ఈ ఆలోచనలిటు ప్రయాణిస్తూ ఉండగానే, యధాలాపంగా పుట్టపర్థి తన గదిలో భద్రపరచుకుని ఉన్న విజయనగర చరిత్రకు సంబంధించి తాను ప్రత్యేకంగా ఒక చోట పెట్టుకున్న సామగ్రిలోనుంచీ, ‘అళియ రామ భూపాలుడు’ అన్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. కారణమేమిటో తెలియదు కానీ అళియ రామరాయలంటే తనకు చాలా ఆరాధన. చరిత్రకారులు అతన్నిఅహంభావిగా, రాజ్యకాంక్ష కలిగినవానిగా క్రూర కర్కశ హృదయునిగా చిత్రీకరించినా అతని సాహసం, రాజనీతి అద్భుతమని పుట్టపర్తి నిశ్చితాభిప్రాయం. ఆ పుస్తకం మొదటి పుటల్లోనే కనిపించిన ఒక చిత్రం, పుట్టపర్తిని తన చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి లాక్కుపోయింది. ఇంతకూ అదెవరి చిత్రం?
ఆ చిత్రపటం, తనకు బాల్యంలో ఆంగ్ల సాహిత్య పరిచయం కల్పించి, తన సాహితీ నేత్రాలకు మరింత విశాల దృష్టినిచ్చిన పిట్ దొరసానిది. ఆమె నేర్పిన ఆంగ్లంతోనే అల్లిబిల్లి కవితలు ఆంగ్లంలోనే అల్లి ఆమెకు చూపించాడు తను. అన్నీ చదివి ఆమె అంది,’నువ్వు ఆంగ్ల సాహిత్యాన్ని బాగా చదివి నీ మాతృ భాషలో ప్రయోగాలు బోలెడు చేసుకో, కానీ ఆంగ్లంలో వ్రాసే ప్రయత్నం చేయవద్దు. కారణం, మాతృభాష పై ఉన్నంత అధికారం అభినివేశం పట్టు అంటారే, ఆవన్నీ నేర్చుకున్న భాషలో రావు. వాళ్ళు నిన్ను అంత సులభంగా ఒప్పుకోరు. ఇది నా సలహా.’ ఆ దెబ్బతో ఆ కవితలను ట్రంక్ పెట్టెలో అడుగున పడేయటం జరిగింది. కానీ బ్రౌనింగూ, టీ.ఎస్.ఇలియట్, షేక్స్ పియర్ వీళ్ళను చదువుతూ ఉంటే, ఆవేశం వచ్చేస్తుంది, ఆంగ్లంలో ఏదైనా గెలకాలని! అంతలోనే పిట్ దొరసాని మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి. ప్రయత్నం విరమించుకో వటమవుతుంది.
ఇప్పుడీ పుస్తకాన్ని ఆమెకు అంకితం ఇచ్చారు యీ రచయిత. అమె అంటే ఎంత ఆరాధన ఉందో వీరికి మరి! తన ఊరు పెనుగొండకే చెందిన శివ శంకరం గారిని తాను ఎక్కువ కలుసుకోలేదు.
వారు గొప్ప కళాభిజ్ఞులట! ఆంధ్ర భాషా విశారదులట! ఇంతే కాదు. గొప్ప దేశ భక్తులు, దైవ భక్తులు, చారిత్రక పరిశోధకులూ కూడా!! వారు ఎంతో శ్రమకోర్చి వ్రాసిన యీ గ్రంథాన్ని పిట్ దొరసానికి అంకితమివ్వటం ఆశ్చర్యం. ఆంగ్లేయ పరిపాలనలో అధికారులందరూ అతి కఠినులూ, భారత దేశానికి తీరని నష్టం కలిగించిన వారేననుకో వటం పొరపాటని ఇదివరకే చాలా సార్లు రుజువైంది.
మనవాళ్ళే ఐనా మనకే ద్రోహం చేస్తున్న అనేక మందిని నేటి సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా కూడా అప్పుడప్పుడు ఆ సంగతి స్ఫురణలోకి వస్తూ , మానవ సహజ ప్రకృతిని వెల్లడిచేస్తుంది. శివశంకరం గారు, తన యీ అళియ రామ రాయలు పరిశోధనాత్మక గ్రంధాన్ని శ్రీమతి పిట్ గారికి అంకితమివ్వటం వల్ల ఆమె పట్ల వారి మనసులో అపార గౌరవాదరాలున్నాయని తెలుస్తూనే ఉంది.
శివ శంకరం గారి ముందు మాట ఎంతో అద్భుతం. ఆంగ్లేయ ప్రభుత్వం, మన సంస్కృతికి చేస్తున్న సేవను వివరించిన తరువాత వారంటారు,’ శరీరమున నసువుల ధరించినంత మాత్రమున సరిపోదు. బ్రదుకు రసజ్ఞులకు లలిత కళ. తెంపు దానికి పెట్టని సొమ్ము. ఆంగ్లేయ భాష యందొక సూక్తి ఉన్నది. ‘లివింగ్ డేంజెరస్లీ..’ (Living dangerously) అంటే అపాయముతో కూడిన బ్రదుకు తెరగు.
ఈ జీవన పద్ధతియే ఉత్తమోత్తమమైనదందురు.’ ఎంత గొప్ప మాట? నిజమే కదా! జీవితం వడ్డించిన విస్తరాకు మాదిరి ఉంటే ఇంక సాధించటమన్న మాటే ఉండదేమో! ఎప్పటికప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా సవాళ్ళు ఉంటే తప్ప దేన్నైనా సాధించే స్ఫూర్తి, ఉత్సాహమూ కూడా ఉండవేమో! అసలు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు నేర్పిన విద్యలకు కూడ యీ విషయమే ఆయువు పట్టు అంటారాయన! ద్రోణుడు కౌరవ పాండవుల విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరించాడంటారాయన. అంటే జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సవాళ్ళనైనా ధీమాతో ఎదుర్కునే ధైర్యం కూడా నేర్పవలె విద్యలు!
అళియ రామరాజును కూడా ఇదే దృష్టితో చిత్రీకరించాడాయన! అంతే కాదు, అళియ జీవితం, వీర పూజకు ప్రతిష్టించదగినదని స్పష్టంగా చెప్పటం జరిగింది ఇందులో!
అసలు విజయనగర రాజ్య చరిత్రంటే తనకూ ఎంతో ఆకర్షణ! కారణం, శ్రీకృష్ణ దేవరాయల గురువైన తాతాచార్యుల వంశానికి తమ కుటుంబానికీ ఉన్న సంబంధమే! అయ్య శ్రీనివాసాచార్యుల వారికి కూడా విజయనగర చరిత్ర పట్ల గట్టి బంధమే ఉంది. మాటి మాటికీ ఆ రోజుల గురించి రాళ్ళపల్లి వారూ యీయనా నెమరు వేసుకుంటూ ఉండటం, చాలా సార్లు విన్నాడు తను. ఆ విధంగా తాను కూడా విజయనగరం గురించి ఒక కావ్యమే రాయాలని గట్టి సంకల్పం చేసుకుని ఎన్నో శాసనాలు, చారిత్రక గ్రంధాలూ పరిశీలించి అస్త సామ్రాజ్యం అన్న పేరుతో మొదలు పెట్టుకోవటం కూడా జరిగింది. ఆ ఆవేశం దేహమంతా వరదలుగా ప్రవహిస్తూ అప్పటి ఎన్నెన్నో రాజకీయ పరిస్థితులకు కావ్య రూపం ఇవ్వాలనే దృఢ నిశ్చయం. గడియారం వారి శివ భారతం వలె, వీర రసోద్దీపితమైన కావ్య సృష్టి జరిగే ఉండేది. కానీ కొంతమంది మిత్రులు, తన ప్రయత్నా న్ని హర్షించలేదు. అప్పుడప్పుడే సర్దుకుంటున్న స్వాతంత్రయ ప్రాప్తి ఆనందాన్ని, గాంధీజీ ప్రతిపాదించిన హిందూ ముస్లింభాయీ భాయీ భావానికి అడ్డుపుల్లగా నిలు స్తుందని వెనక్కి లాగటంతో, తన ఆవేశానికి అప్పటికైతే అడ్డుకట్ట పడింది. ప్చె.. ఆ ఆవేశం ఇప్పుడెక్కడినుంచీ వస్తుంది?’
కానీ, మనకు తెలియనిదొకటే, మన జీవితానికి గమ్యం ఏదో, సార్థకతకు మార్గ మేమిటో విధి తానే ఆ వైపుకు దారి చూపుతుంది. తానిప్పటిదాకా ఎన్నెన్నో ప్రయోగాలు చేసిన దాఖలాలున్నాయి.
దాదాపు అన్ని రచనలూ ఒక పథకం ప్రకారమే వెలుగులోకి వచ్చినాయి. అష్టాక్షరీ కృతులు కూడా ఒక రకంగా శోకం నుండీ ఉద్భవించిన శ్లోకాల వంటివే! జీవితంలో అత్యంత క్లిష్ట కాలంలో ఆరాధ్యదైవం అష్టాక్షరీ నాథునికి అంకితంగా వ్రాసుకున్న ఏడువేల కృతులు కొన్ని కుందూ నదిలో కొట్టుకు పోగా కొన్ని శిష్యుల చొరవతో బ్రదికి బట్ట కట్టుకుని,పుస్తకాల్లో భద్రంగా వున్నాయి. ప్రచురణ సంగతి ఆ అష్టాక్షరీ నాధుడే చూసుకో వలె!
శివతాండవం మాత్రం, చిదంబర నటేశుని ఆశీస్సులతో ధారా ప్రవాహ సదృశంగా ఆవిష్కృతమైంది. దాని కాయాన్ని కాస్త పెంచుదామని ఎన్నివిధాల ప్రయత్నించినా.. ఊహూ..సాధ్యపడటమే లేదు.
ఇంతకూ..యీ అళియ రాయలు పుస్తకం కంటబడటం వల్ల ఇన్ని జ్ఞాపకాలు తిరగదోడుకున్నట్టయింది! మంచిదే! ఒక్కొక్కసారి మన గెలెపోటములను చర్విత చర్వణం చేసుకోవటం, ఇటువంటి ఆత్మావలోకనం అవసరమే, మనలను మనం విశ్లేషించుకోవటానికి!’
ఇలా ఆలోచనల్లో మునిగిపోయిన సమయంలో, కుమారుడు అరవిందుడొచ్చాడు, ‘అయ్యా, మీకోసం రఘూత్తమ రావు సార్ వచ్చినాడు..’ అంటూ!
మంచి సమయానికే శిష్యుడీ విధంగా రావటంతో పుట్టపర్తికి సంతోషం వేసింది. ‘అట్లనా!! పంపించు. వాడితో రాగి చెంబులో మంచి నీళ్ళు, రెండు కప్పుల కాఫీ కూడ పంపించమను మీ అమ్మను!’ అన్నారు పుస్తకం పుటలు తిరగేస్తూ!
కాసేపటికి రఘూత్తమ రావు ఒక చేతిలో నీళ్ళున్న రాగిచెంబు, మరో చేతిలో ప్లేట్లో రెండు కాఫీ కప్పులతో వచ్చి జాగ్రత్తగా అయ్యగారికి రాగి చెంబు అందించి, మరో చేతిలో ఉన్న కాఫీ పోసిన స్టీల్ కప్పును కూడా తీసుకోమన్నట్టు చెయ్యి ముందుకు చాచినాడు. కాఫీ కప్పు అందుకుంటూ పుట్టపర్తి అన్నారు.
‘ఎందుకురా, ఇంత కష్టం నీకు? ఆ అరవిందుణ్ణే తీసుకుని రమ్మనవలసింది!’
‘మీకు యీ విధంగానైనా కొంచెం సేవ చేసుకునే భాగ్యం దక్కవలె కదా స్వామీ!’
శిష్యుని మాటలకు పుట్టపర్తి పెదవులు కాస్త విచ్చుకున్నాయి.
‘ఇంతకూ ఎందుకప్పా ఇట్లా వచ్చినావు?’
అయ్యగారు కాఫీ స్టీల్ కప్పు తీసుకోగానే తానూ కప్పు చేతిలోకి తీసుకుని కింద పెట్టి గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడా శిష్య పరమాణువు.
‘అదే స్వామీ! మా స్కూల్ లో లైబ్రరీ కి తీసుకోవాలసిన పుస్తకాలు, విద్యార్థులకు ఉపకరించేవి మీకు ఆ లిస్ట్ చూపించి వెంకట్రామా అండ్ కో లో కొందామని వచ్చినాను.’
‘బాగుందిరా! ప్రతిసారీ యీ విధంగా నా సలహా కావాలంటే కష్టం. నేను ఊరిలో ఉండవలె! పైగా ఒక సందేహం. నా సలహా మీద కొంటున్నందుకు నా సలహాకు విలువ కట్టి నీ నుండి నేను లాభపడుతున్నానేమోనని, మీ స్కూల్ వాళ్ళకు అనుమానం వచ్చే ప్రమాదం ఉంది.’ భళ్ళున నవ్వారాయన!
‘ఎంత మాట స్వామీ! మీకామాట రానిస్తానా? ఐనా మీరీ విధంగా అడిగినారంటే నమ్మే వాళ్ళెవరైనా ఉంటారా అసలు? ఒక కవిగా మీకెంత గౌరవముందో, లౌక్యం తెలియని అమాయకులుగా కూడా మీకంతే పేరుంది. ఆ సంగతి వాళ్ళకూ తెలుసు.’ నొచ్చుకుంటూ అన్నాడు రఘూత్తమ రావు.
శిష్యుడన్న మాటకు నవ్వు వచ్చింది పుట్టపర్తికి. ‘సరేలే! ఇంతకూ నీ ఉద్యోగం, సంసారం ఎట్లున్నాయి? జపమూ తపమూ కొనసాగుతున్నాయా?’
*****
(సశేషం)