ఈ తరం నడక – 8
లిప్తకాలపు స్వప్నం – స్వర్ణ కిలారి
-రూపరుక్మిణి. కె
అమ్మ మనసుకి ఎన్ని గాయాలైనా… తన బంగారు పిల్లలు లేడీ పిల్లలకు మల్లె ఎగిరి దుంకాలని, పారే నదిలోని పరవళ్ళు ఆ బిడ్డ ఎదుగుదలలో చూసుకోవాలని, కోరుకోని ప్రపంచం ఉండదు.
అలాంటి ఓ ‘చిన్నమ్మ’ మనసు వర్ణించి చెప్పిన తన బిడ్డ “క్లీంట్” గాధ ఈసారి మన ఈతరం కథలో.
ప్రపంచంలో ఎందరో బిడ్డలు పుట్టుకతోనే లోపాలని పంచుకొని పుట్టిన ఆ పిల్లలలో ఉండే ఏదో ఒక అద్భుతమైన కళను, ఆస్వాదించే ప్రతిభను, గుర్తించే తల్లిదండ్రులు మాత్రం అరుదే..
“క్లింట్” బ్రతికింది ఆరేళ్ల జీవితం, అయినా ప్రపంచానికి 25 వేల పైగా చిత్రాలను గీసిన ఆ చిన్నారి చేతులకి అభినందనలు స్వయంగా తెలుపలేకపోవడం ఒక రకమైన మనోవేదనకు గురిచేస్తుంది.
కొచ్చి నగరంలో సుమారు 45 ఏళ్ల క్రితం జరిగిన ఓ మహాద్భుతాన్ని ” అమ్ము నాయర్ ” ఇంగ్లీషులో రాస్తే మనకు తెలుగు అనువాదం చేసి చిన్నమ్మ కలలు కన్న క్లింట్ చిట్టి చేతుల యొక్క అద్భుతమైన కళాఖండాలను గురించి ప్రస్తావిస్తారు స్వర్ణ కిలారి.
జీవితం ఓ రంగుల కాన్వాస్ ఎప్పుడూ ఏ రంగును ఏ జీవితాల మలుపులు తిప్పు తుందో, ఎన్ని వేల ఇంద్రధనస్సులు వెల్లివిరుస్తాయో.., ఊహకందని ప్రపంచం మన చుట్టూ ఉంటే, అటువంటి రంగులవెలుగుల్ని ప్రపంచంలో వెతుకుతూ తన ప్రయాణం మొదలుపెట్టిన బుడతడు నిండా రెండేళ్ల వయస్సు కూడా నిండని చిన్నారి చేతులు పంచే కళాఖండాలని చిన్నమ్మ జోసెఫ్ ల ఇంటి గోడలే మొదట ఆహ్వానం పలికాయి.
ఆ పసితనపు కళ్ళలోని మెరుపు వేగం, చూపులోని చురుకుదనం ఇతరులు ఆలస్యంగా గుర్తించే విషయాన్ని ముందుగానే గమనించి, తల్లిదండ్రులతో చెప్పగలిగే గ్రాహకశక్తి ఆ చిన్నారి సొంతం.
క్లింట్ పక్కింటి మోహన్ ఒక ఆర్టిస్ట్ కావడం ఓ యాదృచ్ఛికమే… అయినా క్లింట్, జోసెఫ్ ల ఆహ్వానం అందుకున్న మోహన్ క్లింట్ ఇంటి గోడలపై క్లింట్ కి అందిన మేర గీసిన గీతల్లో ఓ కళాత్మకమైన ఆర్ట్ దాగి ఉందని ఆ డ్రాయింగ్ మాస్టారికి అర్థమై క్లింట్ ని ప్రోత్సహించే తండ్రి జోసెఫ్ ని అభినందిస్తూ ఆ చంటోడు వాడే రంగురంగుల పెన్సిళ్లు, క్రెయాన్సు నుంచి వాటర్ కలర్స్ లోకి అటు నుండి ఆయిల్ పెయింటింగ్ వరకు పరిచయం చేయాలన్న తన ప్రయత్నంలో ఆ చిన్న పిల్ల వాడి చేతుల్లో కుంచె పట్టు కోడంలోని మెళుకువని చూసి అబ్బుర పడడం ఆ మాస్టారి వంతు అయింది .. అంతే కొన్ని కళలు పుట్టుకతోనే అబ్బుతాయి మరి, సహజంగా క్లీన్ట్ ఆ వయసు పిల్లలు ఉన్నట్టు గా ఉండేవాడు మాత్రం కాదని, అతని చుట్టూ ఉండే ప్రపంచంలోని మనుషుల్ని తన వైపుకి తిప్పుకునే ఘాడమైన శక్తి అతనికి ‘ఆరా’లా ఉంటుందేమో అనిపించేలా… అతని కళకు అందరూ అభిమానులు ఉండేవారని చెప్తుంటే భలే అద్భుతంగా తోచింది.
పిల్లల అనారోగ్యం ఎంతటి క్షోభను మిగులుస్తుందో, అంత బాధలోనూ పిల్లలకు కావలసిన వైద్యము మరియు పిల్లల మానసిక ఆనందానికి ఆ తల్లితండ్రులు చేసే త్యాగం, ప్రదర్శించే గంభీర వదనాలు అన్ని క్లింట్ గురించి ఒక్కో పేజీ ఒక్కోవర్ణ చిత్రంగా మార్చుతూ, తన భవిష్యత్తు ఓ అంధకార రంగుని పులుముకుంటుందని ఆ చిన్నారికి తెలిసిందేమో అనే ఆ తల్లి కంటి చమ్మను…, ఎంతో సరళమైన పద సంపదతో మన కళ్ళకు కట్టి చూపిన ఈ “లిప్తకాల స్వప్నం” మనకెప్పుడూ చిత్రాతి చిత్రమైన కాన్వాస్ రంగుల ప్రపంచమే ఎందుకంటే ప్రతి రంగు కుంచె పులుముకున్నట్లే మనిషి మనసు కూడా రంగులద్దుకుంటుంది ఈ పుస్తకంలోని ప్రతి పేజీ.
ఆ చిన్నమ్మ కి నిజంగా మెచ్చుకు తీరాలి, ఆ చిన్నారి చేతులు ఏ రూపాల్ని చిత్రించినా భద్రపరచుకుంది. అది ఆమె బిడ్డ జ్ఞాపకమే అయి ఉండవచ్చు కానీ ఆ బిడ్డ కళను, ప్రతిభను ఈ లోకానికి పరిచయం చేయడానికి ఆ కుటుంబం పడ్డ వేదన ఏమంత చిన్నదైతే కాదు.
సరియైన వైద్యం అందకపోతే నిండు జీవితం ఎలా పాడవుతుందో. తెలిసి తెలియని వైద్యుం మనుషుల జీవితాల్ని ఎలా ఆడుకుంటుందో చూపిన నిజ జీవిత గాధను మనకు పరిచయం చేసినందుకు స్వర్ణని మెచ్చుకోవాల్సిందే.
ఈ చిన్న వాడి చిత్రాల కోసం కొచ్చి వరకు ప్రయాణించి ఆ కుటుంబాన్ని కలుసుకొని జీవన వైచిత్రాన్ని మనకు పరిచయం చేశారు స్వర్ణ
అంతే కదా కొన్ని సంఘటనలు, కొన్ని కథలు, మనల్ని ఆ మనుషుల్ని చూడమని, అక్కడి చరిత్రను తెలుసుకోమని ప్రోత్సహిస్తాయి.. అలాంటి ప్రయాణమే స్వర్ణ గారు చేసి ఈ లిప్తకాల స్వప్నాన్ని ఓ అమ్మ కలలుగన్న జీవితాన్ని, చేజారిపోయిన సమయాన్ని, జ్ఞాపకాలని మనకి అందించారు.
స్వర్ణ తొలి పుస్తకం ఓ అనువాదం అవడం యాదృచ్ఛికమే అయినా ఆ తర్వాత ట్రావెల్ బ్లాగ్ 13 రాశారు, ‘మేక బతుకు’ అనువాదం, తరువాత ఇప్పుడు కొత్తగా మరో ‘ నల్ల బంగారం’ కథలను తీసుకురాబోతున్నారు… రాబోయే రచనలు కూడా ఇంతే సరళమైన సాత్వికానంద రచనా శైలిలో సాగుతూ మనసుల్ని, మనుషుల్ని…, ముడి వేసే కాలాన్ని బంధిస్తాయని ఆశిస్తూ అభినందనలతో…
*****
పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.