సస్య-2

– రావుల కిరణ్మయి

అపురూపం

(పదివారాల  చిరు  నవల  రెండవ పదం)

(ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సస్య ఆ రోజున తరగతిలో బోధన చేయలేక బాధతో కుంగిపోవడం చూసి వారి ప్రధానోపాధ్యాయులు అడగడంతో సస్య చెప్పడం మొదలు పెట్టింది.ఆ తరువాత)

***

          అందువల్ల మీరందరూ మీ మీ తరగతుల విద్యార్థులను తీసుకొని గ్రంథాలయానికి వెళ్ళిరండి.

          అక్కడ మన విద్యార్థులకు అవసరమైనవి ,ఇంకా ఏవి కావలసి ఉన్నాయో చూసి మన పాఠశాల గ్రంథాలయంలో లేనివి ఒక లిస్ట్ తయారు చేసి వారికి ఇవ్వమంటున్నారు. వాటిని లక్ష్మి గారు తన పుట్టిన రోజు కానుకగా కొన్ని తెప్పిస్తారట. కాబట్టి మీరు సబ్జెక్టుల వారిగా పుస్తకాల జాబితాను రాయండి … అంటూ మరికొన్ని విషయాలు మాట్లాడి సమావేశాన్ని ముగించారు.

          సస్య! మాత్రం ఇక్కడే ఉంటుంది. సర్వీస్ బుక్స్ కొన్ని క్లియర్ చేయవలసి ఉంది. అని చెప్పి అందరినీ గ్రంథాలయానికి పంపించి సస్య, హెచ్.ఎం విద్య మాత్రమే మిగిలారు.

          అమ్మా సస్యా ! నిన్ను కావాలనే ఉంచాను. నేను గత మూడు నాలుగు రోజులుగా నీలో మార్పును స్పష్టంగా గమనిస్తున్నాను. తెలుసుకోవాలనే నిన్ను ఆపాను.

          చెప్పమ్మా ! ఏమైనా -ఆర్ధిక ఇబ్బందులా ? లేక ఆరోగ్య సమస్య? చెప్పేదయితేనే నీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పమ్మా. అతి చూపించాను అనుకుంటే మాత్రం ‘వదిలేయమ్మా క్షమించు అన్నది.

          మేడమ్! పెద్దవారు అంత మాటనకండి, మీరు వృత్తిపరంగా వ్యక్తిగతంగా చాలా అనుభవజ్ఞులు. మీ సలహాను తీసుకోవాలనే అనుకు౦టున్నాను. సమయం కోసం ఎదురు చూస్తున్నాను.అని చెప్పడం మొదలు పెట్టింది.

***

          నా ప్రాణస్నేహితురాలు విదుషి. చిన్నప్పటి నుండి మేము ఒకరంగా బ్రతికాం. మా ఇద్దరి మధ్య అంతస్థుల్లో తేడా భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత దూరం ఉంది

          స్నేహం కూడా చిత్రమైనదే.

          విదుషి వాళ్ళు కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు .లేకలేక పుట్టిన అమ్మాయని అపురూపంగా చూసుకునేవారు.

          వాళ్ళ నాయనమ్మ, అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉండేది. ఆమెకు సపర్యలు చేయడానికి అమ్మను పనిలో పెట్టుకున్నారు. నేను పాలు తాగే వయసు నుండే అమ్మ వాళ్ళింట్లో పనికి కుదిరింది..

          ఆలస్యమైన కాన్పు వల్ల, విదుషి వాళ్ళ అమ్మకు పాలు పడలేదు. దానితో పోతపాలు పట్టేవారు గాని అరగక తరుచూ అనారోగ్యానికి గురవుతూ ఉండేది.

          నేను అమ్మ ఒడిలో పాలు తాగడం, ఆరోగ్యంగా ఉండి కంటి నిండా నిద్ర పోవడం చక్కగా ఎదగడం చూసిన వాళ్ళ నాన్నగారు తన కూతురుని తలచుకొని బాధపడేవారు.
అప్పుడే విదుషి వాళ్ళ అమ్మ ప్రభావతిగారు అమ్మను నా కూతురుకు కూడా నీ పాలు పట్టు. నీ కష్టం ఉంచుకోను అని ప్రాధేయపడింది.

          మనసున్న తల్లిగా అమ్మ ఆ రోజు నుండి మా ఇద్దరికీ తన పాలను పట్టించడంతో పాటు ఒకే తల్లి పిల్లల్లా పెంచింది. విదుషికి ఆకలి ఎక్కువగా ఉండి తానే ఎక్కువగా అమ్మపాలు తాగడం, వల్ల నాకు పాలు త్వరగానే మాన్పించారు. అయినా అమ్మ బాధ పడలేదు. మరో బిడ్డ ఆకలి తీరుస్తున్నందుకు సంతోషించింది. అలా ఇద్దరం స్కూలు వయసు వచ్చే వరకు కలిసే పెరిగాం. తనను పెద్ద కార్పోరేట్ స్కూల్లో చేర్పించారు.
తల్లి పాల ఋణం తీర్చుకోవడానికన్నట్టుగా నన్నూ చేర్పించి చదివిస్తానన్నారు. కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే మా అన్నయ్య, చెల్లెలు, తనను అపురూపంగా పెంచు తున్నారని అనుకొని మా మధ్యభేదాలు పొడసూపుతాయని భయపడింది. అందుకే ఒప్పుకోలేదు.. ఇలా స్కూలు అయిపోగానే నేను వాళ్ళింటికి వెళ్ళడం చదువుకునే స్కూల్లు వేరైనా రోజూకలిసి ఆడుకోవడం చదువు కోవడం మానలేదు. మా వయసులతో పాటు మా స్నేహం పెరుగుతూ వచ్చింది.

          విదుషీ నోటి నుండి ఏదైనా కావాలని అడిగితే కాదనకుండా ఇచ్చే గాఢమైన బంధం బలపడింది. ఈలోగా తనకు తమ్ముడు కూడా పుట్టాడు. నేను మా కుటుంబం కంటే వారి కుటుంబంతోనే ఎక్కువగా కలిసిపోయి ఉండేదాన్ని. మొన్నటివరకు అట్లాగే ఉంది. కాని మొన్న తను కోరిన ఒక తీవ్రమైన కోరికను మాత్రం నేను ఒప్పుకోలేక పోతున్నాను. అది దృష్టిలో ఉంచుకొని తను నా మీద అంతర్గతమైన సున్నితమైన దాడిని మొదలు పెట్టంది అది మాత్రం చెప్పలేను మేడమ్. చెప్పడానికే సిగ్గుగా ఉంది. అని “ఏడుస్తున్న సస్యను.. విద్య మేడమ్,

          సస్య ! ప్లీజ్ ! ఏడవకు. నీ సమస్య తెలుసుకొని సాయం చేద్దామనుకున్నా కానీ చెప్పలేకపోతున్న నీ అశక్తతకు బాధపడుతున్నాను అని అక్కడతో ఆ టాపిక్ మార్చింది.

***

          సాయంత్రం విదుషి నుండి ఫోను.

          సస్యా ! ఎక్కడ? ఇంటికి రావడం లేదేం? నువ్వు రాకుంటే నే వస్తానని తెలుసుగా, ఆలస్యం చెయ్యకుండా వచ్చేయ్ ! అంది. విదుషి ! ప్లీజ్ నేను రాలేను. చాలా పనులు న్నాయి. చెల్లెలు ఒక్కతే ఉంది. పైగా స్కూళ్ళో బాగా అలిసిపోయాను. అందుకే ఇక్కడికి వస్తే కాస్త రిలాక్స్ అవచ్చు. అంది “రిలాక్స్ “అని మత్తుగా అంటూ.

          విదుషీ ! నేను ఇక క్లాసులు మానేద్దామనుకుంటున్నాను, నాట్యం, లలితకళలు నేర్పించడానికి వేరే టీచర్ను ఎవరినైనా చూడమని చెప్దామనుకుంటున్నాను. అంది సస్య భయం భయం గానే,

          అలా ఎలా కుదురుతుంది ? నీ కోసం శ్రవణ్ ని ఉద్యోగం మాన్పించి కుదరదంటా వేం? నువ్వు రావాలి. వస్తున్నావ్. అంతే, ఫోన్పెట్టేసింది. 

          సస్యకు తప్పలేదు. మరో గంటలో అక్కడికి చేరుకుంది.

***

          అది విదుషీ వాళ్ళ తోట బంగ్లా, అందులో మొక్కలను, పక్షులను, చేపల వంటి జంతువులను చాలా ప్రేమగా అపురూపంగా పెంచుతున్నారు.

          తోటలోకి అడుగుపెట్టగానే గన్నేరు చెట్టుకింద ఉన్న సిమెంటు బెంచీమీద కూర్చొని సన్నజాజుల ‘మాల కడుతున్న తోటమాలి సాయమ్మ రండమ్మా! మీకోరకే చూస్తున్నాను.
విదుషి అమ్మగారు చెప్పారు . మీకు సన్నజాజులు మాలగా కట్టి ఇవ్వమని ,అని తానే తన నల్లని పొడవైన జడలో అలంకరించింది. లోన బాబుగారు మీ కొరకే ఎదురు చూస్తున్నారు.

          అమ్మా ! నేను కూడా వెళ్తున్నాను. మా ఆయన వచ్చాక తాళం వేసుకుంటారు.

          ఏకాంతానికి భంగం కలగకుండా చూడమని మరీ మరీ చెప్పారండి. మీకు ఏదైనా తినాలనిపిస్తే పాలు, పండ్లు, బాబుగారికి తీసుకోవాలనిపిస్తే మందు బాటిలు, చికెన్ ఎక్కువ పీసులు కూడా తెప్పించారండి. నేను ఇంకా ఇక్కడే ఉంటే అమ్మగారు కోప్పడుతారు. అని చక చకా వెళ్ళిపోయింది.

          సస్య , ఆ బెంచీ మీద కూలబడి పోయింది.

          ఆ పెద్ద బంగ్లాలో ఇప్పుడు తామిద్దరమే. చుట్టూ ఏదైనా జరిగి సహాయానికి అరిచినా, ఎవరూ కానరాని పరిస్థితి . తన ఒడిలో గన్నేరు పూవు రాలింది, మంచి, ఎర్రని రంగు ముద్ద గన్నేరు అది, వాసన కూడా గుభాలిస్తున్నది. తన నక్షత్రం ప్రకారం ఆ మొక్కను పెంచితే మంచిదని తన చేత తానే నాటించింది.

          విదుషీ, తన నక్షత్రం ప్రకారం సన్నజాజి మొక్క నాటాలని నాటించింది. స్నేహం ప్రకారం ఆ రెండు మొక్కలు ఏపుగా పెరిగి ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. తనకు ఒక విషయం గమ్మత్తుగా అనిపిస్తుంది. గన్నేరును అల్లుకున్న సన్నజాజిని చూస్తే తాను చిన్నతనం నుండి విదుషిని ఆధారం చేసుకునే బ్రతుకుతున్నటుగా సాక్ష్యంగా కనిపి స్తుంది.

          ఫోన్ మోగింది.

          సస్యా ! ఎంత సేపలా .గన్నేరు చెట్టుకింద కూచుంటావ్. పాపం..! శ్రవణ్ ను అలా వెయిట్ చేయించడం పద్దతి కాదు. వెళ్ళు.. వెళ్ళు.. అంది. నీ జడలోని సన్నజాజి పరిమళాలను ఆస్వాదించాలని అతడు తహతహ లాడుతున్నాడు. అని జవాబు కోసం కూడ చూడకుండా ఆడర్ వేసి పెట్టేసింది.

          ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి వెళ్ళకుండా ఎలా ఉంటాను.? అనించి చుట్టూచూసింది. C.C కెమెరాలు లేని ఆ తోటకు అది అవసరం లేకుండానే అన్నీ తెలుస్తున్నందుకు సంతోషించాలో తన పరిస్థితికి బాధపడాలో అర్థం కాక ముందుకు నడిచింది. అడుగుల సవ్వడికి కుందేళ్ళు తప్పుకుంటున్నాయి. కట్టివేయబడి గడ్డి నెమరువేస్తున్న ఆవును చూసి ఆగిపోయి అప్రయత్నంగానే చేతులు జోడించి..

నమో బ్రాహ్మణ్య దేవాయ…
గో బ్రాహ్మణ హితాయచ..

అంటూ తనకు అభయమీయుమని ప్రార్థించింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.