వాతావరణం బాగుండలేదు
मौसम खराब है”
హిందీ మూలం – డా. దామోదర్ ఖడ్సే
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
విమానంలో అడుగుపెడుతూనే ఆమె తన సీటును వెతుక్కుంది. చాలా రోజుల తరువాత తను తన కోసం కిటికీపక్కన ఉన్న సీటు కావాలని అడిగింది. లేకపోతే సాధారణంగా ఏ సీటు దొరికితే అదే తీసుకునేది. ముంబయి నుండి ఢిల్లీకి వెళ్ళే ఈ ఐ.సి. 168 ఫ్లైటులో తరచు జనసందోహం ఉంటుంది. ముంబయిలో పనులన్నీ ముగించుకుని సాయంత్రం 6.30 గం. కి బయలుదేరే ఈ ఫ్లైటులో ఢిల్లీకి రాత్రి 8.30 గం. కి చేరుకోవచ్చు. ఆమెకూడా ఆ రోజున రోజంతా ఆఫీసులోని అవసరమైన పనులన్నీ పూర్తిచేసుకుని అయిదు గంటలకి ఆఫీసు నుంచి బయలుదేరింది. శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి తన ఆఫీసు కేవలం పదిహేను నిముషాల దూరంలోనే ఉంది.
విమానంలో కూర్చోగానే ఆమె ఆ రోజు ఆఫీసులోని అన్ని విషయాలనీ ఒక పక్కన పెట్టి కిటికీలోంచి బయటకి చూడసాగింది. నిజానికి సెక్యూరిటీ చెకింగ్ పూర్తికాగానే ఆవలెల్లుండి… అంటే ఎల్లుండి తర్వాత రోజు జరుగబోయే సాంవత్సరిక మీటింగుకి ఏర్పాటులన్నీ బాగా పూర్తి అయిపోయాయని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. కాని మర్నాడు ఢిల్లీలో జరుగబోయే ఈ మీటింగు అనుకోకుండా అకస్మాత్తుగా పెట్టుకోవలసి వచ్చింది. పార్లమెంటు సమావేశం ప్రారంభం కాబోతోంది. వారి మినిస్ట్రీకి చెందినవి కూడా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అందులో ఉన్నాయి. ఆమె భారతప్రభుత్వానికి చెందిన అండర్ టేకింగు అయిన ఒక ఆయిల్ కంపెనీలో పని చేస్తోంది.
సెక్యూరిటీ చెకింగ్ అయిన తరువాత ఆమె తన పర్సులోంచి డైరీ బయటికి తీసి చూసుకుంది. చెయ్యవలసిన పనులన్నిటి గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంది. మళ్ళీ అనుకోకుండా మార్పులేవైనా జరగడానికి అవకాశం ఉంది. ఈసారి సంవత్సర సమావేశానికి మంత్రిగారు రాబోతున్నారు. ఒక్క విషయంలో కూడా ఏమీ తేడా రాకూడదు. తను వెడుతున్నది ఢిల్లీ అయినప్పటికీ, తన మనసంతా ముంబయిలోనే పరిభ్రమి స్తోంది. అప్పుడే పైలట్ కంఠస్వరం వినిపించింది. పదాలు స్పష్టంగా లేవు. కాని బహుశా చెబుతున్నది విమానంలోని తలుపులని జాగ్రత్తగా చూసుకోమని కావచ్చు. విమానం టేక్ ఆఫ్ చెయ్యడానికి సిద్ధంగా ఉందని కావచ్చు. ఈ పైలట్లు కూడా విచిత్రమైన వాళ్ళని, ప్రతిసారి తనకి అనిపిస్తుంది. విమానం ఎంత జాగ్రత్తగా నడుపుతారో దానికి విరుద్ధంగా అంత నిర్లక్ష్యంగానూ విమానంలో అనౌన్సుమెంటులు చేస్తారు.
సరే! విమానం కదిలింది. ఆమె `స్వాగత్’ పత్రికను చేతిలోకి తీసుకుంది. విమాన సేవలో ఉన్న అందగత్తెలు ఇంగ్లీషు స్టైలులో హిందీ మాట్లాడటానికి ప్రయత్నిస్తూ విపత్కరపరిస్థితిలో `శ్వాస తీసుకునే పద్ధతి’ ని చెబుతున్నారు. ఈ విషయానికి కూడా తనకి ఎప్పుడూ ఒక విచిత్రమైన అనుభవం కలుగుతుంది. తను చెప్పే విషయం మీద ఎవరూ ధ్యాస ఇవ్వడం లేదని ఎయిర్ హోస్టెస్ కి కూడా తెలుసు. ఆ టేప్ మళ్ళీ వినిపిస్తోందని ప్రయాణీకులకి కూడా తెలుసు. నిజంగానే విపత్కరపరిస్థితి వస్తే చాలా మంది ఏం చెయ్యాలో తెలియక తెల్లముఖం వేస్తారు. కాని కొందరు ప్రయాణీకులు ఆ సుందరీమణులని తదేకంగా చూస్తూ ఉంటారు. మొదటిసారి విమానప్రయాణం చేసే వారు తమ నడుముకి పెట్టుకునే బెల్టు సరిగా ఉందోలేదో చూసుకుని ఊరటచెందుతారు. విమానం నేలని విడిచిపెట్టి టేక్-ఆఫ్ చెయ్యగానే సగంమంది నిద్రలోకి జారుకుంటారు. కాని ఆ రోజు ఆమెకి నిద్ర రావడంలేదు. ఏదైనా చదవాలని కూడా అనిపించడంలేదు. నిజానికి ప్రతి ప్రయాణంలోనూ ఆమె ఏదయినా పుస్తకం తప్పకుండా చదువుతూ ఉంటుంది. కాని ఆ రోజు మాత్రం అదేమీ చెయ్యడంలేదు. ప్రత్యేకించి ఆమె ధ్యాస ఆ సమయంలో ఆ మర్నాడూ, ఆ తరువాతనూ జరుగబోయే మీటింగుల మీద కూడా లేదు.
విమానం సముద్రానికి ఒక పెద్ద ప్రదక్షిణం చేసింది. విమానం ఎత్తయిన పర్వతాల మీద తన పెద్ద-పెద్ద రెక్కల నీడని వదులుతూ తన ఎత్తుని పెంచుకుంటోంది. నేల అంతకంతకీ దూరం అవుతోంది.
ఏదో ఊరు తేనెపట్టులాగా కనిపిస్తోంది. భూమి పచ్చని చిన్న-చిన్న దుప్పట్లలాగా దృశ్యగోచరమవుతోంది. అంతలోనే ఏదో నది బంగారపురంగులో గీతలు గీసినట్లుగా అనిపిస్తోంది. పెద్దనది ఎవరో ఎక్కడినుంచో బంగారాన్ని కరిగించి పారబోసినట్లుగా వుంది. ఆమె దూరంగా క్షితిజంవైపుకి దృష్టిని మరల్చింది. అబ్బో, ఎంత అందమైన చిత్రమో. ఏదో పెయింటింగ్ లాగా ఉంది. రిచా ఉంటే ఎంత సంతోషించేది. రిచా తన తొమ్మిదేళ్ళ కూతురు. చూస్తూనే తన పెళ్ళి అయి పన్నెండేళ్ళయిపోయింది. అనాయా సంగా కుశల్ కూడా గుర్తుకి వచ్చారు. కుశల్ తనకి ఎంత స్వతంత్రం ఇచ్చారు. ఉద్యోగం లో కూడా ఎప్పుడూ ఆయన తెలియని పరిస్థితిలో కూడా ఇబ్బంది పెట్టడం మాట అటుంచి ఏదీ బాధ కలిగించే మాట మాట్లాడలేదు. తనకి సంపూర్ణ వ్యక్తిత్వం ఇవ్వడంలో కుశల్ భూమిక ఎంతో విశిష్టమైనది.
ఏ రోజున తను ఒక ట్రైనీ అఫీసరుగా ఈ ఆఫీసులో అడుగు పెట్టిందో, ఆ రోజు అనుకోకుండా ఆమె కళ్ళముందు కదలాడింది. గతంలోంచి ఏదో ఒకటి తవ్వుకుంటూ గడిపే అలవాటు తనకి లేదు. కాని ఆ రోజు ఆమె వెనక్కి చూసుకోసాగింది. తన మొట్ట మొదటి రోజు అందరికీ ఎంత ఆసక్తికరంగా ఉంది. అప్పుడు తనకి కూడా కుతూహలం ఎక్కువగానే ఉంది. ఆఫీసులో చాలాకాలం నుంచి ఉన్నవాళ్ళు అప్పుడప్పుడూ తమ చూపులతో ఆమెని కొంచెం చూడటానికి ప్రయత్నించేవారు. తనుకూడా అందరితో అరమరికలు లేకుండా కలుసుకునేది. ఎటువంటి సంకోచం, ఎటువంటి పరిమితి లేదా ఏంచెయ్యాలో తోచని స్థితి తన మనస్సులో ఎప్పుడూ లేదు. మొట్టమొదటి రోజు నుంచి కూడా. అందువల్లనే ఆఫీసులోని ఉద్యోగుల్లో మహిళలూ, మగవాళ్ళూ అనే హద్దుల్లో తను ఎప్పుడూ ఉండలేదు. కర్తవ్యంపట్ల తన అంకితభావం తన పనికి మెరుగు పెడుతూ ఉండేది. ఉత్సాహం తన వ్యక్తిత్వానికి మంచిరూపం ఇచ్చేది. కష్టపడి పనిచెయ్యడం అనేది తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపేది. చూస్తూఉండగానే ఆమె ఆఫీసులో ఒక ముఖ్యమైన అధికారిగా తనకో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆఫీసులో మహిళా ఆఫీసర్లు ఇంకా ఉన్నారు. కాని తను ఒక ప్రత్యేకమైన విశిష్టమైన గుర్తింపును ఏర్పరుచు కుంది.
లంచ్ సమయంలో అందరితో కలవడం. పని గురించిన మాటలతోబాటు టాపిక్ మార్చడంకూడా తనకి బాగా తెలుసు. దానివల్ల లంచ్ సమయంలో కేవలం ఆఫీసు విషయాలు మాత్రమే కాక, కొన్ని ఇతరవిషయాలు కూడా ఇన్ఫార్మల్ గా మాట్లాడుకోవడం వీలుపడుతుంది. భారంగా ఉన్న భావం తగ్గి మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఆ రోజు మిగిలిన పనులు పూర్తి చేసుకోవడం సాధ్యపడుతుంది. ఆమెని అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్లుగానే చూశారు. తను కూడా అందరితోనూ చాలా ఆత్మీయంగానూ, చురుకుదనం తోనూ మాట్లాడేది. కాని ఇదంతా చాలా సహజంగానూ, ఎప్పుడూ ఎటువంటి కృత్రిమత్వం లేకుండానూ ఉండేది. ఉదయం పని ప్రారంభించడానికి ముందుగా ఆమె తన తోటి ఉద్యోగులందరికీ `హలో’ అనడం కూడా ఎంత సహజంగా ఉండేది. కాని ఇప్పుడయితే హలో అనడం కూడా అర్థవంతంగా, అప్పుడప్పుడూ తెచ్చిపెట్టుకున్నట్లు కృతకంగా, సారం లేని ఫార్మాలిటీ నెరవేర్చడానికి అన్నట్లుగా తప్పనిసరి అయింది. తను తన స్టేటస్ ని తను చేసే పనితోనే నిర్మించుకుంది. దీనికి ఎక్కువ క్రెడిట్ తను కుశల్ కే ఇస్తుంది. కుశల్ తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కుంటువడనీయలేదు, మందగించ నీయలేదు. కుశల్ తో తను అప్పుడప్పుడూ ఆఫీసు విషయాలు మాట్లాడుతూఉంటుంది. కాని నిజానికి తను ఆఫీసు విషయాలు ఇంటి వరకూ తీసుకురాకుండా ఉండాలనే ప్రయత్నిస్తుంది.
చాలా తక్కువ సమయంలోనే తను మానేజిమెంటు దృష్టిలో ఒక యోగ్యురాలైన ఆఫీసరుగా గుర్తింపు పొందింది. కొంతమందికి, ప్రత్యేకించి కొంతమంది పాత ఆఫీసర్లకి ఆమె ఇలా పైకి రావడం నచ్చలేదు. కాని తను ఇదేదీ లెక్కచెయ్యలేదు. కంపెనీ తనకి ఏ బాధ్యత అప్పగించినా, దాన్ని ఉత్సాహంగా, శ్రద్దగా పూర్తి చేస్తుంది. అప్పుడప్పుడూ ఆమె డిపార్టుమెంటు మాత్రమే కాకుండా వేరే పనులు ఇచ్చినప్పుడు వాటిని కూడా తను నిరాకరించలేదు. ఆ కారణంగానే ఆమె ప్రాముఖ్యం ఆఫీసులో పెరుగుతూ వచ్చింది. కాని తన వ్యక్తిత్వంలోని ప్రత్యేకతగా ఆమె తన సహచరులతోనూ, మిగిలిన ఉద్యోగులతోనూ ఎప్పుడూ సంతోషంగానూ, సౌహార్దయుతంగానూ వ్యవహరిస్తుంది. ఎవరూ తన గురించి తేలికగా మాట్లాడే అవకాశమే ఉండదు. అందరితోనూ కలిసి మెలిసి ఉండటమే కాక తను ఒక విశిష్టమైన గౌరవాన్ని సంపాదించుకుంది. ఆమెకి సహోద్యోగులు కూడా చాలా మంచివాళ్ళు లభించారు. త్వరలోనే తనని ప్లానింగ్ డిపార్టుమెంటుకి ఇంచార్జిగా చేశారు.
ఆ రోజు తను ఈ డిపార్టుమెంటుకి హెడ్ గా ఢిల్లీలో జరుగుతున్న ఒక మీటింగుకి వెళ్ళ వలసి వస్తోంది. కంపెనీ చైర్మన్ ముందుగానే అక్కడికి వేరే మీటింగు కోసం వెళ్ళి ఉన్నారు. పని ఎక్కువగా ఉన్నప్పుడూ, ఈ విధంగా అనుకోకుండా ఇంకా పని వచ్చిపడితే తను ఎప్పుడూ అధైర్యపడలేదు.తను ఎంతో పట్టుదలతోనూ, ఏకాగ్రతతోనూ తనపనిలో నిమగ్నమవుతుంది.
ఢిల్లీ విమానాశ్రయంలో దిగుతూనే ఆమె ఎయిర్ పోర్టు నుంచి ప్రీపెయిడ్ టాక్సీ చేయించుకుని తన హోటలుకి బయలుదేరింది. రాత్రి ఎనిమిదిన్నర అవుతోంది. ముంబయిలో ఒంటరిగా తనకి ఎప్పుడూ తనొక మహిళ అనే అనుభూతి కలుగదు. కాని ఆ రోజు ఢిల్లీలో ఈ రాత్రివేళ ఒంటరిగా టాక్సీలో కొంచెం ఇబ్బందిగానే ఉంది. అదీ సహజంగాలేదు. టాక్సీ అతని వైపు ఒక కన్ను వేసి ఉంచాలి. నిజానికి తను ఢిల్లీకి చాలా సార్లు వచ్చింది. కాని ఆ రోజు తనకి ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోంది. బహుశా ఈ మధ్య ఢిల్లీలో జరుగుతున్నట్లు తెలుస్తున్న ఉగ్రవాదులకి సంబంధించినవి, కలవరపరిచే ఇతర వార్తల కారణంగా తను దిగులుగా ఉంది. టాక్సీ అతనితో మాట్లాడాలా వద్దా అనే అసమంజస స్థితిలో కూడా తను ఉంది. తనకి ఈ విధంగా ఎటూతోచని పరిస్థితిలో మొదటిసారిగా ఉంది. ముంబయిలో ఉన్నప్పుడు ఇలాకూడా ఆలోచించవలసి వస్తుందని ఎప్పుడూ అనిపించలేదు.కొంచెం ధైర్యం తెచ్చుకుని తను టాక్సీ అద్దం కొంచెం కిందికి దించింది. లోపల చాలా ఉక్కగా ఉంది. టాక్సీఅతను ప్యాసెంజరు ఇబ్బందిని అర్థం చేసుకున్నాడు. “మేడం, ఢిల్లీలో వాతావరణం ప్రస్తుతం బాగుండలేదు. నిన్నటి నుంచి తీవ్రమైన గాలిదుమారంగా ఉంది. మీరు అద్దం పైకి పెట్టేయండి.”
ఈమాత్రంతోనే తనకి ఆ టాక్సీవాడు మంచివాడని అనిపించింది. కాని అతనితో ఎక్కువ మాట్లాడటం మంచిది కాదనుకుంది. అద్దం పైకి పెట్టుకుంది. నిర్జనంగా ఉన్న మార్గం ముగియగానే కాస్త ఊరటగా ఊపిరి పీల్చుకుంది. కాని ఢిల్లీలోని రాజకీయ నగరం నిర్మానుష్యంగా ఉండే ఊరికన్నా ఎక్కువ భయంకరంగా తనకి అనిపించింది. ప్రతి బిల్డింగు ఒక బంకరులాగా ఉంది. ఎంత సెక్యూరిటీ పెరుగుతోందో అదంతా తనకి అంతగానూ భద్రతలేనట్లుగా అనిపిస్తోంది. ఎలాగో కనాట్ ప్లేస్ వచ్చాక తను నిట్టూర్చింది. హోటలుకు చేరుకోగానే ఊరటగా నిశ్వసించింది. రాత్రి ఇంచుమించు పదిగంటలవుతోంది. విమానంలోనే తగినంత భోజనం చెయ్యడం అయిపోయింది. ఇప్పుడింక తనకి ఏమీ తినాలని లేదు.
హోటల్లో చేతులు-ముఖం కడుక్కున్నాక తను తన చైర్మన్ గారికి ఫోన్ చేసి మాట్లాడింది. ఉన్న కాగితాల గురించి తెలియపర్చింది. చైర్మన్ గారు ఉదయం పదిగంటలకి జరిగే మీటింగుకి ముందుగా ఆయన ఉన్న హోటలుకి వచ్చి ఆయన్ని కలుసుకోవలసిందిగా చెప్పారు. పొద్దున్న టిఫిన్ కలిసే చేద్దామని ఆయన అన్నారు. తను సరేనంది. ఇది బాగానే ఉంటుంది. మీటింగుకి ముందు ఒక గంటసేపు మాట్లాడు కునే అవకాశం కూడా దొరుకుతుంది. ఆమె కంపెనీ చైర్మన్ `జనపథ్’ లో బస చేశారు.
చైర్మన్ గారితో మాట్లాడిన తరువాత తనకి మరింత తేలికపడినట్లు అనిపించింది. ఇప్పుడింక రిచాతోనూ, కుశల్ తోనూ మాట్లాడాలని అనుకుంది. ఫోన్ కూడా తొందరగానే దొరికింది. రిచా గుడ్ నైట్ చెప్పడం తనకి చాలా బాగుంటుంది. చాలాసేపు తను రిచా గురించి ఆలోచిస్తూవుంది.
మర్నాడు తను పొద్దున్నే సరిగా ఎనిమిదిన్నరకి హోటల్ జనపథ్ కి చేరుకుంది. బ్రేక్ ఫాస్ట్ చేస్తూనే చైర్మన్ గారితో చర్చించడం కూడా అయింది. ఇద్దరూ కలిసే మీటింగుకి బయలుదేరారు.
చైర్మన్ గారు మీటింగు తరువాత ఆ రోజు అక్కడే ఉండిపోతారు. ఆయన మర్నాడు ఉదయం ఫ్లైట్ లో తమ సంవత్సర కార్యక్రమం కోసం మంత్రిగారిని వెంటబెట్టుకుని ముంబయి చేరుకుంటారు. కాని తను మాత్రం మీటింగు పూర్తికాగానే ఆ రోజే ముంబయి చేరుకోవాలి. మధ్యాహ్నం రెండుగంటల ఫ్లైట్ కి తన టిక్కెట్టు కూడా బుక్ చెయ్యబడింది. ఒకసారి మళ్ళీ సంవత్సర మీటింగుకి ఆఖరి ఏర్పాటుల కోసం సాయంత్రానికే అక్కడికి చేరుకోవడం తనకి అవసరం అనిపిస్తోంది.
ఢిల్లీలోని మీటింగు బాగానే జరిగింది. చైర్మన్ గారు కూడా సంతోషంగా ఉన్నారు. అంతా సమయానికి ఎటువంటి అంతరాయంకాని, ఇబ్బందికాని లేకుండా పూర్తి అయింది. చైర్మన్ గారు ఆమె ఎయిర్ పోర్టుకి చేరుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళేముందు కార్యక్రమం గురించి, ఏర్పాట్ల గురించి మరోసారి మాట అయింది. ఆ రోజు మీటింగు బాగా జరగడానికి కూడా క్రెడిట్ చైర్మన్ గారు ఆమెకే ఇచ్చారు. ఆమె సవినయంగా ఆయన చెప్పేదంతా విని చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసి ఆయన దగ్గర సెలవు తీసుకుంది. చైర్మన్ గారి ముఖంలో ఆమె పట్ల సంతృప్తి, ప్రశంసాభావం కూడా ప్రస్ఫుటితమవుతోంది. అది ఆమెకి బాగుందని పించింది. హడావిడిలో తయారుచేసిన పేపర్లు, మిగిలిన సామగ్రి బాగానే ఉపయోగిం చాయి.
ఎయిర్ పోర్టు చేరుకున్నాక తను వెళ్ళవలసిన ఫ్లైట్ రెండుగంటలు ఆలస్యంగా వెడుతుందని తెలిసింది. ఆ విమానం ఎక్కడో బయటి నుంచి అక్కడికి రావాలి. కాని ఇంతవరకూ రాలేదు. వాతావరణం బాగుండని కారణంగా కిందికి దిగటం సాధ్యపడలేదు. దానికి ఎంతసమయం పడుతుందో తెలియదు. ఆమెకి దిగులు పట్టుకుంది. రెండు గంటలు కూడా ఎక్కడికైనా వెడితే తిరిగిరాలేని తక్కువ సమయం. ఆమె అక్కడే కూర్చునివుంది. ఒక కొత్త పుస్తకం కొనుక్కుని అందులో లీనం కావడానికి ప్రయత్నించ సాగింది. కాని తనకి తెలియకుండానే కళ్ళకి ఎదురుగా వున్న అక్షరాలు కరిగిపోతు న్నాయి. తనకి ఎదురుగా ఎల్లుండి జరగవలసిన సంవత్సర మీటింగుకి చెందిన పనులు తిరుగుతున్నాయి. అయినా తన కొలీగ్స్ సామర్థ్యాన్ని తలుచుకుని పుస్తకం చదవడంలో నిమగ్నంకావడానికి ప్రయత్నం చేయసాగింది. అది ఒక ఇంగ్లీషు నవల. అందులో అధికారం కోసం పందెంతో పరుగులుతీసే ఒక పెద్ద కథ. అందులో ఆశ్చర్యపరిచే సంఘటనలు బాగా ఉన్నాయి. ఆ పుస్తకం అమెరికా నుండి వెలువడింది. పదేళ్ళకిందట అది అక్కడ పబ్లిష్ అయింది. పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది. రాజకీయనాయకులు, పాత్రికేయులు, వ్యాపారకంపెనీల కుట్రలు, దురాలోచనలు, కేవలం తామే ముందుకి పోవాలనే భయంకరమైన ప్లానులు, ఆధిక్యత కోసం ఎంతకైనా తెగించే ప్రయత్నాలు… వీటితోకూడిన కథలో సున్నితమైన మనోభావాలకి ఏ స్థానం ఉందో తెలియటంలేదు. తను ఆ నవలలో లీనమైపోయింది. అభివృద్ధి చెందినదేశాల కథలో మన దేశం యొక్క క్షణదర్శనం కూడా అప్రయత్నంగా అందులో కనబడుతోంది. రెండు గంటలు ఎప్పుడు గడిచిపోయాయో తెలియనేలేదు. ఇంకా కాస్త ఎక్కువ సమయమే పట్టింది. రెండు గంటలకు వెళ్ళవలసిన విమానం అయిదున్నరకి ముంబయికి బయలుదేరింది. దారిలో తను ఆ నవలని చదవడం పూర్తి చేసింది. కాస్త కునుకు పడుతోందోలేదో విమానం ముంబయిలోని ధారావీని దాటుకుని శాంతాక్రూజ్ ఎయిర్ పోర్టు మీదుగా ఎగురుతోంది. ఆమె మనస్సులో ఒక చిన్న ప్రశ్న ఉదయించింది. ఇంతకుముందే ఢిల్లీలో జరిగిన మీటింగు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో… ఇప్పుడే చదివిన నవల ఆ వైభవాన్ని ఇనుమడింప జేయడానికి… ఇప్పుడు చాలా దూరంవరకూ పేదరికం, కష్టాలు, ఇబ్బందులూ… వీటితో సంఘర్షణ చేస్తున్న చాలా పెద్ద పూరిళ్ళ సముదాయం…. వీటన్నిటికీ మూలాలు ఎక్కడ ఉన్నాయి. మళ్ళీ తనకి అనిపించింది తను ఒక భయంకరమైన ప్రశ్నలవలలో చిక్కుకు పోయిందని. ప్రయాణీకులు తమ తోటి ప్యాసెంజర్ల గురించి ఆలోచించకుండా పైనుంచి తమ సామాను త్వరగా దింపుకుంటున్నారు. ఎవరికైనా ఏమయినా తగిలితే `సారీ’ అని పని జరిపేస్తున్నారు. కాని ఎవరూ అయిదు నిమిషాలు కూడా ఆగడానికి సిద్ధంగా లేరు. విమానం ఇంకో గంట ఆలస్యంగా వస్తే వీరంతా ఏం చేసేవారు?
మర్నాడు తను సమయానికి ఆఫీసుకి చేరుకుంది. లిఫ్టులోంచి బయటికి వస్తూనే తను అదే స్ఫూర్తితో, ఉత్సాహంతో, సంతోషంతో తన హాలులో ప్రవేశించింది. తను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నడుస్తుంది. తను వేసే అడుగుల్లో ఒక ప్రత్యేకమైన విధంగా ఉత్సాహం కనిపిస్తుంది. కళ్ళలో ఒకే లక్ష్యాన్ని సూచించే దృష్టి, హలో అనడంలో అరమరికలు లేని సరళత, నిష్కాపట్యం. తలుపు దగ్గర కూర్చునివున్న ప్యూన్ వంకకూడా తను హలో అనే పద్ధతిలోనే చూసింది. రిసెప్షనిస్టు వంక దృష్టి సారించింది. కాని రిసెప్షనిస్టు ధ్యాస ఎక్కడో వుంది. కాని తను దీన్ని ప్రత్యేకంగా తీసుకోలేదు. తన సీటు వైపుకి చేరుకుంటూనే తన సహచరులందరూ ఎందుకనో ఇలా పరధ్యానంగా ఉండటం గమనించింది. ఎవరూ తనవంక ఎందుకు చూడటంలేదు. కళ్ళు కలిసినా చూపులు తిప్పేసుకుంటున్నారెందుకు వీళ్ళు. ఏదో చెప్పుకోతగ్గ సంఘటన జరిగివుంటుంది. ప్రత్యేకించి సహ అధికారుల కళ్ళలో తనపట్ల ఒక పరాయితనం వున్న భావం కనిపిస్తోంది. ఆమె తన పర్సు టేబిలు మీద పెట్టి `వాష్ రూమ్’ కి వెళ్ళింది. లోపల తను చాలా ఆలోచనలో పడింది. ఆ రోజు ఎవరూ తనతో హలో అనలేదు. తను చెప్పిన హలోకి కూడా ఎవరూ ఉత్సాహంగా బదులు చెప్పలేదు. చీఫ్ ఆఫీసరు దగ్గరికి వెళ్ళి అడిగితేనే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ఆ అవాంఛిత పరిస్థితికి కారణం ఏదో అర్థమవుతుంది.
బయటికి వస్తూనే ఆమె మళ్ళీ అదే నిర్లక్ష్యభావం, అదే పరాయితనం ఎదుర్కోవలసి వచ్చింది. అసలు ఏమయింది? దూరం నుంచే తను గమనించింది తన అసిస్టెంటు పాండే తన టేబిలు దగ్గరే నిలబడివున్నాడు. అతని కళ్ళలో గౌరవంతో కూడిన మెరుపు కనిపిస్తోంది. పాండే ఇలా కలుసుకోవడం సంతోషప్రదంగా ఉంది. ఆఫీసులో కూర్చునే ఏర్పాటు ప్రకారం కూర్చున్న తరువాత ఎవరూ ఎవరికీ కనిపించరు. ఈ ఆఫీసు ఆధునిక పద్ధతిలో తయారుచేయబడింది. కాని దగ్గరికి వచ్చాక పాండే చేతిలో బుకే కూడా ఉండటం తను గమనించింది. పాండేని తను ఏమయినా అడగడానికి ముందే అతనే అన్నాడు- “కంగ్రాచ్యులేషన్స్ మేడమ్ గారూ!”
“దేనికి? ఏ విషయానికి?”
“ఈ సంవత్సరం మిమ్మల్ని బెస్ట్ ఆఫీసరుగా ప్రకటించారు.”
“……”
ఒకసారి తను నలువైపులా పరికించి చూసింది. ఎవరికీ ఆమె వంకకు చూడటానికి సమయం లేనంతగా అందరూ పదిగంటలకే చాలా బిజీగా పని చేస్తున్నారు. ఎవరికీ ఏమీ సంతోషం అనేది లేదు. ఎక్కడా ఎటువంటి అభినందనలూ లేవు. ఆఖరికి పోయిన సంవత్సరం ఈ బహుమానం ఎవరికి వచ్చిందో, ఆ సంతోషంలో తను ఎవరి కోసం అయితే తనవైపు నుంచి స్వీట్లు పంచి పెట్టించిందో ఆ వ్యక్తి కూడా తన పనిలో మునిగి పోయివున్నాడు.
ఆమె మనస్సు కలత చెందింది. తినే స్వీటులో అనుకోకుండా పళ్ళమధ్యలో ఏదో రాయి వచ్చినట్లుగా అనిపించింది. కాని తను ఎవరినీ ఎప్పుడూ బాధ పెట్టలేదు. మరి తన సంతోషం సహచరులందరికీ ఎందుకు బాధ కలిగిస్తోంది.
“ఓఫ్…నో…” అనుకోకుండా ఆమె నోటి నుంచి వచ్చేసింది. పాండే కూడా అన్నాడు
—“మేడమ్! వదిలెయ్యండి. ఈర్ష్య అనేది ఎక్కడ లేదు?” కాని ఆమె అశాంతికి లోనయింది. తను ఏ పనీ చెయ్యలేకపోయింది.
ఆ మర్నాడే సాంవత్సరిక కార్యక్రమం. ఆ కార్యక్రమంలోనే తను మంత్రిగారి చేతుల నుంచి బహుమానం అందుకోవాలి. చైర్మన్ గారికి ఇది తెలిసే వుంటుంది. కాని ఢిల్లీ ప్రయాణంలో దీని గురించి ఆయన ఏమీ సూచన చెయ్యలేదు. హింట్ కూడా ఏదీ ఇవ్వలేదు. బహుశా ఆయన సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుని ఉండవచ్చు. సర్ప్రైజ్ అయితే ఆఫీసులోని తనకి తెలిసిన సహచరులే ఇచ్చారు. ఈ ఉదాసీనత, పరాయితనం, సంబంధరాహిత్యంతో తను బాగా ఆహతురాలయింది. ఇది ఒక విధంగా తనకి అవమానమే. తనవాళ్ళని పరాయివాళ్ళుగా చేసే ఇటువంటి అవార్డు ఎవరికి కావాలి. అవార్డూ వద్దు, ఏమీ వద్దు. కాని పోయిన సంవత్సరం ఇలా కాలేదు. కొంతమంది నిస్సందేహంగా ముఖం ముడుచుకున్నారు. కాని అభినందనలు చెప్పే ఫార్మాలిటీని పూర్తిచేశారు.
తన విషయంలో ఇలా కఠినంగా ఈర్ష్యతో వ్యవహరించడానికి ఏమయినా కారణం ఉందా? ఉందనిపిస్తోంది. అదే, తనకి ఈ ఆఫీసులో త్వరగా గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు కోసం తను ఎప్పుడూ అనుచిత మార్గాలని అనుసరించలేదు. కేవలం అంకితభావంతో కష్టపడి పనిచెయ్యడం. అందువల్లనే తను జూనియర్ అయినప్పటికీ ఈ గుర్తింపును పొందింది.
ఈ విషయం కొంతమందికి, ప్రత్యేకించి సీనియర్స్ కి కంటగింపు కలిగించింది. అంతే. రోజంతా అక్కర్లేని మాటలు…అనవసరపు రియాక్షన్లు… వీటితో గడిచింది. ఇదంతా చూసి తనకి చెప్పలేని విధంగా బాధ కలిగింది. ఈ అవార్డు తనకి అసలు అక్కర్లేదు. మధ్యాహ్నం రెండవుతోంది. బహుశా చైర్మన్ గారు వచ్చి వుండవచ్చు. తను వెంటనే తన సీటు నుంచి లేచి చైర్మన్ గారి క్యాబిన్ వైపు నడిచింది. అందరి చూపులూ ఆమెని అనుసరించసాగాయి. కొంతమందికి ఉన్న అభ్యంతరం ఈవిడ ఎవరినీ లెక్క చెయ్యదని, తిన్నగా చైర్మన్ దగ్గరికి వెడుతోందని.
పి.ఎ. ఆవిడని ఆపుజేశాడు. ఆ రోజు ఆయన్ని కలుసుకోవడం వీలుపడదని. సార్ చాలా బిజీగా ఉన్నారని అన్నాడు. తను బతిమలాడింది ఒక్క రెండు నిమిషాల కోసం… అంతకన్నా నేను ఆయన సమయాన్ని తీసుకోనని. మర్నాడు జరుగబోయే సంవత్సర మీటింగు గురించి… కేవలం రెండు నిమిషాలు… కాని పి.ఎ. దగ్గర గత్యంతరం లేదు. అతనికి చైర్మన్ గారు ఇచ్చిన ఆదేశం అటువంటిది.
తను తన టేబిలు దగ్గరికి వచ్చి కూర్చుంది. సాయంత్రం మళ్ళీ పి.ఎ. కి ఫోన్ చేసింది. కాని ఎక్కడా సాధ్యపడేలా లేదు. చివరికి తను ఒక కాగితం మీద సంక్షిప్తంగా రాసింది—“సార్, నేనీ అవార్డు తీసుకోలేను. కమిటీ నన్ను సెలక్టు చేసినందుకు నేను కృతజ్ఞురాలిని. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.” కేవలం అంతే రాసింది. కవరులో పెట్టి అంటించి దాని మీద `కాన్ఫిడెన్షియల్’ అని రాసి చైర్మన్ గారి పి.ఎ.కి ఇచ్చింది. ఆ కవరు కేవలం చైర్మన్ గారే ఓపెన్ చెయ్యాలని రిక్వస్ట్ చేసింది.
తరువాత పాండేని పిలిచి అన్యమనస్కంగానే మర్నాడు జరిగే కార్యక్రమం గురించిన ఏర్పాటుల విషయంలో అడిగి తెలుసుకుంది. అంతా సరిగానే ఉంది. ఇప్పుడింక తను ఆఫీసులో ఇంకా ఆగదలుచుకోలేదు. కాని తను గనక వెళ్ళిపోతే, చైర్మన్ గారు అయిదు గంటలలోగా తనని పిలిస్తే బాగుండదు. అందుకనే తను అయిదున్నర వరకూ ఉండి, అప్పుడు ఇంటికి బయలుదేరింది. ఏర్పాటులన్నీ పూర్తి అయిపోయాయి. ఇంక మర్నాడు ఉదయం కేవలం తొమ్మిదిన్నరకి ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభం కావలసివుంది. ఇప్పుడు అందులో తనకేమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. అయినా ఎనిమిది గంటలకే అక్కడికి చేరుకోవలసి ఉంటుందని పాండేతో చెప్పింది.
ఇంచుమించు ఆరున్నర గంటలకి చైర్మన్ ఆమెని పిలిచినప్పుడు ఆఫీసులో హడావిడి మొదలయింది. కాని తను ఆఫీసు నుంచి అప్పటికే వెళ్ళిపోయింది. ఆమె ఇంటి ఫోన్ నెంబరు వెతికారు. కాని ఇంటికి ఇంకా ఫోన్ కనెక్షన్ దొరకలేదు. ఆఫీసులో కొంతమంది పనిచెయ్యడం అనే పేరుమీద చైర్మన్ వెళ్ళిపోయిన తరువాత ఆఫీసు నుంచి బయలుదేరుతారు. ఆవిడ అయిదున్నరకే వెళ్ళిపోయిందని, ఆవిడ కాంటాక్టు నెంబరు ఏదీ లేదని వాళ్లు పి.ఎ. కి చెప్పారు.
మర్నాడు ఉదయం సరిగా ఎనిమిది గంటలకి ఆమె కార్యక్రమం జరిగే స్థలానికి చేరుకుంది. సంబంధించిన కాగితాలన్నీ యథావిధిగా అందరికీ అందజేయబడ్డాయని తను నిశ్చింతగా ఉంది.చైర్మన్ గారి కారు రావడం తను దూరాన్నించే గమనించింది. ఆయన ఆ కవరు తెరిచి చూశారో లేదో తెలియదు. ఏమనుకున్నారో ఏమో. కాని ఇంత త్వరగా ఎలా వచ్చారు.
కొద్దిసేపట్లోనే డ్రైవరు వచ్చి, సార్ పిలుస్తున్నారని చెప్పాడు. కొంచెం సంకోచిస్తూనే తను చైర్మన్ గారి దగ్గరికి నడిచింది. ఒకపక్కకి తీసుకువెళ్ళి ఆయన ఆత్మీయంగా అడిగారు-“ఏమయింది? ఎవరైనా ఏమన్నాఅన్నారా? ఇది నిజంగా నీ హక్కు. ఇది సెలక్షన్ కమిటీ నిర్ణయం. ఇందులో నాకేమీ సంబంధం లేదు. అయినా నువ్వు ఈ అవార్డు తీసుకోవాలనే అంటాను. లేకపోతే నువ్వు ముందుకి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళ మనోరథం నెరవేరుతుంది.”
తను కన్నీరు ముప్పిరిగొన్న కళ్ళతో చైర్మన్ గారివంక చూసింది. ఆయన చెబు తున్నది నిజం. తను ఆ అవార్డు తీసుకోవాలి. చైర్మన్ గారు మళ్ళీ అన్నారు- “ఇంత సెంటిమెంటల్ కాకూడదు. నువ్వు ఈ అవార్డు తీసుకునేందుకు వస్తున్నావు.” ఈ మాట చెప్పి ఆయన కార్యక్రమానికి చెందిన మిగిలిన ఏర్పాట్లను వీక్షించడంలో నిమగ్న మయ్యారు.
తను కూడా తన మనస్సును దిటవు చేసుకుంది. కాని తన ఉత్సాహానికి, సంతోషానికి, సంతృప్తికి, గ్రహణం పట్టినట్లుగా ఉంది.
కార్యక్రమం జరిగింది. ఆమె పేరు పిలిచారు. కరతాళధ్వనులు ఆమె చెవుల్లో బాణాలు, బల్లాలులాగా పనిచేస్తున్నాయి. ఆ చప్పట్లలో స్థానిక అధికారులు కూడా ఉన్నారు. వారితోబాటు చైర్మన్ గారు, పాండేల కరతాళధ్వనులు కూడా ఉన్నాయి. అదే ఆలోచించి ఆమె నార్మల్ గా ఉండటానికి ప్రయత్నించసాగింది. తను వేసే అడుగుల్లో చలనం ప్రయత్నపూర్వకంగా ఉన్నట్లు అనిపించింది. అవార్డు తీసుకునే సమయంలో తనలో కమ్ముకుంటున్న కారుమబ్బుల నీడ చిరునవ్వుతో ఉండే తన వ్యక్తిత్వం పైన పడకుండా ఉండటానికి తన మనస్సుకి ఎంతగానో నచ్చఁజెప్పుకుంది. ఆ ప్రయత్నం లోనే తను వేదికవైపుగా ముందుకు నడిచింది. చైర్మన్ గారి కరతాళధ్వనులు ఆమె మనస్సులోని కోలాహలాన్ని తొలగించాయి. అవార్డు తీసుకున్న తరువాత, తన సీటులో కూర్చోగానే మేఘాలు ఎప్పుడు వర్షిస్తాయో తెలియదని తనకి అనిపించింది….
***
డా. దామోదర్ ఖడ్సే – పరిచయం
డా. దామోదర్ ఖడ్సే గారి సాహిత్యసేవ విస్తృతమైనది. వీరి 9 కథాసంకలనాలు, 4 నవలలు, 10 కవితాసంకలనాలు, 1 సమీక్ష, 4 ట్రావెలాగ్స్, 8 అధికారభాషకి సంబంధిం చిన గ్రంథాలు ప్రచురితమయ్యాయి. కొన్ని డాక్యుమెంటరీలకి, టెలీఫిలింలకి స్క్రిప్టు రాశారు. వీరి సాహిత్యంపైన, వ్యక్తిత్వంపైన విద్వాంసులు రాసిన 7 పుస్తకాలు వెలువ డ్జాయి. వీరి రచనలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధభారతి, దూరదర్శన్, టీవీ ఛానళ్లలో ప్రసారితమయ్యాయి. ఈయన వివిధ విద్యాసంస్థలలో 1200 కన్నా ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చారు. వీరి రచనలను వివిధ విద్యాసంస్థల కోర్సులలో పాఠ్యాంశాలుగా తీసుకున్నారు. ఈయన మరాఠీనుంచి, ఆంగ్లం నుంచి 19 సాహిత్య గ్రంథాలను అనువదించారు. 7 పుస్తకాలకి సంపాదకత్వం నిర్వహించారు. వీరి రచనలు ఆంగ్లంతోసహా 10 భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి సాహిత్యంపై కొల్హాపూర్, అమరావతి, షోలాపూర్ యూనివర్సిటీలలో 5 పిహెచ్ డి, పుణే యూనివర్సిటీ ద్వారా 1 ఎం.ఫిల్. డిగ్రీలు ప్రదానం చేశారు. డా. ఖడ్సే ఎన్నో సాహిత్య, సాంస్కృతిక సంస్థల ద్వారా సన్మానం పొందారు. గౌ. రాష్ట్రపతి గారిద్వారా 1992లో, 2012లో సాహిత్య పురస్కారం ప్రదానం చేయబడింది. వీరు కేంద్రప్రభుత్వానికి చెందిన కొన్ని ఉన్నత స్థాయి కమిటీలలో సభ్యులు. నాలుగు యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 30 సంవత్సరాలు సేవ చేసిన అనంతరం అసిస్టెంట్ జనరల్ మానేజరుగా రిటైర్ అయ్యారు. డా. ఖడ్సే పుణే వాస్తవ్యులు.
బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
శ్రీ దామోదర ఖడ్సే గారి ” వాతావరణం బాగుండలేదు ” కథ బాగుంది… కానీ ఇంతకు ముందు అనువదించబడిన కథల స్థాయి లో లేదు. సామాజిక ప్రయోజనం అనేది కొంచెం తక్కువగా ఉండటం వల్లనే మో ! ఒకప్పటి ఆఫీసు ల్లో మానవ సంబంధాల గురించి తెలుసుకోవచ్చు …
రచయిత , అనువాదకులకు…
అందించిన నెచ్చెలి పత్రిక కు అభినందనలు !
( ఇప్పుడు చాలా వరకు మానవసంబంధాలు అనేవి
నల్లపూసలు అయిపోవటం … అసలు ఆఫీసు లనేవే…
ఆనపకాయ సైజు నుంచి ఆవగింజల పరిమాణం లోకి
వచ్చేస్తున్న నేపథ్యం లో …! )