గతిర్నాస్తి

– శ్రీధర్ రెడ్డి బిల్లా

క్రిందికి చూడు మిత్రమా ..
దూరాబార దుర్గమ గగనాంతర సీమల
పోరాడుతూ మనం సాగిపోతుంటే,
భూగోళ వ్యాసం క్షణక్షణానికి తరుగుతూ
అగోచరమవుతున్నట్టు లేదూ?

ఒడలు లేకుండా ,
బడలిక లేకుండా ,
కాయకర్మను మోసుకుంటూ
భయాన్ని వెంటేసుకుంటూ
యోజనాలెన్ని దాటి వచ్చామో!
ప్రయోజనమేమైనా దక్కుతుందంటావా?

కనిపిస్తున్నది అదిగో..
కాసుకొని ఉన్నది మనకొరకే
కణకణమని నిప్పులు
గక్కుకుంటూ కాసారప్రవాహం.
సంశయమే లేదు
అదే.. వైతరణీ.
దాటగలమంటావా?
ఆ దరి చేరగలమంటావా ?
అదృష్టమేదో పరీక్షిద్దాం.. పద!

పరవాలేదోయ్ నేస్తమా.
అన్నార్తులకు చేసిన భిక్షయో
ఆపన్నుల కందించిన సాయమో
ఆ అరకొర పుణ్యమేదో
ఆపద దాటించి
ఇద్దరినీ ఈ గట్టున పడేసిందేమో ?

అవని సీమ దాటి
ఆకాశ సీమ దాటి
అంతరిక్షము దాటి
అవాంతరములు దాటి..
ఇక దివి సీమ దరికి చేరుకునేలోపు..
ఇంకొక సంకట ముంటుందోయ్!

పున్నామ నరకం..
పుత్రుడున్న నీకు సులభమే
నాకదే దుర్లభం…
పద పదవోయ్
ప్రయత్నమైతే తప్పదుగా!

అయ్యో .. అయ్యో.. అనూహ్యం.
ఇక్కడ చిక్కువడ్డావేం నేస్తమా!
నీ ఆస్తిపాస్తులు జూస్తున్న ..
నీ కన్నకొడుకు
నీ వంశం మోస్తున్న..
నీ పుత్రుడు ..
ఈ నరకం నుంచి
నిను తప్పించి ఉండాలే!

అదేమి ఆశ్చర్యమో
నాకిది తప్పిందోయ్,
గుండియల నిండా
నాపై ప్రేమను మోసిన
నా కన్న కూతురు!
నేను నేర్పిన విలువలకై
ఎన్ని కష్టాల కోర్చిందో
నా పేరు ప్రతిష్టలు నిలిపిన
నా కన్న బిడ్డ!
ఆ ప్రేమ గెలిచింది.
నాకు ముక్తి నిచ్చింది!

పురాణం చెప్పినట్టే
ప్రయాణం సాగింది గానీ
ఆ తాళపత్రాలలో
ఆ ఒక్క వాక్యం అచ్చుతప్పన్నమాట!
“అపుత్రికస్య గతిర్నాస్తి”! అని
సరిచేయాలి మిత్రమా !.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.