బాల్యంలో పందుంపుల్ల కోసం చెట్టుదగ్గరకెళ్ళినపుడు అక్కడ వెండ్రుకలూ నిమ్మకాయలూ వంటివి కనిపిస్తే చిరుతిండికి పనికొస్తాయని డబ్బుల్నీ,ఆడుకోడానికి పనికొస్తుందని వేపబెత్తాన్ని తీసుకుని అందరూ నోరెళ్ళబెట్టేలా చేసిన ఆకతాయి, తాను మిఠాయి తింటుంటే “నాకూ కొనిపెట్టవా ? ” అని జాలిగా అడిగిన బ్రాహ్మణ బాలుడికి సరే పోనీ పాపం అని కొని పెడుతుంటే ఆ బాపనకుర్రాడు “నువ్వు డబ్బులు మాత్రమే ఇవ్వు. ఆ మిఠాయిని తాకవద్దు” అంటే క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టిన కుర్రాడు, బడికి ఆలస్యంగా ఎందుకొచ్చావని అడిగిన మాస్టారికి “స్నానం చేసి రావడం వల్ల ” అని సంజాయిషీ ఇచ్చి ” ఏమిటి ? అబ్రాహ్మణులకు కూడా ఉదయపు స్నానమా ! అన్నారని మాస్టారిని ఎదిరించి, ఫలితంగా పాఠం అయ్యేవరకూ నిలబడి ఉండాల్సొచ్చిన ధైర్యశాలి ,”అందరూ సమానులు కాదా ? బ్రాహ్మణుల ఆధిక్యత ఏమిటి ? అబ్రాహ్మణుల అల్పత్వం ఏమిటి ? “అనే ప్రశ్నలు బాల్యంలోనే సంధించిన హేతువాది త్రిపురనేని రామస్వామి చౌదరి కృష్ణాజిల్లా అంగలూరులో చలమయ్య రామమ్మ దంపతులకు 15-1-1887లో జన్మించాడు.
త్రిపురనేని ఇంగ్లండులో బారిష్టరు చదివి బందరు, బెజవాడలలో వకీలుగా పనిచేసి చివరకు తెనాలిలో స్థిరపడ్డారు. పురాణాల మీదా బ్రాహ్మణ సంప్రదాయాల మీదా ( బ్రాహ్మణుల మీద కాదు ) తిరుగుబాటు చేశారు. న్యాయవాదిగా కోర్టులో ఒక సాక్షిని నువ్వు అని సంబోధించినందుకు న్యాయాధిపతి ” అతను బ్రాహ్మణుడు” ఏకవచనం కూడదు “మీరు” అని సంబోధించాలి ‘ అంటే ” నాకు ఏకులమైనా ఒక్కటే ” అని టక్కున సమాధానమిచ్చారు. త్రిపురనేని కోపం బ్రాహ్మణుల మీద కాదు. వారి ఆచారాల మీదే !కాబట్టే ఉన్నవ లక్ష్మీనారాయణగారు ఒక బ్రాహ్మణ యువకుడికి ఉద్యోగం ఇప్పించమని చీటీ రాసి పంపిస్తే తెనాలి మున్సిపాలిటీలో ఉద్యోగం వేయించారు. మూడాఛారాలను ఎదుర్కోడానికి యువజన సంఘాన్నిస్థాపించారు. రాముడు శంభూకుడి శిరస్సు ఖండిం చిన ఘట్టాన్నిచదివి చలించిపోయి తన ఇంటి పేరును ‘శంభుకాశ్రమం’ గా మార్చారు. రాముడు దేవుడు కాదనీ, పురాణాలు కట్టుకథలనీ, భగవద్గీత కల్పితమనీ, భారత రామాయణాలూ ధర్మశాస్త్రాలూ ఒకవర్గం తన అధికారం కోసం రాసిన గ్రంధాలనీ ప్రచారం చేశారు. మారీసుపేటలో బ్రాహ్మణులు ఒక మేకను తెచ్చి యజ్ఞం చేయాలను కుంటే దాన్ని ఈయన భగ్నం చేశారు. వేదాలు దైవం అయితే వాటిని ఒక రాక్షసుడెలా మింగ గలిగాడు? అని ప్రశ్నించారు?’వేదాలు ఎలా పుట్టాయో, ఋషుల దగ్గరకెలా వచ్చాయో వేదాల్లోనే ఉందా !చక్కని కథ. పిల్లలకు చెప్పడానికి బాగుంటుంది’ అని ఎద్దేవా చేసారు. మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. “శుభాశుభ కార్యాలన్నీ బ్రాహ్మణులే చేయించాలని ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు” అన్నారు.
పెళ్ళి అనేది వ్యక్తిగత విషయం. దేవుడికీ మతానికీ సంబంధం లేదు. పట్టాభిషేకానికి పెట్టిన ముహూర్తం రాముణ్ణి అడవులపాలు చేసిన సంగతి మనకు తెలుసు. లగ్నాలు కుదరడం లేదని రోహిణీ కార్తెలో ఏ రెండుజాములకో పెళ్ళిళ్ళు కుదిర్చి అందరికీ చీకాకు కల్పించడం ఉచితమా?” అంటూ పెళ్ళి విధానాలను వివరిస్తూ ” వివాహ విధి ” అనే పుస్తకం రాశారు. ఇది ఆ రోజుల్లో ప్రజాభిమానాన్ని పొందింది. భగవంతుడికి సంస్కృతభాషే ఇష్టమని తలిచే ఈ మూఢలోకానికి పెళ్ళి మంత్రాలు తెలుగులో కూడా ఉండవచ్చని ఎలా చెప్పాలి? అన్నారు. స్వయంగా పౌరోహిత్యం వహించి ఆయన చేసిన పెళ్ళిళ్ళలో వితంతువివాహాలు, వర్ణాంతర వివాహాలు కూడా ఉన్నాయి. ఆ పెళ్ళిళ్ళలో “అగ్నిసాక్షిగా ” అని కాక “పెళ్ళి పెద్దల సాక్షిగా ” అని ప్రమాణం చేయించేవారు.
పురాణాలు వ్యాససృష్టి కాదనీ అవన్నీ కల్పితాలనీ సూతుడు తనకు చెప్పినట్టు “సూతపురాణం” లో రాశారు. విశ్వనాథవారు “వేనరాజు” నాటకంలో వేనరాజుకి ఘోరం తలపెట్టారని విమర్శించి “ఖూనీ” అనే నాటకాన్నిరచించారు. భగవద్గీతకు అధిక్షేపణగా బ్రహ్మనాయుడు బాలచంద్రునికి బోధించినట్టుగా తానొక భగవద్గీతను రాశారు. ‘కుప్పు సామి’ అనే ద్రావిడుల దేవుడిపేరు మీద ఒక నీతిశతకాన్ని రచించారు.తరచుగా గుడికి పోయి ఏదో గొణిగేవాడు తప్పకుండా పాపి అయ్యుంటాడు. అతని కలుషితమైన మనస్సే అలా చేయిస్తుంది. అంటారు ఈ శతకంలో.
” గుడికి తరచు పోయి గొణుగుచుండెడివాడు
చెడ్డపాపమేదో చేసియుండు
నదియె వానిబట్టి యట్టిట్టు పీడింప
గుడికిపోవు నతడు కుప్పుసామి “
శ్రీకృష్ణుని గురించి వ్యంగ్యంగా “ పనికిమాలిన యోరి గోపాలరాయ “అనే మకుటం తో ఓ శతకాన్నిప్రారంభించి 26 పద్యాలు రాశారు. చచ్చిపోయిన జీవి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడని చెబుతూనే మళ్ళీ పిండాలు పెడతామని పిలవడం ఎందుకు? అని ప్రశ్నించారు. 1929లో ఒంగోలు తాలూకా కాకర్లపాడులో పితృకార్యంలో తగిన దక్షిణ ఇవ్వలేదని ఒక వైశ్యుడిని బ్రాహ్మణులు చితగ్గొడితే బాధితుడి పక్షాన వాదించి వారికి జరిమానా వేయించారు.
త్రిపురనేనికి సమయ స్ఫూర్తీ చమత్కారం సహజంగా అలవడ్డాయి. ఒక భక్తుడు ఆయన్ని ” మీరు నాస్తికులుకదా ! దేవుడొక్కడే అనే ఆస్తికుల ఆర్య సమాజంలో ఎలా చేరారు?” అని ప్రశ్నిస్తే ” 33 కోట్ల దేవతలున్న హిందూసమాజంవారిని ఆర్య సమాజం వారు ఓడించేస్తే , ఆర్య సమాజం వారి ఒక్కదేవుడితో నేను కుస్తీపట్టి ఓడిస్తాను” అన్నారు. ఎవరైనా వచ్చి ” మా దేవుడికి రెండుపువ్వులివ్వండి” అంటే ” కావాలంటే మీ దేవుణ్ణి తీసుకొచ్చి ఈ చెట్టుకింద పెట్టండి. పువ్వులు చెట్టుకి ఉంటే అందం కానీ కోసేస్తే ఏముం టుంది? ” అనేవారు. ఒక పురోహితుడాయన్ని ” మీకు మంచితనంతో పాటు దైవ చింతన ఉంటే బాగుండేది” అంటే ” చింతా, సీమ చింతా తెలుసు. ఈ దైవచింత గురించి నాకు తెలియదు. అని చమత్కరించారు. ఒక శాస్త్రిగారాయన్ని ‘రాముణ్ణి విమర్శించే మీరు రామస్వామి అనే పేరెందుకు పెట్టుకున్నారు?’ అనడిగితే “స్వామి అంటే మొగుడు అని అర్ధం. అంటే నేను రాముడికి మొగుణ్ణి “అన్నారు. ఒక పండితుడు “ధర్మము కృత యుగంలో నాలుగు పాదాల నడిచింది” అంటే ” ఆ కాలంలో అందరూ పశుప్రాయు లన్నమాట” అని హేళన చేశారు.
లండన్ లో ఒక స్త్రీ ఆయన్ని ” మీరు టోపీ ధరిస్తే మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తా! ” అంది. వెంటనే ఈయన “మీరు చీరె, రవికె ధరిస్తే మంచి రాకుమారుణ్ణిచ్చి పెళ్ళి చేస్తాను “అన్నారు. గాంధీ టోపీ అంటే ఆయనకి అసహ్యం కలగడానికి కారణముంది. గాంధీగారు దక్షిణాఫ్రికాలో జైలులో ఉన్నపుడు తెల్లవారికీ నల్లవారికీ భేదం తెలియడం కోసం సూపరింటెండెంట్ గాంధీ గారికి తెల్ల టోపీ తగిలించాడు. జైలు నుంచి వచ్చాక కూడా గాంధీ దాన్ని కొనసాగించారు. త్రిపురనేని శాఖాహారి. ఓ విందులో తాపీ ధర్మారావుగారా యన్ని” మీరు తృణభక్షకులు(grass eaters) ” అన్నారు. వెంటనే త్రిపురనేని “మీరు శవభక్షకులు” అని బదులిచ్చారు.
ఇతిహాసకథల్లోని కల్పనల పై కూడా త్రిపురనేని ధ్వజమెత్తారు. రాజరాజ నరేంద్రుడు, చిత్రాంగి కథ మాళవదేశానికి సంబంధించిందనీ కవులు దీన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పాలించిన భారత కృతికర్త రాజరాజనరేంద్రుడికి అంటగట్టారన్నారు. కృష్ణుడి మేనత్త రాధ నందుని చెల్లెలనీ, అతనితో సయ్యాటలాడిన రాధ వేరని వివరాలతో చెప్పారు. అలాగే చంద్రవంశపు దశరథుడి కుమార్తె శాంతను , సూర్యవంశపు రాజైన రాముడి తండ్రి దశరథుడికి కూతుర్నీ, సీతకు ఆడబిడ్డనూ చేశారన్నారు.
త్రిపురనేనికి జాతీయాభిమానం తక్కువేమీ కాదు. ఐర్లాండ్ వెళ్ళినపుడు ఒక ఆంగ్లేయుడు ‘భారతీయులది దాస్యబుద్ధి ‘ (slavish mentality)అన్నాడని రొట్టె కోసే కత్తిని పైకెత్తి ‘మళ్ళీ ఆ మాట అంటే నీ నాలుక కోసేస్తాను’అన్నారు. ఆ తెల్లవాడు నోరెత్తితే ఒట్టు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల ప్రభావంతో “రాణాప్రతాప్ ” అనే నాటకాన్ని, ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో ” వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడీ’ వంటి గేయాలనూ రాశారు.
తాను చెప్పిందే నమ్మమని త్రిపురనేని ఆయన ఎవరికీ చెప్పేవారు కాదు. “చదవండి. ఆలోచించండి. మీరే ఒక నిర్ణయానికి రండి” అనేవారు. అందుకే ఆయన కుమారుడు గోపీచంద్ తన ‘అసమర్ధుని జీవయాత్ర’ నవలను “ఎందుకు? అని ప్రశ్నించడం నేర్పిన నాన్నగారికి ” అంకితం అన్నారు.
ఆంధ్రమహాసభ సభ్యులచే “కవిరాజు ” అనే బిరుదు పొందిన త్రిపురనేని 16-1-43న మరణించారు. ప్రారంభంలో స్వీయ కులాభిమానాన్ని ప్రదర్శించి కమ్మవారు క్షత్రియులే అనే వింతవాదాన్ని లేవనెత్తిన త్రిపురనేని రామస్వామిచౌదరిలో తరువాత భావ విప్లవం వచ్చి తన పేరుచివరి తోకని తీసేశారు. హిందూ మతోన్మాదం విజృంభిస్తున్న ఈనాడు పురాణాలు, హిందూ సంస్కృతి, ఛాందసభావాల పై తీవ్రంగా దాడిచేసి, బ్రాహ్మణత్వ ఆధిక్యతను నిరసించి గొప్ప హేతువాదిగా పేరొందిన త్రిపురనేని సాహిత్యాన్ని యువతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
( గొర్రెపాటి వేంకట సుబ్బయ్యగారి “కవిరాజ జీవితము -సాహిత్యము ” ఆధారంగా )
*****