కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-22
కల్యాణి
-డా. సిహెచ్. సుశీల
ఇంటి నీడలో
గురి చూసి పాడే పాట (1990), నీలిమేఘాలు (1993), ముద్ర (2001), అపరాజిత ( 2022) వంటి స్త్రీవాద కవితా సంకలనాల్లో స్త్రీల వైయక్తిక, సామాజిక అసమానతలను, కౌటుంబిక వేధింపులను కవయిత్రులు రాసిన కవితలు వచ్చాయి, సంచలనాలు సృష్టించాయి. ఇంకా ఎందరో కవయిత్రులు రాసిన కవితా సంకలనాలు వెలువడ్డాయి. రచయిత్రులు స్త్రీల ఆవేదనలను వ్యక్తీకరిస్తూ కథలు, నవలలు రాస్తున్నారు. ఆలోచింపజేస్తున్నారు. అనేక సమస్యల్లో పితృస్వామ్య వ్యవస్థలో తన కంటూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడం స్త్రీలకున్న చాలా పెద్ద నిస్పృహ.
జెండర్ వివక్షతను వ్యతిరేకిస్తూ స్త్రీ స్వేచ్ఛను, స్త్రీ – పురుష సమానత్వాన్ని కాంక్షి స్తున్న ‘స్త్రీవాదం’ నేటి సమాజంలో అనివార్య ప్రవాహం.
పుట్టినింట “జాగ్రత్త”, “భయం”తో కూడిన ఆంక్షలు ఉంటే, అత్తారింట “ఆధిపత్యపు” ఆంక్షలు ఎక్కువ. ఆధిపత్యం అనేది భర్త, మామ నుండి మాత్రమే కాక తోటి స్త్రీలైన అత్తా, ఆడపడుచు, తోడికోడలు నుండి కూడా ఉండటం ఆశ్చర్యకరం. విషాద కరం. ‘కుట్ర’ అనే పదం సబబు అయినా కాకపోయినా ఆనాటి నుంచి ఈనాటి వరకు కనిపించే – కనిపించని ఆంక్షలు స్త్రీకి తప్పడం లేదు. అయితే ఈ కోడలు పిల్ల తర్వాత కాలంలో అత్తగారు స్థానంలోకి వచ్చినప్పుడు కోడలిపై ఆంక్షలు విధించడం మరో చిత్రమైన విషయం. కుటుంబ వ్యవస్థ తీరుతెన్నులతో గుడిపాటి చలం చేసిన యుద్ధం తెలియాలంటే “స్త్రీ”, “బిడ్డల శిక్షణ” చదవాలి.
” ప్రస్తుత నాగరికత కుటుంబ పద్ధతి మీద ఆధారపడి ఉండటం చేత కుటుంబం అనేది లేకపోతే లోకమే లేనట్టు కనబడుతుంది మనుషుల మనసులకి” అన్నారు చలం ” స్త్రీ”పుస్తకంలో.
ఈ సమాజంలో తండ్రి కుటుంబ పెద్దగా ఉంటూ మిగిలిన పురుషుల సహకారాన్ని తీసుకుంటూ స్త్రీలను, పిల్లలను అదుపులో ఉంచుతాడు. స్త్రీలు తమ అభివృద్ధినీ, స్వేచ్ఛను వదిలేసుకుని కుటుంబంలోని పురుషుల అభివృద్ధికి తోడ్పడతారు.
సరిగ్గా ఇదే ఇతివృత్తంతో 1954, అక్టోబర్ 13 ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో ” ఇంటి నీడలో” కథ రాసారు “కల్యాణి”.
ఇంటి నీడలో
మాధవరావు భార్య విజయ. అందరు స్త్రీల లాగానే పెళ్ళయి అత్తారింటికి వచ్చి, పైగా పెళ్ళయినా చదువుకోమని ప్రోత్సహించే కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా ఉంది. అయితే తను నిజంగానే ఆనందంగా ఉన్నానా అని అప్పుడప్పుడు ప్రశ్నించు కుంటూనే ఉంటుంది.
‘విజయా’ అని గొంతులో మాధుర్యాన్ని నింపుకుని పిలిచే భర్త పిలుపుతో హృదయం సమ్మోహితమౌతుంది. తనని చదువుకోమని ఎంతో ప్రోత్సహిస్తాడు. కానీ ఆయన పిహెచ్. డి. చేసాడు కాబట్టి భార్య కనీసం డిగ్రీ అయినా చదవాలని ఆయన “ప్రిస్టేజి”. అత్తగారి ఆదరణలో లోపం లేదు. ఆవిడ తన చదువుకు భంగం కలిగించదు. కారణం లేకుండా కసిదీర్చుకోవాలనే మూర్ఖత్వం కూడా లేదు. “తన మాట జవదాటనంతవరకు, తన ఆజ్ఞలను పొల్లుపోకుండా నెరవేర్చినంత వరకూ” ఆవిడ చాలా మంచిదే. కానీ ముత్తైదువ తనం కొరకు, కుటుంబ సంక్షేమం కొరకు పూజలు, పునస్కారాలు, వ్రతాలు నిష్ఠగా నిర్వహించాలని పోరుతుంది. ఏమైనా అంటే “అచ్చటా ముచ్చటా” అంటుంది. పూర్వాచారపరాయణురాలని చాలా వరకు భరిస్తుంది. తన వల్ల ఆమె మనసు కష్టపెట్టుకో కూడదని సహనంతో ఉంటుంది. ఇక మామగారు అయితే టైంకి బయలుదేరాలి అని తొందర పెడతారు. ఆ పంక్చుయాలిటీతో ఒక తలనొప్పి. అన్నిటికన్నా ముఖ్యం తన చంటి బిడ్డతో కాస్త తీరికగా సమయం గడపలేకపోతున్నానన్న దిగులు మనసును తొలిచేస్తోంది.
ఎవరి అవసరాలు వారికి తీరిపోతే చాలు. తనెంత సతమతమౌతోందో ఎవరికీ పట్టదు. “అంతా మంచివారులానే కనిపిస్తున్నా, అప్పుడప్పుడు ఏవో గ్రహింపరాని కాఠిన్యాన్ని మనసులో దాచుకున్నట్టుగానే” కనిపిస్తారు విజయకి. ఈ చదువులు, వ్రతాలు ఎందుకు ప్రాణానికి సుఖం లేకపోయాక! అవన్నీ తన వదిలించుకోలేని బాధ్యతలు.
తన ఇష్ట ప్రకారం ఏమీ చేయలేక, ఇన్ని హడావుడుల మధ్య అసంతృప్తితో, విసుగు తో మొదటి సంవత్సరం పరీక్షలు సరిగా రాయలేక పోయింది. అనుకున్నట్టుగానే పరీక్ష పోయింది. పీడా వదిలింది అనుకుని సంతోషంతో పాపని ముద్దులాడింది. ఇక చదవను అని చెప్పేసింది విజయ. “చదువుకోక పోతే ఈనాడు సంఘంలో సభ్యతా మర్యాదలుం డవు” అని భర్త, “ఇంతింత ఫీజులు కడితే ఇదా నిర్వాకం” అని అత్తగారు మాటలతో కలవరపరిచారు.
అటూ ఇటూ తేల్చుకోలేక ” ఏం చెయ్యాలి తను” అని విజయ నిర్లిప్తంగా అనుకోవడంతో కథ ముగించారు రచయిత్రి.
“నూరేళ్ళ చలం” వ్యాస సంకలనంలో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ఓల్గా – ” ఇప్పుడు స్త్రీలకు పురుషులతో కానీ పిల్లలతో కానీ ఉండే సంబంధాలలో సహజమైనది ఏదీ లేదని, స్త్రీలు తమ శక్తి యుక్తులుని స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఆ సంబంధా లను తిరిగి నిర్మించాలని స్త్రీవాదం చెబుతుంది… ఆమెను ఒక వ్యక్తిగా గౌరవించడం అంటే ఏమిటో ఈ తలకిందుల సమాజానికి ఇంకా అర్థం కాలేదు. బతుకు పోరాటం నుంచి, ఆత్మగౌరవం నుంచి స్త్రీలను దూరంగా ఉంచే ప్రయత్నాలు ఇంకా జరుగు తున్నాయి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని ధైర్యవచనాలు లేవు. చావో బతుకో జీవన పోరాటంలో తేల్చుకోమనటం లేదు. ఎంతసేపు స్త్రీలను భయపెట్టడం, మీ జీవితాలకు రక్షణ ఉండదని చెప్పటం… చలం సాహిత్యం మనం నేర్చుకునే విషయా లన్నీ మరింత బలంగా చెబుతుంది. మనకు నైతికంగా బలాన్ని ఇస్తుంది. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. స్త్రీ పురుష సంబంధాలను స్నేహం సమానత్వ ప్రాతిపదికపై నిర్మించుకునేందుకు కావలసిన కణజాలాన్ని అందిస్తుంది. అసాధ్యాలను సాధ్యం చేసుకునేందుకు చేసే పోరాటాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే ఎప్పటికంటే ఎక్కువగా ఇవాళ మనకు చలం సాహిత్యం ఒక జీవితావసరం” అంటారు.
కుటుంబ వ్యవస్థ – చలం తిరుగుబాటు అనే వ్యాసంలో ఓల్గా – ” ఆధిపత్యం బలం ఎవరి దగ్గర ఉందో ఎవరు పెత్తనం చేయగలుగుతారో వారికి మిగిలిన వారందరూ చేసే ఒక వ్యవస్థ విధానం కుటుంబం. కుటుంబం అంటే భార్యాభర్తలకు పిల్లలతో కలిసి ఉండే చోటు మాత్రమే కాదు, అది ఒక భావజాలం. ఒక మనిషిని ఫలానా కుటుంబానికి చెందిన వానిగా గుర్తించడం అంటే ఆ మనిషికి సాంఘికంగా ఒక గుర్తింపు పెంచడం. అతను ఒక భర్తగా, తండ్రిగా, కొడుకుగా ఒక హోదాలో ఉంటాడు. స్త్రీలు పలానా వారి భార్యలుగా, తల్లులుగా, కూతుళ్ళుగా రెండవ స్థానంలో ఉంటారు. కుటుంబాలు మనుషుల్ని భౌతికం గానే కాక సాంఘికంగా సాంస్కృతికంగా తయారు చేసే కుటీర పరిశ్రమలని చెప్పొచ్చు. ఇట్లాంటి కుటుంబ వ్యవస్థను కొనసాగించడానికి జెండర్ విధానం చాలా ఉపయోగపడు తుంది. స్త్రీ పురుషుల మధ్య బలంగా వేళ్ళూనుకొని ఉన్న జెండర్ తేడాలే ఈ కుటుంబ నిర్మాణానికి పునాది. స్త్రీలు స్త్రీలుగా పురుషులు పురుషులుగా తమకు సమాజం ఇచ్చిన విధులు నిర్వహించినప్పుడే కుటుంబం సురక్షితంగా ఉంటుంది” అంటారు.
1954 లో “కళ్యాణి” రాసిన ఈ కథలో విజయ తన కుటుంబంలోని అందరి ఆశలను, ఆకాంక్షలను తీర్చే ఒక యంత్రంగా ఉండిపోయింది తప్ప తన ఆశలు కనీసం తన చంటిపాపతో గడుపుకునే సమయాన్ని కూడా తీర్చుకోలేకపోయింది. చాలా కుటుంబా లలో భౌతికంగా కనిపించే హింస లేకపోవచ్చు కానీ “ఎమోషనల్ బ్లాక్ మెయిల్” వల్ల కూడా స్త్రీలు తమ జీవితంలో చాలా కోల్పోతారని ఈ కథలో విజయ పాత్ర ద్వారా రచయిత్రి ఎమోషనల్ గా చెప్పారు.
రచయిత్రి వివరాలేవీ తెలియరాలేదు. పైగా “కల్యాణి” అని కొటేషన్స్ లో ఉండడం వల్ల కలం పేరేమోననే సందేహమూ ఉంది. ఇతివృత్తం, కథనం, విజయ పాత్రలోని అంతర్మధన చిత్రణ గమనిస్తే చేయి తిరిగిన రచయిత్రిగానే తోస్తున్నది.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం