తల్లి మాట వినని పిల్లపాము
-కందేపి రాణి ప్రసాద్
“నొప్పి తగ్గిందా తండ్రీ!” అంటూ అడిగింది నాగరాణి తన పుత్ర రత్నాన్ని. “ఇంకా చాలా నోప్పిగా ఉందమ్మా” ఏడుపు తన్నుకొస్తుండగా పాము పిల్ల బాధగా చెప్పింది. నాగరాణి అనే తల్లిపాము కూడా కళ్ళ వెంట నీరు కారుస్తూనే ఉన్నది.
“అయినా నేను జాగ్రత్తలు చెప్పి వెళ్ళాను, నువ్వు వినిపించుకోలేదు. పుట్ట విడిచి బయటకు రావద్దన్నానా! అంటూ తల్లి పాము తన కొడుకు నడుం మీద చేతితో మెల్లగా నిమురుతూ అన్నది. “అబ్బా అమ్మా! నీ చెయ్యి తియ్యి, ఇంకా నోప్పి ఎక్కువయింది” అంటూ మూలిగింది పిల్లపాము.
అందుకే మన తాత ముత్తాతలు కూడా “బయటకు వెళ్ళేటప్పుడు మానవుల కంటపడకూడదు, అని దణ్ణం పెట్టుకుని మరీ వెళ్ళేవారట. మానవులు చాలా క్రూరులు. మనం బయట కనిపించామా చంపకుండా వదిలి పెట్టరు. వాళ్ళను మనమేమీ చేయక పోయినా మనకు హాని చేస్తారు. వాళ్ళ అడుగుల చప్పుడు వినపడగానే దూరం జరిగి వెళ్ళి పోవాలి”. అని తనలో తను గొణుక్కుంటూ అన్నది.
నువ్వు చెప్పిన జాగ్రత్తలు గుర్తున్నాయమ్మా! కానీ బాగా మేళాలు చప్పుడు అవుతుంటే ఏమిటా అని చుద్దామని బయటకు వచ్చాను. సరిగా కనిపించట్లేదని ఇంకొంచెం ముందుకు వచ్చాను. అక్కడ కూడా కనిపించలేదని ఇంకా ముందుకు వచ్చాను. వాళ్ళేం చేస్తున్నారో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నంతలో ఎవరో ఒకతను ‘పాము’ అని అరిచాడు. అంతే పది మంది మూగారు. ఒకడి చేతిలోనే కర్ర ఉన్నది. కాబట్టి బతికి పోయాను. మెల్లమెల్లగా రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ పాముపిల్ల చెపుతున్నది.
“అదేనమ్మా! నేనెప్పుడూ పెళ్ళి చూడలేదు. మెల్లగా వెల్లి వాళ్ళ మధ్యలో నిలబడి చూద్దామనుకున్నాడు” అని ఆనందంతో చెప్పింది పిల్లపాము.
“ఆ! ఆ పని చేయాల్సింది ఈ పాటికి చచ్చి ఉండేదానివి. చెస్తే వినకుండా బయటకు వచ్చి దెబ్బలు తిన్నావు ! అంటూ కాస్త కోపంగా అన్నది తల్లి పాము.
“కాదమ్మా! లోపలే ఉన్నాను. బాజాభజంత్రీల మోతలు విని ఏమిటో చూద్దామని బయటకు వచ్చాను. నేను తొంగి చూస్తుండగానే కర్రతో ఒక్క దెబ్బ నా మీద పడింది అమ్మో! చచ్చాన్రోయ్” అనుకుని వెంటనే ఇంటివైపు పరిగెత్తాను. కానీ నడుం నెప్పితో వేగంగా పరిగెత్తలేకపోయాను. “అప్పుడే అతను మళ్ళీ రెండవ దెబ్బ వేశాడు. నేను చెట్ల చాటున దాక్కున్నాను. చీకట్లో నేను కనిపించకపోయేసరికి టార్చిలైటు తీసుకురా’ అని పక్కనున్న వాడిని కేకేశాడు నేను ఎలాగో నొప్పిని భరిస్తూ మెల్లగా పుట్టలోపలికి వచ్చేశాను”. రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ భయభయంగా చెప్పింది పిల్లపాము ఆ భయానికి వళ్ళంతా చెమటలు పట్టేశాయి. తల్లి పాము పిల్ల మీద చెయ్యేసి “కాసిని మంచి నీళ్ళు తాగు ఇదుగో” అంటూ మంచి నీళ్ళు అందించింది. పిల్లపాము మంచి నీళ్ళు గటగటా తాగేసింది. “అవునమ్మా! నీవు చెప్పినప్పటికీ నేను వినలేదు ఏదో కుతుహలంతో పెళ్ళి చూడాలని బయటకు వచ్చాను. తప్పంతా నాదేనమ్మా” అని పిల్లపాము పశ్చాత్తాపంతో తల్లికి చెప్పింది.
తల్లి పాము తన పిల్లను సముదాయిస్తూ “నువ్వు చేసిన తప్పేమి లేదు. మనం వాళ్ళ ఇంటీకి వెళ్ళలేదు. వాళ్ళే మన పోలాల్లొకి వచ్చారు. ఆడవులు కబ్జా చేస్తున్నారు. పోలాలు కబ్జా చేస్తునారు. మనమెక్కుడ నివసించాలి. ఈ భూమ్మీద బతికే హక్కు మనకి లేదా! మొత్తం భూమినంతా మనవులే వాడుకుంటారా! మిగతా జీవుల్ని బతకనీయరా”? అంటూ ఆవేశంగా అన్నది తల్లి పాము.
“ఇంకెప్పుడూ నీ మాట జవదాటనమ్మా, నీవు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తానమ్మా. పొరపాటున కూడా మనిషి కంటపడను. ఎక్కడైనా ఆకుల్లో, చెట్లల్లో దాక్కుంటాను గానీ మనుష్యులకు మాత్రం కనిపించను. నేను జాగ్రత్తలు తీసుకుంటాను” అన్నది పిల్లపాము.
“మా బుజ్జి బంగారానివి, బాగా అర్ధం చేసుకున్నావు ఈ మనుష్యుల పిచ్చి గోలకు దూరంగా బతుకుదాం. ఎలుకల్ని కూడా మనకు మిగల్చకుండా చంపేస్తున్నారు ఏం చేస్తాం! ప్రకృతి వైపరిత్యాలు వస్తే గానీ బుద్ధి రాదు వీళ్ళకు ఇంకొద్దిగా మందు రాయనా” అంటూ తల నిమురుతూ ఉండి పోయింది తల్లి పాము.
*****
నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.
పిల్లల కథ అయినా పెద్దలకి కూడా బుద్ధి చెప్పేలా చాలా బావుంది . నిజమే పైకి కనిపించని మానవుడి నీ మించిన క్రూర మృగం ప్రపంచంలో లేదనే చెప్పాలి.