కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-21
శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ
-డా. సిహెచ్. సుశీల
“A phobia is an overwhelming and debilitating fear of an object, place, situation, feeling or animal “
ఫోబియా అనేది ఒక నిర్దిష్ట వస్తువు, పరిస్థితి లేదా కార్యాచరణ పై ‘నియంత్రించ లేని అహేతుకమైన’ భయం. నిజానికి కొందరికి ఈ భయం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క మూలాన్ని నివారించటం ఒకటే మార్గం. లేకుంటే ఒక్కొక్కసారి అది పానిక్ ఎటాక్ గా మారవచ్చు. అకస్మాత్తుగా తీవ్రమైన భయంతో వణికి పోవడం, చెమటలు పట్టడం, గుండె దడ పెరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం పంటి తీవ్ర లక్షణాలు కూడా ఉంటాయి.
కానీ, భయం వేరు, ఆందోళన వేరు, ఫోబియా వేరు. అన్నీ ఒకేలా ఉన్నా, లక్షణాలు ఒకేరకంగా కనిపిస్తున్నా వీటి మధ్య చాలా బేధం ఉంది. అది మానసిక వైద్యులు, కొన్ని పరీక్షల వల్ల మాత్రమే తెలుసుకోగలరు.
ఇతర దేశాల్లో మానసికమైన ఏ చిన్న సమస్య వచ్చినా సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) దగ్గరకు వెళ్ళి నిస్సంకోచంగా తమ సమస్యల్ని చెబుతారు. కానీ భారతదేశంలో మానసిక వైద్యుడు దగ్గరకు వెళ్ళడం అంటే “పిచ్చి” అనుకుంటారని భయం, సంకోచం, సమాజం పట్ల బెరుకు ఉంది. సాంకేతిక పరిజ్ఞానం కలిగి, వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈరోజుల్లోనే ఇలా ఉంటే ఇక 1930 ప్రాంతాలలో మనుషులకు ఈ వ్యాధి లేదా సమస్య గురించిన అవగాహన ఉంటుందా!
ఈ విషయం పైననే శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ ఆంధ్రపత్రిక 1931. మార్చి ఉగాది ప్రత్యేక సంచిక ,లో కథ రాసారు.
*వింత విశాలాక్షి*
విశాలాక్షి, గంగాధరరావు భార్యాభర్తలు. పాతికేళ్ల విశాలాక్షి కి చిన్నప్పటి నుంచీ ఏ జంతువు ని చూసినా భయమే. ఎలుక, పిల్లి, కుక్క, చుంచు, చిమ్మెట, అన్నిటికంటే “, బొద్దింక” ను చూస్తే భయం. బొద్దింకను చూడటమే కాదు పేరు చెప్తేనే ఉలిక్కిపడి హడలి పోతుంది. దీపాలు పెట్టాక సాధారణంగా బయటికి వస్తాయని భయం గా గడుపుతూ ఉంటుంది. ఆ భయం చూసి భర్త కసురుకుంటూ ఉంటాడు. విశాలాక్షి అందమైనది. చదువుకున్నది. పాటలు, పద్యాలు, కుట్టు పనులు చక్కగా వచ్చు. తెలివితేటలు గలది. కానీ బొద్దింక అంటేనే చచ్చేంత భయం.
పక్కింటి పదేళ్ళ పార్వతి కూడా వెక్కిరిస్తుంది – అదుగో బొద్దింక అంటూ. హడలి పోయి గెంతులు వేస్తుంటే పార్వతి నవ్వుతుంది. వాళ్ళమ్మ రామమ్మ “ఎందుకంత భయం? మేమంతా లేమా” అంటున్నా భయంతో ఇంటికి పారిపోయి వస్తుంది. ఈ భయం వల్లనే ఎక్కడికి వెళ్ళడానికి మానుకుంది.
ఒకసారి గంగాధరం మేనమామ కొడుకు పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. విశాలాక్షి రానని ఎంత చెప్పినా వాళ్లు మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాయడంతో వెళ్ళక తప్పలేదు. గంగాధరరావు మేనమామ పేరు వెంకట్రామయ్య. ఆయనకు ఒకే ఒక కొడుకు. చాలా డబ్బు ఉంది. పెళ్ళి కూడా చాలా వైభవంగా చేయదలుచుకున్నాడు. బంధువులందరినీ నాలుగు రోజులు ముందుగానే రమ్మన్నాడు. ఆయన ఇల్లు పెద్ద బంగళా. పక్కనే పెద్ద తోట. ఆ తోటలో రకరకాల అందమైన పువ్వులు. చుట్టాలు అందరూ వచ్చారు. పెళ్ళి సందడి ప్రారంభమైంది. కానీ ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ విశాలాక్షికి భయం పెరిగిపోతోంది. ముఖ్యంగా సాయంత్రమైందంటే ఎక్కడో ఏదో పాకుతూ ఉన్నట్టు భావించేది. నిజానికి అన్నన్ని పెళ్లి సామానులు ఉన్నప్పుడు ఏవో పాకుతూనే ఉండి ఉంటాయి. దాంతోటి ఆమె అదిరిపోవడం, భర్త దగ్గరికి వెళ్లి “నేను రానంటే రమ్మన్నారు. ఎందుకు వచ్చిన పెళ్ళి! వెళ్ళిపోదాం” అని బాధపడటం చేసేది. రాత్రి పూట అందరూ గదుల్లో పడుకుంటే విశాలాక్షి మాత్రం హాలు లో చాలమంది మధ్య లో పడుకునేది.
ఎలాగో నాలుగు రోజులు గడిపింది. ఐదో రోజు రాత్రి అందరూ మంచి నిద్రలో ఉండగా “దొంగ దొంగ” అని బిగ్గరగా అరుపులు విని గదుల్లోని వారందరూ లేచి కంగారుగా హాలు లోకి వచ్చారు. తమ వస్తువులన్నీ ఉన్నాయో లేవో అని చూసుకుని, ఉన్నాయని నిమ్మళించుకుని తేరిపార చూసారు. విశాలాక్షి ఒకామెను గట్టిగా పట్టుకుని దొంగ దొంగ అని అరుస్తోంది. అంతలో ఆమె “,నాకేమీ తెలియదు. సుబ్బమ్మ గారి అడ్డిగ ( మెడలో వేసుకునే నగ) తీసింది మా అక్క” అనేసింది. అక్కడే ఉన్న సుబ్బమ్మ “అవును. పొద్దుటి నుండి నా అడ్డిగ కనబడడం లేదు. ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు” అన్నది. పోయిన వస్తువు దొరకడంతో అందరూ సంతోషపడ్డారు. ఇంకా ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్న విశాలాక్షి ని విడదీసి ” ఎలాగు కనిపెట్టావు సుబ్బమ్మ అడ్డిగ ఈమె అక్క తీసిందని” అని అడిగారు.
“నాకేమీ తెలియదు. నాకు బొద్దింకలు ఎగురుతున్నట్టు, దొంగలొచ్చినట్టు కల వచ్చింది. భయమేసి, పక్కనున్న ఈమెను గట్టిగా పట్టుకున్నాను” అన్నది. అందరూ ఆశ్చర్యపోయారు. సుబ్బమ్మ సంతోషపడింది.
కథ సుఖాంతమయింది కానీ విశాలాక్షి భయాన్ని హాస్యం గా, తేలికగా తీసుకో కూడదు. ఈ భయం పెరిగి ఒక్కోసారి తీవ్రతరమై ప్రాణాంతకం కూడా కావచ్చు.
చిత్రం ఏమిటంటే – 1930 – 32 మధ్య అన్నపూర్ణమ్మ గారు గృహలక్ష్మి, భారతి, ఆంధ్రపత్రిక లలో రాసిన కథలు ( లభ్యమౌతున్న) 5 కథలలో మూడిటిలో బొద్దింక, కుక్క, పాము ప్రసక్తి ఉంది.
ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ రకమైన ఫోబియాలు ( ఎతైన, లోతైన ప్రదేశాలు, విశాలమైన మైదానాలు, ఇరుకైన ప్రదేశాలు, సమూహాలు, జంతువులు వంటి వాటికి భయపడే ఫోబియాలతో) బాధపడుతున్నారు. అది వారి దైనందిన జీవితంలో, ఉద్యోగ జీవితం పై ప్రభావం పడవచ్చు. విపరీతమైన ఒత్తిడితో, ఆందోళనతో ప్రాణాంతకమయ్యే వరకు జాగు చేయక వైద్యుని సంప్రదించడం మంచిది. వంశపారంపర్యం, బాల్యం లో జరిగిన సంఘటనలు వంటి కారణాలు ఉండవచ్చు కానీ పూర్తి కారణం డాక్టర్లు కూడా నిర్ధారించలేరు. వారి ఆందోళనను తీసిపారేయడమో, హేళన చేయడమో కాక సన్నిహితులు – ముఖ్యంగా ఇంట్లోని సభ్యులు అర్ధం చేసుకుని తగినంత సపోర్ట్ ఇవ్వాలి.
స్త్రీ పురుషులకు సంబంధించిన – ముఖ్యంగా స్త్రీల సామాజిక, శారీరక, మానసిక పరిస్థితులను కూడా 95, 100 ఏళ్ల క్రితమే రచయిత్రులు కథలుగా రాసారని తెలుస్తోంది.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం