దేవి చౌధురాణి
(మొదటి భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
తల్లీకూతుళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. ప్రయాణ బడలిక కారణమవ్వవచ్చు, మనేద కావచ్చు, ప్రఫుల్ల తల్లికి జ్వరం తగిలింది. ఏదన్నా ఎండిన రొట్టె ముక్క దొరికితే తింటున్నారు, లేకపోతే లేదు. కొన్ని రోజులకు తల్లికి జ్వరం ముదిరి విష జ్వరంగా మారి కాలాంతం చేసింది. ప్రఫుల్ల ఒంటరిదయ్యింది. ప్రఫుల్ల మీద లేనిపోని మాటలు చెప్పిన ఇరుగుపొరుగు వాళ్ళే దహన సంస్కారాలు చేసారు. తన తల్లి మీద చాడీలు చెప్పిన పెద్ద మనుష్యులే వచ్చి శ్రాద్ధ కర్మలు చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలన్నారు. “చెయ్యాలని వుంది, కానీ పైకం ఎక్కడ నుండి తేవటం?” అని అడిగింది.
ఇరుగూపొరుగూ ఖర్చు మేము పెట్టుకుంటాం అంటు శ్రాద్ధ ఖర్మకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇంతలోనే ప్రఫుల్ల తల్లిమీద పుకార్లు లేవదీసిన అయిదుగురు పెద్దమనుష్యులలో ఒకరు, మరి శ్రాద్ధ భోజనాలుకు ప్రఫుల్ల అత్తవారిని కూడా పిలవాలి కదా, ఎవరు పిలుస్తారు అన్నాడు. ఆ అయిదుగురిలోని ఇద్దరు మేము వెళ్ళి పిలుచు కొస్తాము అంటూ తయ్యారయ్యారు. “మీరే కదా పనికట్టుకుని మా అమ్మ మీద అభాండాలు వేసి మా మావగారికి చెప్పింది, శ్రాద్ధ కర్మకు రమ్మని ఏ మొఖం పెట్టుకుని వెళ్ళతారు” అని అడిగింది ప్రఫుల్ల.
“అవన్నీ ఇప్పుడు మర్చిపోవాలి. ఇప్పుడు నువ్వు అనాథవి, మేము అన్నీ సరి చేస్తాంలే. నీకూ మాకూ ఏ గొడవా లేదు” అంటూ ప్రఫుల్ల కాపురంలోనిప్పెట్టిన వాళ్ళలోనే ఇద్దరు బయలదేరి హరివల్లభ బాబుని పిలవటానికి వెళ్ళారు.
అక్కడ హరివల్లభ బాబు అంతకంటే ఘటికుడు, అనుమానపు పక్షి కూడానూ. వచ్చిన పెద్దమనుషులతో, “మీరే కదా వియ్యపురాలిని జాతినుండి వెలివేసారు, మళ్ళీ సమర్ధిస్తూ మీరే వచ్చారేమిటి?” అన్నాడు.
“మీరే అలా అంటే ఎలాగండీ? ఇరుగూపొరుగూ అన్న తరువాత ఏవో చిన్నచిన్న పితలాటకాలు వుంటాయి. అవన్నీ పట్టించుకుంటే ఎలా?” అన్నారు ఆ ఇద్దరూ.
హరివల్లభ బాబు అప్పటికే వ్యాపారం లావాదేవీలలో తలతిరిగినవాడు అవటం వలన వ్యవహారంలో లోపాయకారితనమేమిటా అని ముందు ఎంచే రకం, అనుమానపు పక్షి. ప్రఫుల్లనే ఏదో ఒక రకముగా కొంత డబ్బు కూడబెట్టి, వీళ్ళిద్దరికీ లంచం ఇచ్చి పంపించి వుంటుంది, ఏదో ఒకరంగా మళ్ళీ ఇక్కడకు చేరాలనుకుంటన్నది అని నిశ్చయ్యించుకున్నాడు. ఈ ఆలోచనలతో ఆయనకు ప్రఫుల్ల మీద వున్న కోపం హెచ్చింది. రాను పొమ్మన్నాడు. పిలవటానికి వచ్చిన ఇద్దరు పెద్దమనుష్యులు వెనుదిరి గారు.
అక్కడే నిలబడి వున్న వ్రజేశ్వర్ మౌనంగా ఈ సంభాషణ విని రహస్యంగానైనా ప్రఫుల్ల దగ్గరకు వెళ్ళి, రాత్రికి రాత్రే తిరిగి రావాలనుకున్నాడు.
అక్కడ ప్రఫుల్ల, ఇంటి చుట్టుపక్కలవాళ్ళ సహాయంతో శ్రాద్ధకర్మల విధుల ప్రకారంగా బ్రాహ్మణులకు భోజనాల ఏర్పాటుకి ప్రయత్నం మొదలు పెట్టింది.
***
తల్లి చనిపోయిన తరువాత ప్రఫుల్ల ఫూల్మణి అనే మంగలి విధవని తోడు పడుకోవ టానికి రమ్మనేది. ఫూల్మణి ప్రఫుల్ల కంటే పదేళ్ళు పెద్దది. ఇదివరకు ప్రఫుల్ల తల్లి ఫూల్మణికి ఎంతో కొంత ఉపకారం చేసింది. ఆ కృతజ్ఞతతో ఫూల్మణి ప్రఫుల్ల దగ్గరకి వచ్చి వుంటుందని అనుకున్నది.
అయితే ఫూల్మణి ప్రవర్తన గురించి ప్రఫుల్లకు పూర్తిగా తెలీదు. ఫూల్మణికి రూపురేఖ లేమీ తక్కువకాదు, అంగసౌష్టవం వున్నది. విధవ అయినా, చమికీలతో కట్టూబట్టా వేసేది. ఆ ఊరి జమీందారు ప్రాణ్ చౌధురి. ఆయన దగ్గర దుర్లబ్ చక్రవర్తి అనే సర్దార్ ఒకడు వుండేవాడు. వూళ్ళో వ్యవహారాలన్నీ అతనే చూస్తూ వుండేవాడు. అతనికీ ఫూల్మణికీ సంబంధం వుందని ఒక వదంతి. ఈ విషయం కొంత ప్రఫుల్ల చెవిన పడటమైతే జరిగింది కానీ తను ఏకాకి అయినప్పుడు ఆపాటి తోడు దొరకటమే భాగ్యం అనుకున్నది. “మంచో చెడో, ఫూల్మణి ఎలా వుంటే నాకెందుకు, నా ప్రవర్తన సరిగ్గా వున్నంత వరకూ నేనేమీ భయపడనవసరంలేదు” అని అనుకున్నది ప్రఫుల్ల.
శ్రాద్ధకర్మలు మొదలైన రెండవ రోజునుంచే ఫూల్మణి కొంత ఆలస్యంగా రావటం మొదలుపెట్టింది. ఫూల్మణి వచ్చే దారిలో ఒక మామిడితోట వుంది. ఎర్రంచు చీరతో, తాంబూలంతో ఎర్రపడిన పెదవులతో తళుకుబెళుకులాడుతూ వయ్యరాలుపోతూ ఆ మామిడితోట దారి వెంట నడుస్తున్నది. అక్కడ చెట్టు క్రింద నుంచున్న దుర్లబ్‌ని చూసి నేరుగా అతని దగ్గరకు వెళ్ళింది. దుర్లబ్ వేరుమాట లేకుండా సూటిగా “ఇవ్వాళ రాత్రి సంగతేమిటి” అన్నాడు.
“ఇవ్వాళ్లేలే, రాత్రి రెండింటికి పల్లకీ తీసుకుని రా. నెమ్మదిగా తలుపు తట్టు, నేను తలుపు తీస్తాను. వేరే ఏమీ గోల చెయ్యమాకు” అన్నది.
“నీకేం భయంలేదు. అది అరిచి కేకలు పెట్టకుండా వుంటుందా?”
“తలుపు నెమ్మదిగా తీస్తా. నిద్రపోతుంటుంది కదా మెలుకువరాదులే, గుడ్డ వేసి నోరు నొక్కేస్తా. ఇంకెక్కడ కేకలు పెడుతుంది?”
“ఈ రకంగా పట్టుకుపోతే నాతో ఎన్నాళ్లుంటుందేమిటీ? అన్నాడు దుర్లబ్.
“ఎందుకుండదూ? ఎవరూ లేనిదానికి, తింటానికి దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి, డబ్బు వస్తంది, సంసారపు సుఖం దొరుకుతుంది. ఇంకేం కావాలంట? తప్పకుండా వుంటుంది, ఆ భరోసా నాది. నాకిస్తానన్న నగలూ, రొక్కం మాత్రం నాకివ్వు” అని ప్రఫుల్ల ఇంటికి చేరింది ఫూల్మణి.
ప్రఫుల్లకు ఈ కుట్రా కుతంత్రం గురించి ఏమీ తెలవదు.తల్లికి జరగవలసిన కర్మల గురించి ఆలోచించుతూ, తల్లి ఆలోచనలతో కూడిన దుఃఖంతో ఏడుస్తూ ఏడుస్తూ చివరకి అలసిపోయి నిదురపోయింది.
***
రాత్రి రెండవ ఝాము తరువాత దుర్లబ్ వచ్చి నెమ్మదిగా తలుపు తట్టాడు. ఆ చప్పుడు కోసమే మేల్కుని వున్న ఫూల్మణి వెంటనే తలుపు తీసింది. ఒక్క ఉదుటలో దుర్లబ్ ప్రఫుల్ల దగ్గరకు చేరుకుని ప్రఫుల్ల నోటికి గుడ్డ కట్టి, బయట తనతో పాటు తెచ్చుకున్న పల్లకీలో పడవేశాడు. ఏమాత్రం చప్పుడు కాకుండా తీసుకు వెళ్లాలని బోయీలకు అప్పటీకే ముందు జాగ్రత్తగా హెచ్చరిక చేసాడు. ఆ పల్లకీని తీసుకుని ప్రాణ్ బాబు తోటలోని విడిదింటికి బయలుదేరారు. ఫూల్మణి కూడా వెంట నడించిది.
వీళ్ళు బయల్దేరిన అరగంటకు ఇంటిలో చెప్పకుండా, చీకటిలో దాక్కుని బయల్దేరిని వ్రజేశ్వర్ ప్రఫుల్ల ఇల్లు చేరుకున్నాడు. అతనికి ఆ ఇంటిలో ఎవరూ కనపడలేదు.
అక్కడ పల్లకీని వేగంగా అడుగులు వేస్తూ తీసుకుపోతున్నారు. సామాన్యంగా బోయీలు “కొహం కొహంకో” అంటూ, ఒకరికొరినీ సంబోధిస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తారు. దీనితో వాళ్ళకి పల్లకీ బరువు తగ్గుతుందేమో. కానీ, దుర్లబ్ చప్పుడు చెయ్యవద్దని చేసిన హెచ్చరికతో వాళ్లు ఏమీ మాట్లాడటంలేదు. చప్పుడు చెయ్యవద్దని చెప్పటానికి ముఖ్య కారణం బందిపోటుల భయం. 1774 కాలానికి ముస్లిం నవాబుల పతనమైతే జరిగింది కానీ ఇంగ్లీషువాళ్ల పాలన ఇంకా మొదలవ్వలేదు. దానికి తోడు కరువు వచ్చింది. ఎవరికి వారే; అరాచకం ప్రబలి బందిపోటులదే రాజ్యమయ్యింది. పల్లకీకి వేరే ఎవరూ కాపలాదారులు లేరు, కేవలం దుర్లబ్, ఫూల్మణి మాత్రమే వెంట నడుస్తున్నారు. అందుకే చప్పుడు చెయ్యకుండా జాగ్రత్త.
పల్లకీ ఒక అడవి దారి పట్టింది. సన్న దారి, చెట్టూపుట్టా అవటం వలన పల్లకీ నడక మందగించింది. పైగా అమావాస్య, నక్షత్రాల మిణుకు మిణుకులు తప్ప వేరే వెలుతురు లేదు. ఇంతలో బోయీలకు దారికి ఎదురుగా, కొంచెం దూరంలో దుడ్డుకర్రలు పట్టుకున్న ఇద్దరి మనుష్యుల ఛాయలు కనిపించాయి.
ఒక బోయీ “వీళ్ళు బందిపోటులేమో” అని సందేహంగా లోగుంతుకతో అన్నాడు.
“బలమైన మనుష్యులు లాగా వున్నారే” అన్నాడు ఇంకొకడు.
“భయంకరంగా వున్నారు, మన దగ్గరేమో కత్తీ కర్రా ఏమీ లేదు” అన్నాడు ఇంకొకడు.
“దుర్లబ్ చక్రవర్తిగారు ఏమంటారో? కాలు కదలటం లేదు. ఇవ్వాళ బందిపోటుల చేతిలో చావాలని వ్రాసిపెట్టి వుందేమో?” అన్నాడు మొదటివాడు.
“ఏ విషయం గురించి భయపడ్డానో, అడే జరుగుతున్నట్టుందే!” అన్నడు దుర్లబ్.
ఎదురుగా వున్న ఇద్దరిలో ఒకడు “ఎవర్రా మీరు” అని గట్టిగా అడిగాడు.
బోయీలు “అయ్యబాబో” అని అరిచి పల్లకీని వదిలేసి అడివిలోకి పరుగు తీసారు. దుర్లబ్ కూడా పారిపోయాడు. ఫూల్మణి “నన్ను వదిలేసి ఎక్కడికి పొతావ్” అంటూ అరుస్తూ దుర్లబ్ వెంట పడి పోయింది.
ఆ ఇద్దరు మనుష్యులూ ప్రక్క వూరి వాళ్లు. కాలి నడకన దినాజ్‌పూర్‌లోని ఇంగ్లీషు వాళ్ల కచ్చేరిలో ఏదన్నా పని దొరుకుతుందేమోనని వెళ్తున్నారు. తెల్లవారటానికి ముందే ఇంటి దగ్గరనుండి బయలుదేరారు. దారిలో ఈ పిరికివాళ్ళు తమని చూసి పారిపోవటం కొంత ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆ ఇద్దరి మనుష్యులకు వారి పిరికితనానికి నవ్వొచ్చింది. కానీ వాళ్లు బయలుదేరింది పని వెతుక్కోవటానికి, ఇక్కడ ఆగి దారి వ్యవహారాలు చక్కపెట్టటానికి కాదు. ఆ తొందరలో దినాజ్‌పూర్ దారి వెంట వడివడిగా నడుస్తూ పోయారు ఆ ఇద్దరు మనుష్యులూ.
ఇంతలో తెల్లవారసాగింది. పల్లకీలో ఉన్న ప్రఫుల్ల అప్పటికే చేతికి కట్టిన తాళ్ళముడి వదులుచేసుకుని వుంది. చేతులు విడిపించుకుని నోట్లో కుక్కిన గుడ్డలు కూడా తీసి నెమ్మదిగా పల్లకీ తలుపులు కొంచెంగా తీసి బయటకి చూసింది, ఎవరో ఇద్దరు మనుష్యులు నవ్వుతూ ఉన్నారు. ఇంతలోనే వేరే దారి వైపు వెళ్లారు. పల్లకీలోనే మౌనంగా కొన్ని క్షణాలు గడిపి, ఏదయితే అదే జరుగుతుందని ధైర్యం చేసి, పల్లకీ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. దుర్లబ్ వాళ్ళు వెతుకుంటూ మళ్ళీ వస్తారని అర్థమ య్యింది ప్రఫుల్లకు. ఆ దారిలోనే వెళ్ళితే ప్రమాదమని ఎంచి ఆ అడవిలోని పొదల వెనుక దాక్కుంటూ ఒక దారి కాని దారి, ఓ చిన్న కాలిబాట వెంట నడవసాగింది. కొంత దూరం వెళ్లేసరికి కొన్ని ఇటుక ముక్కలు కనబడ్డాయి. ముందు ముందు ఏదన్నా ఊరు వుంటుం దేమోనని ముందుకు సాగింది. కొంత దూరంలో ఒక పాడుబడ్డ మేడ కనబడింది. కొన్ని గోడలు శిధలమై, కూలి ఇటుకల గుట్టలయ్యయి. కొన్ని గదులు మాత్రం నిలబడి వున్నాయనిపించింది. ఓ ఇటుకుల గుట్ట ఎక్కి అటు ఇంకా ఏముందో అని పరిశీలించిం ది ప్రఫుల్ల. ఎక్కడో లోపలి గదిలో నుంచి సన్నని మూలుగు, భారమైన శ్వాస వినిపిం చింది. నెమ్మదిగా లోపలికి వెళ్ళి చూస్తే ఒక వృద్ధుడు వున్నాడు. పెదాలు ఎండిపోయి చూపు వాడిపోయి వుంది. ఆ వృద్ధుడు అంతిమ దశలో వున్నట్లు అర్థమయ్యింది ప్రఫుల్లకు.
“నువ్వు ఎవరివమ్మా? ఎవరన్నా దేవతవా? మృత్యు ఘడియలలో నన్ను ఉద్ధరించటానికి వచ్చావా” అని అడిగాడు ఆ వృద్ధుడు.
“నేను ఒక అనాథను, దారి తప్పి ఇటు వచ్చాను. మీరు కూడా ఒక అనాథలాగా ఇక్కడ పడి వున్నారు. ఇప్పుడు మీకు ఏమన్నా ఉపచర్యలు చెయ్యగలనా?” అని అడిగింది ప్రఫుల్ల.
“తప్పకుండా సహాయం కావాలి. ఆ కృష్ణ పరమాత్ముడే పంపించాడేమో. ఆ మురళీధరుడికి జయం, జయం. కొంచెం మంచి నీళ్లు తెచ్చి పెడతావా తల్లీ?” అని ఆడిగాడు.
ప్రఫుల్లకు ఆ ప్రక్కన వున్న మట్టి కుండా, తాగటానికి ఒక చిన్న చెంబు కనబడ్డాయి. కొన్ని మంచి నీళ్లు నోట్లో పోస్తే ఆ వృద్ధుడు కొంచెం తేరుకున్నాడు. ఈ అడివిలో ఒంటరిగా ఆయన ఎందుకు వుంటున్నాడు అని అడగబోయింది. కానీ ఆ వృద్ధుడు ఎక్కువ మాట్లాడే స్థితిలో లేడు. ఆయన ముక్కలు ముక్కలగా చెప్పిన మాటలతో కొంత అర్థం చేసుకోగలిగింది. ఆయన కృష్ణ పరామాత్మునికి జీవితం అంకితం చేసుకున్న వైష్ణవుడు, ఒక వైష్ణవితో కలసి ఈ అడవిలో వుంటున్నాడు. ఈ ఆఖరి ఘడియలలో ఆ వైష్ణవి ఆయనను వదిలివేసి వెళ్లిపోయింది. తన మరణం తరువాత వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఖననం చేసి సమాధి కట్టమని, దహనం చెయ్యవద్దని ఆ వృద్ధుడు కోరాడు.
ప్రఫుల్ల తప్పకుండా అలాగే చేస్తానని మాట ఇచ్చి సపర్యలు కొనసాగించింది. వృద్ధుడు చెప్పటం కొనసాగించాడు, “నాకు కొంత ధనం వుంది. వైష్ణవికి ఇద్దామను కున్నాను. అయితే నన్ను ఈ దశలో వదిలేసి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయింది. ఆ ధనం ఎవ్వరికీ ఇవ్వకుండా నేను మరణిస్తే, ఆ ధన బంధంతో యక్షుడిని అవుతాను కానీ, కృష్ణ పరమాత్ముడితో కైవల్యం లభించదు. అందుకని నీకు ఆ ధనం ఇస్తున్నాను. నా మరణం తరువాత నా శయ్య క్రింద చూడు. అక్కడ ఒక చెక్క పలక వుంది. అది తీస్తే క్రిందకి మెట్లు వుంటాయి. క్రిందకి వెళ్లితే ఒక నేల మాళిగ వుంటుంది. క్రిందకి వెళ్లేటప్పుడు ఒక జ్యోతిని సిద్దం చేసుకో. ఆ నేల మాళిగకు వాయువ్య దిశలో ధనం స్థాపితమయ్యి వుంది” అని అన్నాడు. ఈ మాటలు పలికేటప్పటికి ఆయనకు అమితమయిన ఆయాసం కలిగింది.
ప్రఫుల్లతో ఆయన మళ్ళీ “అక్కడ గోశాలలో ఒక ఆవు వుంది, నీకు పాలు పితకటం చేతయితే కొన్ని పాలు తీసుకువచ్చి నాకు ఇచ్చి, మిగిలనవి నువ్వు త్రాగు” అన్నాడు. ప్రఫుల్లకు పాలు తియ్యటం అలవాటే. ఆ వృద్ధుడు చెప్పినట్లే వెళ్ళి పాలు తీసుకువచ్చి ఆయనకు తాగించింది.
ఆ వృద్ధుడు మధ్యాహ్నం మూడవ ఝాముకి పరమాత్మతో ఐక్యం పొందాడు. ఆ శిధిలగృహనికి కొంత దూరంలో ఆ వృద్ధుడు సిద్ధం చేసుకుని వున్న సమాధి దగ్గరకి కళేబరాన్ని చేర్చింది. ఎముకలగూడు అవటం వలన అంత బరువు అనిపించలేదు. ఆ గొయ్యి దగ్గరే ఒక పలుగుపార వున్నవి. కళేబరాన్ని గోతిలోకి దించి మట్టి కప్పింది. తను కట్టుకున్న బట్టలు వుతికి ఆరబెట్టుకుని, స్నానం చేసి వచ్చింది.
వృద్ధుడు తనకు ఇచ్చిన ధనమే కాబట్టి తీసుకోవటంలో తప్పు లేదనుకున్నది ప్రఫుల్ల. సమాధి దగ్గరనుండి పలుగుపారా వృద్ధుడి శయ్య దగ్గరకి తెచ్చింది. ఆ శయ్యను ప్రక్కకి లాగితే క్రింద చెక్క పలక కనిపించింది. అది తొలగిస్తే క్రిందకి మెట్లు కనబడ్డాయి. చీకటిగా వున్నది.
ఆ అడవిలో దీపం వెలిగించే సామాగ్రి ఎలా అని ప్రఫుల్ల అలోచించుతూ వెతక సాగింది. ఒక అగ్గిపెట్టె, దీపం కనబడ్డాయి. పాఠకులూ, Sir Walter Raleigh పుగాకు అనే అద్భుతాన్ని తీసుకు వచ్చాడు కదా! అది వచ్చిన తరువాత పొగతాగని ముసలివాడు ఎక్కడా లేడు. అయినా, ఈ వృద్ధుడు మాత్రం ఒక సంగీతం లేకుండా, ఒక సంభాషణ లేకుందా, కనీసం ఒక పుస్తకం కూడా లేకుండా ఎలా గడపగలడూ? ఒక వేళ ఎవరన్నా పొగతాగకుండా అందులోని సుఖశాంతులని అనుభవించకుండా వుంటే, మరణించే ముందు ఒక్కసారన్నా ఆ పొగ తెచ్చే ప్రశాంతతను, నిశ్చలతనూ పొందగలరు. అందుకని అగ్గిపెట్టె సరంజామా అన్నీ అక్కడే వున్నాయి.
దీపం పట్టుకుని క్రిందకు చూస్తే ఆ నేలమాళిగ చీకటికి దీపం వెలుతురు చాలదని అర్థమయ్యింది. చుట్టూ అడవే కాబట్టి ఎండు పుల్లలకేమీ తక్కువలేదు. కొన్ని ఎండు పుల్లలూ, గోశాలలోనుండి కొన్ని గడ్డిపరకలూ తీసుకువచ్చి నేలమాళిగలోకి విసిరింది. పలుగుపార కూడా క్రిందికి విసిరి దీపం పట్టుకుని నేలమాళిగకున్న మెట్ల మీద నుండి క్రిందకి దిగింది ప్రఫుల్ల. ఎండు పుల్లలను పేర్చి, కొంత గడ్డి వేసి నిప్పు అంటించితే ఆ చీకటి గదిలో కొంత వెలుతురు కలిగింది. వృద్ధుడు చెప్పినట్లుగానే వాయువ్య మూల తవ్వటం మొదలు పెట్టింది. కొంత సేపటికి ఎదో ఖంగుమన్న శబ్దం కలిగింది. ప్రఫుల్లకు వళ్లు జలదరించింది. ఏవో లంకెబిందెలు కానీ పేటిక గానీ తగిలనట్టు అనిపించిది.
పాఠకుడా అసలు ఈ నిధి ఇక్కడుకు ఎలా చేరిందో వివరస్తాను. ఆ వృద్ధుడి పేరు కృష్ణ గోవింద దాస్, కాయస్థ కులస్తుడు. సంపన్నుడే, జీవితం సుఖంగానే గడిపేవాడు. వయసు పెరిగిన తరువాత ముసలి కోరికలు ఎక్కువయ్యి ఒక అందమైన వైష్ణవి వలలో పడ్డాడు. పాపం ముసలివాడు ఆ వైష్ణవితో ప్రేమలో పడి, ఆ వైష్ణవితో లేచిపోయి, శ్రీగంధంతో నొసట నామాలు పెట్టుకుని, చేత్తో చిడతలు పట్టుకుని, రాధాకృష్ణుల ప్రేమతో కూడిన జయదేవుని అష్టపదులు పాడుకుంటూ బృందావనం చేరాడు. అక్కడ కొందరు అందమైన వైష్ణవులు కనపడ్డారు, వాళ్ళు తన వైష్ణవితో కలుపుగోలుగా వుండటం గమనించాడు. ముసలివాడికి అసూయ ఎక్కువ కదా, మళ్ళీ అక్కడి నుండీ బయలుదేరి ఉత్తర బెంగాలులోని ముర్షీదాబద్ చేరుకున్నాడు. అక్కడ ముస్లిం నవాబు కొలువులో చేరాడు. వైష్ణవి అందం గురించి ఆ నోటా ఈ నోటా పాకి, నవాబు వైష్ణవిని తన బేగం చేసుకుని జనానాలో పెట్టుకుంటానని ఒక కొజ్జావాడి ద్వారా చాటుగా రాయబారాలు పంపటం మొదలుపెట్టాడు. కృష్ణ దాసుకి ఈ విషయం తెలిసింది. మనుష్యల మధ్యలో వుంటే వైష్ణవి ఎప్పుడో ఒకప్పుడు తనని వదిలివేస్తుందని అర్థమయ్యింది. మనుష్యులు లేని చోటుకి వైష్ణవిని తీసుకుపోదామనుకున్నాడు. ఇంతలో అంతకు ముందెప్పుడో అడవిలో చూసిన పాడుపడ్డ భవంతి గుర్తుకువచ్చింది. వైష్ణవిని తీసుకుని అక్కడకు చేరుకుని, అక్కడే జీవితం గడపసాగాడు. వైష్ణవిని ఆ పరిసరాలు దాటనిచ్చే వాడు కాదు. ఏదన్నా అవసరమయితే తనే కొంత దూరంలో వున్న పల్లెటూరి సంతకు వెళ్ళి తీసుకు వచ్చేవాడు.
ఇలా కాలం గడుపుతున్నప్పుడు ఆ పాడుబడ్డ భవంతిలోని గదులు గమనించ సాగాడు. ఒకరోజు ఒక మూల గదిని వంటిల్లు చేద్దామని, కట్టెల పొయ్యికి కుదురు చెయ్యటానికి తవ్వబోతే, తవ్వుతున్న మట్టిలో ఒక బంగారు మొహరీ కనబడింది. ఆశ్చర్యంతో ఉత్సాహం ఎక్కువయ్యి, ఇంకా తవ్వితే బంగారు మొహిరీలతో నిండిన ఒక భరిణ కనపడింది. హమ్మయ్యా, ఇంక జీవితం గడపటానికి సరిపడా డబ్బు దొరికిందను కున్నాడు కృష్ణదాస్. కానీ ఆశ ఎక్కువయ్యింది. భవంతి అంతా వెతకసాగాడు. అయితే కృష్ణదాసు ఈ విషయాలేమీ వైష్ణవికి మాత్రం చెప్పలేదు. నేల మాళిగ కనిపించింది. అప్పుడప్పుడూ కాగాడాతో ఆ నేలమాళిగలోకి దిగి పరిశీలించేవాడు. ఇంకొన్ని చిన్న గదులూ సొరంగాలు కనిపించాయి. అవి కూడా వెతికాడు. ఇలా ఒక సంవత్సరం గడిచింది. ఇంకా ఏమీ దొరకదు అని అనుకుంటుండగా, ఒక గది మూలలో ఎలుకలు కలుగులు తవ్వుకుంటూ మట్టిని పైకి చేర్చుతున్నాయి. ఆ మట్టిలో, కాగడా వెలుతురులో ఒక చమక్కు మెరిసింది. కృష్ణదాసుకు అది ఒక బంగారు మొహిరీ అని అర్ధమయ్యింది. ఆ ఎలుకల కలుగుని తనే తవ్వితే ఇంకొన్ని బంగారు మొహరీలు కనబడ్డాయి. కృష్ణదాసు వైష్ణవికి అనుమానం రాకుండా కొన్ని రోజులు ఏమీ మెదలకుండా వున్నాడు. ఒక రోజు తనకు వంట్లో ఏమీ బాగుండలేదని సాకు చెప్పి నిత్యావసరాల కోసం వైష్ణవిని పక్క వూరు సంతకు పంపాడు. వైష్ణవి, తనని ఎప్పుడూ బయటకి పంపని ముసలివాడు సంతకు పంపుతున్నాడని ఉత్సాహంగా వెళ్ళింది. కృష్ణదాసు నేల మాళిగలోకి దిగి ఆ ఎలుకలు కలుగు ఇంకా లోతుకు తవ్వితే ఒకటి కాదు, రెండు కాదు, ఇరవై జాడీల నిండా బంగారు మొహిరీలు దొరికాయి.
పాఠకుడా, ఆ నిధి అసలు అక్కడకు ఎలా చేరిందో కూడా చెపుతాను. కొంతకాలం క్రితం ఉత్తర వంగ దేశం రాజా నీలాంబర్ పాలనలో వుండేది. ఈ భవంతి ఆయన అడవి లోకి పర్యటనకు వచ్చినప్పడు విడిది ఇల్లు. అప్పుడప్పుడూ వచ్చి ఇక్కడ కొన్ని వారాలు గడుపుతూ వుండేవాడు. ఇంతలో పాదుషాకు గౌర్ రాజ్యాన్ని, ఉత్తర బెంగాలుని కూడా కలుపుకోవాలని బుద్ది పుట్టింది. ఆ పఠాన్ రాక్షత్వం ముందు తను నిలవలేనని నీలాంబరుడికి తెలుసు. అందుకని తన ఐశ్వర్యాన్ని అక్కడక్కడా ముందు జాగ్రత్తగా దాచిపెట్టి, ఒకవేళ యుద్ధంలో గెలిస్తే మళ్ళీ తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. ఈ భవంతిలో కూడా అలా దాచిపెట్టాడు. యుద్ధం జరిగింది. ఊహించినట్టే రాజా నీలాంబర్ ఓడిపోయాడు. గౌర్ పాదుషా నీలాంబరుడుని బందీగా పట్టుకుపోయాడు. ఆ తరువాత నీలాంబర్ సంగతి ఏమయ్యిందో తెలియదుగానీ, ఈ నిధి మాత్రం ఇక్కడ మిగిలి పోయింది. ఆ నిధి కృష్ణదాసుకి దొరికింది.
*****
(సశేషం)
విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.