వ్యాధితో పోరాటం-25

కనకదుర్గ

          మొత్తానికి మా ట్రిప్ ముగించుకుని వచ్చాము. వారం రోజులు వెళ్ళివచ్చే వరకు బాగా అలసిపోయాను. శ్రీనివాస్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. నేను పడుకుని నిద్రపోయాను. శ్రీనివాస్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను లేచి స్నానం చేసి రమ్మని నేను వచ్చేవరకు వేడి వేడి నూడుల్స్ చేసి పెట్టాడు. “నీకు అన్నం తినాలన్పించకపోతే కొద్ది కొద్దిగా ఇలాంటివి తింటూ వుండు, కొద్దిగానయినా శక్తి వుంటుంది.” అంటూ ఒక బౌల్ లో నూడుల్స్, స్పూన్ వేసి ఇచ్చాడు. తను కూడా ఒక బౌల్ తెచ్చుకుని కూర్చున్నాడు. ఇద్దరం కల్సి తిన్నాం.

          నేను చాలా మెల్లిగా తిన్నా కూడా తను కూర్చొన్నాడు. నేను తిన్నాక బౌల్ తీసి లోపల పెట్టి, “సాయంత్రం త్వరగా వస్తాను, 10 నిమిషాల దూరంలోనే ఒక నర్సింగ్ హోం వుంది. అక్కడ డా. శాంత, గైనకాలజిస్ట్ ఉంది, ఆమెకి చూపించుకుని వద్దాం. సరేనా.” అని కాసేపు కూర్చొని వెళ్ళాడు ఆఫీస్ కి. మళ్ళీ సాయంత్రం శ్రీనివాస్ వచ్చి లేపే వరకు నేను లేవలేదు. అంత నిద్ర, నీరసం ఎలా వస్తుందో అర్ధం కాలేదు నాకు.

          డా. శాంత అన్ని చెక్ చేసి అన్నీ బాగున్నాయి అని బ్లడ్ టెస్ట్ ఒకటి మళ్ళీ నెల వచ్చినపుడు చేయించుకుని రమ్మని చెప్పింది. మూడ్నెల్ల వరకు వేవిళ్ళు అస్సలు ఆగలేదు. ఆ తర్వాత మెల్లిగా తగ్గాక లేచి ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం, ఓపిక కూడ దీసుకుని సాయంత్రం కాలేజ్ కి వెళ్ళడం మొదలు పెట్టాను. అక్కడ శారద అనే అమ్మాయి పరిచయం అయ్యింది. తనకి పెళ్ళయ్యింది, ఒక బాబు కూడా ఉన్నాడు. మేమిద్దరం కల్సి కూర్చొనేవాళ్ళం. తన భర్త కూడా ఆఫీస్ నుండి శారదను తీసుకెళ్ళ డానికి వచ్చేవాడు. శ్రీని, అతను ఒకే దగ్గర కూర్చునే వారు. వాళ్ళకి పెళ్ళయి 6 ఏళ్ళయ్యిందని, శారద ఉస్మానియా యునివర్సిటీ లైబ్రరీలో పని చేస్తుందని, రాయడం అంటే ఇష్టమని కానీ తనకి శారద ఉద్యోగం చేయడం, జర్నలిజం చేయడం ఇష్టం లేదని చెప్పేవాడు. 

          నేను నా ప్రాజెక్ట్ వర్క్ కోసం ” జంటనగరాల్లో బాలకార్మికులు,” అనే విషయం పై నేను పని చేస్తున్నపుడు శారదే నాకు సాయం చేసింది.  నాకు కావాల్సిన సమాచారం ఉస్మానియా యునివర్సిటీ లైబ్రరీ నుండి తీసుకున్నాను. బాల కార్మికులు పని చేసే ప్రదేశాలకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు అంత చిన్న వయసులో ఎందుకు పని చేయాల్సి వచ్చింది, వాళ్ళకి పొద్దున్నుండి రాత్రి దాక పని చేస్తే ఎంత జీతాలిస్తారు, ఇంట్లో ఎంత మంది ఉంటారు, వీళ్ళ తక్కువ జీతం ఇంటి వాళ్ళకి సరిపోతుందా? ఊళ్ళ నుండి పారిపోయి వచ్చిన 6 ఏళ్ళ బాబు, 3 ఏళ్ళ బాబుతో మాట్లాడితే, ” మా నాన్న రోజు తాగి ఇంటికి వచ్చి అమ్మని, మమ్మల్నందరిని చచ్చేట్టు కొట్టేవాడండీ!”

          “మీకింకా ఎంత మంది అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారు?”

          “మేమందరం ఎనిమిది మందిమి అక్కా! ఒకరోజు మా యమ్మ మా బట్టలన్నీ సర్ధి మూట కట్టి, మా అందరికీ గంజి పోసి, తనూ కొంచెం తాగింది, నాన్న వచ్చే లోపల మమ్మల్నందరిని తీసుకుని మా తాత కాడికి వెళ్ళాలని. కానీ మా అయ్యకి ఎట్టా తెలిసిందో ఏమో కానీ రాగానే గుడిసె బయట నుండి తలుపుకి తాళం వేసి గ్యాస్ నూనె పోసి తగలబెట్టాడు. నేను మా తమ్ముడిని తీసుకుని వెనకాతల గుడిసె చిరిగిపోయి వుంటే ఆడి నుండి పారిపోతుంటే మా అయ్య మా కోసం పరిగెత్తుకొత్తున్నాడని మా మావ మా ఇద్దరిని ఎత్తుకుని హైద్రాబాద్ బస్ ఎక్కించాడు. రోడ్డు మీద అడుక్కుని తింటుంటే ఈ షెల్టర్ సార్ ఇక్కడికి తీసుకొచ్చారు. మాకు తిండి పెడతారు, ఇక్కడే పడుకుంటాం అక్కా!” నా గుండెలో పట్టి కుదిపేసినట్టయ్యింది.

          నాకున్నవే సమస్యలని ఓ బాధపడ్తుంటాను. ఇదేంటీ? వీళ్ళ బ్రతుకులేమవుతాయి. చిన్న చిన్న పిల్లలు హాయిగా ఆడుతూ పాడుతూ, బడికి వెళ్ళి చదువుకుంటూ, అమ్మా, నాన్నల ప్రేమను పొందుతూ చక్కగా ఎదగవలసిన చిన్నారుల భవిష్యత్తు ఏమిటి?  సమాజంలో వున్న గొప్పా, తక్కువ తేడాలు, పెద్ద కులం, చిన్న కులం తేడాలు, మతాలనేవి లేకుండా సమ సమాజం ఏర్పడినప్పుడే ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు దొరికేది.

          ఎలాగో అలా జర్నలిజం క్లాసెస్ అయిపోయాయి. నా పొట్ట పెరగటం చూసినప్ప ట్నుండి కొంతమంది సో కాల్డ్ హై సొసైటీ అమ్మాయిలు నా వెనక, నా ముందు కూడా మాట్లాడుకోసాగారు. ఒకమ్మాయయితే ఇంకా లెక్చరర్ రాకమునుపు అందరం కబుర్లు చెప్పుకుంటుంటే సడన్ గా నా ముందుకు వచ్చి, ” వాటీజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ షర్మీలా, ఐ వర్క్ ఇన్ న్యూస్ టైం, న్యూస్ పేపర్ యాజ్ ఏ రిపోర్టర్,” అని షేక్ హ్యాండిచ్చింది. అప్పటి వరకు మాతో ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళ గ్రూపంతా వేరేనే, గ్లామరస్ బట్టలు వేసుకుంటారు, ఫర్ ఫ్యూమ్ లు, మేకప్, హై హీల్స్, గాగుల్స్, ఎప్పుడూ ఇంగ్లీష్ లోనే సంభాషణ. అస్సలు ఏ సమస్యలు లేనట్టు వుంటారు.

          “వియ్ డిడ్ నాట్ సీ యూ ఫర్ 1 ఆర్ 2 మంత్స్. వాట్ హాపెండ్? ఆర్యూ ఓకే?” అని అడిగింది.

          ” ఐ యామ్ ఓకే. సంథింగ్ హాపెండ్ దట్స్ వై ఐ కుడ్ నాట్ కమ్.”

          ” ఆర్యూ ఓకే నౌ?”

          “ఎస్.”

          అప్పటికి ఇంకా మూడో నెల నిండింది అంతే.

          “బట్ యూ లుక్ డిఫరెంట్. యూ ఆర్ ఆల్రెడీ సో స్లిమ్. డిడ్ యూ లూజ్ వేయిట్?”

          ” మేబీ జస్ట్ ఏ లిటిల్ బిట్… నాట్ మచ్.”

          ” హౌ ఈజ్ యువర్ హబ్బీ?”

          ” హీ ఈజ్ ఫైన్? వై?”

          ” నో జస్ట్ లైక్ దట్. యూ బోత్ ఆర్ ఏ క్యూట్ కపుల్, యూ నో?”

          ” థాంక్స్?”

          కొంచెం దగ్గరగా వచ్చి, ” సో వాట్ డిడ్ యూ టూ డూ ఎవ్విరీ నైట్ మై డియర్?” కాస్త గట్టిగానే అడిగింది.

          అప్పటివరకు అంతగా పట్టించుకోని స్టూడెంట్స్ కూడా ఇటు వైపు తిరిగి ఆసక్తిగా వినసాగారు.

          శారద నా చెయ్యి పట్టుకుని, “నువ్వేం మాట్లాడకు, ఆమె పిచ్చి ప్రశ్నలకు నువ్వు సమాధానాలివ్వక్కర్లేదు.” అన్నది.

          నాకు షర్మీలా మాట్లాడే తీరు నచ్చకున్నా, గొడవ ఎందుకులే అని ఊరుకున్నా.

          స్టూడెంట్స్ నుండి కొంచెం కుదురుగా ఉండే ఒకతను ముందుకొచ్చి, “షర్మీలా దట్స్ నాట్ నైస్. యు కెన్ నాట్ ఆస్క్ హర్ పర్సనల్ క్వశ్చన్స్.” అన్నాడు.

          “నువ్వు ఇన్ని రోజులెందుకు రాలేదని, ’ఈజ్ షి ప్రెగ్నెంట్? షి ఈజ్ వెరీ యంగ్, వై డూ యు మిడిల్ క్లాస్ పీపుల్ బికం మదర్స్ సో సూన్’ అని అడగడమే. నేనేం చెప్పలేదు. నాకు తెలీదని చెప్పాను. అయినా వీళ్ళకెందుకో మన సంగతులు,” అంది శారద.

          చాలా చిరాకేసింది నాకు. క్లాస్ నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను. వాళ్ళ గురించి నేనెందుకు వెళ్ళాలి? నాకు ఈ కోర్స్ పూర్తి చేయాలని వుంది. తప్పకుండా చేస్తాను.

          మిస్ అయిన క్లాసెస్ కు మెడికల్ సర్టిఫికెట్ పెట్టి మళ్ళీ క్లాసెస్ అటెండ్ కావడానికి పర్మిషన్ ఇమ్మంటే ఇచ్చారు, ప్రిన్సిపల్ గారు.

          ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసేసాను. ఆ రెండ్నెల్లు క్లాసెస్ మిస్ కాకపోతే అన్నీ ఎసైన్మెం ట్స్ సరిగ్గా చేసి వుంటే ఇంకా మంచి మార్క్స్ తో పాసయ్యేదాన్ని.

          ఎనిమిదో నెల నిండాక తొమ్మిదో నెల అమ్మ ఇంటికి వెళ్ళాను. శ్రీనివాస్ వచ్చి దిగబెట్టి శని, ఆదివారాలు ఉండి వెళ్ళాడు. అత్తగారింట్లో ఉన్నని రోజులు తను చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు చాలా  నిశ్శబ్దంగా అయిపోయేవాడు. ఎందుకు అంత బాధ పడడం, నేనెపుడు వాగుతూనే వుంటాను. తన మనసులో ఏం జరుగుతుందో నాతో చెప్పొచ్చు కదా!

          ఎప్రిల్ చివరిలో అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. మే లో జర్నలిజం పరీక్షలయ్యాయి. రేపు పరీక్ష వుంటే ముందు రోజు సాయంత్రం శ్రీనివాస్ వచ్చేవాడు. నాకేదన్నా అర్ధం కాకుంటే చదివి చెప్పేవాడు. పరీక్షలకు తీసుకెళ్ళేవాడు. ఎండాకాలం, ఎక్కువ తినలేక పోయేదాన్ని అందుకని గ్లూకోజ్ నీళ్ళు తీసుకెళ్ళేదాన్ని. పరీక్షకి, పరీక్షకి 2-3 రోజులు గ్యాప్ వచ్చేది. అలాగే పరీక్షలు రాసేసాను. శ్రీనివాస్ వీకెండ్లో వచ్చి సోమవారం పొద్దునే వెళ్ళేవాడు. తను రానప్పుడు అనుకునేదాన్ని, పోనీలే నేనుంటే తనకి చాలా వర్రీగా వుంటుంది. కొన్ని రోజులైనా కొంచెం ప్రశాంతంగా వాళ్ళందరితో సంతోషంగా వుంటాడని పించేది.

          జూన్ మొదటివారంలో డెలివరీ డేట్ ఇచ్చారు. మా కాలనీలో వుండే ఒక గైనకాలజిస్ట్, డా. రేఖా దగ్గరకి వెళ్ళాం. ఆమె చాలా రోజులుగా మాకు తెల్సు. మా వదిన ఇక్కడ వున్నన్ని రోజులు ఆమె దగ్గర చూపించుకునేది, డెలివరీలకు మాత్రం వాళ్ళ పుట్టిల్లు భద్రాచలంకి వెళ్ళేది. నేను కాలేజ్ లో వున్నపుడు కూడా ఏదో చిన్న ప్రాబ్లెం వస్తే ఆవిడే ట్రీట్మెంట్ ఇచ్చింది.  వారం వారం వెళ్ళి చూపించుకుని వచ్చేవారం. ఒకోసారి అమ్మ వచ్చేది, ఒకోసారి శ్రీనివాస్ వచ్చేవాడు.  ఒకరాత్రి సడన్ గా బ్లీడింగ్ మొదలయ్యిం ది, హాస్పిటల్ కి వెళితే  సాయంత్రం వరకు వుంచుకుని అబ్జర్వ్ చేసారు. మెల్లిగా బ్లీడింగ్ ఆగిపోయింది. దాంతో ఫాల్స్ అలార్మ్ అని పంపించేసారు. 10 రోజుల్లో నొప్పులు మొదలవ్వకపోతే ఇండ్యూస్ చేద్దామని అన్నది డాక్టర్. ఇండ్యూస్ అంటే నొప్పులు రావడానికి మందిస్తారు కాసేపు కాగానే నొప్పులు మొదలవుతాయి, డెలివరీ ఈజీగా అయిపోతుందనుకున్నాను.

          రెండు వారాల తర్వాత మమతా నర్సింగ్ హోంలో జాయిన్ అయ్యాను. కాసేపటికి డాక్టర్ వచ్చి చూసి, “ఇదేంటమ్మా మీ పాపో, బాబో ఇంకా ఎన్ని రోజులు లోపల వుండాల నుకుంటున్నారో? ఈ రోజో, రేపో బయటకు తీసుకువచ్చేద్దాం. నువ్వున్నది ఇంత సన్నగా, నేను త్వరగా అయిపోతుందనుకున్నాను. మందు మొదలుపెడ్తారు. నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. నొప్పులు ఎప్పుడు ఎక్కువయితే అపుడే నన్ను పిలుస్తారు, నేనొచ్చి డెలివరీ చేసేస్తాను. సరేనా! కొన్ని గంటల్లో నువ్వు అమ్మవు అయిపోతావు. సరేనా!” అని చెప్పి, అమ్మతో మాట్లాడి, బయట శ్రీనివాస్ కి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళింది.

          డ్రిప్ పెట్టారు. సాయంత్రం వరకు ఏం జరగలేదు. సాయంత్రం తర్వాత మెల్లి మెల్లిగా నొప్పులు రావడం మొదలు పెట్టాయి. రాత్రి వరకు అందరు వచ్చి వెళ్తున్నారు కాబట్టి నాకంతగా తెలియలేదు. శ్రీనివాస్ కి అమ్మ చెప్పింది, డెలివరీ అయ్యాక ఫోన్ చేస్తాం అప్పుడు మీ తల్లిదండ్రులను తీసుకుని రావొచ్చని. కానీ శ్రీనివాస్ ని ఆపే వాళ్ళు ఎవరు.

          నొప్పులు మొదలయి రాత్రంతా ఆ నొప్పులకి తట్టుకోలేక అరుస్తూనే వున్నాను. అప్పట్లో నొప్పులు తెలియకుండా మందులిచ్చేవారు కాదేమో. తెల్లవార్లు ఏడుస్తూనే వున్నాను. అమ్మ వెళ్ళి ఆయమ్మకి పదిసార్లు చెబితే ఒకసారి వెళ్ళి పైనే ఇల్లున్న డాక్టర్ సలీమాను పిలుచుకొచ్చింది. ఆమె వచ్చి బేబి హార్ట్ బీట్ విని, క్రిందకి జారుతుందా లేదా అని చూసి..

          “అంతా బాగుందమ్మా! నొప్పులు ఎక్కువయితే వెంటనే డాక్టర్.రేఖా కి కాల్ చేస్తాం ఆమె వచ్చి డెలివరీ చేస్తుంది.”

          “ఈ రాత్రయినా వస్తుందా?” అని అడిగా. “వస్తుందమ్మా! నీ కోసమే ఆమె ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే వుంది. నీ డెలివరీ అయ్యేదాక ఎక్కడికి వెళ్ళదు సరేనా?” అని చెప్పేసి వెళ్ళిపోయింది.

          2 గంటలయ్యింది రాత్రి, అమ్మ నన్ను చూస్తూ, నా కాళ్ళు రాస్తూ, చేతులు రాస్తూ కాస్తయినా కామ్ డౌన్ అవుతానేమో అని. పెద్ద నొప్పి వచ్చినప్పుడు గట్టిగా అరిచి ఏడ్చేదాన్ని. అమ్మ మళ్ళి ఆ ఆయమ్మ దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఒకసారి డాక్టరమ్మని పిలవమంటే, “ఏందమ్మా ఊరికే పిలువు, పిలువంటవ్. ఆళ్ళు పడుకున్నరు. అయినా పిల్లలున్నదానివి, ఆళ్ళని కన్నదానివి, అన్ని మరిసిపోయినావమ్మా? కానుపు అంటే ఏటిది, ఎంత కష్టపడితే పిల్లలు బయటికి వొస్తరనే సంగతులన్నీ మరిసినావమ్మా!” అనుకుంటూ బేబి హార్ట్ బీట్ వినే గొట్టాం తీసుకొచ్చి పొట్ట మీద పెట్టి విని, ” చూస్తుంటే మగపిల్లగాడులాగ అనిపిస్తుండు. గుండెకాయ మంచిగ కొట్టుకుంటుంది. నువ్వు కూడా కొంచెం సేపు నువ్వు కూడా పడుకోవే యమ్మా!” అని అమ్మకి చెప్పి వెళ్ళిపోయింది. నాకు నొప్పుల బాధ, తల్లయిన తర్వాత ఆ యింట్లో నా పరిస్థితి ఏంటి? బేబి సంతోషంగా పెరుగుతుందా/తాడా? నేననుకున్నవన్నీ మట్టిపాలేనా. ఎన్ని పనులు చేయాలను కున్నాను. ఈ డాక్టర్ రావటం లేదు. అసలు బిడ్డ బయటకు రాకపోతే ఏం చేయాలి? ఈ ఆలోచనలతో చాలా చికాకుగా అయిపోయింది. శరీరం, మనసు పూర్తిగా అలసిపోయి వున్నాయి. పాపం శ్రీనివాస్ కూడా నా బాధ చూడలేక మధ్య మధ్యలో వెళ్ళి డాక్టర్ ఇంటికి ఫోన్ చేసి ఆమెని రమ్మని అడిగాడు. ఆమె విసుక్కోకుండా, “నొప్పులెక్కువవ్వగానే వచ్చేస్తాను. ఫస్ట్ టైం కదా ఒకోసారి కొంచెం లేట్ అవుతుంది. కంగారు పడకండి!” అని చెప్పి ఫోన్ పెట్టేయసాగింది.

          తెల్లవార్లు నొప్పులతో అవస్థ పడుతూనే వున్నాను. తెల్లవారుఝామున డాక్టర్ రేఖా వచ్చేసింది ఇంక కొన్ని నిమిషాల్లో కాన్పు చేసేస్తుంది అని అమ్మ చెప్పింది. నేను కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు చీరతోనే వున్నాను, బాత్రూంకి వెళ్ళాలంటే విసుగొచ్చింది ఆ చీరతో. డాక్టర్ రాగానే అవన్నీ తీసి పడేసి ఒక గౌన్ వేసి డెలివరీ రూంలోకి తీసుకెళ్ళారు. డా.రేఖా, “ఏమ్మా చాలా అవస్థ పడ్డట్టున్నావు, పాపం మీ ఆయన నాకు ఫోన్ చేస్తూనే వున్నాడు.”

          “ఇపుడు అంతా బాగుంది. నువ్వు మూడే మూడుసార్లు ఊపిరి గట్టిగా పీల్చుకొని, ఊపిరి వదిలి గట్టిగా ముక్కాలి. నేను చెప్పినపుడు చేయాలి సరేనా?”

          “సరే” అన్నాను.

          రెండుసార్లు ఆమె చెప్పినట్టుగానే చేసాను. మూడోసారికి ఊపిరి తీసుకోవడం తీసుకున్నా కానీ వదిలేసి గట్టిగా ముక్కలేక పోయాను. ఆమె వెంటనే ఫోర్ సెప్స్ వేసి త్వరగా బిడ్డని బయటకు లాగేసింది. బాబు, డా. రేఖా కూడా అప్పటికి 8 నెల్ల గర్భిణి. బాబుని జాగ్రత్తగా లాగేవరకు ఆమెకి చెమట్లు వచ్చేసాయట. బాబుని మా వదిన ఎత్తుకుని దగ్గరగా తీసుకొచ్చి “ఎంత బాగున్నాడో చూడు చిన్ని!” చాలా హెల్దీగా ఉన్నాడు. వాడు ఆవలించగానే రెండు బుగ్గల్లో సొట్టలు కనిపించాయి. “బుగ్గల్లో సొట్టలున్నాయి చూడమ్మా.” అన్నాను అమ్మ నా పక్కన వచ్చి నిలబడింది. అమ్మ డాక్టర్ ని, ” తేలికగా అయిందామ్మా?”

          ” ఎక్కడమ్మా ఆఖరి నిమిషంలో ఊపిరి వదలాల్సింది పీల్చుకుంటుంటే లోపలికి వెళ్ళిపోతానంటాడు మీ మనవడు, వెంటనే ఫోర్ సెప్స్ వేసి లాగాను. పిల్ల చూడడానికి చిన్నగా, సన్నగా వున్నా బాబు చక్కగా, ఆరోగ్యంగా మంచి బరువుతో పుట్టాడు. నేననుకునే దాన్ని, ఈ పిల్ల ఇంత వీక్ గా వుంది, పుట్టే బిడ్డ ఎంత సన్నగా వుంటుందో అని, కానీ నా అంచనాలన్నీ తారుమారు చేసింది. కొన్ని కుట్లు పడ్తాయమ్మ! బాగా అల్సిపోయి వుంది కదా!” తర్వాత అందరినీ బయటకు పంపించేసి ఆమె, డాక్టర్ సలీమా కల్సి కొన్ని కుట్లు వేస్తూ ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకోసాగారు.

          “సలీమా, ఈ అమ్మాయిని నేను చిన్నప్పట్నుండి చూస్తున్నాను. డిగ్రీ కాగానే పెళ్ళి, పెళ్ళి కాగానే పిల్లలు. ఏం దుర్గా, ఎందుకంత తొందర? నా దగ్గరకొస్తే ఏదన్నా సజెస్ట్ చేసేదాన్ని కదా!”

          “నాకు ఏమి పడలేదు రేఖా అక్కా! అందుకే నేనేమి వాడలేక పోయాను.”

          “మీ ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం లాగ ఉందే, రాత్రంతా ఫోన్ చేస్తూనే వున్నాడు. ఎంత కంగారు పడిపొయాడో పాపం!” అంది నవ్వుతూ డా.రేఖా.

          నాకు తల తిరుగుతూ ఉంది, లేచి సడన్ గా అక్కడి నుండి పారిపోవాలనిపించింది. వాళ్ళిద్దరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ డెలివరీ తర్వాత చేసే పనులన్నీ చేసి, కుట్లేస్తున్నారు. నాకేమో ఎపుడెపుడు అయిపోతుందా, అక్కడినుండి పారిపోవాలని వుంది. బ్లడ్ చాలా పోయింది, చాలా నీరసంగా వుంది అని ఇద్దరు డాక్టర్లు అనుకుం టుంటే విన్నాను.

          “దుర్గా, మీ ఆయన నిన్ను బాగా గారాం చేస్తాడు కదా!” అని దగ్గరకు వచ్చి అడిగింది డా.రేఖా.

          ఆ బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. అవున్నాను. ఈమె డా. సలీమాని పిలిచి,”నేనిప్పుడే తనని మీ ఆయన నిన్ను గారాం చేస్తారు కదా! అంటే, అవునన్నది.” అని చెప్పి ఇద్దరూ నవ్వుకున్నారు.

          నర్స్ ని, ఆయాని పిలిచి ఏం చేయాలో చెప్పి డా.రేఖా వెళ్ళిపోయింది.

          నా గౌన్ మార్చి క్లీన్ చేసి మెల్లిగా క్రిందకి దింపి నడపడానికి ప్రయత్నం చేసారు ఆయా, నర్స్. కుప్పకూలిపోయాను.

          “వీక్ గా వుంటే చెప్పొచ్చు కదమ్మా! వీల్ చేయిర్లో తీసుకెళ్ళేవాళ్ళం,” నర్స్ అంటుంటే ఆయమ్మ వీల్ చేయిర్ తెచ్చి నన్ను లేపి అందులో కూర్చోబెట్టారు.

          కళ్ళముందు బైర్లు కమ్మాయి. ఎక్కడలేని పిచ్చి కోపం వచ్చేసింది. శ్రీనివాస్ బాబుని ఎత్తుకుని దగ్గరకు రావడానికి ప్రయత్నం చేసాడు. (ఇపుడు నేను రాసేదంతా నాకు గుర్తు లేదు

          నేను తెలివిలోకి వచ్చాక మా అమ్మ, అన్న, వదిన ఏం జరిగిందో చెప్పారు.)

          “వద్దు, వద్దు నా దగ్గరకి రావొద్దు. నాకెవ్వరక్కర్లేదు. బాబొద్దు, నువ్వొద్దు, వెళ్ళిపో!” అని గట్టిగా అరుస్తూ తెలివి తప్పానట.

          ఒక రోజు మొత్తం నొప్పులు భరించి శరీరం, మెదడు బాగా అలసిపోయాయి. అదీ కాక బ్లీడింగ్ ఎక్కువయింది, హార్మోన్స్ లో మార్పులు జరగడంతో ఒకోసారి ఇలా జరుగు తుంటుంది కొంతమంది తల్లులకు. పాపో, బాబో పుట్టాక ఎలా పెంచుతాము, ఎలా వుంటాము, నేను బిడ్డను పెంచగలనా, లేదా, ఇంట్లో పరిస్థితులు బాగా లేక డెలివరీకి ముందు వూరికే డెలివరీ తర్వాత ఎలా అని అదే పనిగా ఆలోచిస్తుంటే, మనసు పై ప్రభావం చూపుతుంది, వీక్ నెస్ లో మానసిక ధైర్యం సడలిపోయి “బేబి బ్లూస్,” “పోస్ట్ పార్టం డిప్రెషన్,” “పోస్ట్ పార్టం సైకోసిస్,”  “పోస్ట్పార్ట్ం యాంగ్జాయిటీ,” లాంటివి వస్తాయి.

          శ్రీనివాస్ మనసు దెబ్బతిన్నది. బాబుని, తనని చూసి సంతోషపడ్తుందనుకుంటే అందరి ముందు తనని దగ్గరకే రావొద్దని అనడంతో చాలా బాధ పడ్దాడు. డా.రేఖాకి ఫోన్ చేసి పరిస్థితి చెబితే తను వేరే దగ్గర డెలివరీ చేయడానికి వెళ్తున్నానని, డా.సలీమాకి పేషంట్ కామ్ డౌన్ అయి నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇమ్మని చెప్పి, ఎవ్వరూ సాయంత్రం వరకు డిస్టర్భ్ చేయొద్దని బాగా నిద్రపోవాలని చెప్పిందట.

          తినే ఓపిక లేదని ఓ రెండు గ్లాసుల పాలు ఇచ్చారు, కొద్దిగా కళ్ళు తెరిస్తే తాగించి, ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. 

          పొద్దున్నే 7-15 కి వాడు పుడితే రూమ్ కి వచ్చి గందరగోళం అంతా సద్దుమణిగి నేను పడుకునేవరకు 10.30-11 గంటలయ్యి ఉంటుంది.

          సాయంత్రం లేచాక ఏదో వేరే లోకంలో వున్నట్టనిపించింది. మెల్లిగా బాబు, శ్రీనివాస్, అమ్మ కోసం చూసాను. అమ్మ ఒకతే కూర్చీలో కూర్చుని ఉంది.

          “అమ్మా, బాబు, శ్రీనివాస్ ఏరి?’ అని అడిగా.

          “లేచావా తల్లీ, బయట కూర్చుని వున్నారు పిలుస్తాను.” అని పిలిచుకొచ్చింది.

          శ్రీనివాస్ రావడానికి భయపడుతూ వచ్చాడు. బాబుని చేతుల్లోకి తీసుకోవడానికి లేచి కూర్చున్నాను.

          డెలివరీ రూమ్ లో జరిగింది గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు.

          బాబుకి పాలివ్వాలి కదా! అని గుర్తొచ్చింది. కానీ పాలు పడడానికి టైం పడుతుంది. బాబు గులాబీ రంగులో బుగ్గల్లో సొట్టలతో ముద్దొస్తున్నాడు.

          డా.రేఖా అన్న మాటలు గుర్తొచ్చాయి. “నువ్వింత సన్నగా, చిన్నగా వుంటే చాలా చిన్న బేబి పుడతుందనుకున్నా, ఇంత ఆరోగ్యంగా ఎంత ముద్దొస్తున్నాడో చూడు. అందుకే ఇంత లేట్ అయ్యింది. సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ అయ్యింది, నాకదే సంతోషంగా ఉంది.”

          “అమ్మా ఏమయ్యింది? నేనింత సేపు నిద్ర పోయానా?”

          “రాత్రంతా అల్సిపోయావు కదా! నిద్ర పట్టేసింది. ఏమన్నా తింటావా? ఇంటి నుండి ఇడ్లీలు తెచ్చారు.” అని శ్రీనివాస్ అడిగాడు.

          “నువ్వు తిన్నావా? మొహమంతా పీక్కుపోయింది. నువ్వు కూడా పడుకోలేదు కదా రాత్రంతా, అసలు మనమెవరూ పడుకోలేదు. అమ్మా, నువ్వు తిన్నావా ఏమన్నా? అమ్మ అస్సలు పడుకోలేదు పాపం. చాలా విసిగించాను కదా, అందరిని.” అంటుండగానే డా. రేఖా వచ్చింది.

          ” ఏం పిల్లా అందరిని భయపెట్టి, అదరకొట్టావట. ఏంటీ సంగతి?” అంటూనే బాబుని చేతుల్లోకి తీసుకుని చూసింది. మంచం మీద పడుకోబెట్టి టెస్ట్ చేసింది. బాబు ఏడవసాగాడు.

          “అబ్బా ఏం గొంతురా! మీ అమ్మకి గొంతే లేదనుకుంటే అందరి మీద ఎగిరి పెద్ద గోల చేసిందట. నువ్వు మీ అమ్మలాగే వున్నావురా!” అని ముద్దు చేసింది.

          “నేనా? ఏం గోల చేసాను? అమ్మా ఏం జరిగింది?”

          ” పెద్ద గోలేం కాదురా, రాత్రంతా నొప్పులు భరించావు, బాగా అలసిపోయావు, వీక్ గా వున్నావు కదా! కొద్దిగా అప్ సెట్ అయ్యావు. ఇవి కామనే డెలివరీ తర్వాత కొంతమందికి. చిన్న ఏజ్ లో పిల్లలు పుడితే వాళ్ళని పెంచడం ఎలా అని, ఇంట్లో ఏమైనా సమస్యలుంటే, ఆ సమస్యల మధ్య పిల్లల్ని ఎలా పెంచాలనే ఆలోచన వచ్చినా చాలు మైండ్ డిస్ట్రబ్ అవుతుంది. “బేబి బ్లూస్,” అంతే నీకొచ్చింది. నువ్వు చాలా వీక్ గా వున్నావు. బాగా తినాలి, హెల్తీ ఫుడ్ తిను, పాలు తాగు, నువ్వెంత ఆరోగ్యంగా ఉంటే బాబుకి పాలు అంత బాగా వస్తాయి. తెలిసిందా? రేపు డిశ్చార్జ్ చేస్తాము. 10 రోజుల తర్వాత వచ్చి చెకప్ చేయించుకో, కుట్లు హీల్ అవుతున్నాయా, లేదా చూస్తాను. ఓకే రా! ఏం బాబు శ్రీనివాస్, హ్యాపీయేనా, బాబు పుట్టాడు. దుర్గా చాలా వీక్ గా వుంది జాగ్రత్తగా చూసుకొండి. ఆల్ ది బెస్ట్!” అని వెళ్ళేపుడు నా వైపు చూసి కన్ను కొడుతూ వెళ్ళింది అల్లరిగా. శ్రీనివాస్ చూడడానికి తెలుగు హీరోలా వుంటాడని అందరూ అంటారు, తనేమీ పట్టించుకోడు. తను నన్ను గారాం చేస్తాడని నన్ను ఆట పట్టించడం అన్న మాట.

          అలా అయ్యింది మొదటిసారి ఇండ్యూస్ చేసిన డెలివరీ. బాబు బాగున్నాడు, ఆరోగ్యంగా పెరిగాడు, కానీ అప్పటినుండి నాకు ఇండ్యూస్ చేస్తారంటే చాలా భయం!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.