కొండమల్లిపూలు
-వసీరా
కొండమల్లి పూలు ఊరికే రావు
కూడా తీసుకొస్తాయి కొత్త రుతువుని
పిల్లలకు తీయని సన్నాయిలని
వెళ్ళిపోయే వర్షాలు ఇచ్చే తాయిలాన్ని
మంచులో పొట్లం కట్టిన వెచ్చని సూరీణ్ణి
కొండమల్లి పూలు చూసినప్పుడల్లా
నాకెందుకో ఊరికూరికే నవ్వాలనిపిస్తుంది
నెత్తిన పోసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుకోవాలనిపిస్తుంది
పసితనం తీయగా పిలిచి తనలోకి లాక్కుంటుంది
జీవితం ముందు చేతులు చాచి నుంచుని
స్తుతి గీతాలు పాడాలని పిస్తుంది.
ఓ నా జీవితమా! నీ ముందు మోకరిల్లి ప్రార్థించకుండానే
పువ్వుల్లోకి తేనెల్ని , ప్రకృతిలోకి రుతువుల్ని
ప్రవేశ పెట్టినంత సహజంగా…గాలిలోకి సుగంధాలు నింపినంత సహజంగా
నువ్వే నింపాపు , నా లోపలి కీకారణ్యాలని పువ్వులతో తేనెలతో
నానాగానాల వర్ణాల పక్షుల జీవితోత్సవాలతో..
నా గుహల ముందు పులిపిల్లల చెలగాటాలతో
నింపావు నా లోపలి తేనియల్ని ఆశలతో ఊహలతో
పాటల్లాటి ఆటల్లాటి అల్లారు ముద్దుల్లాటి అమ్మ ప్రేమలాటి
అమ్మకోసం బెంగలాటి ఎంత తీయటి బాల్యాల్నిచ్చావూ!
విరగబడే నవ్వుల్లాటి, విరహాల వడగాలుల్లాటి ,
వడగాలుల్లో తాటిచెలకల్లాటి
తాటిచెలకల్లో తీయని కల్లు లాటి… ఎంతటి మత్తునిచ్చావు
ఓ పక్క తుళ్ళింతలు పడే జీవనోత్సాహం
ఇంకోపక్క నిరాశలు, ఎదురుదెబ్బలకు, బొక్కబోర్లా పడి
చెక్కుకుపోయిన మోకాళ్ళ సలుపుల్ని లెక్కచేయక తిరిగినపుడు
ఓ జీవితమా ! అమ్మలాగా చెల్లిలాగ! ప్రియురాలిలాగా
ఎంతప్రేమగా నీ ఎంగిలి ఉమ్మి మందుగా రాశావు
నీ దగ్గర్నించి నేను కేవలం రెక్కలు విప్పుకుని ఎగరడం నేర్చుకున్నాను
నా నుంచి ఎగిరే పక్షుల రెక్కలు నిమరి దిక్కుల చివరికి ఎగరెయ్యడం
అప్పుడు నా ఊహకైనా రానీయ లేదు నువ్వు
ఓ నా జీవితమా నీకు వందనాలు
నీవిచ్చిన హృదయ మధువు తాగి ఉన్మత్తంగా
ఎక్కడెక్కడి పక్షులతోనో చెలిమి చేసి, కలిసి ఎగిరి
కొంగొత్త ఆకాశాలను జయించాను
నీవిచ్చిన ప్రేమ మధువు నా హరివిల్లు కాగా
ఎండా వాన చేతివేళ్ళు అల్లుకుని సృష్టించిన
రంగుల ఇంద్రజాలాల్లో సమ్మోహితుణ్ణై నేను విహరించలేదూ!
కారుమేఘాల మాటున తటిల్లతలకు విరిసిన
పూల గుచ్చాలు నాకు ఆడుకోడానికిచ్చి ఎంత మురిసిపోయావ్
నా ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తే చాలు నువ్వు కరిగి వర్షమయ్యావు
నా కన్ను ఏమాత్రం చెమ్మగిల్లినా
నీ వెచ్చని చెంగుతో అద్ది నవ్వించావు
ఓ నా జీవితమా నాకు తెలీదు సుమా!
నీతో ప్రేమ నిప్పుతో చెలగాటమని
మంటలతో సయ్యాట అని
వానచినుకుల్లో చలికాగుతూ ఉన్మత్తంగా వెర్రిగా నవ్వుతూ
తొలకరి భావోఉద్వేగాల్లో కాగితం పడవలు వదిలినప్పుడు
నిజం చెప్పు నువ్వు చప్పట్లుకొట్టి , పిచ్చి ఆనందంలో
రాలే చినుకుల్ని పట్టుకుని ,నా నెత్తిన తలంబ్రాలు పొయ్యలేదూ?
మంచు బిందువుల ముత్యాలతో నన్ను అలంకరించి మురిసి పోలేదూ
ఓ నా బంగారుతల్లీ జీవితమా!
చాపకిందనీరులా, కదిలే విమానంలో కదలనట్టుండే కాలంలా
నిశ్చలంగా ఉన్నా దూసుకుపోతున్నట్టు భ్రమింపచేసేలా
నీ సందిట నన్నుంచుకునే
ముందుచూస్తే వెనుక మాయమై, వెనుక చూస్తే ముందుమాయమై
ఎటు చూస్తే అటు మటుమాయమై ..కిలకిలా నవ్వే నిన్ను
కళ్ళకు గంతలు కట్టుకుని వెదికి పట్టుకునే
ఆటని ఎలా ఆడిస్తున్నావే బాబూ
ఓ నా జీవితమా…నాకంటే నువ్వు చాలా పవర్ పుల్
నేను కేవలం అణువుని మాత్రమే
మరి నువ్వో… బ్రహ్మాండ గోళాలు తిప్పే అణుశక్తివి
కాలం నా చేతిలో లేదు, నీ చేతిలో ఉంది
పుట్టుక నా చేతిలో లేదు, నీ చేతిలో ఉంది
చావు నా చేతిలో లేదు, నీ చేతిలో ఉంది
బహుశ నువ్వేదో బోధపర్చడానికే…ఆ నవ్వుతోనే
భ్రమ పెడతావు.. భయపెడతావు… రాక్షసివై వెంటాడతావు
అయినా నిన్ను చూసి నేనెందుకు భయపడాలి?
నీ ఒళ్లో ఎలా పెరగాలో నువ్వే నేర్పావు కదా!
నువ్వు నా దోస్తువు కదా! నీతో వేళాకోళాలూ…కుస్తీలూ
దోబూచులు, పరాచకాలు, తమాషాలు ఇష్టమే కదా!
నువ్వు అద్దంలో చూసుకుని నవ్వినపుడు
నీ పై పెదవికి పైన… చిన్నిపుట్టుమచ్చనై
నీ కాంతిలో ఈదులాడినది నేనే కదా!
నీలో భాగమైనా మరి నా మీద నీ కెందుకంత వివక్ష
నీకు ఎప్పుడు ఏ రకం తిక్కరేగుందో తెలుసుకోవడం ఎవరి తరం
నాకు తిక్కరేగినపుడు నువ్వు బుజ్జగిస్తావు ఊరడిస్తావు
నా మనసుని కాస్తంత కన్నీటితో తడిపి అక్కడో కలని నాటుతావు
నీకు తిక్క రేగినపుడే …ఏం చెయ్యాలో అస్సలు తోచనివ్వవు
శత్రువుగా మారి , నన్ను నిరాయుధుణ్ణి చేసి నా వెనుకే
తుపాకి పట్టుకుని, గుర్రం మీద దౌడు తీస్తూ వెంటాడతావు
దిక్కుతోచక పరుగెట్టి ఒగురుస్తూ చివరికి
పోతాను నా గుహల్లోకి … ఊడల మర్రి తొర్రల్లోకి ..అడవుల్లోకి
పగిలిపోయిన మధుపాత్రని తీసుకుని …ఒలికి పోయిన మధువు కోసం ఏడుస్తూ
బహుశా నువ్వే అడవి కనుల చిరునవ్వుల్లోంచి కొండమల్లి చెట్లమీంచి
నా కోసం రాలుస్తావు నేలంతా పూలని
నేలమీద పున్నాగ పూల మధ్య పడుకుని ఆకాశంలోకి చూస్తుంటానా
నెమ్మది నెమ్మదిగా నేలగంధం ,ఆకాశపు విశాలత్వం,
కాడమల్లి పూల సౌందర్యంతో నేను నిండిపోతాను.
ఓ నా జీవితమా ! ఎంత తమాషాగా పాత్రలు తారుమారు చేశావే
కిక్కుని వదులు కోవడంలో కూడా కిక్కుంటుందా?
తేనెపాత్ర పగిలినా దానిలోంచి ఎగిరే పూలనీ, సీతాకోకల్నీ, ఫ్లెమ్మింగోల్నీ
వదులుకోవడంలోని కిక్కు రుచిచూపిస్తున్నావు కదే
ఒకప్పుడు నీ చేతుల్లోంచి రెక్కలు విప్పుకుని ఎగిరేవాడిని
ఇప్పుడు నా కన్నీటికి రెక్కలు నిమిరి ఎగరెయ్యడంలో
కిక్కుని ఆనందిస్తున్నాను
నాకు తెలుసు కొండమల్లి పూలు ఊరికే రావు
కూడా తీసుకొస్తాయి కొత్త రుతువుని
వెళ్ళిపోయిన వర్షాలు ఇచ్చిన తాయిలాన్ని
పొగమంచులో పొట్లం కట్టిన ఓ వెచ్చని సూరీణ్ణి
******
“వసీరా” గా ప్రసిద్ధి చెందిన వక్కలంక సీతారామారావు పుట్టింది, చదివింది కోనసీమ లోని అమలాపురం. జర్నలిస్ట్ గా వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో దాదాపు 30 స.రాలు పైనే పనిచేసారు. లోహనది, మరోదశ, సెల్ఫీ కవితా సంకలనాలు రాసారు. “లోహనది” కి ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు, గరికపాటి అవార్డులు వచ్చాయి.