వాన తడపని నేల

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          మేడమీద ఆరుబయట నీలాకాశపు పందిట్లోతెలిమంచు పరదాల సందిట్లో మిణుకు మిణుకు మంటూ మెరిసే తారల ముంగిట్లో చంద్రుని వెన్నెల కౌగిట్లో పాతకాలపు నవారు మంచం పైన వెల్లకిలా పడుకుని సిరిచందన రవితో పరవశంగా మాటాడుతోంది. పేరుకి తగినట్లే సిరి, చందనాల మేళవింపు ఆ మోము.

          మొబైల్లో రవి సెక్సీ గళానికి, అతని రొమాంటిక్ భావాలకు, అతడి వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అంత చల్లని వాతావరణంలోనూ ఆమె తనువు తాపంతో వేడి సెగలను కక్కుతోంది. అడ్రినలిన్రష్ తో మరింత పొంగిన ఎదపై నుండి పయ్యదతొలిగిపోయింది. ఆ మనోకాంతుని మన్మధ ఏకాంతంలో ఆ కాంత ఏదీ పట్టించుకునే స్థితిలో లేదు.
మాటల్లో కుసుమలాలిత్యం, కంఠంలో గంభీర మగతనం జోడుగుర్రాలుగా సాగే అతని పలుకులు ఆమెకు ఎన్ని గంటలైనా వినాలనిపిస్తుంది.అయితే అతను అనునిత్యం కాల్ చేయడు. వారానికి ఒకటి రెండుసార్లు మాత్రమే చేస్తూ అతని మాయలో ఆమెను మంత్ర ముగ్ధురాలిని చేస్తూంటాడు. అలా చేసినప్పుడు ఓ రెండు… మూడు… నాలుగు గంటల పాటు ఆమెను తన నాదస్వరానికి వివశమయ్యే నాగకన్యను చేసి వశపరుచుకుంటాడు. ఆ పైన ఆమెను తిరిగి అతని పిలుపు కోసం ఎదురుచూసే చకోరం చేసేస్తాడు.

          మగాడు రససిద్ధి పొందటానికి నీలి సినిమాలు, అడల్ట్ కంటెంట్ వున్న యూ ట్యూబ్ చానెళ్ళు, ఇతరత్రాలుఅవసరమేమో కాని ఆడదానికి మనసుకు నచ్చిన మగాడి మనసైన మాటలు చాలు తాదాత్మ్యం చెంది పతాక స్థాయిలో రససిద్ధి పొందటానికి. అతనితో మాటాడిన ప్రతిసారీ సిరి ఇంకఆ క్షణం చనిపోయినా చాలనుకుంటుంది.

          ఎంఏ తెలుగు చేసి టీచర్ గా ట్రైనింగ్ అయిన సిరి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచరుగా ఉద్యోగం చేస్తోంది. సిరి పెద్దల బలవంతపు వివాహానికి గురయిన చదువుకున్న పల్లెపడుచు. స్త్రీ పురుషులిద్దరూ సమమేనని ఎందరు వేదికలెక్కి ఎన్ని భాషణాలు ఇచ్చినా, స్త్రీలు అనేకానేక వ్యవస్థల్లో అగ్రగాములుగా వున్నా, అందరూ ఒప్పుకోవలసిన నిజం…దాంపత్యంలో స్వారీ చేసే పితృస్వామ్యం.

          భర్త అరాచక పితృస్వామ్యాన్ని భరించలేని సిరి ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అబలత్వాన్నివీడిధీరోదాత్తంగా తన ముప్పయ్యోఏట భర్త నుండి విడాకులు తీసుకుంది. కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయంలో ఆమె తన స్వంత నిర్ణయం తీసుకో వటం సిరిని అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి శత్రువును చేసింది. సిరి ముప్పై ఏళ్ళలోపే భర్త ప్రేమరాహిత్యం కారణంగా అనేక మార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేయటం, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవటం జరిగింది. ఒక సందర్భంలో భర్త శాడిజంకి బలైన సిరికి ఒక ప్రక్క కొంత శరీరభాగం అగ్నికి ఆహుతయ్యింది. ఆ కాలిన మచ్చలు చీరకట్టులో కప్పడిపోయినా తన జీవితాన్ని కాల్చేసిన మగడి మృగత్వాన్ని గుర్తు చేసే మచ్చలు మనసులో ఇప్పటికీ మాననే లేదు.

          ఎన్నోసార్లు సిరి డిప్రెషన్కిలోనయ్యింది. ఇంత సంఘర్షణకు లోనయినా, చావు అంచుల వరకూ వెళ్ళి వచ్చినా సిరి విడాకులను సిరి తల్లిదండ్రులు సమర్ధించలేదు.
ఈ భారతావనిలో ప్రేమా, పెళ్ళిళ్ళ విషయంలో చావోబతుకో అన్న విషమ స్థితిలోనూ తల్లిదండ్రుల ఆపన్నహస్తం ఆదుకోక అంతమయ్యే మగువల జీవితాలు ఎన్నో..! ఏ ఆడపిల్లయినా ప్రియునితో మోసగించబడినప్పుడు, భర్త చేత తిరస్కరించబడ్డప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, పునర్వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు, సహాయ సహకారాలు వుంటే ఆ అమ్మాయిని వేలెత్తి చూపటానికి ఈ సమాజం కూడా జంకుతుంది. సిరికి ఆ మద్దతు కరువయ్యింది.

          అంతే కాకుండా సిరి తల్లిమనవలకు సిరికి విరుద్దంగా ద్వేషాన్ని నూరిపోసి వారికి సిరి పై ఆగ్రహావేశాలను రాజేసింది. కోర్టు విడాకుల మంజూరీతో సిరి భర్తతో పాటుగా బిడ్డలకు కూడా దూరమయ్యింది.

          తల్లి అనే పదం వినగానే భూదేవంత సహనం, అనంతాకాశమంత ప్రేమ, నిండైన అమ్మతనం, కొండంత దయ, క్షమార్ద్ర హృదయం… ఇలా ఎన్నెన్నో కనిపిస్తాయి. తరువుకి కాయ భారమా లాంటి గీతాలెన్నోగుర్తొస్తాయి. కాని దురదృష్టవశాత్తు సిరి తల్లి అందుకు విరుద్దం. మనవలనిద్దరిని తన దగ్గరే పెట్టుకుని, వారి చదువుల ఖర్చు సిరి నుండి తీసుకుంటూ వాళ్ళను సిరికి శత్రువులుగా తీర్చిదిద్దింది.

          పచ్చటి తీగెకు పందిరిపై నమ్మకం… వేలుపట్టుకొని పైకెగబాకుతుంది. పందిరి కుప్పకూలితే మొక్కబతుకు మట్టిపాలవుతుంది. ఆడపిల్లకు పుట్టిల్లే పందిరి. సిరి విషయంలో పుట్టిల్లు కూలిన పందిరయ్యింది. ఆమె బ్రతుకు అటు కన్నవారు, ఇటు కడుపున పుట్టినవారి ప్రేమ లేక నైరాశ్యంతో వ్యథాపూరితమయ్యింది. ఎవరి మీదో తెలియని కక్షతో ఏదో సాధించి నిరూపించుకోవాలన్న తపనతో ఉద్యోగం చేస్తూనే సిరి ఎంఏ సైకాలజీ చేసి మనుషుల మనస్తత్వాలను చదవటం అలవర్చుకుంది. అంతటితో తృప్తి చెందక ఎంఏ ఫిలాసఫీ చేసింది. మూడు ఎంఏలతో సిరిని సరస్వతి వరించినా ఏదో తెలియని తృష్ణ, ఒంటరితనం ఆమెను వేధించసాగాయి.

          తన మంచి చెడులు ఎవరికీ పట్టనప్పుడు, ఒక చిన్న పలకరింపు కూడా తనవాళ్ళ నుండి కరువైనప్పుడు, కేవలం తన సంపాదన మాత్రమే వాడుకుంటున్న తల్లి, పిల్లల పట్ల సిరిలో విముఖత ఏర్పడింది. ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించినా, విద్యార్థులకు ఎంత జ్ఞానబోధ చేసినా సమయాన్నంతా పుస్తకాల మధ్య వెచ్చించినా మనసులో తీరని వెలితి, జీవితంలో పూరించలేని ఖాళీ ఆమెను దహించివేయసాగాయి.

          సిరి మాజీ భర్త పునర్వివాహం చేసుకుని మళ్ళీ మరో ఇద్దరు పిల్లలకు తండ్ర య్యాడు. పిల్లల ప్రేమకు కూడా నోచుకోని సిరిలో తానెందుకు తిరిగి వివాహమాడ కూడదన్న ప్రశ్న కక్షగా రగిలింది. అదే వీధిలో ఓ చివర తన మాజీ భర్త భార్యాపిల్లలతో వస్తూ పోతూ, మరో ప్రక్క వీధి చివర తల్లి ఇంట్లో తన పిల్లలు మొహం తిప్పుకుని అసహ్యకర చూపుల తూట్లతో పొడుస్తూ వుంటే సిరి ఎద రగులుతూ తన అస్తిత్వాన్ని తానేభరించటం కష్టంగా వుంది.

          తనకంటూ ఓ ఓదార్పు కోసం, ఓ పలకరింపు కోసం, కన్నీరు తుడిచే ఓ చేయి కోసం, సేద తీర్చే ఓ భుజం కోసం, తల వాల్చే ఓ ఎద కోసం ఆమె తపించి పోయింది. వీధి మలుపు తిరిగొస్తూ తనవారైన ఎవరో కంటపడాలనుకోవటం, కనుచూపు మేరలో తనదైన ఏదో కనిపించాలనుకోవటం, ఒక పిలుపు కోసం, ఒక అలికిడి కోసం చెవులు తపించటం, ఒక పొందు కోసం ఒక తోడు కోసం దేహం అలమటించటం, మోయలేకపోతున్న వెలివేత భారమేదో ఒక్క పలకరింపుతో అంతమవ్వాలనుకోవటం అసలు పాపమెలా అవుతుంది.
ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయమా… పోనీ ఇప్పుడు తను నియమబద్ధంగా నిజాయితీగా ఒంటరి జీవితాన్ని ఈడిస్తే తన శీలాన్ని మెచ్చి శాలువాలుకప్పేదెవరు. విడాకులను క్షమించనివారు పునర్వివాహాన్ని సమర్థిస్తారనుకోవటం అవివేకమే.

          ఇంతటి ప్రతికూల మానసిక శారీరక వాతావరణంలో తన జీవితపు నావకు తానే చుక్కావిననుకుని దశా నిర్దేశం చేసుకుని ఒక రెండో వివాహపు మాట్రిమనీలో సిరి సూర్యాపేటలో తన పేరు నమోదు చేసుకుంది. ఇరవై ఏళ్ళ వంటరితనంతో బీడువారిన దేహాన్ని, ముప్పై ఏళ్ళుగా ప్రేమ కోసం అలమటిస్తున్న హృదయాన్ని ప్రేమజల్లుతో చమరింప చేసే ప్రయత్నంగా పరిణయానికి సిద్దమైంది సిరి.

          యాభై ఏళ్ళ వధువు కోసం బారులు తీరిన వరులను చూసి విస్మయానంద పడింది సిరి. తను నేర్చిన సైకాలజీ నైపుణ్యంతో అధికోత్సాహంతో ఇష్టపూర్వకంగా స్పందించిన పదిమంది నుండి ఓ నలుగురు వరులను ఫిల్టర్ చేసుకుంది. ఆ నలుగురితో నెల్లాళ్ళు చాటింగ్ చేసింది. ఆ నలుగురి నుండి తన వేవ్లెంత్ తో సరితూగ గల ఇరువురిని ఎంచు కుంది. ఒకరు హైదరాబాద్ రవి మరొకరు ఖమ్మం వాసు.

          ఆ ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరొకరితో గత మూడు మాసాలుగా మాటాడు తోంది. భార్యను కోల్పోయిన ఖమ్మంవాసి వాసు పెద్దమనిషి తరహాగా బాధ్యతాయుతంగా తోచాడు. అతనూ సిరిలాగే బడిపంతులు. తనకున్న ఒక్కగానొక్క కొడుకుని కూడా పరిచయం చేసాడు. అతని నియమబద్ధ జీవనంలో వాస్తవికత, మాటల్లో నిష్కల్మషత, అతనిలో నిజాయితీని ఆమెలో సైకాలజిస్ట్ గ్రహించింది. సిరి బుద్ధికి అతను బాగా నచ్చాడు.

          ఇక పెళ్ళయిన తొలిరాత్రే తను మరొకరిని ప్రేమించానన్న భార్యను, తాకనైనా తాకకుండా ఆమె కోరుకున్న ప్రియుడికిచ్చి భార్య వివాహం చేసిన హైదరాబాదు రవి వ్యక్తిత్వం అద్భుతంగా అనిపించింది సిరికి. ఏవో సినిమాల్లో చూసిన, నవలల్లో చదివిన కాల్పనిక కథానాయకుడిలా కనిపించాడతను. అతని మనసును మురిపించే మురిపాల కబుర్లు, నిద్దురను చెదరగొట్టే ముద్దు మాటలతో ప్రేమపిపాసి అయిన సిరి మనసుకి రవి మరింత నచ్చేసాడు.

          సిరిలో సైకాలజిస్ట్, లవర్ల మధ్య పెద్ద యుద్దమే జరిగింది.

          బుద్దా… మనసా… రెంటి మధ్య తూకం సమంగా తూగటంతో సిరి ఇరుకున పడింది. ప్రోస్ అండ్ కాన్స్లను బేరీజులేసుకున్నా ఒక నిర్ణయానికి రాలేకపోయింది.

          మరికొంత కాలం అలాగే ఫోన్ల మీద ఇద్దరితోనూకబుర్లు కొనసాగించింది. అక్కడికీ ఒకేసారి ఇద్దరితో ఒకే ధోరణి చాటింగ్ కి తన మనస్సాక్షి ఒప్పక, ఒకరి గురించి మరొకరికి నిజాయితీగా చెప్పింది. తన భవిష్యత్తుకి, జీవితానికి సంబంధించిన సమస్య అవటం, తన బంధువులను, పిల్లలను ఎదిరించి వేస్తున్న అడుగు కావటం వలన తను ఒక నిర్ణయానికి రావటానికి కొంత వ్యవధి కావాలని కోరింది ఇద్దరినీ. సిరితో పాటు వాళ్ళ జీవితాలూ ముడిపడి వుండటంతో సరేనన్నారువాళ్ళు.

          వాసు రోజూ ఉదయాన్నే శుభోదయం, పడుకోబోయే ముందు ఆ నాటి కాసిన్ని ముచ్చట్లు బాధ్యతగా చెబుతూంటాడు. రవి MNC ఉద్యోగి కావటం, అతనికేదో ఆర్ధిక సంవత్సరపు టార్గెట్ వుండటంతో బాగా బిజీగా వున్నానని వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే కాల్ చేస్తాడు. కాని ఆ కాల్ కోసం సిరి పిచ్చిది అయ్యేలా చేసే మనసైన చెలికాడతను.

          ఆ రోజున రవి కాల్ తో రససిద్ధిని పొందిన సిరి, ఇక ఈ మానసిక వ్యభిచారానికి చరమగీతం పాడేయాలనుకుని ఇద్దరినీ తనను కలవమని సూర్యాపేట రమ్మని ఆహ్వానించింది.

          యాభై ఏళ్ళ సిరి పాతికేళ్ళ పడుచయ్యింది. మనసు కన్నెమనసై అదుపాజ్ఞలు లేని ఊహల్లో కళ్ళెం లేని గుర్రంలా పరుగిడింది. తనను నచ్చి మెచ్చిన ఇద్దరు మనసైన రాజులు, తన జీవితపు కథానాయకులు, తనను చూడటానికి రాబోతున్నారు. ఎలాంటి మద్దతు లేని తనకు, తనను అంతగా అర్ధం చేసుకున్న ఇద్దరితో ఇలాంటి స్వయంవరం జరగటం ఎంత అదృష్టం. ఇలా ఎందరికి సాధ్యం అవుతుందసలు. తనకు యాభై ఏళ్ళ దురదృష్టకర జీవితం తరువాత అదృష్ట దశ మొదలవబోతోంది. ఆ అదృష్టాన్ని ఇష్టాను సారంగా ఎంచుకునే సౌకర్యం కూడా కలిగించి దేముడు తనకు చేసిన అన్యాయానికి పరిహారం చేసుకుంటున్నాడు. మంగుశని, పొంగుశని అంటూ విడతలు విడతలుగా సాగుతున్న ఏలినాటి శని నుండి తనకు విముక్తి కలిగిస్తున్నాడు.

          సిరికి తన అందం పట్ల అలంకరణ పైన శ్రద్ధ పెరిగింది. ఇప్పుడామె కాలు నేల పైన నిలవటం లేదు. మరో రెండు రోజుల్లో వాసు వస్తున్నాడు. వారంలో రవి వస్తాడు. సిరి ఎదురు చూపు భాష్యాన్ని దిద్దుకుంటూ క్షణాలు లెక్కిస్తోంది.

          నలభై ఎనిమిది గంటల్లో ఎన్ని నిముషాలో, ఆ నిముషాల్లో ఎన్ని క్షణాలో, ఒక్కో క్షణంలో ఎన్నేసి యుగాలో ఆ రెండు రోజుల్లో తెలిసింది సిరికి. మొత్తానికి కొన్ని యుగాల నిరీక్షణానంతరం ఆ క్షణం రానే వచ్చింది.

          వాసు డైరెక్ట్ గా సిరి పని చేస్తున్న బడికే వెళ్ళాడు. వీడియో కాల్ లో కనిపించినట్టు గానే బావున్నాడు. ఏవరేజ్హైటు, సాంప్రదాయబద్దమైన మొహం, కొద్దిగా నెరిసిన గడ్డం… వయసుకి తగినట్లే వున్నా చురుకుగా కనిపించాడు. సిరి మనసులో వెంటనే రవి మొహం మెదిలింది. అతను ఆరడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన మొహంతో వుంటాడు. మనసు బుద్దిని లొంగదీసుకుంటోంది.

          స్కూల్లో సిరి ప్రిన్సిపాల్కి, తన కొలీగ్ రమ్యకి వాసుని పరిచయం చేసింది. రమ్య విధవ. తనకున్న ఒక్కగానొక్క కూతురికి పెళ్ళి చేసి పంపేసింది. ఏ దిక్కూ లేని రమ్య ఒంటరిగా బ్రతుకుతోంది. మంచి మనిషి. సిరికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. తను ఏడాదిగా శ్రమపడి ఎంచిన వరుడువాసుని రమ్యతో పెళ్ళికి ఒప్పిస్తేనో…? అవును. వాసు చాలా శీలవంతుడు, రమ్య జీవితంలో వెలుగులు నింపుతాడు. తను తన మనసు కోరుకుంటున్న రవిని పెళ్ళాడవచ్చు.

          సిరి వెంటనే తన ఆలోచనను కార్యరూపంలో పెట్టే దిశగా ప్రయత్నాలు మొదలెట్టిం ది. రమ్య మొదట ససేమిరా కాదంది. క్రమంగా లొంగింది. వాసుతో మాట్లాడాక చివరకు ఒప్పుకుంది. వాసు మొదటి నుండి సిరి తనను ఒక ఆప్షన్ గా చెప్పటం వలన పెద్దగా షాక్ కి గురి కాలేదు. సిరి తనకి బదులుగా మరో సంబంధం సూచించినప్పటికీ, రమ్యసౌమ్యత, నిదానం నచ్చి సిరి సహృదయతకి మెచ్చి ధన్యవాదాలు చెప్పి అభినందించాడు. మరే ఇతర అడ్డంకులు లేని కారణంగా పది రోజుల్లో గుళ్ళో నిరాడంబరంగా పెళ్ళికిముహూర్తం పెట్టుకున్నారు.

          సిరికి చాలా సంతృప్తిగా వుంది. తను పెళ్ళి ధ్యాస లేని రమ్యకి పెళ్ళి పెద్ద అయి నందుకు, మంచి సంబంధం కుదిర్చినందుకు. సిరి మరో అయిదు రోజుల్లో నిజం కాబోయే తన కల గురించి కలల్లో విహరిస్తోంది. రవి మరుసటిరోజు రావలసి వుండగా ఆఫీసు వర్క్ లోడు ఎక్కువగా వుందని ఆ పై వారం వస్తానని ఫోను చేసాడు. ఒక్కసారిగా సిరి మనసు కుంగిపోయింది. వారం నిరీక్షణ సామాన్యమైనదేమీ కాదు.

          గంటలను చిల్లర మారిస్తే నిమిషాలవుతాయి… నిమిషాల్ని కూడబెడితే గంటలవు తాయి. దేశమేదయినా రోజుకు ఇరవై నాలుగు గంటలే వుంటాయి… కాని సిరికి రోజంతా ఎదురు చూపులే వున్నాయి. తన గడియారం కాలం చూపటం లేదు… ముళ్ళు కావలసినోడి కోసం తిరుగుతున్నాయి.

          “నాకు ఒళ్ళు వెచ్చబడి జ్వరం సోకింది. ఒక్కసారి నువ్వు వస్తే తగ్గిపోతుంది” అని మనోవ్యధతో సిరి రవిని కోరింది.

          అతను “అలా రాగలిగితే నీకు ఇదివరకు చెప్పిన ప్రకారమే కలిసేవాడినిగా.. సిరీ నా ఉద్యోగ పద్ధతులకు నువ్వు అలవాటు పడాలి. లేకపోతే మన సంసారం సుఖంగా సాగదు” అంటూ నచ్చచెప్పాడు.

          “అంటే రేపు మన పెళ్ళయ్యాక నేను చనిపోయి నీకు కబురందినా, నా ఉద్యోగం అనుమతించదు. శవాన్ని భద్రం చేసి వుంచమంటావా” అంటూ అలకతో ఆర్ద్రంగా అడిగింది.

          “పెళ్ళయ్యాక మనమిద్దరం దూరంగా ఎందుకుంటాం డార్లింగ్.. ఒకే ఇంట్లో వుంటాం గా.. వుండు నీ జ్వరానికి ఇక్కడి నుండే మందు వేస్తా” అంటూ ఫోనులో రవి ముద్దులు ఇవ్వసాగాడు.

          అనారోగ్యంలో ఒకింత ఒంటరితనంతో సిరి నిరుత్సాహంగా వున్నా, రవి ఒక్కో ముద్దూ ఒక్కో చోటంటూ తన శరీర భాగాలన్నీ ఫోనులో ఏకరువు పెడుతూ ముద్దుల వర్షం కురిపిస్తుంటే సిగ్గుల మొగ్గయి రగ్గులో ముడుచుకుని ఫోనుని గుండెలకదుముకుని పడుకుంది.

          మరో వారం భారంగా గడిచింది. కళ్ళ పై అరచెయ్యిమంచె వేసి వాన చినుకు జాడ కోసం ఆకాశం వంక ఆశగా చూస్తాడు రైతన్న… గూళ్ళు కడుతూ కాకులరుస్తుంటే కాలం కాదని, మబ్బు ముసిరే ఛాయలుంటే వానొస్తుందని సంకేతం. సిరి ఎదురుచూపుల నోమూ అలాగే వుంది. కానీ తనకు మాత్రం ఏ వర్ష సంకేతాలు కానరావట్లేదు.

          అతడోస్తానన్న వారం రవి మామూలుగానే ఉదయించాడు కాని తన రవి రాకుండానే నింగిలో రవి అస్తమించాడు. రవికి ఫోను చేస్తే స్విచాఫ్అని చెబుతోంది. ఉప్పెనలా ముంచేసిన దిగులులో దిగాలుబడిన సిరి ఫోను ఆ నిశిరాతిరి మోగింది. అవతల రవి కంఠం వినగానే సిరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయ్యింది.

          “హలో రవీ, ఏమయిపోయావు… ప్రోద్దుటి నుండి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా…”  దాదాపుగా ఏడుపు గొంతుతో అడిగింది సిరి.

          “సిరీ, నీ దగ్గరకే సూర్యాపేట వస్తూ, నీ ఆలోచనలలో పడి కారు ఏక్సిడెంట్ చేసాను. పొరపాటు నాదే.. ఆ మాటకొస్తే క్షణం వదలకుండా నా ఆలోచనలలోకి వచ్చే నీదే తప్పంతా. పోలీసు కేసయితే కష్టమవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళతారని అక్కడి కొందరిని ప్రాధేయపడి హైదరాబాద్ యశోదలో అడ్మిట్ చేయమ న్నాను. ఈ ఏక్సిడెంట్లో నా వాలెట్ మిస్ అయ్యింది. గందరగోళంలో నీకు వెంటనే సమాచారం ఇయ్యలేకపోయాను. సారీరా”

          అతని మాటలు పూర్తి కాకముందే సిరి “నేనిప్పుడే బయిలుదేరి వస్తాను” అంది ఏడుస్తూ.

          “వద్దురా, నువ్వు ఇప్పుడు ఈ వేళప్పుడు బయిల్దేరవద్దు. చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చరయ్యింది కాలుకి. ఈ ప్రైవేటు ఆసుపత్రుల సంగతి తెలిసిందేగా. ముందుగా రెండు లక్షలు డిపాజిట్ కట్టమంటున్నారు. కార్డ్స్ అన్నీ వాలెట్ లో వుండిపోయాయి. నాకు ఇన్సూరెన్స్ వుంది. ఈ పళంగా ఏం చేయాలో అర్ధం కావటంలేదు. నిన్ను అడగ టానికి మొహమాటంగా వుంది. ఒక రెండు లక్షలు గూగుల్ పే చేస్తావా. రేపు ఈపాటికల్లా తిరిగి ఇచ్చేస్తా..” బిడియంగా మొహమాటపడుతూ అడిగాడు రవి.

          “నన్ను అడగటానికి మొహమాటం దేనికి రవీ.. నువ్వు నావాడివైనప్పుడు నీ కోసం నేను ఆ మాత్రం ఖర్చు చేయనా… అవసరమైతే ప్రాణమైనా ఇస్తాను” స్పీకర్లో మాటాడు తూనే గూగుల్ పే నుండి లక్షా, ఫోన్ పే నుండి లక్షా… రెండు లక్షలు రవికి పంపేసింది సిరి.

          “థాంక్స్ సిరీ, అడ్మిషన్ అయ్యాక ఉదయం కాల్ చేస్తా.. నువ్వు ప్రశాంతంగా పడుకో” అంటూ ఫోన్ పెట్టేసాడు రవి.

          వేకువ కోసం వేచిన సిరి లేచిన క్షణం నుండీ రవి ఫోను కోసం ప్రయత్నిస్తూనే వుంది. అసలు అంతటితో ఆ సిమ్ జన్మ సార్ధకం అయి అది మురికి కాలువ పాలయ్యిం దని సిరి మనసు ఎప్పటికీ అంగీకరించదు.

*****

Please follow and like us:

One thought on “వాన తడపని నేల (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. సైకాలజీ చదువుకున్న సిరి అన్ని రోజుల స్నేహంలో రవి మనస్త త్వం తెలుసుకోలేక పోవడం, దరిచేరిన స్నేహితుడిని మితృరాలి కోసం త్యాగం చేయడం. తన స్వా ర్ధం కోసం సిరి ఇద్దరు మగాళ్లతో ఆడు కోవడం చదవడానికీ, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా, ఓహో…ఇలాంటి స్త్రీలు కూడా వుంటారా?
    ఇలా కూడా జరుగుతుందా అనిపించక తప్పదు.రచయిత్రి కధను వివరించిన విధానం బాగుంది.

Leave a Reply

Your email address will not be published.