ఈ తరం నడక – 7
కొత్త తలుపు- కాళ్ళకూరి శైలజ కథలు
-రూపరుక్మిణి. కె
ఒక ఆలోచన మనల్ని మనుషుల్లోనికి లాక్కెళుతుంది. మనిషిని చేస్తుంది.
good thoughts gives us a good life
మన ఆలోచనలే మనల్ని ఇతరులకు పట్టించేస్తాయి. అనిపించక మానదు ఈ “కొత్త తలుపు” తెరిచినప్పుడు.
శైలజ గారు మీతో ఒక చిన్నమాట ” మన మాటల్లో ఎప్పుడూ దొర్లిపోయే కాలం ఇక్కడ చాలా మారాం చేసేసిందండి “.
ఆల్చిప్పలో ముత్యం కోసం చూస్తుంటే,… కెంపు, మాణిక్యాలు ఎదురయ్యాయి.. సముద్రం అడుగున గంభీరమైన శబ్దం నన్ను పట్టుకు లాక్కెళ్ళింది. ఎందుకింత సంవేదన ఈ అక్షరాలతో అంటే., అవి మనం కరిగించుకున్న కాలాలవైతే కాదు, ఖచ్చితంగా ఈ కొత్త తలుపులోని అక్షరాల మహత్యమే.
వాక్యం ఎంత ప్రసన్నంగా ప్రశాంతమైన నదీ ప్రవాహంలా సాగుతుందో.., కథ ముగింపు కొచ్చేసరికి సముద్రమంత గాంభీర్యాన్ని మూట కట్టి మనసుకి ఇస్తున్నాయి ఈ కథలు.
మనిషి జీవితానికి ఎన్ని హంగులు అద్దినా, మానవత్వం అనే పరిమళం అంటు కుంటే కలిగే పరిణామాల్ని శైలజ గారి కలం గుప్పిట్లోంచి మనకు కొత్త తలుపు తెరిచి చూపిస్తారు.
What is next step of your life అని యువతని అడిగే ముందు మనం ఒక్క క్షణం ఆలోచించాలి, అనే ఆలోచనతో మొదలవుతుంది ఈ కథా సంపుటి.
మన కళ్ళ ముందు ‘రవి’ లాంటి పిల్లలు మన మధ్యే నలిగిపోతున్నా, పంటి బిగువున జీవితం యొక్క తొలి అడుగుల్లో స్వప్నాలకి భయపడి, ఎంతటి వేదన పడుతుంటారో., ఆ సమయంలో మెంటర్స్ అవసరం ఎలా ప్రభావాన్ని చూపిస్తుందో ఓ లైబ్రేరియన్ విఠల్ గారి లాంటి వాళ్ళ ఆదరణ ఎంత ఆదరువు అవుతుందో చెప్పే కథ ” ఏం చేయాలి” లో ఎదురు నిలిచిన వాక్యం ఇక్కడ చూడండి.
” ఓర్చుకో బిడ్డా, నడిచినంత దూరం నీకు నువ్వే ముళ్ళు రాళ్ళు తీసుకుంటూ అడ్డొచ్చిన కంపా సరిచేసి చదును చేసుకుంటూ వెళ్తే అది నువ్వు వేసిన దారి, కొత్త దారి “
ఇలా చెప్పే నైపుణ్యం కేవలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం అనుకుంటాను. అటువంటి వాక్యాన్ని ఎంతో నేర్పుగా ఈ కథకి వర్తించేలా రాయడం శైలజ గారి ప్రత్యేకత.
ఇలా జీవితపు కోణాల్ని చూపించే కథలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.
ఒక ఆర్టిస్ట్ కి కాలాన్ని గెలిచే అస్త్రం తన బ్రష్ అని, కొందరి జీవితాలు ఇతరులకు ఉపయోగపడడంలోనే జీవితపు గెలుపుని చూసుకుంటారని, అటువంటి వాళ్ళు ఎంత సింపుల్ సిటీని ప్రదర్శిస్తుంటారో, ఏ హంగు ఆర్భాటాలు లేకుండానే మన మధ్య ఎంత గుమ్మనంగా బ్రతుకుతూ ఉంటారో చెప్పే కథ ” ఎవరికి ఎవరు ఈ లోకంలో ”
ఇక్కడ వయసుతో నిమిత్తం లేని స్నేహాలుంటాయి, మనుషులు ఒకరి మనసులతో మరొకరు మాట్లాడుకుంటారు, ఎంత నిర్లిప్తమైన జీవితాలు అయినా, పాజిటివిటీని అందుకుని ఎలా జీవిస్తున్నారో చెప్పే కథలు మనల్ని ఆలోచనల సాగరంలో ముంచుతాయి.
” జీవన సాఫల్యం నాలో లోపల నిండిపోతున్నట్లు అనిపించింది. జీవితం, మరణం అని రెండు చుక్కల నడుమ సరళరేఖలా జీవితం కనిపిస్తుందని” . చెప్పిన ‘వీర ‘ మనకి అమాయకంగా ఇంకిపోతున్న జీవిత మాధుర్యాన్ని చూపిస్తాడు.
తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మూడీగా అయిపోతే వారి కలత పడ్డ జీవితాల్ని చూస్తూ ప్రతిఘటించలేని సందర్భాన్ని ” మౌన పోరాటం ” చేసి మ్యాథ్యు, రిక్కీ మధ్య ( తండ్రి, కొడుకులు) సంవాదానని ఎంతో నేర్పుగా చెప్పి ఒప్పిస్తారు. ఇలాంటి ఓ సందర్భం ప్రతి తల్లిదండ్రులుగా ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటాం చిన్నదో, పెద్దదో.
అన్వేషణలో మంచు తుఫాన్ కి గొంతు పెగలని విశాలమైన మంచు మైదానంలో ‘కొండలరాయుడి’ రిస్క్యూ చేసే విధానం, ఓ తల్లిగా “నెల్లి” మనసు ఎంత ఓర్పుగా ఉంటుందో బాగా చెప్పారు.
“బతుకు పుస్తకం” లో గణపతి మాష్టార్నీ , విశ్వ ( విద్యార్థి) నీ చూసినప్పుడు ఎన్ని జీవితాలు ఇలా పట్టించుకునే వారు లేక చిద్రమవుతున్నాయో కదా అన్న ఆలోచనలు వెన్నంటి నీడలా ప్రవహిస్తాయి.
ఇంక మరి “కొత్త తలుపు” కథ మాట్లాడితే మహిళలకు జీవితమంతా వెతికినా లేని రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుతూ, మాధవి లాంటి సర్వీస్ మైండ్ పీపుల్ అవసరం, డొమెస్టిక్ హెల్పర్స్ సహాయం ఎంత అవసరమో చెప్పే కథని రియాలిటీ ఆఫ్ లైఫ్ గా చూడొచ్చు.. ఈ కథలో నేను ఉన్నాను అనిపించింది. కారణం నా కుటుంబాన్ని నెట్టుకు రాలేని సమయంలో నన్ను నాకు చూపించిన వాతావరణంలో అదృష్టంగా వరించింది ఈ తోవే మరి., ఈ డొమెస్టిక్ హెల్పర్స్.. వీరి సాయమే వుంటే జీవితం ఎంత సుమధురం చేస్తాయో చెప్పే కథ, ” రాజారావు” కూతురి కథ ఇందులోనే ఇంకో ప్రత్యేకం.
ఇంటి పనుల్లో మహిళలకు ఉన్నంత బాధ్యత మధ్యతరగతి జీవితాల్లో పురుషుల పైన ఉండదని చెప్పే కథ ” తాకట్టు విడుదల” పిల్లల బాధ్యత ఎప్పుడూ తల్లిదే ఏ సమస్య ఎదురైనా అటువంటి సందర్భాల్లో స్త్రీ ఎలా బయటకు అడుగుపెట్టి నేర్పు సాధిస్తుందో చెప్పే కథ ఇది. కష్టం తెలిసిన కన్నీటి గాధ.
ఇలా చెప్పుకుపోతే “కర్ణా కర్ణిక” నిత్యజీవితంలో మనం విని తెలుసుకునే ‘ రియాలిటీ చెక్’ లైఫ్ సైకిల్ బాగుంటుంది.
” అదే నీవు,అదే నేను ” కథలో ప్రేమకి, జీవితానికి లంకె కుదరనప్పుడు మనుషులు ఎంత మౌనంలో పడిపోతారో చెప్పే కథ, కులం అంతరం వచ్చి కాదనుకున్న మనసులు ఒకరికొకరు ఎలా ఆలంబనగా నిలుస్తారో డిగ్నిఫైడ్ ఆఫ్ లైఫ్ థియరీ ని చాలా చక్కగా చెప్పారు.
ఈ కొత్త తలుపు పుస్తకం మూసుకుపోయిన జీవితాలకి కొత్త దారి చూపే కథలు, మనలో నుండి మనం చూసే జీవిత అర్ధాలే మార్చే ప్రయత్నం చాలా బాగుంది శైలజ గారు. ఇంత బాగా మీరు కథ చెప్పడం నాకు బలే నచ్చింది. ఇంత పాజిటివిటిని పంచే కథలు ఓ ప్రొఫెసర్ గా మెడికల్ ఫీల్డ్ మీకు అందించిన స్పూర్తి నుండే వచ్చాయేమో… అమ్మలా అల్లుకుపోయే ప్రతి అక్షరానికి సలాములు… కొత్తతలుపు నిజంగానే కొత్త ఆలోచనల తలంపులు
( ఈ “కొత్త తలుపు” పుస్తకం కథలు ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటూ )
*****
పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
అనేకానేక ధన్యవాదాలు రూపా.మీ ఓపెన్ మైండెడ్ నెస్ కి నా స్నేహ హస్తాన్ని అందించి కలిసి నడుస్తూనే ఉన్నాను.ఉంటాను.