ఆమె ఎవరు?

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-తాటిపాముల మృత్యుంజయుడు

          ‘హలో సార్, ‘ఆకాశం ఎర్రబడింది, భూదేవి సిగ్గుపడింది’లాంటి అతిశయోక్తులు ఎప్పుడైనా విన్నారా?’

          ‘ఏమో నాకు అవన్నీ తెల్వద్, అయినా ఇప్పుడు అదెందుకడుగుతున్నవ్?’

          ‘ఓహో మీరు ప్రశ్నకు ప్రశ్న వేస్తున్నారా, వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత మీకు బాగా వంటబట్టినట్టుంది. ఎందుకు అడుగుతున్నానో ఓ రెండు నిమిషాల్లో చెబుతాను, పక్కకు నిలబడండి, ఎక్కడకి వెళ్ళకండి, ప్లీజ్…

          హలో, అలా వెళ్ళే ఇంకో సార్, మిమ్మల్నే… ఇటు రండి… ఆకాశం ఎర్రబడటం మీరెప్పుడైనా చూసారా?”

          ‘అసలేం అడుగుతున్నావో నీకు తెలుసా… ఆకాశం ఎప్పుడు నీలంగానే ఉంటుంది… అప్పుడప్పుడు ఓ ఛాయ ఎక్కువ తక్కువ… అంతే’

          ‘మరైతే, భూదేవి సిగ్గుపడటం…?’

          ‘అదేంటయ్యా, మనిషి మార్స్ గ్రహం మీదకు వెళ్ళాలనుకుంటున్న ఈ కాలంలో కూడా భూదేవేంటీ, సిగ్గుపడింది అనే అర్థంపర్థం మాటలేంటి?… సిగ్గు పడటం ఏమో గానీ, అప్పుడెప్పుడో రామాయణంలో సీతాదేవి అవమానం పాలైతే ఆవిడ తల్లి భూదేవి తల్లడిల్లి నట్టు కాలేజీలో మా లెక్చరర్ చెప్పినట్టు గుర్తు… ఇలాంటివెన్నో కవులు కూర్చుని రాస్తుంటారు, అంతే… దాన్నే కవి సమయం అంటారని విన్నట్టు గుర్తు ‘

          ‘అబ్బ, కనీసం మీరు చూడకున్నా, కాలేజీలో మార్కుల కోసం చదివింది ఇంకా గుర్తెట్టుకున్నారు… మీరు కూడా ఆ మొదటి సారు పక్కన నిలబడండి, ప్లీజ్…

          హలో, అటుగా పోయే నలుగురు సార్లూ, ఇదిగో మిమ్మల్నే… ఇటు రండి… ఆకాశం ఎర్రబడటం, భూదేవి సిగ్గుపడటం ఎప్పుడైనా చూసారా మీరు?’

          ‘ఏంటయ్యా నీ నస… కొంపలు మునిగిపోయినట్టు అందర్నీ పట్టుకొని ఒకటే అడుగు తున్నావ్? నీకు పని పాటా లేకుంటే అందరూ నీలానే ఖాళీ అనుకుంటున్నావా?’

          ‘ఓహో, నా గొంతులో అలాంటి బాధ ధ్వనించిందా… నన్నర్థం చేసుకోండి, ప్లీజ్. మీరు కొద్దిగా టైమిస్తే అంతా చెబుతాను ‘

          ‘ఏంటీ, నీకు మా టైం కావాలా, ఇప్పుడు ఫుల్ బిజీ… మంచి ఫారిన్ సరుకు చేతికం దింది… పార్టీ చేసుకోవాలి… మంచింగ్ కు చికెన్ పకోడీలు, పప్పు గారెలున్నాయి…గారెలు టొమేటో కెచప్ తో నంజుకుంటూ ఫారిన్ విస్కీ సిప్ చేస్తే… హాట్ అండ్ స్వీట్… ఎంత మజాగా ఉంటుందో తెలుసా… పోవయ్యా పో, నీతో టైం వేస్ట్… పెద్ద బొక్క ‘

          ‘అయ్యయ్యో అలా అనకండి. దయచేసి మీ నలుగురు సార్లు ఆ ఇద్దరు సార్ల పక్కన నిలబడండి…

          అమ్మా, ఇదిగో తల్లీ… దయచేసి ఇటురా తల్లీ… నేను ఈ ఆరుగురు సార్లందరిని అడుగుతున్నది మీరు విన్నారు కదా… కనీసం మీరైనా చెప్పండి ‘

          ‘అవును నువ్వు సంధిస్తున్న ప్రశ్నలు విన్నాను… ఆ ప్రశ్నల్లో ఆర్తిని… మీ కడుపు లోని ఆవేదనని అర్థచేసుకొంటున్నాను… ఇదేదో తప్పక స్త్రీ గురించే అయ్యుంటుంది… అలాంటి సమయాల్లోనే కదా, ‘ఆకాశంలో సగం’ అంటూ తెలుగులోను, ‘Women hold up half the sky’ అని ఇంగ్లీషులోను అనడం వింటుంటాం…’

          ‘హమ్మయ్య, మీ మాటలు వింటూంటే నాకు ప్రాణం లేచొచ్చింది… ఎంతైనా ఆడ మనసు… సార్, మొదటి సార్… రెండో సార్, మీరు గూడా… మందు పార్టీ నలుగురు సార్లూ, కొన్ని నిమిషాలు ఆగండి… అమ్మా! దయచేసి మీరు కూడా…కొన్ని నిమిషాలు నేను చెప్పేది వినండి… ‘విబుధజనుల వల్ల కన్నంత విన్నంత తెలియ వచ్చినంత తేట పరతు ‘ అని మన తెలుగు సాహిత్యానికి పెద్ద ఐన పోతన చెప్పినట్టు గొప్పగా కాకుండా, స్వయంగా నా కళ్ళతో నేను చూసినది, చెవులతో విన్నది చెబుతాను వినండి… ఎక్కువ టైం తీసుకోను…’

          ‘సరే, చెప్పు, మగవాళ్ళం, ఇంటికి పెద్దదిక్కులం, ఇంటా బయటా చాలా పనులుం టాయ్, తొందరగా కానీయ్’

          ‘నాలాంటి ఇల్లాలికి ఇంట్లో పనులు ఎప్పుడుండేవే, తొందరేం లేదు, నెమ్మదిగా చెప్పు ‘

          ‘హమ్మయ్య, మీకందరికి థాంక్స్… ఇలా సాగుతుంది నే చెప్పేది…ఓ కథగా అల్లుతూ చెబుతాను…’

***

          ‘ఆకాశం ఎర్రబడింది, భూదేవి సిగ్గుపడింది’ లాంటి పెద్దమాటలు అంతకు ముందు నేను చదివి వుండవచ్చని నా అనుమానం. కాని ఆ సాయంత్రం నేను తలెత్తిచూస్తే ఆకాశంలో కనీసం సగమైనా ఎర్రదనాన్ని చూసుండేవాడినేమో. తలొంచుకుని నేను నిల్చున్న నేలను చూస్తే ఆ తల్లి అవమాన భారంతో, సిగ్గుతో తల్లడిల్లుతున్న వైనం కనిపించేదేమో.

          ఏదేమైనా, తల పైనా, కాళ్ళ కిందా భౌతికంగా అలాంటి మార్పులు జరగకపోయినా కళ్ళేదురుగా జరిగిన ఆ సంఘటన మాత్రం వాస్తవం. అలాంటి తలపులను కలిగించడం మరీ వాస్తవం.

          ఆఫీసర్ గా ప్రమోషన్ ఇస్తూ నన్ను గౌహాతికి బదిలీ చేసింది నేను పనిచేసే బ్యాంకు. అక్కడ మూడేళ్ళు గడిపితే తిరిగి తెలుగునేలకి రావచ్చు అని ఒప్పేసుకున్నాను నేను. దూరప్రయాణం అంటే వ్యయప్రయాసలతో కూడుకున్నది కాబట్టి ఏడాదికి ఒకసారి హైద్రాబాదుకు వస్తున్నాను. ఆ కోవలోనే ఇప్పుడు హైద్రాబాదుకు వచ్చాను. ఎలాగు ఇంత దూరం వచ్చాను గనుక నేను పుట్టిన ఊరెళ్ళాను. అక్కడ ఇంకా నివసిస్తున్న చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా ఓ పూట గడిపాను. ఊరెళ్ళినప్పుడల్లా నేను చదువుకున్న స్కూలుకెళ్ళి చిన్ననాటి మధురస్మృతులను నెమరేసుకుంటాను.

          సాయంత్రం నాలుగు గంటలు కావస్తుంటే ఊరునుండి వరంగల్ వెళ్తున్న స్నేహితుడు ఒకడు నన్ను తన కారులో తీసుకెళ్తానన్నాడు. వరంగల్ చేరుకుంటే అక్కడి నుండి హైద్రాబాదుకు ఏదో ఒకవిధంగా చేరుకోవచ్చని బయలుదేరాను. వరంగల్ చేరుకొన్న తరువాత సిటీ మధ్యలో నన్ను దింపేసి తన పనిమీద వెళ్ళిపోయాడా స్నేహితుడు. అక్కడ హైద్రాబాదు వెళ్ళే బస్సులు ఆగుతాయి.

          శనివారం సాయంత్రం అయిదు కావస్తోంది కాబట్టి ఆ నాలుగురోడ్ల కూడలి యమరద్దీగా ఉంది. ఆఫీసులు మూసే సమయం, కాలేజీ స్టూడెంట్స్ క్లాసులు, కోచింగ్ ముగించుకొని ఇంటికి చేరుకునే వేళ, స్కూలు పిల్లలు ట్యూషన్ నుండి ఇంటికి చేరుకొనే పొద్దు. రోడ్డుకు ఓ పక్క స్టవ్ వెలిగించి నూనె వేడిచేస్తూ మిరపకాయబజ్జీలు వేయటానికి సమాయత్తమవుతున్నాడు తోపుడుబండివాడు. అటు పక్కగా మొక్కజొన్న కంకులను నిప్పుల పైన కాలుస్తున్నది ముసలవ్వ. షాపింగు చేస్తున్నవాళ్ళు దుకాణాల మెట్లు ఖాళీ చేతులతో ఎక్కుతూ, నిండిన బ్యాగులతో దిగుతున్నారు. సినిమాలు, షికార్లకై బయలు దేరిన వారు, ఎప్పుడొస్తుందో తెలియని సిటీ బస్సు కోసం ఉసూరుమంటూ ఎదురుచూసే వారు, వీళ్ళదగ్గరి నుండి బేరం సంపాదించాలని అక్కడ ముసురుకున్న ఆటో వాళ్ళు, వీళ్ళతో పాటు పనిపాటా లేక ముసురుకొంటున్న ఈగలను చేతులతో తోలుతూ తచ్చాడేవాళ్ళు ఉరఫ్ జులాయిలు, ఇలా ప్రతీ సిటీలో కనిపించే తతంగమే ఇక్కడ కూడా కానవస్తోంది.

          విప్పారిన నేత్రాలతో ఈ వాతావరణాన్ని చూస్తూ ఎంతగా పెరుగుతున్నది, అభివృద్ధిచెందుతున్నది నా దేశం అనుకున్నాను.

          అంతలోనే ఆటోలోంచి దిగింది ఓ అమ్మాయి. వయసు ఇరవైకి అటుఇటుగా వుండొచ్చు. కాలేజీ నుండి వస్తుందేమో, వీపున బ్యాగు ఉంది. పాంటు, షర్టు వేసుకొంది. ఎందుకో చూపులో పిరికిదనం ఉంది. ఆమె నడకలో బెరుకుదనం ఉంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ బస్టాపు వెనకాలకు వెళ్ళి నిలుచుంది. నాకు అమ్మాయికి మధ్య నాలుగు అడుగుల దూరమే.

          మనసులోని భావాలను ముఖం చాటుతుందని అంటారు. అమ్మాయి మనసులో జరిగే అలజడి, భయం వలన వచ్చే పిరికితనం ముఖంలో తేటతెల్లమవుతున్నాయి. ఎవరైనా తెలిసినవాళ్ళు ఇటు వస్తారేమో, చూస్తారేమో అన్నట్టుగా కనుకొనల నుండి చూస్తూ దృష్టిని చేతిలో ఉన్న ఫోను పైకి మరలిస్తున్నది. అప్పటి వరకు ఈగలను చేతులతో తరుముతూ యమబిజీగా అక్కడ తచ్చాడుతున్న జులాయికి ఒక్కసారిగా కళ్ళకు పని దొరికింది. అమ్మాయి దిక్కు కొద్దిగా నడిచి వెకిలిగా చూడడంలో నిమగ్న మయ్యాడు.

          కొద్ది నిమిషాల తేడాలో ఇంకో ఆటోలోంచి ఓ అబ్బాయి దిగాడు. దాదాపు అమ్మాయి వయసే. చూస్తుంటే కాలేజీ కుర్రాడిలా ఉన్నాడు. వీపున బాక్ ప్యాక్ ఉంది. అటుఇటు పరికించి అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టాడు. తను చెప్పినట్టుగా వచ్చినందుకు సంతోష పడ్డాడు. వస్తుందో, రాదో అని భయపడ్డ అబ్బాయి ఒక్కసారి ఊపిరి పీల్చుకొన్నాడు. తలొంచుకొని గబగబా అటుదిక్కుగా నడిచాడు. అమ్మాయి పక్కన నిల్చున్నాడు.

          అతను అమ్మాయి ముఖంలోకి చూస్తూ ఏదో మాట్లాడాడు కాని అమ్మాయి ఇతన్ని చూడడం లేదు.

          “ఏమి మాట్లాడవేం, నీకిష్టమైన చాక్లెట్ తీసుకొచ్చాను, ఇదిగో” అంటూ బ్యాగులో నుండి చాక్లెట్ బార్ తీసి అమ్మాయి చేతిలో పెట్టాడు. అమ్మాయి ముభావంగా తీసుకొంది. కనీసం ఒక చిరునవ్వు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉన్న అమ్మాయిని చూస్తుంటే నిరాశపడ్డాడు.

          ‘ఐ లవ్యూ ‘ అని నెమ్మదిగా అన్నాడు.

          అలా చెప్పాలని ఎంత కాలంగానో తాపత్రయపడుతున్నాడు. అలా చెబితే అమ్మాయి నమ్మి వెంటనే తన కౌగిలి చేరుతుందని తరాలుగా వస్తున్న అందరి అబ్బాయి ల్లాగే ఈ అబ్బాయికి కూడా దురభిప్రాయం ఉన్నట్టుంది. కాని, ఆ మాటలు కడుపులో నుండి రాలేదని, నాలుక చివరినుండి తుప్పర్లుగా వచ్చాయని అమ్మాయి ఇట్టే పసిగట్టి నట్టుంది. ఎంతైనా స్త్రీజాతికి చెందింది కదా, వారికి తెలుసు, ‘ఏది నిజమైన ప్రేమో, ఏది తాత్కాలిక ప్రేమో?’ అన్న విషయం.

          “ప్లీజ్, నువ్వు కూడా ఐ లవ్యూ అని చెప్పు ” ప్రాధేయపడ్డాడు.

          కనీసం ఒక్కసారైనా ఆ మాట అమ్మాయితో అనిపిస్తే తను ఇంకొంచం ‘ప్రొసీడ్’ కావచ్చని అతని ఆలోచన. కాని, అమ్మాయిలో చలనం లేదు. అబ్బాయిలో అసహనం మొలకెత్తింది.

          “అందరి అబ్బాయిల్లాగా నేను కాదు, నిజంగానే ఐ లవ్యూ యూ” తను ‘స్పెషల్ ‘ అని చెప్పుకుంటే నమ్ముతుందని అతని దురాలోచన. ‘నిజమైన ప్రేమ బహు అరుదు ‘ అని అందరి అమ్మాయిల్లాగే ఈ అమ్మాయికి కూడా అనుభవం. ఇంతకు ముందు కొంతమంది అబ్బాయిలు ఇలానే చెప్పి, తర్వాత వేరే అమ్మాయిల వెనుక పడుతూ ‘ఐ లవ్యూ’ చెప్పడం చూసిందేమో. అబ్బాయి అమ్మాయి భుజం చుట్టూ మెత్తగా చేయి వేసాడు. అమ్మాయి ఆ చేతిని సుతారంగా తొలగించి ఒక అడుగు పక్కకు జరిగింది.

          ఇదంతా చూస్తున్న జులాయికి హుషారు మొదలైంది. చొంగకార్చటం మొదలె ట్టాడు. ఇలాంటి వాటి గురించే అతను ప్రతి సాయంత్రం ఎదురు చూసేది. తెరపైన ఆడుతున్న సినిమాలా కాకుండా కంటిముందు జరుగుతున్న లైవ్ షో ఇది. ఇలాంటివి అతనికి మంచి ‘కిక్కు’నిస్తాయి. ఒక్క జులాయియే కాదు గమనించేది. దగ్గర్లోని షాపు ముందున్న పిట్టగోడపై తన ఐదేళ్ళ కూతురితో బస్సు కొరకు ఎదురుచూస్తున్న ఇల్లాలు కూడా గమనిస్తున్నది. ఈ సన్నివేశం జులాయికి కిక్కు ఇస్తే ఆమెకు మాత్రం అబ్బాయి ప్రవర్తన ఛీత్కారం కలిగిస్తున్నది. మూలనున్న కిళ్ళీ కొట్టువాడు కూడా ఇదంతా ఓ కంట అప్పుడప్పుడు గమనిస్తూ పాన్ కట్టడంలోను, సిగరెట్లు అమ్మడంలోను యమ బిజీగా ఉన్నాడు. అది ఇతనికి షరా మామూలే లాంటిది, ఇలాంటివి ఎన్నో చూస్తుంటాడు.

          చుట్టూ జనం ఉండేసరికి అబ్బాయికి ఏం చేయాలో తోచడం లేదు. అమ్మాయిని ఏ విధంగానైనా అనునయించి అక్కడ నుండి తీసుకెళ్ళాలని అతని ప్రయత్నం. కాని ఆదిలోనే హంసపాదులా అమ్మాయి నిర్లిప్తత చూసేసరికి అతని ఏం చెయ్యాలో పాలుపోవ డం లేదు.

          “పద, నువ్విలా బిహేవ్ చేస్తే అందరూ మననే చూట్టం మొదలెడుతారు. ఆటో మాట్లాడుతాను” తొందర చేసాడు అబ్బాయి. అమ్మాయి చేయి కూడా పట్టుకొన్నాడు.
చేయి విడిపించుకుంటూ, “నాకివన్నీ ఇష్టం లేదు, అమ్మకు సాయంత్రం ఊరొస్తానని ప్రామిస్ చేసా” చెప్పింది అమ్మాయి.

          “ఏం ఫర్లేదు, ఫ్రెండ్స్ తో సినిమాకెళ్ళానని చెప్పు. రేప్పొద్దున ఊరెళ్ళోచ్చు” ఇలాంటి ఉపాయలకేం తక్కువ లేవు అతని దగ్గర. ఇంకా కొన్ని రెడీ చేసుకునే వచ్చుంటాడు అక్కడికి.

          అమ్మాయి దగ్గర్నుంచి జవాబు లేకపోయేసరికి “ప్లీజ్ నన్నర్థం చేసుకో, నీకేమి భయం లేదు, ప్రామిస్ ” అన్నాడు. ఈ పరిస్థితిలో అతను తల్లిమీద, చెల్లిమీద, కులదైవం మీద కూడా ప్రమాణం చేసేట్టున్నాడు. ఆ సమయంలో ఆ అబ్బాయి అవసరం అలాం టిది.

          “ఈ వీకేండ్ మనిద్దరం హ్యాపీగా స్పెండ్ చేద్దామనుకుకొని ఎన్నో ప్లాన్ చేసాను. నా మూడ్ పాడు చేస్తున్నావ్” నిందారోపణ మొదలెట్టాడు. అమ్మాయి చేతి మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకొన్నాడు. అతనిలోని పురుషత్వం ఆమెలోని స్త్రీత్వాన్ని ఆధిపత్యం చేయాలని చూస్తున్నది.

          “ప్లీజ్, నన్నొదులు, పబ్లిక్ లో ఇలా చేస్తే బాగుండదు” అమ్మాయి అభ్యర్థించింది. అభ్యర్థించిందే తప్ప ప్రతిఘటించలేదు. గట్టిగా ఓ మాట మాట్లాడటానికి ధైర్యం కూడా రావడం లేదు. మరి, ఇంకెన్ని స్త్రీ ఉద్యమాలు రావాలో అలాంటి ధైర్యాన్ని ఇలాంటి అమ్మాయిలకు నూరిపోయడానికి.

          “అదిగో కొంతమంది మనల్ని పదేపదే చూస్తున్నారు. ఇక్కడి నుండి ఎంత తొందరగా వెళ్ళితే అంత మంచిది” భయపెట్టడానికి ప్రయత్నించాడు. జనాలు గమనిస్తున్నారనగానే అమ్మాయిలో వణుకు ప్రారంభమైంది. తలెత్తి చూడటానికి భయమేసింది. చేతులు దగ్గరగా ముడుచుకొన్నాయి. కాళ్ళు దగ్గరగా జరిగి శరీరం బిగిసుకుపోయింది. ఇది గమనించిన అబ్బాయికి మరింత అలుసు దొరికింది. యుద్ధంలో శత్రువు బలహీనపడుతుంటే ఇక గెలుపు తనదేనన్న ధీమా వస్తుందిగా ఎదుటి పార్టీకి.

          “అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనంటే ఇష్టం లేని దానివి ఇక్కడి దాకా ఎందుకొ చ్చావ్?” అబ్బాయిలో దురుసుతనం మొదలైంది.

          “ప్లీజ్ నన్నొదిలెయ్. తర్వాత కలిసి మాట్లాడుకొందాం.” ఆ మాటలు అమ్మాయి నోట్లోంచి పీలగా వచ్చాయి, గట్టిగా మాట్లాడితే ఇంకెవరి చెవిలో పడతాయేమోనని భయంవల్ల.

          చెప్పిన సమయానికి తనను కలుసుకోటానికి చెప్పిన చోటుకు వచ్చిందంటే ‘ఈ అమ్మాయికి అంతా ఓకే’ అనుకునే అజ్ఞానం అబ్బాయిది. అమ్మాయి వేరే ఏదైనా చెప్పటానికి వచ్చిందో ఎమో? నోరెత్తి తన మనసులో ఉన్నది చెప్పటానికి పరిసరాలు సహకరించటం లేదేమో? మరోసారి కలిసినప్పుడు ఏదో చెబుతానంటోందిగా! అమ్మాయి ఎప్పుడైనా తన మనసు మార్చుకోవటానికి అవకాశం, హక్కు ఉంటుంది కదా? ఇలాంటి ప్రశ్నలు వేసుకునే ఇంగిత జ్ఞానం ఎందుకో పాతికేళ్ళోచ్చినా అబ్బాయికి అబ్బలేదు. ఇంకెన్ని చదువులు చదువాలో, ఇంకెంత నూరిపోయాలో అబ్బాయిలకు అమ్మాయిల మనసును అర్థం చేసుకోటానికి, కనీసం అర్థం చేసుకోటానికి ప్రయత్నించటానికి.

          ఇద్దరి మధ్య రెండు నిమిషాలు మౌనం.

          “నా ఫ్రెండ్ ఊరెళ్ళాడు. నా దగ్గర రూం కీ వుంది. ఏం భయంలేదు. చల్లటి బీర్ కూడా తెచ్చాను. హాయిగా పార్టీ చేసుకోవచ్చు. ఎవ్వరికీ తెలియదు” మనసులో ఉన్న కోరిక బయటకు కక్కేసాడు. ఇంతకంటే మంచి సమయం దొరకదన్నట్టు మంచి ఉద్రేకం లో ఉన్నాడు అబ్బాయి.

          “నాకివన్నీ ఇష్టం లేదు. ప్లీజ్ నన్నొదిలెయ్” బేలగా మలాళ్ళీ అభ్యర్థించింది అమ్మాయి.

          అమ్మాయి పిరికితనం చూసి మరింత ధైర్యాన్ని తెచ్చుకొన్నాడు. “నాకు కోపం వస్తే మనిషిని కాను. ఐనా, నువ్వేమన్నా పత్తిత్తువా? నాకు తెలియదనుకుంటున్నావా నువ్వు ఎవరితో ఏమేం చేశావో” అంబులపొదిలోని బలమైన అస్త్రాన్ని బయటకు తీసాడు.

          ఇలాంటి మాటలు చెవిన పడుతుంటే అక్కడ కూర్చున్న తల్లి తన కూతురిని తీసుకొని పక్కకు వెళ్ళిపోయింది, ఎవో పాపం మాటలు వింటున్నట్టు, తన కూతురు ఆ మాటలు వినకూడదన్నట్టు.

          అబ్బాయిలోని పురుషాహంకారం బయటపడుతుంటే సున్నితమైన అమ్మాయి మనసు వడలిపోసాగింది. అతను వేస్తున్న ప్రశ్నలకు ఏవైనా కొన్ని మాటలు మాట్లాడా లనుకొన్న అమ్మాయి తన నోటిని జిప్పుతో కుట్టేసినట్టు మౌనంగా ఉండిపోయింది.

          “పద దూరంగా వెళ్ళి మాట్లాడుకొందాం” అంటూ రెండు షాపుల మధ్యలో నున్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు అనే బదులు అమ్మాయి తన సొత్తు అయినట్టు చెయ్యి పట్టుకొని బలవంతంగా నడిపించాడనడం సబమేమో.

          ఇదంతా చూస్తున్న జులాయికి ఎక్కడ లేని హుషారు ముంచెత్తుకొచ్చింది. కథ మంచి రసపట్టులో పడుతున్నందుకు సంతోషంతో ఊగిపోతున్నాడు. వాళ్ళను అనుసరిస్తూ దూరంగా నిలబడి ఫ్రీగా వస్తున్న వినోదాన్ని అనుభవించసాగాడు. అలా వెళ్తున్న ఇద్దరిని కిళ్ళీకొట్టువాడు కూడా గమనించి తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు.

          ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాడేమో అని భయం వేసింది నాకు. నేను వాళ్ళను అనుసరిస్తూ కొద్ది దూరంలో నిలబడ్డాను. వాళ్ళిద్దరు నన్ను గమనించే స్థితిలో లేరు.

          అమ్మాయిని గోడకేసి బలవంతంగా నిలబెట్టాడు అబ్బాయి. ఆమెను ఎటూ కదల కుండా, అవకాశం దొరికితే తప్పించుకొని పోతుందేమోనన్న శంకతో బంధించినట్టుగా అమ్మాయికి దగ్గరగా నిల్చున్నాడు. ఆమె మీద తనకు సర్వాధికారాలున్నట్టు పెత్తనం చేయసాగాడు.

          “ఇప్పుడు చెప్పు, ఇంతకు ముందు నువ్వు తిరిగిన వాళ్ళకంటే నేనేం తక్కువ” కోపంతో పళ్ళు నూరుతూ అన్నాడు. అమ్మాయిపై ఆధిపత్యం చెలాయించడం తన హక్కుగా భావిస్తున్నాడు.

          “ప్లీజ్, నువ్వు విన్నదంతా అబద్దం, నీకు కావాలని ఎవరో, ఏదో చెప్పుంటారు, లేదా నువ్వే తప్పుగా అర్థం చేసుకొని వుంటావు” దీనంగా అంది అమ్మాయి.

          “హహా, నువ్వా నాకు నీతులు చెప్పేది. నీ కారెక్టర్ గురించి కాలేజీలో ఎవ్వరిని అడిగినా చెపుతారు, నా దగ్గరకు వచ్చిన ఫోటోలే చెబుతాయి, నువ్వేంటో, నీ క్యారెక్టరేంటో” పిచ్చికుక్కలా మీద పడుతూ ఆవేశంతో ఊగిపోయాడు.

          ఒక అమ్మాయి కాస్తా నవ్వుతూ ఏదో ఒక ఫోటోలో అబ్బాయి పక్కన నిలబడి ఉంటే అంతే… ఎన్ని ఊహాగానాలు మొదలవుతాయో, ఎన్ని నీలివార్తలు అల్లబడుతాయో. ఎంత మంది గద్దల్లా తయారవుతారో, పొడుచుకు తిందామని. ‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని ‘ అప్పుడెప్పుడో రాసిన కవితలోని మాటలు ఇప్పటికి ముమ్మాటికి నిజం.

          “నువ్వు మాట్లాడే మాటల్లో అర్థం రవ్వంత కూడా లేదు. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ప్లీజ్, నన్నొదులు. అమ్మ నా గురించి ఎదురుచూస్తుంటుంది” కాళ్ళ మీద పడినంత పని చేసింది. అతన్ని ఒక చేత్తో పక్కకు జరుపుతూ పోబోయింది. తన నుండి తప్పించుకుపోవటానికి ప్రయత్నం చేస్తున్న అమ్మాయిని చూసి కోపంతో  ఊగి పోయాడు అబ్బాయి. అమెకో మెదడుంది, హృదయముంది అన్న స్పృహ కూడా లేకుండా పోయింది అబ్బాయికి.

          “ఎక్కడికి పోతావే, నీకు తెలియదు నేనెంత చెడ్డవాణ్ణో” అంటూ చెయ్యెత్తి ఒక్క దెబ్బ వేసాడు. చెవిమీద బలంగా తగిలిందేమో బాధతో మూలుగుతూ చేతితో చెవిని మూసుకొంది అమ్మాయి. కన్నీళ్ళు ఉబికి వస్తుంటే సన్నగా ఏడ్చింది.

          “ఇదిగో, నేను ఆటోను మాట్లాడుతాను. అల్లరి చేయకుండా నోర్మూసుకొని కూర్చో” బెదిరిస్తుంటే అమ్మాయి అశక్తురాలైంది. అబ్బాయి ముఖం పిచ్చికుక్క మొహంలా ఉంది.

          రోడ్డుపై వెళుతున్న ఆటోను చేత్తో సంజ్ఞ చేసి ఆపాడు అబ్బాయి. అమ్మాయిని చేత బట్టుకొని మాట్లాడుతున్నట్టు నటిస్తూ నవ్వుతూ నడిపించాడు. సింహం పంజాకు చిక్కిన లేడిలా నడిచింది అమ్మాయి, ఏదైనా గోలచేస్తే తన పరువే పోతుందన్న భయంతో.

          ఆగిన ఆటోలోకి మొదట అమ్మాయిని తోస్తూ లోపల కూర్చోబెట్టాడు. తరువాత తను కూర్చోబోతుంటే…

          అంతే…

          ‘కీచ్’ మంటూ శబ్దాలు చేస్తూ ఇరువైపులా వస్తున్న వాహనాలన్నీ ఆగిపోయాయి. ఒక్క సారిగా భూమి తిరగడం మానేసిందా అన్నట్టు స్తబ్దత ఆవరించుకొంది. రెండు ఇసుక దిబ్బల మధ్యనుండి దూసుకొస్తున్న నీటి ఉప్పెనలా రోడ్డుకు ఆటుపక్క నుండి ఇటు దిక్కు దూసుకొని వచ్చింది ఓ మహిళ. మెరుపులా అబ్బాయి వీపుపైనున్న బాక్ ప్యాక్ ను పట్టుకొని శరవేగంతో ఆటోలో నుండి వెనక్కు లాగింది. ఆ బలానికి దఢేల్ మంటూ వెల్లకిలా పడ్డాడు అబ్బాయి. తల వెనుక భాగం రోడ్డుకు గట్టిగా తగిలేసరికి అతని కళ్ళు బైర్లు కమ్మాయి.

          హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం చూసిన కొందరు బెదిరి దూరంగా పారిపోయారు. దూరంగా వున్న కొందరు అక్కడకు చేరుకొన్నారు. ఆ మహిళ ముఖంలోకి చూస్తే రౌద్రం హోరెత్తుతున్న భద్రకాళిలా ఉంది. నరకాసురుణ్ణి బాణంతో సంధించబోయే సత్యభామ లా ఉంది. ఆగ్రహాన్ని అణుచుకోలేక ఊగిపోతున్న నరసింహావతారంలా ఉంది.

          అంతకు ముందు అక్కడ ఏం జరిగిందో తెలియని కొందరు ‘అరె, ఏమైంది, ఏమైనా దొంగతనం చేశాడా? ఆ అమ్మాయి నీ కూతురా?’ లాంటి ప్రశ్నలను సంధిచారు. ఏం జరిగిందో తెలిసిన కొందరు, తాము చేయలేని పనిని ఆ మహిళ చేసినందుకు మనసు ల్లోనే అభినందించారు. ఇంకొందరు అక్కడ అంతకు ముందు జరిగిన అసలు విషయా నికి చిలువలు పలువలు, తమ ఊహాగానాలు జోడిస్తూ పక్కవారి చెవిన పడేసారు. అలా, క్షణాల్లో ఆ విషయం దావానలంలా వ్యాపించింది. కొందరిలో అంతకు ముందు రాని ఆవేశం ఇప్పుడు కట్టలు తెంచుకొంది.

          అబ్బాయి షాక్ నుండి తేరుకొన్నట్టున్నాడు. అతనిలో కదలిక ప్రారంభమైంది. ‘వీణ్ణి అంత ఈజీగా వదిలిపెట్టొద్దు ‘ అంటూ కొందరు కొట్టటానికి చేతులెత్తారు.

          ఒక్కసారిగా చెయ్యెత్తి ఆ మహిళ “ఆగండి!” అని అరిచింది. ఆ అరుపుకు బెదిరి గాల్లోకి లేచిన చేతులు నెమ్మదిగా కిందకు దిగాయి.

          “ఈ నా కొడుకు సంగతి నేను చూసుకొంటాను” అంది.

          పరుషంగా ఓ ఆడది అలా మాట్లాడం చూసి కొంతమంది నిర్ఘాయింతబోయారు. కొంత మంది ముక్కున వేలేసుకొన్నారు. ఇంకొంత మంది మఫ్టీలో ఉన్న ఆడపోలీసేమో నని జంకుతూ ఓ అడుగు వెనక్కు వేసారు.

          ఇంకా ఆవేశం తగ్గని ఆ మహిళ కదులుతున్న అబ్బాయిని చూసి ఫేడేల్ మంటూ తన్నింది. అలా తన్నిన మహిళ ముఖంలోకి చూస్తూ బాధ భరించలేక ‘అమ్మా!’ అంటూ అరిచాడు. అలా అరుస్తూ పక్కకు దొర్లాడు.

          “నీలాంటి కొడుకులు ఏ తల్లి కడుపున పుట్టొద్దు. ఆలనాపాలన చూసుకుంటూ, చిన్నప్పటి నుండి మురిపెంగా పెంచితే అమ్మలకు ఇదేనా మీరిచ్చే బహుమానం. ఆ తల్లులకు ఎంత కడుపుకోత కలుగుతుందో” అంటుంటే ఆ మహిళ కంఠం వణికింది. ఆ వణుకు ఓ తల్లిలా పడే ఆవేదనా లేక ఆడదాని శరీరం పై సర్వహక్కులు మావేనంటూ అణచివేస్తున్న మగజాతిపై తిరుగుబాటా, లేక రెండు మిళితమయ్యాయా? ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధంగా అర్థమయ్యింది. ఆ మహిళ మాటలకు అక్కడున్న స్త్రీలు అందరూ తలలూపారు.

          జరుగుతున్నదంతా చూస్తూ భయంతో వణుకుతూ ఆటోలో ముడుచుకొని కూర్చుంది అమ్మాయి. ఆ అమ్మాయికి ధైర్యం చెబుతూ, “బయటకు రావమ్మ, నీకేమి భయం లేదు” అంది ఆ మహిళ.

          బెదురుతూ నెమ్మదిగా బయటకు దిగింది అమ్మాయి.

          “నిన్నింత క్షోభ పెట్టిన వీణ్ణి నీకు తోచినట్టుగా శిక్షించు, నేనున్నాను, భయపడకు” అంటూ అభయమిచ్చింది.

          అప్పటివరకు మాటలతో హింసించి, చేతలతో తడమటం వల్ల ఒళ్ళంతా జెర్రులు పాకినట్లుంది అమ్మాయికి. ‘ఈ దేశంలో ఆడదానికి వళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని ‘ ఓ కవయిత్రి ఆశించిన రోజు ఇప్పుడు ఆసన్నమైంది అన్నట్టుగా అమ్మాయి ఒంట్లోని అణువణువు అబ్బాయిపట్ల రోతతోను, ఛీత్కారంతోను నిండి పోయింది.

          తన ఎడమకాలి చెప్పుతీసి అబ్బాయి చెంపపైకి విసిరింది. చెంపపై ఆ చెప్పు మట్టిముద్ర క్షుణ్ణంగా వెలిసింది.

          “పద పోలీసు స్టేషనుకెళ్ళి కేసు పెడదాం” అంటూ తీసుకెళ్తుంటే వెనక్కి తిరిగి ఇంకో కాలికి ఉన్న చెప్పును కూడా అబ్బాయి పైకి విసిరేసింది అమ్మాయి.

          ఇంతలో గట్టిగా ‘థూ!’ అంటూ చేసిన చీత్కారం వినిపిస్తే అందరూ అటుదిక్కు చూసారు. అప్పటివరకు ఈ పంకిలం నుండి తన కూతురుని సంరక్షించుకొంటున్న తల్లి ‘ఆఖరికి వీడి పాపం పండింది ‘ అని సంతోషించింది.

          ‘అబ్బ, పదిమంది మగాళ్ళు చేయలేని పనిని ఒక్క ఆడది ఒంటి చేత్తో చేసింది!’ అనుకున్నాడు కిళ్ళీ కడుతున్న కొట్టువాడు. రోడ్డు క్రాస్ చేస్తున్న ఆ ఇద్దరిని చూస్తూ శిలల్లా నిలపడిపోయారందరు.

          అప్పుడు ఆ గుంపులో ఒకతనికి సందేహమొచ్చింది. “అసలు ఎవరా ఆ ఆడమనిషి?” పదిమందికి వినపడేట్టు అడిగాడు.

          వారిలో ఒకడు “ఏమో తెలియదు. కాని, ఆటోలో పోతున్న ఆవిడ డ్రైవరుకు ఆపమని చెప్పింది. ఆటోలోనే కూర్చుని అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగేదంతా రహస్యంగా గమనించింది” అంటూ కొంత సందేహ నివృత్తి చేసాడు.

***

          ‘ఇదండి సార్ నే చెప్పదల్చుకున్నది, విన్నారు కదా?’

          ‘శనివారం సాయంత్రం మా బాగనే తగుల్కున్నవ్, ఇట్లాంటి కతలు రోజూ మస్తుగ చూస్తుంటం. విన్న కదా, ఇగ నే పోతున్నా.’

          ‘ రామాయణంలో చదివింది నేను చెప్పా కదా. ఆకాశం సంగతి వొదిలేస్తే, నువ్వు చెప్పింది ఆడోళ్ళ గురించే కాబట్టి అయితే నేను సగం రైట్ అన్నమాట.’

          ‘విన్నాం గా, సరేనా, పార్టీ చేసుకోటానికి పోవచ్చా, లేటుగా తాగితే పొద్దున హాంగ్ ఓవర్ అంత తొందరగా దిగదు. ‘

          ‘విన్నా బాబు, నీ బాధ అర్థం అయ్యింది… అయ్యో పాపం ఆ ఆడపిల్లను రక్షించక పోతే ఇంకేం అఘాయిత్యం వినవలసి వచ్చేదేమో. ఆడవాళ్ళు ఆడుకోటానికి బొమ్మలు కాదు వాళ్ళకు ఓ మనసుంటుందని ఎప్పుడు తెలుసుకొంటారో ఈ మగవారు.’

          ‘నేను చెప్పింది విన్నందుకు మీ అందరికి థాంక్స్! కాని, వెళ్ళబోయే ముందు మీకందరికి ఒక ప్రశ్న… అలా విసుగ్గా చూడకండి, సార్లూ… ప్రశ్నేవిటంటే… ఇంతకూ ‘ఆ మహిళ’ ఎవరు?”

          ‘ఛల్, విన్నది భీ కాకుండ ప్రశ్న కూడానా… ధిమాక్ ఖరాబు చేస్తున్నవ్, నే పోతున్న ‘

          ‘నేను సగం రైట్ గా చేప్పా గదా! ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు, అవి చాలు, నేను కూడా వెళ్తున్న ‘

          ‘ఏంటయ్యా, చందమామ భేతాళకథలో చివర ఓ ప్రశ్న అడిగినట్టు, నీ ప్రశ్న గోలేంటీ… అవతల పకోడీలు, గారెలు చల్లారి పోతున్నాయి… కొరికినప్పుడు పంటికింద క్రిస్ప్ గా తగలకుంటే మందుకు రుచి రాదు… వెళ్ళోస్తం, బై ‘

          ‘సార్లూ, తొందరపడకండి. అమ్మా, మీరైనా చెప్పండి ‘

          ‘బాబూ, నువ్వు చెప్పింది జాగ్రత్తగా గమనిస్తే అడిగిన ప్రశ్నకు సమాధానం కొంత వరకు ఊహించవచ్చు.’

          ‘ప్లీజ్, మీకు తెలిసింది చెప్పి పుణ్యం కట్టుకోండి… ఆమె ఎవరా అన్నది తేల్చుకో లేకుండా సతమతమవుతున్నాను. ‘

          ‘ఏముంది బాబు… ఆవిడ అబ్బాయిని ఆటోలో నుండి లాగి, కిందపడేసి, కాలితో తన్నినప్పుడు అబ్బాయి చేసిన ఆర్తనాదం… అలాగే, ఛీ నీలాంటివాళ్ళు ఏ తల్లి కడుపున పుట్టకూడదు అని శపించిన మాటను మనం పదేపదే మననం చేసుకుంటే సూచన ప్రాయంగా తెలిసిపోతుందేమో?’

          ‘మా తల్లే, నీ కాళ్ళకు ఓ దణ్ణం, నీ ఊహాశక్తికి, విచక్షణా జ్ఞానానికి ఓ నమస్కారం… మీలాంటి తల్లులుంటే, దేశం చల్లగా ఉంటుంది, ఆకాశం మొత్తం నీలంగా ఉంటూంది, భూదేవి ప్రకృతి కళలతో వెలిగిపోతుంది… నమస్కారం అమ్మా!’

          ‘సరేనయ్య, ఆవిడ చెప్పింది మాకర్థం కాకున్నా నీ ప్రశ్నకు సమాధానం దొరికి నట్టుంది. మరి నా ప్రశ్నేంటంటే, నువ్వు అక్కడే వున్నావు కదా, అంతా విన్నావు, సీనంతా ముందు నుండి చివరి వరకు చూశావు కదా, పూసగుచ్చినట్టు మాకు చెప్పావ్ కదా! మరి నువ్వేం చేసినట్టు? అబ్బాయిని ప్రశ్నించావా? అమ్మాయిని అక్కడి నుండి పంపించ టానికి ప్రయత్నించావా? కనీసం పోలీసులకు ఫోను చేయాలన్న ఆలోచనైనా వచ్చిందా? చెప్పు’

          ‘మా బాగా అడిగారు నన్ను. నేనేం ఉత్తమపురుషుణ్ణి కాదు, స్త్రీల ఉన్నతి కోరుకుంటూ తమ రాతల్లో, చేతల్లో ఉద్యమించిన గురజాడ, కందుకూరి, చలం లాంటి పెద్దవారి అంశ కనీసం వెయ్యో వంతు కూడ లేనివాణ్ణి, అక్కడున్న అందరి మగాళ్ళలో నేనూ ఒకణ్ణి! అబ్బాయిని ఆపటానికి ప్రయత్నిస్తే ఎక్కడ నా మీదకు ఎదురు తిరుగుతాడే మోనన్న భయం, మిగతా మగమహారాజులు కనీసం నా తరఫున మాట్లాడరేమోనన్న అనుమానం, పోలీసులకు ఫోను చేసి, కేసులో నా పేరు పేట్టేయించుకొని అనవసరంగా నా జాబుకు ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకన్న పిరితనం, ఇవన్నీ కలగలిపి నేనూ ఒక సగటు మగమనిషిలా ఉండిపోయాను.’

          ‘అద్గదీ, అట్లా చెప్పు. బై’

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.