సత్యవతి కథలు (పి.సత్యవతి కథలపై సమీక్ష )

-సునీత పొత్తూరి

         

          ఈ సంకలనంలో మొత్తం నలభై కథలు. అన్నీ ఆలోచింప చేసే కథలే. ఆధునిక స్త్రీవాద కథలు. స్త్రీల అస్తిత్వ పోరాట కథలు. సత్యవతి గారి కథలలో ‘దమయంతి కూతురు’, ‘సూపర్ మామ్ సిండ్రోమ్’ కథలకు అంతటా చాలా మంచి స్పందన వచ్చింది.

          రచయిత్రి తన ముందు మాటలో మాయా ఏంజిలోని కోట్ చేస్తూ ఇలా అంటారు.
” కథ అయినా కల అయినా కడుపులో భరించడం కన్న గొప్ప వేదన మరొకటుండదు. కనెయ్యడమే రచయితకు విముక్తి.” అలా బయటపడినవే ఈ కథలు. మనసులో చొరబడి మెలిబెట్టి వేదనకు గురిచేసి బయటపడ్డ కథలు ఇవి” అని అంటారు రచయిత్రి. అవి చదువరుల హృదయంలోనూ చేరి కలవర పరుస్తాయి.

          ఆర్థిక శాస్త్రంలో destructive creation అనే పదం చలామణిలో ఉంది. ఏదైనా కొత్తది లేదా ఆధునిక ఆవిష్కరణ జరుగుతూనే పాతవి కనుమరుగు అవుతూంటాయి. ఇలా యంత్రాల వెనకపడి తమ జీవితాన్ని యాంత్రికం చేసుకుని, అసలైన జీవన మాధుర్యాన్నే కోల్పోతున్న మాట వాస్తవం‌. గ్లోబలైజేషన్ ఫలితంగా వినిమయ సంస్కృతి వచ్చిపడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ అమ్మకానికే అన్నీ-

          సత్యవతి గారు కథల చెప్పే తీరు వేరు.. ఈ కథలలో చాలా మంది మన చుట్టూ ఉన్నవారే అనిపిస్తారు.

          నొప్పి తెలియకుండా మత్తు ఇచ్చి శస్త్ర చికిత్స చేసినట్టు, తన భర్త, తన పిల్లలు – తన ఇల్లు, తనదే అయిన వంటిల్లు అనే చక్రవ్యూహంలో పడి, ఆ మత్తులో తనకు తెలియకుండానే స్త్రీ దోపిడికి గురి అవడం వెనక వ్యవస్థే ఉందని సత్యవతి గారి కథలు చదువుతుంటే తెలిసివస్తుంది.

          “ప్రతి మగవాడి వెనకా ఓ స్త్రీ వుంటుంది. ప్రతి స్త్రీ తనని తాను మర్చిపోడం వెనక, తనని తాను పారేసుకోవడం వెనక ఓ పురుషుడే కాదు వ్యవస్థ మొత్తం ఉంటుందేమో.” అంటారు ఓకథలో.

          “ఆడవాళ్ళకి ఆలోచన లేదనీ, గయ్యాళులనీ అనే వాళ్ళంటే పరమ చిరాకు. వాళ్ళ ఆలోచన వికసించడానికి, వాళ్ళలో ఒక బ్యాలెన్స్డ్ అవుట్లుక్ రావడానికి ఎవరు దోహదం చేస్తున్నారు? ” అంటారు మరో కథలో.

          కుంకుడు గింజ చితక్కుండా గింజను వేరు చేసి, కుంకుడు పులుసు తీసుకొన్నట్టు, స్త్రీలకు చాకిరీ తప్ప, బుర్రలతో పనే లేనట్లు వ్యవహరించడంలో పితృస్వామ్య వ్యవస్థ కారణం కాదా.

          ఇన్నేళ్ళ కాలంలో ఏది ఎంత మారినా, మారనిది స్త్రీ జీవితమే. చదువు, వర్గం ఎదైనా, పరోక్ష ప్రభావం ఇదీ అని చెప్పే కథలు అన్నీ.

          ఇందులో నేను ఎంపిక చేసుకున్నది కథ “సప్తవర్ణ సమ్మిశ్రితం” అన్న కథ.

          ఒక వృద్ధ స్త్రీని- మరో యుక్తవయసు అమ్మాయిని కలిపిన కొత్త ఆర్థిక, సామాజిక పరిణామాల ఫలితం.

కథలోకి వెళితే..

          “నిండు కెంపు రంగుకి పచ్చిపసుపు రుద్రాక్షల అంచు! ఆ అంచుకు చిన్న చిన్న కొండలు..”

          ముసలమ్మ ఎప్పుడూ రంగుల గురించి కలవరిస్తూ ఉంటుంది. గచ్చకాయ, మానుగాయ, ఇటికరాయి, మిరప్పండెరుపు,పెసరపచ్చ, నెమలిపింఛం, తోపు రంగు, నిమ్మపండు, వంగపువ్వు, నారింజ, పసుపు, ముదురు నీలం, రత్నావళి, బచ్చలిపండు, అరటిపువ్వు–అయ్య బాబోయ్!”

          ముసలమ్మను చూసుకుందుకు పెట్టిన అసిస్టెంట్ స్వర్ణకి ఈ రంగులేవి అర్థం కావు. ఎవో నాలుగు డబ్బులు వస్తాయని, తన షాంపూలకు పౌడర్లకు.. ఖర్చులు పోగా ఎంతో కొంత ఇంటికీ సాయంగా ఉంటుంది అనే ఈ పనిలో చేరింది.

          ఆవిడేమో తన చిన్నతనంలో అంతా పూలమొక్కల పెంచడం, రంగు రంగుల పూలతో- ఇంద్రధనస్సు లాటి తోటను చూసుకుని మురిసిపోతూ.. పెరిగింది. ఆ తరువాత, అత్తవారింటికి రాగానే పూలన్నీ మాయమై, పూల రంగులన్నిటినీ తన చీరలలో– వాటి రంగుల ఎంపికలో చూసుకోవడం అలవాటవుతుంది. ఎప్పుడు..ఆ రంగులన్ని వెలిసిపోయాయో.. గ్రహింపుకు వచ్చేసరికి, ఇదిగో ఈనాడు ఇలా..!

          పదవ తరగతి దాకా చదివిన స్వర్ణ ఒక సంస్థ ద్వారా నర్సు ట్రెయినింగ్ తీసుకుని, ఇలా మంచం పట్టిన వృద్ధురాలికి సహాయంగా వచ్చింది. ముసలామెకి కావల్సిన మందులు, భోజనం లాటివి చూసుకున్నాక అంతా ఖాళీనే..! ఇయర్ ఫోన్స్ పెట్టుకుని
సెల్ఫోన్ లో ఎఫ్ ఎమ్ స్టేషన్ పాటలు వినడమూ.. మధ్యమధ్య స్నేహితులతో కబుర్లూ..!

          అన్నిటిలో స్వర్ణకి నచ్చనిదల్లా ముసలామె బాత్ రూమ్ వ్యవహారం. ఆవిడకి కంట్రోల్ ఉండదు. క్లీన్ చేయడానికి ఎక్కడలేని వెలపరమూ వచ్చేస్తుంది స్వర్ణకి. అయినా పనికి ఒప్పుకున్నాక తప్పదు కదా..! అటువంటప్పుడు ఆవిడకి చీరలు మార్చడము కష్టమవుతోందని ఆవిడ కూతురు ఆవిడ చేత గౌన్లు వేయించింది. ఆ పైన జుట్టు కూడా కత్తిరించింది.

          ఎనబై అయిదేళ్ళ ఆ వృద్ధురాలికి ఇదంతా కష్టంగానే ఉంది. తన చాతకానితనానికి దుఃఖం వచ్చినా, కన్నీళ్ళూ .. జలుబు నీళ్ళు తుడుచుకుందుకు అందుబాటులో చీర కొంగైనా ఉండదు. ఓ చీర తెచ్చి తనకు కప్పమని పురమాయిస్తుంది ఆవిడ. ఇంతగా లొంగిపోయిన జీవితం అంటే అసహనం.. వల్లమాలిన దుఃఖం.

          గౌన్లు లేదా నైటీలు వేసుకోవడం ఏమంత ఆక్షేపణీయమైన విషయం కాదు. కొంత మందికి అవి ధరించడం మోజు కూడా. దానికి తోడు సౌకర్యం. అసలు చీరకట్టుని మాయం చేసేంతగా ‘నైటీ’ అన్ని వర్గాల్లోను చొరబడి పోయింది. ఇలా ఆరు గజాల చీరని మోయలేని వాళ్ళకి హాయిగా, తేలికగా అనిపిస్తుంది.

          కాని ఇక్కడ విషయం అది కాదు. వంటి నిండా కట్టుకున్న చీర ఆవిడ ఉనికికి గుర్తింపు. ఈ విషయంలో నిస్సహాయత ఆవిడ ఉనికినీ, అహాన్ని గాయపరచింది. ఎన్నో తలపోతలకు దారితీసింది. అదీ ఆవిడ దుఃఖానికి కారణం.

          అంతకు ముందు ముసలావిడకి సపర్యలు చేస్తూ.. చిరాకు పడ్డ స్వర్ణకే ఆమె దుఃఖం చూసి విచారం కలుగుతుంది. “ఏడవకు మామ్మా- నీ కిష్టమైన రంగు చీర రోజుకొకటి తెచ్చి కడతాను.” అని ఓదారుస్తుంది. ఆవిడ రంగు చీరలని కట్టుకోనందుకే ఇంత దుఃఖమా.. అని జాలి పడుతుంది.

          స్వర్ణకీ మంచాన పడిన మామ్మ ఉంది. ఆవిడంటే సానుభూతి ప్రేమ వున్నాయి. అంతకు మించిన తమ అర్థిక అవసరాలు. ఇక్కడిలా తన మామ్మను ఎవరూ, ఏ పరిస్థితి లోనూ దగ్గర పెట్టుకోరు కదా!

          అసలు దుఃఖం చీరల కోసం కాదు‌- రంగులన్నీ కలిసిపోయి ఒక్క తెలుపే మిగిలిన సమయంలో గతం అంతా గుర్తుకొచ్చీ.. చెప్పుకున్న స్వగతం. అత్తగారికి, భర్తకు వారి అవసాన దశలో తను చేసిన సేవలు పోను.. ఇప్పుడిలా ఏ అనుబంధమూ లేని స్వర్ణ తన పరిచర్యలకు రావడం.. ఏనాటి ఋణానుబంధమో- అని వాపోతుందావిడ. ఇలా ఇంకెన్నాళ్ళు బతకాలో అనే బాధ..!

          “అవన్నీ నాకు తెలవదు మామ్మా నువ్వు డబ్బులిస్తున్నావు నేను పని చేస్తున్నానంతే.” అంటుంది స్వర్ణ.. ఎంతో నిజాయితీగా.‌. మరింత సహానుభూతిగా.

ఈ కథే ఎందుకంటే;
వార్థక్యం. వయసుతో బాటు వచ్చే అనారోగ్యాలు ఎంతటి వారినైనా లొంగదీస్తాయి. అయితే, మానవ సంబంధాలలో మారుతున్న సమీకరణలు అయిన వాళ్ళను దూరం చేస్తున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం తలిదండ్రులను వదలి దూర దేశాలకు వలసపోయే యువత సంఖ్య బాగా పెరిగింది. ఒక పక్కన వృద్ధాశ్రమాల సంఖ్య కూడా పెరిగింది. అలాగే సహాయకుల ఏర్పాట్లను చేసే దళారీలు – అలా అవసరం కొద్దీ ఈ గొలుసు కొనసాగుతూనే ఉంటుంది.

          కర్మ కాలి వృద్ధాప్యంలో మతిమరుపు వ్యాధి బారిన పడితే..? తల్లిదండ్రులు చూడకుండా, పసిపిల్లలను ఆయాలు బాధించినట్టు‌‌‌, ఈ కథలోని స్వర్ణలా కాకుండా, జాలిలేని సహాయకుల చేతిలో వృద్ధులు పడే బాధలు ఊహించగలమా! మనసులో ఎక్కడో నొప్పి ఈ కథను హైలైట్ చేసింది‌.

          సత్యవతి గారి కథలో ప్రత్యేకత ఏమిటంటే ఒక సానుకూల దృక్పథం. పాజిటివిటీ. అంత బాధలోను ముసలావిడకి స్వర్ణ ఇచ్చిన ఓదార్పు.

*****

Please follow and like us:

2 thoughts on “సత్యవతి కథలు (పి.సత్యవతి కథలపై సమీక్ష )”

Leave a Reply

Your email address will not be published.