడంతో పొంగిపోయాడు. ప్రేమశిల ఉడకబెడుతున్న దుంపల విషయం మర్చిపోయి నేల మీద కూచుండిపోయింది. పూర్ణ కొడుకును ఎత్తుకుని ఆమెను తన బాగ్ తెరవమని అడిగాడు. పూర్ణా బిస్కెట్ పాకెట్ గొప్ప ఉత్సాహంగా తెరిచి కొడుక్కు ఒకటి తినిపించాడు. హృదానంద తుప్పున ఉమ్మేసాడు. పూర్ణ ప్రేమశిలను ఒకటి తినమన్నాడు. ఆమె బిస్కెట్ వంక చూసి కాస్త ముక్క తిని చూసింది. అది పాడైపోయినట్టుంది. ఆమె ఉమ్మివేసి, దాని వంక చూసింది, బూజు పట్టి కనిపించింది.
” బిస్కెట్ అమ్మేవాడు కూడా నిన్ను మోసం చేసాడు.” అని ప్రేమశిల బిస్కెట్ పాకెట్ బయటకు విసిరేసింది.
*****
(సశేషం)
స్వాతీ శ్రీపాద పుట్టి పెరిగినది నిజామాబాద్. కధ, కవిత, నవల ఒకఎత్తైతే , అనువాదం మరొక ఎత్తు. వెరసి మొత్తానికి అక్షరాలే ప్రపంచం. రాసినది చాలానే అయినా ప్రచురించినది 8 కవితా సంపుటాలు, 7 కధా సంపుటాలు, 4 నవలలు మరెన్నో డిజిటల్ పుస్తకాలు. అనువాదాలు 32 తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం , ప్రతిభా పురస్కారం, వంశీ -తెన్నెటి లత కధా పురస్కారం , వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం , రచనకు అనువాదానికి మహాత్మా ఫూలే అవార్డ్ , మొదలైనవి ఎన్నో…