ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 4
(ఒరియా నవలిక )
మూలం – హృసికేశ్ పాండా
తెనుగు సేత – స్వాతీ శ్రీపాద
నవంబర్ 1997 వచ్చేసరికి పూర్ణ, ప్రేమ శిలకు ముగ్గురు పిల్లలు. హృదానంద కాక మరో కొడుకు, కూతురు. ఈ లోగా పూర్ణా అధిక వడ్డీ, వడ్డీ చెల్లింపు విషవిలయానికి బలి పశువయాడు. ముందు తన భూమిని తాకట్టు పెట్టాడు. తరువాత అమ్మేసాడు. పూర్ణా ఒప్పందపు వలస కూలీగా ముందు జలంధర్ కింద, తరువాత జహంగీర్ కింద ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆరోగ్యం నాశనం చేసుకున్నాడు. అతని పక్కటెముకలు చర్మంలో నుండి పొడుచుకు వచ్చాయి, ఆకలి లేకుండా పోయింది. 1997 నవంబర్ కి అతని అప్పు పెరిగిపెరిగి నాలుగు వేల రూపాయలకు చేరింది. జలంధర్ కాని జహంగీర్ కాని అతన్ని వలస కూలీగా ఒంటరిగా పంపడానికి సిద్ధంగా లేరు, అదీ నాలుగువేల అప్పుతో. అందుకని పూర్ణా, ప్రేమశిల ఇద్దరూ వలస కూలీలుగా వలస వెళ్ళారు. హృదానంద చిన్న గమడాలో ఒక టీ , స్నాక్స్ అమ్మే చోట పనికి కుదిరాడు. ఆ జంట మిగతా ఇద్దరు పిల్లలనూ పూర్ణ తమ్ముడి దగ్గర వదిలి వెళ్ళారు. వాళ్ళు అయిదు వేలు అప్పు చేసి మునపటి నాలుగువేల అప్పు కట్టేసారు. అయిదు వందలు అతని తమ్ముడికి ఇచ్చి మిగతా డబ్బుతో ఆంధ్రాకు ఇటుకల బట్టీ పనికి బయలు దేరారు. ప్రయాణమంతా ప్రేమశిల మౌనంగానే ఉంది. తిండి తినలేదు, నీళ్ళు కూడా సరిగా తాగలేదు. పూర్ణ అనుభవం ఉన్న వాడిలా ప్రవర్తించాడు. ఈ సారి వారితో జహంగీర్ తాలూకు బ్రోకర్ ఉన్నాడు.
ఈ సారి పూర్ణ విషయంలో ఒక మార్పు కనిపిస్తోంది, భార్య వెంట ఉంది గనక ఇతర వలస కూలీలతో పాటు ఒకే గుడిసెలో ఉండలేడు. అతను నదీ తీరాన, వరుసగా ఉన్న వసతి గృహాలకు దూరంగా ఒక గది కట్టుకున్నాడు. అది ఇదివరకు అతను ఉన్న నదీ తీరమే. కొడుకు హృదానంద పుట్టాక అతను వలస వెళ్ళిన చోటే. కొందరు యువకులు అంతకు మునుపు పూర్ణాతో వచ్చిన వాళ్ళూ ఈ సారి భార్యా పిల్లలలతో వచ్చారు. పూర్ణా లాగే వాళ్ళూ విడిగా గుడిసెలలో ఉన్నారు. వాళ్ళూ , వాళ్ళ స్త్రీలూ ముసలి వాళ్ళులా ఉంటే ప్రేమశిల వయసులో ఉన్నట్టు అనిపించేది.
పూర్ణా, ప్రేమశిల రోజుకు నలభై నుండి యాభై రూపాయలు సంపాదించే వారు. ఇరవై అయిదు రూపాయలు అప్పుకు కట్టేవారు. పదిహేను -ఇరవై రూపాయలు తమకోసం ఉంచుకునే వారు.
ప్రేమశిల గుడిసెలో నేల బట్టీలో విరిగిపోయిన ఇటుకలను పరచి ఏర్పాటు చేసుకున్నారు. అది కుమ్మరి మట్టితో అలికారు. ఒకసారి బట్టీలో వాడిన ఆరు కర్రముక్కలు గుడిసెకు స్థంభాలుగా నిలిచాయి. పై కప్పుకు వెదురు కర్రలు ఎండిన గడ్డి వాడారు. విరిగిన ఇటుకలు బంకమట్టి పూత గోడలను అమర్చాయి. గుడిసె ఎత్తు పూర్ణ నడుం వరకూ వచ్చేది. ఇంక ఏమాత్రం చిన్నదిగా ఉన్నా, పూర్ణ లోపలికి పాకుతూ వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు వంగి వెళ్తున్నాడు. ఒకవేళ ఎత్తు ఎక్కువగా ఉంటే గుడిసె గోడలు వెదురు కర్రలు , చెక్కల బరువును ఆపగలిగేవి కాదు. పొయ్యి గుడిసె బయట చేసుకుని అక్కడ అన్నం ఒకటే వండుకునే వారు.
ఆ నదీ తీరాన ప్రేమశిల గుడిసె మిగతా జంటల గుడిసెల కన్నా రెండు విధాల వేరుగా ఉండేది. ఒకటి ఆమె ఎప్పుడూ గుడిసె ముందు చిన్న వరండా కట్టుకునేది. గుడిసెకు నాలుగు మూలలా నాలుగు కర్రలు పాతి పైకప్పు వేసుకుని ఉండవచ్చు, ఆమె దగ్గర ఉన్న ఆరు కర్రలతో ఇంటిని గజం, గజన్నర వరండాగా పెంచాలనుకుంది. రెండోది గుడిసె ఎప్పుడూ శుభ్రంగా ఉంచి ఎర్రరంగు మట్టితో అలికేది.
ఆ వరండా, గుడిసె పరిశుభ్రత ఇటుక బట్టీ యజమానిని అతని గుమాస్తా, స్నేహితుల దృష్టిని ఆకర్షించింది. కాలక్రమాన తమ సారాయి, తినుబండారాలతో అక్కడికి చేరడం మొదలెట్టారు. వాళ్ళు ప్రేమశిల ఆతిధ్యాన్ని తీసుకుని ఆమె పెట్టిన తరవాణీ, వాళ్ళు తెచ్చిన ఎండిన ఉప్పు చేపలతో తినేవారు. వాళ్ళు దయామయులు అందుకే ఆమెకోసం కాసిన్ని ఎండు చేపలు వదిలి వెళ్ళేవారు. పూర్ణ గుడిసెలో తాగి ఒంటి మీద తెలివిలేకుండా పడుకునేవాడు. స్పృహలేని స్థితిలో అతనుండగా , యజమాని, అతని మిత్రులు ప్రేమశిలను బలవంతంగా అనుభవించేవారు లేదా ఎటైనా తీసుకు వెళ్ళేవారు. ఒక్కోసారి పూర్ణ స్పృహలోనే ఉన్నా ఆమెను బలవంతాన తీసుకుపోయి నప్పుడు లేనట్టు నటించేవాడు .
ఎక్కువ కాలం గడవకముందే ఇలా అస్తవ్యస్తంగా, అనిశ్చితంగా జీవనం సాగించడం అసాధ్యమని ప్రేమశిల గ్రహించింది. తన చిన్నతనంలో తండ్రి కూనిరాగం తీసే ఒక పాట గుర్తుకువచ్చింది ఆమెకు. ఆ పాట సారాంశం – మొగుడు చేతకానివాడైతే భార్య యుక్తిగా మార్చుకోవాలి, దేవుళ్ళ అనుగ్రహానికి ప్రార్ధించాలి. కాని ఇటుక బట్టీ ఉన్న నదీ తీరాన ఒక చెట్టు కూడా కనబడదు, ఇహ గుళ్ళూ దేవుళ్ళమాటెక్కడ? ప్రేమ శిల డబ్బు పొదుపు చెయ్యడం మొదలుపెట్టింది. నడుమెత్తు గుడిసెలో ఉన్నా, ఎంతమందో అనుమతి లేకుండా వస్తున్నా , తన మీద అత్యాచారం చేస్తున్నా రాత్రీ పగలూ ఆహ్వానించని జనం వచ్చిపోతున్నా, గుడిసెకు తలుపు లేకున్నా, వెన్ను విరిగేంతపని రోజంతా చేస్తూ కూడా డబ్బు వెనకేసింది. బ్రోకర్ల నుండి ట్రెయిన్లు ఎప్పుడూ వస్తాయి వెళ్తాయి అనే సమాచారమూ సేకరించింది. మే చివరలో దారి ఖర్చులకు సరిపడా డబ్బు సమకూరగానే పూర్ణాతో తనకు విపరీతంగా రక్తస్రావం అవుతోందనీ అది తన నెలవారీ సమస్యో మరింకేదో గాని ఆ రోజు , రాత్రి అతిధులు రాకూడదని బ్రతిమాలుకుంది. ఆ రాత్రి ప్రేమశిల , పూర్ణా ఇటుక బట్టీ వదిలి వెళ్ళిపోయారు, ముందు ఒక ట్రెయిన్ ఎక్కి కొంత దూరం వెళ్ళాక గమెడా రోడ్ వెళ్ళే మరో ట్రెయిన్ తీసుకున్నారు. జూన్ మొదటి వారంలో గమడా రోడ్ స్టేషన్ లో దిగారు.
వాళ్ళక్కడ దిగే సరికి ఇద్దరూ ముప్పై రెండూ , ఇరవై ఎనిమిదేళ్ళ వాళ్ళే అయినా ముసలి డొక్కుల్లా, అలసిపోయిన మొహాలతో కనిపిస్తున్నారు. కాలం చేసిన విధ్వంసం, అత్యాచారాలు, దుర్మార్గాలు, రోగభూయిష్టమైన పరిసరాలు, వారిని అకాల వృద్ధులను చేసేసింది.
పై నిజాలు చెప్పిన జర్నలిస్ట్ రాజీవ్ కు నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. అతను వారి మాటలు రికార్డ్ చేసాడు, వారి ఫొటో తీసాడు. నా విచారణ సమయంలో అతను ఆ రికార్డ్ వినిపించాడు. ఫొటోలను చూపించాడు. ఆ సమయంలో ఆ సమాచారం ఎందుకు వార్తగా ప్రచురించలేదో అడగాలనుకున్నాను.
అతని జవాబు- ఈ విషయంగా తన తండ్రి అభిప్రాయం అడిగాననీ, వాళ్ళ నాన్న దాన్ని పక్కకు తప్పించాడనీ. అతని తండ్రి, తిండిని సమకూర్చే భగర్తి , ఇద్దరూ వలస కూలీలను పంపే ఏజంట్స్ అవడం వల్ల అతనే పూర్ణను మొదటి సారి వలసకూలీగా పంపాడు మరి.
*****
(సశేషం)
స్వాతీ శ్రీపాద పుట్టి పెరిగినది నిజామాబాద్. కధ, కవిత, నవల ఒకఎత్తైతే , అనువాదం మరొక ఎత్తు. వెరసి మొత్తానికి అక్షరాలే ప్రపంచం. రాసినది చాలానే అయినా ప్రచురించినది 8 కవితా సంపుటాలు, 7 కధా సంపుటాలు, 4 నవలలు మరెన్నో డిజిటల్ పుస్తకాలు. అనువాదాలు 32 తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం , ప్రతిభా పురస్కారం, వంశీ -తెన్నెటి లత కధా పురస్కారం , వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం , రచనకు అనువాదానికి మహాత్మా ఫూలే అవార్డ్ , మొదలైనవి ఎన్నో…