యాదోంకి బారాత్-22

-వారాల ఆనంద్

          బతుకంటేనే పరుగు. పరుగంటేనే డైనమిజం. అమ్మ వొడిలో కన్ను తెరిచింది మొదలు చివర కన్ను మూసేంతదాకా పరుగే పరుగు.‘పరుగు ఆపడం ఓ కళ’ అన్నారెవరో. నిజమే పరుగు ఒక నాన్-స్టాటిక్ డై మెన్షన్. ఆ స్థితిలో వున్నవాడు పరుగు ఆపడమంటే స్టాటిక్ డైమెన్షన్ లోకి రావడమన్నమాట. అట్లా రావడం అంత సులభం కాదు. స్వచ్ఛందంగా రావడం మరీ కష్టం. ఎందుకంటే పరుగులో ఒక మజా వుంది. ఒక వూపు వుంది. నిలువనీయనితనం వుంది. అందుకే పరుగు ఛైతన్యవంతుడయిన మనిషి మనుగడలో ప్రధాన అంశం. కానీ నేనయితే నా ప్రమేయం లేకుండానే పరుగులోంచి నిలకడలోకి రావాల్సే వచ్చింది. అప్పటిదాకా అర్థవంతమయిన సినిమాలు, కాంపస్ ఫిల్మ్ క్లబ్బులు, సెమినార్లు, ఫిలిమ్ ఫెస్టివల్స్, సాహిత్యం అంటూ పరుగులు పెడుతున్న నా పరుగును శారీరక అనారోగ్యం రెడ్ లైట్ చూపించి స్టాప్ అని నిలిపేసింది. బయట తిరగడాలు, ఆహారం తదితర విషయాల్లో అనేక నిబంధనలతో బతుకు కొత్తగా మొదల యింది.

          హైదరబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ విజయవంతమయింది. తర్వాత వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు అక్కడే వున్నాను. నెల రోజుల పాటు వాళ్ళని క్రమం తప్పకుండా దర్శించుకున్నాను. ఇక సర్లే వెళ్ళండి అని వాళ్ళు పొమ్మన్నాక కరీంనగర్ బయలుదేరాను. పిల్లలిద్దరూ రేలా అన్వేష్ లు హాస్టళ్ళలో చేరిపోయారు. నేనూ ఇందిరా ఇల్లు చేరుకున్నాం. మూడు నాలుగు నెలలు విడిచి వెళ్తే ఎట్లా వుంటుందో మా ఇల్లు సరిగ్గా అట్లే వుంది. నన్నేమో దుమ్ముకు దూళికి దూరంగా వుండమన్నారు. పొల్యూషన్ ఫ్రీ అన్నమాట. అందుకే నేను వెళ్ళి పక్క పోర్షన్లో కూర్చున్నాను. రేల, శ్రీలత, అటెండర్ నాగరాజుల సాయంతో ఇందిర ఇంటి పనిలో పడింది. మా పక్క పోర్షన్ లోకి దాదాపు 8 ఏళ్ళ తర్వాత వెళ్ళాను. చందన, సంజీవరెడ్డిలు మా ఇంట్లో చేరింతర్వాత మా వాళ్ళయిపోయారు. చందనయితే కూతురులాగే వుంటుంది. వాళ్ళ రెండో అబ్బాయి కుశ్లు మాయింట్లోనే పుట్టాడు. వాళ్ళతో మా అనుబంధం చాలా మంచి అనుబంధం. ఇల్లు శుభ్రం అవగానే నేనూ ఇందిర హమ్మయ్య మనింట్లోకి వచ్చాం. క్షేమంగా ఆరోగ్యంగా అనుకున్నాం.

          నేను కొంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ ఉత్సాహంగానే వున్నాను. నాకు నా కష్టాల గురించీ అనారోగ్యం గురించీ అందరితో అతిగా చెప్పాలనిపించదు. ఎట్లా వున్నావు అంటే ‘ఫైన్’ అంటాను. అంతేకాదు స్టేబుల్ అని కూడా అంటాను. ఎందుకో మరి కొందరయితే కనిపించగానే, ఎవరయినా పలకరించగానే చాలా కష్టంగా వుంది. అనారోగ్యం చాలా కష్ట పెడుతూ వుంది అంటూ అనేకం చెబుతారు. ఆరోగ్యమే కాదు మరెన్నో సమస్యల్ని ఏకరువు పెడతారు. అది వాళ్ళ అభీష్టమే కాదనలేను. కానీ నేనెందుకో అట్లా చెప్పడానికి సిద్దంగా వుండను. కష్టం వున్నది మనకొక్కరికే కాదు. సమాజంలో చాలామందికి చాలా రకాల కష్టాలున్నాయి అనేక ఇబ్బందులున్నాయి. ఆర్థికమూ, సామాజికమూ కూడా. వాటన్నింటితో పోలిస్తే మన అనారోగ్య సమస్య పెద్దదేమీ కాదు. మనదొక్కటే పెద్ద సమస్య అన్నట్టు దీనంగా వుండడం సరయింది కాదన్నది నా ఫీలింగ్. అది నాకు చేతకాదు. నా ఆరోగ్యం విషయం ఎవరు తీసినా మెడికల్ టెక్నాలజీ చాలా పెరిగింది. నా సహచరి నా పక్కన నిలబడింది. అంతా బాగుంది. సబ్ కుచ్ చల్ రహా హై…ఆచ్ఛాహీ చల్ రహా హై. చలాయెంగే జాబ్ తక్ హై జాన్’ అంటాను.

          కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళాను. అప్పుడు ప్రిన్సిపాల్ గా మిత్రుడు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి వున్నారు. నన్ను చూడగానే భయ్యా వచ్చారా? అంటూ ఎదురొ చ్చాడు. స్నేహపూర్వమయిన హగ్. జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి అవుతుండగానే కాలేజీ మిత్రులంతా హాయ్ హాయ్ అంటూ సంతోషంగా కలిశారు. నేను చదివిన కాలేజీ, అప్పటికే 14 ఏళ్ళుగా పనిచేస్తున్న కాలేజీ. మళ్ళీ ఉత్సాహం ఉరకలు వేసింది. ఇంతలో ప్రిన్సిపాల్ పద పద రూమ్ నంబర్ 63లో పిల్లలతో ఓ మీటింగ్ వుంది అన్నాడు. అరె ఇప్పుడే వచ్చిన కదా అన్నాను. అయితే ఏముంది. ఆవన్నీ తర్వాత పిల్లలతో నువ్వు మాట్లాడాలి పదా అని లాక్కెల్లాడు. ఇంకేముంది ఫాలో అయిపోయాను. పిల్లల్ని చూడగానే పాత ఉత్సాహం పెళ్ళుబికింది. మళ్ళీ ప్రధాన స్రవంతిలోకి వచ్చేశాను. ఇమ్మ్యునో సప్రెస్సర్స్ వాడతాను కనుక మాస్క్ లాంటి ఆయుధాలు తప్పనిసరి. గుంపుల్లోకి వెళ్ళకూడదు. పనేమో కాలేజీలో కనుక కొంత తప్పలేదు. ఇల్లు కాలేజీ అంతే.

          ఒక ఆలోచన తీవ్రంగా తొలవడం మొదలయింది. కాలం ఎప్పుడు ఎట్లా ఏ మలుపు తీసుకుంటుందో ఏమో. ఇన్నాళ్ళుగా రాస్తూ వచ్చిన వాటికి పుస్తక రూపం ఇస్తే బాగుంటుం దనుకున్నాను. ఇందిరేమో మీ ఇష్టం అంది. అలసట అవుతుందేమో చూసుకోండి అంది. ఆసుపత్రి, ఆపరేషన్ అవన్నీ నాపై తీవ్రమయిన వొత్తిడి వుండగానే హైదరబాద్ లో నన్ను నేను ఆవిష్కరించుకుంటూ రాసిన కవిత్వం వుంది. దానికంటే ముందు మరో రెండు పుస్తకాలు వేద్దామనుకున్నాను. ఒకటి ’మానేరు గల గల’. ఆంధ్రజ్యోతి దిన పత్రిక కరీంనగర్ ఎడిషన్ లో మిత్రుడు బ్యూరో చీఫ్ శ్రీ నగునూరు శేఖర్ కోరిక మేరకు నేను వారం వారం ‘విద్యుల్లత’ జిల్లా సాహిత్య పేజీనిర్వహించాను. అందులో జిల్లాకు చెందిన సాహితీవేత్తల పై నేను రాసిన వ్యాసాలు అన్నింటినీ కలిపి ‘మానేరు గల గల‘ పుస్తకం తేవాలని, దానితోపాటు అప్పటిదాకా నమస్తే తెలంగాణతో సహా ఇతర పత్రికల్లో రాసినా సినిమా వ్యాసాలతో ‘బంగారు తెలంగాణలో చలన చిత్రం’ వ్యాస సంకలనం వేయాలని అనుకున్నాను. రెండు పుస్తకాల డీటీపీ పనులు ఎప్పటిలాగే తమ్ముడు అమర్ కి అప్పగించాను. పనులు చక చకా జరిగాయి. పుస్తకాల కవర్ పేజీలు ఎట్లా అన్న సమస్య వచ్చింది. మిత్రుడు అన్నవరం శ్రీనివాస్ ని సంప్రదించాను. వీలుచేసుకుని ఇంటికి రండి సార్. మీ కిష్టం వచ్చిన పెయింటింగ్ ఎంచుకోండి అన్నారాయన. ఆయన వుంటున్న ఫ్లాట్ లోనే వుంటున్న మా కొలీగ్ ఎలిజబెత్ రాణిని కూడా కలిసినట్టు అవుతుంది పద అన్నాను ఇందిరతో. చలో అంది. వెళ్ళి ఒక పెయింటింగ్ ఎంపిక చేసుకున్నాను. కాస్ట్ అడిగితే అదేంది సార్ అట్లా అంటారు మీరు పరాయి వాళ్ళా అన్నాడాయన. శ్రీనివాస్ గారి శ్రీమతి కవిత కూడా అంతే ఆప్యాయంగా టీ తాగేదాకా వదల్లేదు. ఎలిజబెత్ కూడా అంతే మేమంటే ఎంతో అభిమానం చూపించింది. ఇక సినిమా వ్యాసాల పుస్తకానికి అన్వేష్ వేసిన పెయింటింగ్ ని తీసుకున్నాను.‘మానేరు గల గల’ లో పీవీ, చొప్పకట్ల చంద్రమౌళి, పురాణం రామచంద్ర, ఎం.ఎస్.ఆర్. లతో కలిపి 49 వ్యాసాల్ని ప్రచురించాను. తెలంగాణ రచయితల సంఘం ప్రచురణగా వెలువరించాను. అప్పటి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముందుమాట రాస్తూ ‘ఇయాలిటీ సందర్భం అస్తిత్వ ప్రకటన. అంతే బలంగా చరిత్ర నిర్మాణం.జరగాల్సిన సమయం. ఆ దిశలో అవటానికి మానేరు గల గల కరీంనగర్ ప్రాంత కవి పరిచయాలే కావచ్చు కానీ సరయిన మార్గం సరయిన ప్రయత్నం’ అన్నాడు. మనకూ ఒక సాంస్కృతిక విధానం కావాలి అంటూ తెలంగాణా సినిమా ఉనికి దాని అభివృద్ధికి చేయాల్సిన అంశాల పైన ప్రధానం గా నమస్తే తెలంగాణలో రాసినవ్యాసాల సంకలనం బంగారు ‘తెలంగాణాలో చలన చిత్రం’. ఈ రెండు పుస్తకాల్నీ నా పుట్టిన రోజు 21 ఆగస్ట్ 2014 న తెచ్చాను. మానేరు గల గల ను నా వైద్యుడు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గందే శ్రీధర్ కి అంకితమిచ్చాను. ఆయన చాలా సంతోష పడ్డారు. బంగారు తెలంగాణ .. పుస్తకాన్ని ఆత్మీయులు మంగారి రాజేందర్ జింబో, వఝల శివకుమార్, సాంబశివుడు, నందిగం కృష్ణా రావులకు అంకితం చేశాను. మిత్రులు సభ పెట్టాలన్నారు. ఫిల్మ్ భవన్ లో ఏర్పాటు చేశాం. ఆత్మీయులందరినీ పిలిచాను. జింబో నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, దర్భశయనం శ్రీనివాసాచార్య, వఝల శివ కుమార్, బీ.వీ.ఎన్ స్వామి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, దాస్యం సేనాధిపతి తదితరులు అతిథులుగా పాల్గొనగా, కె.ఎస్.అనంతాచార్య సభకు అధ్యక్షత వహించారు. మానేరు గలగలను సిధారెడ్డి, బంగారు తెలంగాణను జింబో ఆవిష్కరించారు. సభ బాగా జరిగింది. నేను అప్పుడప్పుడే స్పీడ్ బ్రేకర్ దాటి వచ్చాను కదా. అనేక మంది మిత్రులు ఆత్మీయులు వచ్చారు. సభలో నమిలకొండ హరిప్రసాద్, నరెడ్ల శ్రీనివాస్, లక్ష్మీకాంతం, పీ.ఎస్.రవీంద్ర, మంగారి శివ ప్రసాద్, ఎం.సరస్వతి-పాపన్న, హిమజ, శారదా శివ కుమార్, నవీన వదిన మహేశన్న, ఇట్లా అనేక మంది ఆప్యాయంగా వచ్చి అభినందిం చారు. దర్భశయనం, స్వామిలు పుస్తకాల మీద సాధికారక ప్రసంగం చేశారు. ఇక మధు అయితే నా వృత్తి, కాలేజీ, లైబ్రరీల గురించి విశేషంగా మాట్లాడారు. సిధారెడ్డి, దేశపతి, వఝల, జింబోలు చాలా ఆప్యాయంగా వివరంగా మాట్లాడారు. నాకిప్పటికీ వారి మాటలు గుర్తున్నాయి. అవి నాకా రోజు పెద్ద టానిక్ లాంటివి.

          ఆ తర్వాత ఆ రెండు పుస్తకాలకు కొన్ని మంచి సమీక్షలే వచ్చాయి. ఇక నా కవిత్వం ముందుకు వచ్చింది. హైదరబాద్ లో గడిపిన ఆ మూడు నెలల సంక్షోభ కాలంలో రాసిన కవితలన్నింటినీ పుస్తకంగా తేవాలని ఆలోచన.

          అనారోగ్యమూ, మందులూ, జాగ్రత్తలూ, ఉద్యోగమూ ఒక వైపు, మరో వైపు నా సృజనాత్మక జీవితం. కవిత్వమయితే వేయాలి అనుకుంటూ ముందుకు సాగాను. ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యను ముందుమాట రాయమని అడిగాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆగస్టులో రెండు పుస్తకాలు వస్తే నవంబర్ 2014 లో కవిత్వం “మనిషి లోపల” వెలువడింది. ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను..

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.