ఆరాధన-4 (ధారావాహిక నవల)

-కోసూరి ఉమాభారతి

నా శిష్యురాలు ప్రియాంక తల్లితండ్రులు శారద, నారాయణ గార్లు అకాడెమీ శ్రేయోభిలాషులు.   భరతనాట్యం అభ్యసించిన శారద అప్పుడప్పుడు స్టూడియోలో చిన్నపిల్లల క్లాసులు నిర్వహిస్తుంది. నాకు ఓ మంచి స్నేహితురాలు కూడా.  వారింట నాకు ఎప్పుడూ ఆప్యాయత, అభిమానాలే. 

ప్రియాంక కోరినట్టుగా మావారు మురళి గారి తో కలిసి మరునాడు సాయంత్రం ఆరింటికి బయలుదేరి వాళ్ళింటికి వెళ్ళాము.  వారి కాబోయే అల్లుడు, ప్రియాంక కి కాబోయే భర్త నేతన్ గార్శియాని, అతని కుటుంబాన్ని మొదటి సారి కలిసాను.  

అలాగే, హూస్టన్ ఇండియన్ కమ్యూనిటీలో పెద్దలు, సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు అయిన అప్పారావు గారు, ఆయన భార్య రాజ్యలక్ష్మి గారి ని కూడా చాలా కాలం తరువాత అక్కడ చూడ్డం సంతోషమనిపించింది.  మా వారికి అప్పారావు గారు పరిచయమే కనుక ఆయనకి బోలెడంత కాలక్షేపం.  

ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిధుల సమక్షంలో.. నాకు మర్యాదలు చేసి, వద్దని వారించినా ప్రియాంక, నేతన్ ల చేత పాద నమస్కారం చేయించి వారి చేత బహుమానాలు ఇప్పించారు.  

రాజ్యలక్ష్మి గారు నాకు పూలమాల వేసి ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు.  అప్పారావు గారు మాట్లాడే అవకాశం కోరి మైక్ అందుకున్నారు. “నృత్యకళా రంగంలో ఉమాభారతి కి ఉన్న పేరు ప్రఖ్యాతులు, పాతికేళ్లగా ‘సేవే ధ్యేయం’గా ఆమె చేస్తున్న కృషి, చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలు, గురువుగా యువత పై ఆమె ప్రభావం కొనియాడదగినవి.  

పాతికేళ్ళ క్రితం ఆమె హూస్టన్ వచ్చినప్పుడు.. నేను ‘ఇండియా సాంస్కృతిక సంఘం’ ప్రెసిడెంట్ గా కార్యక్రమాలు నిర్వహించే వాడిని.  అప్పట్లో మీనాక్షీ టెంపుల్ లో జరిగిన ఓ దసరా ప్రోగ్రామ్ సందర్భంగా ఉమాభారతి తల్లితండ్రులు  మేజర్. సత్యనారాయణ, శారద గార్లని కలిసాను.  మాటల్లో.. ఆమె పేరున్న నృత్యకారిణి అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచేత గుర్తింపబడి, దేశవిదేశాల్లో వందలాది నృత్యప్రదర్శనలు చేసిన యువ నర్తకి, నటి అని తెలిసింది. 

సాంస్కృతిక సంఘం వార్షికోత్సవానికి ప్రత్యేకంగా ఆమె నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాము.  అదే సమయంలో నిర్మాణ దశకి చేరుకున్న మీనాక్షీ ఆలయం లోని వినాయక విగ్రహ స్థాపన తో పాటు ఆలయ ప్రాంగణ నిర్మాణం కోసం ఉమా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన నృత్య ప్రదర్శన ద్వారా నిధులు సేకరించింది.  

ఉత్తమమైన ఆశయాలతో కళాకారిణిగా, నాట్య గురువుగా కొనసాగుతున్న ఉమాభారతికి  హృదయపూర్వక అభినందనలు.” అని ప్రశంసలు అందించిన ఆయనకి ధన్యవాదాలు తెలిపాను. 

విందుభోజనం తరువాత ఇంటి దారి పట్టాము.  

కారు నడుపుతూ.. “నేనూ నీ గురించి నాలుగు మాటలు చెప్పాలనే అనుకున్నాను తెలుసా?” అన్న మా వారి వంక చూసి నవ్వాను. 

“అదేనోయ్, మొదట్లో ఈ నగరం లోని కొందరు మహానుభావులు.. నృత్యరంగంలో నీ పురోగతిని, ఆలయానికి నీ నిధిసేకరణ కార్యక్రమాలని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం, నేరుగా ఓ మారు ఇంటికే వచ్చి.. ప్రోగ్రామ్ విరమించుకోమని హెచ్చరించడం గురించి చెప్పి, నా భార్య పట్టుదలే శ్రీరామ రక్షగా ఈ రోజు ఈ స్థాయికి చేరిందని చెప్పాలనుకున్నాను.” అన్నారు మురళి సీరియస్ గా.  

“మరి చెప్పలేదే? నేను కూడా ‘మా ఆయన బంగారు’ అని నలుగురిలో మిమ్మల్ని మెచ్చుకునేదాన్నిగా.  ఆ ఛాన్స్ పోయింది మరి.” అన్నాను. 

“పర్వాలేదులే. అందుకు బదులుగా రేపు ‘డబల్ క మీఠా’ చేసి పెట్టు. సరిపోతుంది.” అన్నారు.  

“ఓకే.. ఇంకా ఏమన్నా కావాలంటే కూడా వండి పెడతాను.” అని సీటులో వెనక్కి వాలి కళ్ళు

మూసుకున్నాను.  

 

 మా వారు అన్న మాటలతో .. పాతికేళ్ళ నాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా నన్నలుముకున్నాయి. ఊహ తెలిసినప్పటి నుండి నృత్యరంగంలో సాగించిన కృషికి.. ప్రేక్షకులు, పాత్రికేయుల ప్రశంసలు,  ప్రభుత్వం వారి గుర్తింపు, దేశవిదేశాల్లో సత్కార సన్మానాలు పొందిన నాకు.. హూస్టన్ లో అడుగిడినప్పుడు .. కళారంగంలోని కొందరు పెద్దలు ప్రోత్సాహించి సహకరించక పోగా.. ప్రోగ్రాములు మానుకోమన్న హెచ్చరికలు చేయించారు.  ఊహించని వారి ధోరణి అర్ధం కాలేదు. 

కానైతే, నేను వెనుకంజ వేయలేదు సరి కదా, మా నాన్నగారి సలహా మేరకు ..  ధైర్యంగా వరస నృత్య ప్రదర్శనలు చేశాను.  విజయవంతంగా జరిగిన ఆ కార్యక్రమాలకి హూస్టన్ కళాప్రియుల ఆదరణ మెండుగా లభించింది.  ఏడాదిలోపే.. ఆలయ నిర్మాణ నిధికి, చిన్మయ మిషన్ కి, తానా తెలుగు సభల నిర్వహణకి .. నృత్యం ద్వారా నిధులు సేకరించడాన్ని అందరూ హర్షించారు.  

‘ఆ స్పూర్తితో అర్చన డాన్స్ అకాడమీ స్టాపించి నృత్యశిక్షణ నిచ్చేందుకు సంసిద్దమయ్యాను.’ అనుకుంటూ లేచి కూర్చుని బాగ్ నుండి మంచినీళ్ళ బాటిల్ అందుకున్నాను.  

“చుట్టూ చూసి.. ఇల్లు చేరేందుకు మరో ఇరవై నిముషాలుందిగా.” అన్నాను మురళి తో.  

“కొత్త టోల్ రోడ్డు మీద కదా వెళ్తున్నాము.  కాస్త త్వరగానే ఇల్లు చేరుతామూలే.  అది సరే, త్వరలో ఈ రంగప్రవేశ కార్యక్రమాలు అవుతూనే మెంఫిస్ టెంపుల్ ప్రోగ్రామ్ కి ప్రయాణం కదూ! అక్కడ మన ప్రభాకర్ వచ్చి కలుస్తాడేమో.. అతన్ని తన కుటుంబ సమస్య గురించి ఏమీ అడగబాకు.  మరింత బాధ పడతాడు.  సున్నితమైన సంగతి కదా.” అన్నారు.  

“అలాగేలెండి.  అయినా ప్రభాకర్ కాకినాడ వెళ్ళి .. తన పదేళ్ళ కొడుకు విషయంగా భార్యతో తలెత్తిన సమస్య పరిష్కరించుకుంటాడని, కుదరకుంటే కోర్టు మెట్లెక్కుతాడనీ మీరేగా అన్నారు. మీరు అప్పుడప్పుడు చెప్పే సంగతులు తప్ప అతని కుటుంబ విషయాలు నాకెలా తెలుస్తాయి?” అన్నాను. 

“ఎంతో కష్టపడి వృద్దిలోకి వచ్చిన మనిషి ప్రభాకర్.  ఇండియా లో కోర్టు లావాదేవీలు పెట్టుకుంటే.. ఇక్కడ కంపెనీ ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాడు.  పెళ్లి విషయంలో దగా పడి భార్య చేతిలో మోసపోయానని క్రుంగిపోతున్నాడు.  పరస్పర అంగీకారంతో విడిపోతారులే అనుకుంటే.. అంత సులభంగా అయ్యేలా లేదుట.  కొడుకుని ఒక ఆయుధంగా వాడుకుంటుంది వాడి భార్య అని అనిపిస్తుంది.  అదీ వాడి ప్రస్తుత పరిస్థితి.” అన్నారు మురళి.. కారు గ్యారేజ్ లో పార్క్ చేస్తూ.  

“ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనల గురించి ఈ మధ్య వింటూనే ఉన్నాము.  మనకి తెలిసిన డాక్టర్ జితేందర్ ఖత్రి .. కూడా అంతేగా.  కూతురి కోసం ఎన్ని పాట్లు పడ్డాడో కదా.  భార్యతో విడిపోయిన    ఐదేళ్లకి గాని ఆమె కనికరించి, ఇప్పుడు ఎనిమిదేళ్ళ కూతురిని వేసవి సెలవల్లో తండ్రి వద్దకి పంపేందుకు ఒప్పుకోలేదు.” అంటూ కారు దిగి ఇంట్లోకి నడిచాను. 

***

ప్రియాంక, సౌమ్య ల కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమాలు..ఊహించిన దానికన్నా బాగా జరిగాయి.  పెద్ద సంఖ్యలో విచ్చేసిన అతిధులు, కళాప్రియుల నుండి కూడా మంచి స్పందన రావడం మాకందరికీ ఆనందానిచ్చింది.  

నృత్యంలో నా శిష్యురాళ్ళ ప్రావీణ్యత కూడా అందుకు కారణం.   

ప్రియాంక రంగప్రవేశ కార్యక్రమం అయ్యాక పక్కనే ఉన్న బాల్-రూమ్ లో విందు భోజనం ఏర్పాటు చేసారు.  ప్రియాంక, నేతన్ ల  నిశ్చితార్ధం ప్రకటన కొరకు హాలు చక్కగా అలంకరించారు.. నాలుగడుగుల కేక్ తో సహా.  

వైభవంగా కరతాళ ధ్వనుల నడుమ.. నేతన్..  ప్రియాంక కి ప్రపోజ్  చేసి ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆ తరువాత ఏర్పాటయిన మ్యూజిక్, డాన్స్, విందు భోజనం ఆహుతులని అలరించింది.    

ఇక సౌమ్య విషయానికి వస్తే, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వరంగల్ నుండి రంగప్రవేశ కార్యక్రమానికి వచ్చారు.  ‘సంభవామి యుగే యుగే’ అన్న నా రచనకి నృత్యాలు కూర్చి చేయించాను.  ఆమెరికా నలుమూలల నుండి బంధువులు వచ్చారు.  కార్యక్రమానికి ముందే అల్పాహార విందు ఏర్పాటు చేశారు.  విజయవంతంగా జరిగిన ఆ సాంస్కృతిక కార్యక్రమానికి స్థానిక టీ.వీ కవరేజ్ అందడం విశేషం. 

***

తరువాతి నాలుగు వారాంతాల్లో .. అట్లాంటా, ఆగస్తా, న్యూజర్సీ, మెంఫిస్ పట్టణాలలో.. అక్కడి భారతీయ ఆలయ సాంస్కృతిక సంఘాల నిర్వహణలో.. నేను రాసిన ‘దేవీ స్తోత్ర మాలిక’ నృత్య నాటిక ప్రదర్శనలు వైభవంగా జరిగాయి.  నాతో పాటు ప్రదర్శనల్లో పాల్గొన్న సౌమ్య, ప్రియాంక, మా అమ్మాయి ఎనిమిదేళ్ళ శిల్ప కి కూడా మంచి గుర్తింపు రావడం ముదావహం.       

నేను ప్రయాణాల్లో ఉన్న వారాంతాల్లో మా హూస్టన్ స్టూడియో లో చిన్న-మాస్టారుగా పిలవబడే మాధవన్ క్లాసులు నిర్వహిస్తే, బే-పోర్ట్ స్టూడియోలో మియా, రాగిణి కలిసి స్టూడెంట్స్ తో అభ్యాసన చేయించే బాధ్యత తీసుకున్నారు.  

కూచిపూడి నృత్య విధానంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన మాధవన్ ని నాకు సహాయకారుడుగా .. బందర్ నుండి పిలిపించి అప్పుడే ఐదు సంవత్సరాలు గడిచాయి.  కూచిపూడి గ్రామం లో అర్చకుల కుటుంబం నుండి వచ్చిన అతను నృత్యం అంటే ఉన్న ఆసక్తి తో శిక్షణ పొంది కూచిపూడి నృత్యంలో డిగ్రీ తో పాటు కాలేజీ చదువు పూర్తి చేసి బి. ఏ పట్టా పుచ్చుకున్నాడు.   

అమెరికా వచ్చిన మాధవ్ ఇక్కడి జీవన విధానంలో సులువుగా ఇమిడిపోయి.. స్టూడియో లో తన పని తాను చేసుకుపోవడమే కాక, ఎం.బి.ఏ పూర్తి చేశాడు.  త్వరలో మంచి జాబ్ చూసుకుంటానని చెబుతూ, అర్చన ఫైన్-ఆర్ట్స్ లో తన ఉద్యోగాన్ని తప్పక కొనసాగిస్తానని తెలియజేసాడు.  

 

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.