పౌరాణిక గాథలు -22

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

నమ్మకము – శబరి కథ

          ఆమె చాలా సామాన్యమైన స్త్రీ. కాని, ఆమె నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకంతోనే ఆమె జీవితంలో అసాధ్యమైనదాన్ని సాధ్యామయినదాన్నిగా చేసుకోగలిగింది. ఆమె ఎవరో కాదు శబరి. ఆమె కథ భారతీయులందరికీ తెలుసు. శబరి అనగానే ఆశ్రమం తలుపు దగ్గర ఎవరి కోసమో ఆతృతతో ఎదురు చూస్తూ నిలబడిన ఒక వృద్ధురాలి చిత్రం మన మనస్సులో మెదులుతుంది.

          అప్పుడు శబరి చాలా చిన్నపిల్ల. ఆమెకి చదవడంకాని, రాయడంకాని రాదు. అంకితభావంతో సేవ చెయ్యడం మాత్రమే ఆమెకి తెలుసు. బాల్యం నుంచి ఆమె జీవితం అడవిలో చెట్లు, పక్షులు, జంతువులతో గడిచి పోయింది.

          గుహల్లోను, ఆశ్రమాల్లోను తపస్సు చేసుకుంటూ ఉండే మహర్షులకి సేవ చేస్తూ ఎక్కువ కాలం గడిపేసింది. వాళ్ళకి అవసరమయిన అగ్నిహోత్రం, పూలు, పండ్లు, నీళ్ళు అన్నీ అమర్చి పెట్టేది.

          కొంచెం పెరిగి పెద్దదయ్యాక అటు వైపు వచ్చే సాధువులకి సేవ చేసేది. ఆమెకి కోరికలు, ఆశలు, ఇష్టాలు ఏవీ ఉండేవి కావు. ఆమె అడవిలో స్వేచ్ఛగా ఒక పక్షిలా సంతృప్తిగా తన జీవితాన్ని గడిపేసింది. మునులు కూడా శబరి అంకితభావంతో చేసే సేవకి సంతోషించేవాళ్ళు. ఒక మహర్షి శబరిని “”అమ్మా! శబరీ! నీది చాలా మంచి మనస్సు. నీలో ఉన్న అంకితభావం చాలా గొప్పది. ఏదో ఒక రోజు శ్రీరామచంద్రుడు వచ్చి నిన్ను అశీర్వదిస్తాడు!”” అన్నాడు. మహర్షి చెప్పిన మాటల్ని విని ఆయన చెప్పినట్టు జరుగుతుందని నమ్మింది.

          శబరిది చిన్నపిల్లల మనస్సులా కల్మషం లేని నిర్మలమైన మనస్సు. ఆమె మనస్సులో ప్రశ్నలు కాని, సందేహాలు కాని ఏవీ ఉండేవి కావు. చిన్న పిల్లల మనస్సులో ఉన్నట్టు పెద్దల మాట మీద నమ్మకం మాత్రమే ఉండేది. రాముడు వస్తాడని మహర్షి చెప్పాడు… కనుక, రాముడు తప్పకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఆమెకి తెలియక పోయినా మహర్షి చెప్పిన విషయం తప్పకుండ జరుగుతుంది అనే నమ్మకం ఆమెకి బలంగా ఉంది.

          రాముడి ఆశీస్సులు తీసుకునే రోజు, ఆయన్ని సేవించుకునే రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. అకస్మాత్తుగా రాముడు వస్తే అతడికి ఇవ్వడానికి ఏమీ లేవు కదా… అనుకుని అప్పటి నుంచి ప్రతి రోజూ రాముడు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసుకోడం మొదలు పెట్టేసింది.

          తన ఆశ్రమాన్ని శుభ్రం చేసుకునేది. ఏ రోజుకారోజు చల్లటి మంచి నీళ్ళు తెచ్చి పెట్టుకునేది. తన దగ్గర ఉన్న మొత్తం సామాను తను ఉపయోగించినా ఉపయోగించక పోయినా ప్రతి రోజు తోముకుని పెట్టుకునేది. రాముడు వస్తే ఆయన్ని ఎక్కడ కూర్చో బెట్టాలి? బండ రాయి మీద, నేలమీద నా రాముడు కూర్చోలేడు. మెత్తగా ఉండేలా ఆసనం ఏదయినా అమర్చాలి అనుకుంది. లేత పచ్చగడ్డిని కోసుకుని వచ్చి కూర్చునేం దుకు వీలుగా కుట్టి ఉంచింది. రాముడు ఏం తింటాడో? అని ఆలోచించేది. అడవిలో ఏ కాలంలో ఏ పండ్లు దొరుకుతాయో వాటిలో తాజాగాను, రుచిగాను ఉన్న వాటిని సేకరిం చేది. వాటిని అప్పటికప్పుడే ఆశ్రమానికి తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి ఒక ఆకులో పెట్టి తినడానికి వీలుగా ఉండేలా అమర్చి పెట్టేది.

          తపస్వినిగాను, భగవంతుని యందు అంకితభావం కలిగి ఉండేటట్టుగాను శబరి తనకి తానుగానే మలుచుకుంది. రాను రాను పండ్లు, పూలు, గడ్డి, ఆకులు సేకరిస్తూ ఆమె అడవంతా తిరుగుతూ పాడే పాటలు అడవంతా వినిపిస్తూ ఉండేవి.

          అక్కడ ప్రవహించే పంపా నది ఆమె పాటల్ని నలువైపులా ప్రతిధ్వనించేలా చేసేది. పండ్లు ఏరుకొస్తూ శబరి అనుకునేది “ఒకవేళ నేను పెట్టిన పండ్లు పుల్లగా ఉంటే? అమ్మో! నా ఆశ్రమంలో అటువంటి పండ్లు తిని రాముడు బాధపడ కూడదు” అని. ప్రతి పండు రుచి చూసి తియ్యగా ఉన్న పండ్లని ఉంచి, బాగుండని వాటిని అక్కడే పారేసి వచ్చేది. అలా ఏ రోజుకి ఆ రోజు శబరి తాజాగా ఉండే పండ్లని ఏరుకొచ్చి ఉంచేది. ఆమె నిర్మలమైన మనస్సులో రాముడు రాడేమో అనే సందేహం ఎప్పుడూ కలిగేది కాదు. ఆమెకి ఎప్పుడూ ఒకటే ఆలోచన… “రాముడు అకస్మాత్తుగా వస్తే అతణ్ని ఎలా సంతోష పెట్టాలి!” అని.

          ఆమెకి రాముడు వస్తే ఎలా సేవించాలో ఆలోచించి ఆయన కోసం ఏర్పాట్లు చేసుకో వడంతోనే రోజు మొదలయ్యేది. ఏ నిముషంలో రాముడు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉండేది. తలుపు దగ్గరే ఎదురుచూస్తూ ఉండేది. ఎవరేనా అటువైపు నడుస్తూ వెడుతున్నప్పుడు వినబడిన ఎండు అకుల శబ్దానికి ఉలిక్కిపడి రాముడు వస్తున్నాడనుకుని పరుగున వెళ్ళి చూసేది. రాముడు కాదని తెలిసి నిరుత్సాహ పడేది.
శబరి జీవితమంతా రాముడి ఆలోచనలతోనే గడిపింది. ఆమె జీవితం రాముడే, అమె ధ్యానం రాముడే, ఆమె ఊపిరి రాముడే, ఆమె తినేది కూడా రాముడి కోసమే!

          రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు శబరి చిన్నపిల్ల కాదు. పండుటాకులా పండి పోయిన ముదుసలి. అయినా ఒక్క రోజు కూడా రాముణ్ని సేవించడం కోసం ఏర్పాట్లు చెయ్యడం మానలేదు. తనకు మహర్షి చెప్పిన మాటలు నిజం కావని ఒక్కసారి కూడా శబరి అనుకోలేదు. నమ్మకంతో భగవంతుడి సేవ కోసం ఎదురు చూసే తపన కొండల్ని కూడా కదిలించ కలదు. శబరి రాముడి రాక కోసం ఏళ్ళతరబడి ఎదురు చూస్తూనే ఉంది. చివరికి ఆమె నమ్మకం గెలిచింది. తను ఏ రోజు కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తోందో ఆ రోజు రానే వచ్చింది.

          రాముడు తమ్ముడు లక్షణుడితో కలిసి తన ఆశ్రమం వైపు నడిచి వస్తున్నాడు. శబరి తన ఆశ్రమం గుమ్మం దగ్గర నిలబడి చూస్తోంది. ఇద్దరు సూర్యులు దారి వెంట నడుస్తూ తన ఆశ్రమం వైపు వస్తున్నట్టు శబరికి అనిపించింది. ఆ ప్రదేశమంతా రామలక్ష్మణుల కీర్తి ప్రకాశంతోను, శరీర కాంతితోను వెలిగి పోతోంది. ఆమె ఆశ్చర్యపోయింది. అంత వరకు ఆమెకి ముసలితనం వల్ల కనిపించని వస్తువులన్నీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కొంచెం సేపు అంతా తికమకగా అనిపించింది. తరువాత తన ఎదురు చూపులు ఫలించాయి అనుకుంది. తన మనస్సు చెప్తోంది… వస్తున్నది నిజంగా రాముడే! తన రాముడే! అని.

          లక్ష్మణుడితో కలిసి తన ఆశ్రమం వైపే వస్తున్న రామ లక్ష్మణుల్ని చూస్తోంది. ఆ సమయంలో శబరి పొందిన ఆనందాన్ని చెప్పడానికి భాషలో ఉన్న అక్షరాలు చాలవు.
గొప్ప ప్రకాశంతో వెలిగిపోతూ తన ఆశ్రమానికి వచ్చారు. స్వయంగా శబరి తయారు చేసిన ఆసనం మీద కూర్చున్నారు. వాళ్ళు రావడం… తన ఆశ్రమంలో తను తయారు చేసిన ఆసనం మీద కూర్చోవడం… సంభ్రమంతో చూస్తూ అనందాన్ని తట్టుకోలేక పోతోంది శబరి.

          ఆమె ఆశ్రమంలో కూర్చున్న రామలక్ష్మణుల తేజస్సు అడవంతా వ్యాపించింది. వాళ్ళిద్దరి రాకతో అడవి ధన్యత పొందింది. అందుకు కారణమైన శబరిని అడవి మొత్తం కృతజ్ఞతతో చూస్తోంది. రాముడు తన భక్తురాలిమీద ఆత్మీయతని కురిపిస్తున్నాడు.
ఆమె ఇచ్చిన ఆతిథ్యంతో రాముడూ తృప్తి పడట్లేదు… తను సేకరించి తీసుకు వచ్చిన పండ్లు పెట్టిన శబరి కూడా తృప్తిపడట్లేదు. శబరి తినిపిస్తూనే ఉంది. రామలక్ష్మణులు తింటూనే ఉన్నారు. తెచ్చిన పండ్లని మొదట తను కొరికి రుచి చూసి, రుచిగా ఉన్నాయి అనుకున్న వాటినే రామలక్ష్మణులకి తినడానికి ఇస్తోంది. ఆమె పెట్టిన వాటిని రామ లక్ష్మణులు ఇద్దరూ సంతోషంగా తిన్నారు. అడవంతా తిరిగి తను ఏరుకొచ్చిన సువాసనలు వెదజల్లే పువ్వులతో రాముడి పాదలు పూజించింది. తను స్వయంగా కట్టిన పూలమాలల్ని రాముడి మెడలో అలంకరించింది. ఎన్ని విధాలుగా రాముణ్ని సేవించుకున్నా శబరికి ఇంకా తృప్తి కలగలేదు. శబరి భక్తికి, అంకిత భావంతో చేసిన సేవకి మెచ్చిన రాముడు ఆమెకి మోక్షాన్ని ప్రసాదించాడు.

          “అందరూ మెచ్చే విధంగా స్వచ్ఛమైన మనస్సు, బలమైన నమ్మకం, భగవంతుడి యందు భక్తి కలిగి ఉంటే వాళ్ళ కోరికల్ని భగవంతుడు అడగకుండానే తీరుస్తాడు” అనడానికి శబరి చరిత్రే మనకు ఉదాహరణ.

          శబరి తనకు మహర్షి చెప్పిన మాట మీద ఉన్న నమ్మకం ఉంచింది. తనకు తానుగా అంకితభావాన్ని, నమ్మకాన్ని, సేవాభావాన్ని పెంచుకుంది… భగవంతుడైన రాముడి ఆశీస్సుల్ని పొందింది. రాముడి పేరు వినిపించినంత కాలం శబరి పేరు కూడా ఈ భూమి మీద వినబడుతూనే ఉంటుంది.

నమ్మకం ఉంటే అనుకున్నది జరుగుతుంది!
         

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.