స్మశానపూలు
(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-రావుల కిరణ్మయి
మెరుపు తీగ లాంటి దేహసౌందర్యంతో, కమలముల వంటి కన్నులతో తుమ్మెదల వంటి కురులతో చంద్ర బింబం వంటి మోముతో నతనాభితో మరున్నారీ శిరోరత్నములా అచ్చం అల్లసాని మనుసంభవ నాయిక వరూధినిలా ఉంది కదూ ! తెలుగు అధ్యాపకుడి నయిన మధుకర్ మనుచరిత్రను బోధిస్తున్నట్లుగా వర్ణనాత్మకంగా ‘’ఆమె ‘’సౌందర్యాన్ని తన ధోరణిలో తన భార్య మరాళికి చెప్పేసరికి ,
మరాళి కళ్ళ లో నిళ్ళు …..
అంతే …తలకెక్కిన ‘’ఆమె’’ సౌందర్యాన్ని విదిలించుకొని మరాళిని ప్రేమగా దగ్గరికి పొదువుకున్నాడు.
మరాళి కన్నీటి వర్షమయింది.
గాయం చేసిన కత్తి మొనతోనే గాయానికి మందు రాయాలని ప్రయత్నించినట్టుగా ఊరడించబోయాడు.
తాను ఆగని ప్రవాహమయింది.
మరాళీ ..!ప్లీజ్ ..!నన్ను క్షమించు,అన్నాడు. ఆమె గుండెకోత తన గొంతులో చేరి ఆర్ద్రమవుతుండగా. వెచ్చగా తాకిన అతని కన్నీటి స్పర్శకు కాస్త ఉపశమించినా …వెక్కుతూనే ఉంది.
సోఫాలో కూర్చున్న మరాళిఒడిలో, తాను కింద కూర్చొనితల ఉంచి,
ప్లీజ్ ..!అన్నాడు.
చప్పున మధుకర్ తల పై లాలనగా చేతులు వేసి, జుట్టులోనికి వెళ్ళను చొప్పించి నిమురుతూ ….మరాళి
మధూ ..!నువ్వు ఆమె సౌందర్యాన్ని పొగిడినందుకు నేను ఏడవడం లేదు. పైగా సాటి స్త్రీగా గర్విస్తున్నాను. కానీ ఈ పొగడ్తలే రేపు మనకు ఎడబాటును కలిగిస్తే, ప్రేమ మూర్తులయిన మిమ్మల్ని వదులుకొని ఎలా జీవించడం? అంతకంటే మరణం మేలు కదా !అన్నది.
ఒక్క ఉదుటున మధుకర్ ఆమె ఒడిలో నుండి లేచి ..
మరాళి ..! నువ్వేనా? ఇంత బేలగా మాట్లాడుతున్నది? హంసలా మంచీ, చెడులను వేరు చేస్తూ ఎప్పుడూ స్థిత ప్రజ్హతో ఉంటావని కదూ !నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టి మరాళీ అని నీపేరు మార్చింది ? అలాంటి నువ్వేనా ? ఇలా? అసలు …నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అన్నాడు నుదుటి పై ముద్దు పెట్టుకుంటూ .
మన దాంపత్యఫలంగా మాతృత్వంను నేను అందుకోలేకపోవడం మన ఇరు కుటుంబాలలో నివురుగప్పిన నిప్పులా ఎంత రగులుతున్నదో తెలుసుకదా! అదే తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టుగా వారి చెప్పుడు మాటలు విని మీరూ …..అని చెప్పుతున్న ఆమెను అడ్డుకుంటూ మధుకర్ ..
ఇంతేనా ? మన ఐదు సంవత్సరాల ప్రేమ ప్రయాణం, పది సంవత్సరాల వివాహ బంధం అంతా ఈ వేళ నీకు నాపై నమ్మకాన్ని వమ్ముచేశాయా? కొందరు మగవాళ్ళ లాగా నన్నూ జత కడుతున్నావా? నువ్వూ…. మామూలు ఆడవాళ్ళలాగె దిగజారి పోయి నన్ను ఆ దృష్టితో చూస్తున్నావా?
నా దృష్టిలో ఇప్పుడు మాతృత్వమే పెద్దదిగా ఉంది మధూ ..!
సరి ..సరి ..ప్రేమా, పెళ్ళి, కెరీర్ అంటూ ప్రేమికులుగా, అన్యోన్య దంపతులుగా, ప్రణాలికులిగా అనిపించుకుంటూ, ఆలోచించామే తప్ప అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందాలని, దానికి వయసు దాటి పోతున్నదని ఏనాడయినా చింతించామా? అంతా మన స్వయంకృతాపరాధమే కదా! అన్నాడు మధుకర్.
కానీ …ఎన్నాళ్ళిలా మన వాళ్ళని ఇదిగో… అదిగో అంటూ నమ్మిస్తూ కాలం గడుపుదాం. అన్నది మరాళి.
లోకంతో మనకేమి పని ? మరణం దాకా ఒకరికి ఒకరం మనకు మనమే పిల్లలమయి అమ్మానాన్నలమనుకుంటే సరిపోదూ?
మధూ ..! ఇవన్నీ గుండెలయ ఒకటి కాగా బతుకుతున్న మనకు మాత్రమె తెలుసు . లోకానికి? ప్రశ్నించింది.
మధుకర్ మౌనంగా అక్కడి నుండి కదిలాడు.
మరాళికి తెలుసు ఇష్టంలేని ప్రశ్నలకు జవాబివ్వడం అతనికి ఇష్టం ఉండదని. అందుకే ఆమె కూడా అతని వెంటే కదిలింది. సంతానలేమి ఆ దంపతులపాలిట అశనిపాతం కాగా, ఇలా కుంగిపోతుంటారు. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి ఆమె దగ్గరికే వెళ్ళారు.
***
జీవ వైవిధ్యానికి పునాదిగా పక్షుల కిల కిలా రావాలతో, ఏపుగా పెరిగిన పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతూ పలు రకాల పూల పరిమళంతో మత్తుగా ఉండి, మరణించిన వారికి భూతల స్వర్గమై ఉన్నది వనమంటి ఆ స్మశానం. అక్కడే ఆమె నివాసం.
మధుకర్ వాళ్ళ చెల్లెలు నిండా ఇరవయి సంవత్సరాలు కూడా లేని స్వాప్ని ఏదో తెలియని మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు అక్కడే చేయబడ్డాయి. తొలిసారిగా అప్పుడు చూశారు ఆమెను. పన్నెండు రోజుల కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఆమె వీరికి సాయం చేస్తూనే ఉన్నది. తక్కువయిన అవసరమయిన పూజా సామగ్రిని అందించి చాలా సాయం చేసింది.
ఆమె సాయానికి మధుకర్, మరాళి కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆమె అందంగా నవ్వి వెళ్ళిపోయింది.
అంతకు ముందెప్పుడూ కాలేజికి చాలా దగ్గరి దారయినా స్మశానం నుండి పోవడం ఇష్టపడని మధుకర్ స్వాప్ని సమాధిని నిర్మించే పనికి తరుచూ వెళ్ళడం, ఆ పనిలో ఆమె కూడా భాగస్వామ్యం అవడం వల్ల పలకరింపులు మొదలయి పరిచయానికి దారి తీశాయి.
పని పూర్తయిన తరువాత ప్రతీ రోజూ ఆ దారెంటే వెళ్తూ ..ఆమెను చూస్తూ స్వాప్ని సమాధి పై పూలు ఉంచుతుండడం గమనించి, ఒకరోజు ఆమె అడిగింది.
ఎవరూ ఇలా ప్రతిరోజూ ఇక్కడికి రారు. మరి మీరు ..? అన్నది సందేహంగా.
నాకు చెల్లెలంటే ప్రాణం.అందరం ఉండీ ఆమెను చదువు పేరుతో హాస్టల్ లో ఉంచి ఆమెను అర్థం చేసుకోలేక పోగొట్టుకున్నాం. అందుకే పశ్చాత్తాపంతో ఆత్మతృప్తి కోసం ఇలా… అని చెప్పి మరి మీరు ..?అడిగాడు.
చెప్తాను. ఇప్పుడు కాదు. మీరు కొంచెం తీరిగ్గా రండి. అన్నది చాలా మర్యాద పూర్వకంగా.
అలా ఆ రోజు ఉదయం జరిగిన ఆ సంగతి చెప్తూనే మధుకర్ ఆమెను వరూదినిలా వర్ణించాడు.
***
మరాళి, మధుకర్ స్మశానం చేరుకున్నారు. ఆమె బయటే ఎదురయింది. నేను శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి ఇంకా సమయం ఉంది గానీ , మీరు నాతో రండి అంటూ నవ్వుతూ రోడ్డు పక్కన పొదలమాటున ఉన్న గుడిసెలోకి తీసుకు వెళ్ళింది.
ఆ గుడిసెను చూడగానే బురదలో పుట్టిన తామర, మునికన్య గుర్తుకు వచ్చారు. అదే అడిగింది మరాళీ.
దానికి ఆమె నా పేరు మధురిమ. మారుమూల పల్లెకు చెందిన ఒక దళితురాలిని. తోమ్మిదేండ్ల వయసులో స్కూల్లో ఆటల్లోనూ.చదువులోనూ నేనే ఫస్ట్ గా ఉండేదాన్ని.
స్కూల్లో జరిగిన ఒక వేడుకలో బహుమతి ఇవ్వడానికి వచ్చిన ఆ ఊరి పెత్తందారు నా గెలుపును ఓర్వలేక మగపిల్లవాడు కావాలని ఆశపడుతున్న తన తల్లిదండ్రులకు ఈమెను దేవతకిచ్చి పెళ్ళి చేసి జోగినిగా మార్చితే మీ కోరిక తీరుతుందని అయినవారి చేత మాయమాటలు చెప్పించి పెళ్ళికూతురిగా ముస్తాబు చేసి జోగుపట్టం ద్వారా ఎల్లమ్మ గుడిలో పోతురాజు చె పసుపుతాడు తాళిగా కట్టించి కుట్ర చేశాడు.
మొగ్గ నుండి నేను పువ్వయి విప్పుకోగానే జోగుపట్టం వైభవంగా చేసిన ఆపెత్తం దారే మైలపట్టం తంతులో నా పాలిట తుమ్మెదయ్యాడు. ఇక ఆ రోజు నుండి నేను అన్నిటికీ దూరమయి ప్రత్యెక రోజులలో గుడి కడగడం, యాచిస్తూ పొట్ట నింపుకోవడం, ఎన్నో తుమ్మెదలకు ఆనందాన్ని పంచుతూ గుడి సేవకు అంకితమయ్యాను.
అయినా, తెలిసీ తెలియని వయస్సు, ఏనాటి పుణ్యం వల్లనో తమ బిడ్డ ఇలా దేవతకు అర్పితమయినదనే నా కన్నవారి ఆనందం నన్ను ఇరవయిలోనే ఐదుగురు పిల్లల తల్లిని చేసింది.
ఇలా గడుస్తుండగా నా తరువాత నలుగురు చెల్లెళ్ళు పుట్టగా జరిగిన వరుస ప్రసవాలతో అమ్మ మరణం, పిల్లల తల్లి అనే నెపంతో తాతలకు నన్ను అప్పగించడం, అదిగో …ఎంతో అందంగా ఉన్నా స్మశానంలో ఉన్న కారణంగా ఎవరూ ఇష్టపడని ఆ స్మశానపూల లాగానే నా జీవితమూ మారిపోయింది. ఆ దయనీయ స్థితిలో … వయసు రీత్యా ఏర్పడిన కొంత అవగాహన, అదే సమయంలో నా చెల్లెళ్ళను నాలాగే చేయడానికి జరుగుతున్న సన్నాహాలు నన్ను నా పిల్లలతోనూ, చెల్లెల్లతోనూ ఆ ఊరు వదిలేలా చేశాయి.
మీ లాంటి ఒక మహానుభావుడి సాయంతో నా వాళ్ళను దూరంగా వేరు వేరు హాస్టళ్ళలో ఉంచి చదివిస్తూ తల్లిగా నా బాధ్యతకు పాకులాడుతున్నాను.
మరి ఇప్పుడు ఇక్కడ ఎలా గడుస్తున్నది? మరాళి .
స్మశానం సంరక్షణ, వచ్చి పోయేవారి అవసరాలు తీర్చడం, అంతిమయాత్రలో నాట్యం చేయడం ఇలా ఈ పనులకు కుదురుకున్నాను.
ఇంత కంటే నీ పిల్లలను ఎవరికయినా దత్తత ఇస్తే బాగుండేది కదా? అడిగింది మరాళి.
తండ్రి ఎవరో తెలియని నా లాంటి తల్లుల పిల్లల్ని ఎవరు దత్తత చేసుకుంటారు?అంతటి ఉదాత్తగుణం ఆశించడం కూడా తప్పే. ఈ పిల్లలు ఇలాంటి వారు అని తెలిస్తే చులకన చేసే వారూ లేకపోలేదు. అది ఆ లేతమనసుల పై పడితే ఆ నష్టం వారికి, నాకే కాదు ఒకతరం నష్టపోయి సమాజానికి కూడా జరుగుతుంది. అందుకే ఇలా అని చెప్పి,
నా గురించి తెలిసింది కాబట్టి ఇక మీరు కూడా రారేమో కదూ? అన్నది.
మేము రావడం కాదు. ఇక నుండి నువ్వు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు. నీకు ఇంతకంటే మంచి పని నేను చూపిస్తాను, అప్పుడు నువ్వు మాతో రావాలి అని మరాళి ఆమెతో చెప్పి ఇల్లు చేరారు.
***
పదిరోజుల తరువాత మధురిమను మరాళి ఆశా కార్యకర్తగా తన డిపార్టమెంట్ లోనే చేర్చుకున్నది. అందుకు అవసరమయిన శిక్షణ కూడా ఇప్పించింది.
కౌమారదశలో అనోరేక్సియా నేర్వోసా, బులిమియా నేర్వోసా వంటి మానసిక రుగ్మత లతో పీడింపబడుతూ ఎవరికీ చెప్పుకోలేక బాధపడే అమ్మాయిలకు అమ్మలా ఆత్మస్థయి ర్యం నింపడం, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు , వరుస ప్రసవాలు, పోషకాహార లేమి, భ్రూణ హత్యలు, కుటుంబనియంత్రణ అమలు మొ ;వాటిలో తనదయిన ప్రతిభతో మరాళికి మంచి పేరుతెవడమే కాక తన తోటి వారికి ఆదర్శప్రాయమయింది.
మరాళిలోని ఫాలోఫియన్ట్యూబ్ లోని అవరోధం, మధుకర్ లో రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ లె కారణాలని తెలుసుకున్నదయి వారిరువురి అనుమతితో సరోగసి ద్వారా వారి బిడ్డను తనలో పెంచి వారిని తల్లిదండ్రులను చేసి తన ఋణం తీర్చు కున్నది.
స్మశానపూలులా ఎవరూ ఇష్టపడని తన జీవిత గమనాన్ని మార్చిన ఆ ఇద్దరికీ మాతృత్వపు మధురిమలు రుచి చూపించి వారికి ‘’అమ్మ ‘’అయింది. ఎవరికీ అక్కరలేని స్మశానపూల వంటి తన గత జీవితపు మురికి కూపం నుండి బయటకు తేబడి తల్లి గర్భమనే మాయ నుండి బయటపడ్డ నవజాత శిశువులా అ దంపతులనే పునర్జన్మా ఇచ్చిన తల్లిదండ్రులుగా భావించుకొని కొత్తగా పరిమళించింది.
*****
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.
SORRY I DO’ T LIKE THE STORY> SAILIBAGAALEDU. EE ROJULLO BARAIL GROUNDS KOODAA POOLAMOKKALATO AHLAADAMGAA TAYAARUCHESTUNNAARU. HYDERABADLO .
అవునండీ, వాస్తవ కథ ఇది.వారు పలికిన మాటనే అలాగే పెట్టాను. థాంక్యూ అండీ.
ఈ కథ ఎల్లా ఉంది అన్న విషయం అటుంచి, కథ శీర్షిక పట్ల రెండు మాటలు:
1. స్మశానం కాదు, శ్మశానం.
2. శ్మశానం అన్నది సంస్కృత పదం. పూలు తెలుగు. వేరు వేరు భాషల రెండు పదాలని కలిపితే అది దుష్ట సమాసం ఔతుంది, హృదయచప్పుడు లాగ..
ఈ విషయాలను తెలుగు భాషాధ్యాయిని అయి ఉండి రచయిత్రిగానీ సంపాదకులుగానీ పట్టించుకోలేదెందుకో? కథలో భాషాదోషాలు కూడా ఉన్నాయి.
వాస్తవమైన కథ కాబట్టి వారి మాటనే తీసుకొని శీర్షిక పెట్టానండీ.థాంక్యూ.