కాదేదీ కథకనర్హం-8

తలుపు గొళ్ళెం

-డి.కామేశ్వరి 

          ఆ రోజు శోభ శోభనం! రాత్రి పదిగంటలయింది. అమ్మలక్క లందరూ హస్యాలా డుతూ శోభని గదిలో వదిలి పైన తలుపు గొళ్ళెం పెట్టేశారు. తలుపు గొళ్ళెం పెట్టగానే సావిట్లో మంచమ్మీద పడుకున్న కావమ్మ గారి గుండెల్లో రాయి పడ్డట్టయింది. బితుకు బితుకుమంటూ తలుపు గొళ్ళెం వంక చూసింది.

          ‘అమ్మా శోభా- నాతల్లీ! నే నెంచేతూనే తల్లీ” అనుకుంది బాధగా, రాత్రి శోభ తెల్లచీర కట్టుకుని సన్నజాజులు తురుముకుని ముస్తాబవుతుంటే గదిలోకి వెళ్ళి ‘అమ్మడూ భయం వేస్తుందా తల్లీ?” జాలిగా తల నిమిరి అడిగింది. మామ్మ అంటున్నది అర్ధం కాక తెల్లపోయి చూసింది. “అదే నమ్మడూ, రాత్రి గదిలోకి వెళ్ళాలంటే బెంగగా వుందా?” శోభ సిగ్గుల మొగ్గ అయి తలదించుకుంది. కావమ్మగారు రహస్యంగా బుజ్జగిస్తున్నట్టు “పరవాలేదులే తల్లీ” నేను సావిట్లోనే వుంటాగా, అందరూ వెళ్ళాక తలుపు గొళ్ళెం తీసి వుంచుతాలే అంది.

          శోభ మరింత తెల్లపోతూ చూసింది.

          “పిచ్చితల్లీ! ఎలా చెప్పనే , ఎంత వెర్రి మాలోకానివే తల్లీ!” మనవరాలు పులి నోట్లో తల పెట్టబోతున్నట్టు తల్లడిల్లి పోతూ ఎలా చెప్పాలో అర్ధం కాక తికమక పడుతుండగా కోడలు గదిలోకి రావడంతో మెల్లగా గదిలోంచి వెళ్ళి పోయిందావిడ.

          అరవై ఏళ్ళు దాటిన కావమ్మగారికి తలుపు గొళ్ళెం చూస్తె చచ్చే భయం. ఏభై ఏళ్ళ క్రితం – మొదటిసారి ఆవిడ పన్నెండో ఏట – రజస్వల అయి స్నానం అయిన నాలుగో నాడు ఆ పెద్ద యినప గొళ్ళెం వున్న గదిలోకి అమ్మలక్క లందరూ తోసి గొళ్ళెం బిగిం చారు. ఆ గదిలో యింతెత్తు, అంతలావు – యింతింత ఎర్రకళ్ళు , అంతంత మీసాలతో – ఆర్నెల్లనాడు పెళ్ళి పీటల మీద, పల్లకిలో కలిసి కూర్చున్న ముప్పై ఏళ్ళ ఆ ఆంబోతు లాంటి మనిషి – ఆడదాని కోసం వాచిపోయినట్టు ఆరాటంగా ఎదురుచూస్తూ రాక్షసుడిలా గదిలోకి రాగానే ఆ పసిపిల్లని ఆ ముక్కు పచ్చలారని, వంటి తడి ఆరని ఆ పసిపిల్లని అమానుషంగా, క్రూరంగా, నలిపి నలిపి రాత్రంతా అనుభవించాడు. గువ్వపిట్టలా గజగజ వణికిపోతూ , పిల్లి నోట చిక్కిన పిచ్చిక పిల్లలా గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తున్న ఆ పిల్ల నోరునొక్కి , ఏడిస్తే చంపేస్తానని బెదిరించి తన అవసరం యిష్టం వచ్చినంత సేపు తీర్చుకుని అలసి సోమ్మసిల్లె ఆంబోతులా గుర్రు పెట్టి నిద్రపోయాక ఆ పిల్ల గట్టిగా ఏడవడానికి భయపడి వెక్కిపాడుతూ ఆ గదిలోంచి పారిపోవడానికి దారులు వెతికింది.

          రాక్షసి లాంటి యినప గొళ్ళెం – అదీ ఆమెకి అందనంత ఎత్తున – దిగాలు పడి ఏడుస్తూనే దీపం పెట్టిన ముక్కాలి పీట ఎత్తి తలుపు దగ్గిర వేసుకుని, తుప్పు పట్టి ఊడిరాని ఆ యినప గొలుసుల గోళ్ళాన్ని అతికష్టం మీద తీసి, అదృష్టవశాన అర్ధరాత్రి అవతల వైపు గొళ్ళెం ఆమె తల్లి తీసివుంచడం వల్ల – తలుపు తీసి పరుగున వెళ్ళి అమ్మా అంటూ తల్లి పక్కలో బోరుమంటూ ఏడుస్తూ దూరిపోయింది –

          “అయ్యయ్యో – తప్పమ్మా, అలా రాకూడదమ్మా- అల్లుడి గారికి కోపం వస్తుంది. ఏం చేసినా ఓర్చుకోవాలి తల్లీ -” అంటూ ఆ తల్లి భయపడ్తూ కూతుర్ని – తప్పమ్మా అంటూ ఏడుస్తున్న ఆ పసిదాన్ని – నిర్ధాక్షిణ్యంగా బలిపశువుని యీడ్చుకెళ్ళినట్టు రెక్కపట్టి లాక్కెళ్ళి ఆ గదిలో తోసి బయట గొళ్ళెం పెట్టేసింది-

          తెల్లవారు ఝామున ఆ పతిదేవుడు మేల్కొని మళ్ళీ ఓసారి ఏడ్చి ఏడ్చి కటిక నేలని అప్పుడే కను మూసిన అ పసిపిల్లని , అప్పటికి వళ్ళేరగకుండా జ్వరం వచ్చిన అ అమ్మాయిని పూర్తిగా ఆ రోజుకి పిప్పి చేసి వదిలాడు. ఆ పిల్ల స్మృతి కోల్పోయిన సంగతన్నా గుర్తించలేదు ఆ రాక్షసుడు –

          రెండోరోజు నూటమూడు జ్వరం వున్న పిల్లని గదిలోకి పంపమంటే అలిగి వెళ్ళి పోవడానికి అల్లుడు గారు, తయారైతే మామ, అత్త కాళ్ళా వెళ్ళా పడి ఆ జ్వరం వున్న పిల్లనే గదిలోకి పంపడం – రెండోరోజు ఎమయిందీ కూడా గుర్తించలేని మగతలో వుండి పోయింది ఆమె – తరువాత ఆమె కాపురం చేసిన మూడేళ్ళల్లో మొదటిరోజు అనుభవం కంటే మృదు మధురమైన అనుభవం ఆవిడకి కల్గలేదు –

          మొగుడంటే రాక్షసుడే! తలుపుగొళ్ళెం పెడితే గుండె అదిరేది. దగ్గిరకు వస్తుంటే వళ్ళు వణికెది- పెదాలు బిగపెట్టి ఘోరం చూడలేనన్నట్టు కళ్ళు మూసుకుని ముక్క కుండా , మూల్గకుండా మూల్గితే తన్నులు తినాలని ఊపిరి బిగపెట్టి వళ్ళప్పగించి భర్తగారు వదిలేవరకు క్షణం ఒక యుగంలా నరకం చూసి అయన వదలగానే తలుపు గొళ్ళెం తీసుకుని ఒక్క ఉదుటున బయటికి వచ్చిపడి ఊపిరి పీల్చుకుని ఆ పూట గడిచిపోయినందుకు వెయ్యి దండాలు పెట్టుకునేది ఆమె – భర్త, దాంపత్యం అంటే ఆమెకి తెల్సిందదే , అంతకంటే ఎక్కువ తెలిసే అవకాశం – యీయకుండానే పదిహేనో ఏటే విధవని చేసి వెళ్ళిపోయాడు. ఆ భర్త తనకి గుర్తుగా ఓ కొడుకుని అందించి- కాముడు , కావమ్మ, కావమ్మగారిగా అంచెలంచల మీద మారి ఆవిడ కొడుకుని పెంచుకుంటూ వాడితోనే కాలం వెళ్ళబుచ్చేది. పోయిన మొగుడు పొతే పోయాడు – సామెత మాదిరి – మొగుడు పోయి యింక ఆ బాధ వుండనందుకు లోలోపల సంతోషమే కల్గింది ఆవిడకి – లోకంలో అడబతుకుల పట్ల ఆవిడకి జాలి. మొగుళ్ళతో కాపురం చేసుకుంటున్న ఆడ వాళ్ళని చూసి పాపం అని జాలిపడేది. ఏ ఆడపిల్ల కన్నా శోభనం అంటే ఆవిడ గుండెల్లో ఏదో గుబులు పుట్టేది. ఉరికంబం ఎక్కబోయే వాళ్ళ మీద జాలిపడెట్టు జాలిగా చూసేది.

          ఆవిడకి కొడుకు పెరిగి పెద్దయి పెళ్ళి జరిగిన నాడు కొడుకు శోభనం రోజు — ఆవిడకి కోడలి మీద ఎక్కడ లేని దయ పుట్టుకొచ్చింది. కొత్త పెళ్ళి కూతురు — ఆ పిల్లతో ఏమన్నా చెపితే వాళ్ళవాళ్ళెం అనుకుంటారోనని గదిలోకి పంపేముందు కొడుకుని చాటుగా పిలిచి – “వరేయ్ బాబూ – చిన్నపిల్ల జాగ్రత్త ….పాపం…..భయపడ్తుందేమో ….” ఈ చాదస్తం ఏమిటన్నట్టు కొడుకు తల్లి వంక చూసి – “తెలుసులే” అన్నాడు. పూర్తిగా వినకుండానే యింకేం చెప్పాలో తెలియక కావమ్మ గారు నోరుమూసుకుంది….ఆ రాత్రంతా ఆవిడకి కంటి మీద కునుకు లేదు, సావిట్లో పడుకుని మాటిమాటికి తలుపు వంక చూస్తూ, లోపల్నించి ఏడుపు వినవస్తుందేమో కోడలు పిలుస్తుందేమోనన్నట్టు చెవులు ఒగ్గి, మూతలు పడిపోయే కళ్ళని బలవంతాన విప్పుకొని రాత్రంతా జారగం చేసింది. ఆవిడను కున్నట్టు గదిలోంచి ఏడుపులు వినపడలేదు గాని , గుసగుసలు విన్పించాయి. చిన్నగా, నవ్వులు, గాజుల గలగలలు విన్పించాయి. ఆవిడకి నమ్మశక్యం కాక నెమ్మదిగా తలుపు సందులోంచి చూసింది. ఒకరి కౌగిట్లో ఒకరు నవ్వుకుంటూ గుసగుసలాడు కుంటున్న కొడుకు కోడల్ని నమ్మలేనట్టు చూసింది. ఆవిడ మనసెందుకో ముల్లు గుచ్చుకున్నట్ల యింది. శోభనం నాడు యిలా నవ్వుకోటం, ఊసులాడుకోటం, కనివిని ఎరగని వింతలా విడ్డూరం అన్పించింది. తెల్లారి కోడలు గదిలోంచి రాగానే మొహంలోకి పట్టిపట్టి చూసింది. ఏడుపు చాయలు లేకపోగా సిగ్గుతో ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న కోడలిని చూసేసరికి ఆవిడకి ఏదో మంట కల్ఫింది. కోడలు కాపురంకి వచ్చిం దగ్గిర నించి, కొడుకు కోడలు సందు దొరికితే గదిలో దూరటం గుసగుసలు, నవ్వులు, సాయంత్రం అయ్యేసరికి తెల్లచీర కట్టుకుని ముస్తాబయ్యే కోడలిని చూస్తె ఆవిడకి తిక్క రేగింది. కోడలు గనక తనలా భయపడి ఏడిచి వుంటే ఆవిడ కోడలిని నెత్తిన పెట్టుకుని జాలి సానుభూతి చూపి కడుపున పెట్టుకునేది –

          ఆవిడ జాలి, సానుభూతి ఎవరికీ అక్కరలేకపోవడంతో – తనకి దక్కని సుఖం కోడలికి దక్కినందుకు ఏదో , అసూయ, ద్వేషం పెరిగాయి ఆవిడలో అది మొదలు కోడలుని సాధించడం, దెప్పడం, పిల్లి మీద, ఎలక మీద పెట్టి తిట్టడం , పట్టపగలే యింత బరితెగించి మొగుడితో అత్త ముండని వున్నాననైనా లేకుండా సరసాలా — అవ్వ – కలికాలం అంటూ మెటికలు విరిచేది.

          కోడలు కొత్తలో వూరుకున్నా తర్వాత ఎదురు తిరిగి జవాబులు యిచ్చేది . అత్తా కోడళ్ళ మధ్య కొడుకు నలిగేవాడు. “చూడు మా అమ్మకాపురం చేసింది మూడేళ్ళే- మా నాన్న రాక్షసుడిలా ఆవిడని కాల్చుకు తిని మొగుడు , సంసార సుఖం అంటే భయపడే లా చేసి వదిలాడు ఆవిడ్ని – నీవు తనలా కాక సంతోషంగా వున్నావని తనకు దక్కనిది వనుభావిస్తున్నావని ఆవిడ అసూయ – పాపం ఏం సుఖపడింది ఆవిడ జీవితంలో , ఆవిడ కోరికలెం తీరలేదు . అసలలాంటి కోరిక లుంటాయని యిప్పుడే తెల్సుకుంది గనక ఎవరి మీద చూపలేని కోపం నీ మీద చూపిస్తుంది. కాస్త ఆవిడ బాధ అర్ధం చేసికుని ఏమన్నా మాట్లాడక వూరుకో – అంటూ ఓరోజు పెళ్ళానికి సర్ది చెప్పాడు. అప్పటి నించి కోడలు కావమ్మ గారి సాధింపు వినీ విననట్లూరుకుంది.

          మనవరాలు శోభ పుట్టాక కావమ్మగారు కాస్త మారి మనవరాలి ముద్దు ముచ్చట్లతో కాలక్షేపం చేస్తూ కోడలిని సాధించడం మానేసింది. పిల్లలందరిలో శోభ అంటే ఆవిడకి ముద్దు – ఆ శోభ పెద్దదయి – పెళ్ళయ్యాక –

          ఆ శోభకి – శోభనం అంటే కావమ్మగారికి దిగులు, బెంగ పట్టుకున్నాయి. తన కొడుకంటే మంచివాడు గనక, తను చెప్పింది గనక కోడలిని కష్ట పెట్టలేదు. యిప్పుడీ శోభ మొగుడు ఎలాంటివాడో! తన మనవరాలిని ఏం చేస్తాడో – మొదటిరోజు గుర్తు వచ్చి ఆవిడ భయంతో వణికిపోయింది. అయినా నిస్సహాయంగా రాత్రంతా సావిట్లో మంచం మీద కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చుంది – కాని కొడుకు కోడలిని మించి రాత్రంతా యిద్దరూ ఒకటే నవ్వులూ, మాటలు , కిలకిలలు విని ఒకవిధంగా సంతృప్తి పడినా – లోకంలో మొదటిరాత్రి అనుభవం తనకోక్కర్తేకే దక్కనందుకు మొదటిసారిగా బాధపడింది.
మూడు రాత్రులు శోభ మిగతా ప్రపంచాన్ని మరిచిపోయినట్టు గది తలుపులు గొళ్ళెం పెట్టుకుని మొగుడితోనే లోకం అన్నట్టు ప్రవర్తించడం చూసి విస్తుపోయింది.

          కావమ్మగారు చటుక్కున రావడం ఏ కాఫీయో, టీఫినో, నీళ్ళో పట్టుకెళ్ళడం మళ్ళీ గొళ్ళెం పెట్టేసుకోవడం – అక్కడ నించి ఒకటే వికవికలు పకపకలు – చూసి చూసి వారం రోజులు పోయాక మొగుడు వెళ్ళాక శోభని దగ్గరలాక్కుని కూర్చో పెట్టుకుని అన్నాళ్ళుగా , అన్నేళ్ళుగా ఆవిడ మనసులో కదలాడే సందేహలన్నీ బయటపెట్టింది. పన్నెండేండ్ల దానిలో తన మొదటి రాత్రి అనుభవం , మొదటి రాత్రే కాదు మూడేళ్ళ రాత్రుల అనుభవం అనుభూతి చెప్పింది –

          అమ్మడూ మొదటి రోజు నీకు భయం వేయలేదే తల్లీ – అలా నవ్వుకుంటున్నారు. అతను….అతను నిన్నేం చెయ్యలేదా – బాధ కల్గలేదా ఏమో తల్లీ ఇప్పటికీ నాకారోజు తలుచుకున్నా – ఆ రోజే కాదు ఏ తలుపు గొళ్ళెం చూసినా గుండె దడే అమ్మా, యిన్నాళ్ళ యినా ఆ దడ తగ్గలేదే — రాకాసి లాంటి ఇంతింత గొలుసుల గొళ్ళెంతో నన్ను బంధిం చిన ఆ గొళ్ళెం చూస్తె ……అమాయకంగా చెప్పుకున్న మామ్మని జాలిగా, సానుభూతిగా చూసి నవ్వింది శోభ.

          “మైడియర్ మామ్మా – తలుపు గొళ్ళెం కేవలం మనుష్యులని బంధించేదిగా మాత్రమే నీకు తెల్సు , కాని మనసులని బంధించడానికి ఉపయిగిస్తుంది మామ్మా – ఐ పిటీ యు….’ అంది యింకేం చెప్పలేక .

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.