అడవి పువ్వు (అమృతాప్రీతమ్ కథ “వైల్డ్ ఫ్లవర్” కి అనువాదం)
-కాత్యాయని
మా పొరుగింటి వాళ్ళ ముసలి నౌకరు పర్బతీ. అతని పడుచుపెళ్ళాం అంగూరీ ఇటీవలే కాపురానికొచ్చింది. అతనికిది రెండోపెళ్ళి. మొదటిభార్య ఐదేళ్ళ కిందట చచ్చిపోయింది. ఆమె కర్మకాండలు చెయ్యటానికి గ్రామానికి వెళ్ళినప్పుడే అంగూరీ తండ్రి పరిచయమై తన కూతురినిచ్చి పెళ్ళి చేశాడు.
పెళ్ళి నాటికి అంగూరీ చాలా చిన్నపిల్ల కావటంవల్లా, కీళ్ళవాతంతో మంచానపడిన తల్లిని చూసుకోటానికి ఇంకెవరూ లేనందువల్లా వెంటనే కాపురానికి పంపలేదు. ఇటీవలే పర్బతీ వెళ్ళి ఆమెను ఈ పట్నానికి తీసుకొచ్చాడు. యజమానులిచ్చిన చిన్న గదిలో వాళ్ళ కాపురం. వచ్చిన కొన్నాళ్ళదాకా అంగూరీ ఎప్పుడూ మేలిముసుగుతోనే కనబడేది. ఇప్పుడిప్పుడే దాన్ని తొలగించి బయటికొస్తోంది. అ పిల్ల మాట్లాడుతూవుంటే ముఖ మంతా చిరునవ్వుతో కలకల్లాడిపోతుంది. ఆ ముఖాన్ని చూడటం ముచ్చటగా అన్పించి, ఏదో ఒకటి మాట్లాడిస్తుంటా.
“నీ పాదాలకున్నవి, అవేమిటి అంగూరీ? “
“మువ్వల పట్టాలమ్మా! కాలివేళ్ళకున్నవి మట్టెలు-బిచ్చియా అంటారు.”
“ఇవాళ వడ్డాణం పెట్టుకోలేదేం?”
“బాగా బరువైపోయింది. ఐనా రేపు పెట్టుకుంటాన్లెండి. నా గొలుసు కూడా తెగిపో యింది, బాగుచేయించుకోవాల .”
ఇలా సాగేది మా సంభాషణ. తన వెండినగలన్నిటిని అలంకరించుకుని అందరికీ చూపించడం ఆ పిల్లకు మహా ఇష్టం.
***
ఎండాకాలం వచ్చింది.
వాళ్ళ గదిలో ఉక్కబోతగా ఉంటోందని మా వాకిట్లో వేపచెట్టు కిందకొచ్చి కూచుం టోంది అంగూరీ. ఓరోజు నేనూ అక్కడే కూర్చుని చదువుకుంటూవుంటే దగ్గరకొచ్చింది.
” ఏం చదువుతున్నారు బీబీజీ? “
“నీకూ చదవాలనుందా?”
“నాకస్సలు రాదుగా!”
“ఎందుకు నేర్చుకోలేదు? “
“ఆడాళ్ళు చదవడం పాపం కదమ్మా!”
“మగవాళ్ళకు లేదూ, పాపం?”
“అబ్బే, వాళ్ళకేం కాదు.”
“మరి నేను చదువుతున్నాగా, నేనూ పాపం చేసినట్టేనా? “
“అయ్యయ్యో, బస్తీ ఆడాళ్ళకేం కాదులేమ్మా! పల్లెటూరి అమ్మాయిలు చదివితే తప్పుగానీ.”
అంగూరీ కంగారు చూసి నవ్వేశా. తనూ శ్రుతి కలిపింది.
వాళ్ళ ఊళ్ళో నేర్చుకున్న విషయాలమీదా, పెద్దవాళ్ళు చెప్పిన మాటలమీదా ఆమెకు తిరుగులేని విశ్వాసం. ఇక తనతో వాదించి లాభంలేదు. తన ఊరు, పచ్చటి పొలాలు, తల్లిదండ్రులూ, అక్కచెల్లెళ్ళూ…ఇలా ఎందరినో, ఎన్నిటినో తన కబుర్లతో నాకు పరిచయం చేస్తుంది అంగూరీ. ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా ఏ మగాణ్ణీ కన్నెత్తి చూడకూడదనీ, చూస్తే పాపం చుట్టుకుంటుందనీ వాళ్ళ గ్రామంలో చెప్పారట.
“కనీసం పెళ్ళి చేసుకోబోయే కుర్రాణ్ణి చూడొచ్చా? అదీ తప్పేనా? ” అడిగాను.
“తప్పేమరి!”
“ఎప్పుడూ,ఏ అమ్మాయీ చూడనే చూడదా?”
అంగూరీ కాస్త ఆలోచనలో పడింది.
“ఎవర్నయినా ప్రేమించిన అమ్మాయిలు చూస్తారనుకోండి”, అంది చివరికి.
“మీ ఊరి అమ్మాయిలెవరన్నా ప్రేమలో పడ్డారా?”
“అప్పుడప్పుడూ.”
” ప్రేమించటం కూడా పాపమేనా ఏం? “
“పాపం కాదూ మరి! ఘోరమైన పాపం “, భయంగా చెప్పింది.
“ఆ సంగతి తెలిసికూడా ఎందుకు ప్రేమిస్తారంటావ్?”
” కావాలని ప్రేమిస్తారేంటమ్మా? మగాళ్ళే అమ్మాయిలకు మందు పెడతారు. దాంతో వాళ్ళమీద ప్రేమ పుట్టేస్తుంది.”
“ఏంటా మందు?”
“ఏదో పువ్వు. అడివిలో దొరుకుతుంది. దాన్ని మిఠాయిలోనో, పాన్ లోనో చుట్టి తినిపిస్తారు. ఇంక ఆ అమ్మాయి ప్రపంచంలో ఏ మగాణ్ణీ ప్రేమించదు, అతన్ని తప్ప.”
“నిజంగానా?”
“నిజం. నా కళ్ళతో చూశా. నా దోస్తు ఓ పిల్ల ఉండేది. దానికి ఓ కుర్రాడు అడివిపువ్వు తినిపించాడు. మతిపోయి, వాడితో లేచిపోయింది.”
” ఆ అమ్మాయి అడవిపువ్వు తిన్నదని నీకెలా తెలుసు?”
“బాగా తెలుసు. బర్ఫీలో పెట్టి తినిపించాడు. ఇంకా చాలా వస్తువులు_గాజులూ, పూసల దండలూ, అన్నీ తెచ్చిచ్చేవాడు పట్నంనించి.”
“అవన్నీ బహుమతులు కదా, అడవిపువ్వేదో తినిపించాడంటావేం? “
“లేకపోతే ఎందుకు ప్రేమించిందంటారు? మీరే చెప్పండి?”
” అదేంటి అంగూరీ? మనసుకు నచ్చినవాళ్ళను ప్రేమిస్తారు కదా?”అన్నాను. ఆమె ఒప్పుకోలేదు.
“అదేం కాదులేమ్మా. అమ్మానాన్నల్ని బాధపెట్టి అట్లా ప్రేమిస్తారా? అందుకే మగాళ్ళెవరన్నా మిఠాయిలిస్తే తీసుకోగూడదని అమ్మ ఎప్పుడూ చెప్పేది. ఆ పువ్వు తిన్నాక మా నేస్తం పిచ్చిదానిలా అయిపోయింది.అన్నం తినదు, నిద్ర పోదు, జుట్టు దువ్వుకోదు. ఏవేవో పాటలు కూడా పాడేది. “
“ఏం పాటది? నీకొచ్చా? “
“ఛీఛీ! అడివిపువ్వు తిన్నోళ్ళే అట్టా పాటలు పాడతారు, ఏడుస్తారు. ” విచారంగా చెప్పింది అంగూరీ.
***
కొన్నాళ్ళుగా అంగూరీ నా దగ్గరికి రావటమే లేదు. ఒక రోజు చెట్టుకింద కూర్చుని చదువుకుంటుంటే వచ్చి, మౌనంగా కూర్చుంది. కాలిమువ్వలు తీసేసినట్టుంది. అందుకే తన రాకను గమనించలేదు నేను.
“అలా ఉన్నావేం అంగూరీ? ” అడిగాను.
“నాకు రాయటం నేర్పించండమ్మా,” అంది.
“ఏం? ఎవరికన్నా ఉత్తరం రాయాలా? “
జవాబివ్వలేదు. కాసేపయ్యాక లేచి వెళ్ళిపోయింది.
ఆ సాయంత్రం ఒంటరిగా చెట్టుకింద కూర్చుని ఉండటం చూసి దగ్గరకెళ్ళా. నా రాకను గమనించకుండా ఏదో పాట పాడుతోంది.
” పాట బావుంది అంగూరీ ” ,అన్నాను.
చటుక్కున ఆపేసి నావైపు చూసింది. కళ్ళనిండా నీళ్ళు.
“ఈ పాట నా నేస్తం పాడేదమ్మా. ఇంకా చాలా పాడేది.”
“ఇంకోపాట పాడరాదూ!”
నా మాట వినిపించుకున్నట్టే లేదు. తనలో తనే ఏదో గొణుక్కుంటూ, వేళ్ళు మడుస్తూ ఏవో లెక్కలు కడుతోంది.
“అంగూరీ!”
శూన్యమైన చూపులతో నాకేసి కళ్ళెత్తింది. తన భుజంచుట్టూ చెయ్యి వేశాను. ఆమె శరీరం సన్నగా వణుకుతోంది. జాలీ, ప్రేమా పొంగుకొచ్చాయి నాలో.
‘నా చిట్టితల్లీ, ఏమైంది నీకు? అడవిపువ్వుగానీ తిన్నావా, ఏంటమ్మా? ‘ ,అని అడగాలనిపించింది. బలవంతంగా ఆపుకుంటూ, “అన్నం తిన్నావా?” అన్నాను.
పర్బతి యజమానుల ఇంట్లోనే భోజనం చేస్తాడు. తను ఒక్కతే వండుకుంటుంది.
“ఒండుకోలేదమ్మా!”
“చాయ్ అయినా తాగావా, లేదా? “
“ఇవాళ పాలు లేవుగదమ్మా. మేం పాలు పోయించుకోం. ఆ రామ్ తారా పట్టుకొస్తాడు రోజూ .”
రామ్ తారా అంటే మా కాలనీ చౌకీదారు. రాత్రంతా మేలుకుని కాపలా ఉంటాడని మేమందరం చాయ్ ఇస్తుండేవాళ్ళం. ఈ మధ్యన అతడు మా ఇళ్ళకు చాయ్ తాగడానికి రావటంలేదు.
అంగూరీ కాపురానికి వచ్చినప్పటి నుంచి రామ్ తారా రోజూ పాలబ్బాయి దగ్గర కాసిని పాలు కొనుక్కుని అంగూరీవాళ్ళ గదికి పట్టుకెళ్తాడు. ఆమె వాటితో చాయ్ పెడుతుంది. పర్బతీ, రామ్ తారా, అంగూరీ కలిసి చాయ్ తాగుతారు.
ఈ విషయాలన్నీ నాకు గుర్తొచ్చాయి. మూడు రోజుల కిందట రామ్ తారా వాళ్ళ ఊరికి వెళ్ళాడని కూడా గుర్తొచ్చింది. బాధా, జాలీ కలగలిసిన నవ్వొకటి నా పెదాలపై కదిలింది.
“మూడు రోజుల్నించీ చాయ్ తాగలేదా అంగూరీ? అన్నం కూడా తినలేదు కదూ?”అన్నాను.
లేదన్నట్టుగా తల ఊపింది.
రామ్ తారా రూపం నా కళ్ళముందు మెదిలింది. అందంగా, చురుగ్గా ఉండే కుర్రాడు. మాట్లాడుతూ ఉంటే అతని కళ్ళు నవ్వుతుంటాయి. మంచి మాటకారి కూడాను.
“అంగూరీ!”
“ఏమ్మా? “
“అడవిపువ్వు తిన్నావా? “
వెక్కిళ్ళు పెడుతూ ఏడవసాగింది అంగూరీ.
“మీ మీద ఒట్టమ్మా! నేనెప్పుడూ అతని దగ్గర మిఠాయి కానీ, పాన్ గానీ తిననే లేదు. ఉత్తి చాయ్ తాగానంతే. చాయ్ లోనే కలిపాడేమో…”
అంగూరీ మాటల్ని వెక్కిళ్ళు మింగేశాయి.
*****
కాత్యాయిని గారికి అభినందనలు
అద్భుతమైన అనువాదం
చాలా బాగుంది అడవి పువ్వు కథ! అనువాదం కూడా సరళంగా హాయిగా ఉంది. అమృత ప్రీతం గారి కథలు చాలా చదివాను కానీ ఈ కథ మాత్రం ఇదే తొలిసారి చదవటం.
-చంద్ర ప్రతాప్ కంతేటి.
పూర్వ సంపాదకులు, విపుల చతుర
Thank you Suguna garu
Very nice story heading of the story was very accurate and appropriate telugu translation of Mrs Katyayani was very nice 👍🙂
Thank you so much.
Thank you
అడివి పువ్వు అంగూరి ని అమృతా ప్రీతం ఎంత చక్కగా చిత్రించారు అంత చక్కగా రచయిత్రి కాత్యాయిని గారు అనువదించి నందుకు అభినందనలు.